కరనాగభూతం కథలు – 24 అసామాన్యుడు

0
3

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురు చూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! కొందరు అర్హతను మించి ఆశపడడం సాధారణం. ఆ ఆశ నెరవేరడం అసాధారణం. తరుణుడనే పేదరైతు విషయంలో అదే జరిగింది. నీకా కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

జనప్రియుడనే రాజు తరచుగా మారువేషంలో దేశసంచారం చేస్తాడు. అలా ఆయనకు ప్రజల అవసరాలు తెలుస్తాయి. వాళ్లు తన పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. కొత్త కొత్త సూచనలు, సలహాలు లభిస్తాయి. ఒకోసారి సామాన్యుల్లో అసామాన్యులు ఉన్నట్లు తెలుస్తుంది. రాజధానికి తిరిగివెళ్లేక అలాంటి అసామాన్యుల్ని కొలువుకి రప్పించి ఘనంగా సత్కరిస్తాడు.

పైలవరంలో తరుణుడు అనే రైతుకి అలా రాజసత్కారం పొందాలన్న కోరిక ఉంది. కానీ తనేమో సామాన్యుడు. కాబట్టి ఆ కోరిక తీరదని నిరాశ చెందాడు. ఒకసారి తరుణుడు పొలం దున్నుతుండగా ఒక సాధువతణ్ణి చూశాడు. ఆ సాధువుకి చాలా చిట్కాలు తెలుసు. వాటిని ఒకొక్కటిగా ఇతరులకు నేర్పి, హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవాలని ఆయన ఆశయం. చిట్కాలు నేర్చుకునేవారికి ఎంతోకొంత పరోపకార గుణముండాలని నియమం. అలా కొందరికి కొన్ని చిట్కాలు నేర్పేక, ఇక ఒక్కటే చిట్కా మిగిలింది. అది తలనొప్పికి మందు. దాన్ని తరుణుడికి నేర్పాలనుకున్నాడు. అతణ్ణి పరీక్షించాలని సాధువు చటుక్కున తలపట్టుకుని పొలం గట్టుమీద కూర్చుండిపోయాడు. తరుణుడు పరుగున వెళ్లి ఏమయిందని అడిగితే, “ఉన్నట్లుండి తలనొప్పి వచ్చింది. భరించలేకుండా ఉన్నాను. దగ్గర్లో గుంటకలవరాకు, చిలక తోటకూర ఆకు ఉంటే తీసుకునిరాగలవా?” అన్నాడు.

తరుణుడు వెంటనే సాధువుకి ఆ ఆకులు తెచ్చిచ్చాడు. సాధువు వాటిని నమిలి వెంటనే లేచి నిలబడి, “నాయనా! భయంకరమైన శిరోవేదననుండి నన్ను కాపాడావు. ప్రతిఫలంగా వరమడుగు, ఇస్తాను” అన్నాడు. అప్పుడు తరుణుడు ఆలోచనలో పడ్డాడు. ఆ ఆకులు పొలంగట్లమీద సులభంగా దొరికాయి. ఆమాత్రం దానికి ప్రతిఫలమెలా అడుగుతాడు? ఐనా స్వయంగా మందు సమకూర్చుకోలేక తనని సాయమడిగిన సాధువుకి- వరాలిచ్చే శక్తి కూడా ఉంటుందా? వరమడిగితే తనకు భంగపాటు తప్పదా?

సాధువు నవ్వి, “భయంకరమైన తలనొప్పిని అతి సులభంగా తగ్గించే ఉపాయాన్ని చూపించాను. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుని వైద్యంతో నలుగురికి సాయపడాలని అనుకోడానికి బదులు, నువ్వు వేరే అనుమానాలతో సతమతమౌతున్నావు. రాజసత్కారం పొందాలని ఆశ పడే వాడికిది తగిన లక్షణం కాదు” అన్నాడు.

తరుణుడికి గుట్టెక్కువ. తనకి రాజసత్కారంమీద మనసున్న విషయం భార్యకి కూడా చెప్పలేదు. మరి సాధువుకెలా తెలిసింది?

