సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-10

0
3
మైన్ నదియా ఫిర్ భీ మైన్ ప్యాసీ

[dropcap]మై[/dropcap] నదియా ఫిర్ భీ మై ప్యాసీ,

భేద్ యె గహెరా, బాత్ జరాసీ

లతా మంగేష్కర్‍కు శైలేంద్ర గేయాలంటే చాలా ఇష్టం. అలతి అలతి పదాలతో అత్యంత లోతైన భావాలను పొదుగుతాడు. అతి సంక్షిష్టమైన తత్త్వన్ని అత్యంత సరళంగా తన గేయాలలో ప్రదర్శిస్తాడు. ‘మధుమతి’ సినిమాలో శైలేంద్ర రచించగా, లతా మంగేష్కర్ అభిమానించే సంగీత దర్శకుడు,  సలిల్ చౌదరీ, సృజించిన అత్యద్భుతమైన గీతం ‘ఆజారే…. మైతో కబ్‍సే ఖడీ ఇస్ పార్” పాటలో  చరణంలోని పంక్తులివి. అత్యంత భావాత్మకమైనవి. అందరి దాహం  తీర్చే నది దాహం తీర్చేదెవరు? అందుకే నేను నదిని అయి కూడా దాహంతో అల్లల్లాడుతున్నాను. ఈ రహస్యం చాలా లోతైనది. నిజానికి కారణం చాలా చిన్నది. ఈ రెండు పాదాల భావం గురించి ఎంతో రాయవచ్చు. అందరి దాహం తీర్చే నది ఎందుకని దాహంతో ఉంది?

లతా మంగేష్కర్ జీవితం చూస్తే ఈ రెండు పంక్తులు గుర్తుకు వస్తాయి. లతా పాటల వల్ల ఎంతోమందికి సాంత్వన లభిస్తుంది. స్పూర్తి లభిస్తుంది. సంతోషం కలుగుతుంది. జీవితం పట్ల అవగాహన కలుగుతుంది. మార్గదర్శనం లభిస్తుంది. కానీ లతా మంగేష్కర్ మాటలు ఆమె ప్రవర్తనలను గమనిస్తే, లతా మంగేష్కర్‍కు తాను పాడుతున్న నేపథ్యగీతాల పట్ల ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా తనకు శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం అని అనటం, శాస్త్రీయ సంగీత గాయకురాలిని అయి ఉంటే బాగుండేదని అనటం లత మనస్సులో సినీ నేపథ్యగాయని అవటం వల్ల అసంతృప్తి ఉన్నదని స్పష్టం చేస్తుంది.

“నేను శాస్త్రీయ సంగీత గాయనిని అయి ఉంటే ఇంతపేరు వచ్చేది కాదు. వీధి వీధినా నా పాటలు మార్ర్మోగేవి కావు. నాకు ఇంత డబ్బు, గుర్తింపు, సన్మానాలు ఇవేవీ వచ్చేవి కావు. కానీ నాకు ఆత్మ సంతృప్తి కలిగేది. సమాజంలో అత్యంత గౌరవం లభించేది” అని యతీంద్ర మిశ్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది లతా మంగేష్కర్.

కానీ జీవితం కోసం, కుటుంబాన్ని నడపటం కోసం నేపథ్యగానం తప్ప మరో మార్గం లేకపోవటంతో లత గాయనిగా ఎదిగింది. “జీవితంలో ఏ పని చేసినా చిత్తశుద్దితో సంపూర్ణ సమర్పణతో చేయాలన్నది మా నాన్న మాకు చిన్నప్పుడే నేర్పించారు” అంది లత ఓ ఇంటర్వ్యూలో. అంతేకాదు “నాన్నకు సంగీతం తప్ప మరేమీ పట్టి ఉండేది కాదు. ఇంట్లో ఉంటే ఆయన నిరంతరం సాధన చేస్తూండేవారు. ఎప్పుడూ సంగీతం గురించి ఆలోచించేవారు. స్నేహితులు వస్తే కూడా సంగీతం గురించే చర్చించేవారు. నూటికి నూరుపాళ్ళు సమర్పణ అన్నది ఆయనను చూసి నేర్చుకున్నాను” అంటుంది లత.

తండ్రి దీననాథ్ మంగేష్కర్ నుంచి నేర్చుకున్న ఈ సంపూర్ణ సమర్పణ భావం లతను అగ్రశేణి గాయనిగా నిలపటంలో కీలకమైన పాత్రను పోషించింది. ఎందుకంటే, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా మైకుముందు నిలబడితే సర్వం మెదడు లోలోతు పొరల్లోకి దిగజారేవి. ఈ విషయాన్ని  స్పష్టం చేసేందుకు లత ఓ సంఘటన  చెప్పింది.

ఓ రోజు లత రికార్డింగుకు వెళ్ళటానికి సిద్ధమవుతోంది. ఆ సమయంలో ఇన్‍కమ్ టాక్స్ వాళ్ళు ఆమె ఇంటికి వచ్చారు. టాక్స్ కట్టనందుకు ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు కార్లు కూడా తీసుకువెళ్తామన్నారు. లతకు రికార్డింగ్‍కు వెళ్ళాల్సిన సమయం అవుతోంది. అప్పుడు ఆమె వారితో  “ఒక కారు ఇవ్వండి. దానిలో రికార్డింగ్‍ స్టూడియోకు వెళ్తాను. తరువాత కారు మీరు తీసేసుకోండి” అంది. వారు ఒప్పుకోవటంతో సమయానికి స్టూడియోకు చేరుకుంది. కారును పంపించేసింది. ఒక్కసారి ఆమె మైకు ముందు నుంచోగానే ఆమె సర్వం మరచిపోయింది. పాట తప్ప మరొకటి గుర్తులేదు. రికార్డింగ్ పూర్తి అయిన తరువాత లత టాక్స్ ఇబ్బంది తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నిజాయితీ, ఈ నిబద్దత, ఈ అంకిత భావం లత తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నుంచి నేర్చుకుంది.

1942 నుండి 1947 వరకూ రోజూ ఉదయం సంగీత సాధన చేసేది. తండ్రి నేర్పినది, గురువులు నేర్పినది తప్పనిసరిగా సాధన చేసింది. 1947 తరువాత రికార్డింగ్‍ల బిజీలో ఆమెకు శాస్త్రీయ సంగీత సాధనకు సమయం ఉండేది కాదు. ఇది ఆమెను జీవితాంతం బాధించింది. సినిమాలలో శాస్త్రీయ సంగీత ఆధారిత పాటలను అధికంగా సృజించే సంగీత దర్శకులను అత్యంత గౌరవించింది. ఆయా పాటలను ఎంతో ప్రీతితో పాడింది. కానీ శాస్త్రీయ సంగీత సాధన చేయని లోటు ఆమెని వదలలేదు.

“మీరు శాస్త్రీయ సంగీతంలో సాధన చేయటం లేదని, స్టేజిమీద శాస్త్రీయ సంగీత కచేరీలు ఇవ్వలేదన్న లోపం ఉన్నా, సినిమాలలో శాస్త్రీయ సంగీత ఆధారిత గీతాలు పాడేరు. శాస్త్రీయ సంగీత విద్వాంసులు సైతం మీ గానాన్ని ప్రశంసించారు. ఇది సరిపోదా?” అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం లత హృదయలోతుల్లోని శాస్త్రీయ సంగీత దాహార్తిని తెలుపుతుంది. ‘మై నదియా ఫిర్ భీ మై ప్యాసీ’కి అర్థం స్పష్టం చేస్తుంది.

“శాస్త్రీయ సంగీత విద్వాంసులు నా గానాన్ని ప్రశంసించారన్నది నిజం. వారందరికీ నేను కృతజ్ఞురాలిని. కానీ ఏ రకంగా స్థిరంగా కూర్చుని పద్ధతి ప్రకారం రాగాలు తీస్తూ శాస్త్రీయ సంగీతం పాడాలో అలా నేను పాడలేదు. ఇందుకు నాకు దుఃఖం కలుగుతూంటుంది. నా జీవితం సంగీతం. సంగీతం తప్ప నా జీవితంలో మరేమీలేదు. నేనేం చేసినా సంగీతం తప్ప మరొకటి చేయలేను. నాకు శాస్త్రీయ సంగీత క్షేత్రంలో ప్రవేశించాలని ఉంది. కానీ నేను సినిమా రంగంలో ప్రవేశించాను. నేను సినిమా రంగంలో సంపాదించినంత పేరు ప్రఖ్యాతులు శాస్త్రీయ సంగీతరంగంలో సంపాదించవచ్చు,  సంపాదించక పోవచ్చు. కానీ నా జీవితం సినీరంగంతోనే ముడిపడి ఉంది. నేను ఈ నిజాన్ని స్వీకరించాను. ఇప్పుడు ఇదే నా జీవితం. దీనితోనే సంతృప్తి చెందాలి. ఈ నిజాన్ని గ్రహించిన తరువాత శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిని కాలేదన్న బాధ నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయింది (సుర్-గాథా by యతీంద్ర మిశ్ర Page 245). తాను నేపథ్య గాయనిగా స్థిరపడటం తప్ప మరో మార్గం లేదని గ్రహించిన తరువాత నేపథ్య గానంలో మెళకువలు నేర్వటంపై దృష్టి పెట్టింది.

లత, నూర్జహన్

ప్రథమంగా, ఆ కాలంలో పేరు సంపాదించిన గాయనిలు నూర్జహాన్, శంషాద్ బేగమ్, జోహ్రాబాయి అంబాలే వాలి వంటి వారు పాట పాడే విధానాన్ని గమనించింది. తనతో పాటు సినీరంగం ప్రవేశం చేసిన గీతాదత్ గాన సంవిధానాన్ని పరిశీలించింది. నూర్జహాన్ పాటలు గంటల తరబడి వినేది. ఆమె పాటలు పాడే విధానాన్ని, పదాల ఉచ్చారణను, భావాలను పలికించటాన్ని ఆకళింపు చేసుకుంది. విషాద గీతం ఎలా పాడాలి, రొమాంటిక్ పాటను ఎలా పాడాలి, చిలిపి పాటలలో పదాలను ఎలా పలకాలి వంటివి తెలుసుకుంది. ముఖ్యంగా భావప్రకటన నూర్జహాన్ నుంచి నేర్చుకున్నానని పలు ఇంటర్వ్యూలలో చెప్పింది లత. హాస్య గీతం అంటే వెకిలిగా పాడవనసరం లేదని, విషాదగీతం అంటే గాయనీ గాయకులు పాట పాడుతూ వెక్కిళ్ళు పెట్టనవసరం లేదని ఆ విషాదాన్ని స్వరంలో ప్రతిఫలించాలని అర్థం చేసుకుంది. అంటే పాట పాడుతూ గాయని ఎలాంటి వెర్రి, వెకిలి వేషాలు వేయనవసరం లేదు. ఏడవనవసరం లేదు. కానీ ఆ భావాన్ని స్వరంలో ఎంతగా పలికించాలంటే వింటున్న శ్రోతకు అది హాస్యగీతమో, విషాద గీతమో, రొమాంటిక్ పాటనో భాష తెలియకున్నా కేవలం స్వరం పలుకుతున్న భావాల ద్వారా అర్థం అయిపోవాలి.  అంటే, తానే పాటయి పోవాలి. పాటలో భావమైపోవాలి.

