సీత-16

0
3

[dropcap]ప[/dropcap]ట్టుమని పాతికేళ్ళు లేవు. ఎంత పెద్ద ఆలోచన చేసింది. తను ఇన్నాళ్ళు కష్టపడ్డానని కనీసం మాట వరసకు కూడా బయటపెట్టలేదు. తనకి మాత్రం ఇంత పెద్ద వయస్సు వచ్చింది. ఆఫీస్నుంచి ఇంటికి వచ్చిన కోడలు వంట చేయలేదు అనుకున్నాను… కానీ ఇంట్లో ఉంటున్న కొడుకు ఆఫీస్ ఎందుకు వెళ్ళటంలేదని మాత్రం ఆలోచించలేదు. పైగా తన కొడుకు వంట చేస్తున్నాడని చెప్పాల్సిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు.

ఇంట్లో అన్ని వసతులు మారిపోయాయి … విసనకర్ర పోయి ఫ్యాన్ వచ్చింది…. రోకలి మారి గ్రయిండర్ వచ్చింది… కాని కోడలు విషయంలో కొంచెం తేడా వచ్చిన ఒప్పుకోరు.

***

“తరువాత ఏం జరిగింది?” రత్నమాల కృష్ణవేణిని అడిగింది.

“తరువాత ఏముంది? ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు వంట, ఇంటి పను చేసేవాళ్ళం. వీలు కానప్పుడు హోటల్‍కి వెళ్ళేవాళ్ళం. నా కోడలికి నాకు మంచి స్నేహం కుదిరింది.”

“అదేం కాదు…!” రత్నమాల తల అడ్డంగా ఊపింది.

“అంతా బాగుంది కదా…! మరి వృద్ధాశ్రమంలో ఎందుకు చేరినట్టు?”

“రోజులు గడుస్తున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ ఏదో వెలితి. ఏ గొడవా లేదు. కానీ ప్రశాంతత లేదు. దేనికీ కొరత లేదు. కాని ఏదో తక్కువైనట్టు. అంతా అర్థం చేసుకున్నా…. నా పిల్లల్తో అప్పుడప్పుడు గొడవలు అవుతూనే ఉండేవి. చాలా విషయాలు నచ్చేవి కావు. పొద్దున్నే పిల్లలు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. సాయంత్రం ఆరు, ఏడు వరకు తిరిగి రారు. ఉన్న శని, ఆదివారాలు వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతారు. వారం రోజులు ఇంట్లో ఉన్న నన్ను కనీసం తీసుకువెళ్ళరు.

వాళ్ళొక్కరే బజారుకి వెళ్ళతారు. మరి రోజంతా ఇంట్లో ఉంటుంది… పాపం తనని కూడా తీసుకుని వెళ్ళాని ఆలోచనే ఉండదు. ఎంతైనా పిల్లలు స్వార్థపరులు. తల్లిదండ్రులు వీళ్ళ జీవితం కోసం ఎంతో త్యాగం చేస్తారు. అయినా వీళ్ళకి కనీసం గుర్తు ఉండదు. ముసలితనంలో మూలన కూర్చోవాలి అంతే….!”

***

కృష్ణవేణి అపార్ట్‌మెంట్స్ కింద చిన్న పార్కు లాగా ఉంటుంది.

ఒక రోజు ఏం తోచక వెళ్ళి, అక్కడ కూర్చుంది. ఖాళీగా కూర్చుంటే కృష్ణవేణి ఆలోచనలు ఎటో పరుగు తీస్తాయి.

తన కొడుకు కోడలు తన మీద చూపుతున్న నిర్లక్ష్యం గుర్తొచ్చి… బాధవేస్తోంది. ‘నేను వాడికోసం అన్నీ వదులుకున్నాను.’ అనిపిస్తుంది

ఉన్నట్టుండి పక్కనే నలుగురు పెద్దవాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇంచుమించు తన వయసు వారే. తెలుగులో మాట్లాడుతుంటే…. కృష్ణవేణి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది.

“మీరు తెలుగు వారా?” కృష్ణవేణి సంతోషంగా పలకరించింది.

“అవును” అన్నాడు ఆ వ్యక్తి.

