అంతరిక్షంలో ఆరు గంటలు

0
3

[box type=’note’ fontsize=’16’] ఉగాది 2022 సందర్భంగా సంచిక నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథ. [/box]

[dropcap]కా[/dropcap]శీపతిగారి పేరు మీరు వినే ఉంటారు. ఆయన, ఒక సుప్రసిద్ధ రచయిత. ఈ రోజుకి, వెయ్యికి పైగా కథలు, మూడు వందల తొమ్మిది నవలలు, రెండువందల ముఫై ఎనిమిది కవితలు, ఆయన I Pad నుండి జారేయి. ఆయన రాసిన కథలు, నూరు శాతం, బహుమతులు పొందేయి. కాశీపతిగారి నూటతొంభైయొక్క నవలలు, వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషలలో వెండితెరకెక్కేయి. ఆయనను అలంకరించిన బిరుదులు; అయ్యో, సంఖ్య మరిచిపోయేనండి; క్షమించండి కాశీపతిగారు; అవి కనీసం మూడంకెలలో ఉంటాయి. కవిత్రయం రచించిన భారతం, పద్దెనిమిది పర్వాలు, ఆయన, ఆశువుగా సంస్కృతంలోనికి అనువాదం చేసేరు. అవి, వివిధ విశ్వవిద్యాలయాలలో, M.A. సంస్కృతం విద్యార్థులకు, పాఠ్య గ్రంథాలుగా, ఎంపికయ్యేయి. ఆయన రచనలలో,  సమాజాన్ని పీడిస్తున్న సమస్యలు, కొట్టొచ్చినట్లు ప్రతిబింబిస్తాయి. లంచగొండితనం. స్త్రీలపట్ల అత్యాచారాలు, ఆయన రచనల, ముఖ్య ఇతివృత్తాలు.

కాశీపతిగారు, కొత్తగా ఓ కథ రాస్తున్నారు.  ఆ కథ, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాలను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నారు. కథలోనికి, క్లుప్తంగా వెళదామా.

జనాకర్షణ బ్యాంకు, ఓ పెద్ద బ్యాంకు. దాని శాఖలు, దేశంలో నలుమూలలా వ్యాపించి ఉన్నాయి. వాటిలో, ఒక అతి పెద్ద శాఖ, పాడేరు లో ఉంది. ఆ శాఖలో, శఠగోపం అతి పెద్ద ఖాతాదారు. శఠగోపం, అంతర్జాతీయ, ఎగుమతి దిగుమతుల వ్యాపారి. అతగాడి, శఠగోపం ఇంటర్నేషనల్ కంపెని,  ఐసులేండ్ లోని అదృశ్యా కంపెనీ నుండి, అప్పడాలు, వడియాలు, చక్కిలాలు, దిగుమతి చేసుకొని, చైనాలోని, డ్యూప్ కిన్ అనే కంపెనీకి, ఎగుమతి చేస్తూ ఉంటాడు. ఆ వ్యాపారంలో, శఠగోపానికి, బ్యాంకునుండి letters of credit సదుపాయం ఉంది. వివరాలలోనికి వెళ్లకుండా, ఆ సదుపాయం సారాంశం ఏమిటంటే; అదృశ్యా కంపెనీనుండి, దిగుమతి చేసుకొన్న సరుకు మూల్యం, శఠగోపం ఇంటర్నేషనల్ కంపెనీ, చెల్లించకపోతే, జనాకర్షణా బ్యాంకు, ఆ మొత్తం, అదృశ్యా కంపెనీకి చెల్లించవలసి ఉంటుంది.

Letters of credit జారీ చెయ్యడంలో, ఎన్నో నియమాలు, నిబంధనలు ఉంటాయి. జరిగింది ఏమిటంటే, జనాకర్షణా బ్యాంకు మేనేజరు భజగోవిందం, ఆ నియమాలిని, నిబంధనలని, తుంగలో తొక్కి, శఠగోపం ఇంటర్నేషనల్ కంపెనీకి, లెఖా, జమా లేకుండా, L.O.C. లు, ఎడా ఫెడా జారీ చేసేడు. అది, అజ్ఞానం వల్ల కాదండోయ్. పాడేరులోని తమ బ్రాంచిలో జరుగుతున్న వ్యవహారం, మల్కనగిరిలోని బ్యాంకు హెడ్డాఫీసు వారికి తెలియకుండా ఉండేటట్లు, భజగోవిందం అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాడు. కోట్లు, చేతులు మారేయి. భజగోవిందం వద్ద, నల్ల ధనం బాగా పోగయింది.

‘డేమిట్; కథ అడ్డం తిరిగింది.’ ఏమిటయిందంటారా. కథలో , మన భజగోవిందం, అడ్డంగా దొరికిపోయేడండి. ‘ఎలాగా’ అంటారా.

శఠగోపం ఇంటర్నేషనల్ కంపెనీ, అదృశ్యా కంపెనీకి, 5200 కోట్లకి, ఎగనామం పెట్టింది. వాళ్ళు, L.O.C. లను అమలు పరచుకొన్నారు. ముక్కు పిండి, డబ్బు, జనాకర్షణా బ్యాంకు నుండి, అణా పైసలతో  వసూలు చేసుకొన్నారు. బ్యాంకు హెడ్డాఫీసులో బాంబు పేలింది. తెల్లవారేసరికి, ప్రింటు, T.V. మీడియాల్లో, ‘జనాకర్షణా బ్యాంకు, పాడేరు బ్రాంచిలో, పదివేలకోట్ల కుంభకోణం.’ మేనేజరు, భజగోవిందం, పరారీలో ఉన్నాడు.’ అని, ఒకటే హోరు. నిజానికి, భజగోవిందం పరారీలో లేడు. అది మీడియా హైప్.

భజగోవిందం, సస్పెండయ్యేడు.

కుంభకోణం వివరాలు తెలుసుకోడానికి, బ్యాంకు, జనరల్  మేనేజరు నేతృత్వంలో, ఒక పెద్ద కమిటీని వేసింది. భజగోవిందం, బ్యాంకుకు మోసం చేసేడని, ఎంక్వైరీ కమిటీ, తేల్చి చెప్పింది.

కాశీపతిగారి కథ, అక్కడదాకా వచ్చిందండి.

బ్యాంకు లో జరుగుతున్న కుంభకోణం గురించి, కాశీపతిగారు మొదటిసారిగా కథ రాస్తున్నారు. అందుచేత, ప్రతీ ఘట్టాన్ని రాత్రి, పగలు, ఆలోచించి రాస్తున్నారు.

భజగోవిందానికి ఏ శిక్ష వెయ్యాలా, అని, కాశీపతిగారు దీర్ఘాలోచనలో పడ్డారు.

“అర్ధరాత్రవుతున్నాదండి, అదేదో అక్కడకు ఆపి పడుక్కోండి.” అని, భార్య సలహా ఇవ్వడంతో, భజగోవిందం శిక్ష గూర్చి, అలోచించి మర్నాడు రాద్దామని, కాశీపతిగారు, I Pad ని షట్ డౌన్ చేసి, నిద్రపోయేరు.

కథ ముందుకు వెళ్ళింది.

కాశీపతిగారు, ఓ నిశ్చయానికి వచ్చేరు. ఆయన వేళ్ళు,  I Pad మీద, టకటకా నడిచేయి.

‘ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ ఆధారంగా, బ్యాంకు భజగోవిందాన్ని డిస్మిస్ చేసింది.’ అని, స్క్రీను మీద కనిపించగానే,

“కాశీపతీ, ఆగు.” అనే కేక విని, ‘ఎవరా’ అని, రాస్తున్న కథ ఆపి, ముందుకు చూసేడు, కాశీపతి.

ఎదురుగా, లీలగా ఎవరో కనిపించేరు. ఆ వెనక, మరికొందరు లీలగా అగుపడ్డారు, కాశీపతికి.

“ఎవరు నువ్వు.” అని, కళ్ళజోడు సద్దుకొని, ఆ, కనీ కనపడని, వ్యక్తినడిగేడు, కాశీపతి.

“నేను, భజగోవిందాన్ని.” అని, బిగ్గరగా వచ్చింది, సమాధానం.

“నీ వెనకన ఉన్నవాళ్ళందరూ ఎవరు.”

“నువ్వు రాసిన కథలలో, ఎవరెవరి గూర్చి చెడ్డగా రాసేవో, వాళ్ళందరూ నాతో వచ్చేరు.”

“నువ్వెందుకొచ్చేవ్ ఇక్కడికి.”

“ముందు నువ్వు ఆ కథ ఆపు.” దమాయించి ఆజ్ఞాపించేడు, భజగోవిందం.

“ఎందుకు.” అంతకన్నా దమాయించి అడిగేడు, కాశీపతి.

“నన్ను డిస్మిస్ చెయ్యడం రాజ్యాంగ విరుద్ధం.”

“నీ మొహం; రాజ్యాంగవిరుద్ధమేమిటి. ఎంక్వైరీ కమిటీ సభ్యులందరు, ఏకగ్రీవంగా తీర్మానించేరు.”

