అన్నింట అంతరాత్మ-25: ఏ వంక చూసినా నేనుంటా.. పంకాను నేను!

5
3

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం పంకా అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]నా[/dropcap] రెక్కలు ముక్కలవుతున్నా ‘అబ్బ! ఒకటే ఉక్క.. ఈ ఫ్యాన్ తిరుగుతున్నట్లే లేదు’ అని ఇంట్లో అంతా చిరాకుపడుతుంటారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు నేను ఇరవై నాలుగ్గంటలూ ఫుల్ స్పీడ్‌లో తిరగవలసిందే. అయినా ఈ ఎండల ధాటికి నేనిచ్చే గాలి ఏ మాత్రం సరిపోవటం లేదు. ఈ ఇంట్లో టేబుల్ ఫ్యాన్లు, స్టాండింగ్ ఫ్యాన్లు, హాల్లో కూలర్, బెడ్ రూమ్‌లో అయితే ఏసీలు కూడా ఉన్నాయి. ఇంతమందిమి ఉన్నా బామ్మగారు ప్రతి ఏటా ఓ వట్టి వేళ్ల విసనకర్ర, వెదురు విసనకర్ర, తాటాకు విసనకర్ర కూడా తెప్పిస్తారు. కరెంటు పోతే ఎంత స్టెబిలైజర్ ఉన్నా ఇంట్లో ఉన్న ఫ్యాన్లు అన్నీ తిరగవు కదా అంటుందామె. ‘స్టెబిలైజర్ కాదు, అది ఇన్వర్టర్’ నవ్వుతూ వివరిస్తాడు వాళ్లబ్బాయి రాఘవ. ‘ఆఁ అదేలే ఇన్‌వర్టర్ అనబోయి స్టెబిలైజర్ అన్నా.. అయినా విసనకర్ర ఏమన్నా వందలా, వేలా.. ఈ సీజన్లో కూడా కొనకపోతే చేతివృత్తుల వాళ్లు ఏమయిపోవాలి?’ అంటుంది ఉదారంగా. దాంతో రాఘవ మౌనం వహిస్తాడు. ఇవి కాక ఎగ్జిబిషన్లకు వెళ్లినప్పుడు కొనుక్కు వచ్చిన నెమలీకల విసనకర్రలు ఉండనే ఉన్నాయి. అవి చూడటానికి భలే అందంగా ఉంటాయి.

నేనిలా ఆలోచిస్తుండగానే మూలనున్న టేబుల్ ఫ్యాన్ ‘ఏంటీ ఎన్నిసార్లు పిలిచినా పలకవ్.. ఎంత పైనున్నా అంత గర్వమా?’ అంది. ఉలిక్కిపడ్డాను. ‘పిలిచావా, నేనేదో ఆలోచిస్తూ ఉండిపోయాను. నాకెందుకు గర్వంగా ఉంటే గింటే ఆ ఏసీలకు ఉండాలి. ఇంతకూ ఏమిటి సంగతి?’ అన్నాను. ‘ఆఁ ఏం ఉంది.. ఆ మూల ఉండే మరో టేబుల్ ఫ్యాన్‌కు సుస్తీ చేసింది. రిపేరర్ వెయ్యి రూపాయలు అడిగాడని అలాగే ఉంచేశారు. పాపం.. వాడుకున్నన్నాళ్లు వాడుకుని కాస్త సుస్తీ చేస్తే ముఖం చూడకుండా మూల పడేస్తారు. ఈ మనుషులు. నిజానికి మనం లేకుండా వీళ్లకు ఒక్క నిముషం గడవదు. ఏ కాలమైనా స్పీడ్ తగ్గించి అయినా ఫ్యాన్ పెట్టుకునే ఉంటారు. రాఘవగారి కయితే ఫ్యాన్ శబ్దం లేకపోతే నిద్రపట్టదుట’ అంది. ‘అవునవును. నువ్వు చెప్పింది నిజమే’ అని నేను అంటుండగానే విసనకర్ర అందుకుని ‘ఎప్పుడూ మీరే కబుర్లాడుకుంటారు. నేనెంత పాతకాలం దాన్నయినా మీ జాతి దాన్నేకదా’ అంది చిన్నబుచ్చుకుంటూ. చెప్పొద్దూ, నాకు దాన్ని చూస్తుంటే జాలేసింది.

