అవధానం ఆంధ్రుల సొత్తు-17

0
5

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

సహస్రావధానం:

మార్చి నెల 28 తేదీన ‘సేవ యూట్యూబ్ – టి.వి ఛానల్’ లో నేను సహస్రావధాని డా. కడిమెళ్ల వరప్రసాద్‌ను ముఖాముఖీ కార్యక్రమంలో రెండు గంటల పాటు ఇంటర్వ్యూ చేశాను. సాహీతీ గోష్ఠిగా ఆ సంభాషణ కొనసాగింది. 1990-2000 మధ్య కాలంలో ‘స్పర్థయా వర్దతే విద్యా’ అన్న సూక్తి ఆధారంగా ఆంధ్రదేశంలోని అవధానులు అంశాల సంఖ్యను పెంచుకొంటూ వెళ్లారు. అష్టావధాన, శతావధానాల పరిధిని అధిగమించి ద్విశతావధాన, సహస్రావధానాల యాగనిర్వహణ కుపక్రమించారు. మా ఇరువురి సంభాషణా క్రమంలో వెలువడ్డ విషయాలను ప్రస్తావిస్తాను.

ప్రస్తుతానికి తెలుగునాట సహస్రావధానాలు ఆరుగురు లబ్ధప్రతిష్ఠులు – డా. మేడసాని మోహన్, డా. మాడుగుల నాగఫణిశర్మ, పద్మశ్రీ డా. గరికపాటి నరసింహరావు, డా. కడిమళ్ల వరప్రసాద్, శ్రీ కోట వెంకటలక్ష్మీ నరసింహం, డా. వద్దిపర్తి పద్మాకర్. వీరు వివిధ సమయాలలో ఈ అవధాన యజ్ఞ నిర్వహణ భారాన్ని వహించారు.

అవధాన ‘భారతీ’ వరప్రసాద్:

ఉభయ గోదావరి జిల్లాలు శతాబ్దాలుగా కవి పండితులకు పుట్టినిండ్లు. తూర్పు గోదావరి జిల్లా ఏడిదలో 1956 జూలైలో భారతి, వెంకటరామయ్య దంపతులకు వరప్రసాదంగా జన్మించారు వరప్రసాద్. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో నేర్పుకొని ఆ తర్వాత పొడగట్లపల్లి ఓరియంటల్ కళాశాలలో భాషాప్రవీణ చేశారు. తెలుగు పండిట్‌గా జీవనయానం కొనసాగించమని తండ్రి ఆదేశించారు. శిరసావహించి నరసాపురం టేలర్ హై స్కూల్లో తెలుగు పండితులుగా సుదీర్ఘకాలం పని చేసి 2014లో రిటైరయ్యారు. ఆ జిల్లాకు కలెక్టర్‍గా పని చేసిన టేలర్ మహాశయుని పేర ఆ పాఠశాల దిగ్విజయంగా నడుస్తోంది. వరప్రసాద్ సతీమణి మీనాక్షి కూడా అక్కడే తెలుగు పండితులుగా పని చేశారు.

డా. కడిమెళ్ల వరప్రసాద్‌

సాధారణంగా ఒక కుటుంబం నుండి అందరూ పద్యకవులు కావడం అరుదైన అంశం. వరప్రసాద్ సతీమణి మీనాక్షి; కుమారులు రమేష్, విరించులు కూడా పద్యకవులు కావడం విశేషం. మీనాక్షి ‘జేగంట’ ఖండకావ్య సంపుటి రచయిత్రి.

కుమారులు రమేష్ అవధాని, కవి, మలయమారుతం, నేస్తం రచనలు వెలయించారు. శ్రీ విరించి అవధాని, కవి. శ్రీవిరించి శతకం, ఆవలిగట్టు రచనలు ప్రచురించారు. తండ్రీ కొడుకులు అవధాన విద్యపై పట్టు సాధించడం విశేషం. రమేష్ వృత్తిరీత్యా హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. విరించి అధ్యాపకులు.

డాక్టరేట్ పరిశోధన:

వరప్రసాద్ బెంగుళూరు విశ్వవిద్యాలయ తెలుగు శాఖధ్యాక్షులు. ఆచార్య తంగిరాల వెంకటసుబ్బారావు పర్యవేక్షణలో మహా భారత అశ్వమేధ పర్వ విశిష్టతపై సిద్ధాంత గ్రంథం సమర్పించి పి.హెచ్.డి పొందారు. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఆ పరిశోధనా పరీక్షాధికారిగా ఆ గ్రంథాన్ని ప్రశంసించారు. బెంగుళూరు విశ్వవిద్యాలయంవారు భారతంలోని అన్ని పద్యాల పైన పరిశోధనలు అప్పట్లో చేయించారు.