“నువ్వు ఒక బోగస్ కమిటీని ఏర్పాటు చేసేవ్.”

“బోగస్ కమిటీ ఏమిటి. బ్యాంకులో  సీనియరు మోస్ట్ జనరల్ మేనేజరు, కమిటీ చైర్మన్. మిగిలిన పదిమంది, క్రిమినల్ ఇన్వెస్టిగేషనులో నిష్ణాతులు.”

అది వినగానే, భజగోవిందం విరగబడి నవ్వేడు.

“దేనికోసం ఆ వెకిలి నవ్వు. ఆపు; ఆ వెర్రి చేష్టలు.” కాశీపతి, హూంకరించేడు.

భజగోవిందం రెచ్చిపోయేడు.  లీలగా తన వెనకనున్నవారితో,

“వినండిరా; ఆ కమిటీలో నిష్ణాతులు ఎవరో తెలుసా.(పదిమంది మెంబర్ల పేర్లు, వెటకారంగా చెబుతూ) వీళ్ళందరూ, 150 సంవత్సరాలనుండి బైలు మీద ఉన్నారు. నలుగురు చంద్రమండలానికి పారిపోయేరు. మిగిలిన ఆరుగురు, ఎక్కడున్నారో తెలుసా.” అని, భజగోవిందం చెప్పబోతూంటే,

“ఎక్కడున్నారురా.” లీలగా వెనకనున్నవారిలో ఒకడి ప్రశ్న.

“ఈ మధ్య, నా మేనల్లుడు భాస్కరుడు, భూతద్దంతో ఆకాశంలోకి చూస్తూ, నన్ను పిలిచి, ‘తాతా; నేనొక కొత్త గ్రహాన్ని కనిపెట్టేను; చూడు.’ అని, భూతద్దం నా కళ్ళ ముందు పెట్టేడు. ఆకాశంలో ఎప్పుడూ చూడని వింత చూసేను. సూర్యుడికి అవతల, ఓ పే…ద్ద గ్రహం కనిపించింది. అది గిర్రున తిరుగుతూ, కిందకి మీదకి గెంతుతున్నాది. అక్కడ విచిత్రమయిన మనుషులు కనిపించేరు. మనకి కళ్ళున్న చోట, వాళ్లకి ఏనుగు చెవులంత చెవులు, మనకి చెవులున్న చోట, వాళ్లకి గుడ్లగూబలుకున్నటువంటి కళ్ళు, నెత్తిమీద నోరు, ఉన్నాయి. అలా ఆశ్చర్యపోయి చూస్తూంటే; మీకు చెప్పేనే; ఆరుగురు కమిటీ మెంబర్లు, అక్కడ తాగి తందనాలాడుతూ కనిపించేరు.” అని, కమిటీ మెంబర్ల లొకేషను, భజగోవిందం వివరంగా చెప్పేడు.

“కాశీపతీ, కమిటీలో పదిమంది, భూమండలం మీదే లేరుగదా. మీటింగులు ఎలా జరిగేయయ్యా.” లీలగా ఉన్న మరొకని, క్రాస్ ఎక్జామినేషన్.

“నువ్వు ఇంకా త్రేతాయుగంలో ఉన్నావ్. నీకు, ప్రపంచంలో మీటింగులు ఎలా జరుగుతున్నాయో తెలీదు. ప్రపంచమంతా ఇప్పుడు ‘జూమ్’. ఓరి, శుద్ధ బుద్ధావతారం, మీటింగులన్నీ జూమ్ లో జరిగేయి. అవి చాలా ట్రేన్స్పరెంటుగా, టెలికాస్ట్ గూడా జరిగేయి.”

“కమిటీ మెంబర్ల అర్హత గూర్చి విన్నారు గదా. ఆ కమిటీ ఛైర్మన్, ఎవరో తెలుసా. లంచాలు తినడంలో, సీనియరు మోస్ట్ జనరల్ మేనేజరు సర్వభక్షకరావు.” అని, భజగోవిందం తన సహచరులకు వికట ధోరణిలో చెప్పేడు.

“కాశీపతి, అలాంటి దగుల్బాజీ వాళ్ళందరిని, కమిటీలో ఎలా వేసేరయ్యా.” మరొక  ప్రశ్న, భజగోవిందం వెనుకనున్న గుంపులోనుండి వచ్చింది.

“కమిటీలో ఎవరుండాలి, అనేది బ్యాంకు నిర్ణయం. దాన్ని ప్రశ్నించడానికి, ఇటు పధ్నాలుగు లోకాలలోను, అటు పధ్నాలుగు లోకాలలోను ఎవరికీ అధికారం లేదని, బ్యాంకింగ్ వేదాలలో రాసి ఉంది. తెలిసీ తెలియకుండా, నోటికొచ్చినట్లు వాగకండి.” అని కాశీపతి, వార్నింగు ఇచ్చేడు.

“మా గురువుగారు, తెలిసీతెలియక ఏవో చిన్న తప్పులు చేస్తే, ఆయన్ని బోను ఎక్కించేవు గాని, బ్యాంకుకే ఎగనామం పెడుతున్న, ఆ జనరలు మేనేజరు మీద ఒక్క సెంటెన్సయినా రాసేవా.” అని, భజగోవిందం వెనకనున్న భజంత్రీగాళ్లలో ఒకడు, విరుచుకుపడ్డాడు.

“ఆయనమీద, ఒక్క  కంప్లైంటయినా లేకుండా ఎలా రాస్తానయ్యా . అలా, ఏ ఆధారం లేకుండా రాస్తే,ఒక పెద్ద నేరమవుతుంది; తెలుసా. రచయితలు అన్ని కోణాల్లోను ఆలోచించి రాయకపోతే, మీ గురువుగారి దశే పడుతుంది.” అని, వెటకారంగా జవాబిచ్చేడు, కాశీపతి.

“గురూ, ఆ జి. ఎమ్. మీద మీరు కంప్లైంటు పెట్టలేదా.” మరొక భజంత్రీ, భజగోవిందాన్ని అడిగేడు.

“ఈ కథంతా, వెనకనుండి ఆ జి. ఎమ్. గాడే నడిపించించేడు. నన్ను ఇరికించీసేడు; వాడు తప్పుకున్నాడు.  అన్యాయంగా నేను బలిపశువునయిపోయేను.” అని, మొర పెట్టుకొన్నాడు, భజగోవిందం.

“ఇప్పుడు బోధపడిందా, మీకు; ఆ జి. ఎమ్. మీద ఏ కంప్లైంటు లేదని, మీ భజగోవిందమే ఒప్పుకొన్నాడా. అలాంటప్పుడు, అతడి మీద ఏమిటి రాస్తాను.” అని, కాశీపతి, భజగోవిందబృందాన్ని, నిలదీసి అడిగేడు.

“జి. ఎమ్. రెండో పెళ్ళికి, ఇరవై కోట్లు ఖర్చయిందని, మీడియా, రాత్రీ పగలు గొంతుక చించుకు అరుస్తూ ఉంటే, నీకు వినిపించలేదా.” అని, భజగోవిందం, కాశీపతిని కొట్టొచ్చినట్లు అడిగేడు.

“వాళ్ళ రేటింగ్సు కోసం, మీడియా వాళ్ళు, అదిగో పులి అంటే, ఇదిగో తోక అని, బాగా మసాలా జోడించి, గోరంతలు కొండంతలు చేసి ఏకరవు పెడతారు. నావంటి పరిపక్వత ఉన్నవాళ్లు, నిజం నిప్పులాగ కనిపిస్తే గాని, దాని జోలికి వెళ్ళరు. తెలిసిందా.” అని, కాశీపతి స్పష్టం చేసేడు.

“ఆ జి. ఎమ్. గాడు, ఈ కాశీపతి నోరు కట్టీసుంటాడు. అందుకే, ఏవో డొంకతిరుగుడు సమాధానాలు చెప్తున్నాడురా.” అని, కాశీపతిమీద భజగోవిందం ఛార్జిషీటు ఫ్రేము చేసేడు.

“నీకేమైనా మతిపోయిందిరా. నామీదే బురద జల్లుతున్నావ్.” అని, కళ్ళు ఎర్ర జేసి, కాశీపతి కంఠం పెంచి, అరిచేడు.

భజగోవిందం వెనకన ఉన్నవాళ్లలో ఒకడు ముందుకు తోసుకు వచ్చి,

“నువ్వే, మావంటి అమాయకులుమీద బురదజల్లుతున్నావ్.” అని, కాశీపతి వైపు వేలు చూపిస్తూ గట్టిగా నోరు చేసుకొన్నాడు.

“నువ్వెవడివి.” కాశీపతి, అంతకన్నా నోరు చేసుకొని, అడిగేడు.

“నువ్వు రాసేవే కథ, ‘ఓట్లుకు నోట్లు’; ఆ కథ నీకు జ్ఞాపకం ఉందా.”

“జ్ఞాపకం ఉంది; అయితే ఏమిటంటావ్.”

“ఆ కథలో, ధర్మరాజుని నేను.”