‘అయ్యో! అలా అనుకోకు. బామ్మగారికి మీరంటే ఎంత ప్రాణమో మాకు తెలుసుగా. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు నువ్వు చేసే సేవ తక్కువేంకాదు. ఏ ఆరుబయట ఉన్నా నిన్ను వాడుకోవచ్చుగానీ, మమ్మల్ని కాదుకదా’ అన్నాను. దాంతో అది సంతోషించింది. ‘మేం పురాణకాలం నుంచి ఉన్నాం. నువ్వు దేవుళ్ల ఫొటోలు చూశావా. దేవుడికి అటు, ఇటు సేవకులు వింజామరలు ఊపుతుంటారు. కాకపోతే అవి పెద్దగా ఉంటాయి. మరో రకమేమో పెద్ద కుచ్చును కలిగిఉంటాయి. అంతెందుకూ ఇప్పటికీ పూజలో బామ్మగారు ‘చామరం వీచయామి’ అంటూ వింజామరతో దేవుడికి విసురుతారు. అంటే దేవుడికి చేసే ఉపచారాలలో వింజామర సేవ కూడా ఒకటన్నమాట’ అంది విసనకర్ర. ఆసక్తిగా విన్నాం.

ఆ తర్వాత టేబుల్ ఫ్యాన్ ఇలా అంది.. ‘అయినా దేవుళ్ల సంగతి ఆలోచిస్తే ఈశ్వరుడేమో మంచు కొండ కైలాసగిరి లోనే కదా నివాసం. అక్కడ ఇంక వింజామరలతో పనేముంది? మహావిష్ణువా.. సముద్రంలో శేషతల్పం మీద శయనిస్తాడు.. ఇక పోతే బ్రహ్మగారేమో బ్రహ్మలోకంలో.. అది కూడా పుష్పాలతో నిండిన మనోహర ఉద్యానవనం, ఆనంద ప్రపంచాలలో అత్యున్నతమైంది అంటారు. అక్కడ వింజామరల అవసరమేముంటుంది?’. అది విని ‘సరేలే, దేవుళ్ల సంగతి ఎలా ఉన్నా, రాజుల కాలంలో రాజులకు, రాణులకు, రాజకుమార్తెలకు సేవకులు, చెలికత్తెలు వింజామర సేవ చేయడం తెలిసిందే కదా. అంతెందుకు, ప్రాచీనకాలంలో.. విద్యుత్ పంకాలు రానంతకాలం మేమే కదా మనుష్యకోటికి గాలినిచ్చి.. హాయినిచ్చింది. ఒకప్పుడు పెళ్లిళ్లలో, ఇతర వేడుకలలో, శ్రీరామనవమి పందిళ్లలో అందరిచేతుల్లో మావాళ్లే ఉండేవారు’ అంది విసనకర్ర.

‘కోపం తెచ్చుకోకు. నీ ప్రత్యేకత నీదే. విద్యుత్ లేని కాలంలో మరోరకం పంకాలు కూడా ఉన్నాయని ఆ మధ్య టీవీలో చెపుతుంటే విన్నాను. మన దేశంలో బ్రిటిష్ వారి కాలంలో పంకా ఓ విలాస వస్తువని, అధికారుల, సంపన్నుల నివాసాలలోనే ఆ ఏర్పాటు ఉండేదని చెప్పారు. వాటిని దండెం పంకాలుగా వర్ణించారు. దండెంపై దీర్ఘచతురస్రాకార వస్త్రాన్ని వ్రేలాడదీసి, దానికి ఓ పొడుగాటి తాడును కట్టేవారుట. ఆ తాడును సేవకులు అటు, ఇటు లాగుతూ ఉంటే దాని కింద కూర్చున్న వారికి గాలి వచ్చేదట. అలా పంకా తాడును లాగే వ్యక్తిని ‘పంకా వాలా’ అనేవారుట. గదిలో ఓ మూల కూర్చుని తాడును లాగడమే వారి పని. కొన్ని చోట్ల తాడును గోడలో రంధ్రం ద్వారా పక్కగదిలోకి వచ్చేలా చేసి, పంకావాలా అక్కడినుంచే తాడులాగే ఏర్పాటు చేసేవారుట. ఇంకా చిత్రమేమిటంటే పంకావాలాలు అధికారుల మాటలను, రహస్య మంతనాలను వింటే ప్రమాదమని, పంకా వాలాలుగా చెవిటివారిని నియమించుకునే వారుట. భలే ఉంది కదూ’ చెప్పాను నేను.

