ఆనంద స్వరూప విచారణ!

0
6

[dropcap](వి[/dropcap]శ్వనాథ వారి శైలిలో వ్రాయడమైనది, యథాశక్తి, ఒకింత సాహసంతో, కొంత సరదాతో)

***

లౌకిక సుఖము:

ప్రపంచ గత సర్వ ప్రాణులు, వస్తుజాలమంతయు పంచభూతాత్మకములు, కనుక కాలముచే వికారము నొంది, నశించునవే. సత్య మేమనగా, పరిణామ శీలములైనవన్నియును ప్రతి క్షణము మారుచునే యుండును. స్థూల దృష్టికి ఇది గోచరము కాదు. అట్టి విచ్ఛిత్తికి లోబడి యున్న వాటి నుండి వచ్చునది సుఖమనుకొనిననూ, అది నిలుచునదీ, దుఃఖ సమ్మిశ్రితము కానిదీ అగుటకు ప్రకృతి ధర్మము లొప్పవు. కనుక లౌకిక సుఖములన్నియు క్షణికములే, అస్థిరములే! వాని మూలములే అట్టివైన, ఇక వీనికి శాశ్వతత్వ లక్షణమెట్లు వచ్చును? ఇది ఎట్టి ఉన్నత శ్రేణుల గణన లోనికినీ రాని శుష్కము!!

***

కావ్య/రసానందము:

కావ్యగత ఆనందము, యా కవి రసభావముల పండించిన విధానము బట్టియు, తద్గత కథా విశేషములను బట్టియు, ప్రయుక్తమైన భాషా సౌకుమార్య సౌందర్యముల బట్టియు, అర్థ గాంభీర్యాది పలు అంశముల మీద ఆధారితము. ప్రధానముగా అందు ప్రతిపాదింపబడిన విషయ ప్రభావము, సహృదయులగు పాఠకుల పైన, మానవ స్వభావముల, అనుభూతుల నా కావ్యము ఏ స్థాయిలో స్పృశించినదో, ఏ ప్రమాణములో ధర్మ విజయ నిరూపణము తలకెత్తుకొన్నదో ఈ సర్వ విషయముల మీద నాధార పడి యుండును. ఇందు ఉత్ప్రేరకము, వస్తు గతము కాదు, భావగతము. కాన ఇది యొక మెట్టు, అంతగ కోరినచో రెండు మెట్లు లౌకిక సుఖమున కన్న పైననే, సందేహము లేదు.

మహా కవుల రచనలు సద్యః పరనివ్రృత్తి కల్గించుటయు, గుండె తడి యున్న వారికి సువిదితమే!!

శాకుంతలమున ఆ దుష్యంతుడు ఏమనినాడు, “సతాం హి సందేహ పదేషు”. ఇది యొక మహత్తర స్థాయిలో, సనాతన ధర్మ మార్గావలంబి యగు పురుషుడు మాత్రము అనదగిన మాట! అది యొక ఆత్మ ప్రత్యయము!! యొక జాతి సంస్కార బలము యొక్క పాదుల నుండి ఉదయించు ఆదర్శ ప్రాయమైన పలుకు!! కణ్వుని పితృ వాత్సల్యము చూపుచు,రచించిన “యాస్యతద్య శకుంతలేతి …..”

ఎందరి తండ్రుల, అందునా ఆడుపిల్లల తండ్రుల,

కంఠ గాద్గద్యమును తలపించునో, చెప్పునదేమున్నది?

తండ్రి అని ఏమి, సహృదయ పాఠకు లెవ్వరైన కంట

తడి పెట్ట వలసినదే ఆ భావ మార్దవమునకు, ఆ ఔచితీ మర్యాదకు!!

బాష్పములు రాల్చు ఘట్టము ఆనంద కారకమెట్లగును?! ఆనందమన్న, ఇచ్చట ఎట్టి భౌతిక ఛాయ లేని హృదయ సంబంధి యైన యొకానొక భావ బాంధవ్యము!! అది సహానుభుతి అని పిలవబడు అనుభూతి వాదమునకు మూల కందము!! ఆ రహస్యములు తెలిసి అందందు నిక్షిప్తము చేయు రస శిల్పులే మహాకవులు! అట్టి సమరస భావ సేతు బంధనము ఏర్పరచు దైవీ శక్తియే, కావ్య కళా మర్మజ్ఞత!!

ఆ కవి కాళిదాసు వేరొక చోట ఏమనును?

“రమ్యాని వీక్ష్య మధురాంశ్చ…..” ఇది ఏమి! భూమికి, ఆకసమునకు ముడి వేయు మాట!!

