[dropcap]పు[/dropcap]వ్వు మీద
మంచు బిందువులు రాలుతున్నాయి
రివ్వున ఎగిరొచ్చి వాలిన సీతాకోకచిలుక బరువుకి
నేలమీదకు
పువ్వు రాలిపోయింది
తడిసిన నేలపై
ఓ మరణ వాక్యం రాసింది
రాలిపోయే జీవితం
బతికున్నంతవరకూ పరిమళిస్తుండమని
ఎప్పుడు ఏ ఉపద్రవం
ముంచుకొస్తుందో ఎవరికెరుక
ఓ సునామీ రావొచ్చు
ఓ భూకంపం వణుకు పుట్టించొచ్చు
ఓ యుద్ధం కలవరానికి గురిచేయోచ్చు
ఓ స్కైలాబ్ భయపెట్టొచ్చు
ఓ కరోనా చుట్టుముట్టొచ్చు
క్షణక్షణ ప్రమాద జీవితం
ఏ క్షణం కాక్షణం పుటం పెట్టుకోవడం
అలవాటుపడ్డ ప్రమాదాలకు
జీవితానికి ముందుచూపు కరువైంది
పగిలిపోయే వరకై నీటిబుడగ
నదిమీద స్వారీ చేస్తూనే వుంటుంది
కనిపెట్టుకుంటూ
శత్రువుకు కళ్ళెం వేసే వ్యూహం పన్నుతుంటుంది
అకస్మాత్తుగా
మేఘాలు సూర్యుడ్ని చుట్టుముట్టాయి
కురుస్తున్న చినుకుల్లో
త్యాగం పరిమళిస్తున్నది