మావూరి డాక్టర్లు..!!
[dropcap]వై[/dropcap]ద్య వృత్తి, మన సమాజంలోని కొన్ని పవిత్రమైన వృత్తుల్లో ఒకటి అన్నది అందరికీ తెలిసిన విషయమే! వైద్యరంగం కార్పొరేట్ వ్యవస్థ లోనికి రాక మునుపు దాని విలువ అక్షరాలలో వ్యక్తపరచలేనిది. అందుకే అప్పట్లో వైద్యుడంటే దేవుడుతో సమానంగా గౌరవించేవారు, ఆరాధించే వారు కూడా! అందుకే వైద్యుడంటే సమాజంలో ఒక ప్రత్యేకత గౌరవం ఉండేది (ఇప్పుడు లేదని కాదు గాని, చాలా మార్పు వచ్చిందని చెప్పక తప్పదు). అందుకే ఆ వృత్తి పట్ల చాలామందికి మక్కువ ఎక్కువగా ఉండేది. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు తప్పక వైద్య వృత్తి స్వీకరించాలని కలలు కనేవారు. ఐతే అప్పట్లో వైద్య వృత్తిలో ప్రవేశించడానికి కొందరికే అవకాశం ఉండేది. తక్కువ వైద్య కళాశాలలు ఉండడం, పేదరికం, ప్రోత్సాహం లేకపోవడం, ఈ విద్య పట్ల సరైన అవగాహన లేకపోవడం, సామాన్యుడికి అందనంత వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉండడం వంటి అంశాలు ప్రధాన కారణమై ఉండవచ్చు. జనానికి ఒకప్పుడు సరిపడినంతమంది వైద్యులు లేకపోవడం, గ్రామస్థాయిలో అవసరమైన స్థాయిలో వైద్య సదుపాయాలు అందకపోవడానికి కూడా కారణమై ఉండవచ్చు.
అందుకే ఒకప్పుడు (నా బాల్యంలో) తాలూకా స్థాయిలో ఒకే వైద్యుడితో (సింగిల్ డాక్టర్) ఆసుపత్రులు నడిచేవి. బహుశః తక్కువ జనాభావల్ల కూడా అప్పటికి అది సాధ్యం అయింది. జనాభా ఊహించని రీతిలో పెరగడంతో, అధిక సంఖ్యలో వైద్యుల అవసరం ఏర్పడింది. తదనుగుణంగా ప్రభుత్వ పరంగానూ, ప్రైవేట్ పరంగాను వైద్య కళాశాలల సంఖ్య పెరిగింది, అలాగే ఆసుపత్రులూ పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోనికి వచ్చాయి. ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా బోధనా ఆసుపత్రులు ఏర్పాటు అయ్యాయి. అలా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ; విశాఖపట్నంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ, తిరుపతిలో వెంకటేశ్వర, కాకినాడలో రంగరాయ, కర్నూల్‍లో -కర్నూల్ మెడికల్ కళాశాల; వరంగల్‍లో కాకతీయ, విజయవాడలో సిద్దార్ధ, హైదరాబాద్‌లో ఉస్మానియాకు అనుబంధంగా డెంటల్ వింగ్ (ప్రస్తుతం ప్రభుత్వ దంత వైద్య కళాశాల) వంటివి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.
గ్రామ స్థాయిలో డిస్పెన్సరీలు, డివిజన్ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తాలూకా స్థాయిలో, తాలూకా ఆసుపత్రులు, జిల్లా స్థాయిలో జిల్లా ఆసుపత్రులు ఏర్పడ్డాయి. తరువాత ప్రైవేట్ రంగంలో వైద్య రంగం మరింతగా విస్తృత పరచబడింది. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి పుష్కలంగా నిధులు రాబట్టడంతో వైద్య రంగాన్ని సామాన్యుడికి మరింత సన్నిహితంగా తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది.
