పుడమితల్లి నేస్తం-3

0
4

[dropcap]“ఢి[/dropcap]ల్లీలో నీరూ పంటలూ లేవు మాకు. ప్రజలు అల్లాడిపోతున్నారు. మీరు అదృష్టవంతులు.” అన్నారు.

“శుభకార్యమని పేరు చెప్పి పదిమంది పేదల కడుపునింపే సంస్కారాన్ని అలవరిచిన ఆచారాల గొప్పదనం అది అమ్మమ్మా!” అంది అమృత.

“అవును” అంది వసుధ.

***

విజయరామయ్యగారి పుస్తకాల బీరువాలోంచి కొన్ని పుస్తకాలనూ, కొన్ని చిత్రాలనూ చూస్తోంది అమృత. పచ్చని వరి పోలంలో నిలబడి వున్న యువ కర్షకుడి చేతిలోమెరుస్తున్న బంగారు వరి కంకులు ముఖం లోని నవ్వు,ఆ చిత్రాన్ని రెండు నిమిషాల పాటు అలాగే చూసింది. ఆత్మవిశ్వాసం, కృతనిశ్చయం ఆశావహ దృక్పథం రూపుకడితే అది విజయరామయ్య గారు అనుకుంటూ పేజీ తిప్పుతోంది.

1985 జూన్ 5వ తేదీన ఫిలిపైన్స్ ప్రెసిడెంట్ మిష్టర్ మార్కోస్ చేతుల మీదుగా అందుకుంటున్న ‘అవుట్‌స్టాండింగ్ ఇంటర్నేషనల్ రైస్ ఫార్మర్ అవార్డు’ అది, అధిక దిగుబడిని సాధించి రైతులను ఉత్సాహపరిచి ,శాస్త్రజ్ఞులకు రైతులకు మధ్య ఒక అవగాహనను పెంపొందించినందుకు గానూ, మేలురకపు వరి వంగడాలను ప్రభుత్వానికి అందించినందుకు గానూ ఈ అవార్డును ఇస్తున్నట్లుగా ప్రకటించారు.

మరోక పేజీలో భారతప్రభుత్వం నెక్కంటి విజయ రామయ్యను ‘ధాన్ పండిట్’ అవార్డుతో సత్కరించిన 1985 అక్టోబరున తీసిన చిత్రం అది. తరువాత పేజీలు తిప్పుతూనే వుంది.

1972లో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ ఇచ్చిన ‘బెస్ట్ ఫార్మర్’ అవార్డు, 1998 ఆచార్య ఎన్.జి రంగా ‘కృషిరత్న’ అవార్డు,1988లో ‘జుఅరీ ఆగ్రోకెమికల్స్ లిమిటెడ్’ ప్రకటించిన ‘కృషిసామ్రాట్’ అవార్డ్, ఇలా పదిహేడు స్టేట్ అవార్డులను, అనేక గౌరవాలను, నాటి ముఖ్యమంత్రులు ఎన్.టి.రామారావు, రాజశేఖర్ రెడ్డిగారు, చంద్రబాబు గారు మరియు భారతరత్న డాక్టర్ స్వామినాధన్ చేతులమీదుగా అందుకుంటున్న అవార్డుల, అభినందనల జాబితాలను చూస్తోంది. కృషీవలుడుగా విజయరామయ్య ఎగురవేసిన విజయకేతనాలను చూస్తుండిపోయింది.

విజయరామయ్య గారు బ్రేక్‌ఫాస్ట్ చేసి హల్లో కూర్చుని పేపరు చదువుకుంటున్నారు. ఆయన వక్తిత్యాన్ని అర్థం చేసుకుంటోంది అమృత. మనుషుల్ని ప్రేమించడం, స్నేహించడం, విద్య పట్ల ఉన్న గౌరవం, క్రమశిక్షణ, వృత్తి పట్ల ఆయనకు ఉన్న అంకితభావం ఈ నాయకత్వ లక్షణాలు ఇవన్నీ విజయరామయ్యగారిని రైతాంగం లోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాయి అనుకుంది.

