రంగుల హేల 50: అర్థాలూ – అపార్థాలూ

10
3

[box type=’note’ fontsize=’16’] “ఎదుటివారి మనసెప్పుడూ పరాయి భాషలాంటిదే. ఎంత అర్థం చేసుకున్నామని అనుకున్నా ఎంతో కొంత అర్థం కాని స్టఫ్ ఉంటూనే ఉంటుంది” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల’ కాలమ్‌లో. [/box]

[dropcap]సృ[/dropcap]ష్టిలో ఇతర జీవులనుండి మనుషుల్ని వేరు చేసింది మాట. దానివల్లనే మానవుడికి తోటిమనుషులతో కమ్యూనికేషన్ ఏర్పడి ఆపై తెలివి తేటలు అభివృద్ధి చెందాయి. తాను సుఖంగా జీవించడానికి వీలైనన్ని శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు చేసుకుంటూ ఫలితంగా మరింత సౌకర్యంగా బతుకుతూ ఉన్నా మరిన్ని లాభాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు మనిషి. అలా క్రమంగా భూతలంలో మనిషి ఆధిపత్యం మొదలై ఈ భూమీ, దానిపై సంపదా, జీవరాశీ అంతా కేవలం తనకొరకే ఉన్నది అనుకునేంతగా శృతి మించి ముందుకు వెళ్లి కూర్చున్నాడు. అప్పుడప్పుడూ దుష్ఫలితాలు ఎదుర్కొని కూడా పరివర్తన చెందలేకపోతున్నాడు. అలా మాటతో మొదలైన మనిషి చరిత్ర ఎన్నో పుంతలు తొక్కుతోంది. చివరికి తన కాలికింది నేలకు తానే ప్రమాదం తెచ్చుకునేంత స్వార్ధపు మూర్ఖత్వంలో పడుతున్నాడిప్పుడిప్పుడు. పేజీలకు పేజీల శాంతి చర్చల్లోని మాటలు అర్థాన్ని అందజెయ్యలేకపోతున్నాయి. దేశాల మధ్య యుద్ధాన్ని ఆపలేకపోతున్నాయి.

అయితే మన మనసు లోని భావం మాట రూపంగా మార్చినపుడు దాన్నిఎదుటిమనిషికి పూర్తిగా కన్వే చేసి అందజేయగలుగుతున్నామా! లేదా! చేసినా అది ఎదుటివారికి ఎలా అర్థం అవుతోంది అన్నదానికి ఎన్నోరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ మాట అన్నవారిని బట్టి, టైంని బట్టి ఎదుటివారికి వారితో ఉన్న సంబంధ బాంధవ్యాలను బట్టి దాని అర్థం రకరకాలుగా మారిపోతుంది.

ఇంకా కూరిమి గల దినములలో ఆ మాటలు ఒకలా అర్థం అయ్యి, ఆ కూరిమి విరసమయ్యాక అవే మాటలు మరోలా అర్థం అవుతాయని సుమతీ శతకకారుడు ఏనాడో రాసి వెళ్ళిపోయాడు. అది మనకందరికీ అనుభవమే.