దాని పర్యవసానమే ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విధాన పరిషత్’. ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ వైద్య సేవల పరంగా ఎక్కువగా లాభాలు, కొన్ని నష్టాలు కూడా జరిగాయి. వైద్య విధాన పరిషత్ ఏర్పాటుతో జిల్లా/తాలూకా ఆసుపత్రుల పరిపాలన, పర్యవేక్షణ, పరిషత్ కమీషనర్‌కు అప్పగించబడ్డాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు జిల్లా స్థాయిలో డి.ఎం.హెచ్.ఓ (జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి) లకు, రాష్ట్ర స్థాయిలో డైరక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌కు, వైద్య విద్య, బోధనా ఆసుపత్రులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు అప్పగించబడ్డాయి. నేటి పరిస్థితుల్లో సర్వం రాజకీయమయం కావడంతో ఆసుపత్రులు కూడా దీనికి అతీతం కాకుండా పోయాయి. సరైన అధికార పర్యవేక్షణ కరువు కావడం, చోటామోటా రాజకీయ నాయకుల అనవసర జోక్యం, ప్రభుత్వ ఆసుపత్రులపై పడటంతో కొన్నిలోటుపాట్లు తలెత్తడం ద్వారా కొన్ని సమస్యలు సంపూర్ణ వైద్య సదుపాయాలకు ఆటంకం కలిగిస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి సందేహమూ అక్కరలేదు. ఇక ప్రయివేట్ వైద్య రంగం విషయానికొస్తే, అది అంతా డబ్బుతో ముడిపడి ఉండడంతో ఎక్కువ శాతం సామాన్య జనావళికి అవి అందుబాటులో లేవని చెప్పక తప్పదు. ప్రభుత్వ రంగంలో వున్న, నాటి తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో, ఏర్పడిన ‘నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (స్వర్గీయ ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు గారు ప్రథమ సంచాలకులు – ప్రపంచ స్థాయి రేడియోలోజిస్టులలో ఒకరు) కొంతవరకూ అన్ని వర్గాల ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న విషయం గుర్తుంచుకోవలసిందే! ఈ విధంగా వైద్య రంగం ఎన్ని రకాలుగా విస్తరించినా వైద్య సేవలు ఇంకా సామాన్య జనానికి అందని ద్రాక్షపండే అని చెప్పక తప్పదు. ఇంతకీ ఇంత ఉపోద్ఘాతం చెప్పడానికి గల ముఖ్యోద్దేశం మా వూరు అందించిన వైద్యుల గురించి చెప్పడానికి. అదే విధంగా మా కుటుంబం అందించిన వైద్యుల గురించి కూడా చెప్పవలసిన సందర్భం ఇది.
నాకు తెలిసేటప్పటికీ మా వూరు దిండిలో పేద కుటుంబాలు ఎక్కువ (ఎక్కువగా దళితులు) ధనిక కుటుంబాలు తక్కువ (ఎక్కువగా క్షత్రియులు) ఉండేవి. కానీ పేద కుటుంబాలనుంచే పిల్లలు ఎక్కువగా చదువుకునేవారు. ఇంచుమించు ప్రతి కుటుంబంనుండీ చదువుకునే పిల్లలు ఉండేవారు. కొన్ని కుటుంబాలలో పిల్లలు వ్యవసాయ కూలి పనులకు, పాలేరుతనం పనులకు వెళ్లేవారు. నాకు జ్ఞానం వచ్చేనాటికి మా కుటుంబమూ, చింతా సత్తెయ్యగారి కుటుంబమూ విద్యాపరంగా అగ్రస్థానంలో వున్నాయి. ఇంకా చదువుకు ప్రాధాన్యత నిచ్చిన కుటుంబాలు కూడా వున్నప్పటికీ పై చదువులకు పంపిన కుటుంబాలు బహు తక్కువ. నాకు వూహ తెలిసేనాటికి స్వర్గీయ చింతా సత్తయ్య గారి కుమారుడు, చింతా నరసింహస్వామిగారి తమ్ముడు, చింతా నారాయణరావు గారు ఎం.బి.బి.ఎస్. చదివిన మొదటి వ్యక్తి.
అయినా ఆయన వైద్య సేవలు గ్రామానికి దక్కలేదుగాని ప్రభుత్వపరంగా ఆయన సేవలు అధికంగా కరీంనగర్ జిల్లాకు, స్వల్పంగా, వరంగల్ జిల్లాకు దక్కాయి. నాకు అక్క వరస కానేటి సుందరమ్మ (పార్లమెంటు సభ్యులు కానేటి మోహన్ రావు గారి చెల్లెలు)ను ఆయన వివాహమాడారు. మా సుందరక్క అనుకోని రీతిలో మరణించడం వల్ల డాక్టర్ నారాయణ రావు గారు, తనతో కలసి పనిచేసిన బ్రాహ్మణ యువతిని (స్టాఫ్ నర్స్) వివాహమాడారు. మా వూరి మొదటి డాక్టర్‌గా ఆయనకు ప్రత్యేక స్థానం వుంది. డాక్టర్‌గా ఆయన్ను గ్రామ ప్రజలు చూసింది బహు తక్కువ.
