పెంకుటిల్లు

0
3

[dropcap]ఈ [/dropcap]రోజు మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంది? అందులోనూ వసంత కాలంలో ఈ ఉదయ కాలం మరింత మనోహరంగా ఉంది. నిన్నటి రోజు ఏదో అశాంతిగా మనస్సు చికాకు చికాకుగా ఉంది. ఇలా ఆలోచిస్తూ ఉన్నానో లేదో మా తమ్ముడి నుండి ఫోను వచ్చింది. సారాంశ మేమిటంటే మా అన్నయ్య కొడుకు మా పూర్వీకుల ఇల్లు ఎవరో పరాయి వాళ్ళకి అమ్మేసేడని. ఈ విషయం వినగానే అంత వరకూ ఉన్న ప్రశాంతత స్థానంలో నిరుత్సాహం, నిస్సత్తువ వ్యాపించాయి. అన్నయ్య కొడుకు మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఆ ఇంటికి ఓ చరిత్ర ఉంది.

అదే అన్నయ్య కొడుకు ఇల్లు అమ్ముకుంటే మీకెందుకు బాధ? అని అడగవచ్చు. అదే వాడు కొనుగోలు చేసిన ఇల్లు అమ్ముకుంటే మాకు బాధ లేకపోను. బాధ ఎందుకంటే వంద సంవత్సరాల క్రితం అమ్మమ్మ కొనుకున్న పూర్వీకుల ఇల్లు, ఎవ్వరినీ సంప్రదించకుండా అమ్మేసేడు, అదే నా బాధ. అన్నయ్య కొడుకేంటి ఇలా చేశాడు? వాడికి డబ్బు అవసరమయితే మనకి చెప్పచ్చుకదా? మన పూర్వీకుల ఇల్లు మనలో ఎవరో ఒకరిమి ఉంచుకుందుము కదా! అని అనుకున్నాను.

మా పూర్వీకుల పెంకుటిల్లు పూర్వాపరాల్ని ఓసారి అవలోకిస్తే సూమారు నూరు సంవత్సరాల క్రితం అమ్మమ్మ తన ఇరవై సంవత్సరాల వయస్సులో భర్త చనిపోతే పుట్టింటికి చేరింది. అక్కడ ఆమెకి బండ చాకిరీ తప్పలేదు. అలాగే నిస్సారంగా జీవితం గడిపేస్తున్న ఆమెకి నిర్వాకం చేయాలన్న ఆలోచన వచ్చింది, అమ్మమ్మ చెల్లెలి భర్తకి. అమ్మమ్మ దగ్గరున్న కొద్దిపాటి బంగారాన్ని అమ్మించి, ఆమె తల దాచుకోడానికి ఓ పెంకుటిల్లు కొనిపించాడు.

ఆ ఇల్లు ఎంత మంచిదంటే అన్ని శుభకార్యాలే జరగాయి. అమ్మమ్మకి అమ్మ ఒకర్తే కూతురు అవడం వల్ల అమ్మమ్మ తరువాత అమ్మకి వారసత్వంగా ఆ పెంకుటిల్లు మీద హక్కు వచ్చింది. ఆ ఇంట్లోనే సుమారు ముప్పయి, నలభై మంది వారసులు పుట్టి ఉంటారు. పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, బాలసారెలు, ఇంకా ఎన్నో చిన్న పెద్ద శుభకార్యాలు ఆ ఇంట్లో జరిగాయ. ఎంతమందో చదువుకున్న వాళ్ళు, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.

అమ్మమ్మ తాను చనిపోతున్న సమయంలో అమ్మతో “ఈ ఇల్లు చాలా శుభకరమైనది. ఈ ఇంట్లో మనం కొనక ముందు యజ్ఞాలు చేసేవారట. కొన్న తరువాత మనకి ఎన్నో శుభకార్యాలు జరిగాయి. ఎన్నో తుఫాల్ని తట్టుకుంది, పక్కా భవనాలు కూలిపోయినా, భయంకర గాలివానలకి తుఫానులకి తట్టుకుని నిలబడింది. ఎందుకు చెప్తున్నానంటే నేను చనిపోయిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇల్లు అమ్మవద్దు. పరాయి పాలు కాకుడదు. మన వంశం వాళ్ళ దగ్గరే ఉండాలి” అని అమ్మ దగ్గర మాట తీసుకుని కన్ను మూసింది అమ్మమ్మ.

