అందమైన మనసు-7

0
4

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి రచించిన ‘అందమైన మనసు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]మొ[/dropcap]న్నటి నుండి నివేద ఇంటికి రాకపోవటం, ఫోన్ చెయ్యకపోవడం సత్యవతికి ఆందోళనగా వుంది.

“వినీల్! నివేద మొన్న కాలేజీకి వెళ్ళింది. ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏమైవుంటుంది నాన్నా?”

“నన్ను అడిగితే నేనేం చెబుతాను?”

“అదికాదు వినీల్! వాళ్ళ ఊరు వెళ్లినా ఈపాటికి రావాలికదా! ఎన్ని రోజులు వుంటుంది. నాకైతే వాళ్ళ ఊరు వెళ్లినట్లు అనిపించలేదు”

“ఇంకెక్కడికి వెళుతుంది? ఎవరున్నారు తనకి? మనమేగా”

“అదికాదు నాన్నా! వాళ్ళు నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని నివేదను కిడ్నాప్ చేసారేమోననిపిస్తోంది. ఎవరి బుద్ధులు ఎలా మారతాయో తెలియదు కదా! నువ్వేమో ఎప్పుడు చూసినా పైనే వుంటావు. నాన్నగారు ముంబై వెళ్లారు. నాకు భయంగా వుంది”

“ఏంటమ్మా నీ భయం. నా మీద ప్రతీకారం తీర్చుకోవటం ఏంటి? కిడ్నాప్ ఏంటి? అలాంటి శత్రువులు మనకెవరున్నారు?”

“ఎందుకు లేరు. నీ చేతిలో ప్రాణం పోయిన వాడి భార్య లేదా. నీ మీద కోపంతో వుండదా? ఆ కోపంతో నివేదను కిడ్నాప్ చేయించిందేమో”

“అబ్బా… అమ్మా నువ్వలా ఎందుకు ఆలోచిస్తావు? అలా ఏం జరిగివుండదు. నువ్వు అనవసరంగా భయపడకు”

“అదికాదు వినీల్! తప్పిపోయిందా అని అనుకోటానికి చిన్నపిల్ల కాదు. మరేం జరిగిందో ఏమో నాకేం అర్థం కావటం లేదు. పిచ్చి పట్టేలా వుంది. ఇది కిడ్నాపే వినీల్” అంది.

వినీల్‌కి కోపం వచ్చింది.

“నువ్వు మాటిమాటికి కిడ్నాపే అని అనకమ్మా! నాకు వినబుద్ది కాలేదు. నేనేదో తప్పు చేస్తే దానివల్ల నివేదకి హాని జరిగినట్లు మాట్లాడుతున్నావు. వింటే ఎవరైనా నమ్మేలా వున్నాయి నీమాటలు. అసలు నువ్వెందుకలా అనుకుంటున్నావ్? అన్ని ప్రాబ్లమ్స్‌కి నేనే కారణమా? నివేద కూడా కారణం కావచ్చు కదా! అలా ఎందుకు అనుకోవు”

“నివేద కారణమా? అదేంటో అర్థమయ్యేలా చెప్పు వినీల్!”

“చెబుతాను. నీక్కూడా అర్థం కావాలి కదా! లేకుంటే దీన్ని నామీదకు నెట్టేలా వున్నావు. ఉన్న బాధ చాలక ఈ బాధ కూడానా నాకు?” అన్నాడు వినీల్.

వినీల్ ఏంచెబుతాడో అని ఆతృతగా చూసింది సత్యవతి.

తను సహస్రను ప్రేమించినట్లు నివేద కూడా ఎవరినైనా ప్రేమించి వుండొచ్చు. ఇది అమ్మకు తెలియకపోవచ్చు. నా ప్రేమ మాత్రం అమ్మకు తెలిసిందా? ఎలా తెలుస్తుంది చెప్పకపోతే! అని మనసులో అనుకుంటూ “నివేద ఎవరినో ప్రేమించి వుంటుందమ్మా! నువ్వూ, నాన్నగారు తనని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తున్నారని తెలియగానే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది” అన్నాడు ఏమాత్రం సందేహించకుండా.

అది వినగానే వణికిపోయింది సత్యవతి.

“అసలు మీ ఇద్దరికి పెళ్లి చెయ్యాలన్న విషయం నివేదతో ఇంకా చెప్పలేదు వినీల్! అలా ఎలా వెళుతుంది?” అంది.