‘చాలా ఆసక్తికరంగా ఉంది. మా టేబుల్ ఫ్యాన్ల విషయం చెప్పాలంటే. మేం వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో. షూలర్ స్కట్స్ వీలర్ అనే ఆయన మమ్మల్ని అంటే ఎలెక్ట్రిక్ ఫ్యాన్‌ను కనుగొన్నాడట. మొదట్లో ఆ ఫ్యాన్‌కు రెండు రెక్కలే ఉండేవట. తర్వాత.. తర్వాత మూడు, నాలుగు రెక్కల ఫ్యాన్లు వచ్చాయి. మొన్న రాఘవగారి కొడుకు యశస్వి చెపుతుంటే విన్నాను’ అంది టేబుల్ ఫ్యాన్. ‘నేనూ విన్నాలే.. సీలింగ్ ఫ్యాన్లను అంటే మమ్మల్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఫిలిప్ ఢీల్ అనే ఆయన కనుగొన్నాడట. నాకయితే నాలుగు రెక్కలున్నాయి కానీ ఐదు రెక్కల సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉంటాయని విన్నాను. ఇక ఏసీని పందొమ్మిది వందల రెండులో విలిస్ హావిలాండ్ క్యారియర్ ఆవిష్కరించాడు’ చెప్పాను నేను.

‘అసలు మనం లేనిదెక్కడ? ఆఫీసు, ఆసుపత్రి, పాఠశాల, దుకాణాలు, రైళ్లు, బస్సులు, కార్లు, సినిమాహాల్స్.. ఎక్కడైనా మనం ఉండాల్సిందే.. అంది టేబుల్ ఫ్యాన్. పనిమనిషి రంగమ్మ వచ్చి ఇల్లు తడిబట్టతో తుడుస్తుంది. వెంటనే నేల ఆరడానికి అన్ని గదుల్లో ఫ్యాన్లు వేసేస్తుంది గిన్నెలు, సీసాలు తడి ఆరడానికి కూడా రాఘవగారి భార్య తులసి ఫ్యాన్ వేస్తుంది. ‘అన్నట్లు చిన్న పిల్ల పింకీ ఓసారి తిరుగుతున్న నా దగ్గర నిలబడింది. హఠాత్తుగా వేలు అందులో పెట్టింది. వెంటనే ఆఁ.. అంటూ అరిచింది. నాకూ చాలా బాధేసింది. నేనేం చేయను చెప్పు. ఇంకోసారి తులసి చీరె కొంగు అదుగో ఆ మూల నున్న ఫ్యాన్లో పడింది. ఇంకేముంది చుట్టుకు పోసాగింది. ఆమె అరుపుకు రాఘవ వచ్చి గబుక్కున ఫ్యాన్ ఆపేశాడు. వాళ్లు అజాగ్రత్తగా ఉంటే మనమేం చేయగలం. చీరె కొద్దిగా చిరిగింది. కానీ పాపం ఆ ఫ్యాన్ మాత్రం కొద్దిగా దెబ్బతింది’ చెప్పింది.

‘అవును.. అన్నట్లు నాకు ఇంకో అనుభవం అయింది. ఓ రోజు నేను గిర గిరా తిరుగుతున్నాను. అంతలో రెండు పిచ్చుకలు కిటికీలోంచి దూసుకొచ్చి గదిలో పోటీలు పడి ఎగరటం మొదలు పెట్టాయి. అవెక్కడ నా రెక్కల మధ్యకు వచ్చి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటాయో అని తెగ భయపడ్డాను. ఇంతలో బామ్మ వచ్చి టక్కున స్విచ్ ఆఫ్ చేసింది. అవి గాని నా రెక్కలు తగిలి మరణించి ఉంటే… అది తలచుకుంటే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది’ అన్నాను.