ఎదుటివారి మనసెప్పుడూ పరాయి భాషలాంటిదే. ఎంత అర్థం చేసుకున్నామని అనుకున్నా ఎంతో కొంత అర్థం కాని స్టఫ్ ఉంటూనే ఉంటుంది. దశాబ్దాలు కాపురం చేసిన దంపతులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. దీర్ఘకాలంగా జీవిస్తున్న జంటల్లో చిన్న సైగతో ఒకరినొకరు అర్థం చేసుకునే జంటల శాతం రెండుమూడు కన్నా దాటదు అని నేనంటే ఎవరైనా బాధ పడితే నన్ను క్షమించెదరు గాక! కీచులాడుకునేవీ, నిష్ఠూరంగా మాట్లాడుకునేవీ, ఎమోషన్స్ మింగుకునేవీ, ‘కొట్లాడలేంలే పోనీయ్!’ అనుకునేవీ నూటికి తొంభై శాతం పైనే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి జీవిత భాగస్వామిని ఒప్పించే ప్రక్రియను శాస్త్రోక్తంగా మొదలు పెడితే అది చేంతాడులా సాగుతూనే ఉంటుంది. ఫలితం ఎప్పటిలానే ఉంటుంది తప్ప ఎదుటివారు ఆశించినట్టు మాత్రం ఖచ్చితంగా ఉండదు. దానిబదులు వాళ్ళు చెప్పినట్టు చేసేస్తే హాయికదా అనుకుని ఊరుకుంటారు. ఇదే ఆదర్శ దాంపత్యం లోని రహస్యం తప్ప, మనసున మనసైన తోడున్నట్టు ఎవరైనా అపార్థం చేసుకుంటే మనం వారికి అర్థం చేయించే ప్రయత్నం వ్యర్థం. వారిని ఆ భ్రాంతిలోనే ఉండనిచ్చి సుఖపడమందాం. వాళ్ళ ఆనందాన్ని మనమెందుకు పాడు చెయ్యాలి?

రోజాఖరికి ఎవరికైనా మనసుకు శాంతే అతి ముఖ్యమైన గమ్యం అవుతుంది. అందుచేతే పెళ్ళికాక ముందు ఆశపడినట్టు స్వతంత్ర నిర్ణయాలూ, ఇండివిడ్యువాలిటీ లాంటి గప్పాల మాటలు, ఊహాపోహలు నిలబెట్టుకోవడం పెళ్లయ్యాక గగన కుసుమం అవుతుంది. కాబట్టి రాజీ తప్పదు.అయితే ఒకోసారి ఒకరిది పైచేయి, మరొకసారి మరొకరిది అవుతుంది. అలా రాయబడని, సంతకాలు పెట్టుకోని అగ్రిమెంట్ ఒకటి అమలవుతుంటుంది ఇళ్లల్లో. అదే పచ్చని కాపురం అంటేమరి.

దాన్ని బైట వారు అన్యోన్య దాంపత్యమనీ, కుదురైన జంటనీ పేర్లు పెట్టి ప్రోత్సహిస్తూ ఉంటారు. కొత్త జంటలకు వారిని ఉదహరిస్తూ ఉంటారు. చివరాఖరికి.. ఇంతకీ జంటలోని ఇద్దరు మనుషులు ఒకరికొకరు హృదయపూర్వకంగా గౌరవిస్తూ ఒకరి మనోభావాలను మరొకరు దెబ్బ తియ్యకుండా కాపాడుతూనే ఉన్నారా? అన్నది ఆ దేవదేవుడికే తెలియాలి. మానవమాత్రులం మనవల్ల కాదు.

ఊరికే ఎదుటివారి గురించి మాట్లాడతాం కానీ వ్యక్తిగతంగా ఎవరికి వారే అర్థం కారు. మనకేం కావాలో మనకే తెలీదు. అప్పటి పరిస్థితిని బట్టి దేవుణ్ణి ఏదో గట్టిగా కోరి ప్రార్థిస్తాం. ఇంకా మొక్కులు కూడా మొక్కి ముడుపులు కట్టి భగవంతుణ్ణి కూడా మనలాంటి వాడుగా భావించి బేరాలు కూడా పెడతాం. ఆ కోరిక తీరక, చాలా రోజులు గడిచాక మన కష్టాలు మాయమయ్యి ఆకస్మికంగా అనుకోనిదేదో వచ్చి మనకి లాభం, సుఖం దక్కుతాయి. అప్పుడు ‘ఆ నాటి మన కోరిక సరైనది కాదేమో. అమాయకంగా కోరాం కదా! అందుకే దేవుడు ఇవ్వలేదేమో’ అని నవ్వుకుంటాం.

