మహాకవి శ్రీ శ్రీ

0
3

[box type=’note’ fontsize=’16’] ఏప్రిల్ 30న మహాకవి శ్రీ శ్రీ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ కె. హరి మధుసూదన రావు. [/box]

[dropcap]కు[/dropcap]క్క పిల్లా,

అగ్గి పుల్లా,

సబ్బు బిళ్ళా –

          హీనంగా చూడకు దేన్నీ!

          కవితామయమమేనోయ్ అన్నీ!

కాదేదీ కవిత కనర్హమని చెబుతూ రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క వంటివి కూడా కవిత్వానికి పనికి వస్తాయని, అవి నీ వైపు చూస్తూ తమ లోతును కనుక్కోమంటున్నాయి అని చెప్పడంతో పాటూ కవిత ఎలా ఉండాలో దిశా నిర్దేశం చేసిన గొప్ప కవి శ్రీశ్రీ.

కదిలేదీ కదిలించేదీ

మారేదీ మార్పించేదీ

పాడేదీ పాడించేదీ

పెనునిద్దుర వదిలించేదీ

మునుముందుకు సాగించేదీ

పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ

కావాలోయ్ నవకవనానికి

మహాకవిగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన శ్రీరంగం శ్రీనివాస రావు పేరు వినగానే మనకు జ్ఞప్తికి వచ్చేది మహాప్రస్థానం. ఇది ఈ శతాబ్దంలో వచ్చిన ఏకైక మహాకావ్యమని శ్రీశ్రీకి గురుతుల్యునిగా భావించే పురిపండా అప్పలస్వామి చెప్పారు. ఈ శతాబ్దం నాది. “1930 వరకు తెలుగుసాహిత్యం నన్ను నడిపించింది, ఆ తరువాత నుంచి నేను నడిపిస్తున్నాను” అని అన్న శ్రీ శ్రీ మాటలు ఏ మాత్రం సత్యదూరం కాదు. నవయుగ కవితా యుగపురుషుడు శ్రీ శ్రీ.

విశాఖపట్నం తో అనుబంధం :

శ్రీనివాస రావు తన ఆత్మకథ‘అనంతం’ లో తన చిన్ననాటి విశేషాలతో పాటూ ముఖ్యమైన సంగతులనన్నింటిని కూలంకషంగా వివరించాడు. పూడిపెద్ది వెంకట రమణయ్య, అప్పలకొండ దంపతులకు విశాఖపట్నంలో ఏప్రిల్ 30, 1910 న  శ్రీనివాసరావు జన్మించాడు. వెంకట రమణయ్యను శ్రీరంగం సూర్య నారాయణ అనే అతను దత్తత తీసుకోవడం వలన శ్రీరంగం వారి ఇంటి పేరైంది. శ్రీనివాసరావుకు ఒకటిన్నరేళ్ళున్నప్పుడే తల్లిగారైన అప్పలకొండ మరణించింది. కొంతకాలం తరువాత వెంకట రమణయ్య గజపతినగరంలోని తహసిల్దారు కుమార్తె సుభద్రమ్మను రెండో వివాహం చేసుకున్నారు. ఆమె సవతి తల్లైనా శ్రీనివాసరావును సొంతబిడ్డలా పెంచి శ్రీనివాసరావుకు తల్లిలేని లోటును తీర్చింది. అందుకే తన కవితా సంకలనమైన ‘ప్రభవ’ ను ఆమెకే అంకితమిచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. శ్రీనివాసరావుకు చిన్నప్పుడు ఆరోగ్యం సరిగా లేకపొతే చుట్టలతో కాల్చి వాత పెట్టే నాటు వైద్యం చేశారట. జబ్బైతే తగ్గింది కానీ ఆ చుట్టతో పెట్టిన మచ్చలు ముఖంపై శాశ్వతంగా ఉండిపోయాయి. వెంకట రమణయ్య గారు ఎ.వి.ఎన్. కాలేజీకి అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలలో మొదట గణిత ఉపాధ్యాయునిగా తరువాత ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ గా  శ్రీ పి.టి.శ్రీనివాస అయ్యంగార్ ఉండేవారు. వీరు గిడుగు రామమూర్తి పంతులు, ఏట్స్ దొరగారితో కలిసి వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రారంభించారు. వారంటే వెంకట రమణయ్య గారికి ఎనలేని గౌరవం. ఎంత అభిమానమంటే తన కొడుకుకు ఆయనపేరు పెట్టేంత.

