సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-13

4
3

ముఝ్ పె ఇల్జామ్ – ఎ- బేవఫాయీ హై

ఐ మెహబ్బత్ తేరీ దుహాయీ హై

[dropcap]’యా[/dropcap]స్మిన్’ సినిమాలో జాన్ నిసార్ అఖ్తర్ రచించగా లతా మంగేష్కర్ అత్యంత విషాదం ఉప్పతిల్లే రీతిలో పాడిన ఈ పాటకు సంగీత దర్శకత్వం వహించింది సి. రామచంద్రగా ప్రసిద్ధి పొందిన చితల్కర్ రామచంద్ర.

‘యాస్మిన్’ సినిమాలో నాయికను నాయకుడు అపార్థం చేసుకుంటాడు. ఆమె చేయని నేరం ఆమెపై మోపుతాడు. ఆమెను శిక్షిస్తాడు. దూరమవుతాడు. ఆ సందర్భంలో నాయిక తనపై మోపిన ఆరోపణను ఖండిస్తూ, తనపై అన్యాయంగా నేరం మోపారని, ప్రేమకు ఫిర్యాదు చేస్తూ పాడే పాట ఇది. ‘బేవఫా’ అంటే మోసగత్తె, అవిశ్వాసనీయురాలు. తనపై ప్రేమించి మోసం చేసిన నేరం మోపేరని,  ప్రేమకు మొరపెట్టుకుంది నాయిక. పలు సందర్భాలలో పలు విషయాలలో లతపై పలువురు నేరాలు మోపారు. ఆమెని దోషిగా ఎలాంటి విచారణ లేకుండా నిర్ణయించారు. మీడియాలో పలు చర్చలు జరిగాయి. జర్నలిస్టులు  పలు రాతలు రాశారు. పలువురు పలు రకాల విమర్శలు చేశారు. వాటన్నింటికీ లత సమాధానం మౌనమే!

లత మౌనంగా ఉండటంతో ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానించారు. తాము తమ కళ్ళతో చూసినట్టు, ప్రతిదానికీ తాము ప్రత్యక్ష సాక్షులయినట్టు, ఊహాగానాలను, సత్యమనే రంగులద్ది ప్రచారం చేశారు. అలాంటి వాటిల్లో సి. రామచంద్రతో లత ప్రేమ వ్యవహారం అగ్రస్థానం వహిస్తుంది.

హుస్న్‌లాల్ భగత్ రాం లతో లత , ఇతర గాయనిలు

లత సినీరంగంలో ప్రవేశించినప్పటి నుంచీ ఒక పద్దతి ప్రకారం తన చుట్టూ గిరి గీసుకుంది. ఆ పరిధి దాటి ఎవ్వరినీ లోపలకు రానివ్వలేదు. అతిక్రమణ చేయాలని ప్రయత్నించిన వారిని నిర్దాక్షిణ్యంగా తన జీవితం నుంచి వెడలనడిపింది. ‘ఆయెగా ఆనేవాలా’ గేయ రచయితకు పెన్ను ఇచ్చినందుకు ఆయన రకరకాల గాధలను ప్రచారంలోకి తెచ్చాడు. ఆయనను దూరం పెట్టింది. హుస్న్‌లాల్ భగత్ రామ్ సంగీత దర్శక ద్వయంలో లత హుస్న్‌రామ్ ఇంటికి వెళ్ళి పాటలు పాడటం నేర్చుకునేది. ఇది అతని భార్యకు అనుమానం కలిగించింది. లత పట్ల హుస్న్‌లాల్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను ఆమె నిరసించింది. ఫలితంగా లత పాటలను తాను కాక భగత్‌రామ్‍తో రికార్డు చేయించటం ఆరంభించాడు హుస్న్‌లాల్. లత కాక ఇతర గాయనిలతో పాడించటం ఆరంభించాడు. ఇది లతకు అవమానంగా తోచింది. అతని ఈ ప్రవర్తన ఆమె వ్యక్తిత్వాన్ని శంకించినట్టయింది. అందుకని ఆమె నెమ్మదిగా హుస్న్‌లాల్ భగత్‌రామ్‍ల పాటలు పాడటం తగ్గించింది. అప్పటికే హుస్న్‌లాల్ భగత్‌రామ్‍ల అసిస్టెంట్లు శంకర్ జైకిషన్‍లు సినీ సంగీత ప్రపంచ వినీలాకాశంలో ఉజ్జ్వల తారల్లా మెరుస్తూండటంతో,  హుస్న్‌లాల్ భగత్‌రామ్‍లు వెనుకబడ్డారు. దీనికి తోడు లత పాడననటం కూడా వారి కెరీర్‍ను దెబ్బతీసింది. కానీ ప్రచారం మాత్రం లత, హుస్న్‌లాల్‍ల నడుమ వ్యవహారం నడిచిందని,  సి. రామచంద్రతో లత సాన్నిహిత్యం హుస్న్‌లాల్‍తో సాన్నిహిత్యాన్ని  దెబ్బతీసిందని వ్యాఖ్యానిస్తారు. హుస్న్‌లాల్‍తో లత వ్యవహారం ఊహాగానం తప్ప మరొకటి కాదు. హుస్న్‌లాల్ ఏప్రిల్ 1920లో జన్మించాడు. లత సినీరంగంలో ప్రవేశించే నాటికే అతను చక్కటి పేరు సంపాదించాడు సంగీత దర్శకుడిగా. ఇతర అనేక సంగీత దర్శకులలాగా లత స్వరాన్ని మెచ్చాడు. చక్కటి పాటలు పాడించాడు. లత పట్ల నౌషాద్, అనిల్ బిశ్వాస్, ఖేమ్‌చంద్ ప్రకాశ్ వంటి అనేక సంగీత దర్శకులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. హుస్న్‌లాల్ కూడా అంతే.

