కైంకర్యము-34

0
3

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]కో[/dropcap]దండరాముని కోవెల హడావిడిగా ఉంది. కోవెల చుట్టూ ఉన్న మంటపాలలో ఒక మంటపానికి పూలు, మామిడాకులు కట్టి ఉన్నాయి. ఆ రాతి మంటపం బయట వైపుకు కుర్చీలు వేసి ఉన్నాయి. ఒక వైపు సన్నాయి వాళ్ళు మంగళవాయిద్యాలపై రాముని కీర్తనలు మనోహరంగా వాయిస్తున్నారు.

మంటపం వెనకాల గోడ వైపుకు రాముని మెడలో వరమాల వేస్తున్న సీత నిలువెత్తు విగ్రహాలు, వాటి ప్రక్కనే దీపగుచ్ఛాలు.

మంటపంలో బ్రాహ్మడు సర్దుకుంటున్నాడు.

ఒక వైపుగా సుదర్శనాచారి, ఆండాళ్ళు కూర్చున్నారు. తెల్లని పట్టు పంచ కట్టిన చారి గంభీరముగా అన్నీ గమనిస్తున్నాడు.

ఆండాళ్ళు మాత్రం వారు పిలిస్తే వెళ్ళటానికి సన్నద్ధంగా ఉంది.

ఆమె చుట్టూ ఆమె ముగ్గులు కుమార్తెలు, ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. వీళ్ళకు ఆమడ దూరంలో స్ఫురద్రూపములో, వరుని వేషధారణలో రాఘవ కూర్చొని ఉన్నాడు. నుదుటన దిద్దిన ఊర్థ్వపుండ్రాలతో, బుగ్గన చుక్కతో సాక్షాత్తు రంగనాథుడు కదిలి వచ్చాడా అన్నట్లుగా మెరిసిపోతున్నాడు.

అతని చేతికి కంకణము ఉంది. అది వివాహం అయ్యే వరకు తియ్యరు. దానిని చూస్తూ ఎటో ఆలోచనగా ఉన్నాడు.

ఇంతలో వాళ్ళని మంటపంలోని బ్రాహ్మడు పిలిచాడు.

సుదర్శనాచారి, ఆండాళ్ళు, రాఘవ వెళ్ళి ఆయన చెప్పిన పద్ధతిలో కొబ్బరి బోండాం చేతుల్లో ధరించి పీటల మీద కూర్చున్నారు.

పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. రాఘవ యాంత్రికంగా చెప్పినవి చేస్తున్నాడు.

పెళ్ళికి ఆ ఊరికి అతను తన మిత్రులను ఎవ్వరిని పిలవలేదు. పల్లెటూరి పిల్లతో కల్యాణమని వాళ్ళకు చెప్పి వారి ముందు చులకన అవగలడని అతని భయం.

మంటపం వెనకాల ఉన్న రంగరాజన్ ఇంట ప్రసన్నలక్ష్మి తయారై ఉంది. ఆమె చూడగానే భువికి దిగి వచ్చిన గోదాదేవిలా ఉంది.

తలపై ఒకప్రక్కగా కొప్పు, దానికి బంగారు కొప్పుబిళ్ళ, మెడ మీదుగా వాలు జడ.

మెడలో అత్తగారు బహుమతిగా ఇచ్చిన ఆభరణాలు, కుడి వైపుగా వేసిన పమిట, గోచి పోసి కట్టిన పసుపు అంచు ఎర్ర చీర, చేతికి ఎర్ర గాజులతో ఉంది ఆమె. ఆమె అందం ముందు ఆమె అలంకరణ దిగదుడుపులా ఉంది. గంధపు రంగు మేని ఛాయకు ఎరుపు రంగు అద్దినట్లుగా ఉన్న బుగ్గలు, ఎర్రని తిరు నామంతో బుగ్గ చుక్కతో పెళ్ళికళతో ఉంది ప్రసన్నలక్ష్మి.

ఆమె పాదాలకు రాసిన లత్తుకతో ఆమె పాదాలు చూడటానికి ఎర్ర కమలాల వలె ఉన్నాయి. ఆమె తల వంచుకొని ఏదో ఆలోచిస్తూ పిలిస్తే కదలటానికి సిద్ధంగా ఉంది. చూడటానికి పూల తీగలా సున్నితంగా ఉన్నది.

ఇంతలో ఆమె దగ్గరకు ముగ్గురు పిల్లలు వచ్చారు. వాళ్ళు ఆమె వద్ద సంగీతం నేర్చుకుంటున్నారు.

వారు ఆమె చెవిలో గుసగుసగా “అక్కా, పెళ్ళి కొడుకు శోభన్ బాబు అంత అందంగా ఉన్నాడు” అన్నారు.

వాళ్ళు అంతకు మునుపే శోభన్ బాబు చిత్రం చూసి వచ్చారు. వాళ్ళకందులో ఉన్న హీరో తెగ నచ్చాడు మరి.

ప్రసన్న లక్ష్మికి సిగ్గుతో కూడిన నవ్వు పెదవుల మీదకు వచ్చింది.

“అవునక్కా. మేము చూసి వస్తున్నాము. చాలా బాగున్నాడు పెళ్ళికొడుకు. కాని నీకన్నా కాదనుకో…” అన్నది రెండో పిల్ల.

“అక్కా ఎప్పుడు వస్తావు? మీ ఇద్దరిని ప్రక్క ప్రక్క చూడాలి…” అన్నది మూడో పిల్ల.