‘రైస్ టుడే’ ఇంటర్నేషనల్ రైస్ మేగజైన్ చేతిలోకి తీసుకుంది అమృత. ఆమె కళ్ళు ‘ది బ్రెయిన్ అండ్ బ్రాన్ బిహైండ్ ఐ.ఆర్.8’ అనే ఆంగ్ల వ్యాసం మీద పడ్డాయి. 1960లో రాక్ ఫెల్లర్ అండ్ ఫోర్డ్ పౌండేషన్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు డాక్టర్ రాబర్ట్ చాందలర్ను డైరెక్టర్‌గా నియమించింది. ఆసియాలో ఏర్పడిన ఆహార కొరతను, కరువును, ఎదుర్కునేందుకు అత్యధికంగా దిగుబడినిచ్చే వరి వంగడాలను కనుగొనేందుకు డాక్టర్ రాబర్ట్ చాందలర్ నియమించబడ్డారు. తరువాత ప్రముఖులు డాక్టర్ యమ్. బీచల్, డాక్టర్ పీటర్, డాక్టర్ జీనింగ్స్ వరకూ అనేకమంది. అగ్రికల్చరల్ సైంటిస్టుల రైస్ బ్రీడర్ల కృషి ఫలితంగా, పరిశోధనల ఫలితంగా ఐ.ఆర్.8 అనే వరి వంగడం వచ్చింది. ఇంటర్ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వారు ఈ వరి వంగడాన్ని ఆసియాలో ఉన్న అన్ని వ్యవసాయ కేంద్రాలకు అందించారు. కుతూహలంగా పేజీలు తిప్పుతోంది. ‘ఇండియన్ ఫార్మర్ కిక్ స్టార్ట్స్ టూ గ్రీన్ రివొల్యూషన్స్’ అన్న శీర్షికతో ఉన్న ఆంగ్ల వ్యాసం చూసింది. నెక్కంటి విజయరామయ్యగారితో డాక్టర్ ‘దార్’ వ్యవసాయ శాస్త్రజ్ఞుడు కలిసి తీసుకున్న చిత్రాలవి.

ఆయన విజయ రామయ్య గురించి ఇలా అంటారు.

“వ్యవసాయ రంగంలో విజయ రామయ్యగారు, వారికి వారే స్వయంగా ఒక గొప్ప శాస్త్రవేత్త అని నేను నమ్ముతాను. నేను కేవలం ఒక కిలో వరదలకు తట్టుకునే ఒక వరి వంగడాన్ని ఇచ్చాను. ఆయన దాన్ని చాలా ఆశ్చర్యకరంగా కరీఫ్ పంట వేసి వృద్ధి చేసారు. రబీలో వచ్చిన ఇతర వరి వంగడాలకంటే ఎక్కువ దిగుబడిని ఇవ్వడమే కాకుండా అలా వందల హెక్టార్లకు పంట వేయబడి చాలా సంవత్సరాలలోనే పాపులర్ వెరైటీ అయ్యింది. ప్రాంతీయ విశ్వవిద్యాలయాల ద్వారా విత్తనాలను వెయ్యి మినీ కిట్స్‌గా నెక్కంటి విజయరామయ్య రైతులకు అందజేసారు. అది వారి కార్యాచరణకు నిదర్శనం. రైతాంగానికి నెక్కంటి విజయ రామయ్య కృషి గొప్ప స్ఫూర్తి .1985 లో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ25వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో, ప్రపంచ వ్యాప్తంగా రెండు వేలమంది శాస్త్రజ్ఞులు, అనేకమంది వ్యవసాయ శాఖామంత్రులు మరీ ముఖ్యంగా విశేషమైన కృషి చేసిన పధ్నాలుగు మంది రైతులను, వారిలో ఇద్దరు భారతీయులు వరి పరిశోధనా సంస్థ ఫిలిపైన్స్‌కు ఆహ్వనించబడ్డారు. వారిలో ఒకరు సర్దార్ జగజీత్ సింగ్ హార పంజాబ్ నుంచి, రెండవ కృషీవలుడు ‘ధాన్ పండిట్’ నెక్కంటి విజయ రామయ్య గారు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచీ ఆహ్వానించబడ్డారు. శ్రీ విజయరామయ్య 1985 లో జరిగిన అంతర్జాతీయరైతు సదస్సులో పాల్గోన్నారు. ఆయన ఇలా చెపుతారు.

