సంచిక ఉగాది 2022 కథల పోటీ ఫలితాలు – కథకుల పరిచయాలు

10
3

[dropcap]సం[/dropcap]చిక నిర్వహించిన ఉగాది కథల పోటీ ఫలితాలు రామనవమికి ప్రకటితమవుతూన్నాయి. సాధారణంగా ఏ పోటీ ఫలితాలనయినా సంతోషంగా, సంబరాల నడుమ ప్రకటిస్తారు. కానీ ఈ కథల పోటీ ఫలితాలు ప్రకటించటంలో ఎలాంటి ఆనందం లేదు. పోటీకి వచ్చిన కథలు అసంతృప్తిని కలిగిస్తే ఫలితాలు  నిరాశను మిగిల్చాయి.

కథల పోటీ విభిన్నమైన కథల పోటీ. మామూలుగా తెలుగులో వస్తున్న ఆదర్శాలు, అణచివేతలు, ఇజాలు, ఆదర్శాల నీతికథలు కాకుండా, భిన్నమయిన కథలకు పోటీకి ఆహ్వానించాం. మామూలుగా అలవాటయిన రీతిలో కాకుండా రచయితలతో భిన్నంగా ఆలోచింప చేయాలన్నది లక్ష్యం. ఆరంభంలో కథలు అందకపోవటంతో ‘పోనీ మామూలు కథల పోటీగా చేద్దాం’ అని కూడా అనుకున్నాం.

కానీ చివరికి దాదాపుగా 80 కథలు రావటంతో సంతోషంగా కథలను న్యాయనిర్ణేతలకు పంపించాం. అందరికి ఉత్సాహం కలిగించేందుకు 20 బహుమతులను నిర్ణయించాం. యువ రచయితలను ప్రోత్సహించేందుకు, వారికి ప్రత్యేకంగా బహుమతులను కేటాయించాము. కానీ మా వివరణలో లోపం ఉందో, లేక ‘పోటీ’ అనగానే ఇలాంటి కథలకే బహుమతి నిస్తారన్న అభిప్రాయం స్థిరపడి ఉన్నదో కానీ విభిన్నమైన కథలు అందినవి గుప్పెడే. అధిక శాతం కథలు, రచయితలు ఆసక్తికరంగా, అద్భుతంగా కథలను సృజించినా – అన్నీ మామూలు నలిగిన అంశాల ఆధారంగా సృజించిన కథలే. అలాంటి కథలను వదిలి కనీసం విభిన్నమైన అంశాలతో సృజించిన కథలకు 20 బహుమతులు ఇవ్వాలనుకుంటే, ఇవ్వాలనుకున్న బహుమతుల కన్నా బహు తక్కువ కథలు మిగిలాయి.

ఈ కథలు కూడా అంశం భిన్నమైనది అయినా కథనంలో కాని, కథాగమనంలో కాని అసంతృప్తి కలిగించేవే. విభిన్నమైన అంశం అయినా కొన్ని కథలు హాస్యాస్పదంగా, తర్కరహితంగా ఉండి తీవ్రమైన నిరాశను కలిగించాయి. అందువల్ల బహుమతికి అర్హంగా కేవలం 7 కథలు మిగిలాయి. అలాగని ఇతర కథలు బాగా లేవనీ, ఈ కథలు గొప్పగా ఉన్నయనీ కాదు. కేవలం, కథలు, మా నియమ నిబంధనల పరిధిలోకి ఒదగలేదు. కాబట్టి వాటిని బహుమతికి అర్హంగా పరిగణించలేదు అన్న విషయం రచయితలు గ్రహించాలి. బహుమతులిచ్చిన కథలుకూడా, ప్రధానంగా కథాంశం ఆధారంగా ఇచ్చినవే తప్ప కథనం ఆధారంగా కాదు. కథనం ఎలావున్నా కనీసం భిన్నంగా ఆలోచించినందుకు ఇచ్చిన ప్రోత్సాహంగా ఈ బహుమతులను భావించవచ్చు.