1915 లో గోదావరయ్య బడి లో శ్రీనివాసరావుని వెంకట రమణయ్య చేర్పించాడు. కొంతకాలం తరువాత శెట్టి లక్ష్మీ నరసింహం గారి వద్ద శ్రీనివాసరావు విద్యాభ్యాసం కొనసాగించారు. వీరిని శెట్టి మాస్టారు అని పిలిచేవారు. శెట్టి మాస్టారు చనువుగా ఉండే శ్రీనివాసరావుని జగన్మిత్ర అనే నాటక సమాజానికి పరిచయం చేశారు. ఇందులో ప్రదర్శించిన సావిత్రి సత్యవంతుడు అనే నాటికలో శ్రీనివాసరావు మొదట బాల సావిత్రి పాత్రను వేశాడు. లవకుశ నాటికలో కుశునిగా వేశాడు. ఒక సారి శెట్టి మాస్టారితో కలిసి చెళ్ళపిళ్ళ వెంకట శాస్తి గారి ఉపన్యాసం వినడానికి వెళ్ళాడు. అక్కడ చెళ్ళపిళ్ళ పెద్దనగారి పద్యమైన ‘రాతియున్ పవల్ మరుపురాని హొయల్’ ను వివరిస్తూ ఎప్పుడూ మరుపురానిదే కవిత్వం అని అన్నారు. ఈ వాక్యం శ్రీనివాసరావుని ఉత్తేజ పరచింది. గాంధీగారిని బ్రిటీషు అధికారులు అరెస్ట్ చేశారని తెలుసుకున్న హైస్కూల్ విద్యార్థులు సమ్మె చేశారు. వెంకట రమణయ్య గారు హెడ్ మాస్టర్ కావడంతో వాళ్ళందరినీ నిలబెట్టి మిమ్మల్ని ‘సమ్మె చేయమని మీకు ఎవరు చెప్పారు?’ అని ప్రశ్నించగా నేనే చెప్పాను అని శ్రీనివాసరావు అన్నాడు. బెత్తంతో వెంకట రమణయ్య గారు చేతులు బొబ్బలెక్కేటట్లు శ్రీనివాసరావుని కొట్టాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి కొడుకు చేతులు పట్టుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుని ఒక రూపాయి ఇచ్చి కొనుక్కోమన్నారట. పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా తన కర్తవ్యాన్ని నిర్వహించి కన్న తండ్రిగా ప్రేమను చూపించారు. నాలుగు లైన్లు వ్రాసి పద్యం నేనూ వ్రాశానని చూపెడుతున్న కొడుకును చూసి ముచ్చటేసి ఎ.వి.యన్. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ శ్రీ వడ్డే కేశవరావు వద్ద ఛందస్సు నేర్పించారు. మూలా వెంకరమణమ్మతో శ్రీనివాసరావుకు 15 సంవత్సరాల వయస్సులోనే వివాహం జరిపించారు.

పురిపండా అప్పలస్వామితో అనుబంధం :

వెంకట రమణయ్య గారి మిత్రుడైన అబ్బూరి రామకృష్ణారావు ఆంద్ర యూనివర్సిటీలో  గ్రంథాలయ అధికారిగా ఉండేవారు. వీరి ప్రోత్సాహం వల్ల శ్రీనివాసరావు అనేక పుస్తకాలను చదివి, రచనలు చేయడం మొదలెట్టాడు. శ్రీనివాసరావు ‘విశ్వరూప సందర్శనం’ అనే గీతమాలికను 1925 లో వ్రాశాడు. కౌరవ సభలో శ్రీకృష్ణుడు విశ్వరూపం ప్రదర్శించినప్పుడు ధృతరాష్ట్రుడు చేసే ప్రార్థన ఈ పద్యం.

ఓ మహాత్మ! త్వదీయ మహోన్నత  ప్ర

భావమింతని పలుక నెవ్వాని తరము ?….

దివ్యలోచనముల ప్రసాదింపుమయ్య !

దీనిని తీసుకుని స్వశక్తి అనే పత్రికలో ప్రచురణార్థం శ్రీనివాసరావు ఆ కార్యాలయానికెళ్ళారు. అక్కడ పురిపండా అప్పలస్వామి చూసి చాలా బాగుందని మెచ్చుకుని దీనిని మీ అన్నయ్య వ్రాశాడా? అని అడిగాడు. ‘శ్రీనివాసరావు అంటే నేనే. దానిని నేనే వ్రాశాను’ అనగానే, ‘ఇంత చిన్న వయస్సులో ఇంత బాగా వ్రాశావు అంటే నీవు భవిష్యత్తులో గొప్ప కవివవుతావు’ అని ఆశీర్వదించి పంపారు. వీరి ప్రోత్సహంతోనే శ్రీనివాసరావు రచించిన సమరాహ్వానము అనే రచనను భారతి అనే పత్రికలో ప్రచురించారు. ఇది మహాభారత యుద్ధంలో కౌరవులందరూ మరణించాక దుర్యోధనుడు మడుగులో దాక్కున్నప్పుడు ధర్మరాజు యుద్ధానికి పిలిచే సన్నివేశం దీని ప్రధాన ఇతివృత్తం. ఈ రచనని  పురిపండా అప్పలస్వామి  దివ్యలోచనములు అని పేరు మార్చి తన పత్రిక స్వశక్తి ద్వారా శ్రీనివాసరావుని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ రచనతో శ్రీనివాసరావుకి కొంత గుర్తింపు లభించింది. ఎంత ఎత్తుకు ఎదిగాడంటే పురిపండా గారితోనే ‘కొవ్వొత్తిని రెండువైపులా వెలిగించాను. అది శ్రీ శ్రీ లా వెలిగింది’ అని మెచ్చుకొనేలా. కాలేజీలో జరిగిన వ్యాస రచన పోటీలో నెగ్గిన శ్రీనివాసరావుకు ప్రధమ బహుమతి గా వేమన శతకాన్ని బహూకరించారు. వేమన పద్యాలు చదివిన నాటి నుండి అతని దృక్పధం భావకవిత్వం నుండి సామాజిక సమస్యలవైపు మరలింది.

