వైకుంఠపాళి-11

0
10

[dropcap]“ఏ[/dropcap]మిటలా నిలబడి కిటికీలో నుండి చూస్తున్నారు?” అంటూ లక్ష్మి లోపలికి వచ్చింది. ఆమె చేతిలో కొత్త మేగజైన్స్ ఏవో వున్నాయి.

“ఇదిగోండి మీకు పత్రికలూ, సిగరెట్లూ” అంటూ అందించింది.

అతను అవి అందుకుంటూ ‘ఇలా నేనెప్పుడూ ఈమె కోసం ఏవీ తీసుకురాలేదు కదా!’ అనుకున్నాడు.

“బాబిగాడు బాగా అల్లరి చేసాడా?” అడుగుతూ వాడిని ఎత్తుకుంది.

వాసుదేవరావుకి తను ఆఫీసు నుండి వచ్చి ఏం చేసేవాడో గుర్తొచ్చింది. ఫ్రెండ్స్‌తో పేకాటకి వెళ్ళిపోయేవాడు. అక్కడ మందు కొట్టి మాళవిక దగ్గరకెళ్ళి ఏ అర్ధరాత్రో, తెల్లవారు ఝామునో ఇల్లు చేరేవాడు. లక్ష్మి లేచి “భోజనం చెయ్యండీ” అని బ్రతిమాలితే, విసుక్కుని, తిట్టి నిద్రపోయేవాడు.

కానీ లక్ష్మి ఏం చేస్తోందీ?

లక్ష్మి బెండకాయలు, కత్తిపీటా తెచ్చుకుని కూర్చుంది.

“పేపర్లూ, రీఫిల్సూ వున్నాయా? అయిపోతే చెప్పండి, రేపు తెస్తాను” అంది.

ఆమెతో పోట్లాడాలన్నా, జగడం వేసుకోవాలన్నా ఏ కారణాన వేసుకోవాలో అతనికి అర్థం కావడం లేదు.

నుదుటికి పట్టిన చెమట చీర చెంగుతో అద్దుకుంటూ ఆమె మధ్య మధ్యలో బాబిగాడిని ఆడిస్తూ వంట చేస్తోంది.

వాసుదేవరావు చేతులు నులుముకుంటూ పడక కుర్చీలో కూర్చున్నాడు.

“అలా తోచక బాధపడే బదులు టీ.వీ. చూడచ్చు కదా… అదుగో స్టార్ మూవీస్‍లో ‘మిస్టర్ మామ్’ వస్తోంది” అంటూ ఆన్ చేసింది లక్ష్మి.

వాసుదేవరావు ఆ సినిమా చూస్తూ కూర్చున్నాడు. అతనికి తనకి తోచనప్పుడు ఏం చెయ్యాలో అర్థం అయింది.

మరునాడు లక్ష్మి వచ్చేసరికి ఇల్లంతా సర్ది, శుభ్రంగా వుంది.

“ఈ పనిపిల్లకి ఇంత బుద్ధి ఎప్పుడొచ్చిందీ!” ఆశ్చర్యపోతూ వచ్చింది లక్ష్మి.

“పనిపిల్ల కాదు, నేనే చేసాను” అంటూ కాఫీ కప్పుతో ఎదురెళ్ళాడు వాసుదేవరావు.

“మీరు చేసారా? ఎందుకూ?” బోలెడు ఆశ్చర్యపోయింది లక్ష్మి.

“వంట కూడా చేసాను. కూర్చుని తినడం నాకు మొహమాటంగా వుంది లక్ష్మీ!” అన్నాడు.

లక్ష్మి మాట్లాడలేదు. వద్దనీ అనలేదు.

***

“ఎవరమ్మా నువ్వు” అన్నాడు రామనాధం.

మాళవిక నవ్వి, “మీతో పనుండి వచ్చాను. పర్సనల్‍గా మాట్లాడాలి సార్!” అంది.

రామనాధం తనతో మాట్లాడ్తున్న వాళ్ళతో “మళ్ళీ కలుద్దాం” అని చేతులు కలిపాడు.

బట్టతలతో అరవై దాక వయసున్నట్టు కనబడుతున్నాడు రామనాధం.

మాళవిక ఆయన వైపు అదోలా చూసి “మీరు నాకో సాయం చెయ్యాలి. మీ రుణం ఉంచుకోను…” అంది.

రామనాధం ఆమెని కొలిచినట్లు చూసాడు.

“నా పేరు మాళవిక…” అంది. అది ఉపోద్ఘాతం కాదు. అలా అన్నాకా ఆమె మాట్లాడలేదు. ఆమె కాలు ఆయన కాలిని తాకింది.