పోటీకి తమ రచనలు పంపిన అందరికీ సంచిక హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తోంది. కృతజ్ఞతలు తెలుపుతోంది. ఈ అనుభవంతో త్వరలోనే సంచిక మరో కథల పోటీ నిర్వహించబోతోంది. వివరాలు త్వరలో ప్రకటిస్తాము. పోటీలో పాల్గొన్నవారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, విజేతలను అభినందిస్తోంది సంచిక.

పోటీకి వచ్చిన కథలన్నీ సంచికలో ప్రచురితమవుతాయి.

విజేతల వివరాలు (కథల అకారాది క్రమంలో)

  • అప్పారావూ – అంతరిక్ష సుందరి – శ్రీ అయ్యగారి శర్మ
  • అంతరిక్షంలో ఆరు గంటలు – గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం
  • ఇరవై రోజులు – గొర్తి వాణిశ్రీనివాస్
  • నరాలయం – పాలెపు బుచ్చిరాజు
  • భవిష్యత్ దర్శనం – కొమ్ముల వెంకట సూర్య నారాయణ
  • మెయిల్ ఆర్డర్ బ్రైడ్ – తిరుమలశ్రీ
  • సాక్షీ’భూతం’ – భాగవతుల భారతి

కథకుల పరిచయాలు – స్పందనలు:

అయ్యగారి శర్మ

నా పూర్తి పేరు A.V.N.H.S. శర్మ.

ఓ ప్రముఖ దినపత్రికలో పాత్రికేయునిగా 34 ఏళ్ల అనుభవం. దాదాపు 150 వరకు వ్యంగ్య రచనలు, వివిధ పత్రికలలో పదుల సంఖ్యలో కథలు ప్రచురితం.

యూట్యూబ్, బ్లాగ్ ల ద్వారా సామాజిక వేదికలపై అభినివేశం.

 


గొర్తి వాణిశ్రీనివాస్

గొర్తి వాణిశ్రీనివాస్‌గా గత కొంతకాలంగా రచనలు చేస్తున్న నన్ను వివిధ పత్రికలు ఎంతగానో ఆదరించి ప్రోత్సహించడం నా సాహిత్య ప్రయాణానికి బలం చేకూర్చింది.

సాహిత్యం పట్ల మక్కువతో, నా భర్త గొర్తి శ్రీనివాస్ గారి ప్రోత్సాహంతో నేటి సంక్లిష్ట సమాజంలో తలెత్తుతన్న అసమానతలు అసహజతలను తొలిగేందుకు మంచిని పెంచే దిశగా రచనలు చేయాలనేది నా అభిలాష.

ఈ ‘ఇరవైరోజులు’ కథకు ప్రేరణ సంచిక పత్రిక వినూత్న,విభిన్న కథలను ఆహ్వానించడమే.

సంక్లిష్టమైన మెదడుకి సంబంధించిన ఊహాతీతమైన భావనలను ఆధారం చేసుకుని మనసు మెదడుల గుణ సమ్మేళన వైచిత్రిలో గెలుపెవరిదో తెలియని విచిత్ర స్థితిలో ఓటమికీ గెలుపుకీ మధ్య ఊగిసలాడే మనిషి ప్రవర్తనను ,ప్రఖ్యాత అమెరికన్ రైటర్ డేల్ కార్నెగీ రచించిన మానసిక విశ్లేషణకు సంబంధించిన అంశాల ఆధారంగా ఈ కథ రాయటం జరిగింది.

ఈ కధను బహుమతికి ఎంపిక చేసిన సంచిక యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు


గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం

నేను నవంబరు, 1936లో జన్మించేను. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యేను. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా, 1994లో విశ్రాంతి తీసుకొన్నాను. అమెరికా వాసిని.

హైస్కూలు విద్యార్థిగా రంగప్రవేశం చేసేను. గడచిన అయిదు సంవత్సరములవరకు, చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేను.

