ట్యారెంటినో ముద్ర… సన్నివేశాలలో బిగి

0
3

[dropcap]క్వెం[/dropcap]టిన్ ట్యారెంటినో చిత్రాలలో హింస ఎక్కువుంటుందనేది నిజమే. కానీ ఆ చిత్రాలలోని పాత్రలు, నేపథ్యం హింసాత్మకమైనవైతే హింస అనేది కథలో భాగమే అవుతుంది. హింసను చూపించకుండా సంకేతమాత్రంగా చూపించే దర్శకులు కొందరైతే ట్యారెంటినో హింసను ఏ మాత్రం సంకోచించకుండా చూపిస్తాడు. ‘రివిజనిస్ట్ హిస్టరీ ట్రిలజీ’లో మూడు చిత్రాలు తీశాడు. అంటే ‘చరిత్ర పునర్లేఖన త్రయం’ అనుకోవచ్చు. చరిత్రలో ఉన్న నిజాలను మార్చి ‘ఇలా జరిగి ఉంటే ఎంత బావుండేది’ అనిపించేలా ఉంటాయి ఈ చిత్రాలు. కొందరు దీన్ని తప్పుపడతారు. కానీ కేవలం సినిమాలలా చూస్తే ఇవి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ‘ఇన్‌గ్లోరియస్ బాస్టెర్డ్స్’ రెండో ప్రపంచ యుద్ధంలో యూదులు పగ తీర్చుకుంటే ఎలా ఉండేదో చూపించాడు. ‘జాంగో అన్‌చెయిన్డ్’లో బానిసలుగా ఉన్న నల్లజాతివారు తిరగబడితే ఎలా ఉంటుందో చూపించాడు. ‘ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’లో కొందరు హంతకులు గర్భవతి ఐన ఒక నటిని చంపిన నిజజీవిత సంఘటనను మార్చి చూపించాడు. కథాంశాలు ఇలా ఉంటే హింస అనేది అనివార్యం. చరిత్రను మార్చి చూపించటం ఆయా వర్గాలకు మానసిక ప్రక్షాళన (కెథార్సిస్) కలిగిస్తుంది అని కూడా చెప్పవచ్చు. దీనిని Alternate History  అంటారు.

ట్యారెంటినోలో నాకు ముందుగా కనిపించేది ఒక రచయిత. స్క్రీన్ ప్లే రాయటంలో అతను దిట్ట. ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ రేపటంలో సిద్ధహస్తుడు. అతని చిత్రాలు రెండున్నర గంటలపైనే ఉంటాయి. అయినా అప్పుడే అయిపోయిందా అనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు 20-25 నిముషాలున్నా రెప్ప ఆర్పకుండా చూసేలా చేస్తాయి. అలాంటి కొన్ని సన్నివేశాలు ఇప్పుడు చూద్దాం.

రెండో ప్రపంచ యుద్ధంలో జెర్మనీ అధినేత హిట్లర్ నిర్దేశాలతో యూదుల ఊచకోత జరిగింది. ఈ నేపథ్యంలో ‘ఇన్‌గ్లోరియస్ బాస్టెర్డ్స్’ ప్రారంభమౌతుంది. ఫ్రాన్స్‌లో కొంత భాగాన్ని నాజీలు (జెర్మనీ సైన్యం) ఆక్రమించుకుంటారు. అక్కడ ఉన్న యూదుల్ని మట్టుబెడుతుంటారు. ఈ క్రమంలో ఒక పాడి రైతు ఇంటికి హాన్స్ లాండా అనే సైన్యాధికారి వస్తాడు. పాడి రైతు అంటే బక్కచిక్కిన వాడు అనుకోకండి. బలిష్టమైనవాడు. అతనికి ముగ్గురు కూతుళ్ళు. విశాలమైన మైదానంలో అతని ఇల్లు ఉంటుంది. చెక్కతో కట్టినది. బయట కట్టెలు కొట్టుకుంటున్న అతడు సైనికులతో కార్లలో లాండా రావటం చూస్తాడు. ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. కానీ గంభీరంగా ఉంటాడు.

