[dropcap]చీ[/dropcap]కటి సహవాసానికి స్వస్తి చెప్పి
తెరిచి ఉన్న వెన్నెల ద్వారంలోంచి
పాదం మోపాను..ఆ పూల స్వర్గంలోకి.
ఒత్తుకున్న పరిమళం మత్తెక్కిస్తుంటే
గుత్తులు గుత్తులుగా పూసిన కాగితంపూలను
ప్రేమగా స్పృశిస్తున్న సీతాకోకలు.
కలల దీవిలో కళల బండి కదలాడుతుంటే..
మృదు రసాల పదబంజికల్ని
ప్రేమగా ముద్దాడుతున్న మిణుగురులు.
చిక్కగా కురుస్తున్న నిశ్శబ్దంలో
సారస్వత వరసిద్ధి కోసం
తపస్సులో నిమగ్నమైన కుందేలు పిల్లలు.
వెలుతురు పిట్టలు
వెన్నెల మడుగులో మునకలేస్తుంటే
మనసు ఆకాశంపై కాంతులీనుతున్న అక్షరాల చుక్కలు.
అరువది నాలుగు ద్వారాల నందనంలో
వెండి వాక్యాల తోరణాలై మెరిసే
బుజ్జాయిలు, బాలమిత్రలు, చందమామలు.
పవిత్ర పత్రికా మాతల పాదధూళి పూసుకుని
నడిచివస్తున్న ఉదాత్త పాత్రల దర్శనభాగ్యంతో
సపరివారం’గా దివ్య సంపన్నమౌతున్న దిగులు జీవితాలు.
విజ్ఞాన వరప్రధాతలై..
మస్తకాల్ని నడిపించే అపూర్వ గ్రంధాలయాలు.
సమస్త పుస్తకాలూ కొలువైన అరుదైన దేవాలయాలు.