తరుణుడు అడిగేలోగానే సాధువు అతడికి తన కథ చెప్పి, “నీ పరోపకారగుణాన్ని పరీక్షించాను తప్పితే, నాకే తలనొప్పీ లేదు. ఐతే ఆ రెండు ఆకుల్నీ కలిపి తింటే, ఎలాంటి తలనొప్పయినా తగ్గిపోతుంది. ఎటొచ్చీ తినేటప్పుడు ఓ మంత్రం జపించాలి. మంత్రం లేకుండా మందు పనిచెయ్యదు. ఆ మంత్రం నీకు నేర్పుతాను. అది నువ్వు ఇతరులకి చెప్పినా వారికి పనిచెయ్యదు. నీకు మాత్రమే పనిచేస్తుంది అందుకూ షరతులున్నాయి. అడక్కుండా ఎవరికీ వైద్యం చెయ్యరాదు. వైద్యానికి డబ్బు తీసుకోరాదు. నీ గురించి రోగులే చెప్పాలి తప్ప, నువ్వు ప్రచారం చేసుకోరాదు. అలా నువ్వో రోజు రాజసత్కారం పొందగలవు. అదే నేను నీకిస్తున్న వరం” అని మంత్రం నేర్పి వెళ్లాడు.

అప్పట్నించీ తరుణుడు ఎవరికి తలనొప్పి వచ్చినా, వెదుక్కుని వెళ్లి ఆ రెండు ఆకులూ తినిపించేవాడు. అతడు మనసులో మంత్రోచ్చారణ చేయగానే నొప్పి చేత్తో తీసినట్లు మాయమయ్యేది. అందుకతడు డబ్బు తీసుకునేవాడు కాదు. ఐతే తరుణుడికి పెద్దగా పేరు రాలేదు. చాలామంది తలనొప్పి కూడా ఒక జబ్బా అనేవారు. ఇస్తున్నవి బాట పక్కన ఆకులే కదా అని కొందరనేవారు. కొందరు భరించలేని బాధతో వచ్చి స్వస్థులై వెళ్లినా- వారు బయట పెద్దగా ప్రచారం చేసేవారు కాదు. ఇక తరుణుడెలాగూ తనగురించి ప్రచారం చేసుకోడు.

“ఈ జన్మకు రాజసత్కారం లభించదు” అని తరుణుడు నిరాశ చేసుకున్న సమయంలో, రాజు జనప్రియుడు నలుగురు అనుచరులతో కలిసి పైలవరం వచ్చాడు. వాళ్లంతా కట్టెలు కొట్టుకునేవాళ్ల వేషాల్లో ఉన్నారు. వాళ్లకి పూటకూళ్ల ఇంటి భోజనం పడలేదు. భరించలేని తలనొప్పి వచ్చింది. వైద్యుడి కోసం వాకబు చేస్తుంటే ఎవరో వాళ్లకి, “పేదవాళ్లలా ఉన్నారు. వైద్యుడికి ఎక్కువ డబ్బిచ్చుకోలేరు. ఈ ఊళ్లో తరుణుడనే రైతు తలనొప్పికి మంత్రం వేస్తాడు. వెంటనే తగ్గిపోతుంది. అతడు డబ్బు తీసుకోడు” అని చెప్పారు.

రాజు, అనుచరులు తరుణుడింటికెళ్లారు. అతడు వాళ్లకి గుంటకలవరాకు, చిలక తోటకూర ఆకు కలిపిచ్చి నమలమన్నాడు. అది నాటువైద్యమనీ ప్రమాదకరమనీ అనుమానం కలిగిన రాజు ముందా ఆకుల్ని ఓ అనుచరుడిచేత తినిపించాడు. తరుణుడు మంత్రం వెయ్యగానే అతడి తలనొప్పి చేత్తో తీసినట్లు మాయమైంది. ఐతే మంత్రాలమీద నమ్మకం లేని రాజు – నొప్పి తగ్గడానికి ఆ ఆకులే కారణమనుకున్నాడు. ఐతే మంత్రం లేకుండా ఆకులు పనిచెయ్యవని ఆయనకు తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు. అప్పుడు రాజు ఆశ్చర్యపడి, అతడి కథ అడిగితే, తరుణుడు దాచకుండా జరిగిందంతా చెప్పాడు.

