[dropcap]మ[/dropcap]సక మసగ్గా పొద్దు
నల్లగా మారిపోతూ ఉంటుంది
సాయంత్రం మాత్రమే విరిసే గాలిలో ఒక చల్లదనం
తూర్పు కొండల నుంచి గ్రామం వరకూ
పొలాల మధ్యగా గీసినట్టు నిశ్చలంగా దారులు
ఆకులు నేలకు జారి పడినట్టు
దారులపై కొట్టాలకు చేరుకుంటున్న
ఎద్దుల గిట్టల జాడలు
చేలల్లో పట్టిన చెమటను చేలల్లో వదిలేశాక
జాలాట్లమ్మటి అంట్లు తోముతూ
పక్షుల రెక్కల్లా చేతుల అలికిడి
మెడల్లో చెమటకీ, మట్టికీ మాసిపోయిన పసుపు తాళ్ళు
ఆకాశంలో సంజ ఎరుపు పూసుకొని
చిరు చిరుగా వెలుగుతున్న మబ్బుల్లా
ఇళ్ళ ముందు
స్నానాలు చేశాక ఆడుకుంటూ పిల్లల కోలాట
ఇళ్ళ కప్పుల పై నుంచి ఎగిరే పొగ కొంగలు
కోళ్లు గూళ్ళల్లో ముడుక్కున్నాక
పసి మబ్బులు చీకటిలోకి దూరి పోతాయి
గాలి చలిగా మారిపోతుంది
పిల్లలు ఆదమరిచి నిద్రలో
కొత్త ఆటలు మొదలు పెడతారు
చూరులపై ఎగిరిన పొగకొంగలు నక్షత్రాలయిపోతాయి
కొండల నుంచి గ్రామం దాకా పడుకున్న
బాటలన్నీ కలిసి నింగి వైపు తిరుగుతాయి
ఆ బాటపై ఒక కుందేలు ఎద్దుల గిట్టల జాడల ఆసరాతో
ఆకాశంలో నడుస్తూ ఉంటుంది
చేలల్లో కడిగేసిన మనుషుల చేమటంతా
దాని చుట్టూ వెన్నెల ఉమ్మెత్తపువ్వులా విచ్చుకుంటుంది
దాని పరిమళంలో చేతులు
ఏ సడీ లేకుండా నిద్రపోతూ ఉంటాయి.