కుందన్‍లాల్ సహెగల్ పాట విని నూర్జహాన్ గాన సంవిధానానికి సంపూర్ణంగా భిన్నమైన పాట పాడే పద్ధతిని నేర్చుకుంది లతా మంగేష్కర్. ముఖ్యంగా సెహగల్ పాట ‘దుఖ్ కే అబ్ దిన్ బీతత్ నాహి’ (దేవదాసు) పాటను విని దుఃఖం  ధ్వనింపచేయటం నేర్చుకున్నానంటుంది లతా మంగేష్కర్. నాయకుడు విషాదంలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. ఆ ఎమోషన్‍ను, ఆ భావాన్ని సెహగల్ తన గొంతులో ఎలా ప్రతిధ్వనింప చేశాడన్నది ఈనాటికీ తనకు ఆశ్చర్యమేనంటుంది లత.

కుందన్‍లాల్ సహెగల్ పాట విని నూర్జహాన్ గాన సంవిధానానికి సంపూర్ణంగా భిన్నమైన పాట పాడే పద్ధతిని నేర్చుకుంది లతా మంగేష్కర్. ముఖ్యంగా సెహగల్ పాట ‘దుఖ్ కే అబ్ దిన్ బీతత్ నాహి’ (దేవదాసు) పాటను విని దుఃఖం ధ్వనింపచేయటం నేర్చుకున్నానంటుంది లతా మంగేష్కర్. నాయకుడు విషాదంలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. ఆ ఎమోషన్‍ను, ఆ భావాన్ని సెహగల్ తన గొంతులో ఎలా ప్రతిధ్వనింప చేశాడన్నది ఈనాటికీ తనకు ఆశ్చర్యమేనంటుంది లత. ఎందుకంటే పాట పాడుతూ ఏడవలేడు. ఏడిస్తే పాట పాడలేడు. కాబట్టి పాట పాడూతూ ఏడుస్తున్న భావనను సెహగల్ ఎలా కలిగించగలిగాడోనన్నది అంతుపట్టని విషయం అంటూ అలాంటి ‘పర్‍ఫెక్షన్’ కోసం ప్రయత్నిస్తుందని పలు సందర్భాలలో చెప్పింది లత.

తన గాన సంవిధానాన్ని తిరుగులేని రీతిలో ప్రభావితం చేసింది ఈ ఇద్దరు కళాకారులని లత స్పష్టం చేసింది. ఇతర సమకాలీన గాయనిలపై లత ఆధిక్యం సంపాదించటంలో, ఆమె ఇలా విని నేర్చుకోవటం ప్రధాన పాత్ర వహించిందన్నది ప్రముఖ గాయకుడు మన్నా డే అభిప్రాయం.

“when latha emerged as a force to reckon with, the other popular voices of the time like zohrabai Ambalewali, and shamshad begum began to appear unpolished. They lacked Latha’s sophistication. latha has a very rare talent. I would not say she has been taught music. woh sun sun ke bani hai. She learnt from noorjehan. She even learnt by listening to Geeta Dutt. But latha polished all the weaknesses in geetha’s voice”.

అయితే ఎంతగా విని నేర్చుకున్నా, నిజంగా రికార్డింగ్ స్టూడియోలో మైకు ముందు నిలుచుని, ఆర్కెస్ట్రాతో కలిసి పాడటం భిన్నమైన ప్రక్రియ. ఇక్కడ లతా మంగేష్కర్ లోని లోపాలను సవరించి, మార్గదర్శనం చేసిన వాడు గులామ్ హైదర్. “గులామ్ హైదర్ నాకు గాడ్ ఫాదర్ లాంటివాడు” అంటుంది లత సందర్భం దొరికినప్పుడల్లా.

శాస్త్రీయ సంగీత గానానికి, సినిమా పాటలు పాడాటానికి నడుమ గల తేడాను లతకు వివరించినవాడు గులామ్ హైదర్. మైకు ముందు నిలుచుని పాడేటప్పుడు తిన్నగా మైకులోకి పాడకుండా కాస్త పక్కనుంచి పాడాలని, మరీ మైకుకు దగ్గరగా కాకుండా, మరీ దూరం కాకుండా స్వరం సరిగ్గా వినిపించేంత దూరంలో నిలుచుని పాడాలని నేర్పించింది గులామ్ హైదర్. ‘ప, స, భ’ వంటి అక్షరాలను జాగ్రత్తగా పలకాలనీ, మరీ దగ్గరనుంచి పలకకూడదని ‘మైక్ కల్చర్’ను లతకు నేర్పించినవాడు గులామ్ హైదర్.

గులామ్ హైదర్ ఎప్పుడూ లతను పాట పాడేటప్పుడు మూడు విషయాలపై దృష్టి పెట్టమనేవాడు. ముందుగా పదాలు స్పష్టంగా ఉచ్చరించాలి. ఏదైనా పదం ఉచ్చారణ విషయంలో సందేహం ఉంటే, గేయ రచయితలను అడిగి సరైన ఉచ్చారణ తెలుసుకోవాలి. హిందీ సినిమా పాటలలో హిందీ, ఉర్దూ పదాలు కలసి ఉంటాయి. కాబట్టి హిందీ పదాలను, ఉర్దూ పదాలను వేర్వేరుగా, స్పష్టంగా ఉచ్చరించాలి. పాటలో ‘బీట్’ వచ్చినప్పుడు వచ్చే పదాలని మైకుకు ఒక పక్కగా కోమలంగా పాడాలి. ఇందువల్ల ఆ పదం మరింత కోమలంగా వినిపిస్తుంది. పాట మాధుర్యం పెరుగుతుంది. ఇలా పాట మాధుర్యాన్ని ఇనుమడింపజేయటం గాయకుడి పని. పాట పాడే సమయంలో గాయకుడు ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ఆర్కెస్ట్రాతో రిహార్సల్స్ చేసే సమయంలో బీట్‍నూ, వాయిద్యాల నడకను గమనించి, పాటలో ఎక్కడ ఏ పదాలను ఒత్తి పలకాలి, ఏ పదాలను తేలికగా పలకాలి, ఎక్కడ పదాన్ని విరవాలి వంటివి గులామ్ హైదర్ తనకు నేర్పించాడని లత పలుమార్లు చెప్పింది.

గులామ్ హైదర్ నేర్పించిన మరో మహత్తరమైన విషయం, శాస్త్రీయ సంగీతం పాడటానికి, సినిమాల్లో శాస్త్రీయ సంగీత ఆధారిత పాటలు పాడటానికీ ఉన్న ప్రధానమైన తేడా. లత శాస్త్రీయ సంగీత సాధన చేస్తుండేది. ఆమె ప్రమేయం లేకుండా, దీర్ఘంగా రాగాలు తీయటం, శృతి చూసుకునేందుకు సమయం పట్టటం సంభవించేది. అప్పుడు గులామ్ హైదర్ ఆమెకు ఈ రెండు గాన ప్రక్రియలలో తేడాను వివరించాడు.

శాస్త్రీయ సంగీత గాయకుడికి సమయం ప్రతిబంధకం కాదు. అతడికి శృతి చూసుకునేందుకు సమయం ఉంటుంది. రాగాలు తీయవచ్చు. స్వర ప్రస్తారాలు వేయవచ్చు. అతని గానం వినేందుకు వచ్చిన శ్రోతలు కూడా అందుకు సిద్ధమై వస్తారు. వారూ సంగీతంతో పరిచయం ఉన్నవారో, అభిరుచి కలవారో అయి ఉంటారు. పైగా, శాస్త్రీయ సంగీత కళాకారుడు ఎవరినో మెప్పించటం కోసం పాడడు. తన ఆత్మానందం కోసం పాడతాడు. అది శ్రోతల హృదయాలను స్పందింపచేస్తుంది. కానీ సినిమా పాట ఇందుకు పూర్తిగా భిన్నమైనది.

సినిమా పాట వినేవారిలో అధిక సంఖ్యాకులకు సంగీతం తెలియదు. వారికి రాగాలు, తాళాలు తెలియవు. సినిమా పాట పాడటంలో కళాకారుడికి బోలెడన్ని పరిమితులుంటాయి. సినిమా పాట నిడివి మూడున్నర నిమిషాలు. ఈ మూడున్నర నిమిషాలలో కళాకారుడు, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు మూడు గంటల గానం ద్వారా కలిగించిన ప్రభావాన్ని కలిగించాలి. అంతేకాదు, శాస్త్రీయ విద్వాంసుడు తన కోసం పాడుకుంటాడు. సినీగాయకుడు సినిమాలో సందర్భాన్ని, సందర్భంలోని భావనను, ఆ భావనను తెరపై ప్రదర్శించే కళాకారుడిని దృష్టిలో ఉంచుకుని పాడాలి. అంటే, తాను వేరేవారిలా భావించుకుని, వీలైతే వేరేవారయి పోయి, ఆ వేరే వ్యక్తి భావనలను తాను అనుభవిస్తూ తన స్వరంలో పలికించాలి. అత్యంత క్లిష్టమైన ప్రక్రియ ఇది. పైగా, శాస్త్రీయ సంగీత విద్వాంసుడిలా శృతి చూసుకునేందుకు, రాగాలు తీసేందుకు సినీ గాయకుడికి సమయం ఉండదు. మొదటి పదం నుంచి చివరి పదం వరకూ గాయకుడు పాట మూడ్‍లో ఉండాలి. మొదటి పదం నుంచే భావాల్ని పలికించటం ఆరంభించాలి. ఇప్పటి భాషలో చెప్పాలంటే శాస్త్రీయ సంగీతం పాడటం అయిదురోజుల క్రికెట్ మ్యాచ్ లాంటిదయితే, సినిమా పాట పాడటం 20‌-20 క్రికెట్ పోటీ లాంటిది. మొదటి బంతి నుంచి చివరి బంతి వరకూ బాదుతూనే ఉండాలి. ఒక్క బంతి వ్యర్థమైనా అంతా వ్యర్థం. ఇది అర్థమైన తరువాత లతా మంగేష్కర్ వెనుతిరిగి చూడలేదు. అంతేకాదు, సినిమా పాటలలోనే శాస్త్రీయ సంగీతాన్ని వెతుక్కుని సంతృప్తి పడే వీలు చిక్కింది. రోజూ సాధన చేయటం లేదన్న బాధ తీరింది.