లాండాని ఇంటిలోకి ఆహ్వానిస్తాడు. లాండా వికృతంగా ఉంటాడనుకోకండి. మామూలు మనిషిలాగే ఉంటాడు. రైతు తన ముగ్గురు కూతుళ్ళను పరిచయం చేస్తాడు. లాండా నవ్వుతూ అందరినీ పలకరిస్తాడు. ఒకమ్మాయి ముఖంలో భయం కనిపిస్తుంది. నేపథ్యంలో కిటికీలో నుంచి లాండాతో వచ్చిన సైనికులు కనిపిస్తూ ఉంటారు. ప్రమాదం దాపులోనే ఉంది అనేందుకు సూచనగా. రైతు డైనింగ్ టేబుల్ దగ్గర లాండాను కూర్చోమంటాడు. ఒకమ్మాయిని లాండా కోసం వైన్ తెమ్మంటాడు. “నాకు వైన్ వద్దు. మీరు చేసేది పాల ఉత్పత్తి కాబట్టి పాలు ఇవ్వండి” అంటాడు లాండా. ఇక్కడే పైచేయి సాధిస్తాడు. అదీ సౌమ్యంగా. ‘మీరు చెప్పేది కాదు, నేను చెప్పేదే చెల్లుతుంది’ అనే సంకేతం ఇస్తాడు. పాలు గటగటా తాగేస్తాడు. ‘దేనినైనా అంతం చూసేదాకా వదిలిపెట్టను’ అన్నట్టుగా. మీ అమ్మాయిలు, మీ పాలు అద్భుతం అంటాడు. ఇది తప్పుగా అనుకోవలసిన అవసరం లేదు. పాశ్చాత్య దేశాలలో ఇది పొగడ్త కిందికే వస్తుంది. మీ అమ్మాయిలను బయటికి పంపిస్తే మనం మాట్లాడుకోవచ్చు అంటాడు లాండా. ఇప్పటి దాకా సంభాషణ ఫ్రెంచ్ భాషలో నడుస్తుంది. నాకు ఫ్రెంచ్ పెద్దగా రాదు, మనం ఇంగ్లిష్‌లో మాట్లాడుకుందాం అంటాడు. అప్పటివరకు అతను ఫ్రెంచ్ బాగానే మాట్లాడినా కాదనే పరిస్థితి కాదు రైతుది.

“9 నెలల క్రితమే మా ఇల్లు తనిఖీ చేశారు. మళ్ళీ రావటం ఆశ్చర్యంగా ఉంది” అంటాడు రైతు.

“ఒక్కోసారి కొన్ని పనులు రెండుసార్లు చేయాల్సి వస్తుంది. చాలా మటుకు అది సమయం వృథా చేస్తుంది కానీ చేయకతప్పదు” అంటూ కాగితాలు, సిరా బయటికి తీస్తాడు లాండా. ఇదేదో పైపై తనిఖీ మాత్రమే అనే భావన కలిగిస్తూ. రైతుకి కాస్త ధైర్యం వస్తుంది.

“ఇక్కడ నాలుగు యూదు కుటుంబాలు ఉండేవి. మూడు కుటుంబాల సంగతి చూసుకున్నాం కానీ నాలుగో కుటుంబం జాడ తెలియట్లేదు. మీకేమైనా తెలుసా?” అంటాడు లాండా.

“వాళ్ళు స్పెయిన్‌కి పారిపోయారని విన్నాను” అంటాడు రైతు. ఆ కుటుంబం వివరాలు అడిగి రాసుకుంటాడు లాండా.

“ఇంతే నాకు కావల్సింది. ఇంకో గ్లాసు పాలు ఇస్తారా?” అంటాడు లాండా.

ఇంతవరకు వారు కూర్చున్న టేబుల్ కు ఒకవైపు ఉన్న కెమెరా ఇప్పుడు నెమ్మదిగా తిరిగి రైతు కూర్చున్న వైపుకి వెళుతుంది. పైనుంచి రైతు పాదం దాకా వెళ్ళి నేల చెక్క కిందికి వెళుతుంది. అక్కడ కొందరు దాక్కుని ఉంటారు. రైతు ఇంతవరకు అబద్ధం చెప్పాడు. ఆ యూదు కుటుంబానికి అతనే ఆశ్రయం ఇచ్చాడు. అయినా లాండాను తప్పుదోవ పట్టించాడు. పరస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అందుకే కెమెరా అతని వైపుకు వెళ్ళింది.

ఇంకో గ్లాసు పాలు టేబుల్ మీద పెడతాడు రైతు. దాన్ని ముట్టుకోకుండా “ఫ్రాన్స్ వాళ్ళు నాకేం పేరు పెట్టారో తెలుసా?” అని అడుగుతాడు లాండా.

“జ్యూ హంటర్” అంటాడు రైతు. అంటే యూదులను వేటాడేవాడు.

“ఆ పేరంటే నాకు భలే ఇష్టం. ఎందుకంటే నేను యూదులలా ఆలోచించగలను. జెర్మన్లు గద్దల లాంటి వాళ్ళు. అదను చూసి దాడి చేస్తారు. యూదులు ఎలుకలు. ఇదేమీ వారిని కించపరచటం కాదు. ఎలుకల జీవితం చాలా కష్టమైనది. ఎలుకల్ని చూస్తే నువ్వు వదిలేస్తావా?”

“వదలను.”

“అవేం నేరం చేశాయని?”

“ఎలుకలు కరుస్తాయి. రోగాలు కలిగిస్తాయి.”

