జ్ఞాపకాల తరంగిణి-44

1
4

[dropcap]పో[/dropcap]తం జానకమ్మ రాఘవయ్య ఇంగ్లాండు యాత్రాచరిత్ర ‘పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్’ చదివేముందు జానకమ్మ స్వస్థలం మద్రాసు నగర నేపథ్యం తెలుసుకున్నప్పుడే ఆమె జీవితం, పెరిగిన వాతావరణం అవగాహన చేసుకున్నప్పుడే ఆమెను మద్రాసు నుంచి ఇంగ్లాండ్ వరకు తీసుకొని వెళ్ళిన ప్రభావాలు అర్థమవుతాయి. ఆమెకు ముందు మద్రాసుకు రెండువందల సంవత్సరాల చరిత్ర ఉంది. వలసపాలకులు మద్రాసును వాణిజ్య కేంద్రంగా చేసుకొన్న తొలిరోజుల్లో తెలుగు, తమిళం తెలియక, స్థానిక సంప్రదాయాలు, వ్యాపార మర్యాదలు అర్థంకాక దుబాసీలను నియమించుకోవలసి వచ్చింది. ఈస్టిండియా కంపెనీకి దుబాసీలుగా వ్యవహరించిన పచ్చయయ్యప్ప పిళ్లె, అవధానం పాపయ్య, మద్రాసు ప్రఖ్యాత వ్యక్తులుగా స్థిరపడ్డారు. పాండిచ్చేరిలో ఫ్రెంచ్ వారి దుబాసీగా పనిచేసిన ఆనందరంగపిళ్ళె కూడా అంతే ప్రసిద్ధుడు.

మద్రాసు ఎగుమతి, దిగుమతి వాణిజ్యకేంద్రమైన తర్వాత, ఆంధ్రదేశంనుంచి అనేక కులవృత్తులవారు, ప్రధానంగా కోమట్లు, బలిజలు, బ్రాహ్మణులు మద్రాసుకు వలస వచ్చారు. నాయకరాజుల కాలానికే బలిజలు సైనికోద్యోగాల్లో, వ్యాపారాల్లో ముందువరసలో నిలిచి, కొత్త అవకాశాల కోసం దూరప్రాంతాలకు వెళ్లి స్థిరపడే సాహసంతో ఉన్నతికి వచ్చారు. అప్పుడప్పుడే మద్రాసులో ఆయా కులవృత్తులవాళ్లు కులసంఘాలు ఏర్పరచుకొని బలీయమైన శక్తులుగా నిలదొక్కుకుంటున్నారు.

1820 నాటికి మద్రాసులో ప్రతిసందులో వీధిఅరుగు బడి పయాల్ స్కూల్ ఉంది. క్రిస్టియన్ మిషనరీలు కంపెనీ ప్రభుత్వం సహకారంతో మద్రాసులో పాఠశాలలు, వైద్యశాలలు, చర్చిలు నెలకొల్పి మతప్రచారం చేస్తున్న సమయం. ఈ నూతన వాతావణంలోనే మద్రాసు హిందూ లిటరరి సొసైటీ ఏర్పడిన తర్వాత, ఆ సమాజ వేదికమీదినుంచి రాజకీయ, విద్యా విషయాల మీద దేశీయ విద్యావంతులు, పాశ్చాత్య పండితులు ఉపన్యాసాలు చేసి హిందువులను మేల్కొలుపుతున్న తరుణంలోనే మద్రాసులో మిషనరీలు కొద్దిమంది విద్యార్థులను క్రిస్టియన్ మతంలోకి మార్చడంతో హిందు, క్రైస్తవ సమాజాల మధ్య పెద్ద అఖాతం ఏర్పడి, హిందూసమాజం తమ బాలబాలికల కోసం ప్రత్యేకంగా స్కూళ్లు నెలకొల్పడం మొదలయింది. వాణిజ్య వ్యాపారాల్లో కొత్తగా సంపదను పోగుచేసుకొన్న ధనవంతులు ధర్మకార్యాలు చేస్తూ సంస్కృత పాఠశాలలు, ధర్మసంస్థలు నెలకొల్పారు. ఈ నేపథ్యంలోనే పచ్చయ్యప్ప ధర్మనిధి వంటి సంస్థలు, 1842లో మద్రాసులో పచ్చప్పయ్య విద్యాసంస్థ ఆవిర్భవించాయి.