అవధాన అరంగేట్రం:

రావూరి వెంకటేశ్వర్లు అప్పట్లో గోదావరి జిల్లాలో ప్రముఖ అవధాని. వారు ఒకసారి నరసాపురంలో పాఠశాలలో అష్టావధాన ప్రదర్శన చేశారు. యువకుడుగా వరప్రసాద్ ప్రభావితుడై కొందరు అధ్యాపకుల ప్రోత్సాహంతో అవధాన ప్రారంభం చేశారు. అది తెలిసిన పాఠశాల ప్రధానాధ్యాపకులు తమ సంస్థలో తొలి అవధానం ఏర్పాటు చేశారు. అప్పటికి అవధాని వయసు రెండు పదులు. అలా నాందీ ప్రవచనం జరిగి రెండు ఆర్లు (66) వయస్సులో కూడా అవధానం జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. 15 వందలపైగా అష్టావధానాలు, 20 శతావధానాలు, రెండు సహస్రావధానాలు జయప్రదంగా నిర్వహించారు.

రసధుని:

పేరులోనే వుంది ఘనత. పాలకొల్లులోని ఈ సంస్థ ఆధ్వర్యంలో వరప్రసాద్ ద్విశతావధానం (200 మంది పృచ్ఛకులు) విశిష్టం. ఒకసారి మేడసాని మోహన్ తణుకులో అవధానం చేశారు. నన్నయ భట్టారక పీఠంవారికి ఆయన ఒక సూచన చేశారు. అప్పుడప్పుడే మోహన్ సహస్రావధానం నిర్వహించి కీర్తి గడించారు. “మీ ప్రాంతంలోని కడిమెళ్ల వరప్రసాద్ సహస్రావధానం చేయగల దిట్ట” అన్నారు. వెంటనే ఆ కబురు వరప్రసాద్ చెవిన వేశారు. సురశర్మాదులు భారీ ఏర్పాట్లు చేశారు. తణుకు నన్నయగారి మహాభారత నాందీ ప్రవచనం చేసిన ప్రదేశం.

“నన్నయభట్టుగారు యజనం బోనరించిన చోటు జమ్మి చెట్టున్నది తణ్కు తూర్పున…” అని ఒక చాటువు ప్రసిద్ధం. భిన్నప్రాంతాల నుండి ప్రేక్షకులను ఆహ్వానించిన నన్నయభట్టారక పీఠంవారు 18 రోజులుపాటు వరప్రసాద్ సహస్రావధానం ఘనంగా నిర్వహించారు. మహాభారత కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు. అవధాన కురుక్షేత్రంలో సవ్యసాచి వరప్రసాద్. ధారణ రోజు తణుకులోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ ఆసాంతం పద్యధారణము తిలకించి పులకించి ఆలకించారని వరప్రసాద్ సగర్వంగా చెప్పారు ఇంటర్య్వూలో. ఆయన జీవితంలో అదొక మైలురాయి.

జంటకవుల అవధానం:

జంటకవులుగా తిరుపతి వెంకటకవులు, కొప్పరపు కవులు, రామకృష్ణకవులు ప్రభృతులు అవధాన  జైత్రయాత్రలు చేశారు. వరప్రసాద్ తన మిత్రులు, అధ్యాపకులైన కోట లక్ష్మీనరసింహంతో కలసి శతావధానం నిర్వహించారు. వీరి అవధానాంశాలలో అష్టావధానంలో గంటగణనానికి బదులు ‘వ్యస్తపది’ అనే వినూత్నాంశం ఎన్నుకొనేవారు. పృచ్ఛకుడు అనుష్టప్ శ్లోకంలోని పాదాన్ని వ్యక్తంగా అడిగితే పూరించి చివరలో శ్లోకం చెప్పడం ఇందులో ప్రత్యేకత. నిషిద్ధాక్షరిలో కూడా సులభమైన పదాలను ఎంచుకొని అర్థం చెప్పగల రీతిలో పద్యాన్ని పూరించేవారు. కొందరు ఏకాక్షర నిఘంటువుపై ఆధారపడతారు. వివరణ సందర్భంలో క్లిష్టత కలుగుతుంది.

