చిన్న దెబ్బే

2
3

[dropcap]‘‘ఏ[/dropcap]వండీ నేను నేల మీద నిలబడలేకపోతున్నాను.’’

‘‘ఏం కాళ్ళ ఆనలు నొప్పిచేసాయా!’’

‘‘ఛీ, ఛీ అది కాదండీ, కారు కొంటున్నాం అన్న ఆనందం. అందుకే ఫోన్‌ చేశాను, ఆ రంగే తీసుకుంటున్నారా లేక ఆల్రెడీ తీసేసు‘కొన్నారా’. నన్ను కూడా షోరూమ్‌‌కి రమ్మంటారా, తయారైపోయే ఉన్నాను’’ అడిగింది లలిత స్ప్రింగు మింగినట్టు ఊగిపోతూ.

ఎవరో పీక పిసకబోతున్నట్టు ‘‘వొద్దొద్దు, నేనింకా ఆఫీసులోనే అగోరించాను. ఇంకో పది నిమిషాల్లో పని ముగించేసి బయల్దేరిపోతాను. ఇట్నుంచి ఇటే కార్‌ షోరూమ్‌కి రయ్‌మంటూ వెళ్ళి కారు తీసుకుని, జుయ్‌మంటూ మనింటికి వచ్చేస్తాను. మళ్ళీ నువ్వెందుకు అంత దూరం నుండి షోరూమ్‌ వరకూ రావడం.” చెప్పాడు మధు.

‘‘అయితే సరే, రాకెట్‌లా రండి మరి. వచ్చిన వెంటనే మనం గుడికి వెళ్ళాలి, ఆ తర్వాత అట్నుండి అటే మనం డాబుగా, దర్జాగా మా తమ్ముడి నిశ్చితార్థానికి తళతళలాడే మన కొత్త కారులో పెళ్ళున వెళ్ళిపోదాం. అక్కడ అందరూ, మన హుండయ్‌ కారు చూసి డంగై పోవాలి. అసలు విషయం గుర్తు చేయడం మర్చిపోయాను. కారు కుంకుమ రంగు మాత్రమే తీసుకోండి, మర్చిపోయి కుంకుడుకాయ్‌ రంగు తీసుకునేరు, అలానే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ, ఆరేడు సంవత్సరాల పాటు నెలకు పెద్ద మొత్తం ఈ.ఎం.ఐ. కట్‌ అయిపోతుందీ, అదీ ఇదీ అని సాధక బాధకాలన్నీ ఆలోచించకండి. లటక్కనెళ్ళి, చటుక్కున కొనేయండి. మళ్ళీ అక్కడి నుంచి నాకు ఫోన్‌ చేసి కొనాలా వద్దా అంటూ అడిగి నస పెట్టకండి, మీకు పుణ్యం ఉంటుంది’’.

‘‘భలే దానివే లలితా, ఏదో ఇదివరకు కొత్త ఏ.సీ, ఫ్రిడ్జ్‌ కొన్నప్పుడు అలా అడిగానని, ఎప్పుడూ అలానే అడుగుతానా ఏవిటి! ఇప్పుడే ఫోన్‌ చేసి షోరూమ్‌ వాళ్ళకి చెప్పేసాను, రెడ్‌ కలర్‌ కార్‌, దానికి కావాల్సిన యాక్సెసరీస్‌ సిద్ధంగా ఉంచమని.’’

‘‘అవునా, మీరు ఎంతమంచి గుడ్‌ హస్బండ్‌ అండి’’ ఆమె గొంతులో ఎగిరిగంతేసినంత ఉత్సాహం ధ్వనించింది.

‘‘అలాగేలే’’ అని ముక్తసరిగా చెప్పి ఫోన్‌ పెట్టేసాడు మధు.

ఇంటి దగ్గర స్మార్ట్‌ ఫోన్లో ఆ కారు ఇమేజెస్‌ డౌన్లోడ్‌ చేసి చూస్తూ మురిసిపోసాగింది. ఆ కార్‌ కొంటున్నట్టు, అందులోనే రాబోతున్నట్టూ తన తమ్ముడికి వాట్సాప్‌ ద్వారా తెలియజేసింది. ఇంతలో మధు ఫోన్‌ నుండి కాల్‌ వచ్చింది.

‘‘ఏవండీ, సాయంత్రం నుండీ వీధి గుమ్మం దగ్గర గూర్ఖాలా వెయిట్‌ చేస్తున్నాను! ఇంకా ఏం చేస్తున్నారు ఆఫీసులో మీరు’’.