“నువ్వెందుకొచ్చినట్లు.”

“నువ్వు నాకు చేసిన అన్యాయం, నీకు చెప్పాలని వచ్చేను.”

“నేను నీకు చేసిన అన్యాయమేమిటి.”

“నీకు ఎవరు చెప్పేరని, ఎలక్షన్లలో నేను కోట్లు కోట్లు ఖర్చుపెట్టి గెలిచేనని రాసేవ్.”

“నీ అపోజిషను కేండిడేట్స్ గోలపెట్టి అరిచేరు.”

“వాళ్లే, లెఖా జమా లేకుండా ఖర్చుపెట్టేరు. ఆ విషయం నువ్వెందుకు రాయలేదు.”

“ఓడిపోయినవాడు ఖర్చుపెట్టినదంతా గంగపాలే. జనం అది పట్టించుకోరు.”

“అంటే, నువ్వు నిజాలిని  భూమిలో  పాతర వేసి, కథలు రాస్తున్నావన్నమాట. ఛీ, నువ్వు నీచుడివి.” అని ధర్మరాజు ఛీదరించుకోగానే, కాశీపతికి ఒళ్ళు మండిపోయి,

“నన్ను, నీచుడువన్నావురా. నీకు పుట్టగతులుండవురా. ఉండండి చెత్త వెధవల్లారా. ఆ కథలన్నింటికి, రివైజుడు ఎడిషన్సు రాసి, వాటిలో మీ అందరికి ఉరిశిక్ష వేస్తాను. మీ దిక్కున్న చోట చెప్పుకోండి. ఎవరేమిటి చేస్తారో చూస్తాను.” అని, కాశీపతి ఆవేశంతో I Pad ఉన్న టేబిలు మీద బలం కొద్దీ గుద్దేడు. కాశీపతి గుద్దిన ఒత్తిడికి, దాని మీద ఉన్న I Pad, గది పైకప్పును చీల్చుకొని, అమాంతంగా ఆకాశంలోకి  ఎగిరిపోయింది. కాశీపతి ఆకాశంలోకి చూస్తూండగానే అది మాయమయిపోయింది.

ముచ్చెమటలూ కార్చుకొంటూ, కాశీపతి, మనవడిదగ్గరకు పరుగుపెట్టేడు.

“ఒరే, ఆర్యభట్టా, నా I.Pad చూస్తూంటే, ఆకాశంలోకి మాయమయిపోయిందిరా. అది ఎక్కడుందో వెతికిపెట్టరా నాయనా.” అని కాశీపతి మనవడిని బ్రతిమలాడుకొన్నాడు.

“బెంగపడకు తాతా. నిమిషాల మీద పట్టుకొంటాను.” అని తాతకి అభయహస్తం చూపించేడు, ఆర్యభట్ట.

ఆర్యభట్ట, నిత్యం, ఇరవైనాలుగు ఘంటలూ, తన అరచేతిలో ఉండే, తన స్మార్ట్ ఫోనులో లాగ్ ఇన్ అయ్యేడు. తాత I Pad ఎక్కడుందో వెతకనారంభించేడు.

“ఏమిరా నాయనా, అది ఎక్కడుందో, ఏమయినా తెలిసిందా.” అని,ఆతృతగా మనవడిని అడిగేడు.

“సారీ తాతా; నీ I Pad కోసం నవగ్రహాలలోను సెర్చ్ చేసేను. అది ఈ సౌరమండలంలో లేదు తాతా.”

“అయితే అది ఏమయిపోయిందిరా. నేను కళ్లారా చూసేను; అది ఆకాశంలోకి దూసుకుపోయింది.”

“తాతా, నీ పిడికిలికి చాలా శక్తి ఉంది. నువ్వు బల్లను గుద్దిన తాకిడికి, నీ I Pad మన సౌరమండలం దాటి బయటకు పోయింది.” అని, నవ్వుతూ తాతకు చెప్పేడు మనవడు.

“అయితే, అది ఎక్కడ ఉన్నట్టు.” అయోమయంలో కాశీపతి ఉవాచ.

“మిగిలిన సౌరమండలాలలో ఎక్కడో ఉండి ఉంటుంది.”

“అయితే ఇంకా ఆలస్యం దేనికి. తొందరగా ఆ  సౌరమండలాలలో సెర్చ్ చెయ్యి.” అని, మనవడిని తొందరపెట్టేడు, తాత.

“తాతా, ఈ IPSE కేవలం మన సౌరమండలంలోనే పనిచేస్తుంది. ఆ మండలాలలో సెర్చికి పనిచెయ్యదు.”

“అదేదో కొత్త పేరు చెప్తున్నావ్. అది సమంగా పనిచేస్తుందో లేదో.  గూగులులో చూడరా నాయనా.” అని, తాత, మనవడికి సలహా ఇచ్చేడు.

“తాతా, గూగుల్ కేవలం మన ప్రపంచంలోనే పని చేస్తుంది. IPSE అంటే. INTER PLANETARY SEARCH ENGINE. అది మన సౌరమండలంలోని అన్ని గ్రహాల్లోనూ వెతుకుతుంది. అది, ఏ సౌరమండలంలో ఉంటే, ఆ సౌరమండలంలోనే వెతకగలదు.”  అని. తాతకు మనవడు క్లాసు తీసుకొన్నాడు.

“అయితే నా I Pad మీద ఆశలు వదిలొసుకోవాలా. ఆ వెధవలకి ఉరిశిక్ష వేస్తానని భయపెట్టేనురా; ఈ సంగతి తెలిస్తే, వాళ్ళు నన్ను ఏకి కాకిని చేసి, చంపుతారు.” అని తల రెండు చేతులతోను పట్టుకొని, ఏడుపుకు లంఘించుకొన్నాడు, కాశీపతి.

తాత మాటలు మనవడికి అర్థం కాక,

“ఎవరు తాతా ఆ వెధవలు; ఉరిశిక్ష ఏమిటి ?” అని, తాత గడ్డం పట్టుకొని అడిగేడు.

కాశీపతి, జరిగినదంతా పూసగుచ్చినట్లు మనవడికి చెప్పేడు.

“బెంగపడకు తాతా; నీ I Pad ఎక్కడుందో తప్పకుండా కనుక్కొంటాను. అయితే, దానికోసం, ఇతర సౌరమండలాలు గాలించాలి. నా ఫ్రెండు నారదమూర్తి, తరచూ ఇతర సౌరమండలాలికి పనిమీద పోతూ ఉంటాడు. వాడిని కనుక్కొంటాను; ఇతర సౌరమండలాలికి ఎలా వెళ్లడమో.” అని, కాశీపతికి మనవడు ధైర్యం చెప్పేడు.

“ఆ నారదమూర్తిని తొందరగా కనుక్కోరా నాయనా.”

ఆర్యభట్ట, తన స్మార్ట్ ఫోనులోని కీ పేడ్ మీద, ఏవో చాలా బటన్లు నొక్కేడు. రెండు కళ్ళూ మూసుకున్నాడు. ముక్కులోకి, కుడిచేతి అయిదు వేళ్ళు పోనిచ్చేడు. ‘నారదమూర్తి’ , ‘నారదమూర్తి’ అని వల్లెవేస్తూ, ఏదో మనసులో వల్లించుకొంటూ ఉంటే, కాశీపతి, ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయేడు.

ఆర్యభట్ట, 101 మార్లు వల్లెవేసేడు.

ఆర్యభట్ట , స్మార్ట్ ఫోనులో నుండి, ఒక చిన్న తివాసీ బయటకు వచ్చింది.

ఆర్యభట్ట దానిని నేలమీద పరిచేడు.

తివాసీ మీద మఠం వేసుకొని కూర్చోగానే, తివాసీతో బాటు, ఆర్యభట్ట మాయమయిపోయేడు.

అది గమనించి, తాత బెంబేలెత్తిపోయేడు.

గొంతు చించుకొని, ఆకాశంలోకి చూస్తూ, “ఒరే నాయనా ఆర్యభట్టా, ఎక్కడకు మాయమయిపోయేవు.” అని కాశీపతి గట్టిగా అరిచేడు.

“తాతా, నేను నీ పనిమీదే ఉన్నాను. నా ఫ్రెండు నారదమూర్తి ప్రస్తుతం అంగారక గ్రహంలో ఉన్నాడని తెలిసింది. వాడితో, నీ I Pad విషయం చెప్పేను. తను బిజీగా ఉన్నాడని, నన్నే రమ్మన్నాడు. నాకు అక్కడకు వెళ్లడం ఎలాగో తెలీదన్నాను. దానికి, వాడు ఓ టెక్నికల్ మంత్రం చెప్పేడు. అది నేను చదవగానే, వాడు నాకో తివాసీ పంపించేడు. నువ్వు చూసేవుగా; అది నా స్మార్ట్ ఫోనులోనుండి వచ్చింది. దాని మీద నేను అంగారక గ్రహం వెళ్లి, నా ఫ్రెండుతో నీ  I Pad విషయం  మాట్లాడుతాను. గాభరాపడకు. నేను మన పని చూసుకొని, తొందరగా వచ్చేస్తాను.” అని, మనవడి ఆకాశవాణి విని, తాత కుదుటబడ్డాడు.