“రైతు సోదరుల సహకారం, సరియైన ప్రభుత్వ విధానాలు, శాస్త్రజ్ఞుల సలహాలు, శాస్త్రీయ పద్ధతులతో సేద్యం, ఇవన్నీ తనకెంతో ఉపయోగించాయనీ, 1980 ప్రాంతాలకే తాను ఎనిమిది టన్నుల పంటను, హెక్టారుకు పండించగలిగాననీ” తన అనుభవాలను పంచుకున్నారు.

డాక్టర్ ‘దార్’ ఇలాఅంటారు. “నేను ఈ కృషీవలునికి, ప్రతీ సంవత్సరం ఒక కొత్త వరి వంగడాన్నిఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయాన్ని ముందుకు తీసుకు పోవడంలో నెక్కంటి విజయ రామయ్య హరిత విప్లవాన్ని సాధించిన కృషీవలుడు. వారు తన నెట్‌వర్క్ ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే గాకుండా, వేల మంది రైతులకు సలహాదారు, రైతుబాంధవుడు, స్ఫూర్తిదాత శ్రీ నెక్కంటి విజయరామయ్య అంటారు డాక్టర్ ‘దార్’ వ్యవసాయ శాస్త్రవేత్త.  ‘రైస్ టుడే’ పత్రికా సంపాదకుడు ‘జీన్ హెటిల్’ సంపాదకత్వంలో వచ్చిన ఆంగ్ల వ్యాసం చదవడం పూర్తి చేసింది అమృత.

“తాతగారూ!”

“చెప్పమ్మా!”

“ఇప్పటిదాకా ఒక మీమాంసలో వున్నాను ఇక ఇపుడు గట్టిగా నిర్ణయించేసుకున్నానండి.” అంది

“ఏమని” అడిగారు పేపర్లోంచి తల ఎత్తకుండానే..

“ఏజీ బియస్.సి లో చేరాలనీ, మీలాగా వ్యవసాయం చేయాలి, ఆధునిక పద్ధతుల్లో, అమెరికా వంటి దేశాల్లో వేలాది ఎకరాలను తీసుకుని వ్యవసాయం చేస్తారని చదివాను. మనం కూడా అలా చేయవచ్చుగా? ఉత్సాహవంతులు ఒక బృందంగా ఏర్ప డి, అధికదిగుబడినిచ్చే పంటలు పండించాలి. అది నా కోరిక.”

విజయరామయ్య పేపరు పక్కనుంచి అమృత మాటలు వింటున్నారు.

“తాతగారూ! ఒక సంస్థలో పనిచేసే కూలీలకు పెట్టుబడి బాధ లేకుండా నెలవారీ జీతాలను ఏర్పాటు చేయాలి. వారి పిల్లలకు చదువుకునేందుకు అక్కడే ఒక స్కూలు నిర్మించాలి, వైద్యసదుపాయాలు కలిగించాలి. ఇళ్ళు కట్టించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు లభించే అన్ని సౌకర్యాలను రైతులకూ, రైతు కూలీలుగా పనిచేసేవారికి కల్పించాలి. అలాంటి హాదాను నేను కలిగిస్తాను వారికి. దేశంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసికొనకూడదు. వారిమీద ఏరకమైన ఆర్థిక ఒత్తిడి లేనటువంటి ఒక సంస్థను నేను స్థాపిస్తాను. భారతదేశం ప్రధానంగా వ్యావసాయిక దేశం అయివుండీ,స్వాతంత్రం వచ్చిఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, రైతు ఆత్మహత్యలు ఏమిటి? సాంకేతికపరమైన ప్రగతి, హరిత విప్లవాలూ, మేధావుల ఆలోచనలూ, ఒక బడుగు రైతు ఆత్మహత్యను ఆపలేకపోతే దాన్ని అభివృద్ధి అని ఎలా అంటాం తాతగారూ? ‘తిండి కలిగితె కండకలదోయ్, కండకలిగిన వాడే మనిషోయ్’ అన్నారు కదా గురజాడ. అన్నం పండించే రైతు బిడ్డలకే పట్టెడు అన్నం లేని స్థితి ఇంకా ఎన్నాళ్ళూ?” ఆవేశంగానూ, అమాయికంగానూ మాట్లాడుతున్న అమృతను సంభ్రమంగా చూస్తున్నారు విజయరామయ్య.

