కర్మయోగి – 1

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి దాసరి శివకుమారి రచించిన ‘కర్మయోగి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]“దే[/dropcap]వసేనా! రండి కూర్చోండి. చాలాసార్లు మిమ్మల్ని పిలిచాను. మీకీ రోజున మా ఇంటికి రావటానికి కుదిరింది.”

“అవునండీ. రోజూ బిజీగా వుంటాం కదా! ఈ రోజు ఆదివారం. పైగా సాయంకాలం. మీరు కూడా ఫ్రీగానే వుంటారనిపించి ఇలా వచ్చాం. మీ పక్క బిల్డింగ్‌లో వుండే మా బంధువొకరికి తుంటి ఆపరేషన్ జరిగింది. వారిని పలకరించి, మీ దగ్గరకూ వచ్చి కాసేపు గడుపుదామని వచ్చాం.”

“చాలా సంతోషం. మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. మన మగవాళ్ళిద్దరూ కబుర్లలో పడిపొయ్యారు. మీరు మా ఇల్లు చూడండి” అంటూ చాముండేశ్వరి ఇల్లంతా తిప్పి చూపించసాగింది.

వంటగదిలోకొచ్చారు. ఆ గది అధునాతంగా వుంది. వంటమనిషి వంట చేస్తున్నది.

“రాజేశ్వరి గారూ! నాలుగు కప్పులు టీ పెట్టండి. కివీ, ఏపిల్స్ కోసి సర్దిపెట్టండి. టీ తాగాలనిపిస్తే మీ కోసం కూడా పెట్టుకోండి. మాకు హాల్లోకే తెచ్చివ్వండి” అంటూ వంటమనిషికి పనులు పురమాయిస్తూ, దేవసేనతో కలిసి హాల్లోకి వచ్చి కూర్చున్నది చాముండేశ్వరి.

వంటమనిషి రాజేశ్వరికి ఏభై ఏళ్ళ వయస్సున్నది. మనిషి పొందిగ్గా, అందంగా వున్నది. నాజూగ్గా, సన్నగా వున్న ఉప్పాడ నేత చీరా, దానికి తగిన జాకెట్టు, పెట్టుకున్న తెల్లని ఒంటిరాతి ముక్కుపుడకా ఆమెకొక హుందాతనాన్ని తెచ్చి పెట్టాయి. ఆమె వంక మరోసారి చూడాలనిపించేట్టుగా వున్నది.

“టీ తీసుకోండి దేవసేనా. రాజేశ్వరి గారు పెట్టిన టీ, ఒక్క చుక్క కూడా వదిలిపెట్టకుండా తాగేస్తాం.”

ఆ మాటలు విన్న రాజేశ్వరి చిరునవ్వు నవ్వుతూ టీ ఇచ్చి వెనుదిరిగింది. అలా వెనుదిరిగి వెళ్ళే రాజేశ్వరినీ, దేవసేననూ మార్చిమార్చి చూసింది చాముండేశ్వరి. ఇద్దరి తలకట్టులూ, చెంపలూ, బాగా నాజుగ్గా, ఒకదానినొకటి పోలినట్టుగా వున్నాయి.

“అరే, దేవసేనా! ఇదెక్కడి విచిత్రం! మా రాజేశ్వరి గారికీ, మీకూ బాగా దగ్గరి పోలికలు కనబడుతున్నాయి. నేనిలా అనకూడదనుకోండి. కానీ మనుషులను పోలిన మనుషులుంటారని అంటారు కదా! ఒక్కసారి తలెత్తి పరీక్షగా మా రాజేశ్వరిగారిని చూడండి. అచ్చంగా మిమ్మల్ని మీరు చూసుకున్నట్లుగా వుంటుంది.” అంటూనే, “రాజేశ్వరి గారూ! ఓసారిలా రండి” అంటూ పిలించింది.