మా బాల్యమంతా ఆ ఇంట్లోనే జరిగింది. మా బాల్యమే కాదు, మా పిల్లల బాల్యం కూడా ఆ పెంకుటింట్లోనే జరిగింది. చివరికి ఆఖరి పుట్టుక ఆ ఇంట్లో మా మనుమరాలిది. ఆ ఇల్లు ఉన్న ఊర్లోనే నాకు ఉద్యోగం. మా అమ్మ కూడా మా దగ్గరే ఉండేది. మనవల్ని ఆడిస్తూ రోజులు గడిపింది.

ఆ ఇంట్లో నివాసం ఉండడం నాకు సుమారు నలభై సంవత్సరాల అనుబంధం. ఎన్.జి.ఓ. కోపరేటివ్ సోసైటీ ద్వారా ఉద్యోగులందరికీ ఇల్లు కట్టుకోడానికి స్థలాలు మంజూరయినప్పుడు నాకు ఓ స్థలం లభించింది. నేను ఆ స్థలంలో ఇంటిని కూడా నిర్మించుకున్నాను.

అమ్మమ్మ చనిపోయే వరకూ నేను ఆ పెంకుటింట్లోనే ఉన్నాను. మా పెద్దమ్మాయి పెళ్ళవడం, దానికి కూతురు పుట్టడం ఆ ఇంట్లోనే జరిగింది. అమ్మ చనిపోయిన తరువాత మా అన్నయ్య “మీ అందరికీ ఇళ్ళు ఉన్నాయి. నాకు ఇల్లు లేదు. నేను ఈ పెంకుటిల్లు తీసుకుని ఉందామనుకుంటున్నాను. మీ అందరికీ ఖరీదు కట్టి ముదరాలు ఇస్తాను” అన్నాడు.

అన్నయ్య మాటలు మాకు నచ్చాయి. “మనలో మనకి బేరసారాలేంటి? నీకు తోచినంత ఇయ్యి. పట్టింపులేదు. మన ఇంటి పేరు గల వాళ్ళ దగ్గరే  కదా ఇల్లు ఉంటుంది” అని అనిన మా కుటుంబ సభ్యులు అన్నయ్య ప్రస్తావనని బలపరిచారు. ఈ విధంగా అన్నయ్య వశమయింది ఆ పెంకుటిల్లు.

అన్నయ్య వదినగారితో సుమారు పది సంవత్సరాలు ఉన్నారు. ఆ తరువాత కొడుకు దగ్గరికి వెళ్లిన తరువాత తన ఇంటికి తిరిగి రాలేదు. అక్కడే తనువు చాలించారు అన్నయ్య, వదిన నెలల తేడాలోనే. అన్నయ్య కొడుకు గురించి చెప్పుకుంటే వాడు ఇంట్లో డమ్మీ. ఈ ఇల్లు అమ్మే ఆలోచన వాడిది కాదు. వాడి చేతిలో ఏం లేదు. వాడి పరిస్థితి తెలిసి కూడా జాలిపడాలి, అంతే కాని మరింత బాధ పెట్టకూడదు అని అనుకున్నా. మా తమ్ముళ్ళు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. “మాకు చెప్తే మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంచుకుందుము కదా. మా పూర్వీకుల ఆ పెంకుటిల్లు మాకు తాజమహలు కన్నా విలువైనది” అని నిలదీసారు.

అన్నయ్య కొడుకు కొద్దిగా నెమ్మది. కాని వాడి కొడుకులు మాత్రం రేపటి తరానికి వారసులు. “మా తాతగారు తను చనిపోతున్న సమయంలో ఇంటిని మీ అందరితో సంప్రదించి అమ్మమన లేదు. అది మా తాతగారి ఇల్లు. ఆ తరువాత వారసులమైన మాది. మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం” అన్నారు.

దాని మీద మా తమ్మడికి చాలా కోపం వచ్చింది. “ఇది మా వారసత్వ సంపద. అందుకే అడుగుతున్నాం. మా అన్నదమ్ముడే అని ఎంతో కొంత ఇచ్చేయ్ అని, మన ఇంటి వాళ్ళ పేరున ఉంటుందని ఖరీదు కూడా కట్టకుండా ఇచ్చేము. అప్పుడే అమ్మకుంటే ఎంతో డబ్బు వచ్చేది. ఇక్కడ మా పూర్వీకుల ఇల్లు అమ్మేసేరు. మా బాల్యంలో మాకు ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంటిని ఇప్పుడు లక్షలకి లక్షలు తీసుకుని పరాయి వాళ్ళకి అమ్మేసేరు. ఇప్పుడు అది పరాయి సొత్తు అయిపోయింది. అదే మా బాధ” అని తమ్ముడు అన్నయ్య మనుమలకి తీవ్రంగా సమాధానం ఇచ్చాడు. అన్నయ్య కొడుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడుతాడు? ఆ ఇంట్లో వాడికే అధికారం ఉందో లేదో?