“ఉడతలు కూడా అదే జాతి. అవి కూడా రోగాలు కలిగిస్తాయి. కానీ వాటి మీద ద్వేషం కలుగదు. ఎలుకల మీదే కలుగుతుంది. అది కాదనలేని నిజం. దానికి కారణం చెప్పలేం. జెర్మన్లు ఒక ఇంట్లో యూదులు దాక్కున్నారని వెతికితే పైపైనే వెతుకుతారు.. గద్దల్లా. మనుషులు ఆత్మగౌరవాన్ని వదిలేస్తే ఎంత దిగజారతారో వారికి తెలియదు. నాకు తెలుసు. అందుకే నన్ను హిట్లర్ ఆస్ట్రియా నుంచి రప్పించాడు.”

ఇక్కడ కెమెరా మళ్ళీ టేబుల్‌కి ఇటు వైపు వస్తుంది. తిరిగి లాండాది పైచేయి అయిందనటానికి సూచనగా.

“ఇప్పుడు మీ ఇల్లు సోదా చేయించటం నా ఉద్యోగనిర్వహణలో భాగం. అవకతవకలు దొరుకుతాయని నీకూ తెలుసు. అప్పుడు శిక్ష తప్పదు. కాబట్టి నువ్వే చెప్పేస్తే ఏ గొడవా ఉండదు. ”

నేల చెక్క కింద యూదు కుటుంబం ఉందని లాండాకి తెలిసిపోయిందా? బుకాయిస్తున్నాడనుకుందామంటే సోదా చేస్తానంటున్నాడు. ఎలుకలు ఎక్కడ దాక్కుంటాయో నాకు తెలుసు అన్నాడు. దొరికిపోతే? ఇది రైతులోని మథనం. కన్నీళ్ళు పెట్టుకుంటూ నిజం చెప్పేస్తాడు. అతని మంచి మనసు నిరంకుశత్వానికి లొంగిపోయింది.

లాండా సైనికుల్ని లోపలికి రప్పించి నేల చెక్క మీద తూటాల వర్షం కురిపిస్తాడు. కింద ఉన్న అందరూ మరణిస్తారు.. షొసానా అనే అమ్మాయి తప్ప. ఆమె తప్పించుకుని పారిపోతుంది.

ఈ సన్నివేశం రెండు విషయాలను తేటతెల్లం చేస్తుంది. ఒకటి లాండా రాక్షసత్వం. రెండు షొసానాకు లాండాపై పగకు కారణం. ఉత్కంఠ కలిగించి సీటు అంచున కూర్చునేలా చేసి కథ చెప్పటం ట్యారెంటినోకి బాగా తెలుసు. మొదట రైతు కుటుంబం విదేశీ సైనికుల్ని చూసి అందరూ భయపడినట్లే భయపడిందని అనిపిస్తుంది. సన్నివేశం మధ్యలో రైతు అబద్ధమాడుతున్నాడని తెలుస్తుంది. అయినా అతను పట్టుబడకూడదని కోరుకుంటాం. చివరికి రైతు నిస్సహాయతకు, లాండా రాక్షసత్వానికి మనసు బరువెక్కుతుంది. అయినా షొసానా తప్పించుకోవటం ఊరట కలిగిస్తుంది. యూదులను అవమానిస్తూ లాండా మాట్లాడినా సినిమా చివరికి ఆ కసి అంతా తీరుతుంది. లాండా పాత్ర చిత్రణ ఒక ఆకర్షణీయమైన రాక్షసుడిలా ఉంటుంది. నవ్వుతూ ప్రాణాలు తీస్తాడు. నక్కజిత్తుల వాడు. ఫ్రెంచ్ లో మాట్లాడితే దాక్కున్న యూదు కుటుంబానికి అర్థమౌతుందని ఇంగ్లిష్ లో మాట్లాడతాడు.  ఈ సీను సినిమాలో దాదాపుగా 20 నిముషాలపైన వున్నా ఆసక్తి కలుగుతుంది తప్ప విసుగు కలగదు. ఈ సీను అయినతరువాత మనసులోతుల్లోంచి దీర్ఘమయిన నిట్టూర్పు వెలువడుతుంది.  లాండాగా క్రిస్టాఫ్ వాల్ట్జ్ నటించాడు. ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అందుకున్నాడు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ ఎడిటింగ్ నామినేషన్లు వచ్చినా అవార్డులు దక్కలేదు.