సినీ ప్రపంచం చాలా క్రూరమైనది. కళాకారులకు అంతసులభంగా  అవకాశాలు ఇవ్వరు. ఎవరైనా అవకాశాలు అంది పుచ్చుకుంటుంటే దెబ్బ తీయాలని చూస్తుంది. పైకి వస్తూంటే క్రిందకు లాగాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా పలు రకాల వదంతులను సృష్టిస్తుంది. వివాదాలను సృష్టిస్తుంది. ఇలా సృష్టించే వదంతులలో ఒక కళాకారుడు ఏదో ఓ జట్టుకు చెందిన వాడన్న ప్రచారం ఒక భాగం. అందువల్ల ఆ జట్టు వ్యతిరేక జట్టు ఈ కళాకారుడిని దూరం పెడుతుంది. ఇది కళాకారుడి ఎదుగుదలను దెబ్బ తీస్తుంది.

మహమ్మద్ రఫీ సినిమాల్లో అడుగుపెట్టిన కొన్ని రోజులలోనే అతడు నౌషాద్ క్యాంపుకు చెందిన వాడన్న వార్త సినీ పరిశ్రమలో ప్రచారమయింది. నౌషాద్ అంటే అనిల్ బిశ్వాస్‍కి పడదు. సి. రామచంద్ర కయితే నౌషాద్ అంటే అస్సలు నచ్చదు. సజ్జాద్ హుస్సేన్ వంటి వారు నౌషాద్ పేరు చెప్తేనే మండిపడతారు. ఇతర అనేక సంగీత దర్శకులకు నౌషాద్‍తో పోటీ, ద్వేషం. దాంతో రఫీ, నౌషాద్ క్యాంపుకు చెందిన వాడని ప్రచారం కాగానే అనిల్ బిశ్వాస్, సి. రామచంద్రలు రఫీ గాన సంవిధానం పట్ల అసంతృప్తి వ్యక్తపరిచారు. వీరిద్దరూ రఫీతో అయిష్టంగా అతి తక్కువ పాటలు పాడించారు. సి. రామచంద్ర తన సినిమాల్లో తానే ‘చితల్కర్’ పేరుతో పాడేవాడు. లేకపోతే తలత్ మహమూద్‍తో పాడించాడు. అనిల్ బిశ్వాస్‍కూ ముకేష్, తలత్ మహమూద్‍లు ఫేవరేట్లు. వీరికి రఫీ నచ్చకపోవటానికి ఉన్న అనేక కారణాల్లో నౌషాద్ రఫీకి మద్దతుగా నిలబడ్డాడన్నది ఒక కారణం.

1960 దశాబ్దంలో ఓ.పి.నయ్యర్‍కూ , శంకర్ జైకిషన్‍కూ పోటీ ఉండేది. శంకర్ జైకిష‍న్‌లకు రఫీ పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్లవుతున్నాయి. శంకర్ జైకిషన్ పాట రికార్డు చేసి తన రికార్డింగ్‍కు ఆలస్యంగా వచ్చాడని, ఇకపై రఫీతో తాను పాటలు పాడించనని ఓ.పి.నయ్యర్ శపథం పట్టాడు. సినీ పరిశ్రమలో ఇలాంటి ద్వేషాలు, పోటీలు, అపోహలు సర్వసాధారణం.

హుస్న్‌లాల్ భగత్‍రామ్‍లు 1949 ప్రాంతాలలో అగ్రశేణి సంగీత దర్శకులుగా గుర్తింపు పొందారు. వారు పంజాబీ సంగీత దర్శకులు. కాబట్టి అప్పుడప్పుడే సినీ ప్రపంచంపై ముద్ర వేస్తున్న లతా మంగేష్కర్‍ను దెబ్బతీసేందుకు లత పై పంజాబీ సంగీత దర్శకుల క్యాంపుకు చెందిన దానిగా ముద్ర వేస్తే ఇతరులు ఆమెను వాడటం తగ్గుతుందన్న ఆశతో ప్రచారానికి వచ్చిన ప్రేమగాథ ఇది. ఇంతగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, ప్రతి విషయం గురించి నెట్‌లో దొరికే కాలంలోనే పెద్ద పెద్ద పత్రికలు ఊహలను నిజాలుగా ప్రకటించటం చూస్తున్నాం. అలాంటిది, ఆ కాలంలో ఒక ఊహను నిజంగా నమ్మించటం పెద్ద కష్టం కాదు. పైగా పత్రికలపై అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేకపోవటంతో ఒక్కసారి ఒక విషయం ప్రచురితమైతే దాన్ని సత్యంగా నమ్మి తరువాత తరాలు అనుసరించటంతో అది సత్యమై స్థిరపడటంలో ఆశ్చర్యం లేదు.

