సాఫల్యం-20

5
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సుం[/dropcap]కన్న నిమ్మ చెట్లకు నీరుపెడుతున్నాడు. మూడు వరుసలు తడిసినాయి. వెళ్లి వాడి దగ్గర కాసేపున్నాడు. ఈమధ్య మోటారు గంట సేపటికే వేడెక్కుతున్నదట. నీళ్లు తోడటంలో కూడ స్పీడు తగ్గిందని చెప్పాడు.

తోకోడు కూడ వచ్చాడు. వాడు ఎద్దులను గణపతిని రైలు కట్టవెంట మేపుకొని వచ్చాడు.

“ఒక వారం జూసి వంగ తోట దున్నేయాల సామీ” అన్నాడు.

“మోటరు వేడెక్కిందేమో చూసి ఆపు చేస్తాను. ఆ వచ్చే నీళ్లు పెట్టేసి రూము కాడికి వచ్చేయిండి” అని ఇంజను రూము దగ్గరకు వెళ్లాడు పతంజలి. మోటారు మీద చేయిపెట్టి చూస్తే కాలిపోతుంది. మామూలుగ ఐతే మూడు నాలుగు గంటల సేపు ఆడినా గోరువెచ్చగానే ఉండాలి. బావిలోకి చూస్తే నీరంతా అయిపోయి కేవలం అరడుగులోతు మాత్రమే ఉంది. వెంటనే మోటరు ఆపేశాడు. ఆపింతర్వాత కాలువలో పారే నీరు రెండు చెట్లకు సరిపోతుంది.

అప్పటికి నాలుగు దాటింది. జీతగాండ్లిద్దరూ వచ్చారు. “సామీ, నీవు నాల్గయిదు రోజుల్నుంచి లేక తిక్కలేశినట్లుండాది. నాలుగు పాటలేసుకుంటేగాని కుశాల పుట్టదు” అన్నాడు తోకోడు.

సుంకన్న కుండపట్టుకుని సిద్ధమైనాడు. “అందుకోరా తోక నా కొడకా” అన్నాడు. తోకోడు గొంతు సవరించుకొని పాడసాగాడు.

“బెమ్మగుండం తిర్నాలకు
జాగారం సేయనీకె
శివరాత్తిరి నాడు బోతి
గొర్రు కొయ్య పొడిసినంక బెమ్మగుండం॥
మంది తోనా తిర్నాలా
మాబాగుగ నిండినాది
గుడగుడాటల ముప్పావల
బోయినాదీ కర్మకాలి ॥బెమ్మగుండం॥
బెండ్లూ బత్తాసాలూ
కొనుక్కోని పోతుంటే
సెరుకు ముక్క నములుకుంటా
ఓర సూపూ సూసుకుంటా
వగలుపోయే సిన్నక్కను
సూసినేనూ మరులు గొంటీ ॥బెమ్మగుండం॥
మాటకలిపీ సూద్దమానీ
దాపుకంతా నేను బోతే
తానే దగ్గరకొచ్చీ అన్నది
ఐదు రూపాలుంటె జూడూ
సద్ద సేనూలోకి పోదాం
గంటకంటే ఎక్కువుండను
పోదామ తొందరగ సెప్పనె ॥బెమ్మగుండం॥
తూదీ నెమ్మ తిరునాలలొ
గుడిసేటి ముండ దగిలే
శివశివా సెమియించునన్నని
ఎనుదిరిగ సూడకుండా
అదే పోతాపోతి బయపడి ॥బెమ్మగుండం॥

చివరి చరణం విని పతంజలి సుంకన్న నవ్వీ నవ్వీ అలసిపోయారు. బ్రహ్మగుండం తిరునాళ్లలో ఒక రైతు యువకుడు వేశ్య అని తెలియక ఒక అందమయిన అమ్మాయి మీద మనసు పారేసుకొని భంగపడిన వైనాన్ని చక్కగా వర్ణించాడు కవి.

“ఇంక సామి వంతు” అన్నాడు తోకోడు. లయ ప్రధానమయిన పాటయితే గాని వాళ్లకు నచ్చదు. ముఖ్యంగా సుంకన్న అసలు ఒప్పుకోడు.

కాసేపు ఆలోచించి నాగేశ్వర్రావుపాటు

“చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నదీ

దాని జిమ్మ దియ్య, అందమంతా చీరలోనే ఉన్నది” అని పాడాడు.

తర్వాత, కృష్ణ పాట పాడాడు.

“మా ఊళ్లో ఒక పడుచుందీ,

దయ్యమంటె భయమన్నదీ

మా ఊళ్లో ఒక చిన్నోడు

నేనున్నాలే పదమన్నాడు….” అని

ఈ కార్యక్రమం వాళ్లకు ఆటవిడుపులాంటిది. తర్వాత పశువులను తోలుకొని ఇంటికి బయలుదేరారు. ఈరోజు బండి కట్టుకురాలేదు గణపతి పతంజలి వెంట బుద్ధిగా నడచి వచ్చింది.