“రోజూ ఉదయం లేచి సాధన చేయటం ఆపినా, సినిమా పాటలు పాడటం ఒక రకమైన సాధన అని అర్థమయింది. రోజంతా వేర్వేరు కళాకారులు సృజించిన వేర్వేరు రాగాలు, వేర్వేరు భావాలు పలుకుతూ పాడటం కూడా ఒక రకమైన సాధననే”. ఇది అర్థమయిన తరువాత రోజూ సాధన చేయటం లేదన్న బాధ తగ్గిందని అంటుంది లత.

గులామ్ హైదర్ తరువాత అనిల్ బిశ్వాస్ లత అనే వజ్రాన్ని సానపెట్టిన వ్యక్తి. మైకు ముందు నిలచి ఊపిరి పీలుస్తున్నట్టు తెలియకుండా ఊపిరి పీల్చటం, పదాలను విరవటం, ఎక్కడ ఆగాలో, ఎక్కడ సాగాలో తెలియటం వంటివి అనిల్ బిశ్వాస్ నుంచి నేర్చుకున్నానంటుంది లత. గులామ్ హైదర్ ఎక్కువ కాలం జీవించలేదు. అతను లేని లోటును అనిల్ బిశ్వాస్ భర్తీ చేశాడు.

నూర్జహాన్, గులామ్ హైదర్‍లు పాకిస్తాన్ వెళ్ళిపోయిన తరువాత కూడా ఫోను ద్వారా వారితో సంబంధాన్ని కొనసాగించింది లతా మంగేష్కర్. ఫోనులో పాటల గురించి చర్చించటం, ఒకరు కొత్తగా పాడిన పాటలను మరొకరికి వినిపించటంతో పాటు గులామ్ హైదర్ నుండి సలహాలు తీసుకోవటం వంటివి చేసేది లత. అయితే దేశవిభజన విద్వేషాలు తీవ్రంగా ఉన్న సమయం కావటంతో లత క్రమం తప్పకుండా పాకిస్తాన్ కళాకారులతో మాట్లాడుతుండటం వివాదాస్పదమయింది. నెమ్మదిగా టెలిఫోన్ సంభాషణలు తగ్గిపోయాయి. అయితే విదేశాలలో లత, నూర్జహాన్‍లు కలుస్తూండేవారు. ఒకసారి ఇద్దరికీ కలవాలని తీవ్రంగా అనిపించినప్పుడు, అమృత్‌సర్ దగ్గరి వాగాహ్ సరిహద్దు వద్ద “no man’s land” లో కొన్ని నిమిషాల కోసం కలిశారు.

సజ్జాద్ హుస్సేన్ కూడా లత పాటకు మెరుగులు దిద్దినవాడు. ఆమె గురువు అమానత్ అలీఖాన్‍కూ సజ్జాద్ హుస్సేన్‍కు మంచి దోస్తీ. అమానత్ అలీఖాన్ తన శిష్యురాలి గురించి సజ్జాద్ హుస్సేన్‍కు చెప్పాడు. లత స్వరాన్ని పరిశీలించేందుకు సజ్జాద్ హుస్సేన్ లతను పిలిచాడు. సజ్జాద్ హుస్సేన్ అత్యంత సృజనాత్మక సంగీత దర్శకుడు. అయితే ఎవరికీ ఒదిగి ఉండే వ్యక్తి కాదు. ఎవరి మాట వినే వ్యక్తి కాదు. తన సంగీత ప్రతిభ మీద అపారమైన విశ్వాసం కలవాడు సజ్జాద్ హుస్సేన్. అతడి అభిప్రాయం ప్రకారం హిందీ సినీ ప్రపంచంలో పాడటం తెలిసినవారు గాయనిల్లో ఇద్దరే ఇద్దరు. ఒకరు నూర్జహాన్, రెండు లతా మంగేష్కర్. గాయకులలో పాడటం తెలిసింది ఒక్క మహమ్మద్ రఫీకే. లత, తలత్ మహమూద్‍తో చక్కని పాటలు పాడించినా తలత్ మహమూద్‍ ను గలత్ మహమూద్ అనేవాడు సజ్జాద్ హుస్సేన్. సజ్జాద్ హుస్సేన్‍కు లత మంగేష్కర్ నచ్చటంలో ప్రధానంగా తోడ్పడింది – లత చెప్పింది చెప్పినట్టు నేర్చుకోగలగటం.

1917లో మధ్యప్రదేశ్‍లోని ‘సీతామౌ’లో జన్మించిన సజ్జాద్ 1937లో బొంబాయి వచ్చాడు. 1944లో స్వతంత్ర సంగీత దర్శకుడయ్యాడు. నూర్జహాన్‍తో ‘దోస్త్’ సినిమాలో అద్భుతమైన పాటలు పాడించాడు కానీ, ఆమె భర్తతో పడకపోవటంతో నూర్జహాన్, సజ్జాద్ హుస్సేన్‌కు ఎక్కువ పాటలు పాడలేదు. ఇతర గాయనీలు పాటలు పాడే విధానంతో అసంతృప్తి ఉన్న సజ్జాద్‍కు లత స్వరం కన్నా ఆమె నిజాయితీ, చిత్తశుద్ధిలు నచ్చాయి. సజ్జాద్ హుస్సేన్ కోపిష్టి. నోటికి వచ్చిన మాటలంటాడు. కానీ పర్ఫెక్షనిస్టు. అందరూ పర్ఫెక్ట్‌గా ఉండాలన్న పట్టుదల, అలా లేరన్న అసహనంలోంచి ఆయన కోపాన్ని, అసంతృప్తిని ప్రదర్శించేవాడు. ఇది సినీ పరిశ్రమలో ఎవ్వరూ మెచ్చరు. అందుకే 34 సంవత్సరాల సినీ జీవితంలో కేవలం పద్నాలుగు సినిమాలకు మాత్రమే సంగీత దర్శకత్వం వహించాడు. కానీ ప్రతి పాటను వజ్రంలా చెక్కాడు. ప్రతి పదాన్ని, ప్రతి స్వరాన్నీ వజ్రంలా చెక్కటంతో ప్రతి పాట వజ్రాల శిల్పంలా మెరుపులు మెరిసేది.

సజ్జాద్ హుస్సేన్ శతాబ్ది ఉత్సవాలలో లతా మంగేష్కర్ “Sajjaad Sahab was a misunderstood artist. People defamed him saying he is temperamental, but he was a perfectionist” అని వ్యాఖ్యానించింది. తన జీవితంలో తాను పాడిన మరపురాని మధురగీతాలు కొన్ని సజ్జాద్ హుస్సేన్ రూపొందించినవే అంది. సజ్జాద్‍కు గాయనీ గాయకులు కానీ, వాయిద్యకారులు కానీ తాను ఎలా చెప్తే అలా, ఎంతవరకు చెప్తే అంతవరకే తమ కళను ప్రదర్శించాలి తప్ప స్వతంత్రాన్నివ్వడు. ఇళయరాజా కూడా దాదాపుగా ఇంతే. అయితే ఎవ్వరు ఏ మాత్రం తప్పుచేసినా సహించేవాడు కాదు. గాయనీ గాయకులు తాను చెప్పినట్టు సరిగ్గా, ఖచ్చితంగా పాడేవరకు వదిలేవాడు కాదు. అందుకే సజ్జాద్ హుస్సేన్ పాటలు పాడమంటే తాను భయపడేదాన్నని, ఎంతో పరిశ్రమించేదన్నని లత చెప్పింది.

ఒకసారి ఓ పాట రికార్డింగ్ సమయంలో ఓ వాయిద్యకారుడు సజ్జాద్ చెప్పినట్టు వాయించలేకపోతున్నాడు. దాంతో సజ్జాద్‍కు కోపం వచ్చింది. కోపం పట్టలేక ‘ఫో…. బయటకు పో….. నీకు వాయించటం రాదు. వాయించటానికి ఎందుకు వచ్చావు?” అని అరిచాడు. బయటకు వెళ్లబోతున్న వాయిద్యకారుడికి అడ్డుగా నిలుచుని “ఇటునుంచి కాదు, కిటికీలోంచి బయటకు దూకు. ఇక్కడ లత ఉంది. ఆమె ఎదురుగా వస్తే, ఆమె మూడ్ పాడవుతుంది. నేను అది ఎట్టి పరిస్థితుల్లో కానివ్వను” అని ఆ వాయిద్యకారుడిని కిటికీలోంచి బయటకు తోసేశాడట. (Times of India 15.6.2017, article by bella jaisingnani).

సజ్జాద్ సంగీత దర్శకత్వంలో లత కేవలం 14 పాటలు పాడింది. కానీ ఆ పద్నాలుగు పాటలు పద్నాలుగు ఆణిముత్యాలు. 1950లో “ఖేల్” సినిమాలో ‘జాతే హోతో జావో’ పాటతో మొదలైన వీరి సంబంధం 1963లో ‘రుస్తుమ్ సోహ్రాబ్”లో “ఏయ్ దిల్‍ రుబా నజ్రేమిలా” తో సమాప్తమయింది. ప్రతి ఒక్క పాటలో లత భిన్నంగా, ప్రత్యేకంగా వినిపిస్తుంది. ప్రతి పాట పాడేందుకు ఎంతో శ్రమపడినా, ‘ఏయ్ దిల్ రుబా” పాటకు పడ్డంత శ్రమ మరే పాటకూ పడలేదంటుంది లత. ఈ పాటను తాను పాడిన అత్యుత్తమ పాటల జాబితాలో పేర్కొంది లత.