‘జాంగో అన్‌చెయిన్డ్’ 1858లో జాంగో అనే ఒక బానిస కథ. షుల్ట్జ్ అనే వ్యక్తి అతన్ని అతని యజమాని నుంచి కొంటాడు. అయితే షుల్ట్జ్ బానిసత్వానికి వ్యతిరేకి. జాంగో సాయంతో కొందరు నేరస్తులని పట్టుకుని ప్రభుత్వ బహుమానం పొందాలని అతని ఉద్దేశం. ఇలా నేరస్థులని పట్టించి డబ్బు సంపాదించటమే అతని ప్రధాన వృత్తి. ఇలాంటి వారికి బౌంటీ హంటర్స్ (బహుమతుల వేటగాడు) అంటారు. జాంగో పౌరుషం గలవాడు. ఇద్దరికీ స్నేహం పెరుగుతుంది. తన భార్య బానిసగా చేతుల మారి వేరే చోట ఉందని జాంగో షుల్ట్జ్ కి చెబుతాడు. ఆమెని తానెంత ప్రేమిస్తున్నాడో చెబుతాడు. షుల్ట్జ్ తన దగ్గర ఉన్న డబ్బుతో జాంగో భార్యని విడిపించాలని నిశ్చయించుకుంటాడు. జాంగోని తీసుకుని ఆమె యజమాని క్యాల్విన్ దగ్గరకు వెళతాడు. క్యాల్విన్ కర్కోటకుడు. షుల్ట్జ్ చూస్తుండగా ఒక బానిసని తప్పు చేశాడని వేటకుక్కలకు ఆహారంగా వేస్తాడు. అతనికి బానిసలతో మల్లయుద్ధాలు చేయించి వినోదించటం అలవాటు. మల్లయుద్ధం చేసే ఒక బానిసని కొంటానని షుల్ట్జ్ క్యాల్విన్ ఇంట్లో అతిథిగా ప్రవేశిస్తాడు. తనతో వచ్చిన జాంగోకి కూడా అతిథి మర్యాదలు జరగాలని చెబుతాడు. క్యాల్విన్ అయిష్టంగానే ఒప్పుకుంటాడు. జాంగో ఎవరో అక్కడెవరికీ తెలియదు.

క్యాల్విన్‌ని చిన్నప్పటి నుంచీ సాకిన బానిస స్టీఫెన్. ఇప్పుడు ముసలివాడు. ఇతర బానిసల మీద అజమాయిషీ అతనిదే. నల్లజాతి వారందరూ బానిసల్లాగే ఉండాలని అతని నమ్మకం. అతనంటే క్యాల్విన్‌కి ప్రేమ. షుల్ట్జ్ తో పాటు వచ్చిన జాంగో బానిస కాదని, స్వతంత్రుడని తెలిసి స్టీఫెన్‌కి అక్కసు కలుగుతుంది. అతనికి మర్యాదలు కూడా చేయాలని విని భూమి తలకిందులైనంత బాధపడతాడు.

జాంగో భార్యకి జెర్మన్ భాష తెలుసు. షుల్ట్జ్ జెర్మనీ నుంచి అమెరికాకు వచ్చినవాడు. జెర్మన్ భాషలో మాట్లాడాలని ఆమెని రప్పించుకుంటాడు. జాంగో ఆమెని కలుసుకుంటాడు. ఏ అనుమానం రాకుండా ఆమెని కొని తీసుకుపోవాలని షుల్ట్జ్ పథకం. భోజనాల దగ్గర ఆమె వడ్డన చేస్తూ ఉంటుంది. స్టీఫెన్ అజమాయిషీ చేస్తుంటాడు. జాంగో, అతని భార్య ఒకరినొకరు చూసుకోవటం స్టీఫెన్ గమనిస్తాడు. క్లాల్విన్ చెల్లెలు కూడా గమనించి ఆమెకి జాంగో నచ్చినట్టున్నాడని అంటుంది. స్టీఫెన్ అనుమానం బలపడుతుంది. తర్వాతి సన్నివేశం చిత్రాన్ని మలుపు తిప్పుతుంది. ట్యారెంటీనో ఉత్కంఠభరితంగా ఈ సన్నివేశాన్ని నడిపిస్తాడు.

మల్లయోధుడిని పన్నెండు వేల డాలర్లకు కొంటానని అంటాడు షుల్ట్జ్. అది చాలా పెద్దమొత్తం. కొన్నిరోజుల్లో డబ్బు తీసుకుని వస్తానని అంటాడు. భోజనాలు కొనసాగుతుంటాయి. క్యాల్విన్ జాంగో భార్యని ఆటపట్టిస్తూ ఉంటాడు. స్టీఫెన్ ఆమె వీపు మీద కొరడా దెబ్బల గుర్తులు షుల్ట్జ్ కి చూపించమని రెచ్చగొడతాడు. ఇలాంటివి అతనెప్పుడూ చూసి ఉండడని అంటాడు. ఆమెనలా అవమానిస్తే జాంగో ఎలా స్పందిస్తాడో చూడాలని అతని పన్నాగం. ఆమె వీపు మీద దెబ్బలను చూసి జాంగో ముఖం ఎర్రబారుతుంది. ఇంతలో క్యాల్విన్ చెల్లెలు భోజనాల దగ్గర ఇదేం పని క్యాల్విన్‌ని మందలిస్తుంది. పాత్రల ఔచిత్యానికి ఇది ఉదాహరణ. స్త్రీలు సున్నిత హృదయులు. ఎంత బానిస అయినా వారి పట్ల అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించటం చూడలేరు. కానీ స్టీఫెన్ పన్నాగం పండింది. జాంగోకి కోపం వచ్చిందని అతనికి అర్థమౌతుంది. అతను జాంగో భార్యని లోపలికి తీసుకువెళ్ళి నిలదీస్తాడు. ఆమె బెదిరిపోయినా నిజం చెప్పదు. స్టీఫెన్ తిరిగి భోజనాల గదిలోకి వచ్చేసరికి షుల్ట్జ్ జాంగో భార్యని కొంటానని ప్రస్తావన తెస్తాడు. స్టీఫెన్ క్యాల్విన్‌ని లోపలికి రమ్మని కోరతాడు. వాళ్ళు జాంగో భార్యని కొనటానికి వచ్చారని, తక్కువ మొత్తంతో ఆమెని కొనాలని చూస్తున్నారని, మల్లయోధుడిని కొనటం ఒక నాటకమని అంటాడు. క్యాల్విన్ అహం దెబ్బతింటుంది. భోజనాల గదిలోకి వచ్చి తన చెల్లెలిని ఏదో సాకుతో బయటకు పంపుతాడు. ఒక పుర్రెని బయటకు తీస్తాడు. అనూహ్యమైన ఈ పరిణామం ఉత్కంఠను పెంచుతుంది. క్యాల్విన్‌కి నిజం తెలిసిపోయింది. ఇప్పుడేం చేయబోతున్నాడు?

