[dropcap]త[/dropcap]న శరీరాన్నే నిచ్చెన చేసుకుని
నే కష్టపడుతూ
నాన్నను కష్టపెడుతూ
మెల్లమెల్లగా ఓ అంతస్తు పైకెక్కాను
బాధను బిగబట్టిన నాన్న మొహంలో
నా విజయం నవ్వై మొలిచింది
ఆ నవ్వునూ, నాన్ననూ పైకి లాక్కున్నాను
శిథిలమైపోయినా, నా పక్కకే చేర్చుకున్నాను
నాలా కష్టపడకూడదని
నైపుణ్యాల నిచ్చెన తయారుచేసి
నా పిల్లలకందించాను
అలవోకగా అనాయాసంగా
అందరూ ఆ పై అంతస్తుకు చేరుకున్నారు
నాన్న లాగే నా మొహం మీదా
విజయం చిరునవ్వుల పువ్వై విరిసింది
కథ కాదు కదా జీవితం….
నేనందించిన నిచ్చెననూ
నా మొహం మీది చిరునవ్వునూ
లాగేసుకున్నారు నా పిల్లలు
మరో అంతస్తుకెగబాకే హడావిడిలో
శిథిలమవుతోన్న నన్ను
నా మానాన, ఇక్కడే… ఒంటరిగా వదిలేస్తూ….