“నన్ను నువ్వలా కొశ్చన్ చెయ్యకమ్మా! కావాలంటే నువ్వు వాళ్ళ ఊరు వెళ్లి చూడు. నివేద వుంటే తీసుకురా! లేకుంటే నేనన్నదే కరక్ట్ అనుకో…” అన్నాడు.

“వెళతాను. అక్కడ నివేద కనిపించకపోతే నువ్వన్నదే నిజమనుకుంటాను. ఎడాపెడా వాయించి వస్తాను. ప్రేమా లేదు దోమా లేదు. ఎక్కడికి పోయినా, ఎవరితో పోయినా తిరిగివచ్చేలా చేస్తాను. నిన్నుకాదని వేరేవాళ్లను ఎలా చేసుకుంటుందో చూస్తాను. ఎప్పటికైనా నివేద నిన్నే పెళ్లి చేసుకోవాలి. ఈ సత్యవతి అంటే ఏమిటో వాళ్ళకి ఇంకా తెలియదు” అంటూ అప్పటికప్పుడే డ్రైవర్‌ని పిలిచి కారులో నివేద వాళ్ళ ఊరు వెళ్ళింది సత్యవతి.

***

సత్యవతిని చూడగానే దేవతను చూసినట్లు బ్రహ్మయ్య, నాగేశ్వరి హడావుడి చేసారు. వాళ్ళు అమృతంలా ఇచ్చిన నీళ్లు తాగి నివేద కోసం అటుఇటు చూసింది.

“వినీల్, నివేద బాగున్నారా వదినా? అన్నయ్య ముంబైలోనే వున్నారా?” అంది నాగేశ్వరి.

సత్యవతికి చిర్రెత్తుకొచ్చింది.

“నాటకాలా నాగేశ్వరీ! నీ కూతురు నీ ఇంట్లో లేదా? బాగోగులు అడుగుతున్నావ్!”

“నా ఇంట్లో ఎక్కడుంది వదినా! నీ దగ్గరేగా వుంది”

“నా దగ్గర వుందా? ఎక్కడుంది నా దగ్గర? ఎప్పుడో వెళ్ళిపోయింది. ఈ విషయం నా కొడుకు నాకు చెప్పేవరకు తెలియదు. అయినా నేను నమ్మలేదు. వాదించాను. వాడు చెప్పినట్లే జరిగింది. నీ కూతురు ఇక్కడ లేదంటే ఎక్కడో వున్నట్లేగా. ఎవరి దగ్గరకో వెళ్ళిపోయినట్లేగా? చెప్పు నాగేశ్వరీ?”

“నీ కొడుకు చెప్పటమేంటి వదినా? అది ఎవరితోనో వెళ్ళిపోవటం ఏంటి? నాకంతా అయోమయంగా వుంది” అంది నాగేశ్వరి. ఆమె నవనాడులు కృంగిపోతున్నాయి.

బ్రహ్మయ్య భయపడిపోయాడు. ఆయన నోటమాట రావటం లేదు.

“చూడు నాగేశ్వరీ! మీరు కూడా వినండి అన్నయ్యా! మీరేం చేస్తారో తెలియదు. మీ కూతురు ఎక్కడున్నా నా దగ్గరకి తిరిగి రావాలి. నేనూ, ఆయన ఈమధ్యనే ఒక నిర్ణయం తీసుకున్నాం. నివేదను వినీల్‌కి ఇచ్చి చెయ్యాలని. ఆయన రేపు ముంబై వెళతాడనగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇది ఆయనకు తెలియకముందే మీ కూతుర్ని రప్పించండి” అంది సత్యవతి కాస్త తీవ్రంగానే.

నాగేశ్వరీ, బ్రహ్మయ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

“మీరు నా చేత పదేపదే చెప్పించుకోవద్దు. అయినా చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా వినండి. నివేదను చదివించే స్తోమత మీదగ్గర లేనప్పుడు ఆ బాధ్యత నా నెత్తిన వేసుకున్నాను. అది ఇప్పుడు నా కొడుక్కి దక్కకుండా పోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయి. నేను అంత సులభంగా వదులుతాననుకోవద్దు. ఇక నేను వెళతాను” అంటూ లేచి వెళ్లి కారులో కూర్చుంది.

వాళ్ళు అవాక్కయి అలాగే చూస్తున్నారు. కారు వెళ్ళిపోయింది.