‘నిజమే.. ఎంతో ప్రమాదం తప్పింది. ఇంకో సంగతి నాకు అనిపించేది ఏమిటంటే.. మనల్ని శ్రద్ధగా చూసుకుంటే మనం కూడా బాగా సేవ చేయగలం. బర్రూం బర్రూం అంటూ ఒకటే చప్పుడు చేస్తుంది అంటారు కానీ ఎప్పుడైనా మనల్ని తుడిచి, లూబ్రికెంట్ ఆయిల్ వేస్తే కదా.. ఈ మనుషులు చాలా బద్దకస్తులు. ఎంత సేపూ తమకు సేవలు కోరుకుంటారే కానీ మన గురించి ఆలోచించరు. పైగా ‘వాళ్లకు కోపం వచ్చినప్పుడల్లా నేనేమన్నా యంత్రాన్నా?’ అంటూ మనల్ని అవమానిస్తారు. ఎంత మేధ ఉంటే మాత్రం అంత అహంభావమా?’ అంది టేబుల్ ఫ్యాను.

అంతలో నాకు మరో విషయం గుర్తొచ్చింది. వెంటనే మా వాళ్లతో ‘ఈ విషయం వినండి. ఈ మధ్య హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఓ పరికరం కనుగొన్నారట. దాంతో ఇండియాలో తమ ఇంట్లోని తిరుగుతున్న ఫ్యానును విదేశాల్లో ఉండి కూడా స్విచాఫ్ చేయవచ్చట. ఆ ఆవిష్కరణ పేరు హై వైఫై. దీనివల్ల మనం అనవసరంగా కష్టపడి అలసిపోం. అలాగే విద్యుత్తు వృథా కాకుండా ఉంటుంది’ చెప్పాను నేను. ‘భలే భలే’ అన్నారు మా వాళ్లంతా.

ఇంతలో ఏసీ గది తలుపు తెరుచుకుంది. ‘హమ్మయ్య! మీ రందరూ కనిపిస్తున్నారు. ఏంటి ఏదో మీటింగ్ పెట్టినట్లున్నారు?’ అడిగింది ఏసీ నవ్వుతూ. ‘ఏం వుంది.. మన గురించి, మానవుల గురించి..’ అన్నాను నేను. ‘ఈ కాలంలో అయితే ఏసీ లేకుండా ఏ మనిషీ ఉండలేక పోతున్నాడు. మనుషులకే కాదు ఆఖరికి కంప్యూటర్లకు కూడా ఏసీ అవససరమే. అప్పుడే అవి వేడెక్కకుండా శాంతంగా ఉండి చక్కగా పనిచేస్తాయి. సినిమాహాల్స్‌లోనూ ఏసీకే ప్రాముఖ్యం. రైల్లోనూ ఏసీ క్లాస్ అంటే మక్కువ. ఏసీ బస్సులు చెప్పనే అక్కర్లేదు. కార్లలో సరేసరి. షాపింగ్ మాల్స్ లోనూ ఏసీలు ఉండాల్సిందే. చాలామంది ఇంటికన్న గుడి పదిలమన్నట్లు ఇంట్లో ఏసీ ఉన్నా, లేకున్నా, మధ్యాహ్న సమయాలు ఎంచక్కా షాపింగ్ మాల్స్‌లో గడిపేస్తున్నారట. మరి ఏమాత్రం కొంటారనేది దేవుడికే తెలియాలి’ నవ్వుతూ అంది ఏసీ తన గొప్పను చాటి చెపుతూ. మేం బదులిచ్చే లోపే రాఘవ ఆ గది తలుపు వేసేశాడు.