అప్పుడు రాజు, “అంటే ఈ వైద్యం ఒక సాధువు నీకు ప్రసాదించిన వరం. స్వయంకృషి ఏంలేదు. రాజసత్కారాన్ని కోరుకోవడం అత్యాశే ఔతుంది నీకు. ఈ ఉచితవైద్యానికి స్వస్తి చెప్పి, అసామాన్యుడివనిపించుకునే విద్య ఇంకేదైనా నేర్చుకో” అని సలహా ఇచ్చాడు.

“నేను మామూలు రైతుని. వ్యవసాయం చెయ్యడం నాకు ఆనందం. అదికాక మరే విద్యా రాదు. నేర్చుకోవాలన్న కుతూహలమూ లేదు. అనుకోకుండా సాధువు నాకో చిట్కా నేర్పాడు. దాంతో ఎందరికో సాయపడుతున్నాను. నాకు రాజసత్కారంమీద ఆశ ఉన్నమాట నిజం. సాధువు చెప్పేక ఆ ఆశ ఇంకా పెరిగింది. ఇప్పుడు నువ్వన్నది విన్నాక నా కళ్లు తెరుచుకున్నాయి. నేను రాజసత్కారానికి తగనన్న వాస్తవం గ్రహించాను. ఇకమీదట మరింత తృప్తిగా ఇదే జీవితాన్ని కొనసాగిస్తాను. నీకు నా కృతజ్ఞతలు” అన్నాడు తరుణుడు రాజుతో.

“నా తలనొప్పి పోగొట్టావు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి” అనేసి రాజు అనుచరులతో వెళ్లిపోయాడు.

ఇలా ఉండగా ధనగామి అనే కోటీశ్వరుడికి భరించలేని శిరోవేదన వచ్చింది. ఉద్దండులైన వైద్యులు ఆయనకోసం ఎంతో ఖరీదైన మందులు తయారు చేసి వాడారు కానీ ప్రయోజనం కనపడలేదు. చివరికాయన తనకు బాధోపశమనం కలిగించినవారికి లక్ష వరహాలు కానుకగా ఇస్తానని ప్రకటించాడు. ధనాశతో ఎందరో వచ్చి వెళ్లారు కానీ ఆయన తలనొప్పిని తగ్గించలేకపోయారు. చివరికాయనకు పేదరైతు తరుణుడి గురించి తెలిసింది. ఆయన ఆశ్చర్యపడి, “అంతటి ఘనవైద్యుడు పేదవాడిగా ఎందుకుండిపోయాడు? నేను లక్ష వరహాలిస్తానని తెలిసి కూడా వైద్యానికి ఎందుకు రాలేదు? ఇతడి వైద్యం నిజంగా నమ్మతగినదేనా” అనడిగాడు. అప్పుడు మరింత వాకబు చెయ్యగా, తరుణుడు తనంత తానుగా ఎవరివద్దకూ వచ్చి వైద్యం చెయ్యడనీ, అడిగితే మాత్రం ఎవరికైనా వైద్యం చేస్తాడనీ తెలిసింది. ఆయన్నుంచి తరుణుడికి కబురెళ్లింది.

కబురందగానే తరుణుడు హుటాహుటిన బయల్దేరి ధనగామి ఇంటికి వెళ్లాడు. గుంటకలవరాకు, చిలక తోటకూర అకులు తెప్పించి ఆయనచేత తినిపించాడు. అతడు మంత్రం చదవగానే, ధనగామి తలనొప్పి క్షణాలమీద మటుమాయమైంది.