“ఇదేంటండీ నివేద ఇలాచేసింది?” అంటూ తలపట్టుకుని కూర్చుంది నాగేశ్వరి.

“నమ్మబుద్ది కావట్లేదు నాగేశ్వరీ! సత్యవతమ్మను నివేద ఇంత కష్టపెడుతుందనుకోలేదు. నాకొస్తున్న కోపానికి అది కనిపిస్తే చంపేయాలని వుంది. ఇప్పుడే చైత్రన్‌కి ఫోన్ చేసి ఇదంతా చెబుతాను” అంటూ ఫోన్ పట్టుకున్నాడు బ్రహ్మయ్య.

“చెయ్యండి. నాకు అసలే కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి” అంది నాగేశ్వరి.

చైత్రన్‌కి కాల్ చేసాడు బ్రహ్మయ్య. భార్యకు కూడా వినిపించేలా స్పీకర్ ఆన్ చేసాడు.

లిఫ్ట్ చేసి “చెప్పు నాన్నా! నువ్వూ, అమ్మా బాగున్నారా?”

“ఏం బాగురా చైత్రా! నీ చెల్లెలు నివేద మన కొంప ముంచిందిరా! ఇంట్లో లేదట. మూడురోజులు పైనే అయిందట. దాన్ని వినీల్‌కి చేసుకుంటారట. అదెక్కడుందో రప్పించమని అత్తయ్య చెప్పిపోయింది. అది విని మీ అమ్మ కుమిలిపోతోంది”

“నువ్వనేది నిజమా నాన్నా? దాన్ని వినీల్‌కి చేసుకుంటారటనా?”

“నిజమే చైత్రా! కానీ అది ఇంట్లో లేదట. ఇక్కడకి వచ్చిందేమోనని అత్తయ్య వచ్చివెళ్ళింది”

“దానికి నిజంగానే తెలివి లేదు నాన్నా! వినీల్‌కి భార్య కావటమంటే మాటలా! మనకేముందని? అయినా వాళ్ళు చేసుకుంటామంటున్నారు. ఈ టైంలో ఇదెక్కడి వెళ్లినట్లు?”

“ఏమోరా! నివేదకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అని వస్తోంది”

“నువ్వేం కంగారు పడకు నాన్నా! అదెక్కడకి పోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వుంటుంది”

“అదికాదట చైత్రా! నీ చెల్లెలు ఎవడినో ప్రేమించి లేచిపోయి వుంటుందేమో అని మీ అత్తయ్య అంటోంది”

“దాని మొహం అదొట్టి పుస్తకాల పురుగు నాన్నా! దాన్నెవడు ప్రేమిస్తాడు? వాళ్ళ ఫ్రెండ్స్ నంబర్లు వుంటే వాళ్లకు ఫోన్ చెయ్యండి. అదెక్కడుందో తెలుస్తుంది. అమ్మను భయపడొద్దని చెప్పు. నేనున్నాను కదా! అది వినీల్‌ని ఎలా పెళ్లి చేసుకోదో చూస్తాను”

“నువ్వు రా రా చైత్రా! ఎందుకైనా మంచిది. నాకు చదువు లేదు. నీలాగా నేను మాట్లాడలేను” అన్నాడు బ్రహ్మయ్య.

“అలాగే నాన్నా! రేపటివరకు వచ్చేస్తాను. నువ్వు ధైర్యంగా వుండు” అంటూ ఫోన్ పెట్టేసాడు చైత్రన్.

నాగేశ్వరి వెంటనే అలర్టై “ఫోన్లో అలేఖ్య నంబర్ వుంది. ఆ నంబర్‌కి ఫోన్ చెయ్యండి. నేను మాట్లాడతాను” అంది.

బ్రహ్మయ్య నంబర్ వెతికి ఆ నంబర్‌కి కాల్ చేసాడు.

అలేఖ్య కాల్ లిఫ్ట్ చేసి “చెప్పండి ఆంటీ!” అంది.

“నివేద ఫోన్ కలవట్లేదు అలేఖ్యా! ఒకసారి కాల్ చెయ్యమని చెబుతావా?”

“చెబుతాను ఆంటీ!”

“నివేద ఇప్పుడు ఎక్కడుంది?”

“మధురిమా హాస్టల్లో ఆంటీ!”

“అక్కడ ఎందుకుంది?”