రాజేశ్వరి బిడియంగా వచ్చి నిలబడింది. ఈ మాటలు విన్న మగవాళ్లిద్దరూ కూడా తల్తెత్తి చూశారు. దేవసేన భర్త డా. రాజేష్. అతను రాజేశ్వరి వంకా, దేవసేన వంకా పరీక్షగా చూశాడు.

‘దేవసేనకూ, రాజేశ్వరికీ పోలికలు బాగా కలుస్తున్నాయి. ఆవిడ కూడా దేవసేన అంత వయసులో ఇలాగే వుండి వుంటుంది. ఇలా పోలికలు కలవటానికి వీళ్లిద్దరి మధ్య నున్న సంబంధమేమిటి! చుట్టరికం ఏమైనా వున్నదా?’ అని ఆలోచించసాగాడు.

రాజేశ్వరి సంశయపడుతూనే తలెత్తి ఒకసారి దేవసేన వంక రెప్పవేయకుండా చూసి మౌనంగా లోపలికెళ్లిపోయింది.

“దేవసేన గారూ! మీ పుట్టిల్లు ఏ ఊరో తెలుసుకోవచ్చా?”

“సత్తెనపల్లి చాముండేశ్వరి గారు! అక్కడే పుట్టి పెరిగాను. మేం ఇద్దరం అక్కాచెల్లెళ్ళం. ఇద్దరు అన్నదమ్ములు. ఈ రోజులతో పోలిస్తే మా ఇంట్లో  పిల్లల సంఖ్య ఎక్కువే. నాన్నగారు కాంగ్రెస్ హాయంలో ఒక టరమ్ ఎం.ఎల్.ఎ.గా చేశారు. ఆ తర్వాత మా వ్యాపారాలే చూస్తున్నారు. మళ్ళీ మా పెద్దన్నయ్య రాజకీయాలలోకి దిగాడు. రెండో అన్నయ్య పూర్తిగా వ్యాపారానికే అంకితమై పోయాడు. అక్క యు.ఎస్.లో వున్నది.  మా ఇంట్లో నేనే చిన్నదాన్ని, అయితే, నేను మా చిన్నన్నయ్య కవలపిల్లలం” అంటూ వివరాలు చెప్పుకొచ్చింది.

పోలికల సంగతి వచ్చింది కాబట్టి ఇంత వివరంగా మాట్లాడిందనుకున్నాడు రాజేష్. మరో, అరగంట కూర్చుని ఇంటికి వచ్చేశారు దేవసేన దంపతులు.

చాముండేశ్వరి అన్న మాటల్ని దేవసేన తేలిగ్గానే తీసుకుంది. కానీ రాజేష్ ఏదో ఆలోచనలో పడ్డాడు. అప్పటికి రాజేష్ మెదలకుండా వున్నా ఆ తర్వాత ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ‘ఇంత బాగా పోలికలేంటి? ఇలా కలవటమేంటి?’ అని ఆలోచిస్తూనే వున్నాడు.

అటు రాజేశ్వరిలో కూడా ఉలికిపాటు కలిగింది. ‘దేవసేన నన్ను చూస్తుంటే తన్ను తాను అద్దంలో చూసుకున్నట్లుగా వున్నది. ఆ అమ్మాయి వాళ్ళ ఊరు, మరికొన్ని వివరాలు చెప్పింది. అంటే…’

“రాజేశ్వరి గారూ! వంట పూర్తయినట్లేనా? వెళతారా?” అంటూ చాముండేశ్వరి వచ్చింది.

“వెళతాను” అంటూ రాజేశ్వరి ఇంటికి బయల్దేరింది.