కుందన్‍లాల్ సహెగల్ పాట విని నూర్జహాన్ గాన సంవిధానానికి సంపూర్ణంగా భిన్నమైన పాట పాడే పద్ధతిని నేర్చుకుంది లతా మంగేష్కర్. ముఖ్యంగా సెహగల్ పాట ‘దుఖ్ కే అబ్ దిన్ బీతత్ నాహి’ (దేవదాసు) పాటను విని దుఃఖం ధ్వనింపచేయటం నేర్చుకున్నానంటుంది లతా మంగేష్కర్. నాయకుడు విషాదంలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. ఆ ఎమోషన్‍ను, ఆ భావాన్ని సెహగల్ తన గొంతులో ఎలా ప్రతిధ్వనింప చేశాడన్నది ఈనాటికీ తనకు ఆశ్చర్యమేనంటుంది లత. ఏడిస్తే పాట పాడలేడు. కాబట్టి పాట పాడూతూ ఏడుస్తున్న భావనను సెహగల్ ఎలా కలిగించగలిగాడోనన్నది అంతుపట్టని విషయం అంటూ అలాంటి ‘పర్‍ఫెక్షన్’ కోసం ప్రయత్నిస్తుందని పలు సందర్భాలలో చెప్పింది లత.

నిజానికి అమానత్ ఖాన్ సాహబ్ లత గురించి చెప్పగానే ‘హల్‌చల్’ సినిమాలో ‘ఆజ్ మేరే నసీబ్ మే’ అన్న పాటను లతతో రికార్డు చేశాడు సజ్జాద్. కానీ నిర్మాతతో గొడవలు వచ్చి ఆ సినిమా సగంలో వదిలేశాడు. దాంతో సినిమాలో ఈ పాటను వాడలేదు. సజ్జాద్‍కు నౌషాద్ అంటే పడేది కాదు. అందుకని లత ఎప్పుడు తన కోసం పాడే పాటలో పొరపాటు చేసినా ‘యే నౌషాద్ మియాకే గానా నహీ హై: థోడీ ఔర్ మొహనత్ కర్నీ పడేగీ” అని తిట్టేవాడు. సంగీత దర్శకులందరిలో సహాయ సంగీత దర్శకుడిని వాడనిది సజ్జాద్ హుస్సేన్ ఒక్కడే. అన్నీ తానే చూసుకునేవాడు. ఏ పాటనూ చులకనగా తీసుకోకూడదని, ప్రతి పాటనూ జీవన్మరణ సమస్యగా తీసుకుని పాడాలన్నది సజ్జాద్ నుంచి నేర్చుకున్నానంటుంది లత.

లతా మంగేష్కర్ గాన సంవిధానాన్ని తిరుగులేని రీతిలో ప్రభావితం చేసినవాడు ఖేమ్‌చంద్ ప్రకాశ్. ‘మహల్’ సినిమాలో ‘ఆయెగా ఆనేవాలా’ తో లత సినీ సంగీత జీవితం శిఖరారోహణ ఆరంభమయింది.

లారలప్ప లారలప్ప లాయి రఖ్దా

ఖేమ్‍చంద్ ప్రకాశ్ సృజించిన ‘ఆయెగా ఆనేవాలా’తో పోటీగా సూపర్ హిట్ అయి, వీధి వీధినా వాడవాడలా లత స్వరం మార్మోగేట్టు చేసిన మరో పాట ‘లారలప్ప లారలప్ప’ . మీనాశౌరీపై చిత్రితమైన ‘ఏక్‍థీ లడ్కీ’ (1949) సినిమాలోని ఈ పాటను రూపొందించింది సంగీత దర్శకుడు వినోద్. వినోద్ అసలు పేరు ఎరిక్ రాబర్ట్స్. ఈయన, గులామ్ హైదర్, బులో సి రాణి, హన్స్‌రాజ్ బహల్, శ్యామ్ సుందర్, హుస్న్‌లాల్ భగత్‌రామ్ వంటి సంగీత దర్శకులంతా పంజాబీ సంగీత దర్శకులు. వీరిలో ఒకరు ఒక గాయనిని వాడితే మిగతా వారంతా ఆ గాయనీ గాయకులను వాడేవారు. అలా గులామ్ హైదర్ లతను గాయనిగా ఉపయోగించి చూడమని వినోద్‍కు చెప్పటంతో, వినోద్ లతతో పంజాబీ సినిమా ‘చమన్’లో రెండు పాటలు పాడించాడు. శంషాద్ బేగం పాటలకన్నా లత పాడిన రెండు పాటలు హిట్ అయ్యాయి. దాంతో వినోద్ లతతో పాడించటం ప్రారంభించాడు. వినోద్‍కు నిర్మాత రూప్‍శౌరీతో మంచి దోస్తీ. ఆయన వినోద్‍ను బొంబాయికి ఆహ్వానించాడు. అలా ‘ఏక్‍థీ లడ్కీ’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం వినోద్‍కు లభించింది. ఏక్ థీ లడ్కీ సినిమా నాయిక మీనాశౌరీ స్వయంగా చక్కని గాయని. కానీ ఆమె ఈ సినిమాలో లారలప్ప పాటను లతో పాడించమని వినోద్‍ను కోరింది. ఫలితంగా లారలప్ప లత సూపర్ హిట్ పాటల్లో ఒకటిగా నిలిచింది. కోరస్‍తో కలసి పాడటం, పంజాబీ పదాలను సరిగ్గా ఉచ్చరించటం, పంజాబీ జానపద గీతాల లయకనుగుణంగా స్వరాన్ని పరుగులెత్తించటం లత – వినోద్, బులో సి రాణి, హుస్న్‌లాల్ భగత్‍ రామ్, హన్స్‌రాజ్ బహెల్‍ల పాటలు పాడుతూ నేర్చుకుంది. వినోద్ లతతో పాడించే సమయానికి ఆమె స్వరంలో ఇప్పటి పరిపక్వత లేదు. ఇది గమనించిన వినోద్ వయోలిన్, తబలా, హార్మోనియం వంటి వాయిద్యాలను అత్యంత సృజనాత్మకంగా వాడుతూ, ఆ వాయిద్యాల నాదాల నడుమ తీగలా లత స్వరం వినిపించే రీతిలో సంగీతాన్ని రచించాడు. తరువాత ఎందుకనో వినోద్ లత స్వరాన్ని వాడలేదు. వినోద్‍కు హాస్య చిత్రాల సంగీత దర్శకుడని ముద్రపడటం అతని కెరీర్‍ను దెబ్బతీసింది. చివరికి తుప్పుపట్టిన బ్లేడ్‍తో షేవింగ్ చేసుకుంటుండగా చర్మం తెగి టిటానస్ శరీరమంతా వ్యాపించి 37 ఏళ్ళ వయసులో వినోద్ మరణించాడు. లతతో భేదాభిప్రాయాల వల్ల 1950 తరువాత వినోద్ లతతో పాటలు పాడించలేదు. ఇది అతని కెరీర్‍పై ప్రభావం చూపించింది. ఎందుకంటే 1950 నుండి హిందీ సినీ ప్రపంచంలో లత యుగం ప్రారంభమయింది. అతని పాటలు అంతగా హిట్ కాలేదు. ప్రొడ్యుసర్లు హన్స్‌రాజ్ బహెల్‍కు ప్రాధాన్యం ఇవ్వటంతో వినోద్‍కు సినిమాలు అందటం తగ్గిపోయింది. కానీ ఈనాటికీ ‘లారలప్ప’ పాటలతో వినోద్ చిరంజీవిగా మిగులుతాడు. దులారీ, మహల్, అందాజ్, బర్సాత్ వంటి సినిమాలు విడుదలైన సంవత్సరమే విడదలయి ఆ సూపర్ హిట్ సినిమాలకు ధీటైన సంగీతం సృజించిన వాడిగా, ఆయెగా ఆనేవాలా, ఉఠాయేజా ఉన్ కే సితమ్, జియా బేక రార్ హై వంటి పాటలతో సమానమైన హిట్ లారలప్పను లతకు అందించినవాడిగా వినోద్‍ను సినీ సంగీతప్రపంచం ఈనాటికీ గుర్తుంచుకుంటుంది.

లతతో తక్కువ పాటలు పాడించినా లత సినీసంగీత ప్రపంచంలో ఒక శక్తిగా నిలవటంతో తనవంతు పాత్ర పోషించిన మరో సంగీత దర్శకుడు హన్స్‌రాజ్ బహెల్.