“ఇంటికెవరో బంధువులు వచ్చారట. వాళ్ళు తన గురించి చులకనగా మాట్లాడుకోవటం వాళ్లకు తెలియకుండా విన్నదట. ఆ మాటలకి బాగా హర్ట్ అయింది. అందుకే బయటకొచ్చింది”

“నాకీ విషయం ఎందుకు చెప్పలేదట”

“మీరు బాధ పడతారని చెప్పలేదేమో ఆంటీ!”

“బాధపడ్డా చెప్పాలిగా అలేఖ్యా! ఇలా చెప్పకుండా తనపాటికి తను వెళ్లి ఎక్కడో వుంటే సమస్యపోతుందా? ఇప్పుడు చూడు అది ఇంట్లోంచి వెళ్ళటం వల్ల కొత్త సమస్యలు వచ్చాయి”

“కొత్త సమస్యలా?”

“అవును అలేఖ్యా! నివేద ఎవడితోనో వెళ్ళిపోయివుంటుందని వినీల్ అంటున్నాడట. సత్యవతి వదిన అన్నది. ఎక్కడికి వెళ్లిందో తీసుకురమ్మంటుంది. నాకు తల తీసేసినట్లుగా వుంది” అంది బాధగా నాగేశ్వరి.

షాక్ తిన్నది అలేఖ్య.

వెంటనే తేరుకుని “వినీల్ అలా అంటున్నాడా!! సరే! ఆంటీ! నేను నివేదతో మాట్లాడతాను. మీరేం వర్రీ కాకండి. వినీల్ అన్నట్లు నివేద ఎక్కడికీ వెళ్ళలేదు. మధురిమా హాస్టల్లోనే వుంది” అంటూ ఫోన్ పెట్టేసింది అలేఖ్య.

నాగేశ్వరి భర్త వైపు చూసి “నివేద అక్కడే హాస్టల్లో వుందట. ఎంత బాధగా వుంటే అలా వెళ్లిందో. ఇప్పుడే వెళ్లి దాన్ని మనతో తీసుకొద్దాం. ఆ వినీల్ చూడండి ఎంత మాట అన్నాడో..” అంది రోషంగా

“అంటే అన్నాడులే నాగేశ్వరీ! ఏదో తొందరపాటుతో అని వుంటాడు. అది నా బిడ్డ. తప్పు చెయ్యదు. ఆవేశంలో నేనే తొందరపడి దాన్ని చంపేస్తా అన్నాను. బాధగా వుంది” అన్నాడు.

“బాధ పడకండి. ముందు నేను దాన్ని చూడాలి. దాన్ని చూసేవరకు నా మనసు కుదుట పడేలా లేదు” అంది.

ఇద్దరు కలిసి అప్పటికప్పుడే బయలుదేరి మధురిమా హాస్టల్ కి వెళ్లారు. అక్కడ నివేద లేదు. నిరాశగా, బాధగా చూసింది నాగేశ్వరి.

“అలేఖ్యకు ఫోన్ చెయ్యి నాగేశ్వరీ! నివేద ఎక్కడకి వెళ్లిందో చెబుతుంది” అన్నాడు బ్రహ్మయ్య.

అలేఖ్యకు ఫోన్ చేసి “హాస్టల్లో నివేద లేదు అలేఖ్యా!” అంది.

“అక్కడ అడిగారా ఆంటీ?”

“అడిగితే తెలియదంటున్నారు. బ్యాగ్ కూడా లేదు. హాస్టల్ మాత్రం వెకేట్ చెయ్యలేదట”

“నాక్కూడా ఫోన్ చెయ్యలేదు ఆంటీ! అది ఫోన్ చేస్తేనే ఏ విషయమైనా తెలుస్తుంది”

“సత్యవతి వదినేమైనా వచ్చి తీసికెళ్ళిందేమో అలేఖ్యా!”

“అదక్కడ ఉన్నట్లు ఎలా తెలుస్తుంది ఆంటీ! ఒకవేళ తెలిసి తీసికెళితే మాత్రం అక్కడ పెద్ద యుద్ధమే అవుతుంది. మీరు వెంటనే వెళ్ళండి ఆంటీ! మీరు పక్కన వుంటే నివేదకు ధైర్యంగా వుంటుంది”

“వెళతాం అలేఖ్యా” అంది నాగేశ్వరి కళ్లనీళ్లు తుడుచుకుంటూ.

“వెళ్ళగానే ఏ విషయం నాకు ఫోన్ చెయ్యండి ఆంటీ!” అంటూ ఫోన్ పెట్టేసింది అలేఖ్య.