***

“దేవసేనా! నేను చెప్పేది విను. రాజేష్‌కి కుదరదు అంటూ సంక్రాంతికి రాకుండా వుండొద్దు. అక్క ఎలాగూ అమెరికా నుంచి పండక్కు రాలేదు. నువ్వైనా పండగలకు వచ్చి వెళ్తుంటే, మాకు తృప్తిగా వుంటుంది. కాకినాడకూ, సత్తెనపల్లికీ మరీ అంత దూరమేం కాదు. మీ ఇంజనీరింగ్ కాలేజ్‌కు పండుగ మూడు రోజులూ శెలవలిస్తారుగా. రాజేష్ వాళ్ల మెడికల్ కాలేజ్‍కు కనీసం రెండు రోజులైనా శెలవలుంటాయి. పిల్లల కెలాగూ ఓ పది రోజుల పాటు శెలవులేగా. మీ పిల్లలూ, అన్నయ్య పిల్లలూ కలిసి ఆడుకుంటారు. మీరొస్తే మేమెంత సంతోషపడతామో నీకు తెలియదా? నాన్నగారు కూడా మీ కోసం ఎంతో ఎదురుచూస్తారు.” అన్నడి సత్యవతి ఫోన్ చేసి.

“నువ్వెప్పుడూ ఇలాగే అంటావుగా అమ్మా. వదినెలు మాత్రం పండక్కి పుట్టింటి కెళ్ళరా? వాళ్ళ పిల్లలు, మా పిల్లలు కలిసి ఆడుకునేది ఎక్కడ?” అంటూ నవ్వింది దేవసేన.

“మీ పెద్ద వదిన పుట్టింటి కెళ్ళడం అంతంత మాత్రమే. చిన్న వదిన మాత్రం తరచూ వెళుతుంది. నువ్వు బయలుదేరి వస్తావనే నాన్నగారూ, నేనూ అనుకుంటాం. మరోసారి ఫోన్ చేసి నాన్నగారు రాజేష్‌కూ, నీకూ చెప్తారు. వుంటా” అంటూ సత్యవతి ఫోన్ పెట్టేసింది.

***

రోజూ సాయంకాలాలు వచ్చే పనిమనిషి ఈ రోజు రాలేదు. ఆరిన బట్టలు తీసుకొద్దామని, దేవసేన పెరట్లో కెళ్ళింది. తమ పక్కిల్లు మ్యాథ్స్ ప్రొఫెసర్ గారిది. ఆయన భార్య మొక్కలకు నీళ్ళు పెడుతున్నారు. మంచి సందడిగానూ, కలుపుగోరు గాను వుండే మనిషి. దేవసేనను చూడటంతో పని ఆపేసి పెరటి గోడ దగ్గరకొచ్చారు.

“ఈ సంవత్సరం ఇప్పటి నుండే ఎండలు కాసేస్తున్నాయండీ… మొక్కలు ఓ… నీళ్లు తాగేస్తున్నాయి. బాగా ఎండలు పెరగ్గానే ఉప్పులూ, పప్పులూ అన్ని తెప్పించి, ఎండబెట్టి నిల్వ పోసుకోవాలండీ. సంవత్సరానికి సరిపడా చింతపండు కూడా తెప్పించి గింజా అదీ ఏరేస్తామండీ. ఆ తర్వాత, ఎండలో ఎండించి, వుండలు చేసి దాచేస్తామండీ. వడియాలు, ఒరుగులూ, అప్పడాలు… ఓ.. ఒకటేంటి చాలా పెడ్తామండీ. మీరు పెట్టే పిండి వడియాలు కావండీ… మేం వేరేగా పెడ్తాం. వరిపిండిని పల్చగా కలుపుతాం. నీళ్ళు పోసిన కూజా చెంబు లాంటి దానిని పొయ్యి ఎక్కిస్తామండీ. దానికొక మూతేస్తాం. ఆ మూతలో కలిపిన పిండి పోస్తాం. నీళ్ల ఆవిరికి అది గట్టిపడి అప్పడంలా లేచి వస్తదండీ. వాటిని ఎండలో పడేసి, ఎండిస్తామండీ. వాటిని నూనెలో వేపితే, భలే రుచిగా వుంటాయండీ. ఆయ్… మీకూ రుచి చూపిస్తాను, ఓ నెల్లాళ్ళు ఆగండి” అంటూ కబుర్లు మొదలుపెట్టింది.