తర్వాత మాకు చాలాకాలం వరకూ తెలియని బహు మంచి వైద్యురాలు (వారు ఎక్కువకాలం ఇతర ప్రాంతాల్లో గడపడం కారణం కావచ్చు) రచయిత్రి, సాహిత్య పిపాసకురాలు, సంఘ సేవకురాలు, సహృదయిని డా. అల్లూరి రాజకుమారి గారు. నవల/కథా రచయితగా మా అన్న శ్రీ కె.కె. మీనన్‌ను, డా. రాజకుమారి గారికి పరిచయం చేసే అవకాశం నాకు దక్కినందుకు నేను గర్వపడుతుంటాను (మా అన్నయ్య దిండి వాసి అని, అయన మంచి రచయిత అని తెలియనందుకు బాధపడేవారు). భీమవరం కళాశాలలో రాజకుమారిగారు మా అక్కయ్య కానేటి మహానీయమ్మకు జూనియర్ అని తర్వాత తెలిసింది. డా. రాజకుమారి గారు కొన్ని ఆరోగ్య సమస్యల మూలంగా అవివాహితగానే వుండిపోయిన విషయం ఆవిడ మరణం తర్వాతనే తెలిసింది.
కానీ బ్రతికిన కాలం అంతా వైద్యురాలిగా ప్రజాసేవలోనూ, రచయిత్రిగా, సాహిత్యాభిమానిగా, సాహిత్య సేవలోనూ క్షణం తీరిక లేకుండా తృప్తికరమైన జీవితాన్ని అనుభవించారు. నాటి రాజోలు తాలూకా కేంద్రంలో ఆసుపత్రిని నెలకొల్పి, తన గ్రామప్రజలకు అందుబాటులో వుండి నాణ్యమైన వైద్య సేవలు అందించారు. అంతమాత్రమే కాదు, ప్రతి సంవత్సరం సాహిత్య సభలు ఏర్పాటు చేసి, ప్రఖ్యాత రచయితలను, కవులను, పండితులను కోనసీమకు రప్పించి చక్కని సాహిత్య ఉపన్యాసాలను అందించిన ఘనత స్వర్గీయ డా. అల్లూరి రాజకుమారి గారికే దక్కుతుంది.
తర్వాత డాక్టర్‌గా మా ఊరి రికార్డులో స్థానం సంపాదించింది నేనే! అది కూడా దంత వైద్యుడిగా. నిజానికి బాల్యంలో నా అనారోగ్య సమస్యలను గమనించిన వారెవ్వరూ (నాకు పునర్జన్మ నిచ్చినవాడు పెద్దన్నయ్య, స్వర్గీయ కె.కె. మీనన్) నేను దంతవైద్యుడినౌతానని, కవిగా, రచయితగా, వ్యాసకర్తగా, రేడియో బ్రాడ్‌కాస్టర్‌గా ఎదుగుతానని ఊహించరు. నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి, నాకు అదృష్టం కలిసిరావడమే గాక, నా కుటుంబ పెద్దలందరి ఆశీస్సులు మెండుగా లభించడమే ప్రధాన కారణంగా నేను భావిస్తాను. వూరు కన్నబిడ్డగా, దంతవైద్యుడిగా కొన్ని సంవత్సరాలు వైద్య శిబిరాల ద్వారా గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం నాకు కలిగింది. ఈ విషయంలో కూడా పెద్దన్నయ్య కె.కె. మీనన్ ప్రోత్సాహం చాలా వుంది.
తర్వాత నా దృష్టికి వచ్చిన మా గ్రామం అందించిన మరో వైద్యురాలు డా. దేవ సుజాత. దేవ ముసలయ్య, కుసుమ మంగాయమ్మగార్ల ముద్దుల పుత్రిక. డా. సదానందం (హన్మకొండ) గారి సహచరి. మా దిండి గ్రామంలో, దేవ వారి కుటుంబంలో, ఉన్నత విద్యలో రాణించిన మొదటి వ్యక్తి డా. సుజాత. హై స్కూల్ చదువులనుండి ఇంటెర్మీడియేట్ వరకూ వివిధ ప్రాంతాలలో చదువుకున్న సుజాత, ఎం.బి.బి.ఎస్. విజయవాడలోని సిద్దార్ధ వైద్య కళాశాలలోనూ, రేడియాలజీ డిప్లొమా ఉస్మానియా వైద్యకళాశాలలోనూ పూర్తి చేసి, కొద్దికాలం ప్రభుత్వ వైద్యశాఖలో పని చేసి, తర్వాత విజయవాడలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేసి, తన సహచరుడు డా. సదానందం గారితో(మానసిక వైద్య నిపుణులు) కలసి పూర్తి వైద్య సేవలు అందిస్తున్నారు. వారి ఏకైక కుమార్తె డా. వెన్నెల కూడా వైద్య రంగంలో, ఫిజీషియన్ (చెన్నై)గా స్థిరపడటం గమనించ దగ్గ విషయం.
స్వతహాగా మృదుభాషిణి, సహృదయిని, సేవాగుణం గల డా. సుజాత విజయవాడలో స్థిరపడినప్పటికీ, సందర్భం వచ్చినప్పుడల్లా తాను జన్మించిన గ్రామంలో (దిండి/రామరాజులంక) భర్తతో కలసి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. పుట్టిన వూరి పైనా, అక్కడి ప్రజల పట్ల డాక్టర్ గారికి మక్కువ ఎక్కువ. అందు చేతనే తరచుగా ఏదో పని కల్పించుకుని, దిండి గ్రామం పర్యటిస్తుంటారు. మా వూరు ఆణిముత్యం డా. సుజాత.