బ్రహ్మయ్య, నాగేశ్వరి ఆటోలో కూర్చుని హరనాధరావు ఇంటికి వెళ్లారు.

నాగేశ్వరిని, బ్రహ్మయ్యను చూడగానే “దొరికిందా మీ అమ్మాయి?” అని అడిగింది సత్యవతి.

“లేదు వదినా!”

“మరెందుకొచ్చారు. ఇది చెప్పటానికా?” అంది కోపంగా సత్యవతి.

“ఇక్కడకి వచ్చిందేమో అని ఆశగా వచ్చాం వదినా!” అంది నాగేశ్వరి.

“చూడు నాగేశ్వరీ! ఎంతయినా నువ్వు నా ఆడపడుచువి. ఇన్నిరోజులు నీ బాధలేవో నువ్వు పడ్డావ్. నన్నొక మాట నువ్వు అనలేదు. నిన్నొక మాట నేనూ అనలేదు. కానీ నీ కూతురు చేసిన ద్రోహానికి నిన్ను దండించాల్సి రావటం బాధగానే వుంది. కానీ నీ కూతుర్ని మాత్రం వదిలేది లేదు. మీరు ఇక్కడే వుండండి. ఈరోజు చూసి పేపర్లో వేయిద్దాం. అవసరమైతే టీవీలో ప్రకటన కూడా ఇప్పిద్దాం” అంది సత్యవతి.

వణికిపోయారు నాగేశ్వరి, బ్రహ్మయ్య.

నిస్సహాయంగా చూడటం తప్ప వాళ్ళింకేం మాట్లాడలేకపోతున్నారు.

మెల్లగా అక్కడ నుండి లేచి పక్కకి వెళ్లింది నాగేశ్వరి. అలేఖ్యకు ఫోన్ చేసింది.

అలేఖ్య లిఫ్ట్ చేసి “అక్కడ ఉందా ఆంటీ నివేద?” అంది.

“లేదు అలేఖ్యా! నివేద ఇక్కడ లేదు. మా వదిన ఈరోజు చూసి పేపర్లో, టీవీ లో ప్రకటన ఇద్దాం అంటోంది. రేపు తప్పకుండా ఆమె అన్నంత పని చేస్తుంది” అంది భయపడుతూ నాగేశ్వరి.

“ఓమైగాడ్! ఆంటీ మీరు ఫోన్ పెట్టెయ్యండి. నేను తరువాత మీకు కాల్ చేస్తాను” అంటూ కాల్ కట్ చేసి సూర్యదేవ్‌కి ఫోన్ చేసింది అలేఖ్య. సూర్యదేవ్ ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే “సర్ నేను అలేఖ్యను. నా ఫ్రెండ్ నివేద చాలా ప్రమాదంలో వుంది సర్!” అంది కంగారుగా.

నివేద అనగానే అతని మనసు బెదిరినట్లైంది.

“నివేదకు ప్రమాదమా! ఏంజరిగింది?” అన్నాడు ఆతృతగా అతనెందుకంత ఆత్రుత పడుతున్నాడో అతనికే తెలియటం లేదు. నాలుగు రోజుల క్రితం అతను మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేసింది నివేద. ఆ తరువాత రోజు రాత్రికి ఎప్పటిలాగే ఫోన్ చేసాడు స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇప్పుడు అలేఖ్య ప్రమాదంలో వుంది అనగానే అతని గుండె బాగా కొట్టుకుంటుంది భయంతో. ఎందుకింత భయపడుతున్నాడు? తనకి నివేద ఏమవుతుంది?

“చెప్పు అలేఖ్యా, త్వరగా చెప్పు. ఏం జరిగింది?” అన్నాడు.

