[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
మధుర స్వరాల రాఘవులు:
జె.వి. రాఘవులుగా చిరపరిచితమైన ప్రసిద్ధ స్వరకర్త రాఘవులు గారి పూర్తి పేరు జెట్టి వీర రాఘవులు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందినవారు. వీరాస్వామినాయుడు, ఆదిలక్షి వీరి తల్లిదండ్రులు. ఆరుగురు తోబుట్టువులలో ఈయన ఒకరు. రాఘవులు స్కూలు ఫైనల్ వరకు మాత్రమే చదివారు, ఆపై చదువు ఆపేశారు.
నాటకాలలో పాల్గొని నటిస్తూ, పాటలు పాడేవారు. దీని వల్ల ఆయన దృష్టి సంగీతంపైకి మళ్ళింది. స్థానికంగా హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించే శ్రీ భట్టాచార్యులు గారి వద్ద సంగీతం అభ్యసించారు. ఆ నాటకంలో లోహితాసుడి వేషం వేసే అవకాశం వచ్చింది రాఘవులుకి. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి – బడిలో రాఘవులికి గురువులు. వారి పద్యాలు బెజవాడలో ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమయ్యేవి. వారు ఆ పద్యాలను చదవమని రాఘవులిని ప్రోత్సహించేవారు. వారిద్దరూ, ఇంకా ఎందరో కవులు రచించిన గీతాలకు బాణీలు కట్టి ‘గీతావళి’ కార్యక్రమంలో ఆలపించేవారు రాఘవులు. ఒక రికార్డింగ్ సెషన్‍లో రాఘవులు ఒక లలిత గీతం పాడుతుండగా ఘంటసాల విన్నారు. ఆయన గొంతు నచ్చిన ఘంటసాల రాఘవులు గారిని మద్రాసు వచ్చి తన సహాయకుడిగా చేరమన్నారు. రాఘవులు మద్రాసు చేరి ఘంటసాల వద్ద సహాయడయ్యారు. ఘంటసాలని కలవగలడం ఆయన అదృష్టం! ఘంటసాలకి రాఘవులు ఎంతో నచ్చి, ఆయనతో పాటలు కూడా పాడించారు. పొద్దున్నుంచీ రాత్రి వరకూ ఘంటసాలతోనే ఉండి సినీ సంగీతపు మెళకువలను నేర్చుకున్నారు రాఘవులు. పొద్దున్నే లేచి ఘంటసాల పాటలు వినగలగడం తన భాగ్యం అని రాఘవులు అనేవారు. ఈ భాగ్యం ఎవరికీ దక్కలేదు అన్నారు.
సినిమాల కోసం రాఘవులు పాడిన మొదటి సినిమా 1953లో వచ్చిన ‘గుమస్తా’. మొదటిసారి అంత పెద్ద ఆర్కెస్ట్రాని చూసినప్పుడు ఆయన భయపడ్దారట! కానీ స్వరకర్త పాండు, ఇతరులు ఆయనకు ధైర్యం చెప్పి, పోత్సహించి ఆయన భయాన్ని పోగొట్టారట. రాఘవులు ఎక్కువగా ఘంటసాల స్వరపరిచిన పాటలే పాడారు. పెళ్ళిసందడి చిత్రంలోని ‘భైఠో బైఠో పెళ్లికొడకా’, పరమానందయ్య శిష్యుల కథలోని ‘పరమగురువులు చెప్పినవాడు పెద్ద మనిషి కాదురా’, ప్రాణమిత్రులు చిత్రంలో ‘ఈ పాపం ఫలితం ఎవరిది’, గాలి మేడలు సినిమాలో ‘కాలమంతా మనది కాదు’, భక్త రఘునాథ చిత్రంలో ‘కొండమీద చందమామ’, పాప కోసం చిత్రంలో ‘దేవుడు ఎందుకు పుట్టాడు’, సత్యనారాయణ వ్రత మహత్యంలో ‘ఓహోహో చందమామ’ వంటి పాటలు పాడారు. ఆయన ‘కైకొడుత దైవం’ అనే తమిళ చిత్రంలో ఒక తెలుగు పాట కూడా పాడారు. శ్రీ వేంకటేశ్వర మహత్యం, ఆలుమగలు, అభిమానం, భలే అమ్మాయిలు వంటి సినిమాలకు కూడా పాడారు. కానీ ఆయన దృష్టి సంగీత దర్శకత్వంపై ఉంది. తన గురువుగారిలా స్వతంత్ర సంగీత దర్శకుడవ్వాలనేది ఆయన అభీష్టం. ఆయన 30 సినిమాల పాటలను ఇతర భాషలలోకి డబ్ చేశారు. పాండవ వనవాసం, లవకుశ పాటలను ఆయన బెంగాలీలోకి డబ్ చేశారు. ఆయన పాడారు కూడా. రాఘవులు ఘంటసాలతో 17 సంవత్సరాలు ఉన్నారు. రాఘవులు గారికి తొలిసారిగా స్వతంత్ర సంగీత దర్శకుడిగా డి. రామానాయుడు 1970లో ఎన్.టి. రామారావు, జమున నటించిన ‘ద్రోహి’ చిత్రం ద్వారా అవకాశం ఇచ్చారు.