మిషనరీలు పత్రికలద్వారా చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కొనడానికి హిందువులు కూడా అచ్చుకూటాలు, పత్రికలు నెలకొల్పి మిషనరీల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నం చేశారు. సి.వెంకటరాయుడు Native Interpreter పత్రిక ప్రారంభించి హిందువుల పక్షాన రాస్తూవచ్చాడు. 1840-60 మధ్య గాజుల లక్ష్మీనరసుచెట్టి మద్రాసు పౌరజీవితంలో ప్రముఖులుగా ఉంటూ క్రెసెంట్ పత్రిక ద్వారా హిందూ సమాజానికి గొప్ప సేవచేశాడు. కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్లె, గాజుల లక్ష్మీనరసుచెట్టి మహజర్లద్వారా భారతీయుల సమస్యలను బ్రిటిష్ పార్లమెంట్ దృష్టికితెచ్చారు.

పాశ్చాత్యవిద్య ద్వారానే భారతీయ సంస్కృతి యొక్క పునరుజ్జీవనం సాధ్యపడగలదని భావించిన కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె స్త్రీవిద్యకోసం కృషిచేశాడు. ఆనాటి మద్రాసు ప్రముఖులు ఏనుగుల వీరాస్వామి, వెన్నెలకంటి సుబ్బారావు, వెంబాకం రాఘవచారి మొదలైన వారు, మద్రాసు సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ జార్జ్ నార్టన్ పాశ్చాత్యవిద్య తోనే హిందువులు రాజకీయ ప్రయోజనాలు పొందగలరని భావించారు. హిందూ లిటరరి సొసైటీ పర్యవేక్షణలో మద్రాసులో ఇంగ్లీషు బోధించే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. నార్టన్, శ్రీనివాసపిళ్లై కృషివల్ల 1841లో మద్రాసు యూనివర్సిటీ హైస్కూలు పార్రంభమై అది క్రమంగా 1858కి మద్రాసు యూనివర్సిటీగా పరిణమించింది.

శ్రీనివాసపిళ్లె స్త్రీవిద్య, వితంతువివాహాలు, బడుగు వర్గాల ఉన్నతి వంటి అంశాలపై హిందూ ప్రోగ్రెసివ్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ నెలకొల్పి ప్రచారం చేశాడు. ఈ ఉద్యమానికి దన్నుగా ప్లీడరువృత్తిలో ఉన్న ఎం.సుబ్బరాయుడు రైసింగ్ సన్ పత్రిక ప్రారంభించి సంస్కరణోద్యమానికి సహకరించాడు.

ఆ రోజుల్లో మద్రాసు పత్రికల్లో స్త్రీవిద్య, వితంతువివాహాలు, సంఘసంస్కరణ, వివాహాల్లో అతివ్యయం, పెళ్ళిళ్ళలో వేశ్యల మేజువాణీలు వంటి విషయాలమీద, 1856 విడో మ్యారేజ్ ఆక్ట్ మీద అనుకూల, వ్యతిరేక చర్చలు సాగుతూండేవి. శ్రీనివాసపిళ్లె హిందూ రీడింగ్ రూమ్, హిందూ డిబేటింగ్ సొసైటీ నెలకొల్పి విద్యార్థుల్లో సమస్యలను విశ్లేషించి ఉపన్యసించే నేర్పు, ప్రశ్నించే గుణాన్ని పెంపొందించడానికి దోహదం చేశాడు. ఇవన్నీ అరకొర ప్రయత్నాలే కావచ్చుగాని, మద్రాసులో నూతన భావోదయానికి ఇవి స్ఫూర్తినిచ్చాయి.