“నివేద ఇప్పుడు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో లేదు సర్! వాళ్ళ బంధువులావిడ ఏమో అన్నారని బాగా హర్టయింది. ఎవరికీ చెప్పకుండా నాలుగు రోజుల నుండి మధురిమా హాస్టల్లో వుంది. మొన్న తనతో నేను కూడా హాస్టల్‌కి వెళ్లాను. నా ద్వారా విషయం తెలుసుకుని వాళ్ళ పేరెంట్స్ ఈరోజు హాస్టల్ దగ్గరకి వెళ్లారు. నివేద బ్యాగ్‌తో సహా హాస్టల్లో లేదట. నివేద ఇంకా ఇంటికి రాలేదని వాళ్ళ అత్తయ్య పేపర్లో, టీవీలో ప్రకటన ఇస్తానంటోందట. ఎవడితోనో లేచిపోయిందంటుందట. అదసలు లేచిపోదు. నాకు తెలియకుండా దాని మనసులో కూడా ఎవరూ లేరు. ఇదంతా ఏమిటి దేవుడా అని వాళ్ళ పేరెంట్స్ బాగా ఏడుస్తున్నారు. ఉదయం నుండి అది నాకు ఫోన్ చెయ్యలేదు. భయంగా వుంది సర్” అంది అలేఖ్య.

“భయపడకు. నువ్వు ఫోన్ పెట్టెయ్యి. నేను ట్రై చేస్తాను” అంటూ వెంటనే తన ఫోన్ లోంచి కాకుండా వేరే ఫోన్ లోంచి నివేదకు కాల్ చేసాడు సూర్యదేవ్.

కాలేజీ వాళ్లతో మాట్లాడాలని అప్పుడే ఫోన్ ఆన్ చేసింది నివేద. సూర్యదేవ్ ఫోన్ చెయ్యగానే ఆమె ఫోన్ రింగ్ అయింది.

స్క్రీన్ మీద కొత్త నంబర్ కనిపించగానే లిఫ్ట్ చేసి “హలో” అంది నివేద.

“సూర్యదేవ్‌ని మాట్లాడుతున్నాను వేదా!” అని సూర్యదేవ్ అనగానే ఫోన్ కట్ అయింది. ఆమె కావాలనే ఫోన్ కట్ చేసిందని సూర్యదేవ్‌కి అర్ధమైంది.

వెంటనే రైటర్ ని పిలిచి “ఈ నంబర్‌ని ట్రేస్ చేసి ఏ ఏరియాలో వుందో కనుక్కోమని మనవాళ్లకు చెప్పు” అన్నాడు.

రైటర్ “అలాగే సార్” అంటూ వెళ్ళిపోయాడు.

కొద్దిసేపయ్యాక ఆ నెంబర్ నల్లటి కొండలకి దగ్గరలో ఉన్నట్లు తెలిసింది. ఆ విషయం వెంటనే అలేఖ్యకు ఫోన్ చేసి చెప్పాడు సూర్యదేవ్.

“హమ్మయ్యా! అది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వుంది సర్! దానికి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే క్షణం ఆగదు. నాకు చెప్పకుండానే వెళ్ళింది” అంటూ ఆ ఇంటి అడ్రెస్ చెప్పింది సూర్యదేవ్‌కి.

“మరి నువ్వు వెళతావా నివేద దగ్గరకి?”

“నేను వెళితే రాదు సర్! కొన్నిసార్లు చాలా మొండిగా వుంటుంది. ఎలాగైనా దాన్ని ఇంటికి వెళ్లేలా చెయ్యండి ప్లీజ్” అంది అలేఖ్య.

“ష్యూర్” అంటూ సూర్యదేవ్ ఫోన్ పెట్టేసాడు.

వెహికిల్ దిగి తనవైపే వస్తున్న సూర్యదేవ్‌ని చూసి బిత్తరపోయింది నివేద. కుర్చీలోంచి లేచింది.

“కూర్చో” అంటూ అతను వెళ్లి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు.

“ఇంట్లో ఎవరూ లేరా?” అన్నాడు చుట్టూ చూసి.

“అరుంధతీ ఆంటీ వున్నారు. ఇప్పుడే పైకి వెళ్లారు. పిలవనా ఏ.ఎస్.పి. గారు” అంటూ మళ్ళీ లేచింది. ఆమెకెందుకో అతన్ని చూస్తుంటే భయంగా వుంది. అక్కడ నుండి పారిపోవాలని వుంది.

“పారిపోవాలని వుందా మాటిమాటికి లేస్తున్నావ్?” అన్నాడు సూర్యదేవ్.

అదేం లేదు అన్నట్లుగా తలవూపి మెల్లగా కూర్చుంది.

“నా గొంతు వినగానే ఫోన్ కట్ చేసావ్. నేనంత పరాయివాడినయ్యానా?”

“ఊహూ.. ” అంది నివేద.

“మధురిమా హాస్టల్ పక్కనే నేను ఉన్నట్లు నీకు తెలియదా?” అడిగాడు సూర్యదేవ్.