“ఇది బెన్ అనే బానిస పుర్రె. మా నాన్నకి, తాతకి చచ్చేదాకా సేవ చేశాడు” అంటాడు క్యాల్విన్. “నాకు అర్థం కానీ విషయం ఏమిటంటే ఈ బానిసలు మాలాంటి వారిని చంపి ఎందుకు పారిపోరు? ఎందుకంటే నల్లజాతి వారికి సమర్పణకి సంబంధించిన మెదడు భాగం పెద్దదిగా ఉంటుంది. బానిసత్వం వారి స్వభావం.”

క్యాల్విన్ ఆ పుర్రె వెనక భాగాన్ని చిన్న రంపంతో కోసి ఒక ముక్క తీసి లోపలి భాగం చూపించి జాంగోతో “ఇక్కడ మూడు సొట్టలున్నాయి. న్యూటన్ లాంటి వారి పుర్రెలో ఈ సొట్టలు సృజనాత్మకతకు సంబంధించిన భాగంలో ఉంటాయి. కానీ ఇక్కడ సమర్పణకి సంబంధించిన భాగంలో ఉన్నాయి. నువ్వు తెలివైనవాడివని ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నీ బుర్ర పగలగొట్టి చూస్తే ఇదే చోట నీ పుర్రెలోనూ సొట్టలుంటాయి” అంటాడు. బానిసలు అవ్వటం వారికి అనివార్యమని అతను ఎంత నమ్మాడో స్పష్టమౌతుంది. మరి వారిని హింసించటానికి ఏం హక్కు ఉంది? దానికి సమాధానం ఉండదు. నిమ్నజాతి వారు అని పేరు పెట్టి దాష్టీకం చేయటమే అతని నైజం. అరకొర ఆధారాలతో, అశాస్త్రీయ పద్ధతులలో వైజ్ఞానికులు చేసే ప్రతిపాదనలు కొందరు తమ ప్రయోజనాలకు వాడుకుంటారు. విజ్ఞానం, రాజకీయం వేరుగా ఉండకపోతే పరిణామాలు ఇలాగే ఉంటాయి. ట్యారెంటీనో ఎంత పరిశోధన చేసి ఈ సన్నివేశం రాశాడో అని అబ్బురం కలుగుతుంది.

అకస్మాత్తుగా క్యాల్విన్ సహచరులు లోపలికి వచ్చి షుల్ట్జ్ మీద, జాంగో మీద తుపాకీలు గురిపెడతారు. నన్ను మోసం చేయాలని చూస్తారా అని క్యాల్విన్ ఆవేశంతో రగిలిపోతుంటాడు. వారిని కదిల్తే కాల్చేస్తానని అంటాడు. జాంగో భార్యని రప్పించి “పన్నెండు వేలు ఇచ్చి ఈమెని తీసుకు వెళ్ళవచ్చు. కాదంటే ఈమె బుర్ర పగలగొట్టేస్తాను” అని ఆమె తల మీద కొట్టటానికి సుత్తి ఎత్తుతాడు. షుల్ట్జ్ “నా పర్సు బయటకి తీయనివ్వండి” అని తన పర్సు తీసి క్యాల్విన్ వైపు టేబుల్ మీద పడేస్తాడు. స్టీఫెన్ పర్సులో నుంచి పన్నెండు వేలు తీసుకుంటాడు. “సోల్డ్!” అని అరిచి జాంగో భార్యని వదిలేస్తాడు క్యాల్విన్.

తర్వాత క్యాల్విన్ ఇంటిలోని లైబ్రరీలో అమ్మకానికి సంబంధించిన రాతకోతలు జరుగుతాయి. “ఒక బానిసకి ‘ద త్రీ మస్కెటియర్స్’ అనే నవలలోని దార్తాన్యాన్ అనే పాత్ర పేరు పెట్టావుగా. ఆ నవలంటే నీకిష్టమనుకుంటా. మనుషులని కుక్కలకి ఆహారంగా వేయటాన్ని ఆ నవల రచయిత ద్యూమా హర్షిస్తాడంటావా” అంటాడు క్యాలిన్‌తో షుల్ట్జ్.