“రజనీ గారూ! మీరిచ్చిన మామిడి తాండ్ర ఇంకా అలాగే వున్నది. చీటికీ మాటికీ పూతరేకులనీ, సున్ని వుండలనీ ఏవో ఒకటి ఇస్తూనే వుంటారు. నాకైతే సిగ్గేస్తుంది. వద్దంటే ఊరుకోకు గదా” అన్నది దేవసేన.

“ఎంత భాగ్యం లెండి. పిల్లల కోసమని ఇస్తున్నాను. మొక్కల కింకా నీళ్ళు చాలా పట్టాలి వస్తా” అంటూ వెళ్ళింది.

దేవసేన బట్టలు తీస్తూ ఆవిడ గురించే ఆలోచించింది. మ్యాథ్స్ సార్ ఎంత రిజర్వుడో, ఈవిడ అంత సందడి మనిషి. ఇంట్లోనే తీరుబాటుగా వుండి అన్ని రకాల తినుబండారాలు చేసి డబ్బాలకెత్తుతుంది. ఆమెకే రోజైనా పనిమనిషి రాకపోతే వీధి వాకిట్లో నిలబడుతుంది. దారినపోయే పనిమనుషులైవరైనా కనపడితే ‘అమ్మాయ్! బంగారు తల్లీ! నాకీ వేళ పనామె రాలేదు. నేనేమో చేసుకోలేకుండా వున్నాను. నీకెవరైనా తెలిసినవాళ్ళుంటే, నాకీ పూట పని చేయించి పెడతావా తల్లీ!’ అంటుంది. ఆమె అడిగిన విధానానికి వాళ్ళు సంతోషపడతారు. ‘ఎవరో ఎందుకులేమ్మా! నేనే చేసి పెడతాను. నన్ను మాత్రం తొందరగా పంపించాలి. డబ్బులిద్దరుగాని’ అంటూ వాళ్లు లోపలికొచ్చి పని చేసి పెడ్తారు.

ఆవిడకు ఎప్పుడైనా పొరపాటున ఏ అల్లం ముక్కో కావలసి వస్తుంది. ‘దేవసేన గారూ! టమోటా, చిక్కుడుకాయ కలిపి కూర చేద్దామనుకున్నానండీ. కుంపట్లో అల్లం ముక్క చిక్కలేదు. అది లేకుండా కూరొండితే బాగుంటుందంటారా? ఒక్క వెల్లుల్లి మాత్రమే వేస్తే కూరకు రుచొస్తుందంటారా?’ అంటుంది.

‘ఎందుకలా వంటడం? మీకు కావల్సింది అల్లమేగా? మా ఫ్రిజ్‍లో వున్నది. లేదూ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కావాలన్నా మా ఇంట్లో వున్నది. పంపిస్తాను.’ అంటుంది తను. ఆవిడ మాటలు తనకూ వినసొంపుగానే వుంటాయనుకుంటుంది. పెద్ద గొంతుతో గలగలా మాట్లాడుతూ దుమికే జలపాతం లాంటిది రజనీ గారనుకుంటుంది తను.

ఆ రోజు రాత్రి భోజనాలు చేస్తున్నారు. “దేవసేనా! బాగా గుర్తు తెచ్చుకో. మీ బంధువుల్లో అంటే వరుసకు మేనత్తలు కాని, పెద్దమ్మలు కానీ, నీ పోలికల్తో వున్నారేమో! నీకు తెలియకపోవచ్చుగా” అన్నాడు రాజేష్.

“ఎవరూ లేరు రాజేష్. ఉన్నవాళ్ళను ఏదో సందర్భంలో నేను చూశాను. నాకో పెద్దమ్మ వున్నది. వాళ్లు గుడివాడలో వుంటారు. మా మేనత్తా వాళ్ళు గుంటూరులోనే వుంటారు. వాళ్ళంతా నీకు తెలిసినవాళ్ళే. నువ్వింకా ఆ రాజేశ్వరి గురించే ఆలోచిస్తున్నట్లున్నావు.”