పృథ్వీరాజ్ కపూర్ రికమండేషన్‍తో 1946లో ‘పూజారి’ సినిమాతో స్వతంత్ర సంగీత దర్శకుడైన ఈయన – నటి మధుబాల బేబీ ముంతాజ్‍గా ఉన్నప్పుడు ‘భగవాన్ మేరీ జ్ఞాన్ కే దీపక్ కో జలాలే’ అనే పాటను పాడించాడు. ఆరంభంలో ఈయన ముకేష్‍తో అద్భుతమైన గీతాలు పాడించాడు. శంషాద్ బేగం, ఇతర గాయనీలతో పాడించాడు కానీ, లత స్వరం వాడటంపై ఎలాంటి ఉత్సాహం చూపలేదు. 1948లో ‘చునరియా’ సినిమాలో తొలిసారిగా లత, రఫీలను వాడేడు. ఈ సినిమాలోనే ఆశాభోస్లేతో తొలి సోలోను పాడించాడు. అయితే 1949లో లతతో ‘చకోరా’ సినిమాలో ‘హాయ్ చందా గయే పర్ దేశ్’ పాటతో చక్కని గుర్తింపు సాధించాడు. 1949లోనే ‘రాత్ కీ రానీ’ సినిమాలో రఫీతో ‘జిన్ రాతోమే నీంద్ నహీ ఆతీ’ పాటను పాడించాడు. లత, రఫీల స్వరాల ఆధారంగా గుర్తింపు సాధించినవాడు హన్స్‌రాజ్ బహెల్. అయితే ఈయన రఫీని అధికంగా వాడేడు కానీ ఎన్నడూ లతను తన సంగీతంలో ప్రముఖ గాయనిగా భావించలేదు. కానీ 1958లో ‘మిలన్’ సినిమాలో లతతో పాడించిన ‘హాయె జియ రోయే’ పాట లత పాడిన అత్యుత్తమ పాటలలో అగ్రశ్రేణి పాటగా నిలుస్తుంది. దర్బారీ రాగంలో దృత లయలో రూపొందించిన ఈ పాటలో కేవలం బాన్సూరీ, సారంగీ, లత స్వరాలు మాత్రమే వాడి, విన్న ప్రతివారూ ‘మెలోడీ లోకం’లో కళ్ళు తెరిచే రీతిలో ఈ పాటను రూపొందించాడు. ‘చునారియా’ సినిమాలో ‘ఆంఖ్ మేరీ లడ్ గయీరే’ అన్న పాటను పాడించే కన్నా ముందు లతను కశ్మీరు తీసుకువెళ్ళి ఈ పాటకు ప్రేరణ అయిన కశ్మీరు జానపదగీతాన్ని స్వయంగా విని, బాణీలోని లయను అర్థం చేసుకోమన్నాడు. ఇలా ఒక పాట పాడేముందు పాటను తనలోకి ఆహ్వానించి ఆ పాటే తానైపోవటం హన్స్‌రాజ్ బహెల్ నేర్పించాడు. అయితే ఇతను లత కన్నా అధికంగా ఇతర గాయనిలను వాడటం ముఖ్యంగా ‘మధుబాల ఝూవేరీ’ అన్న గాయనితో అధికంగా పాటలు పాడించటం ఇతని కెరీర్‍ను దెబ్బతీసింది. లత, రఫీలు పాడిన పాటల వల్లనే ఈనాటికీ హన్స్‌రాజ్ బహెల్‍ను సినీ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. తొలిపాటనే కాదు, తొలి సొలో తనతో పాడించినా ఆశాభోస్లే హన్స్‌రాజ్ బహెల్ ప్రస్తావన చేయదు. ‘మొహబ్బత్ జిందా రహీతీహై (చెంగిజ్ ఖాన్), ‘జహ డాల్ డాల్ పర్’ (సికందర్ – ఎ- ఆజామ్), ‘జిందగీ హర్ గమ్ జుదాయీ’ (మిస్ బాంబే) వంటి రఫీ పాటలతో పాటు లత పాడిన ‘హాయే జియా రోయ్’ పాట వల్ల ఈనాటికీ హన్స్‌రాజ్ బహెల్‌ను గుర్తుంచుకుంటుంది సినీ సంగీత ప్రపంచం.

వినోద్, హన్స్‌రాజ్ బహెల్ వంటి సంగీత దర్శకుల కోసం తాను ఎక్కువ పాటలు పాడలేదనీ; ‘ప్రశ్నలు అడిగేవారు హిట్ పాటల గురించి అడుగుతూంటారు; కానీ జవాబు ఇచ్చేవారికి ఆ పాటలు గుర్తుకు రాకపోవటం ఇబ్బందిగా ఉంటుంద’ని తనను అధికంగా వాడని సంగీత దర్శకుల గురించి అడిగిన ప్రశ్నకు లత ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చింది. హన్స్‌రాజ్ బహెల్ గురించి ప్రత్యేకంగా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘నేను హన్స్‌రాజ్ బహెల్‍కు‍ ఎన్నో పాటలు పాడేను. కానీ ఇప్పుడు అవన్నీ గుర్తులేవు. ఆరంభంలో అతనికి చక్కని పాటలు పాడేను. ‘నాలే లమ్మీ తే నాలే కాలీ హోయ్’ అనే పంజాబీ పాట గుర్తొస్తోంది. ‘మిలన్’లో హాయె జియా రోయ్ పాట, చకోరీ లో పాటలు గుర్తొస్తున్నాయి అని సమాధానం ఇచ్చింది.

లత హన్స్‌రాజ్ బహెల్‍ను గుర్తుంచుకోకపోవటం వెనుక కారణం ఉంది. లతా మంగేష్కర్ అవకాశం కోసం సంగీత దర్శకుల చుట్టూ తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆమెని పాట పాడమనేవారు. పాట పాడిన తరువాత స్వరం బలహీనంగా ఉందనో, నాయికకు సరిపోదనో, ఉచ్చారణ సరిగ్గా లేదనో ఏదో ఒక వంకతో ఆమెను తిరస్కరించేవారు. ఇది లత మనస్తత్వంపై తీవ్రమైన ప్రభావం చూపింది. వ్యక్తిగతంగా దీనానాథ్ మంగేష్కర్ తనయగా, దైవదత్తమైన అత్యద్భుతమైన స్వరం పొందిన గాయనిగా లతకు అత్యంత ఆత్మవిశ్వాసం ఉండేది. కానీ తప్పనిసరిగా ఎదుర్కొంటున్న తిరస్కృతులు లత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. అందుకని అప్పటి హిట్ గాయనిలను అనుకరించే ప్రయత్నం చేసింది. తన స్వరం మెచ్చి దాని ఆధారంగా గుర్తింపు పొందిన తరువాత కూడా తనని ఆదరించని సంగీత దర్శకులతో తాను అగ్రశ్రేణికి చేరిన తరువాత లత పనిచేసేందుకు ఉత్సాహం చూపలేదు. ‘చకోరీ’ తో హిట్ సాధించిన హన్స్‌రాజ్ బహెల్, తరువాత లత కన్న శంషాద్ బేగం, సురయ్య వంటి ఇతర గాయనిలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. 1949 తరువాత నెంబర్ వన్ గాయనిగా నిలిచిన లత ఏ సంగీత దర్శకుడి పాటలు పాడేందుకు అంతగా ఉత్సాహం చూపలేదో, వ్యాపారపరంగా ఆ సంగీత దర్శకుడి కెరీర్ ప్రమాదంలో పడుతుంది. కారణం ఏమిటంటే అప్పటికి డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడి పెట్టే వ్యవస్థ వచ్చింది. పంపిణీదార్ల దృష్టి వ్యాపార లాభాలపైనే ఉంటుంది. లత పాట ఉంటే సినిమా వ్యాపార విలువ పెరుగుతుంది. కాబట్టి లత పాట ఉన్న సినిమాలకు పెట్టుబడులు సులభంగా లభించేవి.

హన్స్‌రాజ్ బహెల్‍ను లత అంతగా ప్రస్తావించకపోవటానికి వ్యక్తిగత కారణం ఇంకోటి ఉందని అంటారు. తన స్వరం ఆధారంగా లత కుటుంబాన్ని పోషిస్తోంది. ఆ సమయంలో కుటుంబంలోని ఇతర సభ్యులు తనతో సహకరిస్తారని వాంఛించటం సహజం. మానసిక శాస్త్రవేత్తల ప్రకారం, యుక్తవయసు రాకముందే ఇంటి బాధ్యత తలకెత్తుకున్న వారి మానసిక వ్యవస్థ అల్లకల్లోలంగా ఉంటుంది. న్యూనతా భావం, అభద్రతా భావాలు అలాంటి వారిలో తీవ్రంగా చెలరేగుతూ వారి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. కుటుంబ బరువు ఓ వైపు ఒత్తిడి పెంచుతుంటే, నిరాశాజనకం, అంధకారం అయిన భవిష్యత్తు అణచి వేస్తుంటే, వర్తమానంలోని తిరస్కృతులు భయపెడుతుంటే, నిరాశా, నిస్పృహలు అలముకొని వ్యక్తిని మానసికంగా దిగజారుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో లత తనని తాను కూడగట్టుకుని ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ అనుక్షణం పోరాటం సాగిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తుంటే, ప్రతి తిరస్కృతి ఒక సుత్తిదెబ్బలా మనస్సును క్రుంగదీస్తుంది. బాధ కలిగిస్తుంది. అందుకే తనను తిరస్కరించిన వారిని కానీ, తన స్వరాన్ని అధికంగా వాడని వారినీ లత క్షమించలేదు. వారు ఎంత గొప్ప సంగీతం అందించినా అధికంగా వారిని ప్రస్తావించలేదు. ఇలా లత సినీరంగంలో నిలద్రొక్కుకోవటం కోసం పోరాడుతున్న సమయంలో అండగా నిలబడవలసిన సోదరి ఆశా భోస్లే, గణపతిరావు భోస్లే అనే అతడితో పారిపోయి వివాహం చేసుకుంది. ఇది లత మనస్తత్వంపై ప్రభావం చూపించింది. సాధారణంగా ఇంట్లో ఒకరు ఇలా పారిపోయి ప్రేమ వివాహం చేసుకుంటే ఇంట్లో మిగిలిన వారికి ప్రేమ పట్ల విముఖత కలుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రేమ వివాహం వల్ల ఇంట్లో తల్లిదండ్రులకు దుఃఖం కలిగితే అది ఆ దుఃఖం కలిగించిన వారి పట్ల ద్వేషభావంగా ప్రకటితమవుతుంది. ఓ వైపు ఇంట్లో వారు జీవిక కోసం నిరంతరం పోరాడుతుంటే, వారితో కలిసి పోరాడాల్సిన వ్యక్తి తన స్వార్థం చూసుకుని అందరినీ వదిలివెళ్తే ఆ సంఘటన వల్ల కలిగిన గాయం జీవితాంతం మనసులో మానని గాయంలా మిగిలి బాధను కలిగిస్తూంటుంది. కాలం మాన్పలేని గాయాలలో ఇదొక గాయం. తరువాత ఎంత ప్రయత్నించినా వారి సంబంధాన్ని ఈ గాయం ప్రభావం చేస్తూనే ఉంటుంది. అభద్రతా భావంతో తాను తన జీవితంలో భద్రత సాధించేందుకు అందరినీ గాయపరచి వెళ్ళిన వ్యక్తి ప్రయత్నం విఫలమైతే అది మరో రకమైన వేదనను కలిగిస్తుంది. అలా వెళ్ళిన వ్యక్తి కుటుంబం కోసం పోరాడుతున్న సోదరితోనే పోటీకి వస్తే, అది ఆ బంధాన్ని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది.