మద్రాసు యూనివర్సిటీ స్కూల్లో ఫీజులు ఎక్కువగా ఉండండంవల్ల ఉన్నత వర్గాలవారికి మాత్రమే అందులో చదువుకోడానికి అవకాశాలు లభించాయి. ఆ స్కూల్లో చదువుకొన్న టి.మాధవరావు, సి.వి.రంగనాథశాస్త్రి మొదలైన వారు పాశ్చాత్య విద్యల ప్రభావంలో స్త్రీవిద్య, రజస్వలానంతర వివాహాలు మొదలైన సమస్యలమీద పనిచేశారు. 1858లో మద్రాసు, బొంబాయి, కలకత్తా విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడడాన్ని గొప్ప సంఘటనగానే పేర్కొనాలి.

బాలికావిద్య, బడుగు, పేద వర్గాల పిల్లల విద్యకోసం విశేషంగా కృషిచేసిన మేరీ కార్పెంటర్ 1866లో మద్రాసు వచ్చినపుడు, Public Instruction Director పావెల్ సహకారంతో హిందూ బాలికల స్కూళ్లలో టీచర్లుగా పనిచేయడానికి మహిళలకు శిక్షణ గరపే నార్మల్ స్కూళ్లు నెలకొల్పబడాలని ప్రచారం చేయడమేకాక, హిందూ సమాజానికి నచ్చజెప్పి మద్రాసులో మహిళలకు నార్మల్ స్కూల్ పెట్టించింది. అంతకు కొంచం ముందే, 1864లో కేశవచంద్రసేన్ మద్రాసువచ్చి కులనిర్మూలన, స్త్రీవిద్య, సంఘ సంస్కరణ వంటి బ్రహ్మసమాజ ఆదర్శాలను వివరిస్తూ చేసిన ఉపన్యాసాలు మద్రాసు యువ విద్యార్థుల మీద గొప్ప ప్రభావం కలిగించాయి. కేశవచంద్రసేన్ మద్రాసు వచ్చిన మూడునెలల లోపలే మద్రాసులో వేదసమాజం పేరుతో బ్రహ్మసమాజ శాఖ ప్రారంభమై, తెలుగు, తమిళ, ఇంగ్లీషు పత్రికలద్వారా ఆ సమాజ భావాలు ప్రచారమయ్యాయి. 1864లో చదలవాడ అనంతరామశాస్త్రి రజస్వలానంతర వివాహాలను సమర్థిస్తూ మనుధర్మ శాస్త్రాన్ని ఉటంకించి సంస్కృతంలో ‘వివాహ్య కన్యా స్వరూప నిరూపణం’ అనే పేరుతో పుస్తకం ప్రచురించాడు. కొందరు న్యాయవాదులు ఆ సమయంలోనే రజస్వలానంతర వివాహాలను జరిపించడానికి ప్రయత్నాలు చేశారు. దేశీయ పత్రికాధిపతులు తెలుగు, తమిళ పత్రికల ద్వారా ఈ నూతన భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు. దంపూరు వెంకట నరసయ్య అనే పద్దెనిమిదేళ్ళ యువకుడు లెటర్స్ ఆనే హిందూ మేరేజస్ పేరుతో రజస్వలానంతర వివాహాలమీద చెలరేగిన వాదవివాదాలను పుస్తక రూపంలో ముద్రించి, అందులో మృత సంప్రదాయాలను విడిచిపెట్టి ఆధునిక యుగానికి అనుగుణంగా నూతన భావాలను ఆమోదించమని, రజస్వలానంతర వివాహాలను సమర్థించాడు.

సరిగ్గా ఇటువంటి వాతావరణం, భావజాలం మద్రాసులో నెలకొంటున్న సమయంలో 1840 ప్రాంతంలో జానకమ్మ తెలుగు బలిజ వ్యాపారస్థుల కుటుంబంలో జన్మించి ఉంటుందని ఊహించుకోవచ్చు. ఆమె, భర్త పేరు రాఘవయ్య అని, వారున్న ఇంటికి ‘Brampton Home’ అని పేరు పెట్టుకొన్నట్లు, అది మద్రాసు ఎగ్మూరులో ఉందని తప్ప ఆమెను గురించిన మరేవివరాలు తెలియవు.