ఆర్యభట్ట నిమిషాలమీద అంగారకగ్రహం చేరుకొన్నాడు. అక్కడ వాడి ఫ్రెండు నారదమూర్తితో తన రాకకు కారణం చెప్పేడు.

నారదమూర్తి అక్కడ ఒక పెద్ద టెన్ స్టార్ హోటల్ నిర్మిస్తున్నాడు. అది చూసి,

“మూర్తీ, ఏమిటిరా ఇది.” అని, ఆర్యభట్ట ఆశ్చర్యపడుతూ అడిగేడు.

“ఇక్కడ టెన్ స్టార్  హోటల్ కట్టిస్తున్నాను. సుమారుగా కంప్లీటు అయిపొయింది. నా ఫ్యూచర్ ప్రోజెక్టులో ఒక భాగం, ఇది.” అని, సగర్వంగా సమాధానమిచ్చేడు, నారదమూర్తి.

“ఏమిటిరా, నీ ఫ్యూచరు ప్రోజెక్టు.” కుతూహలంతో అడిగేడు, ఆర్యభట్ట.

“మన ప్రపంచంలోనే గాక, అనేక ఇతర గ్రహవాసులు, అంతర్గ్రహ ప్రయాణాలికి, అంతర్విశ్వ ప్రయాణాలికి, కుతూహలంగా ఉన్నారు. అటువంటి ప్రయాణీకులు, ఇక్కడికి వచ్చినప్పుడు, వారి వసతి భోజన సౌకర్యాలకు ఇది నిర్మిస్తున్నాను. ఇటువంటి హోటళ్లు, అయిదు గ్రహాలలో తయారుగా ఉన్నాయి.” అని, తన ప్రోజెక్టు గూర్చి క్లుప్తంగా చెప్పేడు.

“కంగ్రేచులేషన్స్. చాలా పెద్ద ప్రోజెక్టు. ఇది బాగుంది; మరి ప్రయాణీకుల ట్రేన్స్పోర్టు మాటేమిటి.”

“అంతర్గ్రహ ప్రయాణాలికి, అంతర్విశ్వ ప్రయాణాలికి, ట్రాన్స్పోర్టు తయారుగా ఉంది. ట్రయల్ రన్సు చేసేం. చాలా సక్సస్. అయ్యేయి.”

“అయిదు హోటళ్లు తయారుగా ఉన్నాయన్నావ్. వాటిలో పనిచేయడానికి స్టాఫ్ రిక్రూట్ చేసేవా.”

“వాటిలో సర్వీసులన్నీ మనుషులు లేకుండా, లేటెస్ట్ టెక్నాలజీతో ఏర్పాటు చేసేను. శుక్రగ్రహంలో, ‘ఇన్విజిబుల్ టెక్నోక్రాట్స్’ అని, ఒక  రెఫ్యూటెడ్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ, స్టాఫ్ ఎవరూ లేకుండా నడుస్తోంది. నా హోటళ్ల మేనేజ్మెంట్ ఆ కంపెనీకి కాంట్రేక్ట్ ఇచ్చేను. ఆ కంపెనీ సర్వీస్ నాకు బాగా నచ్చింది. ఫర్ ఎక్జామ్పుల్, నువ్వు ఆ హోటల్లో టిఫిన్ చెయ్యడానికి వెళ్ళేవనుకో. డైనింగు హాలు ఎంట్రన్సు దగ్గరకు నువ్వు చేరుకోగానే , ‘ఆర్యభట్టగారు, నమస్కారం. దయచేయండి.’ అని నీకు వినిపిస్తుంది. అక్కడ నీకు మనుషులెవరూ కనిపించరు. హాలులో స్టాఫ్ ఎవరూ ఉండరు. నువ్వు డైనింగు టేబులు చేరుకోగానే, కుర్చీ దానంతటదే కొద్దిగా వెనక్కి వెళుతుంది. నువ్వు కూర్చోడానికి సదుపాయంగా, ఆ కుర్చీ దానంతటదే ముందుకు వెళుతుంది. మెన్యు పుస్తకం జరిగి నీ దగ్గరకు వస్తుంది. అది తిరగేస్తూ నువ్వు ఏ ఐటమ్సు మనసులో ఎంచుకొన్నావో , కిచెనుకు సమాచారం వెళుతుంది. కిచేనులో పనివాళ్లెవరూ ఉండరు. నువ్వు కోరుకొన్న ఐటమ్సు, నిమిషాల మీద తయారయి, వాటంతటవే, నీ ఎదుట టేబులుమీద ప్రత్యక్షమవుతాయి. ఇలా సర్వీస్ అంతా, ఆటోమేటిక్. బాగుంది కదరా.” అని, స్నేహితుని భుజం తట్టి చెప్పేడు, నారదమూర్తి.

“మూర్తీ, నువ్వు చాలా యుగాల ముందున ఉన్నావ్. నువ్వు ఇక్కడ  ఏదో చేస్తున్నావని తెలుసు గాని, ఈ డిటైల్సు ఏవీ నాకు తెలీవు. అది సరే, నేను నీదగ్గరకు రావడానికి కారణం చెప్పేను. నా ప్రాబ్లెమ్ కి ఏదో సొల్యూషను చూడు. అక్కడ, నా తాత, నాకోసం వెయ్యికళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు.”

“నీ మెయిన్ ప్రాబ్లెమ్, మీ తాత I Pad ఏ సౌరమండలంలో ఉందో లోకేటు చెయ్యాలి. ఆ మండలాలన్నీ గాలించడానికి, నీకు ట్రేన్స్పోర్టు కావాలి. ఔనా.”

“అవునురా. అది నడపడానికి డ్రైవరు కూడా కావాలి.”

“ఇక్కడ నీకు డ్రైవరులు ఎవ్వరూ ఉండరు. Every thing is automatic. నీకు నేను ఎక్స్ప్లైను చేస్తాను; చూడు.” అని,  ఎడమ చెయ్యి ఎత్తి, మూడు మార్లు గాలిలో క్లాక్వైజు తిప్పి, అయిదు చప్పట్లు కొట్టేడు. ముగ్గురు కూర్చోడానికి సరిపడే ఒక మెత్తని తివాసీ వచ్చి వారి ముందు వాలింది.

“ఒరే, ఈ తివాసీయే మీ ట్రాన్స్పోర్టు. ఈ తివాసీ కేవలం మనసులోని కమాండ్లతో పనిచేస్తుంది. నువ్వు మనసులో ‘ముందుకు వెళ్ళు’ అని అనుకొంటే, ముందుకు వెళుతుంది. అలాగే, ‘రైట్ ‘ , ‘లెఫ్ట్’ , ‘అప్’ ‘డౌన్’ , అని, నువ్వు మనసులో ఎదనుకొంటే, అటు వెళుతుంది. అంతేకాదు, నువ్వు  ఏ సౌరమండలంలో ఎక్కడ ఉన్నావో, అక్కడ ఉన్న వింతలు విశేషాలు, చెపుతూ ఉంటుంది.   బోధపడిందా.” అని, నారదమూర్తి, తన స్నేహితుణ్ణి అడిగేడు.

“బోధపడ్డాదిరా; చాలా థేంక్సురా.” అని ధన్యవాదాలు చెప్పగానే,

“ఒరే. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పడం మరచిపోయేను. దీనికి కమాండ్స్ ఒకమాటు ఎవరో ఒక్కరే ఇవ్వాలి. ఇద్దరూ, ఒకేమారు డిఫరెంట్ కమాండ్స్ ఇస్తే, అది కంఫ్యూజ్ అవుతుంది. అంచేత, నువ్వే కమాండ్స్ ఇస్తూ ఉండు. అంతేకాదు. ఇంకో అతి ముఖ్యమయిన విషయం. నువ్వు ఉపయోగించని సమయాలలో, దాన్ని జాగ్రత్తగా చుట్టబెట్టి ఉంచాలి. ఫర్ ఎక్జామ్పుల్; నువ్వు ఏదయినా ప్రదేశం చేరుకున్నాక; అక్కడ మీ తాత I Pad వెతకడానికి, తివాసీ నుండి దిగి, నాలుగు మూలలా వెతుకుదామనుకొంటే; తివాసీనుండి దిగగానే, దాన్ని చుట్టబెట్టి ఉంచాలి. దాన్ని ఖాళీగా పరచి ఉంచకూడదు.  అది బాగా జ్ఞాపకముంచుకో. ఖాళీగా ఉండగానే, అది నా దగ్గరకు వచ్చేస్తుంది. భట్టా, నేను చెప్పినవన్నీ బాగా జ్ఞాపకం ఉంచుకో. ఏదైనా పొరబాటు చేస్తే, ఇబ్బందుల్లో పడతావ్.” అని, స్నేహితుణ్ణి హెచ్చరించేడు.

“నువ్వు చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటిస్తాను. చాలా థాంక్సురా మూర్తీ.” అని మరోమారు ధన్యవాదాలు చెప్పుకొన్నాడు, ఆర్యభట్ట.

