వైకుంఠపాళి-10

0
3

[dropcap]”ను[/dropcap]వ్వు సంపాదిస్తూ వుంటే నేను ఇంట్లో కూచోనా?” అన్నాడు.

“సరిగ్గా సంపాదించడం రాక అడ్డదారులలో సంపాదిస్తే మళ్ళీ చిక్కుల్లో పడతాం… ప్రేమైనా అంతే! అందుకే నేనీ నిర్ణయం తీసుకున్నాను. మీరు హాయిగా పూర్వాశ్రమంలోలా కథలు వ్రాసుకోండి. నేను ఆఫీసుకెళ్ళి తిరిగొచ్చేదాకా మీకు బోలెడు తీరిక!” అని అతని గుండెల దాకా దుప్పటి కప్పి లేచింది లక్ష్మి.

బేలగా చూస్తూ నోరు లేనట్టు వుండే లక్ష్మి అలా సూటిగా, ధాటిగా తన జీవితాన్ని గురించి ఓ నిర్ణయాన్ని తీసేసుకుని, అమలు జరిపెయ్యడం అతను చూస్తూ వుండిపోయాడు.

“నేను ఆఫీసు కెళ్ళాలి…. వస్తా…. వచ్చేటప్పుడు మీకేం తీసుకురానూ?” ప్రేమగా అడిగింది.

అతను తల అడ్డంగా ఊపాడు.

“మీకు ఇష్టమైనవి నేను తీసుకురాలేకపోవచ్చు. కానీ అవసరమైనవి నేను తేగలను!” అని ఆమె బయటకు వెళ్ళిపోయింది.

వాసుదేవరావుకి యమధర్మరాజుతో పోట్లాడి భర్త ప్రాణాలు కాపాడిన సావిత్రి గుర్తొచ్చింది. ఈ ఆధునిక సావిత్రి రేపటి నుంచీ తన జీవితాన్ని ఎలా నిర్దేశిస్తుందో అతనికి అర్థం అయిపోయింది.

ఒకప్పుడు లక్ష్మి ఎలా చూస్తూ వూరుకునేదో, ఇప్పుడు తనూ అలా వూర్కోక తప్పదని అతని అనుభవం చెప్పింది!

***

“నేను సమయానికి రాకపోతే, అతన్ని చంపేసి వుండేదానివి. థాంక్ గాడ్… సమయానికి వచ్చి నిన్ను ఆ ఆపద నుండి కాపాడుకున్నాను” నందినిని హృదయానికి హత్తుకుంటూ అన్నాడు శశిధర్.

నందిని వెక్కి వెక్కి ఏడుస్తూ “ఇప్పుడు… ఇప్పుడు నేను నిజంగా చెడిపోయానండీ! శీలం పోగొట్టుకున్నాను. పతితను!” అంది.

శశిధర్ ఆమె కళ్ళు తుడిచాడు.

“కాదు నందినీ… పవిత్రత అంటే ఏమిటో నిరూపించి నా కళ్ళు తెరిపించావు. శీలం రక్తమాంసాల్లో, కండరాల్లో వుండదు! మనసులో వుంటుంది. ఇన్నాళ్ళూ నీతో కాపురం చేసి, నువ్వంటే ఏమిటో బాగా తెలిసి కూడా నేను మృగంలా విజ్ఞత లేకుండా ప్రవర్తించాను. నిన్ను అవమానించి, అనరాని మాటలు అన్నాను. నిన్ను నరకం పెట్టి, నేను నరకం పడ్డాను. అసలు ఇదంతా మీ అక్క వల్ల కదూ… ఆమె ఒక పథకం ప్రకారం ఇదంతా చేసిందనిపిస్తోంది!” కోపంగా అన్నాడు.

“అది పిచ్చిది! ఏ క్షణానైనా కాటు వేసే విషసర్పాలతో ఆడ్తోంది. చిన్నప్పటి నుండీ అంతే… ఎందుకో తెలియని ద్వేషం అందరి మీదా పెంచుకుంది. ఎవరూ దానికంటే అందంగా వుండకూడదు… బాగా మార్కులు తెచ్చుకోకూడడు. తెలివిగా వుండకూడదు… గొప్పగా వుండకూడదు! ఇలాంటి మనస్తత్వంతోనే అమ్మనీ, నాన్ననీ, చివరికి నన్నూ దూరం చేసుకుంది. ఇక ముందు ముందు ఏమౌతుందో… ” బాధగా నిట్టూర్చి కళ్ళు తుడుచుకుంది నందిని.

ఇంతలో కొంతమంది ఆడవాళ్ళు లోనికి వచ్చారు.

“నువ్వు ధైర్యంగా ఆ వెధవని శిక్షించినందుకు మహిళా సంఘాలు నీకు సన్మానం చేస్తాయిట!” అన్నాడు శశిధర్.

నందిని విరక్తిగా నవ్వి “ప్రతి స్త్రీ తన భర్త ఇలాంటి పనుల కోసం గడప దాటకుండా చూసుకుంటే చాలు! స్త్రీ జాతికి మేలు చేసినట్లే…” అంది.

ఆ మాటలు తననే ఉద్దేశించి అన్నట్లుగా ముందుగా నిలబడ్డ వందన వులిక్కిపడింది.