జానకమ్మ తమ ఇంటిపేరు పోతం అని, ఆనాటి ఉన్నత వర్గాల మర్యాదల ప్రకారం భర్త పేరును తనపేరు చివర తగిలించుకొని ‘పోతం జానకమ్మ రాఘవయ్య’ అని చెప్పుకొంది. పోతం ఇంటిపేరుతో ఎవరూ లేరుగానీ, పోతంసెట్టి ఇంటిపేరుతో అనేక కుటుంబాలవారు దేశమంతా ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో తన మరిది పి. వెంకటాచల చెట్టి బొంబాయి ఓడరేవుకు వచ్చినట్లు జానకమ్మ పేర్కొంది. వెంకటాచల చెట్టి తన మిత్రుడు పి.వెంకటకృష్ణమనాయుడుతో కలిసి 1871-1872లో ఇంగ్లండ్ పర్యటించినట్లు, కృష్ణమనాయుడు మద్రాసులో ప్రత్తి వ్యాపార సంస్థ దళారనీ, వీళ్లిద్దరు రైల్వే ప్లాట్ఫారం మీద విక్టోరియా రాణిగారు కనపడగానే కాస్త వంగి వినయంగా నమస్కరిస్తే, ప్రతిగా రాణి గారు కూడా కాస్త వంగి విష్ చేసినట్లు ఇంగ్లండ్ స్థానిక పత్రికలు ప్రచురించిన వార్తలో ‘పోతంసెట్టి వెంకటాచల చెట్టి’ అనే రాశాయి. ఇంతదూరం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే జానకమ్మ తన ఇంటిపేరులో సెట్టిని తొలగించుకొన్నదని చెప్పడానికే.

జానకమ్మ ఆంగ్లంలో రాసిన తన యాత్రాచరిత్రను, మద్రాసు యాక్టింగ్ గవర్నర్‌గా చేసిన విలియం రోజ్ రాబిన్సన్ అర్థాంగి శ్రీమతి జూలియా ఎలిజబెత్ రాబిన్సన్‌కు అంకితం చేస్తూ, జూలియా మద్రాసులో హిందూ స్త్రీజనోద్ధరణ కోసం పాటుపడుతున్నట్లు ప్రశంసించింది. ఆ అంకిత వాక్యాలవల్ల మాజీ గవర్నర్ గారి సతీమణితో తనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

జానకమ్మ 1871లో మొదటిసారి లండన్ ప్రయాణం పెట్టుకొన్నపుడు బొంబాయిలో ప్రార్థన సమాజ ప్రముఖులు డాక్టర్ ఆత్మారాం పాండురంగ గారమ్మాయిలు దుర్గ, మానిక్, అన్నపూర్ణల చేత బ్రిస్టల్లో ఉంటున్న మేరీ కార్పెంటర్‌కు పరిచయలేఖలు కూడా రాయించుకొంది కానీ, ఆ యేడు ఇంగ్లండ్ వెళ్తున్న బృందంలో తానొక్కటే మహిళ కావడంతో బంధుజనం ఆమెను వెళ్లవద్దని గట్టిగా పోరి ఆమెచేత ప్రయాణం మాన్పించినా, ఆమె తన స్నేహితురాళ్ళు దుర్గ,అన్నపూర్ణ, మానిక్‌ల వెంట బొంబాయి నగరం అంతా దర్శించింది. ఈ ముగ్గురు అమ్మాయిలు కొంత కాలం లండన్లో చదువుకొన్నట్లు తెలిసింది.