తర్వాత చెప్పుకోదగ్గవారిలో మా వూరు అందించిన మరో ఆణిముత్యం డా. అపర్ణ. కానేటి. శ్రీ కె.కె. మీనన్, శ్రీమతి శిరోరత్నమ్మ దొండపాటి గార్ల ముద్దుల పట్టి. అంటే మా పెద్దన్నయ్య కూతురు అన్న మాట!
ఉద్యోగ రీత్యా తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉండడం మూలాన ఆమె విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే కొనసాగింది. మెడిసిన్/కంటి వైద్యంలో డిప్లొమా, ఉస్మానియా వైద్య కళాశాలలోనే చదివే అవకాశం కలిగింది. కంటి వైద్య నిపుణురాలుగా, కొంతకాలం సింగరేణి కాలరీస్ ఆసుపత్రి (కొత్తగూడెం)లో పని చేసి, తర్వాత స్థానికంగా ప్రైవేట్ కంటి వైద్యశాలల్లో పని చేస్తూనే హైదరాబాద్‌లో స్థిరపడి వైద్య సేవలు అందిస్తున్నది. ఇక్కడ డా. అపర్ణ సహచరుడు డా. కమలాకర్ (తిరుపతి) కూడా కంటి వైద్య నిపుణుడు కావడం విశేషం!
డా. అపర్ణకు తన పూర్వీకుల గ్రామంలో తన వైద్య సేవలు అందించే అవకాశం రాలేదు. మరొక విశేషం ఏమిటంటే డా. అపర్ణ బాల్యం చాలా మట్టుకు తన బాబాయ్ (నేను) చేతుల మీదుగా గడిచింది.
వైద్య సేవల పరంగా మా ఊరి ప్రత్యేకత ఏమిటంటే, నాకు హై స్కూల్‌లో చదువుకునే వయస్సు వచ్చేవరకూ, మా వూర్లో నిపుణుల వైద్య సేవలు అందక పోవడం! నాకు తెలిసి శ్రీనివాసరావు అనే ఆర్.ఎం.పి వైద్యుడు పొరుగూరు నుండి సైకిలు మీద వచ్చేవాడు. గ్రామంలో జనార్దన్ అనే ఆయన హోమియో (చదువుకోకుండానే) వైద్యం చేసేవారు. కరుడు కట్టిన కమ్యూనిస్టు కార్యకర్తగా, అజ్ఞాత వాసంలో ఆయన నేర్చుకున్న వైద్యం అది. ఈయనతో పాటు ఒక నాటు వైద్యుడు కూడా (ఇప్పుడు ప్రకృతి వైద్యుడు అనాలేమో) ఉండేవాడు. ఈయనే అక్కడి ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండేవాడు. పూర్తి నిరక్షరాస్యుడు. నాడి చూసి సమస్యను పసిగట్టేవాడు. ఆకులు-ఆకు పసర్లు, లంఖణాలతో వైద్యం సాగేది. ఆయన పేరు స్వర్గీయ కలిగిత లక్ష్మయ్య. గ్రామంలో లచ్ముడు అనేవారు. నాకు పెదనాన్న వరుస. అందుకే ‘పెద్దాయ’ అని పిలిచేవాడిని.
డా. సూర్య మోహన్ కుమార్ (జోషి) కానేటి. (విశాఖపట్నం/దిండి) కమ్యూనిస్ట్ భావజాలాన్నినరనరాన జీర్ణించుకున్నవాడు. మాజీ పార్లమెంటు సభ్యులు కానేటి మోహనరావు గారి సుపుత్రుడు. విశాఖ షిప్ యార్డ్ లో తన అమూల్య వైద్య సేవలు అందించారు. దిండి వైద్య ఆణిముత్యం డా. సూర్య మోహన్ కుమార్. ఈ రచయితకు కొడుకు వరస.
ఇలాంటి గ్రామ నేపథ్యంలో నా వూరు, కొద్దిమందినైనా, మంచి వైద్యులను సమాజానికి అందించింది. నేను బాల్యంలోనే అనారోగ్య రీత్యా హైదరాబాద్ వెళ్లిపోవడంతో నా దృష్టికి రాని మా ఊరి వైద్యులు ఇంకా ఉండవచ్చు. వారికి నా ఊరి ప్రజల పక్షాన వందనాలు/ఆశీస్సులు.
నన్ను ఈ స్థితికి తీసుకువచ్చిన నా గ్రామానికి, గ్రామ ప్రజానీకానికి, నా కుటుంబ సభ్యులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
(మళ్ళీ కలుద్దాం)