అమృత, కాస్త సిగ్గుపడింది.

“అమ్మా! నాకు అబ్దుల్ కలాం గారి మాటలు గుర్తుకు వస్తున్నాయి.”

“కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి” అన్నారు కదా! నిద్రలో వచ్చేవి కావు మనకు నిద్ర పట్టకుండా చేసివి కలలు అన్నారు కదా!”

“అమృతా! ఈనాడు అనేక రంగాల్లో మానవుడు సాధించిన విజయాల వెనుక వున్నవి కలలే. అవి ఇలా సాకారమయ్యి మానవ ప్రగతికి దారి తీశాయి. నా లక్ష్యం కంటే నీ లక్ష్యం ఇంకా గొప్పది. నాడు శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం, అధిక దిగుబడిని సాధించడం, తోటి రైతులకు మార్గదర్శకత్వం చేయడం, ఊరుకు ఉపకారం చేయడం, కుటుంబాన్ని అప్పుల్లోంచి బయట పడేయటం. ఇవి మాత్రమే నా లక్ష్యంగా ప్రయాణం సాగించాను. ఈ రోజు నీ కల ఇంకా గొప్పది. భారత దేశంలో ప్రతీ బడుగు రైతు కూడా తన బతుకుని, ఆనందంగానూ, సంతృప్తి గానూ బతికేందుకు గల మార్గాలను అన్వేషిస్తున్నావు తల్లీ! చాలా సంతోషంగా వుంది . తప్పకుండా నీ మార్గంలో వెళ్ళు ముందుగా అవగాహన పెంచుకో.”

“అమృతా! శాస్త్రీయపరంగానూ, సాంకేతిక పరంగానూ ఎంత ముందుకు నడిచినా ఒక కల్చరల్ లేగ్ వుంటుంది. కల్చరల్ లేగ్ అంటే తెలుసుగా, ‘లేగింగ్ బిహైండ్’ అంటే వెనుకబడటం, భౌతిక సంస్కృతి మరియు భౌతికేతర సంస్కృతి మధ్య వ్యత్యాసాన్ని కల్చరల్ లాగ్ అంటారు. ఈ పదం సాంకేతికపరమైన ఆవిష్కరణలను అందుకొనడానికి సంస్కృతికి సమయం పడుతుందనే భావనను సూచిస్తుంది. మరోమాటలో చెప్పాలంటే సంస్కృతిలోని వివిధ అంశాల మధ్య అసమాన మార్పుల రేటు ఉన్నపుడు భౌతిక మరియు అభౌతిక సంస్కృతి మధ్య అంతరాన్ని కలిగిస్తుంది. సాంకేతికంగా, భౌతికంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతూంటే, దాన్ని అందుకోవడంలో వెనుకబడటం అన్నమాట. ఇది ప్రతీ సమాజంలోనూ ఏర్పడుతుంది. అయితే సామాన్యమైన రైతు కూడా, సెల్ ఫోన్ల వినియోగం ద్వారా ఆధునికతకు, దగ్గరగానే నడుస్తున్నాడు. అయినప్పటికీ, అందవలసినంత సమాచారం, ప్రభుత్వ సహకారం బడుగు రైతుకు అందడంలేదమ్మా – ఈ తేడాను మీ లాంటి యువత ముందుకు వచ్చి పూరించగలిగితే నీ కల నెరవేరుతుంది. అమృతా!” అన్నారు.