“తెలుసు” అంది నివేద.

“మరి నువ్వు అక్కడ ఉన్నట్లు నాకెందుకు మెసేజ్ పెట్టలేదు?”

“ఏదో ప్రాబ్లంలో వుండి పెట్టలేదు”

“ప్రాబ్లంలో వున్నప్పుడే కదా మెసేజ్ పెట్టాలి”

“ప్లీజ్ మీరు వెళ్ళండి సర్! ఆంటీ వస్తారు”

“ఎందుకు వెళ్ళాలి? నేనేమైనా దొంగనా వెళ్ళటానికి?”

“అహా .. అదికాదు ఏ.ఎస్.పి గారు! నేను అలా అనలేదు” అంది భయంగా.

“ఎందుకంత భయపడుతున్నావ్ వేదా? దేనికైనా నీకు నేనున్నాను కదా! ఏదైనా నాకెందుకు చెప్పవు? చెబితేనే కదా తెలుస్తుంది. ఆ రోజు కూడా నువ్వు నాతో బయటకు రాగలవా అని నేను అనగానే ఫోన్ కట్ చేసావు. ఈరోజూ అంతే నా గొంతు వినగానే ఫోన్ కట్ చేసావు. నాకేమో నువ్వు బాగుండాలని, నీ ప్రాబ్లమ్స్‌ని తెలుసుకోవాలని వుంటుంది. నువ్వేమో నాకు దూరంగా వుండాలని చూస్తావ్. ఇలా ఎందుకు చెప్పు?” అన్నాడు. అతని గొంతులో మళ్ళీ అదే లాలన, అదే ప్రేమ. అదే చనువు. నివేద మనసు కరిగిపోయింది.

“మాట్లాడు వేదా! అసలేం జరిగింది? ఇక్కడకి ఎందుకొచ్చావ్?” అన్నాడు.

“ఇక్కడ అరుంధతీ ఆంటీ దగ్గర మా మామయ్య గురించి, మా ఆస్తుల గురించి ఇన్ఫర్మేషన్ వుందని అలేఖ్య చెబితే తెలుసుకుందామని వచ్చాను” అంది.

“తెలుసుకున్నావా?”

“తెలుసుకున్నాను”

“మరి అలా బయటకు వెళ్లి ఏదైనా కాఫీ కేఫ్‌లో కూర్చుని మాట్లాడుకుందాం. వస్తావా?”

“నేను రాను” అంది.

అప్పటికే సూర్యేదేవ్ ఫోన్‌కి కాల్స్ వస్తున్నాయి. కట్ చేస్తున్నాడు.

“ఇక్కడే వుంటావా?”

“లేదు హాస్టల్‌కి వెళతాను”

“హాస్టల్లో వుంటే నువ్వు నాకు రోజూ కనిపిస్తావు. నిన్ను రోజూ చూడొచ్చు. కానీ మీ ఇంట్లో మీ అత్తయ్య నీ గురించి ఏమంటున్నారో నీకు తెలుసా?”

“ఏమనుకున్నా నేను వెళ్ళను. వెళితే నన్ను మా బావకు ఇచ్చి పెళ్లి చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. వాళ్ళను నేను బేర్ చెయ్యలేను” అంది నివేద.

కొత్త విషయాన్ని విన్నట్లుగా విన్నాడు సూర్యేదేవ్. అలేఖ్య ఇది నాకు చెప్పలేదే అన్నట్లుగా చూసాడు.

“నీకు మీ బావను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే పోలీసులకి కంప్లైంట్ చెయ్యి. ఆ మాత్రం డేర్ చెయ్యలేవా? అలేఖ్య వుందిగా. తోడు తీసుకెళ్ళు. ఇందులో బేర్ చెయ్యలేకపోయేది ఏముంది?”

“నేనా పని చెయ్యలేను సర్! వాళ్ళు నన్ను చదివించారు. బిడ్డలా చూసుకున్నారు”

“కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవుగా. నువ్వు ఇంట్లో చెప్పకుండా బయటకు రావటం వల్ల నీ గురించి బ్యాడ్‌గా అనుకునే అవకాశం దొరికింది వాళ్లకు. ఇంకా బయటే వుంటే పేపర్లో, టీవీలో ప్రకటన ఇస్తారట నువ్వు ఎవరితోనో వెళ్లిపోయినట్లు మీ అత్తయ్య. అది నీకు ఓకేనా?”