మొఖంలో తేజస్సు… నవ్వులో ప్రశాంతత చూస్తే, యోగిలా ఉన్నాడాయన.

“నా పేరు కృష్ణవేణి. ఇదిగో ఈ అపార్ట్‌మెంట్స్ లోనే .. మా అబ్బాయితో ఉంటున్నాను.”

“అవునా? మంచిది! నా పేరు సత్యనారాయణ, వీళ్ళు నా స్నేహితులు. మేం ఢిల్లీ చూడటానికి వచ్చాం.”

“అవునా? మీరు ఎక్కడ ఉంటారు?”

“హైదరాబాదులో అమ్మా!” సత్యనారాయణ వినయంగా అన్నారు.

“మాది కూడా హైదరాబాదే!”

“హైదరాబాదులో ఎక్కడ…?”

అన్ని నెలల తరువాత తెలుగులో మాట్లాడేవారు కనిపించేసరికి…. మాటలు ఆపాలనిపించలేదు… కృష్ణవేణికి.

“మేము హైదరాబాదులో… వివేకానంద వృద్ధాశ్రమంలో ఉంటాం.” అన్నాడాయన.

“అవునా? మరి మీ పిల్లలు?”

“నాకు ఇద్దరు కొడుకులు. ఒకరు సింగపూర్లో….. ఇంకొకరు బెంగుళూరులో …. ఉంటారు.  ఒక కూతురు హైదరాబాదులోనే ఉంటుంది.” ఆయన ఇంకేం మాట్లాడలేదు.

కృష్ణవేణికి ఇంకా అడగాలంటే మొహమాటం వేసింది……

ఊరుకుంది. పాపం ఏం కష్టం వచ్చిందో కొడుకు ఇంట్లోనుంచి వెళ్ళగొట్టారు. తల్లిదండ్రులను వదిలేయటం పిల్లలకు కొత్తేమీ కాదు కదా!

“మీరు ఏం అనుకోను అంటే… ఒక చిన్న మాట. మా ఇల్లు ఇక్కడే… వచ్చి కొంచెం టీ లేదా కాఫీ తాగి వెళ్ళండి…ప్లీజ్…” కృష్ణవేణి ప్రాధేయపడింది.

“అయ్యో మీకెందుకమ్మ శ్రమ?”

“శ్రమేముంది? మీరు మా ఇంటికొస్తే …. ఈ ఒంటరి జీవితానికి కాస్తా ఊరట దొరుకుతుంది. ఇక్కడ పలుకరించేవాడే లేడు. వచ్చి… ఒక అరగంట కూర్చొని… వెళ్ళండి.” అంది.

కాసేపటికి కాఫీ, టిఫిన్లు అయ్యాయి.

“మీ అబ్బాయి ఎప్పుడు వస్తారు?”

“ఆఁ ఎప్పుడో వస్తాడు లేండి… ఏ ఎనిమిదికో, తొమ్మిదికో…. మా కోడలూ అంతే.. రాత్రి ఏడెనిమిది దాటితే గాని రాదు. అప్పటి వరకు నేను ఒక్కదాన్నే… నేను… ఈ టి.వి…. ఈ నాలుగు గోడలు…. ఇదే జీవితం. మనకి కష్టాలు తప్పవు. నేను ఇక్కడ… మీరు వృద్ధాశ్రమంలో… అంతే తేడా.”

“అయ్యో! భలే వారే… నాకేం కష్టాలండి… నేను వృద్ధాశ్రమంలో లేనండి.” రామ్మూర్తి గట్టిగా నవ్వాడు.

“అంటే మీ కొడుకు మిమ్మల్ని వదిలేశారని కదా…. మీరు వృద్ధాశ్రమంలో చేరారు.” అంది సత్యనారాయణతో.

“అయ్యో! లేదు లేదు. వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకునేవారు.” సత్యనారాయణ కంగారుగా అన్నారు.

“మరి?” కృష్ణవేణికి అర్థం కాలేదు.

“నేను నా ఇష్టపూర్వకంగా ఉంటున్నాను…”

“అదేంటి? మనం ఇంత కష్టపడి, త్యాగాలు చేసి…. పిల్లలకు జీవితం మొత్తం ధారపోస్తే…. వాళ్ళు కనీసం వయసు మళ్ళాక మనల్ని చూసుకోవడం బాధ్యత కదా!”