గత అయిదు సంవత్సరాలనుండి, కథలు, కవితలు రాయడం ప్రారంభించేను. ఈ నాటికి, 25 కథలు, 3 కవితలు ప్రచురణమయ్యేయి. సుమారు 45 సంవత్సరాలకు పూర్వం, నేను రచించిన, ఒక చిన్న నాటిక, ఈ కథకు, పునాది వేసింది. నా శ్రీమతి ప్రేరణతోనే, ఈ కథ రాయగలిగేను.


పాలెపు బుచ్చిరాజు

భారత దేశపు పెట్రోలియం అన్వేషణ సంస్థ ఓ. ఎస్. జి. సి. లో సైంటిస్టుగా పదవీ విరమణ చేశాను. వయసు 81 సం.లు. స్వస్థలం గునుపూడి, విశాఖపట్నం జిల్లా, ఉద్యోగ రీత్యా బరోడాలో (గుజరాత్) చాలా కాలం ఉండడంవల్ల బరోడాలో స్థిర పడ్డాను. గత నలభై సంవత్సరాలుగా రచనలు చేస్తున్నాను. కథలు, వ్యాసాలూ, అనువాద కథలు (గుజరాతీ, ఆంగ్లం) కలిపి రెండు వందలకు పైనే ఉంటాయి. నా కథల మీద ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్ధిని పి. హెచ్. డి. కి సిద్ధాంత వ్యాసం సమర్పించింది. రాఫ్టేతరాంధ్ర రచయితగా తెలుగు విశ్వవిద్యాలయం, అహమ్మదాబాదు ఆంధ్ర సభ సన్మానించారు.

నరాలయం కథకి స్ఫూర్తి

కథ చదవండి. కరతలామలకం. నేటి కుల, మత, రాజకీయ పరిస్థితులు సమాజాన్ని నైతికంగా ఎంత క్రిందికి దిగజార్చాయో ప్రతి నిత్యం మాధ్యమాల్లో వింటూ, చూస్తూ ఊరికే ఉండలేక చేసిన సృజనాత్మక వాక్యీకరణ . కొంతకాలం క్రిందట, ‘ఆంగ్లేయులే నయం’ అనిపించేది. ఇప్పుడు ‘హిరణ్యకశ్యపాదులే నయం’ అనిపించడం లేదూ!


కొమ్ముల వెంకట సూర్య నారాయణ

సంచిక ఉగాది కథల పోటీలో నా కథ ‘భవిష్యత్ దర్శనం’ బహమతికి ఎంపికైనందుకు సంచిక సంపాదక వర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కొమ్ముల వెంకట సూర్యనారాయణ. ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ, బొమ్మూరులో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా గణితం పట్ల మక్కువైతే ప్రవృత్తి రీత్యా తెలుగు భాషంటే ఎనలేని అభిమానం. ఇప్పటివరకు సుమారు డెబ్భై అయిదు కథలు వరకు వివిధ పత్రికల్లో, ఆన్‌లైన్ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి, అలాగే ఇరవై వరకు కవితలు, నానీలు, హైకూలు, మినీ కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

ఇక బహుమతి పొందిన ఈ కథ విషయానికొస్తే మొబైల్ ఫోన్ విస్తృతంగా వాడటం మొదలుపెట్టి దానికి ఇంచుమించు బానిసగా మారిపోయి ఆప్యాయతలు, అనుబంధాలు మొబైల్ సందేశాలకి పరిమితమైపోతున్నాం. ఇదే కొనసాగితే కొంతకాలానికి మన పరిస్థితి ఎలా దిగజారుతుందో ఊహించి ఈ కథను వ్రాయటం జరిగింది.

ఈ కథకు బహుమతి ఇచ్చి ప్రోత్సహించినందుకు సంచిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.