కొంపెల్ల జనార్దన రావుతో అనుబంధం :

శ్రీనివాసరావు బి.ఎ. సైన్స్ చదవడానికి మద్రాసుకు వచ్చాడు. ప్రభవ అనే రచన చేసి శ్రీ శ్రీ అని పొట్టి సంతకంతో ఒక పద్య సంకలనాన్ని వ్రాశాడు. ఇదే ఒక పుస్తకరూపంలో అచ్చయిన మొదటి కావ్య సంపుటి. ఈ పొట్టి పేరే భవిష్యత్తులో అతని పొడుగాటి కీర్తికి ప్రతీకయ్యింది. ప్రభవపై ‘భారతి’ అనే సాహిత్య పత్రికలో కొంపెల్ల జనార్దన రావు అనే యువ కవి విమర్శిస్తూ “శైలి యందు సార్థకత కంటె సమతత్పరత ఎక్కువగా గోచరిస్తున్నది. ఇంకను విషయానుగుణ్యముగ శైలి యందు మార్పులు కన్పడవలెను. తెనుగు వాడకము చాలా తక్కువగానున్నది.” అని వ్రాశాడు. భారతి పత్రిక ఆఫీసులో సంపాదకుడు గన్నవరపు సుబ్బరామయ్య గారితో మాట్లాడి వస్తూ ఉండగా ఒక యువకుడు వెనకనుంచి చేయి వేసి ‘నీవేనా శ్రీ శ్రీ?, నా పేరు కొంపెల్ల జనార్దన రావు’ అని పరిచయం చేసుకున్నాడు. ‘ప్రభవ పై విమర్శిస్తూ వ్రాసింది మీరే కదా?’ అని శ్రీ శ్రీ అన్నాడు. సాహితీ చర్చ జరిపారు. సాహిత్యం పై అభిలాష వీరిని మంచి స్నేహితులుగా చేసింది. ఇద్దరూ తమ జీవితాల్ని సాహిత్యానికే అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు.

శ్రీ శ్రీ కష్టాలు :

శ్రీ శ్రీ తండ్రి గారు తన మిత్రునికి హామీ పత్రం రాయించు కోకుండా కొంత డబ్బు ఇచ్చారట. కానీ ఆ మిత్రుడు అకాల మరణం చెందారు. వెంకట రమణయ్య గారు ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకుని నెల నెలా వడ్డీ కట్టేవారట. కొన్ని సంవత్సరాల తరువాత ఆ వడ్డీ కట్టిన రసీదులు పోగొట్టుకోవడంతో ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యాపారి ఇంతవరకూ వడ్డీ కట్టలేదని మొత్తం డబ్బు ఇవ్వాలని పట్టుబట్టడంతో ఎంతో కష్టపడి కట్టిన ఇల్లు అమ్మాల్సి వచ్చింది. ఇదే సమయంలో శ్రీ శ్రీ కి 63 రోజులు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. మల్లిక్ అనే డాక్టర్ గారి సహాయంతో మృత్యువు నుండి బయటపడ్డారు. శ్రీ శ్రీ ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. విశాఖపట్నం పోర్టులో క్లర్క్ గా కొంతకాలం, ఎ.వి.యన్.కాలేజీలో జంతుశాస్త్ర విభాగంలో సహాయకుడిగా పనిచేశాడు. కలకత్తాలో ఉద్యోగం అని ఖరగ్ పూర్ కు వెళ్ళాడు. అక్కడ రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న శ్రీ శ్రీ ని చూసి ఒకతను ‘నిన్ను దోచుకుని చంపేస్తారు’ అని అంటే ‘నాదగ్గర  రెండు అణాలు తప్ప డబ్బేమీ లేదు’ అన్నాడు. ‘ఆ రెండు అణాలు చాలు నిన్ను చంపడానికి’ అని ఆయన అన్నాడు. అలా శ్రీ శ్రీ 20 మైళ్ళు నడిచి ఒక రైల్వే స్టేషన్ కు చేరుకున్నారట. ఆర్ధిక మాంద్య పరిస్థితులు నాడు అలా ఉండేవి. తన జీవితంలో అవి ‘దరిద్రపు రోజులు’ అని శ్రీ శ్రీ వ్రాసుకున్నారు. చివరకు మద్రాసుకు వచ్చి ఆంధ్రప్రభలో ఉపసంపాదకుడిగా చేరారు. ఆంధ్రప్రభ ద్వారా నార్ల వెంకటేశ్వరరావు, మల్లవరపు విశ్వేశ్వర రావు, కప్పగంతుల సత్యనారాయణ గార్లతో పరిచయ మయ్యింది. సరిగ్గా పని చేయలేదని శ్రీ శ్రీ ని తీసివేశారు. ఆంధ్ర పత్రికకు ఉద్యోగం కోసం వెళ్ళాడు. కానీ ఫలితం లేకపోయింది. ఢిల్లీలో అల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ గా కొంతకాలం పనిచేశాడు. స్టాలిన్గ్రాడ్ యుద్ధంపై వ్యాఖ్యానం చేసిన శ్రీ శ్రీ ని  గాంధేయవాది అని బ్రిటీష్ వారు ఉద్యోగం తీసేశారు. లక్నోలో మిలటరీ కంటోన్మెంట్ లో లేబరేటరీ అసిస్టెంట్ గా చేరాడు. కానీ దురదృష్టం వెంటాడుతూ వచ్చి మలేరియా బారిన పడ్డాడు. మద్యం తీసుకుంటే ఎవరో తగ్గుతుందని చెప్పారట. మలేరియా తగ్గింది కానీ మద్యం బారినుండి తప్పించుకోలేక పోయాడు. విప్లవ కవితలు వ్రాయడం వల్ల ఇతను కమ్యూనిస్టు అని బ్రిటీష్ అధికారులు ఉద్యోగం నుంచి తీసేశారు.  చివరకు విశాఖపట్నం కు వచ్చి అబ్బూరి రామకృష్ణారావు గారి నాటాలి అనే నాటక సంస్థలో నాటక రచయితగా చేరారు. ఇదే సమయంలో శ్రీ శ్రీ తండ్రి గారు వెంకట రమణయ్య గారు మరణించారు.