సత్యనారాయణ ఒక్క నిమిషం కృష్ణవేణిని ఎగాదిగా చూసాడు.

“అదేంటమ్మా! అంటే చిన్నప్పుడు మనం వాళ్ళని పెంచాం… కాబట్టి వారు పెద్దయినప్పుడు చూసుకోవాలి. అయితే లెక్క సరిపోతుందా? తల్లిదండ్రులు, పిల్లల బంధం ఇంతేనా? కుటుంబం అంటే ఇంతేనా? బంధానికి, బాధ్యతకి మీరు ఎలా ముడివేస్తారు?”

“మరి ఈ వయసులో మనకి ఎవరున్నారు? మనం ఎక్కడికి వెళ్ళాలి? చేతగాని ఈ సమయంలో మనకు వాళ్ళ ఆసరా లేకపోతే ఎలా?”

“ఎక్కడికి వెళతారు? ఎందుకు వెళతారు? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలేదు. హాయిగా మీ బిడ్డ దగ్గరే ఉండొచ్చు.” సత్యనారాయణ నవ్వాడు.

“మీరు చెప్పింది…. నాకు అర్థం కావటం లేదు”

“సరే చెబుతాను వినండి. ఎక్కడో వందల్లో ఒకరు ఇద్దరు కొడుకులు, కూతుర్లు తల్లిదండ్రులను వదిలేస్తారు. నేను కాదనను. అలాగే కోడల్ని సాధించే అత్తమామలు ఉన్నారు. అదీ కాదనను. పిల్లల్ని వేధించే తల్లిదండ్రులూ ఉన్నారు. కాని దాన్ని పట్టుకొని అందరూ అలాగే ఉంటారంటే ఎలా?

నూటికి తొంభైమంది తల్లిదండ్రులకు పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో… పిల్లలకి కూడా తల్లిదండ్రుల మీద అంతే ప్రేమ ఉంటుంది.

కానీ రోజురోజుకి ప్రపంచం మారిపోతుంది. జీవన విధానం మారుతోంది. భార్యభర్తలు ఇద్దరూ సంపాదిస్తే గాని ఇల్లు గడవదు. అట్లాంటి పరిస్థితుల్లో వారికే సమయం ఉండదు…. ఇక మనకు సమయం కేటాయించాంటే అది వాళ్ళకి భారం అవుతుంది.

తల్లిదండ్రులు, పిల్లలు జీవితాల్లో ముఖ్యమైనవారే… కానీ వారి ముఖ్యమైన సమయం గడచిపోయింది. ఇప్పుడు వారి ముందు జరగబోయే జీవితాన్ని  ఆలోచించాలి. భవిష్యత్తు చూసుకోవాలి. అలాంటి సమయంలో… మనం వాళ్ళకి సేద తీర్చాలి. కానీ వారి జీవితంలో భారం కావొద్దు.”

“అంటే ఇప్పుడు నా కొడుకు నన్ను ఇంట్లో పెట్టుకొని.. ఇంత ముద్ద వేస్తే.. నేను వాడికి భారం అయిపోతానా?” కృష్ణవేణి కళ్లు కోపంతో ఎర్రగా మారాయి.

“లేదు లేదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మీకు తిండిపెట్టి… వసతులు కల్పిస్తే…. మీ కొడుక్కి జీతం భారం అవుతుంది, కానీ జీవితం భారం కాదు. ఏ కొడుకు, కూతురు తన తల్లిమీద ఖర్చుని లెక్కపెట్టరు.”

“మరి జీవితం మీద భారం అంటే?” కృష్ణవేణి అర్థంకాక  అడిగింది.

“జీవితం మీద భారం అంటే` మిమ్మల్ని పట్టించుకోలేదని బాధపడటం, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసాడనుకోవడం… ఒంటరినైపోయాననుకోవడం… పిల్లలకు తమ మీద ప్రేమలేదు అనుకోవడం …. తమ సొంత విషయాలను తమతో చెప్పటం లేదనుకోవడం….