గోకర్ణం ప్రయాణం వల్ల చదువు కుంటుపడింది. ఆరోజు రాత్రి 12 గంటల వరకు చదువుకున్నాడు. మరుసటి రోజు ఆదివారం. ఇదురూస్‌ భాషా దగ్గరకు వెళ్లి అర్థంకాని టాపిక్స్‌ మూడు నాలుగు చెప్పించుకొని వచ్చాడు. నాలుగైదు రోజులు పెద్దగా పనులు కూడ లేవు. తోటలో కూడ చదువుకున్నాడు. నాన్నతో సంస్కృత పాఠాలు చెప్పించుకున్నాడు. పెండింగ్‌లో ఉన్న నోట్సు లన్నీ రాసుకున్నాడు.

వాగ్దేవి, రామ్మూర్తి బావ నంద్యాలలో కాపురం పెట్టారు. ‘నడిగడ్డ వీధి’లో ఇల్లు తీసుకున్నారు. బావ బ్యాంకు కూడ దగ్గరేనట. మధ్యాహ్నం వచ్చి భోంచేసి పోతాడట. ఇల్లు సౌకర్యంగానే ఉందట. స్థిమిత పడినాక ఒకసారి వెల్దుర్తి వచ్చి పోతామని రాసింది. ‘శశిధర్‌’ అల్లరి, ముద్దుమాటలు వివరంగా రాసింది. అందరికీ వాడిని చూడాలనిపించింది.

ఎండాకాలం గ్రామర్‌ స్పెషల్‌ క్లాసులు స్టార్ట్‌ చేశాడు పతంజలి. చాలామంది చేరారు. అంతమంది వస్తారనుకోలేదు. కొందరు ఇంటర్‌ చదువుతున్నవాళ్లు, పూర్తయి డిగ్రీలో చేరబోతున్నవాళ్లు కూడ వస్తామని అడిగారు. 8, 9, 10 తరగతి వాళ్లు నలభైమందయ్యారు. వాళ్లకు ఒక బ్యాచ్‌ ఉదయం 7 గం॥ నుండి 8:30 వరకు. ఇంటర్‌ వాళ్లకు సాయంత్రం 6 నుండి 7:30 వరకు కొందరు డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు కూడ ఈ బ్యాచ్‌లో చేరారు. వీరంతా 23 మంది.

స్ట్రక్చర్‌ అండ్‌ ట్రాన్స్ లేషన్‌ మెథడ్‌ ఉపయోగించసాగాడు పతంజలి. ప్రతి టెన్స్‌నూ, పాజిటివ్‌, నెగెటివ్‌, కొశ్చన్‌ రూపాలుగా విభజించాడు. ప్రతిదానికి స్ట్రక్చర్‌ ఇచ్చి, దాని ప్రకారం ఇంగ్లీషులో ఐదు వాక్యాలు వారితోనే రాయించసాగాడు. తర్వాత వర్తమాన రాజకీయాలు, సినిమాలు, క్రికెట్‌, లాంటి టాపిక్స్‌ నుండి తెలుగు వాక్యాలు ఇచ్చి, ఇచ్చిన స్ట్రక్చర్‌ ప్రకారం ఇంగ్లీషులోకి అనువదింప చేశాడు. పతంజలి ఇచ్చే తెలుగు వాక్యాలు ఇలా వుండేవి.

“ఇండియా ప్రపంచకప్‌ గెలుచుకోదా?”

“నీ అభిమాన నటి జమునేనా”

“మొదటి నుండి ఇందిరాగాంధీ ఒక నియంత”

తెలుగులో భావం ఎదురుగా ఉండటం వల్ల దాన్ని ఇంగ్లీషు వాక్య నిర్మాణానికి అనువుగా మార్చి రాసేవారు విద్యార్థులు. సాయంత్రం బ్యాచ్‌లో చాలామంది పతంజలి కంటె వయసులో పెద్ద. తానేదో గురుస్థానంలో ఉన్నట్లు కాకుండా వాళ్లను మర్యాదగా చూసేవాడు.

జూన్‌ 15 వరకు క్లాసులు జరిగాయి. మొత్తం రెండు నెలల కోర్సు. హైస్కూలు పిల్లలకు నలభై రూపాయలు, పెద్దవారికి యాభై రూపాయలుగా ఫీజు నిర్ణయించాడు. చేరిన వారం పదిరోజుల్లోగా మొత్తం ఫీజు కట్టేయాలని చెప్పాడు.