“అవును. నాకావిడ మాటిమాటికీ గుర్తుకొస్తున్నది. చూసింది కొద్ది సేపే అయినా మీ ఇద్దరికీ పోలికలుండడం వల్ల కావచ్చు.”

“మనిషిని పోలిన మనిషి. అంతే. అమ్మ సంక్రాంతికి రమ్మని పిలిచింది. నాన్న కూడా నీకు ఫోన్ చేసి చెప్పచ్చు.”

“కాలేజ్ డిపార్ట్‌మెంట్‌లో నాకు పనుంటుంది. పిల్లల్ని తీసుకుని ముందు నువ్వెళ్ళు. మా నాన్నగారు కూడా నాకు ఫోన్ చేశారు. పిల్లల్నీ, కోడల్ని తీసుకుని పండక్కి రా అని గట్టిగా చెప్పారు. ముందు నువ్వు పిల్లల్తో సత్తెనపల్లి వెళ్ళు. పండుగ రోజుకు నేను వచ్చి నిన్ను కోదాడ మనింటికి తీసుకెడతాను. వాళ్ళ కోరికా తీరుతుంది.”

“అలాగే చేద్దాం రాజేష్” అంటుండగానే వీళ్ల దగ్గరకు కిరణ్ వచ్చాడు.

“నా హోమ్ వర్క్ అయిపోయింది మమ్మీ. ఇందాక ఊరు వెళ్దాం అంటున్నారుగా డాడీ. మన మెప్పుడు వెళ్దాం? ఏ ఊరికి? సత్తెనపల్లికేనా? కోదాడ కూడానా?” అన్నాడు.

“రెండు ఊళ్ళకూను రా కిరణ్. నేను విన్నాను” అన్నది ప్రణవి.

“మీరు వ్రాస్తున్నారు, చదువుతున్నారు. మా మాటలన్నీ ఎక్కడ విన్నారు?”

“మాకు వినబడ్డాయి కూడా” అన్నారు ఇద్దరు కోరస్‍గా.

“మీరే పని చేస్తున్నా, ఓ చెవి మా మాటల మీదే వేస్తారు. మా మాటలన్నీ భలే వినబడతాయి మీకు. మేము దేనికైనా పిలిస్తే మాత్రం వినబడదు. ఇద్దరి కిద్దరూ తోడుదొంగలు” అన్నది దేవసేన.

“ఏం కాదు. మీరు పిలవగానే ‘ఏంటి మమ్మీ? ఏంటి డాడీ?’ అని అడగడం లేదా ఏంటీ? కోదాడ తాతగారైతే గాలిపటాలు తెప్పించి ఇస్తారు. అక్కడ పలుగులూ, పారలు అన్నీ వుంటాయి. వాటిలో నేలను బాగా తవ్వుకోవచ్చు. అయినా నేను వెళ్ళేటప్పటికి ఆ తాతగారు పలుగూ, పారా అన్నీ దాచేస్తారు. ఏమీ లేవు అని చెప్తారు. పోయినసారి ఎలాగో తీసుకొని కొబ్బరికాయల్ని నేలలో పెట్టి వచ్చాను. నాయనమ్మను నీళ్లు పొయ్యమని చెప్పాను. అది మొక్క మొలిచిందో లేదో తెలియదు.”

“అంతేకాదురా కిరణ్, నన్నయితే పొయ్యి దగ్గర మంట పెట్టనివ్వరు. అగ్గిపెట్టె దాచేస్తారు. కర్పూరం, కడ్డీలు అన్నీ దాచేస్తారు. మీరు చిన్నపిల్లలు, ఇవన్నీ వెలిగించకూడదంటారు. చేతులు కాల్చుకుంటారని చెప్తారు. పోయిన సారి నేను ప్రమిదెలో నూనె పోసి దూది వేసి వెలిగించాను. అంతా ఒక్కసారి మండింది. నాయనమ్మ గోల పెట్టింది. మేం జాగ్రత్తగానే వుంటాం. మేం పెద్దవాళ్ళమయ్యాం అని చెప్పినా వినిపించుకోదు” అన్నది ఆరిందాలా ప్రణవి.