రచయితలు ఎంతో సాహిత్యం చదివి, మరెంతో మనసుపడి తమవైన సరికొత్త భావాలు కొన్ని చెప్పాలని సరికొత్త సాహిత్యాన్ని సృజించి వివిధ ప్రక్రియలలో వాటిని పొదిగి పాఠకుల ముందు పరిచి చేతులు కట్టుకుని నిలబడతారు. అయితే పాఠకుల మనో స్థాయిని బట్టి రచయిత ఊహించిన అర్థం అనుకున్నఅలవరసలో వారిని చేరదు. గొప్ప ఉద్గ్రంధాలు తెల్ల మొహం వేస్తాయి. సానుభూతి కరువైన నాడు, కవి వేదన వినేవాడి మనసునూ, చెవినీ తాకదు. గాల్లో కలిసి పోతుంది. గంటల గంటల వాదనలనంతరం పండితులు ఎవరి పాయింటు దగ్గర వారే నిలబడతారు. అడుగు కూడా దగ్గర కాలేకపోతారు. భాష అయోమయంగా తలదించుకుంటుంది. కమ్యూనికేషన్ ఘోరంగా ఫెయిల్ అవుతుంది.

కొంతమంది ఎవరైనా వచ్చి వారి సొంత బాధల్ని వివరించి చెప్పగానే ఇన్ బిట్వీన్ లైన్స్ అన్నట్టు వారి మాటల మధ్య ఊహాగానాలు చేస్తారు తప్ప వారు చెప్పే దానిపట్ల సానుభూతితో స్పందించలేరు. మనకి ఆత్మీయులైన వారికి కష్ట కాలంలో ఒక్క అరమాట ఫోన్‌లో చెప్పీ చెప్పకుండానే మనముందు వచ్చి వాలిపోతారు. అలా కానివారి ముందు మన కష్టాలు వివరించి చెప్పబోయినా అవి వారి చెవినుంచి మరోచెవి ద్వారా బైటికి పోతాయి తప్ప సహానుభూతి దొరకదు. పైగా మరో అనవసరపు అర్ధాన్నిస్తాయవి. అంటే మాటలు సమయాన్ని బట్టి మనుషుల్ని బట్టి అర్థాల్ని మార్చుకుంటాయన్నమాటేగా!

ప్రతి మాటకీ నిఘంటువులో ఉన్న అర్థాలే కాక మరికొన్ని అర్థాలు ప్రాంతాన్ని బట్టికూడా ఏర్పడతాయి. వ్యాపార కేంద్రంగా ఉన్న జిల్లాల వారి మాటలు కాస్త క్లుప్తంగా, వ్యంగ్యార్థంతో ఒకలా ఉంటాయి. ఎక్కువగా వేళాకోళంగా మాట్లాడే జిల్లాల వారి మాటల అర్థాలు కాస్త వేరుగా ఉంటాయి. మాట వెనుక మనసు మనవారిదైతే దాని అర్థం వేరు. మాట వెనుక మనసు మన వారిది కాకపొతే దాని అర్థం వేరు.

ఇక అపార్థాల సంగతి కొస్తే కొన్ని కొన్ని అపార్థాలు దూది పింజెల్లా తేలిపోతాయి. కదిలే మబ్బుల్లా మాయమవుతాయి. అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల, అన్న చెల్లెళ్ళ మధ్య పెళ్లిళ్లయ్యాక ఎవరి సంసారాలు, పిల్లలూ వాళ్ళవయ్యాక ఎన్నో అపార్థాలు చిక్కుబడిన తీగల్లా అల్లుకుని ఉంటాయి. వాటిని తొలగించుకుంటూ మధ్య మధ్య ఫంక్షన్ లలో కలుసుకుంటూ ఉన్నా అవి అలాగే ఓ మూల నుంచి తొంగి చూస్తూ ఉండి వారి జీవిత భాగస్వాముల దయా సహకారాలపై ఆధారపడి ముందుకు సాగుతుంటాయి.