మే మొదటి వారం కల్లా రెండు వేల ఆరువందలు వసూలయింది. కొందరు బీదవారికి ఉచితంగా చెపుతున్నాడు. వెయ్యి రూపాయలు బ్యాంక్‌ లోన్‌ చెల్లించాడు పతంజలి. రాధాసారుకు మూడు వందలిచ్చాడు. జీతగాండ్ల కూలీ బకాయిలన్నీ తీర్చాడు. తోటలో మోటారుకు బేరింగ్‌లు మార్పించి రీవైండింగ్‌ చేయించాడు. దానికి దాదాపు వందరూపాయలైంది.

వారానికి ఒకసారి స్పోకెన్‌ ఇంగ్లీష్‌ క్లాసు. ఆరోజు రాయడం అంటూ ఉండదు. ఏదో ఒక టాపిక్‌ తీసుకుని అందరూ మాట్లాడాలి. ఒక్కోసారి ఐదారు మందిని ఒక గ్రూపుగా, వలయాకారంలో కూర్చోబెట్టి, ఒక టాపిక్‌ ఇచ్చి, చర్చించమని చెపుతాడు.

త్వరలోనే పతంజలి చాలా బాగా చెపుతున్నాడని చుట్టు పక్కల ఊర్లలో మంచి పేరు వచ్చింది.

ఒకరోజు రాత్రి భోజనాలయింతర్వాత నాన్నకు కాళ్లు నొక్కుతూ పతంజలి అన్నాడు.

“నాన్నా, మనందరికీ సరైన బట్టలు లేవు. మూడు నాలుగు వందలు పెట్టి అందరికీ బట్టలు తీసుకుందామా?” తండ్రి కూడ సరేనన్నాడు. చెల్లిలిని, తమ్ముళ్లను తీసుకొని, భోజనం చేసి పదిగంటలకల్లా కర్నూలు బస్సెక్కారు. పెద్దక్క బావ, మేనల్లుడు వస్తారు కాబట్టి వాళ్లకు కూడ తీసుకురమ్మనింది అమ్మ. ఆరోజు సాయంత్రం బ్యాచ్‌ వాళ్లకు సెలవిచ్చాడు పతంజలి.

బస్సు దిగి, వన్‌టౌన్‌కు వెళ్లారు. బస్టాండుకు దగ్గరే. మల్లినాధ, పాణిని ఉత్సాహంగా ఉన్నారు. అన్నయ్య తమకు కర్నూలుకు తీసుకొచ్చినందుకు. మహిత మితభాషి. ఎక్కువగా మాట్లాడదు. “పొలిమేర క్లాత్‌ స్టోర్సు”కు వెళ్లారంతా. కర్నూల్లో అది చాలా పేరు పొందిన పెద్ద బట్టలషాపు. ముందు తల్లికి నేతచీరలు చూపమన్నాడు. అమ్మ ఎనిమిది గజాల చేరలే కడుతుంది. రెండు చీరలు సెలెక్ట్‌ చేశారు. అన్నయ్య చెల్లెలు. ఒకటి ముదురాకుపచ్చ, రెండవది నశ్యం కలరు. రెండూ 52 రూపాయలయ్యాయి. తర్వాత నాన్నకు. ఆయన తెల్లని దుస్తులే కడతాడు. గ్లాస్కో మల్లు పంచలు రెండు జుబ్బాలకు మఫల్‌ లాల్‌ ఫాబ్రిక్స్‌లో పాలనురగలాంటి తెల్లని అంగీ గుడ్డలు తీసుకున్నాడు. ఒక్కో జుబ్బాకు మూడు గజాల గుడ్డ పడుతుందని చెప్పాడు అక్కడి టైలరు. నాన్నకు రెండు కండువాలు కూడ. బిల్లు నూటనలభై ఏడు రూపాయలైంది. తగ్గించమని అడిగాడు పతంజలి. పదిహేడు రూపాయలు కన్సెషన్‌ ఇచ్చారు.

బట్టల ప్యాకెట్లు పట్టుకుని బయటకు వచ్చారందరూ బయట చెరుకు రసం బండి వాడి వద్ద చెరుకు రసం తాగించాడు పిల్లలకు. “మల్లినాధన్నయ్యకు మీసాలొచ్చాయి” అన్నాడు పాణిని. చెరుకు రసం నురగ నోటికి ఇరువైపులా ఉండిపోయింది. తాగింతర్వాత. తనక్కూడ మీసాలు వచ్చాయి అనేది తెలియలేదు వాడికి. మహిత జాగ్రత్తగా తాగింది. కర్చీఫ్‌తో తమ్ముళ్ల మూతులు తుడిచాడు పతంజలి.