లత సోదరి ఆశా, గణపతిరావు భోస్లేను ప్రేమ వివాహం చేసుకోవటం, అతడు ఆమెని ఇంట్లో వారితో కలవనివ్వకపోవటం, హింసించటం చివరికి సోదరి లత లాగా పాటలు పాడి ఇంటిని పోషించమని సినిమాలవైపు తరమటం ఇవన్నీ లత ఆలోచనలను ప్రభావితం చేశాయి. అందుకే ఆశకు ప్రోత్సాహం ఇచ్చి పాటలు పాడించిన ‘హన్స్‌రాజ్ బహెల్’ ను లత అంతగా ప్రస్తావించకపోవటం ఆశ్చర్యం కలిగించదు. లత నిస్వార్థం, ఆశా భోస్లే స్వార్థం వారి వారి కెరీర్లను ప్రభావితం చేయటమే కాదు, లత వెంట సమస్త కుటుంబం నిలవటం, ఆశాతో వారు కలిసినా, లత పట్ల కనబరచిన శ్రద్ధ, భక్తిభావం, విశ్వాసం ఆశా పట్ల కనబర్చకపోవటానికి కారణం. కుటుంబంలో లతకు లభించిన గౌరవాభిమానాలు ఆశాకు లభించకపోవటానికీ లత జీవితాంతం కుటుంబంతో జీవించటం, ఆశా తన స్వార్ధం చూసుకోవటం ప్రధానకారణం. భోస్లేతో వివాహం విఫలమయిన తరువాత ఆశాను కుటుంబం ఆదరించినా, కెరీర్ పరంగా నిలద్రొక్కుకోవటానికి లత ఆశాకు ఏ రకంగా సహాయం చేయకపోవటం గమనార్హం. ఆశాను కూడా లత సహ గాయనిగానే చూడటం కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. లత తన కుటుంబం కోసం పాడుతుంది. ఆశా ఆమె కుటుంబం కోసం పాడుతుంది. ఎలాగైతే ఇతర గాయనిలు వారివారి కెరీర్ల కోసం వారి వారి కుటుంబాల కోసం పాడుతున్నారో, ఆశా కూడా అంతే! అయితే ఆశా సినీ సంగీత రంగాన్ని ఆధారంగా చేసుకునే నాటికి లత గాయనిగా స్థిరపడటమే కాదు, తనదైన పద్ధతిలో ఇమేజీని సంపాదించుకుంది. మరోవైపు గీతారాయ్ తనదైన ప్రత్యేక గానసంవిధానంతో ఇమేజీ సాధించింది. సినీ గీతాల ప్రపంచాన్ని లత గీతాలు ఆక్రమించగా మిగిలిన రకమైన పాటలను ఇతర గాయనిలు పాడాల్సిన పరిస్థితి 1950 కల్లా సినీ ప్రపంచంలో నెలకొంది. దాంతో ఆశా భోస్లేకు దొరికిన పాట దొరికినట్టు పాడితే కానీ పాటలు దొరకని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘ఆ సంగీత దర్శకుడికి పాడను’, ‘ఈ గాయకుడితో పాడను’, ‘ఇలాంటి పాటలు పాడను’ అనే అవకాశం ఆశాకు దక్కలేదు. లత పాడే పాటలు ఆశా పాడలేదు. గీతారాయ్‍ను కదపలేదు. దాంతో అవకాశం దొరికిన పాటనల్లా పాడేయటంతో ఆశా భోస్లే కెరీరు ఆరంభంలోనే తప్పుదారి పట్టింది. చివరికి గీతారాయ్, గీతదత్ అయ్యి తన కెరీర్‍ను తానే స్వయంగా నాశనం చేసుకొనే వరకూ ఆశా భోస్లే సినీరంగంలో నిలద్రొక్కుకోలేకపోయింది. చివరికి ఓ.పీ. నయ్యర్ సంగీత ప్రపంచంలో గీతా స్థానాన్ని ఆక్రమించే వరకూ ఆశా ఒక గుర్తింపును సాధించలేకపోయింది. కానీ ఓపీతో ఆశా సాన్నిహిత్యం లతకు నచ్చలేదు. ఇది ఓపీనయ్యర్, లతల నడుమ ఉద్విగ్నతగా పరిణమించింది. ఇదంతా భవిష్యత్తు . అయితే ఆరంభం నుంచీ లత ఆశాను సోదరిగా ఆత్మీయంగా చూసింది కానీ గాయనిగా, మరో గాయనిగానే చూసింది తప్ప సోదరిగా చూడలేదు. వ్యక్తిగతంగా సొదరి- సినీరంగంలో గాయని . ఈ విచక్షణ ఇతరులతో లత వ్యవహరించిన తీరులోనూ కనిపిస్తుంది. తనను గౌరవించి, ఆదరించిన వారితో తానూ అభిమానంగా, గౌరవంగా వ్యవహరించింది. వారు ఏమాత్రం పొరపాటు చేసినా వారికి దూరం అయింది. వారిని లెక్కచేయలేదు. తన ఆత్మన్యూనత భావాన్ని, అభద్రతాభావాన్ని ఆత్మగౌరవంగా, ఆత్మవిశ్వాసంగా రూపాంతరం చెందించటంలో లత ప్రయత్నంలో భాగమే ఈ ప్రవర్తన.

లత సినీ సంగీత జీవితాన్ని మలుపు తిప్పిన ఖేమ్‌చంద్ ప్రకాశ్‍కు లత స్వరం వాడి చూడమని సలహా ఇచ్చింది గులామ్ హైదర్. ఆ కాలంలో ఫిల్మిస్తాన్ కంపెనీకి చెందిన శశిధర్ ముఖర్జీ లత స్వరాన్ని తిరస్కరించాడు. ‘రణజీత్ టోన్’ కంపెనీలో కూడా లత నిరాశ చెందాల్సి వచ్చింది. ఆ కంపెనీ యజమాని సర్దార్ చందూలాల్ షాహకు లత స్వరం గురించి సంగీత దర్శకుడు అవినాశ్ వ్యాస్ చెప్పాడు. అవినాస్ వ్యాస్ ప్రధానంగా గుజరాతీ సంగీత దర్శకుడు. 1970లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి భారత ప్రభుత్వం ఈయనను సత్కరించింది. లత స్వరం విని మెచ్చిన అవినాశ్ వ్యాస్ లతకు ‘మాఝూమ్ రాతే నీతరతీ నభ్ నీ చాంద్ నీ’ అనే గుజరాతీ గీతం పాడటంలో శిక్షణ ఇచ్చి చందులాల్ షాహ ముందు పాడించాడు. పాట విని చందూలాల్ షాహ్ పెదవి విరిచాడు. అంతేకాదు, అదే కంపెనీలో పనిచేస్తున్న సంగీత దర్శకుడు ఖేమ్‌చంద్ ప్రకాశ్‍కు ఈ పాట వినిపించి, ఈమె గాయనిగా పనికిరాదంటూ లతను తీసిపారేసినట్టు మాట్లాడేడు. అప్పటికే గులామ్ హైదర్ ద్వారా లత గురించి విన్న ఖేమ్‍చంద్ ప్రకాశ్ కుతూహలంతో లత పాడిన పాట విన్నాడు. అతడికి ఆమె స్వరం నచ్చింది. ఇదేమాట చందూలాల్ షాహతో చెప్పి ‘నాకు అవకాశం లభిస్తే ఈమెతో పాట పాడిస్తాను’ అన్నాడు. ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. కోపంతో చందూలాల్ ‘నా కంపెనీలో నువ్వు నౌకరివి” అన్నాడు ఖేమ్‍చంద్ ప్రకాశ్ స్వాభిమానం దెబ్బతిన్నది. వెంటనే ఆ కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ‘బోంబే టాకీస్’లో చేరిపోయాడు ఖేమ్‌చంద్.

బోంబే టాకిస్‍లో ‘జిద్ది’ సినిమాలో ‘చందారే జారేజా’ పాటను ఛాయానట్ రాగంలో రూపొందించి లతతో పాడించాడు. శాస్త్రీయ సంగీతంలో లతకు ప్రవేశం ఉండటంతో అతి సంక్లిష్టమైన ఈ పాటను లత అతి సులభంగా పాడి అందరినీ మెప్పించింది. ఇదే సినిమాలో గజల్ రూపంలో ‘తుఝుకో ఓ బేవఫా’ పాటలో లతతో ఉచ్చస్వరంలో పాడించి అంత ఉచ్చస్థాయిలో కూడా భావాలు పలకటం నేర్పించాడు. ఆ కాలంలో గాయనిలు ఉచ్చస్థాయిలో అతి తక్కువగా పాడేవారు. లతతో ఉచ్చస్థాయిలో పాడించటం, భావాలు పలికించటం ద్వారా ఆమె ప్రతిభను ప్రదర్శించే వీలు కల్పించాడు ఖేమ్‌చంద్. 1948లోనే ‘ఆశా’ సినిమాలో ‘ఇక్ మురారీ మనోహర్ రే’, ‘కిత్ జాయే బసో మురారీ రే’ వంటి పాటల ద్వారా లత గాన సంవిధానానికి మెరుగులు దిద్ది విభిన్నమైన భావప్రకటనలో లతకు శిక్షణ నిచ్చాడు ఖేమ్‌చంద్ ప్రకాశ్. లత స్వరంలోని మార్మికతను, రహస్యమయంగా ధ్వనించే లక్షణాన్ని అంతర్లీనంగా ఉన్న అలౌకిక ధ్వనిని ‘ఆశా’ సినిమాలోని ‘దూర్ జాయేరే రాహ మేరీ అజ్ తేరీ రాహా సే ‘లో తొలిసారిగా ప్రదర్శించాడు ఖేమ్‌చంద్ ప్రకాశ్. ఈ పాట ‘మహల్’ లోని ‘ఆయేగా ఆనెవాలా’ కు రిహార్సల్స్ లాంటిది. ఈ పాట వల్ల ఇలాంటి రహస్యమయ గీతాలకు లత స్వరం ఎంతగా సరిపోతుందో ఖేమ్‍చంద్ ప్రకాశ్‍కు అర్థమయింది. అందుకే ‘మహల్‍’లో ఆయెగా అనేవాలా పాటను లతతో పాడించాలని ఖేమ్‌చంద్ ప్రకాశ్ పట్టుబట్టాడు. సినిమా నిర్మాత లత స్వరంపై అంత ఉత్సహం చూపించలేదు.

ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా

మహల్ పాట రిహార్సల్స్ అయిదు రోజులు రాత్రింబవళ్ళు సాగాయి. రిహార్సల్స్ ఎంత తీవ్రతతో సాగేయంటే పాట లత నరనరాన జీర్ణించుకుపోయింది. పాట అంతా తయారైన తరువాత దర్శకుడు కమల్ అమ్రోహి, పాట ముందు నెమ్మదిగా పాడే ‘ఖామోష్ హై జమానా’ అనే రెండు పంక్తులను స్వయంగా రచించి జోడించాడు. పాటలోని రహస్యమయ మూడ్‌ను ఈ పంక్తులు ఇనుమడింపచేస్తాయన్నది అతని వాదన. కానీ అప్పటికే పాట చాలా నెమ్మదిగా ఉందని, ఈ పాటను వినే ఓపిక ప్రేక్షకులకు ఉండదని అందరూ అభిప్రాయం వ్యక్తం చేయటంతో ఖేమ్‍చంద్ ప్రకాశ్‍కు తన పాటపై విశ్వాసం సడలింది. కానీ కమల్ అమ్రోహి ఒత్తిడి వల్ల పాట ముందు రెండు పంక్తులు జోడించాడు. పాటలో వ్యక్తి దూరం నుంచి పాడుతూ దగ్గరకు వస్తున్న ఎఫెక్ట్ సాధించేందుకు లతను పాట పాడుతూ మైకు దగ్గరకు నడచి రమ్మన్నాడు. అనుకున్న ఎఫెక్ట్ సరిగ్గా వచ్చేవరకు ప్రాక్టీస్ చేయించాడు. పాట రికార్డయింది కానీ అది హిట్ అవుతుందో లేదోనన్న అవిశ్వాసం అతడిని పట్టి పీడించింది. ఇదే సినిమాలో లతతో ‘ముష్కిల్ హై బహుత్ ముష్కిల్’, ‘దిల్ నె ఫిర్ యాద్ కియా’ అనే మరో రెండు అద్భుతమైన పాటలను పాడించాడు ఖేమ్‌చంద్ ప్రకాశ్. అయితే విమర్శకుల ప్రకారం ఈ సినిమాలో అన్ని పాటలకన్నా అద్భుతమైన పాట రాజ్ కుమారి పాడిన “ఘబ్‌రాకె జో హమ్ సర్‍కొ టక్రాయే తో అఛ్చాహో!’. కానీ సినిమా విడుదలైన తరువాత ‘ఆయెగా అనెవాలా’ పాట సృజించిన తుఫాను ముందు మిగతా పాటలన్నీ కొట్టుకుపోయాయి. లత సూపర్ స్టార్ సింగర్ అయ్యేందుకు దారి తీసింది ‘ఆయేగా అనెవాలా’ పాట. అయితే తాను సృజించిన పాట సూపర్ హిట్ అవటం, ఏ లత స్వరం చక్కనిది అని వాదించి ఉద్యోగం వదులుకున్నాడో ఆ లత స్వరాన్ని ప్రేక్షకులు ఆదరించి ‘స్వరసామ్రాజ్ఞి’గా పట్టం కట్టటం చూడకుండానే మరణించాడు ఖేమ్‍చంద్ ప్రకాశ్. ఆయెగా ఆనేవాలా పాట ప్రేరణతో భవిష్యత్తులో పలు సంగీత దర్శకులు లతతో రహస్యమయమైన పాటలను పాడించారు. మైన్ తో కబ్ సే ఖడీ ఇస్ పార్ ( మధుమతి), కహిన్ దీప్ జలే కహిన్ దిల్ (బీస్ సాల్ బాద్) , ఝూం ఝూం ఢల్తీ రాత్ (కోహ్రా) , తేరే బినా జియా జాయేనా ( పర్దే కే పీఛే) వంటి అత్యద్భుతమయిన గీతాలు లతతో పాడించారు.

ఇలాంటి ఆత్మల గీతాలు పాడటం తనకు చాలా ఇష్టమనీ, అతి సులభంగా తానీ పాటలను పాడతాననీ లత ఇంటెర్వ్యూల్లో చెప్పింది. కారణమేమిటంటే, ఈ పాటల్లో నాయిక సరిగా కనపడదు. ఆత్మనో, దయ్యమో, లేక రహస్య భావన కలిగించటంకోసం లాంగ్ షాట్ లోనో నాయికను చూపుతారు. అందువల్ల, నాయిక రూపాన్ని, ఆమె హావభావాలనూ తాను పాట పాడేప్పుడు దృష్టిలో వుంచుకోవాల్సిన అవసరం వుండదు కాబట్టి, తాను తనలాగే పాడేపాటలివి అని అన్నది లత.

“నేను ఖేమ్‍చంద్ ప్రకాశ్, నౌషాద్‍లతో, గులామ్ హైదర్ కనుగొన్న లత స్వరంలోని గొప్పతనాన్ని ప్రపంచానికి ప్రదర్శించాను” అని ప్రఖ్యాత సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్ వ్యాఖ్యానించాడు.

ఇతర సంగీత దర్శకులు కొన్ని పాటలలోనే లత స్వరమాధుర్యాన్ని ప్రదర్శిస్తే ఖేమ్‍చంద్ ఒక్క మహల్ పాట ‘ఆయెగా ఆనెవాలా’తో లత స్వరంలోని మాధుర్యం విశ్వరూప ప్రదర్శన చేశాడు. అనిల్ బిశ్వాస్ వందపాటల్లో లత స్వరాన్ని సానబెట్టి తీర్చిదిద్దితే, నౌషాద్ వజ్రం లాంటి అమూల్యమైన లత స్వరం జిలుగు వెలుగులను ప్రపంచానికి ప్రదర్శించాడు.

లత నౌషాద్‍ను కలవటం, నౌషాద్ లత స్వరాన్ని మెచ్చటం గురించి ఈనాటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. నౌషాద్ ముందుగా లతను తొలిసారి ‘కోరస్’ లో పాడుతూంటే చూశాడు. అతని దగ్గర పనిచేసే కుర్రవాడు ఓ మరాఠీ అమ్మాయి బాగా పాడుతోందంటే కుతూహలం కొద్ది వెళ్ళి కోరస్ పాడుతున్న అమ్మాయిని చూశాడు నౌషాద్. ఓ రోజు గాయకుడు ముకేష్ తాను ఓ కొత్త గాయనితో యుగళగీతం పాడేనని, ఆమె బాగా పాడుతోందని, నౌషాద్ ఆమె స్వరం వినాలని లత గురించి నౌషాద్‍కు చెప్పాడు. ముకేష్ మాట విన్న లత, నౌషాద్ ను కలుస్తాను కానీ, పరీక్షకు కూచున్నట్టు అతనిముందు పాటను పాడను అని కచ్చితంగా చెప్పింది. నౌషాద్ అందుకు ఒప్పుకున్నాడు.

బహర్ ఆయీ , ఖిలి కలియాన్, హసే తారె , చలే ఆవో….

హమే జీనే నహీ దేతే, యె నజారె చలె ఆవో

1953 లో విడుదలైన అలిఫ్ లైలా సినిమాలో ఆశామాధుర్ పై చిత్రితమైన ఈ పరమాద్భుతమైన పాటను రూపొందించిన సంగీత దర్శకుడు శ్యామ్ సుందర్. హిందోళ రాగంలో కహరెవా తాళంలో సాహిర్ లుధియాన్వీ రచనకు సర్కస్ డ్రమ్స్ లయను అత్యంత సృజనాత్మకంగా జోడించిన ఈ పాట లత మంగేష్కర్ స్వరంలో మరపురాని మధురగీతంలా రూపొందింది.

నౌషాద్‍ను కలవమని ముకేష్ సూచించినప్పుడు తాను పాట పాడి వినిపించను అని లత అనటం వెనుక ఓ చేదు అనుభవం ఉంది. లతా మంగేష్కర్ అవకాశాల కోసం సంగీత దర్శకులను కలుస్తున్న క్రమంలో శ్యామ్ సుందర్‍ను కూడా కలిసింది. ఆయన స్వరం ఎలా ఉందో వినేందుకు పాడమంటే పాడింది. పాట విని ఎలాంటి స్పందనను ప్రదర్శించకుండా కనీసం బాగుంది, బాగాలేదు అనకుండా వెళ్ళిపోయాడు శ్యామ్ సుందర్ (తరువాత కొన్నాళ్ళకి శ్యామ్ సుందర్ నుంచి లతకు పిలుపు వచ్చింది). ఈలాంటి అనేక చేదు అనుభవాల వల్ల విసిగిపోయిన లత తాను ఎవరిముందు పరీక్షకు కూర్చున్నట్టు పాడనని నిశ్ఛయించుకుంది. పాట వినటం తన స్వరాన్ని తిరస్కరించటం లత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్న అంశం. అందుకే ఎవరైనా తన గొంతును వినాలనుకుంటే అప్పటికి రికార్డయిన పాటలు వినవచ్చని చెప్పటం ఆరంభించింది. అప్పటికి ఆమె గులామ్ హైదర్ పాటలు రికార్డ్ చేసింది. అందుకే ముకేష్ ఒకసారి నౌషాద్‍ను కలవమంటే లత ‘ఆయన ముందు నేను పాట పాడను’ అన్న నియమం విధించింది.

ఇదంతా విన్న నౌషాద్, లతను ఆమె నియమానుసారంగానే కలసేందుకు ఉత్సుకత చూపాడు. ఎందుకంటే అప్పటికే గులామ్ హైదర్ గుర్తించిన స్వరంగా లత పేరు మార్మోగుతుంది. కర్దార్ స్టూడియోలోని తన గదిలో లత అడుగుపెట్టగానే ఆమె స్వరాన్ని పొగిడేడు నౌషాద్. ఆమె పాట పాడే విధానాన్ని ప్రశంసించాడు. మామూలుగా మాటల నడుమ అన్నాడు “నేను నీ పాట పాడే విధానాన్ని కానీ, నీ స్వరాన్ని కానీ పరీక్షకు పెట్టటం లేదు. నువ్వు ఓ సంగీత దర్శకుడి ముందు కాదు, ఓ సంగీత ప్రేమికుడి ముందు పాడుతున్నాననుకొని ఒక పాట పాడ”మని అభ్యర్థించాడు. లత అంగీకరించింది. శ్యామ్ సుందర్ సంగీత దర్శకత్వంలో ‘లాహోర్’ సినిమాలో పాడిన “బహారే ఫిర్ భి ఆయెగీ” పాట పాడింది. అది విన్న నౌషాద్ ఆమెను ప్రశంసించాడు. అప్పుడు ఆమెతో ఒక “ఛోటా గానా” పాడించాలని నిశ్చయించాడు.