తమ అభిప్రాయాలు వారిమీద రుద్దడం…. వారి జీవిత విధానాన్ని తప్పుపట్టడం…. తమకు ప్రాధాన్యత తగ్గిపోయిందని అనుమానించడం… వారిని పరోక్షంగా మాటనడం… కావాలని తక్కువ చేయడం…  ఇవన్నీ వాళ్ళ జీవితం మీద భారం అవుతుంది.”

సత్యనారాయణ  మాట్లాడినంతసేపు కృష్ణవేణికి తన గురించే మాట్లాడినట్టు అనిపించింది.

“మరి దానికి మనమేం చేయాలి?”

కృష్ణవేణి ప్రశ్నకి సత్యనారాయణ  తలాడించాడు.

“మన జీవితాన్ని మనమే తీర్చుకోవాలి..? మీరే అన్నారు…! రోజంతా ఈ నాలుగు గోడల మధ్యే గడపాలి అని. మిమ్మల్ని అలా ఎవరు ఉండమన్నారు? ఎవరు కష్టపడమన్నారు? మీకు నచ్చినదేదో మీరే తెలుసుకోండి. మీ ఇష్టమైన పనులు చేసుకోండి. కొత్త స్నేహాలు చేసుకోండి.

ఈ మిగిలిన జీవితాన్ని ఎలా సంతోషంగా గడపగలరో మీరే దారి వెతుక్కోండి.

మనం ఏం చేయాలి? అన్న విషయంతో కూడా మన పిల్లలమీద ఆధారపడితే ఎలా?

మనకు మరీ చేతగాని సమయంలో మన పిల్లలు మనకు ఎలాగో అండగా ఉంటారు. వాళ్ళు మనల్ని ఎప్పటికీ వదలరు.

ముందు నేనూ మీలాగే ఆలోచించేవాడిని… కాని వాళ్లతో ఉన్న ఒక సంవత్సరంలో నాకు అర్థమైపోయింది. వాళ్ళు పడే బాధ.

పాపం నాతో ఆగిపోలేరు, అలాగని నన్ను తీసుకొని పరిగెత్తలేరు.

అందుకే ఈ ఆలోచన చేసాను.

నేను నా నలుగురు స్నేహితులు కలిసి ఈ వృద్ధాశ్రమం పెట్టాం. అందరం కలిసి ఉంటాం. అందరూ నెలకొకసారి ఇలా ఏదో ఒక కొత్త ప్రదేశానికి వెళతాం.

మధ్య మధ్యలో కొడుకు దగ్గర, కూతురు దగ్గర వెళ్ళి ఉంటాను. నాకు నచ్చినన్ని రోజు అక్కడ ఉండి మళ్ళీ వస్తాను.

ఇప్పుడు నా జీవితం నాకుంది. నాకేం కావాలో తెలుసు. నా సంతోషం నా చేతుల్లో ఉంది. ఎవ్వరి మీద ఆధారపడను.” చెప్పాడు సత్యనారాయణ.

***

బామ్మ గట్టిగా నిట్టూర్చింది.

“ఇదిరా కథ. ఇదంతా చెప్పి నన్ను కూడా అక్కడికికి వచ్చేయమని ఎన్ని సార్లు చెప్పిందో!! కాని ఏం చేయను? వాడు ఒప్పుకోడే.”

“ఎందుకు ఒప్పుకోడు బామ్మ? ఒక్కసారి దగ్గర కూర్చోబెట్టుకొని, మాట్లాడరాదు?”

“లేదురా! వాడు వినడు, వాడికి పరువే ముఖ్యం.” బామ్మ ఆవేశపడిపోతుంది.

నేను బామ్మని ఉరుకోబెట్టాను. కాసేపు ఆమె గదిలో ఉండిపోయాను.

“నాకు ఒక సహాయం చేస్తావా? కృష్ణవేణి హైద్రాబాదు దగ్గరలోనే ఉంటుంది. రెండు గంటల ప్రయాణం. నువ్వు హైదరాబాద్‍కి తిరిగి వెళ్ళాక ఒక రోజు వీలు చూసుకొని కృష్ణవేణి దగ్గరకు వెళతావా? నేను నీకు ఒక కవర్ ఇస్తాను. దాన్ని ఇచ్చేయి.” అంది బామ్మ.

***

నందిని ఫోన్ ఇప్పటికే పదిసార్లు మోగింది.

