[dropcap]6వ[/dropcap] తరగతి విద్యార్ధులు క్లాసు టీచర్ కనుసన్నలలో తమ క్లాసు కార్యక్రమం రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ప్రతి నూతన విద్యా సంవత్సరంలో అన్ని తరగతుల విద్యార్ధులు కెజి నుండి 10 తరగతి దాకా తమ ప్రతిభ పాటవాలను అందరి ముందు జంకు లేకుండా ప్రదర్శిస్తుంటారు. ఈ ప్రదర్శనలు వారి ప్రతిభనే కాదు వారికి కలసికట్టుగా జట్టుగా టీం స్పిరిట్‌ను నేర్పిస్తాయి. నాయకత్వ లక్షణాలు తెలుస్తాయి. అందుచేత పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొంటారు.
ఈ క్రమంలో పిల్లలు టీచర్ కలిసి వారివారి సామర్థ్యాన్ని బట్టి చెయ్యవలసిన పనులను కేటాయిస్తున్నారు. కొందరు నాటకంలో, మరికొందరు పాటలు, సూక్తులు, డాన్సు; మరికొందరు బ్యాక్‍గ్రౌండ్‌కి అవసరమైన సెట్టింగ్స్, చార్ట్స్ చెయ్యటం అన్నమాట.
అందరు ఉత్సాహంగా ప్రాక్టీసులో మునిగి తేలుతున్నారు. ఇంతలో చిన్న అలజడి టీచర్‌కి వినబడింది. నాటకం లోని ముఖ్య పాత్రధారులు ఇతర విద్యార్ధుల పార్టిసిపేషన్ గురించి చులకనగా నొప్పించేలా మాటలాడటంతో క్లాసులో గందరగోళం ఏర్పడింది. వాదనకు దిగారు. టీచర్ స్టూడెంట్స్‌ని పిలిచింది.
“టీచర్! యాక్టర్స్ మమ్మల్ని విసిగిస్తున్నారు. ఎగతాళి చేస్తున్నారు టీచర్!”
టీచర్ చిరునవ్వుతో వారిని వారించింది.
“స్టూడెంట్స్ మీకు ఒక కథ చెప్పాలి. ఎవరు ఎక్కువ తక్కువ కాదని విజయ సాధనలో అని తన సామర్ధ్యంతో నిరూపించిన ఉడత కథ.” అంద్.
కథ అనగానే పిల్లలు అల్లరిమాని వినటానికి సిద్ధం అవుతారని ఆవిడకు తెలుసు.
“స్టూడెంట్స్! రామ సేతు గురించి విన్నారా?”
“విన్నాం టీచర్.”
“గుడ్. ఎక్కడ ఎవరు కట్టారో తెలుసా?”
“ఆ! శ్రీలంక దగ్గర.”
“తమిళనాడులో”
“కన్యాకుమారిలో!”
రకరకాల సమాధానాలు వచ్చాయి.
“గుడ్. అది ఎక్కడ? ఎలా? ఎవరు కట్టారో తెలుసుకుందాము” అన్నారు టీచర్.
“రామ సేతు లేదా రాముని వంతెన సున్నపు రాతి వంతెన. పంబన్ ద్వీపం లేదా రామేశ్వరం తమిళనాడుకు southestren వైపున, శ్రీలంకకు northwest తీరంలో ఉన్న మన్నార్ ద్వీపాన్ని కలిపిన అతి పురాతన వంతెన. భౌగోళిక ఆనవాళ్ళ ప్రకారం ఈ వంతెన గతంలో ఇండియా, శ్రీలంకను కలిపిన భూమార్గం. ఈ రామ సేతు ను శ్రీ రాముడు మరియు వానర సేన కట్టారు.”
“ఎప్పుడు? ఎందుకు? కట్టారో తెలుసా?” అన్నారు టీచర్.
“టీచర్! టీచర్! సీతను లంక నుండి తేవటానికి, రావణుని చంపటానికి.”
“గుడ్! చాలా తెలుసు మీకు.”
పిల్లలు ఆనందంతో చిరునవ్వులు చిందించారు టీచర్ మెప్పు పొందినందుకు.
“సరే! కథలోకి వద్దాము. వానరులు రాముని పర్యవేక్షణలో వంతెన /సేతు నిర్మాణం మొదలుపెట్టారు. దేనిమీద కట్టారో తెల్సా? సముద్రం మీద. Indian ocean మీద.