జీవి సుఖియైనను,ఏదో మధురమైన బాధ వంటిది కల్గునట, ఎందువలన?! ఆ జరిగిన సంఘటనకో, ఆ వ్యక్తికో , నీకును నేదియో తెలియరాని గత జన్మల బంధము,నిద్రాణమైనది, కించిత్ జాగృతమైనపుడు, అంతరాంతరముల, ఈ అనుభూతి కల్గునట!! ఇది ఎక్కడి భావనా పటిమ, అభివ్యక్తి!

ఇంకొక మహానుభావుడగు కవి, భవభూతి అని, ఆయన అన్నాడు కదా, “లౌకికానాం హి సాధూనాం…..” సామాన్యులకు అర్థము తెలిసి, మనసున స్ఫురించి, మాట వెలువడును, కానీ మహాత్ముల పట్ల ఇది విపర్యయమట! వారేది తోచినదో అది అందురు, ఆ మాటల అర్థము, పర్యవసానము అది తానై ఏర్పడునట!! కారణము, వారు భగవదేచ్చ తెలిసి పలుకుదురట!! అనగా వారు భగవత్ భావన యందు నిత్యరతులని అర్థము. అప్పుడు గానీ వాక్కు కా శక్తి రాదు!! ఇది ఎట్టి లోతుల తరచిన మాట!!ఇచ్చట ఎట్టి చింతనయు భగవన్నిష్ఠమే!

ఆ భావసమాధి వంటి స్థితి యందు చేసిన కవితాగానము వాగర్థముల సమాహార సుందరము, శివమయం!! అది కర్ణారసాయనమై యుండవలెను, శబ్ద సంయోజనమున!అది మానవ జీవన పథ నిర్దేశ సమర్థ, ఔపదేశికమై వెలగవలే, అర్థ గౌరవమున!!

అట్టివి ఇచ్చట మహా కావ్యము లనినవి. తాదృశగ్రంథ రచనల చేసిన వారు, ఈ దేశమున మహాకవిపద పురస్సరులు! అట్టివారి కావ్య పఠనమున కల్గునది,యొక పై స్థాయి ఆనందము అని చెప్పుచున్నాము, అది రస లోక విహారి!!

అదియే, భాగవతాది విష్ణు పారమ్యములైనచో, చింతామణియై ఇహలోక సుఖదాయిని అగుటయే గాక కల్పద్రుమము వలె స్వర్గ సౌఖ్య ప్రదాతయు అగుచు, గురు పీఠమున ఉండి, కైవల్య మార్గసంధాయిని కూడా అగునని పెద్దల మాట!!

ఇట్లెన్నియైన ఉదాహరణములు చూపవచ్చును. ఉత్తమ కావ్యస్థ శాశ్వతత్వము సాధించిన వాక్యముల, రసానంద ప్లావితములైన ఘట్టముల!! వాల్మీకి వ్యాసాదుల రచనలో కొల్లలుగ లభించును, ఇట్టి ప్రమాణ వాక్యములు!! “వాక్యం రసాత్మకం కావ్యం”

అని కదా ఆలంకారికుల నిష్కర్ష!!

ఒక “సార్వకాలిక సత్యము” అను కావ్యాత్మను సుందరమగు శబ్ద శరీరమున అవతరింప జేసి, ఔచితి పాటించి తగు ఆలంకారిక చట్రములో నుంచి, కావ్యము నిర్మించుట ఒక సృష్టి జేయు నంతటి మహత్కార్యము!!

ఇచ్చట కవియే విధాత, కావ్యప్రపంచమే ఆతని సృష్టి!!

“కవిరేవ ప్రజాపతిః”! లోకజ్ఞత, ఔచితియే దీనికి జీవగర్ర, జగద్ధితమే పరమార్థము! “విశ్వ శ్రేయః కావ్యం” అనినారు, మన కవితా మార్గ నిర్దేష్టలు! బాగుగ ఆలోచించినచో మహాకవిశబ్ద వాచ్యుడు, అనివార్యముగ యొక ఋషికల్పుడే!! లేనిచో అట్టి ఉత్కృష్ట భావములు ఏమి లేని చాలున పుట్టునా?!! ఇది యీ జాతి బలము, అదృష్టము, వారసత్వ సంపద!!

ఇందు మరల భిన్న భిన్న రసముల ప్రాధాన్యత, దేని కదియే! వాని ప్రభావమును తర తమ భేదములతో సాగును.

కరుణయే యున్న రసములన్ని సమయించు సాగరమని కొందరి మతము. అది అటుండనిండు.