“ప్రభుత్వాలు ఏవో చట్టాలు చేస్తాయి. అవి రైతులకు ప్రాక్టికల్‌గా లాభించక పోగా నష్టం చేస్తాయి. పేపరు చదువుతున్నావుగా! మొన్న జరిగిన రైతు ఉద్యమంలో చాలా మంది రైతులు చనిపోయారు”

“అసలు ఏం జరిగింది తాతగారూ?”

“2020లో సెప్టెంబరు నెలలో భారత పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలిపారు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఫార్మ్ బిల్’ అని పిలిచే ఈ బిల్లుకు అనేక రైతుసంఘాలు రైతు వ్యతిరేక చట్టాలుగా భావించాయి. ఈ ఉద్యమంలో అనేక మంది రైతులు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ముఖ్యంగా పంజాబ్ హర్యానా రైతులు ప్రాణత్యాగం చేసారు. రైతు తాను పండించుకున్న పంటను ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకువెళ్లి అమ్ముకోవచ్చును పూర్వం జిల్లాలు దాటి వెళ్ళటంకూడా నేరం. ఇది ఒకరకంగా మంచిది. ఒకరకంగా మంచిదికాదు. కారణమేమిటంటే ఒక పేద రైతు తన పంటను ఇతర రాష్ట్రాలకు లారీలో తీసుకుని వెళ్లి అమ్ముకోలేడు కదమ్మా. పైగా ఇతర రాష్ట్రాల రైతులతో స్థానికులు పోటీని ఎదుర్కొనవలసి వస్తుంది. అంతే కాక రైతు కష్టం దళారీల చేతుల్లోకి పోతుంది అందుచేత ఇది వారికి నచ్చలేదు. దీనిని కూడా కల్చరల్ లాగ్ అనవచ్చు. చట్టాలు చేయడం వేరు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండటం వేరు కదమ్మా!”

“అవునండీ. తరువాత?”

“ఏముంది! ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేసింది. ఎంతోమంది చనిపోయారు. ఆ కుటుంబాల దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరు కదా! సమాజంలో వచ్చే మార్పుని అంత త్వరగా ప్రజలు తీసుకోరు. ప్రభుత్వం ఒక నియంతలా వ్యవహరించకుండా రైతాంగం పట్ల నిజాయితీతో ఉన్నట్లు అయితే వారు స్వాగతిస్తారు.”

“ఈరోజు భారతదేశంలో వ్యవసాయ రంగంలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో వుంది. 60.43 శాతం సాగుభూమి వుంది అయినా ఆకలి బాధ తప్పడం లేదు. ఆత్మహత్యలు తప్పడం లేదు.మిగులు భూమి చాల వరకూ ఇంకా సాగులోకి రావాలి” అంటూ నిట్టూర్చారు.

“పూర్వం ఇంతమంది రైతుల ఆత్మహత్యలు లేవు కదండీ?”

“అవునమ్మా! రైతు ఆత్మహత్యల్లో అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్‌ది మూడవ స్థానం. పూర్వం రోజుల్లో నువ్వు ఇందాకా అడిగినట్లుగా సామాన్యమైన రైతు మీద ఇంత ఆర్థిక పరమైన ఒత్తిడి వుండేది కాదు. ఇపుడు బడుగు రైతులకు పెట్టుబడి భారం పెరిగింది. పూర్వం ఒక ఎకరం ఊడ్పించటానికి అయ్యే ఖర్చు కేవలం మూడు వందల రూపాయలు. ఇపుడు పాతిక వేలరూపాయలు, రైతుకూలీ ఆరువందల రూపాయలు అయినా రూపాయి విలువ తగ్గిపోయిన స్టితి. ఎరువులు,మందుల ధరలు పెరిగిపోయాయి. ఈ రోజు ఆంధ్రా, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలకు, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, కోల్కటా నించి రైతుకూలీలు పొట్ట చేత పట్టుకుని ఒంటినిండా బట్టలు కూడా లేకుండా వచ్చేస్తున్నారు. ఈ కారణం చేత ఎకరానికి ఆరువేల రూపాయలు ఉండే కూలిధర మూడువేల అయిదు వందల రూపాయలకు పడిపోయింది. నిజానికి ఈనాడు రైతు ఆర్థిక స్థితి పెరగలేదుగానీ కష్టాలు పెరిగాయి. కేవలం రైతు బాధల మీద అధ్యయనం చాలదు. రైతాంగంలో చైతన్యం కలిగించాలి, ఆర్థికపరమైన చేయూతతో బాటూ సామాజికపరమైన, సాంకేతికపరమైన అవగాహనను కలిగించాలి. అలా జరగనంత కాలం పోరాటాలు, ఉద్యమాలూ తప్పవు. నక్సల్స్ మావోయిస్ట్ ఉద్యమాలు నీకు తెలుసు కదా?”