ఇక ధనగామి ఆనందానికి అవధులు లేవు. ఆయన అతడితో, “తలనొప్పి బాధతో నాకు జీవితేచ్ఛ పోయింది. నాకున్న డబ్బంతా వృథా అనిపించింది. ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను? ప్రకటించిన లక్ష వరహాలు కాక అదనంగా ఇంకో లక్ష ఇస్తాను. ఇంకా నీకు ఏం కావాలన్నా ఇస్తాను. తీసుకుని నాకు సంతోషాన్ని కలిగించు” అన్నాడు. కానీ తరుణుడు ఒప్పుకోలేదు. అతడాయన్నించి చిల్లిగవ్వ కూడా తీసుకోకుండా తనింటికి తిరిగి వెళ్లాడు.

ఆ తర్వాత వారానికే పైలవరంలో తరుణుడికి రాజధానిలో ఘనంగా రాజసత్కారం జరిగింది. రాజతడికి లక్ష వరహాలు కానుకగా ఇచ్చి సగౌరవంగా పైలవరానికి పంపాడు. తరుణుడు తన వైద్యవృత్తిని ఎప్పటిలా కొనసాగిస్తూ సుఖసంతోషాలతో జీవిస్తున్నాడు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “అటు జనప్రియ మహారాజు, ఇటు తరుణుడు- ఇద్దరి ప్రవర్తనా నాకు చిత్రంగా అనిపిస్తోంది. సామాన్యుడైన తరుణుడు రాజసత్కారానికి తగడని అభిప్రాయపడ్డ జనప్రియుడు చివరకు అతణ్ణెలా సత్కరించాడు? తను సామాన్యుణ్ణేనని ఒప్పుకుని, రాజసత్కారానికి తగనన్న తరుణుడా సత్కారానికెలా ఒప్పుకున్నాడు? ధనగామి డబ్బిస్తానంటే అది తన నియమానికి విరుద్ధమన్న తరుణుడు రాజిచ్చిన డబ్బెలా తీసుకున్నాడు? తీసుకున్నా అతడి మంత్రప్రభావం పోలేదెందుకు? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “నిస్వార్థంగా సామాన్యుల్ని సేవించే తరుణుడు సామాన్యుడు కాదు. అసామాన్యుడు. అది గ్రహించే సాధువు మంత్రోపదేశానికి అతణ్ణి ఎన్నుకున్నాడు. డబ్బు, పేరు కూడా లభించవని తెలిసీ తన వైద్యాన్ని మానెయ్యాలని తరుణుడు ఎన్నడూ అనుకోలేదు. డబ్బు తీసుకున్నా, ప్రచారం చేసుకున్నా అతడి వైద్యం పని చెయ్యదు కాబట్టి – ఆ షరతులు పాటిస్తున్నాడని మొదట్లో రాజు అనుకున్నాడు. ఆ మాట అంటే తరుణుడు వెంటనే ఒప్పుకోవడం కూడా అసామాన్యుల లక్షణం. అది రాజు గ్రహించే ఉంటాడు. ఆ తర్వాత ధనగామి లక్ష వరహాలిస్తానంటే, అది వైద్యానికి ప్రతిఫలం కాబట్టి, నియమాన్ని పాటించి తరుణుడు నిరాకరించడం సబబే! ఐతే తరుణుడా డబ్బు తీసుకుని ఉంటే, మంత్రప్రభావం పోయినా అతడి జీవితం సాఫీగా, హాయిగా గడిచిపోయేది. కానీ అతడా డబ్బుకి ఆశపడకుండా, మంత్రప్రభావాన్ని నిలుపుకున్నాడు. పరోపకారంకోసం స్వలాభాన్ని కూడా త్యాగం చేసిన తరుణుడి నిస్వార్థం కూడా అసామాన్యుల లక్షణం. అతడు రాజసత్కారానికర్హుడనీ, అందుకే సాధువతడికి వరమిచ్చాడనీ అర్థమై, రాజు అతణ్ణి సత్కరించదలిచాడు. రాజసత్కారం రాజు నిర్ణయం కాబట్టి, తరుణుడు దాన్ని గౌరవించాడు. వైద్యానికి ప్రతిఫలంగా కాక, వ్యక్తిత్వానికి మెప్పుగా లభించింది కాబట్టి అతడా డబ్బు తీసుకున్నాడు. తీసుకున్నా అతడి మంత్రప్రభావం పోలేదు”.

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 25వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here