“ఓకే, Wish you all the best. Bye.” అని, నారదమూర్తి, వీడ్కోలు పలికేడు

ఆర్యభట్ట, తివాసీ మీద ఆసీనుడై, మనసులో ఏదో అనుకొన్నాడు.

నిమిషాలమీద, వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న తాత ముందు, మనవడు ప్రత్యక్షమయ్యేడు.

ఆర్యభట్ట, తన స్నేహితుడు నారదమూర్తి గూర్చి వివరంగా చెబుతూ ఉంటే, కాశీపతి నోరు వెళ్ళబెట్టి, రెప్పలార్పకుండా, ఆశ్చర్యపడుతూ విన్నాడు.

ఆ తరువాత, తను కూర్చొని వచ్చిన తివాసీ గురించి, తీసుకోవలసిన  జాగ్రత్తలతో బాటు, వివరంగా బోధపరిచేడు.

ఆ  సమయంలో, ఆర్యభట్టను కలియడానికి, వాడి స్నేహితుడొకడు, విదేశాలనుండి వచ్చేడు.

ఆర్యభట్ట, వాడిని కలియడానికి డ్రాయింగు రూము లోనికి వెళుతూ,

“తాతా, నువ్వు ఇక్కడే ఉండు. నేనిప్పుడే వచ్చేస్తాను. నేను రాగానే, నీ I Pad వెతకడానికి బయలుదేరదాం.” అని, చెప్పి వెళ్ళేడు.

హిమాలయాలలోని, మౌంట్ కైలాస్, పరమశివుడు నివసించే ప్రదేశమని, అక్కడకు వెళ్ళినవాళ్ళు, కళ్లారా శివుని దర్శనం చేసుకోగలరని, కాశీపతికి ఇదివరలో ఎవరో చెప్పేరు. అప్పటినుండి, ఎలాగయినా మౌంట్ కైలాస్ వెళితే, పరమశివుణ్ణి ప్రత్యక్షంగా చూడొచ్చునని, కాశీపతి బుర్రలో పాతుకు పోయింది. ఆ కోరిక నెరవేరడానికి మంచి అవకాశం దొరికిందనుకొన్నాడు. మనవడు, వాడి ఫ్రెండుతో తప్పకుండా చాలా సేపు గడుపుతాడు. ఆ లోగా, తివాసీ మీద, మౌంట్ కైలాస్  వెళ్లి శివదర్శనం చేసుకొని, ఆ త్రినేత్రుని వద్ద ఏవయినా వరాలు పొందవచ్చునని, కుతూహలపడ్డాడు. మరేం; ‘ఆలస్యం అమృతం విషం.’ అని, చుట్టబెట్టి ఉన్న తివాసీని, నేలపై పరచి, దాని మీద ఆసీనుడయ్యేడు. మనసులో ‘మౌంట్  కైలాస్’ అనుకొన్నాడు.

కాశీపతి, మరు క్షణంలో చైనా భూభాగం మీద ఉన్న మౌంట్  కైలాస్ మీద ఉన్నాడు. మంచులో మునిగి, పిరమిడు ఆకారంలో ఉన్న మౌంట్ కైలాస్, దాని క్రిందన పరిశుభ్రమయిన  నీటితో నిశ్చలముగా నున్న మానసరోవరం సరస్సు, అక్కడ ఉన్న దృశ్యాలను చూసి మంత్రముగ్ధుడయ్యేడు. కుండపోతలా మంచువర్షం కురుస్తోంది. కనురెప్ప విప్పలేనంత వడిగా ఈదురుగాలులు, భయంకరమయిన శబ్దాలు చేస్తూ, వీస్తున్నాయి. ఆ మంచుకొండల మధ్య, తను ఇసుమంతయినా చలి వేయకుండా, ఎలా ఉన్నాడని ఆశ్చర్యపోయేడు. అది తివాసీ మహిమని అనుకోలేదు. ఎదురుగా కొంత దూరంలో, ఓ మానవాకారం, తపస్సు చేసుకొంటున్నట్లు లీలగా కనిపించింది. ప్రక్కనే ఒక  త్రిశూలం నిలబడి ఉంది. అనుమానం లేదు; తను చూస్తున్నది, సాక్షాత్తు, మహేశ్వరుడే అని సంబరపడ్డాడు. తివాసీ మీద నుండి లేచేడు. ‘ఓం నమః శివాయ’ , ‘ఓం నమః శివాయ’ అని భక్తితో వల్లెవేసుకొంటూ, ఆ దిక్కుగా నడవ సాగేడు. మంచులో కాళ్ళు కూరుకుపోవడం లేదు. జపం చేసుకొంటూ ముందుకు నడవసాగేడు. అక్కడ భయంకరంగా వీస్తున్న అతి చల్లటి ఈదురుగాలులు, కాశీపతికి వెచ్చగా తగులుతున్నాయి.

హిమాలయా పర్వతాల మీద ఉండే భయంకర వాతావరణం గూర్చి, స్కూల్లో జాగ్రఫీ మాష్టారు చెప్పినది, కాశీపతి జ్ఞాపకం చేసుకొన్నాడు. వాతావరణం అలాగే అగుపిస్తోంది. కాని, తనకు ఏ ఇబ్బంది  లేకపోవడం, కనిపిస్తున్న శివుని మహిమే అని, గర్వపడ్డాడు. శివుని, ఏ వరాలు కోరుకోవడమా అని ఆలోచిస్తూ, ఆ ఆకారానికి దగ్గరపడ్డాడు.ఆ ఆకారానికి సాష్టాంగ నమస్కారం చేస్తూ, లింగాష్టకం, శివచాలీసా గడగడా వినిపించేడు. ఆ ఆకారం, “కాశీపతిగారూ, లేవండి.” అని అనడంతో,

“మహేశ్వరులు; తమరు నన్ను మన్నించడమేమిటి. నేను మీ సేవకుడను.” అని, లెంపలు వాయించుకొంటూ వినమ్రంగా నిలబడ్డాడు.

“కాశీపతిగారూ, నేను పరమేశ్వరుడను కాను. నేను మీ వంటి మానవుడనే. ఒకప్పుడు నేను భూమండలమంతటికి చక్రవర్తిని. అన్ని భోగభాగ్యాలు అనుభవించేను. వాటితో విసుగెత్తిపోయేను. కట్టెతో కైలాసానికి వెళ్లాలని, శివుని కోసం తపస్సు చేస్తున్నాను. చిల్లరదేముళ్ళు, ఇద్దరు ముగ్గురు ప్రత్యక్షమయ్యేరు. వాళ్ళు నా  కోరిక తీర్చలేమన్నారు. శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యేవరకు, తపస్సు కొనసాగిస్తాను. మీరు రావడం చూసేను. ఇప్పటివరకు నేను చేసిన తపోమహిమ వల్ల, మీకు ఇక్కడి వాతావరణం కష్టం కలిగించకుండా ఆపేను. మీరు తొందరగా వెనక్కి వెళ్లిపోండి;     లేకపోతే ఇబ్బందుల్లో పడిపోతారు.” అని తన పరిచయం చేసుకొని, హితబోధ చేసేడు, ఆ తపస్వి.

“ధన్యవాదాలు; నేను కూడా తొందరగా వెనక్కి  వెళ్ళాలి.” అని, ఆ తపస్వి వద్ద శలవు తీసుకొని, కాశీపతి వెనుదిరిగేడు.

కాశీపతి గుండె బద్దలయింది. కాళ్ళూ చేతులూ ఆడడం లేదు. ఏమంటారా; కాశీపతికి తివాసీ కానరాలేదు. నలుదిక్కులా గాభరా పడుతూ చూసేడు. ఎక్కడా దాని జాడ కానరాలేదు. కాశీపతికి జ్ఞాపకమొచ్చింది; తను తివాసీని చుట్టపెట్టడం మరచిపోయేడు. కొంప మునిగిందనుకొన్నాడు.

కాశీపతి, ‘శివుడు కనిపించలేదు గాని; ఇక్కడ ‘శివ శివా’ అని చావాలి.’ అని లబో దిబో, ఏడవసాగేడు.

ఆర్యభట్ట, స్నేహితుని సాగనంపి, వచ్చేడు.

తాత జాడ లేదు. తివాసీ కూడా ఎక్కడా కనబడలేదు. ముసలాడు ఏదో కోతి పని చేసి ఉంటాడని ఊహించేడు. తివాసీ ఏమిటయి ఉంటుంది. ముసలాడు ఏమిటయి ఉంటాడు. ‘భగవంతుడా ఏమిటి దారి.’ అని, తలపట్టుకు చతికిలబడిపోయేడు.

అంతలో, తన స్మార్ట్ ఫోనులో ఏవో శబ్దాలు వినిపించేయి. హుటాహుటిన స్మార్ట్ ఫోనులో లాగ్ ఇన్ అయ్యేడు.    నారదమూర్తి మెసేజ్.