“ఆ విషయం కూడా చెప్పారా? “ అంటూ వసుధ కూడా వచ్చి కూర్చుంది.

“ఏ విషయం?” అన్నారు విజయరామయ్య.

“మీరు ఆశ్వారావుపేటలో పని చేస్తున్నపుడు భారతి గారితో మాట్లాడారుకదా? ఆ విషయం” అంది వసుధ.

“చెప్పండి తాతయ్యా!” అంది అమృత ఉత్సాహంగా.

“అలాగే”

“అది 1985లో సంగతి, నేను ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఒక అరవై ఎకరాల భూమి కొని కొబ్బరి దానిమ్మ, అరటి, బొప్పాయి, సపోటా పంటలు వేస్తున్నాను. మూడు ఏళ్ళు గడిచాయి. నేల ఎర్రమట్టి, ముప్ఫై అడుగులలో పడ్డ నీరు కూడా మంచినీరు కావడంచేత ఫలసాయం బావుంది. 1988లో, ఆ రోజు రాత్రి పదిగంటలు అయింది. పొలంలోనే నేను ఒక షెడ్డు వేసుకుని, మోటారు వున్న ఆ గది లోనే ఒక మడత మంచం వేసుకుని పడుకున్నాను. ఒక జీప్ వచ్చి ఆగింది. జీప్ లోంచి ఒక అరుగురు మనుషులు దిగారు. వారిలో ఒక ముఫై అయిదేళ్ళ వయసున్న ఒక మహిళ కూడా వుంది. ఆమెతోపాటూ మరో నలుగురు చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు.

“ఎవరండీ మీరు” అన్నాను

“నా పేరు భారతి మేం నక్సల్స్, భద్రాచలం అడవుల పైనించి వస్తున్నాము.” అన్నారు

“భయపడకండి, మీ గురించి తెలుసుకునే వచ్చాం. గిరిజన రైతులను మీరు ఆదరంగా చూస్తున్నారని తెలిసి మా హైకమాండ్ మిమ్మల్ని అభినందించి రమ్మన్నారు.. మీరు వంద మంది రైతు కూలీలకు స్టీలు కేరియర్లు కొని ఇచ్చారని, కూలీని అయిదు నుంచి పది రూపాయలు చేశారని తెలుసుకుని వచ్చాం.” అన్నారు భారతి.

నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

“అవునమ్మా! ఇక్కడ కూలీల పరిస్థితి చూస్తే చాలా బాధగా వుంది. గుడ్డలో అన్నం మూట కట్టుకుని తెచ్చుకుంటున్నారు. నేను కేరియర్లు కొన్నమాట నిజమే, అంతేగాక చిన్నచిన్న అనారోగ్యాలకు మందులు కూడా తెచ్చి ఇస్తూంటాను” అన్నాను.

“అవును అది కూడా మాకు తెలుసు. అసైన్డ్ భూములను మీరు తీసుకోలేదని, మీరు కొన్న భూమి జమిందార్ల భూమి అని మాకు తెలుసు” అంటూ ఆమె నా చేతిలో ఒక చందాల పట్టిక వున్నపుస్తకం పెట్టారు. పుస్తకంలో చందాలు ఇచ్చిన వారి పేర్లు, ఇచ్చిన మొత్తం, లక్ష రూపాయల నించి, అయిదు లక్షల దాకా వుంది ఆ పట్టీలో.