“అవును మరి. నిప్పుతో ఆడకూడదు. మీ పిల్లల్ని మీరు సరిగా పెంచడం లేదని, భయం నేర్పటంలేదని అందరూ నన్నంటున్నారు. పలుగూ పారలూ తీసుకుని నేలలు గుంటలు పెట్టం, నిప్పుతో ఆడం, మంటలు వెయ్యం అని చెప్తేనే కోదాడ వెళ్దాం. లేకుంటే లేదు.” అన్నది దేవసేన.

“శెలవుల్లో కూడా ఆడుకోకుండా ఎట్లా వుంటాం? ఆడుకోమనేగా శెలవులిచ్చేది” అన్నది ప్రణవి.

“ఆ. మరే. తోకలు తగిలించుకుని ఎగురుదురు గాని. అక్కడ అమ్మమ్మ వాళ్ళింట్లోనూ అంతే. ఎక్కువ అల్లరి చెయ్యొద్దు. అక్కడ అత్తా వాళ్ళు  నవ్వుతారు. ప్రణవినీ, కిరణ్‍నూ చూసి మా పిల్లలు కూడా అల్లరి నేర్చుకుంటున్నారంటారు. అమ్మమ్మను అదీ ఇదీ కావాలని విసిగించద్దు. అన్నీ పన్లూ చేయడానికి ఇంట్లో పని వాళ్లుంటారు. కానీ అమ్మమ్మే మీ పన్లన్నీ చేయటానికి ముందుకొస్తది. తనని ఎక్కువ విసిగిస్తే పాపం అలసిపోతుందమ్మా” అన్నది దేవసేన.

“మేమేం అడగం మమ్మీ. ‘కాజూ బర్ఫీ కావాలా? డ్రై ఫ్రూట్స్ లడ్డూ కావాలా? ఏం తింటారు? మీకేం కావాలంటే అది చేస్తాను.’ అంటూ చేసి తీసుకొచ్చి మాటిమాటికీ మా వెంటబడుతుంది. తాతగారైతే తనెక్కడికి వెళ్ళినా మమ్మల్నీ తనతో పాటు కార్లో కూర్చోపెట్టుకుని తీసుకెళతారు. మావయ్యలు కూడా బిస్కట్లూ, చాక్లెట్లూ బాగా తెస్తారు. మాకు హాలిడేస్ ఇవ్వగానే సత్తెనపల్లి పోదాం మమ్మీ. నువ్వూ రా డాడీ” అన్నారు గారాలు పోతూ.

“మాకు కాలేజ్ హాస్పిటల్ వుంటుందిగా. అక్కడి కొచ్చే పేషంట్లకి వైద్యం చెయ్యాలి. పండుగ రోజుకొస్తాను. మమ్మీ చెప్పినవన్నీ గుర్తు పెట్టుకోండి. నిజంగా చాలా బుద్ధిగా వుండాలి. గుడ్ అనిపించుకోవాలి. సరేనా? ఆ టీ.వీ. తీసేసి వెళ్ళి పడుకోండి” అంటూ పిల్లలకు నచ్చచెప్పాడు రాజేష్.

***

“తాతగారూ! ఇది పతంగుల పండుగ కూడా అంట కదా! మా స్కూల్లో నా ఫ్రెండ్ చెప్పాడు. తనకి, శెలవులివ్వగానే వాళ్ళ తాతాగారి ఊరు వెళ్ళి పతంగులను ఎగురవేస్తానని చెప్తున్నాడు. నాకూ కావాలి. తెప్పించరా?” అంటూ గారాలు పోయాడు శశాంక్.

