[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత శ్రీ ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారు రచించిన 30 మినీ కథల సంపుటి ఇది.
ఇందులో 1. పొట్టి మొగుడు 2. ముదురు 3. ట్రిమ్మింగ్ 4. స్వచ్ఛతే సేవ 5. యోగా నేర్పబడును 6. ఐడియా 7. స్కానింగ్ 8. దానికదే దీనికిదే 9. దొంగ- భక్తుడు 10. బదిలీ 11. వడ్ల ఒలుపు 12. రాజ’కీ’యం 13. శల్య వైద్యుదు 14. నాటు కోడి 15. మిక్చర్ పొట్లం 16. మ్యాచింగ్ 17. దళారి 18. వ్యర్థంతో (లో) అర్థం 19. జజ్జనక 20. అనాథ(?) శవం 21. (మైనర్) మమ్మీ 22. ఓటు-నోటు 23. సంతకం 24. దూరపు కొండలు 25. బంద్ 26. ‘చెక్’ డ్యాం 27. నే(నీ)తి బీరకాయ 28. ఉతుకుడు 29. రైటర్ 30. భలే బర్త్ డే – అనే కథలు ఉన్నాయి.
***
“రచయిత ఆర్.సి. కృష్ణస్వామి రాజు కథలు చాలా కాలంగా చదువుతున్నాను. సమాజ తత్వాన్ని, సగటు మనిషి మనస్తత్వాన్ని కాచి వడబోసిన అనుభవం ప్రతి కథలో రంగరించడం ఆయన పద్ధతి. వ్యంగ్య హాస్యాల తాళింపు కూడా వేయడం వల్ల ‘పకోడీ పొట్లాలు’, ‘మిక్చర్ పొట్లాలు’ ఆయన కథల అంగడి నుంచి మనకు రవాణా అవుతున్నాయి. మనకు మనసు ఊరిస్తుంటాయి. చదువరులకు మంచి అనుభూతి పంచుతూ ఉంటాయి. అదీగాక ‘సూక్ష్మంలో మోక్షం’ ఆయన విధానం అయినందున ఓ గంటలో కరకరలాడించేయవచ్చు.
ప్రస్తుత ‘మిక్చర్ పొట్లం’ గురించి చెప్పాలంటే మొత్తం 30 కథలు ఉన్నాయి.
ఎక్కడో ఒకటీ అరా మామూలుగా ఉన్నా, దాదాపు అన్ని కథలూ మనకెన్నో అనుభవాలు బోధిస్తాయి. మనం రోజూ చూసే నిత్య సత్యాలనే కథల రూపంలో కొంచం వ్యంగ్యం పాళ్ళు దట్టించడం వల్ల ఆయన కథలు ఒకసారి చదివితే త్వరగా మరిచిపోలేం.
మరచి పోలేనివే కదా మంచి కథలు అంటే?
ఆ లెక్కన రాజుగారి కథలు మంచివి. సమకాలీనమైనవి.” అన్నారు శ్రీ చంద్ర ప్రతాప్ కంతేటి తమ ముందుమాట ‘చతురత, గడుసుదనం ఈ కథలకు ప్రాణం!’లో.
***
“విరివిగా కథలు రాస్తూ, బహుమతులు గెలుస్తూ, కథల రాజుగా ఖ్యాతి గాంచిన కృష్ణస్వామిరాజు గారి తాజా మినీ కథల ‘మిక్చర్ పొట్లం’ ఇది.
చిత్తూరు జిల్లా మట్టి వాసనలతో, అక్కడి భాష, యాస సాగసులతో చక్కని సామెతల జీడిపప్పు కలిపిన చిన్న కథలు. అవడానికివి మినీకథలే గాని, మెనీ ముఖాలున్న కథలు. ఇందులోని ప్రతీ కథా ప్రత్యేకమైనదే అయినా, కొన్ని మరీ మరీ ప్రత్యేకం.
~
సరదా సరదాగా సాగిన ఈ కథల మిక్చర్, మసాలా ఘాటు కన్నా చముక్కులూ… చురుక్కులూ… హాసాలూ… పరిహాసాలు… అధికం. ఇవన్నీ కూడా తప్పక రుచి చూసి ఆస్వాదించాల్సినవే.
నిత్యం మనం తినే, చూసే, చదివే సంఘటనల్లోంచి చక్కని, చిక్కని కథల్ని పిండిన రాజుగారికి అభినందనలు.” అన్నారు శ్రీ సింహప్రసాద్ తమ అభిప్రాయం ‘హాస్య గుళికల పొట్లం’లో.
***
మిక్చర్ పొట్లం (మినీ కథలు)
రచన: ఆర్.సి. కృష్ణస్వామి రాజు
పేజీలు: 115
వెల: ₹ 125
ముద్రణ: మల్లెతీగలు, విజయవాడ
ప్రతులకు:
ఆర్ సి కృష్ణ స్వామి రాజు
ఫోన్ 9393662821.
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు