సంచిక విశ్వవేదిక – శుభకృత్ నుండి శుభకృత్ వరకు

0
4

[dropcap]అ[/dropcap]నంతకాల గమనంలో
అరవై ఒక అర క్షణమే!
బిందువైన జీవనయానంలో
అరవై ఒక మైలురాయే!

పూలబాట కాని రాదారిలో
ఆటుపోటుల జీవన జలధిలో …
నిలిచి.. నిలిచి.. ఎదురీది –
సాగిన పయనం ఒక యాగమే!

నచ్చినవారు.. నువు నచ్చేవారు
మెచ్చుకోలుతో వెన్ను తట్టేవారు …
ఏది ఏమైనా నీతో నిలిచేవారు –
అందరితో నిండినదే ఈ లోకం!

ఆశలు.. ఆశయాలు.. అలజడులు
తరం తరం నిరంతరం …
మానవ జీవితంతో ముడిపడినా –
విడివిడిగా చూడడం.. ఓ వరమే!

తెలిసిన.. తెలీన.. కానరాని
నరులు.. మానవులు.. వానరులు …
కలసి.. విడిచి.. ఎదురై –
వేయవచ్చు చెరగని ముద్రలెన్నో!


మనసు మమత మది.. నిలిపినా –
అవే అవే చేదు అనుభవాలు నింపినా …
ఎగసి వచ్చిన కన్నీరే చమురుగా –
నడిచిన ఆ నడకలు – నీవే!

జీవనదాతలు.. మానవతా మూర్తులు
అంత: బాహ్య ప్రకృతి శోధకులు
అనుభవాల ఆర్ద్రతని ఒలికించినవారు –
వెల్గుచూపె.. నడకలో సారధులుగా!

ఆటలుగా మొదలైన చదువులు
చదువే ఓ ఆటగా మారినా …
నేర్చినది అణు మాత్రమే –
అవధిలేని విశాల వినువీధిలో!

ఇది కళా? ఇది శాస్త్రమా?
ఇది కవితా! ఇది గణన కవితా?
వలయాల వలయాల భేదాలు –
కనబడలేదు నాకు ఏనాడు!

ఇది చిరుపనా? పేరు తెచ్చేదా?
పైకి నెట్టేదా? కలిమి తెచ్చేదా?
కాలేదు ఎప్పుడు ఒక ప్రేరణ –
చేశానెప్పుడు సూటిగా, ధీటిగా!

ఇతరులు నచ్చినా, తెగిడినా –
మంచి కోసం.. అందరి బాగు కోసం …
మంచి తలపులే చెప్పాను
మేలు అన్నదే చేసాను!

నవ్వుతూ.. నవ్వులు చిందిస్తూ
కొండల కొండల నెక్కాను …
ప్రతి మలుపు ఒక మెరుపై –
జీవన నాదం వినిపించింది!

అందని తారకలు దెస చూపినా
అగుపించే దారులు దారిదాచినా …
మొక్కవోని వెరుపుతో నడిచిన –
ఆ క్షణాలు ఒక మధుర చరితే!

బాటల బాటల కూడలి
వేనవేనల బాటసారులు …
కదిలిపోయినా.. కరిగిపోయినా –
ఓ బాటసారి! నీ అనుభూతి నీదే!

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here