రచనా వ్యాసంగం:

సాధారణంగా అవధాన పద్యాలు గాలిలో కలిసిపోతాయనే వాదం ఒకటి వుంది. కాని, ఇటీవలి కాలంలో అవధాన పద్యాలు కూడా గ్రంథస్థమవుతన్నాయి. తిరుపతి వెంకటకవుల పాండవోద్యోగ విజయాది నాటకాలు, తదితర కావ్యాలు వారికి శాశ్వత కీర్తి తెచ్చిపెట్టాయి. వరప్రసాద్ రచనలలో ప్రముఖాలు: సంగమేశ్వర శతకము, మన జాతి, తాంబూలం, మధుజీవనము, అమృతవర్షిణి, త్యాగసింధువు, పెంపుడు చిలుక, ఏడు చేపలు, అహంకార శతకము, గాండీవం, శిష్యశతకము, అన్నశతకము (అచ్చతెలుగులో). వీటన్నింటికీ మించి ‘గోభాగవతం’ ప్రశస్తం. గోమాత ప్రాధాన్యాన్ని వెలికి తీసే నాలుగు గాథలను కావ్యరూపంలో సంతరించారు. రఘువంశంలోని దిలీపుడు రామాయణ విశ్వామిత్రుడు, గౌతముడు, చ్యవనుడు –  అనే నలుగురి జీవన గమనాలను పద్యరూపంలో ప్రకటించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈ కావ్యాన్ని తలపై ధరించి ప్రదక్షిణలు చేసి తొలి ప్రతిని శృంగేరీ పీఠాధిపతుల పాదాల ముందు సమర్పించారు.

గురుశిష్య పరంపర:

వరప్రసాద్‌కు ప్రముఖ గురువుల సాన్నిధ్యం లభించింది. అవధాన విద్యకు, పాండితీ ప్రాభవానికీ వారు జ్ఞానంజన శలాకలయ్యారు. మహామహోపాద్యాయ శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి (రాష్ట్రపతి పురస్కార గ్రహీత), మహామహోపాద్యాయ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ, ఆచార్య కొంపెల్ల రామసూర్యనారాయణ (రాష్ట్రపతి పురస్కార గ్రహీత), కొంపెల్ల సత్యనారాయణ, రావూరి వెంకటేశ్వర్లు, కొట్టే కోటారావు, అత్తిలి గోపాలకృష్ణమాచార్యులు –  ప్రముఖులు, వరప్రసాద్ అనే వజ్రానికి సాన పెట్టిన ఘనలు వీరు.

సంస్కృతంలో చింతాంబికాష్టకం, గురువందనం, దాసోహం, శ్రీరామశతకం ప్రకటించారు. శతావధాన చంద్రిక, సహస్రశారద పేర తమ అవధాన పద్యాలు గ్రంధస్థం చేశారు. వద్దిపర్తి పద్మాకర్ వంటి శతావధానులకు గురువుగా నిలిచి గురు సహస్రావధాన బిరుదు నందుకున్నారు. ఎందరో అవధానులకు అవధానంలో మెళకువలు బోధించి తీర్చిదిద్దారు.

బిరుదావళి:

వరప్రసాద్‌ను వివిధ సంస్థలు బిరుదులతో సత్కరించాయి. అవి – భారతీపుత్ర, పండితరత్న, అష్టావధాన సమ్రాట్, నేత్రావధానశేఖర, శతావధాన సార్వభౌమ, అవధాన కళానిధి, శతావధాన చక్రవర్తి, శతావధాన చూడామణి, సహస్రావధాన భాస్కర, గురు సహస్రావధాని.

పురస్కర పరంపర:

వరప్రసాద్‌ను పలువురు పీఠాధిపతులు ఆశీఃపురస్సరంగా సత్కరించారు. వారిలో శృంగేరీ పీఠాధిపతి, కుర్తాళం పీఠాధిపతి, శ్రీ పీఠాధిపతి, దత్త పీఠాధిపతి, విజయదుర్గా పీఠాధిపతి ప్రముఖులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు – ఉగాది పురస్కారం, భాషాపురస్కారాలు అందించారు. తెలుగు విశ్వవిద్యాలయం అవధాన పురస్కారం, బచ్చు పౌండేషన్ వారి లక్ష రూపాయల నగదు పురస్కారం, నవయుగ ఇంజనీరింగు సత్కారం ఒక ఎత్తు; కనకాభిషేకము, సువర్ణ ఘంటాకంకణ సత్కారాలు, పల్లకీలో ఊరేగింపు మరొక ఎత్తు. అక్కినేని నాగేశ్వరరావు జన్మదిన అవధాన పురస్కారం చిరస్మరణీయం.

విదేశీ (పర్యటనలలో) అవధానాలు:

దుబాయ్, బెహరైన్, సింగపూరు, అమెరికాలలో పలుమార్లు పర్యటించి అవధాన ప్రదర్శనలిచ్చారు.

ఛానళ్లలో ప్రవచనాలు:

సంస్కృతి చానల్‌లో ‘వింటే భారతం వినాలి’  పేర 500 ఎపిసోడ్లు, జ్ఞానయోగి చానల్‌లో డైలీ – 150 ఎపిసోడ్లు, దూరదర్శన్, భక్తి, యస్.వి.బి.సి ఛానళ్లలో వీరి వివిధ కార్యక్రమాలు ప్రతిష్ఠను పెంచాయి.

(మళ్ళీ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here