యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 57 – మల్లయ్య కొండ

2
4

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా మల్లయ్య కొండపై ఉన్న అఖండ మల్లేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

మల్లయ్య కొండ

[dropcap]6[/dropcap]-3-22 ఆదివారం.. ఇవాళ మదనపల్లె చుట్టుపక్కల ఆలయాలు చూసి రాత్రి మదనపల్లెలోనే బస చేద్దామని చిత్తూరులోని రూమ్ ఖాళీ చేసి బయల్దేరాము. ఇవాళ్టి యాత్రలో ఇంకో విశేషం చిత్తూరు జిల్లాని ఔపోసన బట్టి, ఎన్నో ఆలయాల గురించి సమగ్ర గ్రంథాలు రచించిన శ్రీ మునిరత్నం రెడ్డి గారు కూడా ఎన్నో పనులున్నా కొంత సమయం మాకు కేటాయించి మాతో రావటం. శ్రీ సాంబశివరెడ్డిగారి తమ్ముడి కొడుకు శ్రీ హేమంత్ రెడ్డి, వారి స్నేహితులు శ్రీ అనిల్ వారికి సంబంధించిన హోటల్‌లో రూమ్స్ బుక్ చేసిపెట్టారు డబ్బులు తీసుకోకుండా. వారు ఆఫీసు పనిమీద వేరే ఊరు వెళ్ళవలసి రావటంతో కలవలేక పోయాము. వారికి పత్రికా ముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు.

మేము బయల్దేరేసరికే ఉదయం 9-10 అయింది. ఆత్మారాముడు ఆగలేడుకదా. మధ్యలో వాడిని శాంతపరిచి మదనపల్లెకి వచ్చేసరికి 11-30. అన్ని ఆలయాలు మూసేశారు. అక్కడికి 10 కి.మీ.ల దూరంలో అంగళ్ళు అనే గ్రామం వున్నది. అక్కడ రహదారి నుంచి విశ్వం స్కూలు పక్క సందులో 3 కి.మీ.ల వెళ్తే చిన్న కొండ మీద అఖండ మల్లేశ్వరస్వామి ఆలయం వున్నది. అక్కడికి వెళ్ళాము.

అక్కడి ధర్మకర్త శ్రీ కాకర్ల కృష్ణమూర్తి, 82 సంవత్సరాల వయసు. ఎంతో ఉత్సాహంగా ఆలయ నిర్వహణ గావిస్తున్నారు. ఇంకా ఎంతో ఉత్సాహంగా అక్కడ జరుగుతున్న అభివృధ్ధి కార్యక్రమాల గురించి వివరించారు. వారి తాత ముత్తాతలనుంచి ఆలయ అభివృధ్ధికి కృషి చేస్తున్నారుట. వారి తాత, తండ్రి 100 సంవత్సరాలపైన బతికారుట. అంతేకాదు. అనారోగ్యమన్నది తెలియదు. ఈయనకి కూడా. ధన్యజీవులు.

అఖండ మల్లేశ్వరస్వామి నివాసం మల్లయ్యకొండ

ఈ కొండ ఈశాన్యంలో కాకర్లకోన, మల్లేశ్వర ప్రాజెక్టు, వాయువ్యంలో నిమ్మకాయలకోన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ జిడ్డు క్రిష్ణమూర్తి గారి ఋషీవ్యాలీ స్కూల్, నైరుతిలో ఊటుకోన, ఆగ్నేయంలో అక్కగార్ల కోన వంటి కోనల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది. ప్రశాంతమైన వాతావరణం. సేద తీర్చే చల్లని గాలి. కొండమీద గుడి, గుడికి సంబంధించిన కట్టడాలు తప్పితే ఇంకేమీ లేవు.

అప్పుడప్పుడూ నాగేంద్రుడు వచ్చి శివలింగం మీద ఆడతాడుట. చాలామంది చూశారుట. ఇక్కడ ఇప్పటిదాకా 370 పెళ్ళిళ్ళు జరిగాయట. వాటికోసం కావాల్సిన సదుపాయాలు కూడా చేస్తున్నారు. 2002 డిసెంబరు 22వ తారీకు స్వామి కృష్ణమూర్తిగారి కలలో కనబడి ఆలయ ఆభివృధ్ధికి కంకణం కట్టుకోమన్నారుట. అప్పటినుంచి ఆయన భక్తుల సహకారంతో అనేక అభివృధ్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామి దయవల్ల కావాల్సిన సామాను అంతా భక్తులు సమయానికి సమకూరుస్తున్నారు అన్నారు.

గోశాల కట్టించారు. ప్రస్తుతం 50 ఆవులు వున్నాయి. వాటి సంఖ్య ఇంకా పెంచాలని చూస్తున్నారు. స్ధానిక అధికారుల సహాయంతో కరెంటు, మెటల్ రోడ్ ఏర్పాటు అయ్యాయి. 100 x 25 అడుగుల వంటశాల, 4 బాత్ రూమ్‌లు కట్టించారు. కొండమీద వేసిన బోర్‌లో బాగా నీళ్ళు పడ్డాయి. ఎండాకాలంలో కూడా నీళ్ళు బాగా వుంటాయి.

శ్రీ కాకర్ల కృష్ణమూర్తిగారు వయోభారంలో శ్రమ అనుకోకుండా ఆలయాభివృధ్ధికి చాలా శ్రధ్ధ చూపిస్తున్నారు. ఇంకా ఇంకా అభివృధ్ధి చేయాలని అహర్నిశలూ ఆలోచిస్తున్నారు. వారికి స్ధానిక నాయకులు, భక్తులు సహకరిస్తున్నారు.

ఆలయాన్ని పునర్నిర్మించి, చుట్టూ ప్రహరీ కట్టించాలనే ఉద్దేశంతో వున్నారు. ఉద్యానవనం, కోనేరు, కోనేరు మధ్య మండపంలో శివలింగం, మెయిన్ రోడ్డులో మహాద్వారం ఆలోచనలో వున్నాయి.

కృష్ణమూర్తిగారు చెప్పినదాని ప్రకారం తుంబళ్ళపల్లి మల్లయ్యకొండ, అంగళ్ళు మల్లయ్య కొండ, వేంపల్లి మల్లయ్య ఇవ్వన్నీ కరికాల చోళులు యుధ్ధానంతరం ఒకేసారి నిర్మించారు. ఒకే నూలుకి వుంటాయి.

ఆలయ కమిటీ ఛైర్మెన్ శ్రీ కాకర్ల కృష్ణమూర్తిగారి ఫోన్ నెంబర్లు.. 9010985929 మరియు 9959656139

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here