ఇంతలో గది బయట గలగలలు.

కొందరు స్త్రీలు వచ్చారు. వారి చేతులలో మాలలున్నాయి.

వారితో వల్లి కూడా ఉన్నది. సీత కూడా వస్తూ “పద పద లక్ష్మి… నాన్నగారు తీసుకురమ్మంటున్నారు” అన్నది.

వల్లీ, ప్రసన్నలక్ష్మి మెడలో మాల వేసి, ఒక మాల చేతికిచ్చింది.

ప్రసన్నలక్ష్మి లేచి మాల చేతులోకి తీసుకుంది.

వల్లి దగ్గరకు వచ్చి బుగ్గలు పుణుకుతు “అచ్చు గోదా తల్లే… రా అమ్మా.. నీ పుణ్య వశాన నీకీ సంబంధమొచ్చింది..” అంటూ ముద్దాడింది. అందరి మనసులో అదే ఆలోచన. రాజన్న పుణ్యం, ప్రసన్నలక్ష్మి అదృష్టం ఆ సంబంధమన్న భావనే.

అందరూ ప్రసన్నలక్ష్మిని నడిపిస్తూ తీసుకువచ్చారు.

బయట కోవెల మంటపం వద్ద వరుడు ఎదురు చూస్తున్నాడు.

వైష్ణవులలో పెళ్ళికొడుకు సాక్షాత్తూ రంగనాథుని అవతారంగా భావిస్తారు. పెళ్ళికుమారి గోదాదేవే. ప్రతి కల్యాణం రంగనాథుని ఆరాధనే.

ఎదురుకోళ్ళలో అమ్మాయికి, అబ్బాయికి మాల మార్పిడి ఆచారం.

పిల్ల మెడలో వెయ్యనియ్యకుండా పిల్ల తాలుకు వారు పిల్లను ఎత్తి వేస్తారు. పెళ్ళికొడుకును వారివాళ్ళు ఎత్తుతారు. అలా మెడలో వెయ్యనియ్యక వేస్తూ, మూడు మార్లు మార్పిస్తారు. అదో వేడుక..

వారి ఈ వేడుకకు సాధారణంగా గీత వాయిద్యాల మధ్య సాగుతుంది.

“మాలై సారథినాల్ కోధై

మాలై మాతృనాల్

మాలదైందు మధిలరంగన్

మాలై అవర్థన్ మార్భిలే

మైయలై తైయాలాల్

మామలర్ కరతినాల్ – మాలై సారథినాల్” అంటూ సన్నాయి వారు ఆ పాటనందుకున్నారు. కొందరు స్త్రీలు ఆ గానమును అందుకున్నారు.

సౌందర్య రాజన్, అతనితో పాటు ప్రసన్నలక్ష్మి అన్నలు ఆమెను ఎత్తివేశారు. రాఘవ అన్నలు రాఘవను ఎత్తి ముందుకు ఉరకసాగారు. ఇరువైపులా సంతోషం వెల్లివిరిసింది. అందరూ నవ్వుతున్నారు. ఇరువైపుల వారిని ఉత్సాహ పరుస్తున్నారు. ఎవరు ఎంత అల్లరిగా ఉన్నా, రాఘవ ముఖంలో కరుడుగట్టిన గాంభీర్యం సడలలేదు. అతని ముఖం అంతే సీరియస్‌గా ఉంది. ప్రసన్నలక్ష్మి సిగ్గుతో తల ఎత్తలేక పోతోంది. ఆమెకు మాలమార్పిడిలో విజయం లభించలేదు. తన సిగ్గు వలన కలిగిన దడకు రాఘవ ముఖంలోని సీరియస్‌నెస్‌కు మనసు కొద్దిగా చిన్నబోయింది. ఆమె మళ్ళీ సర్దుకుంది.

ఆ వేడుక కానిచ్చారు అందరు. లోపలికి వెళ్ళాక రాజన్న వడిలో కూర్చున్న ప్రసన్నలక్ష్మి మెడలో పెద్దల ఆశీర్వచనాల మధ్య, మంగళవాయిద్యాల మధ్య సూత్రం కట్టాడు రాఘవ.

ఇద్దరిని పెద్దలు దీవించారు. భువికి దిగి వచ్చిన రంగనాథ గోదాదేవులలా మెరిసిపోయారు నవ దంపతులు.

తల్లితండ్రులకు నమస్కరించినప్పుడు “అమ్మా ఇకపై నీవు సంతోషంగా ఉండాలి. నీవు కోరినట్లుగా నీ మేనకోడలు నీ కోడలై వచ్చింది” అన్నాడు చెవిలో రాఘవ.

సంతోషంగా హృదయపూర్వకంగా నవ్వింది ఆండాళ్ళు.

“ఇది మనం పూజించే గోదాతల్లే రా నాయనా…” అంటూ ప్రసన్నలక్ష్మిని ముద్దాడింది.

మిగిలిన కోడళ్ళు గుసగుసలను లెక్కచెయ్యక అందరికీ సమానంగా ఉండేలా ప్రసన్నలక్ష్మికి నగలు బహుమతి ఇచ్చింది ఆండాళ్ళు.

రాజన్నను నమస్కరించినప్పుడు ఆయన అల్లుడ్ని దీవిస్తూ “సదా ధర్మవర్తునివై నడుచుకో నాయనా. ధర్మమొక్కటే కాపాడుతుంది…” అన్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here