“హలో, భట్టా. మీ I Pad చాలా తొందరగానే దొరికినట్టుంది. మీ తాతకు, నీకు, కంగ్రేచులేషన్స్. నీకు ఎప్పుడు అవసరమొచ్చినా, మొహమాటపడకు. ఈ తివాసీ పంపిస్తాను.”

అది చూడగానే ఆర్యభట్టకు, అర్థమయింది. ముసలాడు తివాసీ మీద కూర్చొని ఎక్కడికో వెళ్ళేడు. తివాసీ దిగేక, దాన్ని చుట్టబెట్టి ఉండడు. అంచేత అది మూర్తి  దగ్గరకు వెళిపోయింది. అయితే, ముసలాడు ఎక్కడ ఉన్నట్టు. గాలించి చూడాలి, అని, గాభరా పడ్డాడు.

ఆర్యభట్ట, తన సెర్చ్ ఎంజీనికి పని చెప్పేడు. కాశీపతి, ఏడుస్తూ కనిపించేడు.

కైలాస్  మీద, ఆ భయంకర వాతావరణంలో, ముసలాడు ఎలా బ్రతికి ఉన్నాడు. గట్టి పిండమే’ అనుకొన్నాడు. ఆలస్యం చెయ్యకూడదనుకొన్నాడు .

నారదమూర్తిని సంప్రదించి, విషయం చెప్పేడు.

నిమిషాల మీద, తివాసీ ప్రత్యక్షమయింది. దాని మీద ఆసీనుడయి, ఆర్యభట్ట కైలాస్ శిఖరం చేరుకొన్నాడు.

తివాసీ మీద ఉన్న మనవడిని చూడగానే, కాశీపతికి ప్రాణాలు లేచొచ్చేయి. ‘బ్రతుకు జీవుడా’ అనుకొన్నాడు.

కాశీపతి, “పొరబాటు అయిపోయిందిరా నాయనా’ అని క్షమాపణలు చెప్పుకొని, ఏమిటి జరిగిందో చెప్పబోతూ ఉంటే,

“నాన్సెన్స్; మరేమీ మాట్లాడకు; తొందరగా వచ్చి, ఈ తివాసీ మీద కూర్చొ. ఇంటికి వెళ్ళగానే ఈ తివాసీని మూర్తికి పంపించేస్తాను. నీ I Pad సంగతి నువ్వే చూసుకో.” అని, గర్జించేడు.

“నా I Pad ని వెతకడం నాకు చేతగాదు. అది లేకుండా, భజగోవిందానికి ఉరిశిక్ష వెయ్యలేను. ఆ అవమానం భరించేకన్నా, ఇక్కడ గడ్డకట్టుకు చావడం మేలు.” అని కాశీపతి అట్టు తిరగేసేడు.

ముసలాడు ఇక్కడ ‘హరీ’ అంటే, తనకు పీకలమీదకు వస్తుందని, ఆర్యభట్ట ఆలోచించి,

“మరి ఇటువంటి పనులు చెయ్యకపోతే, నీ I Pad వెతుకుతాను.” అని, మెట్లు దిగి వచ్చేడు, మనవడు.

“తెలీక పొరబాటు చేసెనురా. ఇహమీద, మరెప్పుడూ, ఈ తివాసీ జోలుకు పొనురా నాయనా.” అని, మనవడికి హామీ ఇచ్చేడు, తాత.

“సరే, వచ్చి కూర్చో. నీ I Pad వెతకడానికి ఇక్కడినుండే బయలుదేరుదాం.” అని, ఆహ్వానం పలికేడు, ఆర్యభట్ట.

తాత, మనవడు, తివాసీ మీద ఆసీనులయ్యేరు.

ఆర్యభట్ట, మనసులో ఏదో అనుకొన్నాడు.

కొద్ది సేపట్లో, కాశీపతి, ఆర్యభట్ట, మన సౌరమండలం దాటి, మరో సౌరమండలంలో, ముందుకు దూసుకు పోసాగేరు.

ఆర్యభట్ట, తన స్మార్ట్ ఫోనులో, INTER PLANETARY SEARCH ENGINE కు పని చెప్పేడు. వారప్పుడున్న సౌర్యమండలంలో  I pad లేదని తేలింది. తాత, మనవల, అంతర్సౌర్యమండల ప్రయాణం ముందుకు సాగుతోంది. మరో సౌర్యమండలంలో ప్రవేశించేరు.  కొద్దిసేపట్లో, తాము వెళుతున్న సౌర్యమండలంలో, తమ కుడి చేతి వైపు, ఒక పెద్ద పసుపుపచ్చని గ్రహం, గిర్రున తనలో తాను తిరుగుతూ క్రిందకు మీదకు, గెంతులేస్తూ, కనిపించింది. ఆర్యభట్టకు ఆ గ్రహంలో ఏముందో చూద్దామనిపించింది.

మనసులో, తివాసీకి కమాండ్ ఇచ్చేడు. ఉభయులూ, ఆ గ్రహం చేరుకొన్నారు. తివాసీనుండి దిగి, దాన్ని జాగ్రత్తగా చుట్టబెట్టేరు. వాళ్ళని చూడగానే, ఆ గ్రహంలోని కొందరు వాళ్ళ చుట్టూ చేరేరు. తాత, మనవడు, ఆశ్చర్యపోయేరు. ఎందుకంటారా. వారిలో చాలామంది వాళ్లకి తెలిసినవాళ్ళే. కాని, వారంతా చాలా రోజులయి చనిపోయేరు.

“మీరందరూ, ఇక్కడ ఎలా ఉన్నారు.” అని ఆశ్చర్యంతో వాళ్ళని అడిగేడు, కాశీపతి.

వారిలో ఒకాయన, “మేఁవంతా  కోవిదుతో పోయేమ్. ఆ పరలోకంలోనికి వెళ్ళడానికి ముందు, ఇక్కడ క్వారంటైనులో ఉండాలని శాసించేరు. సాన్నాళ్ళయి ఇక్కడ పడి ఉన్నాం.” అని దీనంగా చెప్పుకొచ్చేడు.

“మరి మీ భోజనాలో.” అని, కాశీపతి సానుభూతితో అడిగేడు.

“అది చెప్పుకోడానికే మీ దగ్గరకు వచ్చేవ్.  మేఁవంతా, చాలా రోజులై తిండి తిప్పలు లేకుండా పడున్నావ్. అని, ఓ ముసలమ్మ గోల పెట్టింది.

“మీరు చెప్తున్నది, నాకు అర్థం కావడం లేదు.” అని ఆర్యభట్ట అనగానే,

“నాయనా, పరలోకవ్ లో ఉన్నవాళ్లకు ఒక రోజయితే, భూలోకంలో ఒక సంవత్సరం కదా. అందుకే, చనిపోయిన పెద్దల భోజనాలికి, ఏడాదికోరోజు తద్దినాలు పెడతారు. కాని,  సగం దారిలో మమ్మల్ని ఇక్కడ పడీడం మూలాన్న, ఈ సమస్య వచ్చింది. ఇక్కడ ఒక రోజంటే, భూలోకంలో రెండు నెల్లే అవుతుంది. అంచేత, మాకు తద్దినాలు రెండు నెలలకోసారి పెట్టాలి. కాని, ఇప్పటి దాకా మా వాళ్ళు ఒక్క తద్దినమూ పెట్టలేదు. దానివల్ల మా ఆకలి.” అని, ఒక పౌరోహితుడు, వారి ఆకలికి కారణం విడమరచి చెప్పేడు.

“అయ్యో , అలాగా, మేవ్ వెళ్ళగానే  మీ వాళ్లకి ఈ సంగతి తెలియజేస్తాం.” అని, ఆర్యభట్ట హామీ ఇచ్చేడు.

“ఆ పనేదో తొందరగా చెయ్ నాయనా.” అని, మరో  ముసలాయన బ్రతిమాలుకొన్నాడు.

ఇదంతా  విన్న కాశీపతి, మనవడి చెవిలో ఏదో చెప్పేడు.

ఆర్యభట్ట, తన ఫ్రెండు నారదమూర్తిని సంప్రదించేడు. తాము చేరుకొన్న గ్రహం లోని విశేషాలు తెలియజేసేడు. అక్కడ ఆకలితో ఉన్నవారి పరిస్థితి చెప్పేడు. వాళ్ళకి సాయం చెయ్యమని రిక్వెష్టు చేసేడు. నారదమూర్తి సానుకూలంగా స్పందించేడు. తను వారి భోజనాలికి వెంటనే ఏర్పాటు చేస్తానన్నాడు. అప్పటివరకు వెయిట్ చెయ్యక,

వారిరువురిని, I Pad వెతకడానికి ముందుకు సాగమన్నాడు. ఆ విషయం, ఆర్యభట్ట, తాతకు చెప్పేడు. కాశీపతి, మనవణ్ణి మెచ్చుకున్నాడు.

కాశీపతి, అక్కడ చేరుకొన్నవారితో,  వారికి త్వరలో భోజనాల ఏర్పాటు జరుగుతుందని, తీపి కబురు చెప్పేడు. వాళ్లంతా ఎగిరి గంతేశారు. తాత, మనవళ్లను, వేయి నోళ్ళ ప్రశంసించి, ధన్యవాదాలు సమర్పించుకున్నారు.