‘బాగా అయింది. ఓ గొప్ప తెగ చెపుతోంది. తలుపులు మూసి, గదిలో ఉన్నవాళ్ళు తాము వదిలిన గాలినే మళ్లీ మళ్లీ పీల్చు కోవడం.. అదో గొప్పా’ ఈసడిస్తూ మెల్లగా అంది టేబుల్ ఫ్యాన్. విసనకర్ర పకపకమంటే నేను చిరునవ్వు నవ్వాను. ‘మీకు గుర్తుందా. కిందటేడు రాఘవ చెల్లెలు వాళ్లు కొత్త ఇల్లు కట్టుకున్నారు. బావమరిదికి బహుమతిగా నాలుగు సీలింగ్ ఫ్యాన్లు ఇస్తానన్నారు రాఘవగారు. కానీ బావమరిది “ఇస్తే నాలుగు ఏసీలు ఇవ్వమను.. బోడి సీలింగ్ ఫ్యానెందుకు” అన్నాడట. చివరకు రెండు ఏసీలు, రెండు సీలింగ్ ఫ్యాన్లతో సర్దుబాటు జరిగింది’ గుర్తు చేసింది టేబుల్ ఫ్యాను.

‘ఏమిటో ఈ మనుషులు. పుడుతూనే ఏసీలతో పుట్టినట్లు’ అంది విసనకర్ర. అందుకు నేను నవ్వుతూ.. ‘అలా అనకు రాఘవగారి బావమరిది మాటేమో కానీ ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులన్నిట్లో ఏసీ ఉంటోంది కదా. ఆపరేషన్ థియేటర్లలో తప్పనిసరిగా ఉంటుంది. అందునా ఇప్పుడు అన్నీ సిజేరియన్లే కదా. అందువల్ల ఇప్పటి పిల్లలయితే పుడుతూనే ఏసీలో ఉన్నట్లే లెక్క’ అన్నాను. దానికి అంతా నవ్వుతూ ‘నువ్వు చెప్పింది నిజమే’ అన్నారు. ‘సరేలే.. మనలో మనం ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనుకోవడం ఎందుకు.. పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎవరు అవసరమయితే వారిని వాడుకుంటూ ఉంటారు ఈ మనుషులు. విసనకర్రగాని ఏ రకమయిన విద్యుత్ పంకా కానీ, ఏసీ గాని అవసరాలే’ అంది టేబుల్ ఫ్యాన్.

ఇంతలో కూలర్ పళ్లికిలిస్తూ ‘హాల్లో అయితే నేను ఉండాల్సిందే. పైగా నా లోపలి నీళ్లలో రకరకాల సువాసన ద్రవ్యాలు కలుపుతారేమో. నేను సుగంధ గాలులు వీస్తూ ఉంటే అంతా హాయిగా సేద తీరుతూ ముచ్చట్లు చెప్పుకుంటారు’ అంది తన ప్రత్యేకతను గుర్తుచేస్తూ. టేబుల్ ఫ్యాన్‌కు కాస్తంత కోపం వచ్చింది. ఏదో అనబోతుంటే నేనే దాన్ని ‘కూల్ కూల్’ అని వారించి.. ’నిజమేలే. నువ్వే కాదు, నీ కన్నా పెద్ద ఎయిర్ బ్లోయర్లు ఉంటాయిట. ఆ మధ్య రాఘవ గారు చెపుతుంటే విన్నాను. మేరేజ్ హాల్స్ దగ్గర లోపలి ప్రవేశ ద్వారాల వద్దవాటిని ఏర్పాటు చేస్తారట. ఆహుతులు లోపలికి ప్రవేశించేటప్పుడు చల్లని చిరుజల్లుల సుగంధ గాలులు వారిని మైమరపిస్తాయట’ చెప్పాను. ‘అలాగా’ అంది కూలర్. ‘ఇంకో విషయం. విండ్ మిల్ అనేది కూడా ఫ్యాన్ మాదిరే ఉంటుంది. కానీ మనకు, వాటికీ తేడా ఉంది. మనం విద్యుత్‌తో పనిచేస్తాం లేదా బ్యాటరీతో పనిచేస్తాం. కానీ విండ్ మిల్ గాలికి తిరుగుతూ పవన విద్యుత్తును తయారుచేస్తుంది. గమ్మత్తుగా ఉంది కదూ’ అన్నాను. ‘భలే భలే’ అన్నాయి మిగతావి.