కూరగాయలకు పోయిన అయ్య పొలముల కొలుచు

నట్లగును ఇప్పుడా రస చర్చ!! రసము ఒకమహా సముద్రము!!

***

తురీయము:

ఇక నిర్వికార చిత్తులై, సర్వ కార్యములు భగవదాజ్ఞగ చేయుచు, ఫల నిరపేక్షులై జీవించి, అన్నిట ఆ దేవదేవుని ప్రతిబింబమే జూచు వారి స్థితి, వారి జీవన సాఫల్య సూచకము!! అట్టి నిరతిశయ ఆనందము సర్వోత్కృష్ఠము, అది అనుభవైక వేద్యము. దానిని, మరి ఏ ఇతరములతో పోల్చరాదు!

అట్టి పోలిక ఆ మనుజుల స్థాయిని దెల్పుటయే కాదు, వారి జ్ఞానదీప మెంత గుడ్డిదో అథవా చిన్నదో సూచించును గాని వేరొకటి కాదు.

నామ మాత్ర జగన్నాధులు ఏమన్నను, సర్వ నియామకత్రిగుణాతీత,నిత్యానంద ధామమున యోగరతుడై, స్వాత్మారాముడై వెలుగు ఆ పరబ్రహ్మమగుజగన్నాథుని, ఆ మేధావిని కొలుచుట, ఈ పరిమితమనుష్య బుద్ధికి అందెడునది ఆగునా?! ముమ్మాటికీ

కానేరదు.

అది మహర్షులు తపమను దివ్య సాధనమున, సమాహిత చిత్తులై, ఇంద్రియ గ్రామమును జయించి, ఈ పాంచభౌతిక ఆవరణల నధిగమించి, అనుభవించిన, వినిన,కనిన సత్యానంద ఝరీ వివరము! వారు దయతో చెప్పినవే మనకు తెలిసిన ఈ బహు స్వల్పము, ప్రాచుర్యములో నున్న “జ్ఞాన” శబ్ద సంబోధితము!

అట్టి భాగవత తేజోమూర్తులు అనుభవించు ఆనందమును, ఎట్టి పావన జీవనుచే రచితమైన కావ్య సంబంధి యైననూ, కావ్యానందముతో సరి పోల్చుట తగని పని, అజ్ఞాన జనితమగును!!

***

సమన్వయము:

ఇక లౌకిక సుఖముల మాట ఎంత తక్కువ జెప్పిన అంత దుఃఖ దూరులము అగుదుము,

అందుకు సందేహ మేమీ?!!

నిచ్చెన నెక్కలేని వాడు స్వర్గమున కేమి పోవును?

వాదనల కేమి, వేయి తలలు, అనంతమైన దారులు!

నిలుచునది మాత్రము భాగవతుల చరితలూ, వారి అనుభవములోకి వచ్చిన శాశ్వతానంద సంబంధ విషయములు మాత్రమే. తదన్యములన్నియూ

కాల ప్రవాహ మున కొట్టుకొనిపోవునవే!!

కాగితపు పూలు లౌకిక సుఖములైన, మల్లె జాజీ ఇత్యాది సుమ రాజములు కావ్యానందములు. వాటి కాల ప్రమాణమంతియ, వాటి స్థాయిను అంత వరకే!

వేరొక పద్ధతిని చెప్పవలెనన్న లౌకిక సుఖముల స్థాయి

జాంతవ స్థాయి, కావ్యగతానందము అది మానుష స్థాయి! తురీయమైనది, శాశ్వతమైనది అయిన యా

ఆనందము మోక్ష సంబంధి, ఉత్తమ శ్లోకులైన జీవన్ముక్త

ధన్యాత్మల పరిధి లోనిది.సామాన్యుల కది దురవగాహము, అనుభవించిన వారికది, దురవబోధనీయము, నిర్వచించుటకు పరమైనదీ!!

ఈ చివరి వర్గము లోని ఆనందమును పోల్చ వలెనన్న అది దేవలోక పారిజాతము అనవచ్చునేమో!

ఆ ఆనందము మన అనుభవము లోనిది కాదు, ఆ పుష్ప సౌరభమునూ!! ఇది యొక పోలికమాత్రమే!

నిజమునకు ఆ ఆనందము అనిర్వచనీయం.

“యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ”

అని కదా!ఆ ఆనందము ఆ పరమపద సంబంధి!!

అఛ్ఛేద్యోయం, అదాహ్యోయం… అని చెప్పిన

దానితో దాని యోగము!

ఈశ్వారానుగ్రహము చేత,వారి వారి సాధన చేత అట్టి ఆనందప్రాప్తి కలిగిన మహా ప్రకృతులకు ఒక నమస్కారము!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here