[dropcap]కొం[/dropcap]డలే అనుకున్నా…
కోట్ల సంవత్సరాలకు సాక్షులు కదా!
గుట్టలే అనుకున్నా..
కొండల్లా ఎదగాలనే ఆకాంక్షలు కదా!
బండలే అనుకున్నా..
మహనీయుల పదస్పర్శలు కదా!
అడివి చెట్లే అనుకున్నా…
అద్భుత ప్రకృతికే అందాలు కదా!
పేరు తెలీని పిట్టలే అనుకున్నా…
మనకన్నా ఎంత స్వేచ్ఛాజీవులు కదా!
ఆకాశం అందుతున్నదనుకున్నా…
అవనికి దూరమౌతున్నానుకదా!
ఎంతో ప్రశాంతత అనుకున్నా…
అది మనసుకు వ్యాపించాలి కదా!
చిన్న గడ్డిపువ్వే అనుకున్నా..
వెన్నెలలో తనివారా స్నానించేది కదా!
గువ్వ గళాన కువకువలనుకున్నా..
నా అడుగులకు అందని లయలు కదా!
చెంగున దూకే జింకలే అనుకున్నా…
మనిషి జాడకే బెదిరిపోతున్నాయి కదా!
అడవినంతా హత్తుకోవాలనుకున్నా…
నేనే అడవిగా మారిపోయాను కదా!