డాక్టర్ ఆత్మారాం పాండురంగ కుటుంబం బొంబాయిలో గొప్ప పేరు ప్రతిష్ఠలున్న కుటుంబం, పూర్తిగా ఇంగ్లీషు జీవిత విధానానికి మారిపోయిన పాండురంగ 1878లో బొంబాయి షరీఫ్‌గా ఎన్నికయ్యాడు కూడా. దేవేంద్రనాథ టాగోర్ గారి కుటుంబం, పాండురంగ కుటుంబం సన్నిహితంగా మెలిగేవి. పాడురంగ కేశవచంద్రసేన్ అభిమాని. వీరే బొంబాయి ప్రార్థన సమాజాం, బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీల స్థాపకులు. పాండురంగ గొప్ప సంస్కృత పండితులని పేరుపొందారు. ఇటువంటి గొప్ప కుటుంబంతో పరిచయం, స్నేహాలను పరిగణనలోకి తీసుకొని జానకమ్మ కూడా గొప్ప పేరుప్రఖ్యాతి గల విద్యావంతుల కుటుంబం తాలూకు మనిషనిపిస్తుంది. 1871లో పాండురంగ మూడవ కుమార్తె అన్నపూర్ణకు సుమారు 14 సంవత్సరాలు. దుర్గ, మానిక్ లేక మేనకల వయసెంతో తెలియదు. పాండురంగ కుమార్తెలు తన స్నేహితురాళ్ళని జానకమ్మ చెప్పుకొన్నా, ప్రధానంగా ఈ స్నేహం రెండు బ్రహ్మసమాజ కుటుంబాల మధ్య పరిచయాలే అని భావించడానికి అవకాశం ఎక్కువ. జానకమ్మ దంపతులు 1871లోనే ఇంగ్లండ్ పర్యటన పెట్టుకొని పొగ ఓడలో టిక్కెట్లు కూడా రిజర్వు చేసుకొన్న తర్వాత చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఈ అంశాలన్నిటినీ పరిగణించినపుడు జానకమ్మకు లండన్ వెళ్ళినపుడు ఆమెకు కనీసం 20-25 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని రచనలో ఆమె వ్యక్తం చేసిన ఆమె వ్యక్తం చేసిన భావాల పరిణతిని బట్టి కూడా, అభిప్రాయాల పరిమితిని బట్టి కూడా అనిపిస్తుంది. 1872కే ఆమె మరిది ఇంగ్లండ్‌లో న్యాయశాస్త్రం చదువుతూ, వ్యాపారం వ్యవహారాలు చూచుకొంటున్నాడు.

జానకమ్మ మద్రాసులో క్రైస్తవుల బడిలో చదువుకొని ఉంటుంది. తనకు ఇంగ్లీషులో సంభాషించడం వచ్చని, అవసరమైనపుడు భర్త సహాయం, లేదా తన వెంట వచ్చిన ఆయా సహాయం తీసుకున్నానని, ఏమైనా తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా పొగ ఓడ ప్రయాణంలో, ఇంగ్లాండులోనూ వ్యవహరించగలిగానని రాస్తుంది. మద్రాసులో ఆమె ఉన్నతవర్గాల పరిచయస్థులను గుర్తుచేసుకొన్నపుడు, పర్యటనానుభవాలను ఇంగ్లీషులో రాయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తిగానే అనిపించింది.

జానకమ్మ పర్యటనానుభవాలను తెలుగులో చిన్న లేఖారూపంలో రాసి కొక్కొండ వెంకటరత్నం పంతులు సంపాదకత్వంలో మద్రాసునుంచి వెలువడిన శ్రీ ఆంధ్రభాషాసంజీవనిలో ప్రచురించింది. తర్వాత ఆ లేఖనే ‘మద్రాసు ఎథీనియం అండ్ డైలీ న్యూస్’ పత్రిక కాస్త వ్యాఖ్యానం జోడించి ఇంగ్లీషు అనువాదం ప్రచురించింది. జానకమ్మ 1876లో ప్రచురించిన Pictures Of England పుస్తకంలో పై ఉత్తరాలను ఇచ్చిందిగానీ తెలుగు లేఖకు ఇంగ్లీష్ అనువాదాన్ని మాత్రమే పొందుపరచింది.