తిరుమలశ్రీ

అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. ఆలిండియా సర్వీసెస్ కి చెందిన వీరు, భారతప్రభుత్వపు జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు. ‘తిరుమలశ్రీ’, ‘విశ్వమోహిని’ కలం పేర్లు.

తెలుగులో – అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. 190 నవలలు పుస్తకరూపంలోను, పత్రికలలోను, సీరియల్స్ గానూ ప్రచురితమయ్యాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలు కథలకు బహుమతులు లభించాయి. కొన్ని కథలు హిందితో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ ని నిర్వహించారు. ఎడిటింగులో అనుభవం. పలు సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. ‘కలహంస’’ పురస్కార గ్రహీత. ‘కథాకిరీటి’, ‘కథా విశారద’, ‘బాలకథాబంధు’ బిరుదాంకితులు.

కథ నేపథ్యం

ఇంటర్నెట్ వచ్చాక పిన్-టు-పియానో-టు-పెట్స్ వరకు – అరుదైన వస్తువులను సైతం – మెయిల్ ఆర్డర్ ద్వారా పొందే అవకాశం కలిగింది. ‘డిజైన్డ్ బేబీస్’ అన్న పద్ధతికూడా ఇటీవల అమలులోకి వచ్చింది. అలాగే, ‘వధువు’ ను కూడా ‘మెయిల్ ద్వారా ఆర్డర్’ చేసి పొందితే ఎలా వుంటుంది అన్న ఓ చిలిపి ఆలోచనకు రూపకల్పనే – ఈ ‘మెయిల్ ఆర్డర్ బ్రైడ్’!!


భాగవతుల భారతి

సంచిక వారికి సాక్షీ’భూతం’ అనే కథకు బహుమతి ప్రకటించినందులకు హృదయపూర్వక ప్రణామములండీ.

మా ఇంటిపేరు… భాగవతుల నా పేరు పేరు… భారతి. మా ఊరు ఖమ్మం. నేను గృహిణిని. నేను డబుల్ ఎం.ఎ (బిఎడ్) చేశాను. శ్రీవారు శ్రీనివాస్ గారు ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్. పాప భాగవతుల మానస.

కుటుంబ బాధ్యతల దృష్ట్యా టీచర్‌ ఉద్యోగం మానేసి.. నిత్యాగ్నిహోత్రమూ, వేదాధ్యయనము, స్వాధ్యాయం వైపు నడిచి… పౌరోహిత్యం నేర్చి, ఆడవాళ్లు పౌరోహిత్యం చేయకూడదా? అనే స్త్రీ సాధికారతతో పురోహితురాలు, అనే దిశగా నా ప్రయాణం సాగుతోంది. ఎంతోమంది విద్యార్ధులు, నా వద్ద మంత్రాల్నీ నేర్చుకుంటున్నారు…

పిల్లలకూ పెద్దలకూ స్వాధ్యాయం క్లాసెస్ జరుపుతూ ఉండటం. రచనలు చేయటం రెండూ రెండు కళ్ళుగా జీవన పయనం సాగిస్తున్నాము. (దీనికి శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా ఉంది.)

పద్యాలూ, పాట, వచన కవితలూ వ్యాసం,కథలూ… అనేక పత్రికలో ప్రచురణ అయినాయి. మనీతో కూడిన బహుమతులతో పాటుగా… సన్మానాలూ అందుకోవటం… మరిచిపోలేని మధురానుభూతులు. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్శిటీ లో వైస్ ఛాన్సలర్ గారి చేతుల మీదుగా సన్మానోత్సవకార్యక్రమం మరిచిపోలేనిది.

కథకి ప్రేరణ.. సంచిక వారు అందించిన ప్రోత్సాహమే… రొటీన్ సామాజిక, నీతి కథలు కాకుండా భిన్నంగా వ్రాయమని ప్రోహ్సహించిన సంచికవారే ప్రేరణ.. నా కథకు బహుమతి ప్రకటించి ఇలాంటి నా పరిచయానికి అవకాశం కల్పించిన సంచిక పత్రిక వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here