ప్రతీ మనిషిలోనూ బలాలూ బలహీనతలు ఉంటాయి. కొంతమంది తమ బలాల గురించి ఆలోచిస్తారు. చెప్పుకుంటారు. కాని బలహీనతల్ని గురించి చెప్పుకోరు. అయితే నా బలహీనత ఏంటంటే బాల్యం నుండి ఇప్పటి వరకు సుమారు ఏభై సంవత్సరాలు ఆ పెంకుటిల్లు నాకు ఆశ్రయం ఇచ్చింది. ఆ మమకారంతోనే ఆ పెంకుటిల్లు మా కుటుంబ సభ్యులకి కాకుండా పరాయి వాళ్ళ పాలవుతోంది అని తెలిసి బాధ పడతున్నాను. ఆ పెంకుటిల్లు రూపం నా కళ్ళెదుట కదలాడుతూనే ఉంది.

ఆ ఇంటి ఎదురుగా తమ్ముడు ఉంటున్నాడు. వాడు ఆ పెంకుటింటిని పడగొట్టిన దగ్గర నుండి అన్ని విషయాలూ చెప్తుంటే ఎంతో బాధ.  ఆ ఇంటికి దూరంగా ఉండి అక్కడ విషయాలు వింటూ ఉంటేనే నాకు ఎంత బాధగా ఉంది కదా! ఎదురుగా ఆ దృశ్యాలను చూస్తున్న తమ్ముడు ఎంత బాధపడి ఉంటాడో అని అనుకున్నాను.

మా తమ్ముడు వాళ్ళ ఇంటికి రమ్మనమని పిలుస్తూ ఉన్నా, పరాయి పాలయిన, నాశనం చేయబడ్డ ఆ పెంకుటింటి శిధిలాలు చూడలేక మా తమ్ముడింటికిటి వెళ్ళడం మానుకున్నాను. ఆ పెంకుటిల్లు చూడ్డానికి మామూలు పెంకుటిల్లు అవచ్చు. విశాలమైనది కాకపోవచ్చు. అయితే ఇరుకు మనస్తత్వం గల మనుష్యుల మనస్తత్వం కన్నా విశాలమైన దనిపిస్తుంది నాకు.

జీవితంలో ఎన్నో కష్టనష్టాలు, కన్నీళ్ళు, అవమానాలూ, నిందలు, నిష్ఠూరాలు ఆ ఇంట్లో జరిగి ఉండొచ్చు. వాటితో బాటు తాము అనుభవించిన సుఖాలు, ఆనందాలు, బాల్యంలో అనుభవించిన మధురిమలు అప్పటి మధుర జీవితాన్ని తలుచుకుంటూ ఉంటే మేము అనుభవించిన కష్టనష్టాలు, కన్నీళ్ళు, నిందలు అన్ని దిగదుడుపే. వాటి నన్నింటిని మరిచిపోతాం. వెను వెంటనే వేదాంత భావం. కష్ట సుఖాల కలయికే మానవ జీవితం. అన్నింటిని మనం ఆస్వాదించాలి.

అన్నయ్య చనిపోయిన తరువాత ఆ పెంకుటింటిని అన్నయ్య కొడుకు పట్టించుకోలేదు. ఇల్లు పాడవుతోంది. శిధిలావస్థకి చేరుకుంటోంది అని తమ్ముడు చెప్తూ ఉంటే ఎంత బాధ పడిపోయాను. అందమైన పూల తోట అది. మన కళ్ళెదుట కాకుండా నాశనం అయినా, ఆ నాశనాన్ని మనం చూడనంత వరకూ అది మన కళ్ళెదుట అందంగానే అగుపిస్తుంది. ఆ పూల తోట నాశనం కళ్ళారా చూసిన తరువాత దాన్ని చూసిన మన గుండెల్లో చెప్పనలవి కానంత బాధ. ఆ శిధిలావస్థకి చేరుకుంటున్న ఆ ఇల్లు మేము చూడనంత వరకు అది మనకి అందమైన పూలతోటే అని అనుకున్నాను.

మన హైందవ సిద్ధాంతం ప్రకారం శరీరం నాశనం చెందుతుంది కాని ఆత్మకి చావు లేదు అంటారు. తమ పెంకుటిల్లు తమ వారసుడు పరాయివాళ్ళకి అమ్మేసాడు అని తెలిసి ఆ ఇంటి శిధిలాలను చూసి అమ్మమ్మ, అమ్మ, అన్నయ్యల ఆత్మలు ఎంత క్షోభిస్తున్నాయో అని అనుకున్నాను నేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here