తర్వాత మజిలీ ‘రాయల్‌ గార్మెంట్స్‌’ అది కూడ పేరుపొందిన రడీమేడ్‌ షాపు కర్నూల్లో మల్లినాధకూ, పాణినికి రెండు నిక్కర్లు, రెండు షర్టులు తీసుకున్నాడు. పాణినికి నచ్చేవి తేలేందుకు చాలాసేపు పట్టింది. “అది నీకు బాగుండదు. ఇది తీసుకో” అంటే వినడు. మొత్తానికి తమ్ములిద్దరికీ మంచివే సెట్టయ్యాయి. ఇద్దరికీ కలిసి నూటపది రూపాయలయ్యాయి.

పక్కనే ‘అంజలి శారీ హౌస్‌’ కనపడింది. అక్కడ అక్కకు చీర జాకెట్టు తీశారు. లేత నీలం రంగు మీద తెల్లని చిన్న చిన్న పువ్వులున్న ఆర్గండీ చీర. నలభైఐదు రూపాయలు చెప్పి ఐదురూపాయలు తగ్గించారు. మ్యాచింగ్‌ జాకెట్‌ గుడ్డ నాలుగు రూపాయలు. ఆ షాపులోనే మహితకు పావడా, ఓణీ, జాకెట్టు ‘సెట్‌’ అమ్ముతున్నారు. కుట్టించుకోవాలి.

“అన్నయ్యా, నాకు రెండు వద్దు. ఇంట్లో వేసుకునేవి ఉన్నాయి. పేరంటాలకు, పండగలకు వేసుకుని వెళ్లడానికి మంచిది ఒకటి తీసుకుంటా” అన్నది మహిత.

“సరేనమ్మా” అన్నాడు అన్నయ్య.

వీళ్ల మాటలు అర్థమయిన సేల్స్‌మన్‌ అన్నాడు. “నిన్ననే స్టాకు వచ్చిందండీ. పట్టు కాదు కానీ, పావడా గుడ్డ పట్టులాగే ఉంటుంది. మంచి బార్డరు, జరీ టైపులో, మ్యాచింగ్‌ జాకెట్లు కూడ చాలా బాగున్నాయి. చూడండి పైట కూడ దాంట్లోనే వస్తుంది” అంటూ ఏడెనిమిది రకాలు చూపించాడు. అన్నీ చాలా బాగున్నాయి.

“ఇవి ఎంత ధరలో ఉన్నాయండి?” అనడిగింది మహిత.

“సెట్‌ డెభై ఐదు రూపాయలకు వస్తుందమ్మా. మీరు సెలెక్టు చేసుకోండి మా షావుకారు తగ్గిస్తాడులెండి” అన్నాడతను.

మహిత సంశయించసాగింది.

“బంగారమ్మా! ఏం పరవాలేదులే తీసుకో” అని ధైర్యం చెప్పాడు అన్నయ్య.

నేరేడు పండు రంగు పావడా. దానికి పచ్చని పసుపురంగు బార్డరు బార్డరంతా చిన్న చిన్న గులాబీ రంగు హంసల జంటలు. పావడా అంతా పువ్వులు లతలు, జాకెట్ట కూడ అదేరంగు, ఏదో డిజైనున్న బార్డరు. పైట క్రీం కలర్‌. అద్భుతంగా ఉంది కాంబినేషను.

“ఇది బాగుంటుంది చూడమ్మా” అన్నాడు పతంజలి.

“నాక్కూడ ఇదే నచ్చిందన్నయ్యా. కానీ ఇంత ఖరీదు…”

“దీన్ని ఇవ్వండి” అన్నాడు అన్నయ్య.

చెల్లెలి ముఖం చేమంతిలా వికసించింది.

షావుకారు ఎనిమిది రూపాయలు తగ్గించాడు. అక్కడనుండి D.C.M షోరూంకు వెళ్లారు. కేవలం మెన్స్‌ షోరూమది. అక్కడ ముందు బావకు పాంటు షర్టు క్లాత్‌ తీసుకున్నారు. బ్లాక్‌ కలరు పాంటు మీద సెల్ఫ్‌డిజైన్‌ ఉన్న ప్యాంటు, దానిమీదకి డార్క్‌ బ్రవున్‌ కలర్‌ మీద చిన్న చిన్న నల్లని గళ్లున్న షర్టు సెలెక్ట్‌ చేశాడు పతంజలి. తనకు కూడ అంత ఖరీదువి కాకుండా రెండు ప్యాంట్లు, రెండు షర్టులు తీశాడు. ప్యాంట్లు డార్క్‌ బ్లూ ఒకటి, డార్క్‌ చాక్‌లెట్‌ కలర్‌ ఒకటి. షర్టులు రెండూ లైట్‌ కలర్‌. ఒకటి బిస్కెట్‌ కలర్‌ మీద వైట్‌ నిలువు చారలు, మరొకటి వైట్‌ మీద గ్రీన్‌ చెక్స్‌, బావది డ్రస్‌ 90 రూ. ఐంది. పతంజలి రెండు డ్రస్‌లూ నూట ఐదు రూపాయలకొచ్చాయి. ఆ షోరూంలో ఫిక్స్ డ్‌ రేట్లట. వాడు పైసా తగ్గించలేదు.