మహాప్రస్థానం :      

కాలాన్ని జయించిన కవిత్వం శ్రీ శ్రీ ది. మహాప్రస్థానం ఆధునిక సాహిత్యాన్ని మలుపు తిప్పింది అని చెప్పడం నూటికి నూరు పాళ్ళు నిజం. మహాప్రస్థానం  వంటి గేయాలను మళ్ళీ శ్రీ శ్రీ కూడా రాయలేనంత అద్భుత రచన. మహాప్రస్థానం రచన అంతా ఒక్కసారి చేసినది కాదు. ఆప్పుడప్పుడు శ్రీ శ్రీ ఈ కవితలని పత్రికలకు పంపేవాడు. మొదట ఈ కవితలను భారతి పత్రికకు పంపితే వారు ప్రచురించమని త్రిప్పి పంపారు. 1950 లో మచిలీపట్నం కి చెందిన నళినీ కుమార్ మహాప్రస్థానాన్ని ప్రచురించారు. ఉండవల్లి సూర్యనారాయణ రావు నళినీకుమార్ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. శ్రీ శ్రీ మహాప్రస్థానం గురించి తెలుపుతూ ‘నేను ఈ పుస్తకంలో విప్లవ సాహిత్యం వ్రాయలేదు. దీనిలో అభ్యుదయ కవిత్యం ఉంది. దీనిలో విప్లవ బీజాలున్నాయి.’ అని అన్నాడు. గూటాల కృష్ణమూర్తి గారి ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ లండన్ కు వెళ్లి స్వ దస్తూరితో మహాప్రస్థానం వ్రాసి ఇచ్చారు. దీనిని వారు భద్ర పరచారు. అంతేకాక శ్రీ శ్రీ చే కవితలను చెప్పించి రికార్డు చేశారు. ‘ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని అన్న మాటలు తూటాల్లా ఉంటాయి. జాతీయోద్యమంలో గరిమెళ్ళ సత్యనారాయణ గారి ‘నాకొద్దీ తెల్లదొరతనము’ అనే పాట, అభ్యుదయోద్యమంలో శ్రీ శ్రీ ‘మరో ప్రపంచం’ అనే గేయం జనులు పాడుకొనే మంత్రాల స్థాయిని సంపాదించు కొన్నాయి అని ఆరుద్ర గారన్నారు. మహాప్రస్థానంలోని ‘కవితా ఓ కవితా’  గీతాన్ని 1938 లో బందరు లో జరిగిన నవ్య సాహిత్య పరిషత్తు సదస్సులో శ్రీ శ్రీ పాడగా విశ్వనాథ సత్యనారాయణ గారు  కన్నీళ్ళతో గద్గద స్వరంతో ‘కవిత్వం అంటే ఇదే’ అని  మెచ్చుకొన్నారు. ‘ఔను నిజం, ఔను నిజం’ అనే శ్రీ శ్రీ ‘చేదు పాట’ను జరుక్ శాస్త్రి గారు పాడగా విన్న చలం గారు భావోద్వేగంతో కన్నీటి పర్యంతం అయ్యారట. తెలుగు కవిత్వంలో మరో మలుపు మహాప్రస్థానం.

చలం గారి యోగ్యతా పత్రం :

జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి శ్రీ శ్రీ మహాప్రస్థానానికి గుడిపాటి వెంకటా చలం గారితో ముందు మాట వ్రాయించారు. చలంగారు వ్రాసిన ఈ యోగ్యతా పత్రానికి కూడా ఎంతోమంది అభిమానులున్నారు. “నెత్తురూ, కన్నీళ్ళూ తడిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీ శ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి. కృష్ణశాస్త్రి తన బాధను అందరిలోనూ పలికిస్తే, శ్రీ శ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ. శ్రీ శ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి. పద్యం పదిసార్లు చదవండి. ఏమీ అర్థం కాలేదా? ఏ యువకుడికో భిక్షకుడికో ‘డెత్ బెడ్ ప్రజెంట్’ గా పంపండి. పారెయ్యకండి. అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీచేతిలో పుస్తకం. పాస్ ఇట్. పదేళ్ళు ఆగండి. ఈ లోపల ఆస్తిని సంపాదించడం, పిల్లల్ని కనడం, ధరలు హెచ్చడం కాక, జీవితంలో ఇంకా ఏవన్నా మిమ్మల్ని అమితంగా ప్రభావితంచేసినవి జరిగివుంటే మళ్ళీ కొత్త కాపీ కొని శ్రీ శ్రీ పద్యాల్ని చదవండి. అపుడన్నా అర్థమౌతుందేమో. రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోషం, ఝాంఝానిల షడ్జధ్వానం విని తట్టుకోగల చేవ వుంటే ఈ పుస్తకం తెరవండి.” అని చలం గారు జులై 17, 1940 లో యోగ్యతా పత్రాన్ని వ్రాసి ఇచ్చారు.

మహాప్రస్థాన అంకితం :

కొంపెల్ల జనార్దన రావు ‘ఉదయిని’ అనే పత్రికను స్థాపించి ఆ పత్రిక కోసం తన సంపదనంతా ఖర్చు చేశాడు.

క్షయ వ్యాధి గ్రస్తుడై మంచి వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక మరణించాడు. తన స్నేహితుని మరణం శ్రీ శ్రీ పై తీవ్రమైన ప్రభావం చూపించింది.

ఆనాదరణతో, అలక్ష్యంతో చూసి

ఒక్కణ్ణీచేసి వేధించారని, బాధించారని

వెక్కి వెక్కి ఏడుస్తూ వెళిపోయావా, నేస్తం!

తలవంచుకు వెళిపోయావా, నేస్తం!