“గుండె నిబ్బరం లేని అలాంటి ఫ్రెంచ్ వాళ్ళ అభిప్రాయం ఎవడిక్కావాలి” అంటాడు క్యాల్విన్.

“నిజానికి ద్యూమా నల్లజాతి వాడు” అంటాడు షుల్ట్జ్. అవాక్కవటం క్యాల్విన్ వంతవుతుంది. నల్లజాతి వాళ్ళందరినీ ఒకే గాటన కట్టేసి వారు చాకిరీకి తప్ప దేనికీ పనికిరారు అనే వాడికి తనకి ఇష్టమైన నవల రాసింది ఒక నల్లజాతి వాడని తెలుస్తుంది. సృజనాత్మకత ఏ ఒక్కరి సొత్తూ కాదు. పుట్టుకని బట్టి ఎవరి ప్రతిభనీ నిర్ణయించలేం. అప్పటి రాజకీయ వాతావరణం ఎలాంటిదో, తమకు అనుకూలంగా ఉన్నవాటిని మాత్రమే నాయకులు ఎలా ప్రచారం చేసుకున్నారో మనకి ఈ సన్నివేశంలో అర్థమౌతుంది. ట్యారెంటీనోని అభినందించకుండా ఉండలేం. స్టీఫెన్ పాత్ర ఒక వింత పాత్ర. తన జాతి వారికే శత్రువుగా మారతాడు. క్యాల్విన్ మీద మమకారం అతన్ని అంధుణ్ని చేస్తుంది. చిత్రంలో తర్వాత ఏం జరుగుతుందో ఊహించవచ్చు కానీ ఎలా జరుగుతుందో చూస్తే ఆ మజాయే వేరు.

క్యాల్విన్‌గా లియొనార్డో డికాప్రియో, షుల్ట్జ్‌గా క్రిస్టాఫ్ వాల్ట్జ్, స్టీఫెన్‌గా శామ్యూల్ జాక్సన్ నటించారు. ‘ఇన్‌గ్లోరియస్ బాస్టెర్డ్స్’కి ఆస్కార్ అందుకున్న క్రిస్టాఫ్ ఈ చిత్రానికి మళ్ళీ ఆస్కార్ అందుకున్నాడు. ట్యారెంటీనో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఆస్కార్ అందుకున్నాడు. ఈ అవార్డు అందుకోవటం అతనికిది రెండో సారి. మొదటిది ‘పల్ప్ ఫిక్షన్’ చిత్రానికి అందుకున్నాడు.

‘ఒన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’ గురించి చెప్పుకునే ముందు కాస్త నేపథ్యం చెప్పుకోవాలి. 1960 లలో సమాజాన్ని ధిక్కరించే ఒక సమూహం తాము పెట్టుబడిదారీ విధానం లేని సమాజం సృష్టిస్తామని వింత పోకడలు పోయారు. విచ్చలవిడి శృంగారం, దారీ తెన్నూ లేకుండా జీవితం గడపటం వారికి అలవాటు. వీరినే హిప్పీలనే వారు. వీరిలో కొందరు లాస్ ఏంజిల్స్‌లో గర్భవతి అయిన ఒక నటిని దారుణంగా చంపారు. ఆ కథని మార్చి తీసిన చిత్రం ‘ఒన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’.

క్లిఫ్ బూత్ హాలీవుడ్‌లో స్టంట్ మ్యాన్‌గా పనిచేస్తుంటాడు. అప్పట్లో కౌబాయ్ చిత్రాలు ఎక్కువ వచ్చేవి. వాటి చిత్రీకరణకి అశ్వశాలలున్న తమ స్థలాలను అద్దెకు ఇచ్చేవారు కొంతమంది. అక్కడ ఒక ఊరి సెట్టు వేసి షూటింగులు చేసేవారు. ఆ స్థలాలలో ఒకటి హిప్పీలకు కేంద్రంగా మారుతుంది. ఒకరోజు క్లిఫ్ అక్కడికి వెళ్ళే ఒక అమ్మాయికి తన కార్లో లిఫ్ట్ ఇస్తాడు. ఆ అమ్మాయి కూడా హిప్పీయే. ఆమె వెళ్ళే చోట ఒకప్పుడు షూటింగులు చేశాడు క్లిఫ్. అతనికి ఆ స్థలం యజమాని జార్జ్ తెలుసు. ఓసారి అతన్ని పలకరించవచ్చని ఈ అమ్మాయితో కలిసి వెళతాడు. ఈ సన్నివేశం ఉద్దేశ్యం హిప్పీల జీవనశైలిని చూపించటమే. దీన్ని కూడా ఉత్కంఠభరితంగా చూపిస్తాడు ట్యరెంటీనో.