తను ఎక్కడో ఉన్నట్టుంది.

‘అర్జెంటా!’ అని అనుమానం వచ్చింది.

‘ఎత్తాలా! వద్దా!’ అనుకుంటూనే ఎత్తాను

“ఏంటి? ఫోన్ ఎత్తవు? ఎన్ని సార్లు చేశాను.”

మాటను బట్టి అర్థం చేసుకున్నా అది సతీష్ అయి ఉంటాడని….

“నాకు ఉద్యోగం వచ్చింది. చాలా మంచి కంపెనీ… మంచి జీతం…నీకు ఏ లోటూ రానీయను నందిని. ఒక్కసారి కలిసి మాట్లాడదాం…..”

“హలో హలో”

నాకేం చెప్పాలో అర్థం కాలేదు.

ఫోన్ కట్ చేసి .. వెనక్కు తిరిగాను.

వెనకాల నందిని ఉంది.

గుండె ఆగినంత పనైంది.

“ఎవరు ఫోన్లో?”

నందిని మామూలు గానే ఉంది.

“అదీ!! సతీష్ అనుకుంటా!!” కొంచెం తడబడ్డాను.

“మరి మాట్లాడలేదు? ఆ రోజు షాప్‍లో పరిచయం చేశాను కదా!”

నేనేం సమాధానం చెప్పలేదు.

“అతనికి ఉద్యోగం వచ్చిందంట!!”

“అవునా??”

మిగతాది నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు.

“అది…! నిన్ను తనతో వచ్చేయమని చెప్పాడు.”

నందిని తనని సూటిగా చూసింది.

ఎందుకో తెలీదు.ఆ చూపు నన్ను ఎన్నో ప్రశ్నలు వేస్తుందనిపించింది.

ఏదో అర్థంకానట్లు అనిపించింది.

“నందిని నిజం చెప్పు…. నీకు ఈ పెళ్ళి ఇష్ణమే కదా??”

“ఇష్టమే రాజీవ్!! నిజంగా!!”

“మీ నాన్న బలవంతంగా ఒప్పించలేదు కదా!”

నందిని, గట్టిగా నిట్టూర్చింది.

“ఇక నీ దగ్గర దాచేదేముంది రాజీవ్… మొదట్లో బలవంతం చేశారు, చాలా చాలా బలవంతం చేశారు. సతీష్‌తో పెళ్ళి చేయనని ఖచ్చితంగా చెప్పేశారు. కాని అది కొద్ది కాలామే. ఎందుకంటే సతీష్ అంటే నాకు, మా నాన్న అంత ఇష్టం కాదు. తెలివైనవాడు, మంచివాడు. బాగా మాట్లాడతాడు. మొదట్లో చాలా ఇష్టం ఉండేది. అది ఇష్టం మాత్రమే…. పెళ్ళి  చేసుకుంటే అతనితో నా జీవితం బాగుంటుందని అనుకున్నాను.. ఇదంతా నువ్వు రాక ముందే జరిగిపోయింది. అదే సతీష్‌తో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను.”

“మరి సతీష్ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా?”

“ఛీ ఛీ అస్సలు కాదు. అతనికి అలాంటి ఉద్దేశాలే లేవు. కాని, ఎంత కాదన్నా, అతను కూడా నన్ను ఇష్టపడ్డాడు. ఒక్కసారి చివరి ప్రయత్నం చేస్తా.. నాన్నతో వచ్చి మాట్లాడుతాను అంటున్నాడు. దానికి నేను ఒప్పుకోవటం లేదు అంతే!!”

నందిని మాటల్లో నిజాయితీ నాకు కొంచెం ఊరట కలిగించింది.

కానీ అదే గొంతులో దుఃఖం కూడా ఉంది. మాటలు తేలికగా ఉన్నా మాట్లాడటం బరువుగా ఉంది.

‘నందిని విషయంలో ఎక్కడో తప్పు జరుగుతోంది.’

ఆలోచించి… ఆలోచించి… బుర్ర బద్దలయ్యేలా ఉంది.

ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రతి వెధవకి ఒక సిక్స్త్ సెన్స్ ఉంటుంది. ఇప్పుడు నాకది పనిచేస్తున్నట్టుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here