కోతులు తెచ్చి వేస్తున్న రాళ్ళు నీటిలో మునిగిపోతున్నాయి. వానరులు అది చూసి బాధపడ్డారు.
శ్రీ రాముడు సముద్రుని ప్రార్థించి రాళ్ళు నీటిలో తేలేలాగా చేసాడు. అందరు war footing లో వంతెన నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఇంతలో ఎక్కడ నుండి వచ్చిందో ఒక పెద్ద ఉడత కుచ్చు తోకతో అక్కడకు వచ్చి కొద్ది సేపు వారందరిని పరిశీలనగా చూసింది. తరువాత ఉడత సముద్రం లోకి నీటిలో ఒళ్ళు తడుపుకుని, ఒడ్డుకు వచ్చి ఇసుకలో అటు ఇటు పొర్లి తగినంత ఇసుక అంటిన తరువాత వానరులు సముద్రంలో వేస్తున్న రాళ్ళ మీదకు వెళ్లి ఇసుకను దులిపి, మళ్ళీ సముద్రం లోకి వెళ్లి ఇలా అనేక సార్లు చేసింది.
కొద్దిసేపటి తరువాత ఉడత చేస్తున్న పనిని గమనించిన వానరులు నవ్వసాగారు. అది గమనించిన రాముడు అక్కడకు వచ్చి ఉడుత చేస్తున పనిని గమనించి ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు.
చెట్లు చేమలు, రాళ్ళు, ఇసక మేటలు తెచ్చివేస్తున్న కోతులకు రాముని action వింతగా అనిపించింది.
దానికి సమాధానంగా రాముడు ‘తనకు తోచినంత, సాధ్యమైనంత పనిని ఇష్టంగా చేస్తున్న ఉడుత ధన్య జీవి. మీ అందరిలో ఎవరైతే గొప్ప పనిమంతుడో వారితో ఈ ఉడుత సమానం.’ అంటూ ప్రేమగా ఉడుతను చేతిలోకి తీసుకుని వీపు మీద నిమిరాడు. అందుకే నేటికి ఉడుతల వీపు మీద రాముని చేతి గుర్తులు కనిపిస్తాయి.
స్టూడెంట్స్! సముద్రం మీద తేలే రాళ్ళతో వంతెన కట్టడము ఒక గొప్ప నిర్మాణ చాతుర్యం. ఎంతో మంది వానరులు కలసి మెలసి జట్టుగా చేసిన పని. అలాంటి కష్టమైన పనిని చూసి నా వల్ల ఏమి అవుతుంది. నేను చెయ్యకపోయినా పని ఆగదు అనుకోలేదు ఆ ఉడత. చేతులు ముడుచుకొని కూర్చోలేదు. నాకు చేతనైన పనిని చేస్తాను. నా సామర్ద్యం మేరకు. అనుకోని బద్దకించకుండా ఇష్టంగా రామ సేతు నిర్మాణంలో పాలుపంచుకుంది.
ఇక్కడ మనం తెలుసు కావాల్సింది ఏమంటే ఏ గొప్ప పని ఒక్కరి వాళ్ళ సాధ్యం కాదు. ఎక్కువా తక్కువా అనే భేదభావం లేకుండా అందరు వారి వారి శక్తి కొలది ఇష్టంగా పని చేస్తేనే ఏ పని అయినా విజయవంతం అవుతుంది.
ఆ విషయం లోకానికి చెప్పటానికి ఉడుత చేసిన సాయాన్ని లోకానికి చెప్పి మెచ్చుకున్నాడు రాముడు.
ఎవరైన ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేస్తే దాన్ని ఉడుతా భక్తి అంటారు.
కనుక స్టూడెంట్స్ పనిలో మీరు ఎవరు ఎక్కువ తక్కువ కాదు. మీ మీ ఇంటరెస్ట్, కెపాసిటీకి అనుగుణంగా కలసి పనిచేస్తేనే మన క్లాసు కల్చరల్ ప్రోగ్రామే విజయవంతం అవుతుంది.
ఉడతలా వినయంగా ఉంటారా? గర్విష్టి వానరంలా ఉంటారా?” అడిగింది టీచర్.
“ఉడతా భక్తితో వినయంగా విజయం సాధిస్తాం” అని పిల్లలు ఉత్సాహంగా తమ తమ పనుల్లో బిజీ అయ్యారు.