పతంజలి లెక్క చూసుకున్నాడు. ఐదువందలు దాటింది. పర్వాలేదు. తాననుకున్న బడ్జెట్‌లోనే వచ్చినాయని సంతోషపడ్డాడు. షాపింగ్‌ ముగిసినట్టే. అప్పుడు ఒకటిన్నర కావొస్తూంది. “అన్నయ్యా, ఆకలైతూంది” అన్నాడు చిన్నోడు. “నాక్కూడా” అన్నాడు వాడికంటె పెద్దోడు. మహిత వైపు చూసి నవ్వాడు పతంజలి. “పదండి” అంటూ అందర్నీ రాధాకృష్ణ టాకీసు ప్రక్కనుండే ‘న్యూ ఆర్య భవన్‌’కు తీసుకుని పోయాడు.

ఉదయం అన్నం తినేసి వచ్చారు కాబట్టి టిఫిన్‌ తిందామన్నాడు పతంజలి. అందరూ సరే అన్నారు. ‘ఆర్యభవన్‌’ పూరీ చాలా ప్రసిద్ధి కర్నూల్లో. చాలా పెద్దదిగా ఉంటుంది. సింగిల్‌ పూరీనే ఇస్తారు. రెండు తినడం కష్టం.

నలుగురికీ పూరీ ఆర్డరిచ్చాడు. దాన్లోకి యిచ్చిన ‘కుర్మా’ కూడ చాలా బాగుంది. చిన్నోడు తినలేకపోయాడు.

“ఎంతసేపు తిన్నా అయిపోదే” అన్నాడు అన్నయ్యవైపు చూసి.

“తిన్నంత తిను బలవంతంగా తినకు” అన్నాడు పతంజలి.

దాదాపు మూడింట ఒక భాగం మిగిలిపోయింది. వృధా చేయడమెందుకని దాన్ని పతంజలి తినేశాడు.

“చాలా పెద్దది బాబూ” అన్నది మహిత.

“నీవు కాఫీ తాగుతావా అమ్మా” అని అడిగాడు చెల్లెలిని. సరేనంటే తనకూ మహితకూ కాఫీలు తెప్పించాడు. తమ్ముళ్లకు బాదంపాలు.

బిల్లు కట్టేసి బయటకు వచ్చారు. రెండు దాటింది. “ఇప్పుడు మనందరం సినిమాకు బోతున్నాం.” అని ప్రకటించాడు. చిన్నోడు కేరింతలు కొట్టాడు. బట్టలన్నీ రెండు కర్రల బ్యాగుల్లో సర్ది, అన్నా చెల్లెలు చెరొకటి పట్టుకున్నారు.

నడచుకుంటూ ‘విక్టరీ టాకీసు’ చేరుకున్నారు. AVM వారి ‘భక్త ప్రహ్లాద’ ఆడుతూంది. దాంట్లో చాలా రష్‌గా ఉంది. బెంచీటికెట్లు తెచ్చుకునే పరిస్థితి లేదు. బాల్కనీ కాకుండ క్రింద డ్రస్‌ సర్కిల్‌ అని ఉంటుంది. కుర్చీలు ఉంటాయి. నాలుగు టికెట్లు తెచ్చాడు.

లోపలికి వెళ్లి చూస్తే కుర్చీలన్నీ నిండిపోయి ఉన్నాయి. చిన్న బెంచీలు మోసుకొని వస్తున్నారు టాకీసు సిబ్బంది ప్రతి బెంచీని చేత్తో పట్టుకొని ముగ్గురు నలుగురు ప్రేక్షక మహాశయులు నడుస్తున్నారు. దాన్ని దించుతూనే వీళ్లు కూర్చుంటారన్నమాట.

కుర్చీల వరుసల మధ్య వెనుక నించి బెంచీలు వేసుకుంటూ వస్తున్నారు. వేసినవి వేసినట్టు నిండిపోతున్నాయి. పతంజలి ఒకతన్ని రిక్వెస్ట్‌ చేశాడు.

“మేం నల్గురం ఉన్నాం. ఇద్దరు చిన్న పిల్లలున్నారు. మమ్మల్నెక్కడయినా కూర్చోబెట్టవా?” అని.

“ఇక్కడే ఉండండి” అని బయటకు వెళ్లాడతను. ఈలోపు సినిమా స్టార్టయింది. అతనొక బెంచీ తెచ్చి తలుపుకు కొంత యివతలగా వేసి, అందర్నీ కూర్చోబెట్టాడు.