అని  కొంపెల్ల జనార్దన రావు మరణాన్ని శ్రీ శ్రీ తట్టుకోలేక పోయాడు.

ఇక్కడ నిలబడి నిన్ను

ఇవాళ ఆవాహనం చేస్తున్నాను

అందుకో ఈ చాచిన హస్తం

ఆవేశించు నాలో!

ఇలాచూడు నీకోసం

ఇదే నా మహాప్రస్థానం!

అని అంటూ శ్రీ శ్రీ తన మహాప్రస్థానాన్ని కొంపెల్ల జనార్దన రావుకి అంకితమిచ్చాడు.

సినిమా రంగ ప్రవేశం :

‘మరో ప్రపంచం’ అనే గేయాన్ని బందా కనకలింగేశ్వర రావు నటించిన ‘కాలచక్రం’ అనే సినిమాలో ఉపయోగించుకున్నందుకు 25 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఆ సినిమా సరిగ్గా ఆడక పోవడంలో వారు డబ్బు ఇవ్వలేక పోయారు. ‘గాంధీనగర్’ సినిమాకు శ్రీ శ్రీ పాటలు, చలం గారు మాటలు వ్రాయడానికి ఒప్పుకున్నారు. దీనికోసం బొంబాయి లోని సి. రామచంద్రయ్య అనే సంగీతదర్శకుని వద్దకు వెళ్ళమని ఆ చిత్ర నిర్మాతలు శ్రీ శ్రీ కి చెప్పారు. కానీ రామచంద్రయ్య గారికి డబ్బు ఇవ్వక పోవడంతో వారు సంగీతం చేయలేదు. బొంబాయి వీధుల్లో డబ్బుల్లేక తిరుగుతున్న శ్రీ శ్రీ, వాడవల్లి సూర్యనారాయణ అనే అతని ధన సహాయంతో మద్రాసు చేరుకున్నారు. హైదరాబాదు లో ఖాసిం ఖాన్ అనే రచయిత సహాయంతో నిజాం సచివాలయంలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా చేరాడు. కానీ ముల్కీ సర్టిఫికేట్ లేక పోవడంతో ఉద్యోగం పోయింది. ఇన్ని కష్టాలు పడుతున్నా కవిగా మాత్రం రచనలు మానలేదు. 1948 లో నంద్యాలలో జరిగిన కమ్యూనిస్ట్ సభలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు శ్రీ శ్రీ ని మహాకవి అని సభకు పరిచయం చేశాడు. ఆప్పటినుంచి శ్రీ శ్రీ ని మహాకవిగా పిలిచేవారు. ఎంతగా అంటే విమర్శకులు సైతం మహాకవి శ్రీ శ్రీ అని సంభోధించేటంతగా.

శ్రీ శ్రీ అదృష్టం :  

1949 లో శ్రీ శ్రీ బంధువు ఒకావిడ మద్రాసులోని ఇంటికి కాన్పుకని వచ్చింది. ఆమెకు పుట్టిన ఆమ్మాయిని శ్రీ శ్రీ కి పిల్లలు లేకపోవడంతో ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి లెనినా అనే పేరు పెట్టాడు. ఆ పాపను పెంచుకున్నప్పటి నుంచి శ్రీ శ్రీ కి అదృష్టం కలిసి వచ్చింది. ఎంతగా అంటే ఒక గుర్రానికి శ్రీ శ్రీ అని పేరు పెట్టి గుర్రపు పందేలు కూడా ఆడి గెలిచేవాడు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సిఫారస్సుతో ‘ఆహుతి’ అనే సినిమాకు పాటలు వ్రాయడానికి ఆవకాశం వచ్చింది. ఇది ‘నీర్ ఔర్ నందా’ అనే హిందీ సినిమాకు డబ్బింగ్. ఈ సినిమాలోని ‘హంస వలే ఓ పడవా ఊగుచు రావె’ అనే పాటను శ్రీ శ్రీ వ్రాశారు. హిందీ సినిమా పాట సంగీతానికి సరిపోయేలాగా, హిందీ మాటలకు పెదవులు సరిపోయే లాగా తెలుగు లో పాటను శ్రీ శ్రీ వ్రాశారు. ఘంటసాల, రావు బాలసరస్వతి దేవి తమ గాత్ర సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఘోర పరాజయం పొందినా, ఈ సినిమాలో వ్రాసిన ‘ప్రేమయే జనన మరణ లీల మృత్యు పాశమే అమర బంధమౌ యువ ప్రాణుల మ్రోల’ అనే పాటకు మంచి పేరు వచ్చింది. హెచ్.ఎం.రెడ్డి గారి దర్శకత్వంలో ‘నిర్దోషి’ అనే సినిమాలో వ్రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మునాస్ అనే తమిళ దర్శకుడు తెలుగులో ‘ప్రపంచం’ అని తమిళంలో ‘ఉళగం’ అనే ద్విభాషా చిత్రాన్ని తీసారు. ఇందులో శ్రీ శ్రీ ఒక చిన్న సన్నివేశంలో నటించాడు. అంతవరకూ డబ్బింగ్ పాటలు వ్రాసి డబ్బింగ్ కింగ్ గా పేరుపొందాడు. 1952 లో ‘మరదలు పెళ్లి’ అనే తెలుగు సినిమా కు పాటలు వ్రాశాడు.  మాదాల రంగారావు శ్రీ శ్రీ చేత తన సినిమాల్లో విప్లవగీతాలు వ్రాయించుకొనేవాడు. 1952 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ఎం.ఎల్.సి. గా ఎన్నికయ్యాడు. స్టాక్ హోంలో 1954 లో జరిగిన ప్రపంచ శాంతి మహా సభలలో పాల్గొన్నాడు.  మొదటి భార్య చనిపోవడంతో శ్రీ శ్రీ కి అసిస్టెంట్ గా పనిచేసిన సరోజినిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక ఆబ్బాయి పుట్టారు.