జార్జ్‌కి చెందిన స్థలానికి రాగానే దూరంగా జార్జ్ ఉండే ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లో కొంతమంది టీవీ చూస్తూ ఉంటారు. బయట కారు శబ్దం విని ఒక అమ్మాయి గుమ్మం దగ్గరకు వచ్చి మెష్ తలుపులో నుంచి చూస్తుంది. “మన ఫ్రెండ్ ఎవరినో తీసుకొచ్చింది” అంటుంది. అటు వైపు తిరిగి కూర్చుని టీవీ చూస్తున్న ఒక యువతి “వాడు ఇక్కడికి వస్తే నాకు చెప్పు” అంటుంది. ఆ యువతికి అక్కడి వాళ్ళు పెట్టిన పేరు స్క్వీకీ.

ఆ స్థలంలో చిన్న చిన్న ఇళ్ళలో ఎంతో మంది నివసిస్తూ ఉంటారు. ఒక గర్భవతి కూడా ఉంటుంది. వారిలో కొంతమంది చుట్టుపక్కల ఉన్న కొండలలోకి గుర్రాల మీద పర్యాటకులని తీసుకువెళ్ళి డబ్బులు సంపాదిస్తుంటారు. సిటీ వారికి గుర్రాల మీద తిరగటం సరదా కదా. అక్కడ ఉన్న అమ్మాయిలలో కొందరు క్లిఫ్‌ని పలకరిస్తారు.

“నేను జార్జ్ ని పలకరించి వస్తాను” అంటాడు క్లిఫ్.

“ఇది జార్జ్ పడుకునే సమయం” అంటుంది ఒకామె.

“లేచాడేమో చూసి వస్తాను” అని ఇంటి వైపు నడుస్తాడు.

తలుపు దగ్గర ఉన్న అమ్మాయి “వాడు ఇటు వైపు వస్తున్నాడు” అంటుంది.

స్క్వీకీ “అందరూ బయటికి పొండి” అంటుంది. అందరూ బయటికి వెళతారు. క్లిఫ్ వారికి ఎదురుపడతాడు. వింతగా చూస్తూ వెళతారు వాళ్ళు. ఇదంతా చూస్తుంటే అసలు జార్జ్ బతికి ఉన్నాడా అని అనుమానం వస్తుంది మనకి. ఉత్కంఠ పెరుగుతుంది.

క్లిఫ్ మెట్లెక్కి తలుపు దగ్గరకు వస్తాడు. మెష్ తలుపు అవతల స్క్వీకీ నిలబడి ఉంటుంది. “ఏం కావాలి?” అంటుంది గంభీరంగా.

“జార్జ్‌ని కలవాలి” అంటాడు క్లిఫ్.

“జార్జ్ పడుకున్నాడు. కలవటం కుదరదు.”

“అయ్యో.”

“జార్జ్ నీకెలా తెలుసు?”

“ఇక్కడ షూటింగులు చేసేవాళ్ళం.”

“జార్జ్‌ని కలిసి ఎన్నాళయింది?”

“ఎనిమిదేళ్ళు.”

“చాలా గాఢమైన స్నేహం!” అంటుంది స్క్వీకీ మొహంలో ఏ భావమూ లేకుండా. ఎనిమిదేళ్ళకు ఓసారి కలిసే స్నేహమూ ఓ స్నేహమేనా అనే వెటకారం క్లిఫ్‌కి అర్థమౌతుంది.

“చాలా దూరం నుంచి వచ్చాను. ఓసారి పలకరించి వెళతాను. మళ్ళీ ఇటువైపు ఎప్పుడొస్తానో తెలియదు” అంటాడు క్లిఫ్.

“అది సాధ్యం కాదు.”

“ఎందుకు సాధ్యం కాదు?”

“రాత్రికి జార్జ్‌తో కలిసి టీవీ చూడాలి. ఇప్పుడు నిద్రలేపితే రాత్రి మేలుకుని ఉండలేడు. అందుకే ఇప్పుడు పడుకోవాలి. అతనితో కలిసి టీవీ చూడటం నాకిష్టం.”

“నువ్వు వద్దన్నా నేను లోపలికొస్తాను. జార్జ్ ఎలా ఉన్నాడో నా కళ్ళతో నేను చూడాలి. నువ్వు నన్ను ఆపలేవు” అంటాడు క్లిఫ్.

“నీ ఇష్టం” అని గడియ తీసి లోపలికి వెళ్ళిపోతుంది స్క్వీకీ.

వెనక్కి తిరిగి చూస్తాడు క్లిఫ్. కొంతమంది నిలబడి అతన్నే చూస్తూ ఉంటారు. లోపలికి నడుస్తాడు క్లిఫ్. సస్పెన్స్ సినిమాలోలా సంగీతం వస్తుంది. ఒక మనిషి ఇంకో మనిషిని పలకరించటానికి రావటం సాధారణమే. కానీ ఇక్కడి పరిస్థితులు అసాధారణం.