ఇప్పటికి మనకు తెలిసినంతవరకు యాత్రానుభవాలను గ్రంధస్థం చేసిన తొలి తెలుగు మహిళ జానకమ్మే, బహుశా తొలి భారతీయ మహిళ కూడా తనే కావచ్చు. పురుషులు రాసిన యాత్రా రచనలు మనకు అంతకు ముందునుంచే ఉన్నా ఒక మహిళ యాత్రానుభవ రచన ఇదే. బాగా డబ్బున్న వ్యాపారుల కుటుంబాలు బృందంగా ఏర్పడి ఇంగ్లండ్, ఫ్రాన్స్ పర్యటించిన యాత్రలో జానకమ్మ దంపతులు గూడా చేరినట్లు ఉంది. ఓడమీద తన సహ యాత్రిక మహిళలను గురించి కూడా ఆమె ప్రస్తావిచింది. తన కంటేముందు హిందూ మహిళలు ఎవరూ సముద్రయానం చెయ్యలేదంటూ, తాను సంప్రదాయాన్నేమీ ఉల్లంఘించలేదని, ఓడ ప్రయాణంలో ‘కాసిని పాలు, వైన్, పళ్ళు పుచ్చుకొంటే కొంపలేం మునుగుతాయ’ని అంటుంది. తన విదేశీ ప్రయాణాన్ని పంజరంలోంచి విముక్తి పొందిన విహంగంతో పోల్చుతుంది. ఓడ ప్రయాణంలో, లండన్‌లో ఆమె ఎప్పుడూ భోజనాల విషయంలో ఎటువంటి ఇబ్బంది పడినట్లు రాయకుండా, ఓడ ప్రయాణంలో తల్లితండ్రులకు దూరమైన వియోగ దుఃఖాన్ని గురించి మాత్రమే ప్రస్తావించింది. ఇంగ్లండ్ పర్యటనలో జానకమ్మ చీరకట్టులోనే తిరిగినట్లు చెప్పకొంది.

ఓడలో కళాసీ చనిపోయినపుడు అంతిమసంస్కారానికి ఆమె హాజరై కెప్టెన్ బైబిల్ నుంచి చదివిన వాక్యాలలాగా హిందువుల మంత్రాలు కూడా అందరికి అర్థమయేట్లు దేశభాషలో అనువదించినవారిని ప్రజలు అభినందిస్తారని అంటుంది. సందర్భాన్ని బట్టి తాను క్రైస్తవ పురాణ గాథలనుంచి ఉదహరించవలసి వస్తుందనీ, దాన్ని కొందరు హర్షించకపోయినా తాను లెక్కపెట్టనంటుంది. పారిస్ లోని కాథలిక్ చర్చిలో ఆదివారం ఆరాధనలో జానకమ్మ దంపతులు పాల్గొని, చర్చి అంతటా కలయతిరిగి అక్కడి విశేషాలను చూస్తారు. మరొక సందర్భంలో ఈ లోకంలో సంపదంతా తన కాళ్ల ముందు గుమ్మరించినా తాను కిరస్తాని మతంలోకి వెళ్లనని ఘంటాపథంగా అంటుంది.

జానకమ్మ ఇంగ్లండ్ పర్యటనలో స్త్రీల విషయాలు ప్రతేకంగా గమనిస్తుంది. సౌథాంఫ్టన్ రైల్వే స్టేషన్లో ఉద్యోగులంతా స్త్రీలే అని విస్తుపోతుంది. గృహసేవకులుగా, అన్నిచోట్లా స్త్రీలే పనిచేస్తున్నట్లు వివరిస్తుంది. ఇంగ్లండ్‌లో స్త్రీలకంటే హిందుదేశంలో స్త్రీలు చాలా వెనకబడి ఉన్నారనీ, ఆ దేశంలో స్త్రీలు అనుభవిస్తున్న స్వేచ్ఛను చాలా మెచ్చుకొంటుంది. హిందూదేశంలో తానెప్పుడూ వ్యాయామం, నడక మీద దృష్టి పెట్టలేదని, లండన్ పార్కుల్లో ఉదయం నడక తన ఆరోగ్యాన్ని మెరుగు పరచిందని అంటుంది.