తాత, మనవడు, తమ యాత్రను ముందుకు సాగించేరు.

మరుక్షణం, ఆ గ్రహవాసులు సంతృప్తిగా తద్దినపు భోజనం ఆరగించేరు. ఆ వచ్చిన ఇద్దరు, మానవులు కారని, వారిని రక్షించడానికి, దేవతలే వచ్చేరని భావించేరు.

తాత, మనవడు, మరో సౌర్యమండలంలో ప్రవేశించేరు. ఆర్యభట్ట, తన సెర్చ్ ఎంజీన్, IPSE లోకి వెళ్ళేడు. తాత I Pad కోసం గాలింపు మొదలు పెట్టేడు. కొంత సేపట్లో, ఎక్కడో, చాలా దూరంనుండి, ఫీబులుగా సిగ్నల్స్ వచ్చేయి. ఆ సిగ్నల్స్ రాగానే తాత I Pad ఆ సౌర్యమండలంలోనే ఉందని ఆర్యభట్ట తెలుసుకొన్నాడు. ఆ శుభ పరిణామం తాతకు చెప్పేడు. కాశీపతి సంతోషానికి అంతు లేదు. ఆర్యభట్ట తివాసీని సిగ్నల్స్  వస్తున్న దిశగా వెళ్ళమని, కమాండ్ చేసేడు. తాత, మనవడు, ఆ సౌరమండలంలో, ఒక్కొక్క గ్రహం దాటి ముందుకు వెళుతున్నారు. వారిద్దరు, ఒక గ్రహం చేరువవుతున్నకొద్దీ, సిగ్నల్స్ చాలా ఖణీగా రావడం మొదలయింది. I Pad , ఆ గ్రహంలోనే ఉందని, ఆర్యభట్ట నిర్ధారించుకొన్నాడు. తివాసీని, ఆ గ్రహంలో లేండ్ అవ్వమని, ఆర్యభట్ట కమాండ్ ఇచ్చేడు. కాశీపతి, తన ఇష్టదేవతలందరికి మనసులో మొక్కుకొంటున్నాడు. తివాసీ, లేండ్ అయింది. తాత, మనవడు, తివాసీ దిగి, జాగ్రత్తగా దాన్ని చుట్టబెట్టేరు. దూరంగా ఏవో మాట్లాడుతున్న పెద్ద గొంతుకలు వినిపించేయి. అవి విని, ఆర్యభట్ట  ఆ చుట్టబెట్టిన తివాసీని అక్కడ ఉంచి, I Pad వెతకడానికి  దూరంగా పోవడం రిస్క్ అని అనుకొన్నాడు. తమతోనే ఉంచుకోవాలని, అనుకొన్నాడు. కాని, I pad సెర్చ్ చేస్తూ, ఆ చుట్టబెట్టిన తివాసీని కూడా తను పట్టుకోలేననుకొన్నాడు. పోనీ, తను సెర్చ్ చేస్తున్న సమయంలో, తివాసీని విప్పి, దాని మీద తాతని కూర్చొని ఉండమంటే, మళ్ళీ ఏ కోతిపని చేస్తాడో, అని భయం. తప్పదు; తాతకు తివాసీ డ్యూటీ వెయ్యాలనుకొన్నాడు.  తాతకు బోధపరచి చెప్పేడు. మరేమీ అనుకోవద్దన్నాడు.

“అదేమిటి నాయనా, నువ్వు నా కోసం ఇంత కష్టబడుతూ ఉంటే, ఆ మాత్రం చెయ్యలేనా.” అని చెప్పి, కాశీపతి , చుట్టబెట్టి ఉన్న తివాసీని జాగ్రత్తగా తలమీద పెట్టుకొని, రెండు చేతులతోను దాన్ని గట్టిగా పట్టుకొన్నాడు.

మనవడు స్మార్ట్ ఫోను ఆపరేటు చేస్తూ, సిగ్నల్స్ వస్తున్న దిశగా ముందుకు వెళుతూ ఉంటే, తలమీద తివాసీతో, తాత ఫాలో అవుతున్నాడు.

తాత, మనవడు, కొంత దూరం వెళ్ళగానే, దూరాన్న, కొందరు తాటిచెట్టు పొడవు మనుషులు కనిపించేరు. తాత బెదిరిపోయేడు. అది చూసి, మనవడు,

“తాతా, భయపడకు. వాళ్లేమిటి మాట్లాడుకొంటున్నారో విందాం.” అన్నాడు.

“నాయనా, వాళ్ళ భాష మనకేమిటి బోధపడుతుంది.” అని సంకోచించేడు.

“తాతా, నా ఫోనులో ఒక ఏప్ ఉంది. ఎవరు ఏ భాషలో మాట్లాడినా, అది నాకు మన భాషలో తర్జుమా చేసి చెపుతుంది. అలాగే, నేను మాట్లాడినది, వాళ్ళ భాషలో తర్జుమా చేసి, వాళ్ళకి చెబుతుంది. కొంచెం ముందుకు వెళితే, వాళ్ళు మాట్లాడుకొంటున్నది తెలుస్తుంది.” అని, తాతకు ధైర్యం చెప్పేడు, ఆర్యభట్ట.

తాత, మనవడు, ముందుకు అడుగులు వేసేరు. వింతమానవులు  దగ్గరపడ్డారు. వాళ్ళు, ఈ ఇరువురిని చూసి, ‘ఎంత పొట్టి వారో’ అని ఆశ్చర్యపోయేరు.

“మీరెవరు; ఇక్కడికెందుకొచ్చేరు.” అని వాళ్ళ భాషలో అడిగేరు.

ఆర్యభట్ట ఏప్ కి భాష తర్జుమాల పని పడ్డాది.

“మేం భూమండలం నుండి వచ్చేమ్.” అని, ఆర్యభట్ట సమాధానం చెప్పగానే, వారి భాషలో అది విని, ఆ వింత మనుషులు ఆశ్చర్యపోయేరు.

వారిలో ఒకడు, ఆకాశం దిక్కు వేలు చూపుతూ, “అదిగో అక్కడ…నెమలికంఠం రంగులో పెద్దదిగా కనిపిస్తున్న గ్రహం కనిపిస్తున్నాదా.” అని అడిగేడు.

“ఆ. కనిపిస్తోంది. చాలా అందంగా ఉంది.” అని, తాత ఆ గ్రహం వైపే ఆశ్చర్యంగా చూస్తూ స్పందించేడు.

“మేం, ఆ గ్రహం నుండి విలాసయాత్రకు వచ్చేమ్.” అని ఆ పొడవు ఆసామీ, తమ గూర్చి చెప్పేడు.

“కొన్ని యుగాల క్రితం, మా పూర్వీకులు మీరిప్పుడుంటున్న భూమండలం మీదే ఉండేవారట. వారు అన్ని శాస్త్రాలలోను, మిక్కిలి తెలివయిన  వాళ్ళట. వారి తెలివితేటల వల్ల, భూమండలం అన్ని రంగాలలోను, చాలా అభివృద్ధి చెంది ఉండేదట. వాళ్ళు తరచూ, ఇతర గ్రహాలకు వినోదయాత్రకు వెళుతూ ఉండేవారట. ఒకమారు, అలా వెళుతూ, మేముంటున్న గ్రహం చూసేరట. భూమండలం కన్నా చాలా బాగుందని, అక్కడకు శాశ్వతంగా వలస పోదామనుకొన్నారట. భూమండలం వెళ్ళేక, వారి ఉద్దేశం, అందరికి చెప్పేరట. కొన్ని కుటుంబాలు మాత్రమే, దానికి ఆసక్తి చూపేయట. అలా, మా పూర్వీకులు మేమున్న గ్రహానికి వలస వచ్చిన నాటికి, అక్కడ కొందరు ఆదిమ వాసులు నివసిస్తూ ఉండేవారట. తమ తెలివితేటలతో, వారిని అరణ్య ప్రాంతాలకు తరిమి, మా పూర్వీకులు ఆ గ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారట.” అని విడమరచి, వారి చరిత్రను తెలియజేసేడు, మరొక పొడగరి.

“మీరు ఇక్కడకి ఎందుకు వచ్చేరు.” మరో పొడగరి, కాశీపతిని అడిగేడు.

“మా తాత I Pad ఈ గ్రహంలో వచ్చి పడ్డాది. దాన్ని వెతుక్కొంటూ ఇక్కడకు వచ్చేమ్.” అని, ఆర్యభట్ట క్లుప్తంగా, వారి రాకకు కారణం చెప్పేడు.

“అదేదో ఈ గ్రహంలో పడ్డాది అన్నారే; అది ఎలా ఉంటుంది.” అని, మరొకడు తెలియగోరేడు.

ఆర్యభట్ట, తన ఫోనులో I Pad చిత్రాన్ని వాళ్లకు చూపించేడు.