వెంటనే రాఘవులు వెళ్ళి తన గురువుగారి ఆశీర్వాదం తీసుకున్నారు. రాఘవులికి సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చినందుకు ఘంటసాల ఎంతో సంతోషించారు. ‘ద్రోహి’ ముహుర్తానికి హాజరయ్యారు కూడా. ఈ సినిమాకి ‘మెరిసే మేఘ మాలిక’ అనే గొప్ప హిట్ పాటని అందించారు రాఘవులు. ఈ సినిమాలో ఘంటసాల – ‘తమాషైన లోకం’, ‘రాముడు దేవుడు’ అనే రెండు పాటలు పాడారు. తన దర్శకత్వంలో తన గురువుగారు పాటలు పాడినందుకు రాఘవులు పొంగిపోయారు.
వడ్డే బ్రదర్స్ [శోభనాద్రి, రమేష్ (నటుడు వడ్డే నవీన్ తండ్రి), కిషోర్‍లు] – ‘విజయ మాధవి పిక్చర్స్/కంబైన్స్’ అనే సంస్థని స్థాపించి రాఘువులిని తమ ఆస్థాన సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. 1977లో ‘ఆత్మీయుడు’ తో ప్రారంభించి – కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, – 1982లో బొబ్బిలి పులి వరకు ఆయనే వారి సినిమాలకు స్వరకర్తగా వ్యవహరించారు. ఆయన దాదాపు 172 సినిమాలకు స్వరాలందించారు.
బెబ్బులి పులి చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్న సమయంలో – ఎన్.టి. రామారావు రాఘవులి గారిని తీసుకుని నడుస్తూ ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి వారి భార్యని కుశల ప్రశ్నలు వేసి, ఏవైనా సాయం కావాలా అని అడిగారట. పోటీ ఎంతో తీవ్రంగా ఉండే సినీ పరిశ్రమలో ఇలా ఎవరైనా చేస్తారా అని రాఘవులు ఆశ్చర్యపోయారుట. అయితే ఘంటసాలతో తనకున్న సాన్నిహిత్యం వల్లే రామారావు గారు తనని తీసుకువెళ్ళారని రాఘవులు భావించారు. ఈ విషయాని జ్యోతిచిత్ర పత్రికలో అనుకుంటా, ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. మొదటిసారి ఆ ఇంటర్వ్యూ చదివినప్పుడు ఇది నా మనసులో ముద్రితమైపోయింది.
రాఘవులిగారి భార్య పేరు రమణమ్మ. వీరికి నలుగురు అబ్బాయిలు (వెంకటేశ్వర రావు, భాస్కర్, శ్యామ్ కుమార్, రవి కుమార్), ఒక అమ్మాయి (లక్ష్మి) ఉన్నారు. వీరిలో రవి రాఘవ్ కూడా సంగీత దర్శకుడై – విల్లలన్, ముత్తల్ తగవల్ అరిక్కై, ఎన్ ఓవియా – వంటి లోబడ్జెట్ తమిళ సినిమాలకు సంగీతం అందించారు.
మంచి కెరీర్ అనంతరం రాఘవులు రిటైరయ్యారు. భార్యాపిల్లలతో కలిస్ రాజమండ్రిలో స్థిరపడ్దారు. సుదీర్ఘకాలం కొనసాగిన అనారోగ్యం కారణంగా రాజమండ్రిలోని తన స్వగృహంలో మృతి చెందారు.
మరణానికి రెండేళ్ళ ముందు, 20 జూలై 2011 నాడు ఆయనకు సన్మానం జరిగింది. ఆనాటి ఫోటోలు కొన్ని.
అలరించే నటుడు శివరామకృష్ణయ్య:
డా. కూచిభొట్ల శివరామకృష్ణయ్య తెనాలికి చెందినవారు. చిన్నప్పటి నుండే ఆయనను అందరూ ‘అందగాడు’ అనేవారు. తెగ పొగిడేవారు. ఆయన కూడా తాను మంచి రూపసిననే అనుకునేవారు. పాటలు బాగా పాడేవారు. దాంతో తెనాలిలో ప్రదర్శించే నాటకాలలో చిన్న చిన్న స్త్రీ-పురుష వేషాలు వేశారు. బాల్యంలో ఆయన వేషంలో ఉంటే అమ్మాయో అబ్బాయో అసలు పోల్చుకోలేకపోయేవారు జనాలు.