నమ్మలేనట్లు చూసింది.

“ఇది చెప్పాలనే నాతో కాఫీ కేఫ్‌కి రమ్మన్నాను వేదా! మరి ఇప్పుడైనా వస్తావా నాతో. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను” అన్నాడు.

“నాకు రావాలనే వుంది. కానీ నేను వస్తే చాలా పెద్ద గొడవే చేస్తారు వాళ్ళు” అంది భయంగా నివేద.

“చేస్తే చెయ్యనియ్యి వేదా! అక్కడ మీ పేరెంట్స్ వున్నారుగా. వాళ్ళు చూసుకోరా?”

“వాళ్ళేం చూస్తారు సర్! నన్ను చూసిందంటే మా అత్తయ్య చంపేస్తుంది. నేను ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను”

“దూరంగా వెళ్ళిపోతావా? బాగా ఆలోచించే అంటున్నావా?”

“బాగా ఆలోచించే అంటున్నాను. ఆమె నుండి నన్నుమా పేరెంట్స్ కాపాడలేరు”

“వాళ్ళు కాపాడలేకపోతే నేను కాపాడలేనా వేదా? నా మీద ఆ నమ్మకం లేదా నీకు? ఎందుకిలా అంటున్నానంటే నువ్వు ఎటో వెళ్లి వాళ్ళ మాటల్ని నిజం చెయ్యొద్దు. నువ్వు నా దృష్టిలో చాలా మంచి అమ్మాయివి” అన్నాడు.

వెంటనే కుర్చీలోంచి లేచింది నివేద. మెట్లెక్కి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది.

అరుంధతితో ఇంటికెళుతున్నట్లు చెప్పింది. పైకి వెళ్లినంత వేగంగా తిరిగి కిందకి దిగింది. బ్యాగ్ భుజానికి తగిలించుకుంది.

“పదండి వెళదాం” అంది.

సూర్యేదేవ్ లేచి వెళ్లి తన వెహికిల్లో కూర్చున్నాడు. నివేద కూడా కూర్చోగానే వెహికిల్ కదిలింది.

హరనాధరావు ఇల్లు రాగానే వెహికిల్ ఆగింది.

“వేదా! నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యి” అన్నాడు సూర్యదేవ్.

“అలాగే” అంటూ వెహికిల్ దిగి ఇంట్లోకి వెళ్ళింది నివేద.

అప్పటి వరకు తన కూతురు ఇంటికి రావాలని దేవునికి మొక్కుకుంటున్న నాగేశ్వరి, బ్రహ్మయ్య నివేదను చూడగానే లోలోన సంబర పడ్డారు.

“అమ్మా! మీరెప్పుడొచ్చారు?” అడిగింది నివేద.

“ప్రొద్దున వచ్చాం వేదా!” అని నాగేశ్వరి అనగానే నివేద నేరుగా తన గదిలోకి వెళ్ళబోయింది.

సత్యవతి “ఆగు” అనగానే ఆగింది నివేద.

“ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావ్? నిన్నెవరో కిడ్నాప్ చేసారని నేను బాధ పడుతుంటే ఎవడితోనో లేచిపోయి వుంటుంది బాధ పడకు అని వినీల్ ఓదార్చాడు. నన్నెందుకంత బాధపెట్టావ్. చెప్పు ఎవరితో వెళ్ళావ్?” అంది సత్యవతి కోపంగా.

వస్తున్న కోపాన్ని అదిమిపట్టి “నేను ఎవరితోనూ వెళ్ళలేదు. నా మనసు బాగాలేక హాస్టల్లో వుండి వచ్చాను” అంది నివేద.

“నమ్మొచ్చా?”

“హాస్టల్ మేడంకి ఫోన్ చెయ్యండి”

“అవసరం లేదులే. ఇంకెప్పుడూ అలా వెళ్ళకు. ఇక నీ గదిలోకి వెళ్ళు” అంటూ అప్పటికప్పుడే కూల్ అయింది సత్యవతి.

తుఫాను వస్తుందనుకుంటే పిల్లగాలి వీచినట్లు తేలిగ్గా గాలి పీల్చుకున్నారు నాగేశ్వరి, బ్రహ్మయ్య.

ఆ రాత్రంతా కూతురితో మాట్లాడుకుంటూ కూతురి గదిలోనే పడుకున్నారు నాగేశ్వరి, బ్రహ్మయ్య.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here