ఒకోసారి అర్జెంటుగా పనిపడి ఫోన్ చేస్తే వారు అవతలివారు కట్ చేస్తే అల్లాడిపోయిన మనం, మరో పది నిమిషాల తర్వాత వారు కాల్ బ్యాక్ చేసి వివరాలు అడగానే ఆనందపడిపోతాం. ఆత్మీయులు ఫోన్‌లో ముక్తసరిగా మాట్లాడి పెట్టేశారని ఒకోసారి మన మనసు చివుక్కుమంటుంది. నాలుగు రోజుల తర్వాత ఆ రోజు ఒక ఇబ్బందిలో ఉండి అలా మాట్లాడారని తెలియగానే తెరిపిన పడతాం. ఇవన్నీ చిట్టి చిట్టి అపార్థాలు. ఒకోసారి కమ్యూనికేషన్ సరిగా లేక కొన్ని కొన్ని సందర్భాల్లో అపోహలు కలుగుతాయి.అవన్నీ సర్దుకుంటేనే మనుషుల మధ్య బంధాలూ, అనుబంధాలూ నిలబడతాయి, కొనసాగుతాయి. ఒకోసారి అవతలివారు సరిగా ప్రవర్తించకపోయినా మనం కాస్త ఓర్చుకుంటే వాళ్లే తప్పు తెలుసుకుని చక్కబడతారు. మనతో కలిసి ప్రయాణం సాగించగలుగుతారు. లేదంటే లేదు.

కొందరు చిన్నప్పటినుండీ అణచివేతకు గురవేరడం వల్లకాని, సహజ జీన్స్ లక్షణం వల్ల కానీ మనసులో మాటల్ని బైటకి రాకుండా తొక్కిపెట్టే అలవాటువల్ల కానీ వ్యంగ్యంగా మాట్లాడ్డం ప్రాక్టీస్ చేస్తారు. ఓపెన్‌గా మనసులో మాట చెప్పరు. గుంభనగా వారనుకుంటున్న మాటని మరొకరి నోటినుండి రప్పిస్తారు. అదొక రకం టెక్నీక్. ఇంకొందరు సూదుల్లాంటి మాటల్తో ఎదుటివారిని గుచ్చి సంబరపడతారు. తామేదో తెలివైన వారమనీ, గడుసువారమనీ అనుకుంటూ వంకరగా మాట్లాడుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే ఎదుటివారిచేత రిపార్టీ మాటల్తో దెబ్బలు తింటూ ఉంటారు. అయినా వారి సహజ ప్రవృత్తిని వదులుకోలేక, ఎవరికీ ఆత్మీయులు కాలేక ఒంటరిగా మిగిలిపోతుంటారు.

ప్రేమికుల మధ్య తొందరగా అపార్థాలు వస్తాయి. చిన్న ముఖాముఖీ వివరణతో పోయేదానికి వందల పేజీలు నవలలు రాసిన రచయితలున్నారు. అలాంటి కథలు సినిమాలుగా తీసి మునిగిన నిర్మాతలున్నారు.

లవర్స్ మధ్య అపార్థాలు ఎదుటివారిమీద అతి ప్రేమ వల్లా, ప్రేమను మించిన రాగం పెంచుకోవడం వల్లా వస్తుంటాయి.కాస్త సహనం, సంయమనం వహిస్తే అవి తొలగిపోతాయి.

అపార్థాల గొంగళీ పురుగులు పుట్టినప్పుడు వాటిని నెమ్మదిగా కొంతకాలం అలా వదిలేస్తే అవి చక్కని సీతాకోక చిలుకలై వచ్చి మన బంధాల్ని మరింత బాగా కొనసాగిస్తాయిట. కొన్ని అపార్థాలు కావచ్చు లేదా అసలు స్వరూపాలు బైట పడడం వల్ల కావచ్చు, కొందరి మధ్య శాశ్వతంగా గోడలు ఏర్పడి వారింక జీవితంలో మళ్ళీ కలవలేకపోతారు.