“భారతిగారూ! నీరు లేక, సాగు లేక పడివున్న భూమిని ఈ స్థితికి తీసుకుని రావడానికి నాకు లక్ష రూపాయలు ఖర్చు అయింది. ఎకరం అయిదువేలు పెట్టికొంటే పదివేలు సాగుకు ఖర్చు అయింది. ప్రస్తుత పరిస్థితిలో నేను ఏమీ ఇవ్వలేను” అని చెప్పాను.

“తాము ఈ డబ్బుని గిరిజన సంక్షేమం కోసం ఖర్చు పెడతామనీ, తాను పోస్ట్ గ్రాడ్యుయేట్‌ననీ, ఉద్యమంలో చేరి పేదల కోసం పనిచేస్తున్నాను” అని చెప్పారు. ఆ పుస్తకంలో వందరూపాయలు అని రాసి సంతకం పెట్టమని చెప్పారు.

“సంతకం పెట్టాను కానీ ఆ వంద రూపాయలు కూడా వాళ్ళు నా దగ్గర తీసుకోలేదు. రైతుకూలీ ఇరవై రూపాయలకు పెంచమని చెప్పారు.”

అప్పటికే స్థానిక రైతుల నుంచి వ్యతిరేకతను నేను ఎదుర్కొంటున్నాననీ, మరుసటి సంవత్సరంలో పెంచుతానని మాట ఇచ్చాను. తరువాత మాట నిలబెట్టుకున్నాను కూడా అమృతా!.

వాళ్ళు వెళుతూ చెప్పారు. “మీకు జమిందార్ల నుంచీగానీ ఇతర స్థానిక రైతుల నుంచి గానీ ఎలాంటి సమస్య వచ్చినా మాకు తెలియజేయండి” అంటూ వారితో వచ్చిన ఒక వ్యక్తిని చూపించి “ఇతను వస్తూ వుంటాడు. మీరు ఇతనికి మీకొచ్చిన సమస్యను చెపితే మేం వాళ్ళని శిక్షిస్తాము” అని చెప్పి, తాము వచ్చినట్లుగా, పోలీసులకుగానీ, స్థానిక ప్రజలకు గానీ చెప్ప వద్దని హెచ్చరించి వెళ్ళారమ్మా!!”

“నేను ఈ విషయాన్ని నా కుటుంబ సభ్యులకూ, ఈరోజు నీకూ తప్ప ఎవరికీ చెప్పలేదమ్మా!” అన్నారు విజయరామయ్య. అమృత విస్తుపోతూ వింది.

“అశ్వారావు పేటలో చాలా వరకూ జమీందార్ల భూములు సాగు లేకుండా వదిలి వేసినవే అన్నారు.”

“అలాంటి మంచి సారవంతమైన భూములను సాగు లోకి తీసుకుని రాకుండా ప్రభుత్వాలూ, ప్రజలూ కూడా వదిలేశారా? పండిస్తే పేదల కడుపు నింపవచ్చుగా!”

“నిజమే ఎవరు చేస్తారు?”

“నేను” అంది అమృత.

వసుధ నవ్వేసింది కానీ విజయరాయ్యగారు నవ్వలేదు. విజయరామయ్య గొప్ప ఆశాజీవి.

“నిజానికి లక్ష్య సాధనలో ప్రతీ రంగంలోనూ సాధక బాధకాలు వుంటాయి.

అందులో రైతు జీవితం మరీనూ, ప్రకృతి వైపరీత్యాలూ, ప్రభుత్వ విధానాలూ, గిట్టుబాటు కాని ధరలూ, ఆర్థికపరమైన ఇబ్బందులూ, ఇన్ని అవరోధాల నడుమ క్షేత్ర భూమిలో నిలబడి వ్యతిరేక శక్తులతో పోరాడే హలం పట్టిన వీరుడమ్మా రైతు. కానీ ఏమాత్రం గ్లామర్ లేనివృత్తి అది. తమ ఆడపిల్లలను ఏ డాక్టరుకో ప్రభుత్వ అధికారికో, సాఫ్ట్‌వేర్ ఇంజనీరు కోఇవ్వాలని కోరుకుంటారుగానీ, ఒక సాధారణ రైతుకు ఇచ్చి పెళ్ళి చేయాలని ఏ తల్లి తండ్రులూ కోరుకోరు. రైతుకు దక్కవలసిన గౌరవం దక్కలేదమ్మా ఈరోజుకూ మన సమాజంలో.”

