[dropcap]పొ[/dropcap]ద్దు తెల్లారగానే
కాడి తగిలించుకొని
తిరిగిన గాడిలోనే తిరుగుతున్న దొకటి
తన కాళ్లను తానే
నేలలో బిగించుకు
గొడుగులా విప్పారి
నీడను పంచుతోంది మరొకటి
కురవని ఆకాశాన్నే
ఆశగా చూస్తూ
నేలనే గెంతుతోంది మరోటి
ఎంత ప్రయత్నించినా
బయటపడలేక లోలోపలే
నిమిషాలనూ గంటలనూ లెక్కిస్తూ ఇంకొకటి
అన్నింటినీ తానై
పరకాయ ప్రవేశం చేసి
తిరిగే ఎద్దులా, కదలని చెట్టులా, బోదురు కప్పలా
గొణిగే స్వేచ్ఛ కూడాలేని లోలకంలా జీవితం!