లండన్ ఆల్బర్ట్ హాల్లో సంగీత కచ్చేరీలు, నాటకాలు, సర్కస్ ప్రదర్శనలకు హాజరైంది, పారిస్‌లో నాటక ప్రదర్శనలతో లండన్ ప్రదర్శనలను పోల్చి పేరిస్ ప్రేక్షకుల అల్లరిని గురించి ప్రత్యేకంగా రాసింది. రాయల్ పొలిటెక్నిక్‌లో ఉపన్యాసాలు వినడం – ఇంగ్లాండులో, పారిస్‌లో ఆమె పారిశ్రామికవాడలను, మాంచెస్టర్‌లో నూలు పరిశ్రమలను చూచి అటువంటి సౌకర్యాలు హిందూదేశంలో కలిగించితే ఇక్కడి పరిశ్రమలు కూడా బాగా ఉత్పత్తి చేయగలవని అంటుంది. ప్రత్యేకంగా నూలు నేతపరిశ్రమ మిల్లులను దర్శించడంలో ఆమెకున్న ఆసక్తినీ బట్టి మద్రాసులో ఆమె కుటుంబానికి అటువంటి పరిశ్రమలతో సంబందం ఉన్నట్లు అనిపిస్తుంది. బ్రిటిష్ పాలకులను, వారి సంప్రదాయాలను మెచ్చుకుంటూనే హిందూదేశాన్ని ఇంగ్లీషువాళ్ళు ఎప్పుడూ తమదేశంగా భావించలేదని, అట్లా జరిగి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేదని వ్యాఖ్యానిస్తూ, “ఇంగ్లండ్ ఎంతో గొప్పదని గర్వించడానికే, నీచమైనదని దుఃఖించడానికి సమాన కారణాలున్నాయి. ఈ దేశం అందమైనది, ఇక్కడ ఎంతో మంచి ఉంది, ఇక్కడ ఆవిష్కరింపబడ్డ ప్రతి ఆవిష్కరణ ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఇక్కడి మేలుతలపులు, ఆవిష్కరించబడిన విజ్ఞాన విషయాలు ప్రపంచంపై ఎంతో ప్రభావం కలిగిస్తాయో అంచనా వెయ్యలేము. మనం అబ్బురపడే సంపద, కటికపేదరికం, జుగుప్సాకరమైన వ్యసనాలు, పాపాలు ఇక్కడ సహజీవనం చేస్తున్నాయి. ఇక్కడ ప్రతిఒక్కరూ ధనార్జనలో నిరంతరం తలమునకలై ఉన్నారు. సుఖభోగలాలసకు, విజ్ఞానాభివృద్హికీ అన్నింటికి ఇదే కేంద్రం. క్రూరత్వానికి, చెడ్డ వ్యసనాలకు ఈ నగరమే కేంద్రం. ఇక్కడ గొప్ప విజ్ఞానం, మహా అజ్ఙానం రెండూ పక్కపక్కనే ఉన్నాయి.” అని వ్యాఖ్యానిస్తుంది.

లండన్‌లో ఆమె అనేక రాజకీయ, సైన్స్ ఉపన్యాసాలకు హాజరవుతుంది. సాధారణ పర్యాటకులకంటే విశేషమైన శ్రద్ధ, అనేక విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆమెలో కనిపిస్తాయి. లండన్ మేయర్ సర్ సిడ్నీ వాటర్లూను కలుసుకొని ఆ దంపతులిచ్చిన విందుకు కూడా జానకమ్మ దంపతులు హాజరవుతారు.

“ఇంతకముందే చెప్పినట్లు ఆదేశాల్లో నేను విన్న, కన్న ప్రతివిషయానికి ఎంతో సంతోషించానని ఒప్పుకోక తప్పదు. ఆర్థిక స్తోమత, సాహసం ఉన్న దేశీయులందర్నీ ఇంగ్లండ్ చూచి రమ్మని ఎంతగానో అర్థిస్తున్నాను…”

“ఇంగ్లండ్ వెళ్ళక పూర్వం బ్రిటిష్ ప్రజల గురించి అనేక అసంబద్ధ ఆలోచనలు నా బుర్రలో ఉండేవి. సంకుచిత దృష్టితో రవంత ఔదార్యం కూడా లేకుండా అభిప్రాయాలు ఏర్పరచుకొనేదాన్ని. ఆ దేశానికి వెళ్ళొచ్చిన తర్వాత ఎవరైనా నాలాగే అభిప్రాయాలు మార్చుకోక తప్పదు. బ్రిటిష్ అధికార ప్రతినిధులు మనదేశంలో అనేక తప్పులు చేశారు. ఆనాలోచిత చర్యలకు పూనుకొన్నారు. మన ప్రజల అవసరాలను, ఆకాంక్షలను గ్రహించలేక, నిర్లక్ష్యంతో అలా చేశారేగాని వాళ్ళ మనసులో ఎలాంటి దురుద్దేశం, విద్వేషం లేనే లేవు…”

