[box type=’note’ fontsize=’16’] విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘Fireflies’ కవితా సంపుటిని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ ముకుంద రామారావు. [/box]
166
భూమి తన కలల స్వర్గాన్ని నిర్మించుకుందుకు
అపరిమితంగా ఖాళీగా ఉండిపోతుంది ఆకాశం
167
అదొక శకలమే అని చెబితే
సంపూర్ణతకోసం ఎదురుచూస్తున్న
చంద్రవంక బహుశా అనుమానంతో నవ్వుతుంది
168
పగటి పొరపాట్లను సాయంత్రం మన్నించనీ
అలా తనకుతానే శాంతిని సాధించనీ
169
అందం నవ్వుతుంది
తీయని అసంపూర్ణ హృదయ నిర్బంధంలో మొగ్గని ఉంచినందుకు
170
నీ ప్రేమ
నా సూర్యపుష్పాన్ని దాని రెక్కలతో ఎగురుతూ తాకుతూ పోతూ
ఎన్నడూ అడగలేదు దాని తేనె అప్పగించటానికది సిద్ధమేనా అని
171
పూల చుట్టూ
నిశ్శబ్దాలు ఆకులు
అవి వాటి పదాలు
172
చెట్టు
దాని వేయి సంవత్సరాల్ని
ఒక మహా మహత్తరమైన క్షణంలా మోస్తుంది
173
నా నివేదనలు
దారి చివరన ఉన్న గుడి కోసం కాదు
ప్రతీ మలుపులో నన్ను ఆశ్చర్యపరిచే దారిపక్క పుణ్యక్షేత్రాల కోసం
174
నా ప్రేమా, నీ నవ్వు
ఒక అపరిచిత పుష్ప సుగంధంలా నిరాడంబరం అనిర్వచనీయం
175
మరణం నవ్వుకుంటుంది
మరణించిన వాని యోగ్యతని పెంచి చెప్పినపుడు
అతని హక్కుకి మించి అతని గిడ్డంగి పెరుగుతుంది గనుక
176
నౌకని సముద్రంలో తొందరపెడుతున్న గాలిని
తీరం నిట్టూర్పు వ్యర్థంగా అనుసరిస్తుంది
177
సత్యం దాని పరిమితుల్ని ప్రేమిస్తుంది
అందాన్ని అక్కడ కలుస్తుంది గనుక
178
నా నీ తీరాల మధ్య
తీవ్రమైన సముద్రం, నా స్వీయాత్మ తరంగమూనూ
దానిని దాటాలని నా కోరిక
179
స్వాధీనాధికారం
మూర్ఖంగా బడాయిపోతుంది
దాని భోగాధికారానికి
180
ముల్లుకోసం యెర్రబారిన క్షమాపణ కంటే
గులాబీ వ్యవహారం ఎక్కువ
(మళ్ళీ వచ్చే వారం)