ఇంతలో ఆడుకోవడానికి బయటకు వెళ్లిన పిల్లలు వచ్చేశారు. వస్తూనే అన్ని స్విచ్‌లు వేసేసి, మమ్మల్ని సేవకు పురమాయించారు. దాంతో మా వాళ్లంతా నిశ్శబ్దమయి పోయారు. నేను కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఆలోచన కొనసాగిస్తున్నాను.. మేం కాసేపు తిరగకపోతే చిరాకుపడి, కోపావేశాలకు లోనవుతారు. మా జాతి ఎంత చల్లబరిచినా అది ఓ స్థాయి వరకే వారికి శాంతాన్నివ్వగలదు. ఎందుకంటే దేహానికి సంబంధించిన చిరాకును మేం తరిమిగొట్టగలం గానీ, ఈర్ష్యాసూయలతో, లేనిపోని అశాంతులతో ఆగ్రహావేశాలకు లోనయి తగవులకు, దాడులకు తెగబడే వారిని మేం ఎట్లా శాంతపరచగలం? మేమిచ్చే చల్లనిగాలికి ఆఫీసుల్లో బాస్‌లు కాస్తంత కూల్‌గా ఉండి, కింది ఉద్యోగుల పై చిటపటలాడరు. ఉద్యోగులు కూడా ప్రశాంతంగా పని చేసుకుంటారు. అలాగే ఏసీ ఉంటే కంప్యూటర్లు మొరాయించకుండా చక్కగా పని చేస్తాయి. ఈ మనుషులు ఒక్కోసారి చిత్రంగా మాట్లాడుతారు. మా సేవలు పొందుతూనే ‘ఆఁ ఎంతైనా ఆరుబయల్లో ప్రకృతి సహజంగా చెట్లు ఇచ్చే గాలిలో ఎంతో హాయి. దానికి సాటి లేదు’ అంటూ మమ్మల్ని చిన్నచూపు చూస్తారు. అయినా ఇప్పుడు స్వచ్ఛమైన గాలులెక్కడున్నాయనీ? ప్రపంచమంతా వాయు కాలుష్యం పెరిగి పోతోందని తెలిసి కూడా అలా మాట్లాడుతారేంటో? ఆ లెక్కన కృత్రిమమైనా మేమిచ్చే గాలే ఉత్తమమంటాను నేను. పైగా ఆరుబయట పురుగు, పుట్ర, దోమలు వగైరా శత్రువులు ఉండనే ఉంటాయి. దొంగల భయం సరేసరి. ఇలాంటి పరిస్థితులలో ఆరుబయలు.. స్వచ్ఛమైన గాలి వట్టిమాటలేకదా. సరే.. ఇది అటుంచితే నాకు అమితంగా బాధ కలిగించే విషయం ఏమిటంటే.. ఫ్యాన్లకు చీర కట్టి, చున్నీలు కట్టి ఉరివేసుకోవడం. అందుకే మనుషులకో మాట చెప్పాలనుకుంటున్నా.. ఆత్మహత్య చేసుకోవడమే కూడని పని. పైగా అందుకు మమ్మల్ని సాధనం చేసుకుని, ఆ పాపంలో మమ్మల్ని భాగస్థుల్ని చేయకండి. ఇదేదో గాలిమాట లనుకోకండి.. గట్టి మాటలుగా అర్థం చేసుకోండి.. ఎందుకంటే మీరంతా మా ఫ్యాన్లు (అభిమానులు).. మేమూ మీ ‘ఫ్యాన్’లమే’.. నా మాటలు మనిషికి చేరేనా అనుకుంటుంటే రాఘవగారు వచ్చి నా స్పీడ్ పెంచారు. దాంతో ఆలోచనను పక్కకు నెట్టి, గిర్రున తిరిగా. ఇంకేముంది.. టేబుల్ మీద పైన బరువు పెట్టని కాగితాలు ఒక్కసారిగా ఎగిరి గదంతా చెల్లాచెదురుగా పడ్డాయి. ‘అయ్యో అయ్యో’ అంటూ రాఘవగారు వాటిని ఏరుకుంటుంటే నేను నవ్వుకుంటూ నా పవర్ చూపించడంలో ఫుల్ బిజీ అయిపోయా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here