అక్కడ ఉన్న వాళ్ళందరూ, I Pad చిత్రాన్ని చూసేరు.

వారిలో ఒకడు,”నేను అటువంటిదే నిన్న చూసేను. మన పిల్లలు కొందరు దానితో ఆడుకొంటూ ఉండేవారు.” అని, చెప్పగానే,

“మాకు కూడా దగ్గరలోనే అది ఉందని సిగ్నల్స్ వస్తున్నాయి.” అని ఆర్యభట్ట వారితో చెప్పేడు.

“తాతా, నీ I Pad ఎక్కడుందో కనిపెట్టేం.” అని తాత భుజం తట్టి సగర్వంగా అన్నాడు, ఆర్యభట్ట.

“అయ్యా , దయచేసి మమ్మల్ని ఆ పిల్లల దగ్గరకు తీసుకు వెళ్ళండి. మాకు, మా i Pad ఇప్పిస్తే మేమెంతో సంతోషిస్తాం.” అని కాశీపతి విన్నవించుకున్నాడు.

“పదండి; ఆ పిల్లలు దగ్గరలోనే ఉన్నారు.” అని, వారు, తాత, మనవలను, ఆ పిల్లలున్న ప్రదేశానికి తీసుకొని వెళ్ళేరు.

తమ కంటే పొడవుగా ఉన్న పిల్లల్ని చూసి, తాత, మనవడు, ఆశ్చర్యపోయేరు.

“పాపలూ, మీరు ఆడుకొంటూ ఉండేవారే, ఓ కొత్త బొమ్మ, ఇలా ఇవ్వండమ్మా. అది , వీళ్ళదమ్మా. వాళ్లకి ఇచ్చేద్దాం.” అని, తాత, మనవలను చూపిస్తూ, అడిగేడు, I Pad ను పిల్లలవద్ద చూసిన పొడగరి.

“అది మా దగ్గర లేదు.” ఓ పిల్లడు పలికేడు.

“మరి ఎక్కడ ఉంది.” మరో పొడగరి ప్రశ్న.

“మేవ్ ఆడుకొంటూ ఉంటే, ఓ పెద్ద జంతువు వచ్చి, అది పట్టుకు పారిపోయింది.” అని, బిక్కు బిక్కు మని, వారిలో ఓ అమ్మాయి జవాబిచ్చింది.

అది విని, తాత హతాశుడయ్యేడు.

“గాభరా పడకు తాతా. అదెక్కడుందో కనుక్కొంటాను.” అని తన సెర్చ్ ఇంజీనుకు పని చెప్పేడు.

ఆర్యభట్ట, ఫోనులో సెర్చ్ ఇంజీను చూపిస్తున్న దిక్కు, ముందుకు అడుగులేసుకొంటూ వెళ్తున్నాడు. తాత, పొడగరి గుంపు, వాడి వెంటా నడుస్తున్నారు.

“ఈ గుంటడెవడో గడుక్కాయలాగున్నాడు.” అని, వారిలో వారు, నెమ్మదిగా అనుకొంటూ, ఆర్యభట్టను ప్రశంసించసాగేరు.

కొద్దిసేపట్లో, ఆర్యభట్ట, కాశీపతి, పొడగరివారు, కొన్ని వింత  జంతువులను సమీపించేరు. ఆ జంతువులు, మన ఒంటెలకు  రెండింతలు ఎత్తులో ఉన్నాయి. వాటిని చూసి, తాత, మనవడు  ఆశ్చర్యపోయేరు. ఆర్యభట్ట, తన ఫోనులో వస్తున్న సిగ్నల్సును జాగ్రత్తగా పరీక్షించేడు. తాత I Pad, ఆ జంతువులలో పడుకొని ఉన్న ఒకదాని మెడలోపల ఉన్నట్టు కనుగొన్నాడు. ఫోనులో ఏవో ఎడ్జస్టుమెంట్సు  చేసేడు. ఫోను స్క్రీను మీద, ఆ జంతువు మెడ, దానిలో I Pad, స్పష్టంగా కనిపించేయి. అది, సగర్వంగా తాతకు చూపించేడు. తన I Pad చూడగానే, కాశీపతి మొహం చేటంత అయింది. అంతలోనే, ఆందోళన కమ్ముకుపోయింది. ఆ వింత జంతువు మెడలోనుండి I Pad ను బయటకు తీయడం సంభవమేనా. అది దానిని పూర్తిగా మింగి జీర్ణం చేసీసుకొంటుందేమో. తన భయాందోళలను, మనవడికి చెప్పేడు.

ఆర్యభట్ట, తన ఫోనులో కనిపిస్తున్న జంతువు, దాని మెడలో ఉన్న I Pad, పొడగరి వారికి చూపించేడు. వాళ్ళు ఆర్యభట్ట తెలివితేటలకు ఆశ్చర్యపోయేరు.

ఆర్యభట్ట, తాత ఆందోళను వారికి చెప్పి, “దయచేసి ఆ I Pad ను తొందరగా దాని మెడనుండి బయటకు తీయడానికి సాయం చేయండి. నాకు వాటిని చూస్తే భయమేస్తోంది.” అని, ప్రాధేయపడ్డాడు. తాత కూడా వంత పాడేడు.

“భయపడకండి. అవన్నీ సాధు జంతువులు. మేము మీ వస్తువుని జాగ్రత్తగా బయటకు తీసి, మీకిస్తాం.” అని, పొడగరి వారు హామీ ఇవ్వడంతో, తాత, మనవడు కుదుటబడ్డారు.

ఆరుగురు  పొడగరివారు, ఆ పడుకొన్న జంతువును సమీపించేరు. ఆ జంతువు నాలుగు కాళ్ళు, నలుగురు పట్టుకొన్నారు. తాత, మనవడు, ఆ జంతువు దగ్గరగా వెళ్ళేరు. ఆర్యభట్ట, I Pad, జంతువు మెడలో ఎక్కడుందో చూపిస్తూంటే, ఒక పొడగరి, దాని నోట్లో చెయ్యి పెట్టి వెతికేడు. వాడి చేతికి I Pad తగిలింది. దాన్ని జాగ్రత్తగా బయటకు తీసేడు. జాగ్రత్తగా శుభ్రపరచి, దాన్ని కాశీపతి చేతుల్లో పెట్టేడు.

తను ఆశలు వదులుకొన్న I Pad కనిపించగానే, కాశీపతి సంతోషానికి హద్దులు కోల్పోయేయి.

“ఒరేయ్, ఆ దొంగ సచ్చినవాళ్ళకి, ఇంటికి వెళ్ళగానే, ఉరి శిక్ష వేస్తాను.” అని, మనవడితో , ధైర్యంగా చెప్పేడు, తాత.

కాశీపతి, ఆర్యభట్ట, ఆ పొదగరివారందరకు ధన్యవాదాలు సమర్పించుకున్నారు. వారిని, వీలు చూసుకొని భూమండలం విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించమని, ఆహ్వానించేరు. వారున్నూ, అదేవిధంగా, కాశీపతిని, ఆర్యభట్టును ఆహ్వానించేరు.

తాత, మనవడు, తివాసీ తెరచుకొని, దానిపై ఆసీనులయ్యేరు. ఆర్యభట్ట మనసులో ఏదో అనుకొన్నాడు. అంతరిక్షంలో ఆరుగంటల ప్రయాణం ముగించుకొని, క్షణాలమీద ఇద్దరూ, ఇల్లు చేరుకొన్నారు. ఆర్యభట్ట, తన స్నేహితునికి, జరిగిన విషయం చెప్పి, I Pad పొందడంలో సహాయం చేసినందులకు, కృతజ్ఞతలు చెప్పుకొని, తివాసీని, అతని చెంతకు పంపించేడు.

కాశీపతి తన I Pad ను నెమ్మదిగా  టేబులు మీద ఉంచేడు. భజగోవిందానికి ఉరి శిక్ష వెయ్యడానికి I Pad తెరచేడు. అంతలో, కాశీపతి రాకకై ఎదురు చూస్తున్న భజగోవిందం ముఠా, ఒక్కమారుగా, మీదపడి, I pad పై పెట్రోలు పోసి, అగ్గిపుల్ల వెలిగించి, దాని మీద  పడేసారు. ఏముంది; I pad భగభగమంటున్న మంటల్లో మాడిపోతున్నాది. భజగోవిందం ముఠా, విరగబడి నవ్వుకొంటూ ఉంటే,

“అయ్యో, నా I Pad అయ్యో, నా I pad , కాలిపోతోంది.” అని, కాశీపతిగారు గొంతు చించుకొని అరుస్తూ ఉంటే,

“ఏమిటయిందండి; I Pad కాలిపోవడమేమిటండి. ఏమయినా పాడు కల వచ్చిందా ; లేవండి, లేవండి.”  అని, ప్రక్కనే పడుకొన్న భార్య కుదిపి కుదిపి లేపితే, కాశీపతిగారు లేచి, ముఖం మీద ఉన్న చెమటను తుడుచుకొని, చెంబుడు నీళ్లు త్రాగి, మళ్ళీ పడుకొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here