వాడి మాటలు ముద్దొచ్చాయి రామారావుకు. “అలాగే లే, ఇలారా” అంటూ వాణ్ణి పిలిచి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు. ఏదో డ్రాయింగ్ వేస్తూ పక్కనే వాడి చెల్లెలు శైలజ కూర్చుని వున్నది.

“తాతగారూ! నాకింకా రంగురంగుల స్కెచ్‍ పెన్నులూ, క్రేయాన్లూ కావాలి. అవీ తెప్పించండి” అంటూ ఆర్డరేసింది.

“అలాగే తల్లీ. తప్పకుండా తెప్పిస్తాను. రామ్, కృష్ణ ఏరి? ఏం చేస్తున్నారు?”

“వాళ్ళు ఎర్లీగా పడుకున్నట్లున్నారు తాతగారూ” అన్నాడు శశాంక్.

ఇంతలో హాల్లోకి శశిరేఖ వచ్చింది.

“ఏయ్ శశాంక్, ఏంటి తాతగారి ఒడి ఎక్కి కూర్చున్నావు? దిగి సోఫాలో కూర్చో” అన్నది.

“తాతగారే పిలిచి కూర్చోబెట్టుకున్నారు. కావాలంటే అడుగు మమ్మీ” అన్నాడు శశాంక్ బుంగమూతి పెట్టి.

“ఉండనీ అమ్మా. నేనే కూర్చోబెట్టుకున్నాను. జగత్ ఇంకా రాలేదా?”

“రాలేదు మామయ్యా. మీ అబ్బాయి వచ్చేసరికి బాగా పొద్దుపోతోంది. అత్తయ్యా, మీరూ భోంచేయండి.”

“కాదు లేమ్మా, వాడిని కూడా రానివ్వు” అనేలోగా సత్యవతి కూడా తన స్నానం ముగించి జడ అల్లుకుంటూ హాల్లోకి వచ్చింది.

కింద నుంచి కారు శబ్దం వినబడింది. “సత్యం వచ్చినట్లున్నాడు” అన్నాడు రామారావు.

“అవును పెద్దబ్బాయి కివాళ లేటయింది. ఈ మధ్య తరచూ జగత్ వచ్చేటప్పటికి లేటవుతోంది. బాగా రాజకీయాలలో తిరుగుతున్నాడు. వ్యాపారం మొత్తం మీరూ, సత్యమే చూసుకుంటున్నారు. తన కోసం భోజనానికి కాచుకుని వుంటామని ఆ మాత్రం టైం కన్నా ఇంటికొస్తున్నాడు. లేకపొతే ఇంకా ఆలస్యం చేసేను” అన్నది సత్యవతి. అంటూనే, తను కూడా అక్కడున్న కుర్చీలో కూర్చున్నది. మరలా తనే మాటలు మొదలుపెట్టింది.

“సంక్రాంతికి రమ్మని దేవసేనకు గట్టిగా చెప్పాను. రాజేష్ కొకసారి ఫోన్ చేసి మీరూ పిలవండి. పెద్దమ్మాయి, అల్లుడూ, వాళ్ళ పిల్లలూ ఏ పండక్కూ వుండరు. ఎప్పుడో ఏడాదికో, రెండేళ్ళకొకసారి గాని అమెరికా నుంచి రారు. పండక్కూ, పబ్బానికి ఏ పిండి వంటలు చేసుకుని తింటున్నా వాళ్ళే గుర్తుకొస్తారు. వాళ్లకి ఏ అచ్చటా ముచ్చటా జరపలేకపోతున్నాం. కరువుతీరా కళ్ళ ముందు వుంచుకోలేకపోతున్నాం.” అన్నది సత్యవతి బాధగా.

“పోనే మనమే వెళ్ళి కొన్నాళ్ళు వాళ్ళ దగ్గర వుండి వద్దామా?” అన్నాడు రామారావు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here