“ఓ ఎనిమిదేళ్ళ క్రితం నేస్తమా! జార్జ్ గుడ్డివాడైపోయాడు. నిన్ను గుర్తుపట్టడేమో. చూసుకో” అంటుంది స్క్వీకీ.

క్లిఫ్ జార్జ్ గదిలోకి వెళతాడు. జార్జ్ ముసలివాడు. అటు తిరిగి పడుకుని ఉంటాడు. క్లిఫ్ అతన్ని లేపుతాడు. అతను క్లిఫ్ ని గుర్తు పట్టలేక అయోమయపడతాడు.

“బావున్నారా?” అంటాడు క్లిఫ్.

“ఏమంత గొప్పగా లేను” అంటాడు జార్జ్. మనకు ఏమైందో అని ఆసక్తి కలుగుతుంది.

“ఏమైనా సమస్యా?”

“కళ్ళు పోయాయి. అది సమస్యో కాదో నువ్వే చెప్పు!” అని విసుక్కుంటాడు జార్జ్.

“ఆ విషయం విన్నాను. సారీ.”

“స్క్వీకీ నన్ను పడుకోమంది” అంటాడు జార్జ్.

“స్క్వీకీ అంటే ఆ రాగి జుట్టున్న అమ్మాయేనా?”

“ఇప్పుడే కదా కళ్ళు పోయాయని చెప్పాను. నాతో ఉండే అమ్మయి జుట్టు ఏ రంగో నాకెలా తెలుస్తుంది” మళ్ళే విసుక్కుంటాడు జార్జ్.

“నిజమే.”

ఇంతలో జార్జ్ “నువ్వెవరో నాకు తెలియదు. కానీ నన్ను పలకరించటానికి వచ్చావు. చాలా సంతోషం. నేను ఇంకాసేపు పడుకుంటాను. రాత్రికి టీవీ చూడాలి. అప్పుడు పడుకుంటే స్క్వీకీకి కోపం వస్తుంది.”

“కోపం వస్తే ఏం చేస్తుంది?” మన చెవులు నిక్కబొడుచుకుంటాయి.

“ఏం లేదు. ఆమెని నిరాశపరచటం నాకిష్టం లేదంతే” అంటాడు జార్జ్. స్క్వీకీ లాంటి యువతి తనకు దొరకటమే భాగ్యమని అతని భావం. ఎంతవారలైనా కాంతదాసులే.

“ఈ హిప్పీలందరూ ఇక్కడ ఉండటానికి మీరు అనుమతిచ్చారా?”

జార్జ్‌కి మళ్ళే కోపమొస్తుంది. “ఇవన్నీ అడగటానికి నువ్వెవరు?”

“వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో అని అడుగుతున్నాను.”

“ఎవరు స్క్వీకీనా? ఆమెకి నేనంటే ఎంతో ప్రేమ. నీకలాంటి అమ్మాయి ఎప్పుడైనా పడిందా?” అని మంచం మీద వాలిపోతాడు జార్జ్. క్లిఫ్‌కి అసూయ అని అతని భ్రమ. స్క్వీకీ ఎంత తెలివిగా అతని బలహీనతల్ని వాడుకుందో మనకి అర్థమౌతుంది. ఆమె లాంటి వాళ్ళు ఆ స్థలంలో ఇష్టానుసారం ఉంటున్నారు. జార్జ్‌కి చూపు పోవటంతో ఆమె మీదే ఆధారపడ్డాడు. ముందు ముందు జరిగేది మనం ఊహించవచ్చు. ముసలాయన చచ్చేలోపే స్థలం రాయించుకుంటుంది. ఆ తర్వాత ఆమెదే రాజ్యం.

క్లిఫ్ నిట్టూర్చి “ఆరోగ్యం జాగ్రత్త” అని బయటికి వస్తాడు. అంతకన్నా ఏం చేయగలడు? మంచి మనసుతో వచ్చిన అతను ఏమీ చేయలేక వెళ్ళిపోతాడు. చివరికి అతను ఆ హిప్పీలకి బుద్ధి చెప్పే సమయం వస్తుంది. అప్పుడు తగిన శాస్తి జరిగింది అని మనకు అనిపిస్తుంది. అలా అనిపించటానికి కారణం వారు ఎంత స్వార్థపరులో మనకు అప్పటికే ట్యారెంటీనో చూపించటమే. కానీ నిజజీవితంలో అలా జరగలేదు. ఎందుకంటే క్లిఫ్ ఒక కల్పిత పాత్ర మాత్రమే! క్లిఫ్‌గా నటించిన బ్రాడ్ పిట్‌కి ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ వచ్చింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే నామినేషన్లు కూడా వచ్చాయి.

మంచి చెడుల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో కేవలం పోరాటాలలోనే కాక సంభాషణల్లో చూడాలనుకునేవారు ఈ చిత్రాలు తప్పకుండా చూడాలి. అయితే ఇవి పెద్దలకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఈ చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here