విరసం ఆవిర్బావం :

శ్రీ శ్రీ షష్టి పూర్తి సందర్భంగా తెన్నేటి విశ్వనాధం అధ్యక్షతన  1970 ఫిబ్రవరి 2 తేదీన ఏర్పాటు చేసిన సభ సందర్భంగా శ్రీ శ్రీ ని జగదాంబ సెంటర్ నుండి మునిసిపల్ స్టేడియం వరకూ ఊరేగింపు జరిగింది. జూలై 4, 1970 న ఏర్పడిన విప్లవ రచయితల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేశారు. విశ్వనాధ సత్యనారాయణ గారితో కొంత అభిప్రాయ భేదాలు వచ్చాయి. సద సత సంచయం అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. విరసం వారు ప్రభుత్వం ఇచ్చే అవార్డులు బహిష్కరించాలని పిలుపు నివ్వగా

శ్రీ శ్రీ ఆ అవార్డును స్వీకరించలేదు. కానీ ప్రభుత్వం వారు చెక్ రూపంలో పారితోషికం పంపగా శ్రీ శ్రీ తీసుకున్నారు. ఈ డబ్బుతో విరసం ఆఫీసు లో ఒక ప్రింటింగ్ మిషన్ పెట్టించడం కోసం శ్రీ శ్రీ తీసుకొన్నారు. విరసం లోని కొందరికి ఇది నచ్చలేదు. దీనితో అధ్యక్ష పదవికి శ్రీ శ్రీ రాజీనామా చేశాడు. 1982 లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వ్యక్తిగతంగా సమర్థించాడు. ఇది కూడా వివాదాస్పద మయ్యింది. కానీ కాంగ్రేస్ ను ఓడించడానికి రామారావు గారి మద్దతు తెలిపాడు.

శ్రీ శ్రీ పై ఇతర రచయితల ప్రభావం :

శ్రీ శ్రీ ని మొదట బొదిలేర్,  మాపాసా, ఎడ్గార్ ఎల్ న్ పో, 1935 తరువాత  స్విన్ బర్న్, క్రొపాట్కిన్ ప్రముఖ కవులు ప్రభావితం చేశారు. బోదిలేర్ ఫ్రెంచ్ సింబాలిస్ట్. బోదిలేర్ మాఘ పూర్ణిమ మంచు తెరల సోయగంతో తనను ఆవహిస్తాడని శ్రీ శ్రీ చెప్పుకున్నాడు. మపాసా ఫ్రెంచ్ కథకుడు. ఇతని రచనలు చదివి ఖండ కావ్యం ఎలా రాయాలో తెలుసుకున్నానన్నాడు. ఎడ్గార్ ఎలెన్ పో అమెరికన్ కవి. ఇతని రచనలు చదివి ఛందో రహస్యాలను తెలుసుకున్నాడు. 1936 లో ‘స్విన్ బర్న్ కవికి’ అనే గేయాన్ని ఇలా వ్రాశాడు.

విషం క్రక్కే భుజంగాలో

కదం త్రొక్కే తురంగాలో

మదంపట్టిన మాతంగాలో

కవీ, నీ పాటల్ !

మహాప్రస్థానంలో ‘ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే’ అంటూ అద్వైతం అనే గేయాన్ని అతని స్పూర్తి తోనే వ్రాశాడు. క్రొపాట్కిన్ భావాల ప్రభావంగా శ్రీశ్రీ వ్రాసిన గేయం చూడండి.

చీనాలో రిక్షావాలా,

చెక్ దేశపు గని పనిమనిషీ,

ఐర్లండున ఓడ కళాసీ,

అణగారిన ఆర్తులందరూ..

హాటెన్ టాట్, జూలూ, నీగ్రో,

ఖండాంతర  నానా జాతులు,

చారిత్రక యదార్థ తత్త్వం,

చాటిస్తా రొక గొంతుకతో..

అని శ్రీ శ్రీ వ్రాశాడు. కవిత్రయమంటే మనకు గుర్తుకు వచ్చేది నన్నయ, తిక్కన, ఎఱ్ఱన. అయితే, శ్రీ శ్రీ మాత్రం తిక్కన, వేమన, గురజాడ కవిత్రయంగా చెప్పాడు.

శ్రీ శ్రీ సినిమా పాటలు :

శ్రీ శ్రీ  సినిమాలలో దేశభక్తి పాటలు, విప్లవ గీతాలు, వీణ పాటలు, శృంగార పాటలు, విరహపు పాటలు, హాస్యపు పాటలతో పాటూ పద్యాలు కూడా వ్రాశారు. శ్రీ శ్రీ సినిమా పాట అనగానే మనకు గుర్తుకు వచ్చేది ‘తెలుగువీర లేవరా, దీక్ష బూని సాగరా, దేశ మాత స్వేచ్ఛకోరి, తిరుగుబాటు చేయరా’ 1974 లో వచ్చిన ఆల్లూరి సీతారామ రాజు చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. ఇందులో అల్లూరి గా నటించిన ఈ చిత్రం కృష్ణ కు వందవ చిత్రం. ఈ చిత్రంలో సీత గా విజయ నిర్మల నటించింది. ఈ చిత్రానికి

పి. ఆదిశేషగిరిరావు సంగీతం వహించారు. శ్రీ శ్రీ వ్రాసిన ఈ పాటకు జాతీయ ఉత్తమ సినీ గేయ రచయితగా బహుమతి లభించింది. ఇప్పటికీ జాతీయ పండగలప్పుడు తెలుగు రాష్ట్రాలలో లౌడ్ స్పీకర్లలో వినిపించే దేశభక్తి పాట ‘పాడవోయి భారతీయుడా’, ఈ పాటను వెలుగు నీడలు అనే సినిమా కోసం శ్రీ శ్రీ వ్రాయగా, ఘంటసాల పాడారు.  పెండ్యాల స్వరపరచారు. ఇందులో ఒక చరణంలో స్వతంత్రం వచ్చిందని సంబర పడవద్దని తెలుపుతూ ఇలా వ్రాశారు.