‘‘అయ్యో నేను మధును కాదమ్మా, అతనితో పాటు పని చేసే వాడిని, పేరు గిరి. మధుగారికి చిన్న యాక్సిడెంట్‌ అయి, అరికాలికి కౌకు దెబ్బ తగిలింది. దాంతో లేచి నిలబడలేకపోతున్నాడు. నేనూ అటుగా వెళుతూ చూసి, వెంటనే అతన్ని హాస్పిటల్లో చేర్చాను. మీరు త్వరగా రండి, అడ్రస్‌ మొత్తం మీకు వాట్సాప్‌ ద్వారా పంపుతానులెండి’’ కంగారు పడుతూ చెప్పాడాయన.

‘‘అన్నయ్యగారూ, ఆయన బాగానే ఉన్నారని చెప్పారు అదే పదివేలు, కానీ నడుపుతున్న కొత్త కారు బాగా దెబ్బ తిని ఉంటుంది కదా? పోన్లెండి ఇన్సూరెన్స్‌ ఉంటుందిగా’’ చెప్పిందామె.

ఏం అర్థం కాలేదు గిరికి. దాంతో కొంచెం వికారంగా మొహం పెట్టి, ఓ సారి బుర్రగొక్కుని, ‘‘అదేవిటమ్మా అది! అతను బైక్‌ మీద నుంచి పడితే కారెలా దెబ్బతింటుంది, నా బొంద’’ అడిగాడాయన.

‘‘అలాగా! అంటే ఆయన కారు కొనడానికని వెళుతూ, వెళుతూ ఉండగానే యాక్సిడెంట్‌ అయిందన్న మాట.’’ అని ఫోన్‌ పెట్టేసి హాస్పిటల్‌కి వెళ్ళింది.

మధు వైపు చూస్తూ, ‘‘ఆ కారు కొనడానికి వెళుతూనే ఇలా కాలుకి  దెబ్బతగలడం ఏవిటి ఖర్మ, ఈశ్వరుడి దయ, ఏం జరగలేదు.ఇక ఇప్పుడప్పుడే కారు వద్దండీ’’ చెప్పి కళ్ళు తుడుచుకుంది.

ఇంతలో డాక్టర్‌గారు వచ్చి, మధుని చూసి, కాలుకి తీసిన ఎక్సరే, మిగతా టెస్ట్‌ రిపోర్టులూ చూసి, ‘‘కంగారు పడాల్సిందేమీ లేదు. అయితే ఇది బెణకడం లేదా కౌకు దెబ్బ కనుక కొంత రెస్ట్‌ అవసరం. అయితే, ఇంత దెబ్బ తగిలినా కూడా, వర్రీ అవకుండా, కనీసం కుయ్యో, మొర్రో అనకుండా, అంత హాయిగా, ప్రశాంతంగా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఎలా సాధ్యం’’ అడిగాడాయన అయోమయంగా మధు వంక చూస్తూ.

‘‘డాక్టర్ గారూ, నా కాలికి దెబ్బ తగిలింది కాబట్టి ఆరేడు రోజుల్లో తగ్గిపోతుంది. ఒక వేళ ఈ దెబ్బ తగలకపోయి ఉంటే, నాకు ఇంకో పెద్ద కోలుకోలేని దెబ్బే తగిలేది. దాని నుంచి కోలుకోవాలంటే, ఆరేడు సంవత్సరాలు పట్టేది. ఆ దెబ్బతో పోల్చుకుంటే ఇది చిన్నదే కదా డాక్టర్‌. ఆ సంతోషంతోనే ఇలా’’ చెప్పాడు మధు.

అప్పటి వరకూ దిగులుగా ఉన్న లలిత, విషయం అర్థవైనట్టు చిన్నగా నవ్వేసింది. కానీ, మధు చెప్పిందేవిటో అర్ధం కాక, మరింత అయోమయంగా చూస్తుండిపోయారు డాక్టర్ గారు.

‘‘మధుకి కారు కొనడం ఇష్టం లేక, యాక్సిడెంటూ, కౌకు దెబ్బా అంటూ ఆడిన నాటకం బానే పండింది. నేనూ నా పాత్ర మేరకు బానే నటించాను’’ అని మనసులో అనుకుని, ఊపిరి పీల్చుకున్నాడు గిరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here