“ఓ… ప్రఖ్యాత రచయిత్రి మాళవికా?” అన్నాడు. ఆయనకి ఆమె వచ్చిన పని అర్థమైనట్లు చూసాడు.

***

మాళవిక కృష్ణమూర్తిని కూడా కలిసింది.

ఆ రాత్రి రాజశేఖరంతో “పని అయ్యేటట్లే వుంది. ఇంకో జడ్జి ఎవరుటా?” అంది.

రాజశేఖరం చెప్పిన పేరు విని నోరు తెరిచి వుండిపోయింది.

“ఏయ్… ఏమిటలా అయిపోయావు? అతను నీకు బాగా తెలిసినవాడే అనుకుంట!” అన్నాడు.

“ఆ. బాగా!” అంది.

ఇన్నాళ్ళకి మళ్ళీ వాసుదేవరావుతో పని పడడం ఆమెకి కాస్త ఇబ్బందిగానే అనిపించింది.

మాళవిక వాసుదేవరావు ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళేసరికీ అతను బాబుకి పాలు పడ్తూ కనిపించాడు.

మాళవిక గట్టిగా క్లాప్స్ కొట్టి “మీరిలా కనిపిస్తుంటే నాలాంటి ఫెమినిస్ట్‌కి ఎంత సంతోషంగా వుంటుందో తెలుసా?” అంది.

వాసుదేవరావు ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు. “నువ్వా?” అన్నాడు.

“ఏం రాకూడదా? నాకా హక్కు లేదా?” చనువుగా అడుగుతూ లోపలికి వచ్చేసింది.

వాసుదేవరావు ఆమె అలంకరణని పరికిస్తూ నిలబడ్డాడు.

కాళ్ళకి హవాయి చెప్పులేసుకుని, చౌకబారు పౌడరు చెంపలకి అద్దుకుని, వెలసిన ఓణీతో తన పత్రికాఫీసులో అడుగుపెట్టిన ఆ మాళవికేనా ఈ మాళవిక అనిపించింది!

ఇంపోర్టెడ్ ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ సుగంధాలని విరజిమ్ముతూ, దేవతా వస్త్రం లాంటి అతి పలచని సిల్కు శారీలో ఫ్రెంచ్ నాట్ వేసుకుని, అప్పుడే ఫేషియల్ చేసుకొస్తున్నట్లుగా ఫ్రెష్‌గా వుంది మాళవిక.

“బాబు తల్లి ఎక్కడికెళ్ళిందీ?” లోపలికి చూస్తూ అడిగింది.

వాసుదేవరావు మౌనంగా బాబుని వుయ్యాలలో పడుకోబెట్టాడు.

“ఇంట్లో లేదా?” మళ్ళీ అడిగింది.

“లేదు… ఆఫీసుకెళ్ళింది” చెప్పాడు.

“ఓ… చూడబోతే నా కన్నా పెద్ద ఫెమినిస్టులా వుంది” నవ్వుతూ అంది.

“నీకన్నా కాదు… నిజమైన ఫెమినిస్టు” గట్టిగా అన్నాడు.

“ఆ సంగతి మిమ్మల్ని చూడగానే తెలిసింది లెండి” అంది.

“ఇంతకీ నువ్వెందుకొచ్చినట్టూ?” అడిగాడు.

“పాత స్నేహాలు, అనుభవాలూ మరవాలన్నా ఒకంతట మరపు రావు” అంది.

“ఎస్టీమ్ కార్లూ, ఏ.సీ. మేడలూ, ఫైవ్ స్టార్ హోటళ్ళూ కూడా వాటిని మరిపించలేదా? నీ సంగతి తెలిసీ నన్ను నమ్మమంటావా?” హేళనగా అడిగాడు.

మాళవిక అతని దగ్గరగా వచ్చి రెండు చేతులు పట్టుకుంది. “నన్ను నమ్మండి. మట్టిబొమ్మ లాంటి నన్ను ఇంతదాకా తెచ్చి ఈ పేరూ డబ్బూకి కారణమైనది మీరే! ఈ విషయం నేను ఒక్క రాత్రి కూడా మరువలేదు” అంది.

“అందుకేనా? పనివాడి చేత బైటకి గెంటించావు?” చేతులు విడిపించుకుటూ అన్నాడు.

మాళవిక బాధగా చూసింది. ఆ తర్వాత రెండు చేతుల్లో మొహాన్ని దాచుకుని ఏడవడం ప్రారంభించింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here