[dropcap]వు[/dropcap]న్నట్టుండి తడిమిచూసుకొంటే
కప్పుకొన్న వస్త్రం ముడతలుపడి మురికిదయింది…
వాడుకోవడమే కాని…వదిలింది లేదు
ఉతికిందిలేదు…అయినా… ఎంతప్రేమ,
ఎన్ని అనుభూతులను
సొంతంచేసుకొని, పెనవేసుకొంది….
ఎన్ని రాగాలను అద్దుకొని మరెన్నో
అనురాగాలను వెదజిమ్మింది
అమ్మ ఒడిలో నేసిన నేత
ఎన్నో దారాల కలబోతలతో
రబ్బరులా సాగుతూ మరో బొమ్మను హత్తుకొని
పోసిన అచ్చులను అలరిస్తూ సవరిస్తూ మురసిపోయిన వేళలు…
ఆకలి చితుకుల వెలుగులో
ఆశల చినుకులలో తడుస్తూ
నీరెండలో పొడిబారి పరుగెత్తిన మధుర క్షణాలు ….
వీరీ విరీ గుమ్మడి పండు ఆటలోలా
దాక్కున్న వాళ్ళను పట్టలేక దొంగగానే మిగలడం…..
వసంత కేళులలో జల్లుకొన్న
రంగులు …వర్ణమాలలై.
పట్టాలకై..పరుగులు… పట్టుకొమ్మకు వ్రేలాడినవేళలు
అలరించిన కొలువుల కుసుమ సౌరభాల మత్తులు
విడవని వింత శక్తిని స్తుంటే..
వరదలు,ఉప్పెనలు ముంచెత్తినా
దులుపుకొన్న మొక్కవోని ధైర్యమేది?.
సమాంతర రేఖలెన్నో..
అర్ధాంతరంగా ఆగిపోతుంటే
ఏగాలికి ఎగురుతుందో..
ఏ కొమ్మకు పట్టకొని చిరుగుతుందో అన్న భీతి…
అర్ధం కాని అసంతృప్తి.
కనిపించని సమీరాన్నీ
గమనించని అలసత్వం.
చుట్టూ క్లీబత్వ వస్త్రమయం..
వెలిసిపోయే రంగులమయం
చీకిపోయే నేతలు మెరిసేలా
మరింత మాసికల మెరుగులతో
అయినా …..
ఎప్పటికప్పుడు ఓ శక్తి సమీరం
ముడతలను సవిరస్తూ మడతలుపెడుతోంది.
మరెన్నో.. కొత్త నేతలూ మరీకాస్త జరీతో…
నిరంతరంగా సాగే పట్టు.. లోకంలో