[dropcap]మే[/dropcap]ధావులు కేటాయించిన
ఈ రోజు
‘అంతర్జాతీయ కవితా దినోత్సవం’
అని తెలిసి ఉషారుగా
ఉదయపు నడక సాగిస్తున్నా…
ఈ రోజు దినం
ఎలా గడుస్తుందోనని
ఆలోచిస్తూ ఎదురుచూస్తూ
దైనందిన ఆటో కోసం
ఓ కూరలమ్మీ
ఓ పనిమనిషీ
ఓ తాపీ మేస్త్రీ
ఓ రోజు కూలీ
యుద్ధ సంసిద్ధతతో…
సర్దుతోన్న కిరాణా కొట్లో
పాలప్యాకెట్లు
నవ్వుతున్నాయి తెల్లగా…
మాల్టోవా డ్రెస్
ధరించిన అంబలి
ఫుట్‌పాత్‌పై గ్లాసుల్లో
నవ్వుతోంది ముసిముసిగా…
తలుపులు తెరచిన గుడి
మైకులో భక్తిపాటలు
వినిపిస్తున్నాయి మాం(యాం)త్రికంగా…
బస్ స్టాప్ షెల్టర్లో
మత్తువీడిన మొహాల
కసరత్తులు గమ్మత్తుగా…
ఎప్పటిలా నాతో నడుస్తూ
తోకాడిస్తూ ఓ ఊరకుక్క
నోరు చాపి ఆబగా
లాంఛన బిస్కత్తుకై…
పరిసరాల జీవన సరళిని
సులోచనీయంగా గమనిస్తూ
లయబద్ధ పాదముద్రలతో
నేనూ
నా కవితాత్మ.