“భక్త ప్రహ్లాద’ వచ్చి అప్పటికి చాలా ఏళ్లయింది. ప్రతి రెండేళ్లకు ఏదో ఒక ధియేటర్లో వేస్తూనే ఉంటారు. అయినా ఆడినన్ని రోజులూ ‘హౌస్‌ఫుల్‌’. “కొన్ని సినిమాలు నిత్యనూతనాలే” అనుకున్నాడు పతంజలి.

మ్యాట్నీ కాబట్టి తలుపులన్నీ వేశారు. ఫ్యాన్‌ లేదక్కడ. దిగు చెమటలు పోస్తున్నాయి. కానీ సినిమా గొప్పతనం వల్ల ఇవేమీ పట్టించుకోకుండా అందరూ సినిమాలో లీనమయ్యారు. ఐదేండ్ల పాప రోజారమణి నటన పరమాద్భుతం. మహానటుడు యస్‌.వి రంగారావు ముందు నిలబడటానికే ఇతర నటులు భయపడేవారట. అలాంటిది అంత చిన్న పిల్ల అంత బాగా చేసిందంటే చిన్న విషయం కాదు. అక్కినేని నాగేశ్వరర్రావు, సుశీల పద్యాలకు, పాటలకు ఆ పాప యిచ్చే లిప్‌ మూవ్‌మెంట్‌ చూడటానికి స్టూడియోకు వచ్చేవాడట.

బాలమురళీ కృష్ణ నారదుని పాత్రను ఎంత రక్తి కట్టించాడో. అంజలీ దేవి సరేసరి. సాక్షాత్తూ లీలావతే అనిపించింది. చండామార్కుల వారిగా ప్రహ్లాదుని గురువుల పాత్రలో రేలంగి పద్మనాభం శిష్యుల చేతుల్లో అగచాట్లు పడుతూంటే బాగా నవ్వుకున్నారు.

కొంచెం సేపున్నా, పాములాడించే వాని పాత్రలో రమణారెడ్డి దేవేంద్రుడుగా ధూళిపాళ చాలా బాగా చేశారు. చివర్లో యస్వీ రంగారావు నటన అద్భుతం. నరసింహుడు స్తంభం నుండి ఉద్భవిస్తూంటే జనం లేచి నిలబడి నమస్కారం చేసుకుంటున్నారు. ధియేటర్‌ సిబ్బంది కొందరు పెద్ద పళ్లెంలో కర్పూరం వెలిగించి తెరమీది నరసింహస్వామికి హారతి పట్టారు. పతంజలి తట్టుకోలేకపోయాడు స్వామిని చూస్తూ అమిత దుఃఖం వచ్చింది భక్తి ఉద్వేగంతో. ఇప్పటికి రెండుసార్లు చూశాడు. ఇది మూడోసారి. చెల్లెలికీ తమ్ముళ్లకూ చూపించాలని, మళ్లీ వచ్చాడు.

అసలు ఇంటర్వెల్‌ వదలలేదు. ఇంతజనం బయటకు వెళ్లి వస్తే బెంచీల దగ్గర గొడవలవుతాయని వదలరు. చివర్లో AVM వారి లోగో తెరనిండా పరచుకుంటుండగా తలుపులు తెరిచారు. జన సముద్రం ఒక్కసారి బయటకు వెల్లువెత్తింది. పతంజలి, మహిత ఒక చేత్తో బ్యాగు, మరొక చేత్తో తమ్మున్ని పట్టుకొని తలుపుదగ్గరే ఒక ప్రక్కన ఉండిపోయారు. జనం తగ్గేవరకు.

“అన్నయ్యా, దప్పికైతుంది” అన్నాడు చిన్నోడు.

“నాక్కూడా” అన్నాడు వానికంటే పెద్దోడు.

దగ్గర్లోనే ‘పఠాన్‌ సోడా’ షాపుకు తీసుకుని పోయాడందర్నీ. ముగ్గురికీ ‘నన్నారి డ్రింక్‌’ తాగించి తాను నిమ్మకాయ సోడా తాగాడు. రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లో మాత్రమే నన్నారి డ్రింక్‌ దొరుకుతుంది. అది ఒక చెట్టు వేరు. సువాసనా భరితంగా ఉంటాది. దాని రసంతో, సోడా కలిపి ఈ డ్రింక్‌ తయారవుతుంది. చాలా రుచిగా ఉంటుంది.

చిన్నోడు గటగటా గ్లాసుడు డ్రింక్‌ తాగేసి “బాగుంది అన్నాడు. ‘బా’ ను దీర్ఘం తీస్తూ.