“నేను మహిళను కావడంతో రాజకీయ విషయాలమీద అంత పట్టులేదు…” అంటూ తన పర్యటన అనుభవాలను ముగిస్తుంది.

బ్రిటిష్ వాళ్ళు భారతీయులను వలస శ్రామికులుగా, మారిషస్, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాలకు శ్రామిక కుటుంబాలను Indentured labourers గా 18వ శతాబ్ది నుంచీ తీసుకొని వెళుతూనే ఉన్నారు. సప్త సముద్రాలు దాటి వెళ్ళిన స్త్రీ పురుషులు వాళ్ళే. చదువుకొన్న భారతీయ మహిళలు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్ళడం మాత్రం జానకమ్మతోనే మొదలు. 1882లో Krishnabhabinii Das అనే 18 ఏళ్ల మధ్యతరగతి యువతి ఆరు సంవత్సరాల పాపను విడిచిపెట్టి భర్త వెంట లండన్ వెళ్ళి ఎనిమిది సంవత్సరాలు ఆ దేశంలో ఉండిపోయింది. ఆమె లండన్‌లో ఉండగానే పదేళ్ళ కుమార్తెకు తల్లి దండ్రులు వివాహం జరిపించారు. కృష్ణ భబినిదాస్ తన ఓడ ప్రయాణం, లండన్ జీవితాన్ని వంగభాషలో రాసి బెంగాల్ పంపించి, ఆనాటి పరిస్థితుల్లో తనపేరు బైటికి రాకుండా పేరు లేకుండానే అచ్చువేయించింది. వంగదేశీయులు ఈ పుస్తకం ఇంగ్లీషు అనువాదాన్ని కూడా రచయిత్రి జీవితచరిత్రతో పాటు అచ్చువేశారు. దుదృష్టం మనం తెలుగు వాళ్ళం జానకమ్మను మరచిపోయాము.

జానకమ్మ పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్ పుస్తకం అంతర్జాతీయ పరిశోధకులకు కొత్తకాదుగాని, తెలుగువారికి మాత్రం కొత్తే. నవలాకారుడు, కళావిమర్శకుడు, జర్నలిస్టు మిత్రులు శ్రీ పి. మోహన్ గారు ఏడాది క్రితం ఈ పుస్తకం సాఫ్ట్ కాపీ చదవమని పంపారు. ప్రొఫెసర్ కేతవరపు కాత్యాయనీవిద్మహే గారిని ఈ పుస్తకాన్ని గురించి ఏదైనా పత్రికలో రాయమని కోరగానే, ఆమె ‘గోదావరి’ వెబ్ సంచికలో దీని మీద మూడు వ్యాసాలు రాశారు. ఈలోగా నేను పొద్దుపోక ఈ పుస్తకాన్ని అనువదించి శ్రీ పి. మోహన్ గారికి పంపితే, వారు నా అనువాదాన్ని ఓపికగా టైపు చేసి పంపారు. నా అభ్యర్థనను మన్నించి శ్రీమతి ‘చూపు’ కాత్యాయని గారు పుస్తకానికి చిన్నపరిచయం రాయడానికి అంగీకరించారు. జానకమ్మ ఇంగ్లండ్ యాత్రాచరిత్రను ప్రచురిస్తామని డాక్టర్ మన్నం రాయుడు గారు (మనసు ఫౌండేషన్) మాటిచ్చారు. అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు.

నెల్లూరు,14-4-2022.

డాక్టర్ కాళిదాసు పురుషోత్తం

విశ్రాంత ప్రిన్సిపాల్,

సర్వోదయ కాలేజి, నెల్లూరు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here