కొందరికి మాటలు హృదయం నుంచి కాక నోటి చివరినుంచి వస్తాయి. కొందరింటికి కాసిని పళ్ళు తీసుకుని వెళ్లి, సరదాగా ఓ గంట కూర్చుని కబుర్లు చెప్పి వస్తుంటాము. మనం చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని బయలుదేరుతుంటే ‘భోంచేసి వెళితే బావుండేది కదా’ అంటారు.

నిజానికి మనకి లంచ్ కానీ డిన్నర్ కానీ ఇచ్చే వారి ప్రయత్నాలు వేరుగా ఉంటాయి. ఏదో మాటవరసకు అంటే భోజనానికి వెళ్ళం కదా. ఇంకా కొందరు మెరమెచ్చు మాటలు చెప్పే వాళ్ళుంటారు. వారు పైకి నోటిమాటగా మంచి మంచి మాటలతో మనల్ని తెగ పొగుడుతూ ఉంటారు. అప్పుడు మనకి ఎంతమాత్రమూ ఆనందం కలగదు. వాటివెనుక వారి మనసు మనకు తెలుసుగా! ఇంకెలా ఆనందిస్తాం? యువతీ యువకులకు పెద్దవాళ్ళు చెప్పే సుద్దులు అస్సలర్థం కావు. “మా పిల్లలు, చెబితే అర్థం చేసుకోవడం లేదండీ” అని తల్లితండ్రులు వాపోతూ ఉంటారు. యువతకి పెద్దల మాట అర్థం కాకపోవడానికి కారణం జీవితం పట్ల పిల్లల వైఖరి అంటే యాటిట్యూడ్ వేరుగా ఉండడమే. మరో మాటలో చెప్పాలంటే అనుభవ రాహిత్యం.

హృదయంలో ప్రేమలేకుండానే తేనెలొలికే మాటలు చెప్పేవారుంటారు. మాటే కదా ఖర్చులేనిది చెబితే ఎదుటివారు సంతోషపడతారు అనుకుంటారు. వారి గురించి మనకి తెలుసు కాబట్టి అటువంటి మాటలు మనకి తియ్యగా అస్సలు అనిపించవు. ఆ తీపి మాటలు రుచీ పచీ లేని ఎండుగడ్డిలాంటివి. మరికొందరి మాటలు కఠినంగా ఉన్నా వారికి మనపై ప్రేమ ఉంటుంది. అటువంటివారు మన కుటుంబాల్లో కొందరుంటారు. మన బాగుకోసమే అలా అంటూ ఉంటారు. వారిగురించి మనకి తెలుసు కాబట్టి వారి మాటలు మనకి మంచి అర్థాన్నే ఇస్తాయి.

మాటవరసకు ‘బావున్నారా!’ అని ఎంతో మంది అడుగుతారు. మనకు ఏ ఫీలింగూ కలగదు. తలూపి ఊరుకుంటాం. ఏ చిన్ననాటి మిత్రురాలో ఫోన్ చేసి “ఎలా ఉన్నావే? పిచ్చి మొహం! సరిగా తినడం మానేసి డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటావ్!” అనడిగిన తీరు మనకి కంట నీరు తెప్పిస్తుంది. ఇటీవల మనం, చిక్కు సమస్యల వల్ల పడ్డ బాధల గాయంపై గంధం పూసినట్టుంటుంది ఆ పలకరింపు. మనసుకు ఊరట కలుగుతుంది. ఆ తర్వాత మనసుతీరా ఏదో చెప్పుకుంటాం. అటునుంచి చల్లని ఓదార్పూ, అనునయం దొరుకుతాయి. ఒక భరోసా లభిస్తుంది. వెంటనే మనకి ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహం కలుగుతుంది. చూశారా! మాటకు అర్థం అంటే, అందులో ఒకోసారి కనబడని మహత్యం కూడా ఉంటుంది! అదీ సంగతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here