సినీ పరిశ్రమలో ‘ఛోటా గానా’ అంటే హీరో హీరోయిన్లు, ప్రధాన పాత్రధార్లు కాక, ఇతరులపై చిత్రితమయ్యే పాట. ఛోటా గానా బాగా పాడితే ‘బడా గానా’ పాడే అవకాశం వస్తుంది. ‘బడా గానా’ అంటే నాయికా నాయికలు కానీ ప్రధాన పాత్రలపై కానీ చిత్రితమయ్యే పాట. అయితే తాను పాడుతున్నది ఛోటా గానా అని గాయనీ గాయకులకు చెప్పేవాడు కాదు నౌషాద్. ఛోటా గానా పరీక్షలో లత పాస్ అవటంతో బడా గానా వైపు మళ్లాడు నౌషాద్.

ఆ సమయంలో ‘అందాజ్’ సినిమా తయారవుతోంది. ఆ కాలంలో మల్టీస్టారర్ సినిమా. ప్రతిష్ఠాత్మకమైన సినిమా అది. మహబూబ్ ఖాన్ నిర్మిస్తున్న సినిమా. అందాజ్‍లో పాటలు లతతో పాడించాలని నౌషాద్ నిర్ణయించాడు. మహబూబ్ ఖాన్‍కూ నౌషాద్ కూ నడుమ చక్కని అవగాహన ఉంది. అందుకే నౌషాద్ నిర్ణయాన్ని మహబూబ్ ఖాన్ కాదనలేదు కానీ “జాగ్రత్త నీ నిర్ణయాన్ని నేను ప్రశ్నించను. కానీ మొదటి పాటనే ఉర్దూ గజల్. పాడుతున్నది మహారాష్ట్ర అమ్మాయి. సరిగ్గా పాడలేకపోతే ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఒక్కసారి పెద్ద బ్యానర్‌లో అవకాశం పోయిందన్నమాట అందరికీ తెలిస్తే ఆమె కెరీర్ దెబ్బ తింటుంది ఆలోచించుకో” అని హెచ్చరించాడు.

నౌషాద్‍కు లత ఆ క్లిష్టమైన ఉర్దూ గజల్ పాడగలదన్న నమ్మకం ఉంది. లతకు పాట నేర్పించటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. మొదటిరోజు సినిమా కథ వినిపించాడు. పాత్రల స్వభావాలు వివరించాడు. పాటల ప్రాధాన్యం బోధించాడు. పాట రాసి ఉన్న కాగితం ఇచ్చి “పాట చదువు. అర్థం చేసుకో. పదాల ఉచ్చారణను సాధన చేయి” అని చెప్పి పంపించాడు.

రెండవ రోజు పాటను కంఠస్థం చేయించాడు. “ప్రతి కవితనూ కవి ప్రత్యేకమైన ఛందస్సుతో రచిస్తాడు. పాటలోనే లయ ఉంటుంది. దాన్ని పట్టుకో. దీనికి సంగీత దర్శకుడు వేరే బాణీ కుదుర్చుతాడు. కానీ కవితలో అంతర్లీనంగా ఉన్న లయను పట్టుకోవటం ముఖ్యం” అని ఆ లయను పట్టుకునేట్టు చేశాడు. మరుసటి రోజు ఆమెకు ఆ కవితకు తాను కట్టిన బాణీని వినిపించాడు. కవితలోని లయకనుగుణంగా తాను కట్టిన బాణీని వినిపించాడు. ఆ బాణీలో పాడటం నేర్పించాడు. తరువాత పాటకు వాయిద్యాలు జోడించి, వాయిద్యాలతో పాడుతూ పాటలోని భావాన్ని ఇనుమడింప చేయటం నేర్పించాడు. ఇలా కొన్ని రోజులు రిహార్సల్ జరిగాయి. ప్రతిరోజూ గేయ రచయిత, దర్శకుడు, ఇతర అసిస్టెంట్లు పాటను విని సూచనలు చేయటం, అవి బాగుంటే పాటను అందుకు తదనుగుణంగా మార్చటం సాగుతూ వస్తుంది. ఎప్పుడైతే పాటలో ఇంకా మార్పులు చేర్పులు అవసరం లేదు, అన్నీ సరిగ్గా ఉన్నాయన్న నమ్మకం కుదిరిన తరువాత రికార్డింగ్‍కు టేకులు ఆరంభిస్తారు. కొన్ని టేకులైన తరువాత అందరూ బాగున్నదని అన్న పాట రికార్డును ఎంపిక చేస్తారు. ఇది నౌషాద్ పద్ధతి.

దాదాపుగా + పదిహేను ఇరవై రోజులు పట్టింది, ఆ పాట రికార్డింగ్ దశకు రావటానికి . తాను నేర్పిస్తున్నదాని కన్నా అధికంగా నేర్చుకోవటం, ఎన్నిసార్లు ప్రాక్టీసు చేయమన్నా విసుగు లేకుండా లత సాధన చేయటం నౌషాద్‍కు నచ్చింది. తన నిర్ణయం సరైనదేనన్న విశ్వాసం కలిగింది. రికార్డింగ్ రోజు నిశ్చయించాడు నౌషాద్. రికార్డింగ్ నేషనల్ స్టూడియోలో.

రికార్డింగ్ రోజు నిర్మాత, దర్శకులు, ఇతర పెద్దలందరినీ ప్రివ్యూ థియేటర్లలో లతకు వారు కనబడకుండా కూర్చోబెట్టాడు నౌషాద్. ఎందుకంటే ఇంతమంది పెద్దలు ఉండటం వల్ల లత నెర్వస్‍గా భావిస్తే పాట అభాసు పాలవటమే కాదు, నౌషాద్ పరువు కూడా పోతుంది. మళ్ళీ అయిదారు రిహార్సల్స్ అయిన తరువాత రికార్డింగ్ ఆరంభించాడు.

రికార్డింగ్ ఆరంభించేముందు నౌషాద్, లత చెవిలో చెప్పాడు “ఈ పాట బాణీ తెలిసింది మన ఇద్దరికే, మిగతా ఎవ్వరికీ ఏమీ తెలియదు. కాబట్టి మిగతా అంతా మూర్ఖులు. నేర్చుకున్నది నేర్చుకున్నట్టు పాడు” అని.

ఉఠాయేజా ఉన్ కే సితం

లత అద్భుతంగా పాడింది. పాట విన్నవారంతా ముగ్ధులైపోయారు. లతను ప్రశంసించారు. లతను అభినందించారు. పాటలోని పదాలను లత పలికిన తీరు, పదాలను సాగదీసిన తీరు, కొన్ని పదాలను పట్టి ఆగి పలికిన తీరును ప్రశంసించారు. ‘ఈ అమ్మాయికి అద్భుతమైన భవిష్యత్తు ఉంద’ని అభిప్రాయపడ్దారు. ఆ పాట హిందీ సినీగీతాల ప్రపంచంలో అత్యద్భుతమైన గజ్‍ల్‍గా ప్రసిద్ధికెక్కిన గజల్ ‘ఉఠాయేజా ఉన్ కే సితం’.

“అందాజ్” సినిమా పాటల విడుదలతో లత అతి సులభంగా అగ్రస్థాయి గాయనిగా గుర్తింపు పొందింది. అందాజ్ సినిమా పాటలు అత్యద్భుతం అని అందరూ అనుకుంటూంటే అందాజ్ సినిమా నిర్మాత, దర్శకుడు మహబూబ్ ఖాన్ మాత్రం” బర్సాత్ సినిమా పాటలముందు అందాజ్ సినిమా పాటలు తేలిపోయాయి” అని బాధపడ్డాడు. అంటే, 1949లో లత పాటలున్న సినిమాలు ఒకదాన్ని మించినది మరొకటి అన్నమాట.

1949తో హిందీ సినీ గీతాల యుగం ప్రారంభమయింది. అంతవరకూ ఏయే గాయని ఎన్నిపాటలు పాడింది అని లెక్కించేవారు. కానీ 1949 తరువాత నుంచీ లత పాడిన పాటలు, ఇతర గాయనిల పాటలుగా హిందీ సినిమాల పాటలను ఎంచటం ప్రారంభమయింది. 1952 వరకూ గీతారాయ్ లతకు ధీటుగా పాటలు పాడింది. కానీ ఆ తరువాత ఆమెకు గురుదత్‍తో వివాహమవటం – గీతారాయ్, గీతాదత్‍గా మారటంతో ఆమె అదృష్టం కూడా మారిపోయింది. గురుదత్ అప్పటికి పైకి వస్తున్న కళాకారుడు. గీతాదత్ అగ్రశ్రేణి గాయని. దాంతో అసూయవల్ల గురుదత్ గీతాదత్‍ను తన సినిమాల్లోనే పాడమని నిర్భందించటం, ఇతరులకు పాడనీయకపోవటంతో గీతాదత్ కెరీర్ దెబ్బతిన్నది. తరువాత వారిరువురి నడుమ బేధాభిప్రాయాలు పెరగటం, గురుదత్ వహీదా రహమాన్ ప్రేమలో వెర్రిగా పడటం వారి జీవితాలపైనే కాదు , ఆమె కెరీర్ పైన కూడా ప్రభావం చూపింది. కుంభవృష్టిలా ఆరంభమై, చిన్న వర్షమై, చినుకులుగా మారి వర్షం ఆగిపోయినట్టు ఆరంభంలోనే అగ్రశ్రేణి గాయనిగా నిలిచిన గీతారాయ్, గీతాదత్‍గా అయినప్పటి నుంచి పాటలు తగ్గి చివరికి పాటలు లేని స్థితికి దిగజారింది. ఈ ఖాళీని ఆశా భోస్లే భర్తీ చేసింది. దాంతో గీతాదత్ తిరిగిరాలేని పరిస్థితి ఏర్పడింది. ఆమె పాడాలన్నా పాటలు ఇచ్చేవారు లేని దుస్థితి నెలకొంది. ఇదే సమయానికి లత ఒక్కో సంగీత దర్శకుడిని తన పాటలతో మైమరపిస్తూ, హిట్ సినిమాలలో పాటలు పాడుతూ, పాటలు తప్ప మరో ప్రపంచం పట్టించుకోకుండా అగ్రశేణి గాయనిగా, ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది.

1950 సంవత్సరం నుంచీ స్థిరపడిన లత యుగం గురించి చర్చించేకన్నా ముందు 1946 నుండి 1949 నడుమ లతతో కొన్ని చక్కని పాటలు పాడించినా అంతగా తెలియని సంగీత దర్శకులు; లత పాడిన అద్భుతమైన పాటలను పరామర్శిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది.

(వచ్చేవారం)