స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి

సంబర పడగానే సరిపోదోయి

సాధించినదానికి సంతృప్తిని పొంది

అదే విజయమనుకుంటే పొరబాటోయి

అని అంటూ ప్రస్తుత పరిస్థితిని ఇలా వివరిస్తున్నాడు.

ఆకాశం అందుకొనే ధరలోక వైపు

అదుపులేని నిరుద్యోగ మింకొకవైపు

అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు

అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు!

మరి మన కర్తవ్యాన్ని కూడా ఇలా గుర్తుచేస్తున్నాడు.

సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం

సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం

ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే

లోకానికి మన భారతదేశం

అందించునులే శుభ సందేశం

ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ వారి మొదటి చిత్రం ‘పెంపుడు కొడుకు’. ఈ చిత్రంలో పాటలన్నీ శ్రీ  శ్రీ గారే వ్రాశారు. అందులోని ఒక పాట చూడండి.

ఉన్నవారికే అన్ని సుఖాలోరయ్యో రయ్యో

లేని వారిగతి ఈ లోకంలో నుయ్యో గొయ్యో

ఎవరికి వారే యమునా తీరే అన్నా అన్నా

ఇల్లూ వాకిలి నీదీ నాదీ సున్నా సున్నా

ఈ పాట ద్వారా రాజసులోచన సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాకు సాలూరు రాజేశ్వరరావు సంగీతాన్ని అందించారు. శ్రీ శ్రీ పాటలతో పాటు పద్యాలు కూడా వ్రాశారు. ‘కుమ్మరి మొల్ల’ అనే చిత్రంలో శ్రీ శ్రీ వ్రాసిన పద్యం ఒకటి చూడండి.

అప్పుడు మిథిలకు జనినే

నిప్పుడు కావించు వింత నిచ్చటి ప్రజ తా

మెప్పుడును కాంచబోరని

చెప్పుచు రాఘవుడు విరిచె శివకార్ముకమున్

ఆప్పు, నిప్పు, మెప్పు, చెప్పు అనే నాలుగు మాటల ద్వారా రామాయణ పరంగా అర్థం వచ్చేటట్లు కవయిత్రి మొల్లను తెనాలి రామలింగడు ఒక పద్యం చెప్పమని అడిగే సందర్భంలో మొల్ల చెప్పిన పద్యం ఇది. శ్రీ శ్రీ వ్రాసిన ఇంకొక పద్యం చూడండి.

అహో దుర్భరమాయె భారతము! గ

ర్వాంధుల్, దురార్భాట, సం

రహుల్ స్వార్థ పరుల్ చరింతురట! వీ

రల్ సేయు ఘోరాలపై

          సింహంబోయన లేచి, నేనిక మహా

క్ష్వేళాధ్వనిన్ వీరలన్

సంహారం బొనరించు శక్తిని జగ

న్మాతా! ప్రాసాదింపుమా!

‘పంతులమ్మ’ అనే సినిమాలో 1978 లో సింగీతం శ్రీనివాసరావు సంగీత దర్శకత్వంలో రంగనాథ్, దీపా నటీ నటులుగా వచ్చిన ఈ చిత్రంలో ఈ పద్యాన్ని శ్రీ శ్రీ వ్రాశాడు. చందస్సు మీద శ్రీ శ్రీ కి పట్టు ఉందని చెప్పడానికి ఈ పద్యం ఒక ఉదాహరణ. శివాజీ అమ్మవారిని వేడుకొనే పద్యం ఇది.

ఆత్రేయ గారు దర్శకత్వం వహించిన ఏకైక సినిమా వాగ్దానం. ఇందులో ఆత్రేయ శ్రీ శ్రీ చేత హరికథను వ్రాయించారు.

శ్రీ రామ భక్తులారా! ఇది సీతా కళ్యాణ సత్కథ.

నలభై రోజులు నుండి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పు కొస్తున్నాను.

అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తోంది.

నాయనా! కాస్త పాలు, మిరియాలు! ఏవైనా

చిత్తం, సిద్ధం

భక్తులారా! సీతామహాదేవి స్వయం వరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరులలో అందరినీ ఆకర్షించిన ఏకైక దివ్య సుందరమూర్తి ఆహా! అతడెవరయ్య అంటే …

రఘురాముడు

రమణీయ వినీల ఘనశ్యాముడు

వాడు, నెలరేడు, సరితోడు, మొనగాడు

వాని కనులు మగమీల నేలురా

వాని నగవు రతనాల జాలురా

వాని చూచి మగవారలైన మైమరచి

మరుల్కొనెడు మరో మరుడు, మనోహరుడు

ఈ విధంగా హరికథ సాగుతుంది.

భార్యా భర్తలు అనే ప్రసాద్ ఆర్ట్స్ చిత్రంలో ఒక వీణ పాట వ్రాశాడు.