బస్టాండు దగ్గరే. పెద్ద సినిమా కాబట్టి వదిలే సరికే ఆరు కావచ్చింది. 6 గం॥ అనంతపురం బస్సులో వెల్దుర్తి వాళ్లకు సీట్లు మిగలలేదు. 7 గం॥ ప్యాపిలి వెళ్లే పాల బస్సులో దొరికాయి. ఎక్కి కూర్చున్నారు. కూర్చున్న కాసేపటికే పాణిని అన్నయ్య ఒళ్లో పడుకుని నిద్రపోయాడు.

పావుతక్కువ ఎనిమిదికి వెల్దుర్తిలో దిగి ఇంటికి వెళ్లారు. అమ్మకు నాన్నకూ బట్టలన్నీ చూపించారు. అమ్మకు చీరలు నచ్చాయి. నాన్నకు మఫత్‌లాల్‌ గుడ్డ చాలా బాగుందన్నాడు. అందరికంటే అక్కా బావలకు కొంచెం ఖరీదైనవే తెచ్చానన్నాడు పతంజలి.

“నాక్కూడా” అంది మహిత.

“ఆడపిల్లకు మంచి బట్టలుండాల మరి” అన్నది వర్ధనమ్మ.

మార్కండేయ శర్మ బట్టల గురించి వాళ్లమ్మ ఎప్పుడూ చెప్పే ‘కొటేషన్‌’ చెప్పారు.

“బట్టలకు బెడితివో భ్రష్టయితివో!” అందరూ నవ్వుకున్నారు.

***

మరుసటి రోజు ఉదయం స్పెషల్‌ క్లాసు ముగించుకొని, భోజనం చేసి, తోటకు వెళ్లాడు పతంజలి. వంగతోట పూర్తిగా దున్నేసి, గుంటక తోలమని చెప్పాడు జీతగాళ్లకు. నిమ్మచెట్లున్న భాగం తప్ప, మిగతా పొలమంతా వేరుశనగ పంట వాన కారులో వేద్దామని, మిగతా పొలం కూడ రెండు వైపులా దుక్కిదున్ని పెట్టుకుంటే, ఎండకాలుతుందనీ అనుకున్నారు ఈ రెండు నెలలూ రోజూ రెండు బళ్లు చెరువు మట్టి, పశువుల ఎరువు తోలి పెట్టుకుంటే మంచిదని భావించారు.

మట్టి, ఎరువు తోలడం పైటాల కల్లా ఐపోతుంది. సాయంత్రం వరకు నిమ్మ చెట్ల క్రింద సలికెలతో కలుపుపోయేటట్లు తిరగవేయాలని చెప్పాడు.

గడ్డివామి దగ్గర గుడిసెలో కూర్చుని చదువుకోవడం ప్రారంభిచాడు పతంజలి. గట్టిగా ఆరునెలల కూడ లేవు పరీక్షలు. కనీసం ఆగస్టు చివరికన్నా నోట్సులన్నీ రాసేసుకుంటే ఆ రెండు నెలలూ చదువుకోవచ్చుననుకున్నాడు.

సాయంత్రం నాలుగు గంటలకు బన్సీరవ్వ ఉప్మా, కాఫీ తీసుకొని మార్కండేయశర్మ వచ్చాడు. కొడుకు ఉప్మాతిని, కాఫీ తాగింతర్వాత ఒక గంట, గంటన్నర సంస్కృత పాఠం చెప్పుకున్నారు.

సాయంత్రం ఇద్దరూ ఇల్లు చేరుకొనేసరికి నంద్యాల నుండి వాగ్దేవి, రామ్మూర్తి, పిల్లవాడిని తీసుకొని వచ్చి ఉన్నారు.

“నాన్నా, బాగున్నావా?” అంటూ తండ్రిని అల్లుకుపోయింది వాగ్దేవి. ఆమెకు ఇప్పుడు ఏడో నెల. శశిధర్‌కు సంవత్సరంన్నర.

“నా తల్లీ, ఎంతసేపయిందమ్మా మీరు వచ్చి?” అంటూ కూతుర్ని అక్కున చేర్చుకున్నాడాయన.

“నాయనా, రామ్మూర్తీ, నంద్యాల్లో అంతా బాగానే ఉందికదా!” అని అల్లుడిని పరామర్శించాడు. “అంతా ఓ.కే. మామా. రేపు సెకండ్‌ సాటర్‌డే, ఎల్లుండి ఆదివారం, మిమ్మల్నందర్నీ చూడాలని బయలుదేరినాము” అన్నాడు అల్లుడు. శశిధర్‌ వాళ్లమ్మ నాన్నలను వదిలి ఎవరి వద్దకూ రావడం లేదు. చిన్నచిన్న మాటలు వస్తాయి వాడికి.