“ఈ పురుషులు అహంకారులు… మదాంధులు… దుర్మార్గులు… ఉన్మాదులు!” ఆవేశంగా అందో అమ్మాయి.

నందిని వారిస్తూ… “కాదమ్మా… ఆ పురుషుడు ఎక్కడి నుండో రాలేదు… మనకే పుడ్తున్నాడు. వాడిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనదే! మనం మనింట్లో వాడిని వదిలిపెట్టి, ఇంకెక్కడో వున్న వాడిని సరిచేసేందుకు నినాదాలిస్తూ, ఊరేగింపులు జరపడం అనవసరం… క్షమించండి. నాకు పెద్ద పెద్ద మాటలతో స్త్రీ అభ్యుదయం… స్త్రీ స్వేచ్ఛ అని మాటలాడడం రాదు. నా అభిప్రాయాలు నేను చెప్పాను అంతే!” అంది.

వందన ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ వెనుతిరిగింది.

***

“ఈసారి సాహిత్య పరిషత్ ఎకాడమీ అవార్డు నాకే రావాలి” బుంగమూతి పెట్టి చెప్పింది మాళవిక.

“డబ్బుతో పనౌతుందా?” ఆమెని పైకి లాక్కుంటూ అడిగాడు రాజశేఖరం.

“తెలీదు. ముందుగా జడ్జీలు ఎవరో తెలుసుకోవాలి!” అంది.

రాజశేఖరానికి చాలా పలుకుబడీ, డబ్బూ రెండూ వున్నాయి. అతన్ని కలిసాకా మాళవికకి సతీష్ చంద్ర బోర్‌గా అనిపిస్తున్నాడు.

అతను ఎక్కడెక్కడికో ఫోన్లు చేసాడు.

“జడ్జీల్లో రామనాథం, కృష్ణమూర్తీ కూడా వున్నారు. వాళ్ళిద్దరూ నాకు ఫ్రెండ్స్. నీకేం భయం లేదు. ఇంతకీ ఏ నవల ఇస్తున్నావు?” అడిగాదు

“అంతిమ విజయం” అంది.

ఆమెని అమాంతం చుట్టేసి, “అంతిమ విజయం నీదేలే!” అన్నాడు.

మాళవికకి తన చుట్టూ ఫోటోగ్రాఫర్లూ, ప్రెస్ వాళ్ళూ, ఇంటర్వ్యూలూ కళ్ళల్లో మెదిలాయి. ‘నాలుగు ఇంగ్లీషు ముక్కలు కూడా నేర్చుకుంటే బుకర్స్ ప్రైజు కొట్టేసేదాన్ని కదా!’ అనిపించింది.

ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదు. తనకి వచ్చే కీర్తి ప్రతిష్ఠలు గురించి మేల్కొనే కలలు కంది.

రాజశేఖరం మాత్రం తన అవసరం తీర్చుకుని నిశ్చింతగా నిద్రపోయాడు.

***

వాసుదేవరావు బాబుకి పాలు పట్టించి వుయ్యాలలో పడుకోబెట్టి వూపుతూ ఆలోచించాడు. ఏ ఉద్యోగమైనా చూసుకుందామనుకున్నా లక్ష్మి ఒప్పుకోవడం లేదు. ‘పిల్లాడ్ని వదిలేసి ఎందుకొచ్చిన వుద్యోగాలూ? ఇన్నాళ్ళూ చేసారుగా, ఇంక నన్ను చెయనీయండీ. ఆడది ఆర్థిక బాధ్యతలు చేపడ్తే ఏం కొంప మునిగిపోదులెండి!’ అంటూ కొట్టి పారేస్తోంది. అతనికి లక్ష్మిలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. ఆమె తనతో ప్రేమగానే వుంటోంది కానీ తనని నమ్మడం లేదు. స్వేచ్ఛ నివ్వడం లేదు. తనని ఓ బందీని చేసి ఇంట్లో ఖైదు చేసింది. తనీ శృంఖలాలు తెంచుకుని బయటపడ్తే ఇంక జన్మలో ఈ వివాహ చట్రంలోకి రానివ్వదు. అది పరోక్షంగా హెచ్చరిస్తూనే వుంది! ‘వా! ఆధునిక స్త్రీ ఎంత తెలివి మీరిందీ… ముఖ్యంగా లక్ష్మిలా నోరు లేకుండా మూగగా పడుండే స్త్రీ ఇలా భర్తని అదుపు చెయ్యగలదని ఎవరైనా అనుకోగలరా. ఉద్యోగం పురుష లక్షణం అంటారు. అలాంటి పురుష లక్షణాన్నే ఆమె తన నుండి వేరు చేసింది. తను చేసిన పొరపాట్లకి శిక్షగా గాజులు వేయించలేదు. కానీ అంత కన్నా ఎక్కువే చేసింది.

స్త్రీ వాదం అంటూ పైటల్ని వదిలేసి, భర్తల్ని వదిలేసే స్త్రీలు ఎంతైనా నేర్చుకోవాల్సింది వుంది లక్ష్మి లాంటి వాళ్ళనించి’ అనుకున్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here