ఏమని పాడెదనో ఈ వేళ

మానస వీణ మౌనముగా నిదురించిన వేళ

అన్నపూర్ణ సంస్థ వారు ద్విభాషా చిత్రాలు తీసేవారు. తెలుగులో 1959 లో ‘మాంగల్య బలం’ అనే సినిమా లో శ్రీ శ్రీ ఒక పాట వ్రాశాడు.

ఆకాశ వీధిలో అందాల జాబిలి

ఒయ్యారి తారను చేరి ఉయ్యాల లూగెనే, సయ్యాట లాడెనే

మనసు కవి అనగానే మనకు ఆత్రేయ గుర్తుకు వస్తారు.  శ్రీ శ్రీ వ్రాసిన ఒక మనసు పాటను చూడండి.

మనసున మనసై, బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము

జగతి పిక్చర్స్ వారి ఆరాధనలో బెంగాలీ ట్యూన్ కు అనుగుణంగా శ్రీ శ్రీ ఒక పాటను వ్రాశాడు.

నా హృదయంలో నిదురించే చెలీ!

కలలోనే కవ్వించే సఖీ

మయురివై వయ్యారివై నేడే

నటనమాడినావే

నన్ను దోచినావే

ఈ పాట విన్న విద్యార్ధి ఒక రోజు శ్రీ శ్రీ ని ‘ ఆ నిదురించే చెలి ఎవరు ?’ అని అడిగాడట. దానికి ‘ఆ చెలి కమ్యూనిజం’  అని శ్రీ శ్రీ సమాధానమిచ్చాడట.

యమలోకంలో కూడా సమానత్వానికి పోరాడిన ఈ పాట చూడండి.

సమరానికి నేడే ప్రారంభం

యమరాజుకు మూడెను ప్రారబ్ధం

నరకలోకమున కార్మిక శక్తికి

తిరుగులేదని చాటిద్దాం

ఇదే పాటలో ఇందిరాగాంధీ దేశంలో పెట్టిన అత్యవసర పరిస్థితిని ఇలా ఎదిరించాడు.

యముడి నిరంకుశ పాలన వద్దు

యమ అర్జెన్సీ ఇకపై రద్దు

వెట్టిచాకిరి తలపై మొట్టు

వెయ్యండర్రా అందరు ఒట్టు

శ్రీ శ్రీ చివరి క్షణాలు :

శ్రీ శ్రీ కి గొంతునొప్పిగా ఉందని చిట్టూరి సత్యనారాయణ రావు గారి వద్దకు వచ్చి చూపించుకుంటే క్యాన్సర్ అని తేలింది. డాక్టర్ గారి మంచి వైద్యం వల్ల తగ్గింది. డాక్టర్ గారి సలహా పై మద్యం, సిగరెట్టు మానివేశారు. 1983 జూన్ 4 తేదీన నేటి భారతం అనే సినిమాకు ఒక పాట వ్రాశారు. 1983 జూన్ 5వ తేదీన సుశీల, మాధవపెద్ది పాడి రికార్డు చేశారు.

అర్థరాత్రి స్వతంత్రం, అంధకార బంధురం

అంగాంగం దోపిడైన కన్నతల్లి జీవితం

ఇదే ఇదే నేటి భారతం

భరతమాత జీవితం

భరతమాతను నేను బందీనై పడి ఉన్నాను

శరీరమంతా కారాగారం, సంకెళ్ళే నాకలంకారం

ఉరితాడే నా మెడలో హారం, కన్నీరే నా జీవాధారం

అదే వారి చివరి పాట. శ్రీ శ్రీ 1983 జూన్ 15 వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పరమపదించారు. శ్రీ శ్రీ భౌతికంగా లేక పోయినా యువతలో రగిలించిన స్పూర్తి హృదయాంతరాళాలలో నేటికీ నిలిచి ఉంది. వేటూరి గారన్నట్లు ‘శ్రీ శ్రీ పుట్టుకతో మనిషి, వృద్ధాప్యంలో మహర్షి, మధ్యలో మాత్రమే కవి, ఎప్పటికీ ప్రవక్త’. అనర్గళం, అనితరసాధ్యం శ్రీ శ్రీ మార్గం.

కుదిరితే పరిగెత్తు

లేకపొతే నడువు…

అదీ చేతకాక పొతే

పాకుతూ పో ..

                    అంతేకానీ ఒకే చోట

                    అలా కదలకుండా

                    ఉండిపోకు …

పారే నది,

వీచే గాలి,

ఊగే చెట్టు..

ఉదయించే సూర్యుడు..

                    అనుకున్నది

                    సాధించాలని నీలో

                    కసి కసిగా ప్రవహిస్తుండే

                    ఆ నెత్తురుతో సహా ..

ఏదీ ఏదీ ఆగిపోవడానికి

వీల్లేదు,,

                    నీవు పడుకునే

పరుపు .. నిన్ను

చీదరించుకోక ముందే

బద్దకాన్ని వదిలేయ్ …

మళ్ళీ చెబుతున్నా .. కన్నీళ్లు

కారిస్తే కాదు … చెమట

చుక్కను చిందిస్తేనే

చరిత్రను రాయగలవని

తెలుసుకో..

                    చదివితే ఇవి పదాలు

                    మాత్రమే,

                    ఆచరిస్తే…

                    అస్త్రాలు.

          వాడుక బాషకు గురజాడ వారు ఆద్యులైతే, ఆభాషను ప్రజా హృదయాల్లోకి చొప్పించి, ప్రజాభ్యుదయ, విప్లవ జ్యోతులను వెలిగించిన నిత్య విప్లవ కృషీవలుడు శ్రీ శ్రీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here