“నీ పేరేమిటి నాన్నా” అనడిగితే “చచి” అని చెబుతాడు ముద్దుగా. “నీకే అన్నం ఇష్టం” అంటే “పపుమమ్ము” అంటాడు. అన్నంలో పప్పు నెయ్యి కలిపి పెడితే ఇష్టంగా తింటాడట.

బావ తాను చూసినప్పటికంటే లావైనట్లు గమనించాడు పతంజలి. కొంచెం బొజ్జకూడ ఎక్కువయింది. అక్క మాత్రం మామూలుగా ఉంది. పిల్లవాడితో చేసుకోవడం కష్టమని పనిమనిషిని పెట్టుకున్నారట.

తన చదువు బాగా సాగుతున్నదని చెప్పాడు పతంజలి బావతో. తన నోట్సులు చూపించాడు. ఆయన కొన్ని సూచనలు చేశాడు. తన డిగ్రీ అయిపోయిందనీ, సెకండు క్లాసు వచ్చిందనీ చెప్పాడు బావ. C.A.I.I.B. అనే డిపార్టుమెంటు పరీక్షకు ప్రిపేరవుతున్నానన్నాడు. మరో రెండేళ్లలో ఆఫీసరుగా ప్రమోషన్‌ రావొచ్చుననుకుంటున్నాని చెప్పాడు.

బిడ్డ, అల్లుడు వచ్చినారని వర్ధనమ్మ మునక్కాయలు సాంబారు. అరటిపువ్వు పచ్చడి చేసింది. మనమడికి కొంచెం పప్పు పక్కకు తీసింది. పేలాల వడియాలు వేయించింది.

భోజనాలయినాక అందరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అందరికీ తాను కర్నూలు నుండి తెచ్చిన బట్టలు చూపించాడు పతంజలి. అక్కకూ బావకూ నచ్చాయి. బుజ్జి శశిధర్‌కు మాత్రం మర్చిపోయారు! రెండు మూడు రోజుల్లో నిమ్మకాయలు తీసుకొని కర్నూలుకు పోయినపుడు తెస్తానన్నాడు.

రెండు రోజులు రెండు నిమిషాల్లా గడచిపోయాయి. వాగ్దేవిని పిల్లవాడిని వారం రోజులుంచుకొని పంపిస్తామని చెప్పారు. సోమవారం ఉదయాన్నే రామళ్లకోట, సోమయాజుల పల్లె మీదుగా నంద్యాల వెళ్లే బస్సులో రామ్మూర్తి వెళ్లిపోయాడు. బ్యాంకు టయానికి చేరుకుంటాడు. తండ్రి వెంట తానూ వెళతానని ‘శశి’ ఒకటే ఏడుపు. కాసేపటి తర్వాత మరచిపోయాడు.

రెండు రోజుల్లో అందరికీ చేరికయ్యాడు ‘చచి’. గణపతికి వాడెంతో నచ్చాడు. వాడు కూడ గణపతితో ఆడుకున్నాడు. ఒకరోజు మేనల్లుడిని తోటకు తీసుకెళ్లాడు పతంజలి. వాడికి మామ చెయ్యి పట్టుకుని నడవడమే యిష్టం. మోటారు వేసి, పంపులో నీళ్లు వదిలి, నిక్కరు అంగీ తీసేసి కాలువలో వదిలేస్తే వాడి ఆనందం చెప్పనలవికాదు. నీళ్లల్లో కేరింతలు కొడుతూ ఆడుకున్నాడు. సాయంత్రం ఎద్దుల బండిలో, మామ బండి తోలుతూంటే, వెనక భుజాలు పట్టుకుని నిల్చున్నాడు.

పది రోజుల తర్వాత అక్కను మేనల్లుడినీ నంద్యాలలో విడిచిపెట్టి వచ్చాడు పతంజలి.

మరో వారం పదిరోజుల్లో సమ్మర్‌ స్పెషల్‌ ట్యూషను పూర్తవుతుంది. జూలై వరకు తీరుబాటు దొరుకుతుంది. అప్పుడు నోట్సు రాయటం ఎక్కువ చేయాలి అనుకున్నాడు. ఎండు చేపల ఎరువు వేసి దాదాపు నెల కావస్తూంది. వేసిన తర్వాత ఆరుసార్లు నీళ్లు పెట్టారు. చెట్ల కింద సలికెలతో మట్టి తవ్వి తిరగవేయటం పూర్తికావస్తూంది. ఎరువు ప్రభావం కనబడసాగింది. చెట్లు బాగా తిరుక్కున్నాయి. కొత్తగా వస్తున్న కొమ్మలు నిగనిగలాడుతున్నాయి. బాగా మొగ్గ తొడిగాయి. మరో వారంలో పూతపూస్తాయి. పూత పూసినప్పుడు కమ్మని వాసన తోటంతా వ్యాపిస్తుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here