అవునన్నట్టు తల పూసింది. అమృత.

“గోదావరి తల్లి ఆశీస్సులూ, మా అమ్మగారు నేర్పిన విలువలు, అలవరిచిన సంస్కారం, నా చేత కొన్ని మంచిపనులు చేయించిందమ్మా!

1986లో సిద్ధాంతం వంతెన వద్ద ఏటి గట్టు తెగి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతం అంతా వరదనీటికి గురి అయింది. రైతులెవ్వరి వద్దా, ఒడ్డూ, గడ్డీ లేకుండా పోయింది. అంతకు ముందు సంవత్సరం ‘ఐ.ఆర్. 64’ వరి విత్తనాలను గోదావరి జిల్లాలోని రైతులందరకూ టాక్సీ చేసుకుని, నేనూ నా మిత్రుడు బాపిరాజు, ఇంటికి కేజీ చొప్పున పంచిపెట్టాము. అపుడు భీమవరం పక్కన వున్న ‘పాన్దువ’ అనే గ్రామానికి వెళ్ళి అక్కడి మునసుబుగారికి విత్తనాలను ఇచ్చి, ఆ పూరి రచ్చబండ వద్ద కూర్చున్న పెద్దమనుషులకు కూడా తలోక కేజీ ఇచ్చాము.

మేము వస్తుంటే “ఏంటీ ఏదో సారె పంచి పెట్టినట్లు, పంచి పెడుతున్నారు. అంత గొప్ప విత్తనాలా ఇవి?” అని వారు నన్ను వెటకారం చేసారు, అపహాస్యం చేశారు. ఆ తరువాత జిల్లా అంతా వరదకు గురి అయింది. నేను అశ్వరావు పేటలో వంద ఎకరాల్లో ఐ.ఆర్.64 పంట వేశానవి తెలుసుకుని వచ్చారు.

“క్షమించండి, మీరు వచ్చినపుడు మిమ్మల్ని వెటకారం చేసి అవమానించాం. ఇపుడు మా దగ్గర విత్తనాలు లేవు, మీరు ఆదుకోవాలి” అని చెప్పారు. వారు చెప్పేవరకూ ఆ సంఘటన నాకు జ్ఞాపకం లేదు. ఆ మాటే వారితో చెప్పి, 75 కేజీల విత్తనాల బస్తాను కేవలం మూడు వందల రూపాయలకు వారికి ఇచ్చాను. నేను వంద ఎకరాల్లో వేసిన విత్తనాలను అయిదు వేల మంది రైతులకు ఉచితంగా పంచాను. కర్ణాటక, రాయచూర్ జిల్లాలోని ‘గంగావతి’ అనే ఊరి రైతులకు రెండు వందల కేజీల విత్తనాలను పంచిపెట్టాను. ఎరువులు, వేసే పద్ధతిని వారికి చెప్పాను. ఆ సంవత్సరం రెండింతల దిగుబడిని సాధించారు రైతులు. ఆ కాలంలో కేవలం అది అయిదువేలు, ఖరీదు చేసే కర్ణాటక భూములు, ఈ అధిక రాబడితో యాభైవేలకు పెరిగాయి. అప్పటికి గోదావరి జిల్లాలో ఎకరం యాభైవేలు ఖరీదు చేసేవి, అయిదు లక్షలకు పెరిగాయి. కర్ణాటకలోని తెలుగు రైతులు రెండు వేల మంది నాకు అభినందన సభ ఏర్పాటు చేసి భోజనాలు పెట్టారు. నిజానికి, ఖమ్మంలోనైనా, కర్ణాటకలోనైనా, గోదావరి జిల్లాల వారైనా రైతులు ఎదురైనప్పుడు వారు చూపించే ప్రేమ, గౌరవం, ముందు ఏ అవార్డూ సాటి రాదు.” అన్నారు.

“ఇంక భోజనాల వేళైంది” అంటూ వసుధ పిలిచింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here