తెనాలి తాలూకా హైస్కూలులో చదువుతున్నప్పుడు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలోనూ ఆయన పాటలు పాడేవారు. ఉదయపు ప్రార్థన శ్లోకాలు పాడేవారు. ఉపాధ్యాయులందరూ ఆయన గాన ప్రతిభను మెచ్చుకునేవారు. 1919లో విశాఖపట్టణం వెళ్ళి అక్కడ మెడిసిన్ పూర్తి చేశారు. 1923లో తెనాలికి తిరిగి వచ్చి వైద్యుడిగా ప్రాక్టీసు ప్రారంభించారు. అప్పుడు కూడా ఖాళీ సమయాలలో నాటకాలు వేస్తూండేవారు. అయితే తగిన పారితోషికం లేకుండా ఏ పాత్రను ఒప్పుకునేవారు కాదు, అలా అని డబ్బు మనిషీ కాదు.
ద్రౌపది మాన సంరక్షణం నాటకంలో దుర్యోధనుడు, సారంగధరలో రాజరాజనరేంద్రుడు, రామదాసులో భక్త రామదాసు ఆయనకు ఇష్టమైన పాత్రలు.
1933లో ఎం.ఎస్.ఆర్. ఎ. గుప్తా మద్రాసులో తాము ప్రదర్శిస్తున్న ద్రౌపది మాన సంరక్షణం సినిమాలో కర్ణుడి పాత్ర ధరించడానికి మద్రాసు రమ్మని కబురు చేశారు. ఆయన అంగీకరించి మద్రాసు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో సరస్వతి టాకీస్ వారి నుంచి – అదే పేరుతో తాము తీస్తున్న సినిమాలో కర్ణుడి వేషం ఇస్తున్నామంటూ టెలిగ్రాం వచ్చింది. రెండు సంస్థలు పోటీగా తీస్తున్నాయా సినిమాలని. సరస్వతి టాకీస్ వారు డబ్బు ఎక్కువ ఇస్తామన్నారు. ఆయన శివరామకృష్ణయ్య లొంగలేదు. ముందుగా మాట ఇచ్చినవారి సినిమాకే పని చేశారు. ఆ సినిమాలో బళ్ళారి రాఘవ దుర్యోధనుడి వేషం వేశారు. దుర్యోధనుడు పాత్ర తనకి ఇష్టమైన పాత్ర అయినప్పటికీ, బళ్ళారి రాఘవ లాంటి గొప్ప నటుడి సరసన నటించానని సంతృప్తి చెందారు శివరామకృష్ణయ్య.
ఆ కాలంలో నవాబ్ ఎ తుగ్లక్, జీవన ముక్తి, భలే పెళ్ళి వంటి సినిమాలలో నటించారు. అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం ముంచుకు రావడంతో – సినిమాల షూటింగులు ఆగిపోయాయి. సినిమాలలో నటించాలో, వైద్య వృత్తి కొనసాగించాలో ఆయన తేల్చుకోలేకపోయారు. నటనను విరమించుకుని వైద్యునిగా సేవలందించాలని నిర్ణయించారు. యుద్ధంలో గాయపడిన వారికి రాత్రింబవళ్ళు సేవలందించారు. ఆయన సైన్యంలో కెప్టెన్ స్థాయి నందుకున్నారు.
యుద్ధ ప్రభావం ముగిసాకా, నిర్మాత చక్రపాణి ‘పెళ్ళి చేసి చూడు’లో నటించేందుకు కబురు చేశారు. సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆయన వైద్యం మానలేదు. పేదవారికి ఉచితంగా చికిత్స చేసేవారు. మరింత సమయం ఉంటే నటుడు సూరిబాబుతో కలిసి నాటకాలలో పాల్గొనేవారు. సినిమాలలో వేషాల కోసం ఆయన ఎవరినీ అడగలేదు. తనకి లభించిన అవకాశాలను ఉపయోగించుకున్నారు. ఈ రకంగా ఆయన సుమారు 160 సినిమాలలో నటించారు.
ఈ గొప్ప నటుడు 78 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకి సినీరంగం నుంచి ఎవరూ హాజరు కాకపోవడం విషాదం. ఆయన చనిపోయిన కొద్దిరోజులకే, ఆ బాధతో ఆయన భార్య కూడా చనిపోయారు. దురదృష్టం!