కానీ హుస్న్‌లాల్ విషయంలో జరిగిన ప్రచారం లత కెరీర్‌పై పెద్దగా ప్రభావం చూపించలేదు. ఎందుకంటే అప్పటికే సంగీత దర్శకులు అధిక సంఖ్యలో లత స్వరంపై ఆధారపడ్డారు. నాయికలు అగ్రిమెంట్లలో తమకు లతనే పాడాలన్న నియమాన్ని విధిస్తున్నారు. శంకర్ జైకిషన్‍లు తమ ప్రతి సినిమాలో లతతోనే పాడిస్తున్నారు. సి. రామచంద్ర తాను సంగీత దర్శకత్వం వహించే సినిమాల్లో లతనే పాడాలన్న షరతు విధిస్తున్నాడు. నౌషాద్, అనిల్ బిశ్వాస్, ఎస్.డి. బర్మన్ వంటి వారు పరిధులు లేని లత స్వరం ఆధారంగా తమ సృజనను విశృంఖల విహారం చేయిస్తున్నారు. దాంతో హుస్న్‌లాల్ వ్యవహారం ఏమీ తోచని జర్నలిస్టులకు, సర్వం తెలిసినట్టు మాట్లాడే వదరుబోతులకు,  లత గురించి చులకనగా మాట్లాడే ఓ అంశంలా మిగిలింది. ఇంకా ఊహాశాలురు సి. రామచంద్రతో సాన్నిహిత్యం హుస్న్‌లాల్‍కు దూరమవటానికి కారణం అని ఊహిస్తారు. కానీ లత స్వయంగా హుస్న్‌లాల్ భగత్‌రామ్‍లకు దూరమయిందన్న విషయం ప్రకటించరు.

సి. రామచంద్ర లత స్వరంతో అత్యద్భుతాలు సృష్టించాడు. 1951 – 55 ల నడుమ సి. రామచంద్ర లతతో పాడించిన ప్రతి పాట బంగారం. అందుకే సినీ సంగీత ప్రపంచంలో స్వర్ణయుగం నిలపటంలో సి. రామచంద్ర ప్రధాన పాత్ర పోషించాడంటారు. లత కోసం సి. రామచంద్ర తన హృదయంతో పాటలను రూపొందించాడు. యుగళగీతాలు అత్యుత్సాహంగా పాడేడు.

భగవాన్, సీ రామచంద్ర

1951లో సి. రామచంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఏడు సినిమాలు విడుదలయ్యాయి. అల్బేలా, సగాయి, సంగ్రామ్, ఖజానా, ఉస్తాద్ షెద్రో, షబిస్తాన్ వంటి సినిమాలు ఈనాటికీ పాటల వల్లనే గుర్తున్నాయి. ముఖ్యంగా ‘అల్బేలా’ సినిమాలో పాటలు ఈనాటికీ అత్యంత ప్రియమైనవి. నటుడు భగవాన్‌కు,  సి. రామచంద్రకూ చక్కని దోస్తీ. 1941లోనే భగవాన్ తమిళంలో నిర్మించిన సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు సి. రామచంద్ర. భగవాన్ ‘అల్బేలా’ నిర్మిస్తున్నప్పుడు సంగీత దర్శకత్వ బాధ్యతలు సి. రామచంద్రకే అప్పగించాడు. సి. రామచంద్ర అప్పటికే లత స్వరం తాను సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అధిరోహించటంలో తోడ్పడుతుందని నమ్మేడు. అన్నిపాటలు లతతోనే పాడించాలన్న నియమం విధించాడు. భగవాన్ ఒప్పుకున్నాడు. ఫలితంగా ఒకదాన్ని మించి మరొకటిగా పాటలు రూపొందాయి. ‘షామ్ ఢలే, ఖిడ్కి తలే’ , ‘భోలే సూరత్ దిల్‍కే ఖోటే’ , ‘షోలా జో భడ్ కే’,,  ‘మెహఫిల్ మే మేరే’,,  ‘మెరె దిల్ కి ఘడీ’,,  ‘బల్ మా బడా నాదాన్ హై’, ‘దీవానా యే పర్వానా’, ‘దిల్ ధడ్కే’ వంటి సూపర్ డూపర్ హిట్ పాటలతో పాటు ఎన్నటికీ మరపురాని మధురగీతం ‘ధీరేసే – అజారే అఖియన్ మే’ పాట కూడా ‘అల్బేలా ‘ లోదే. ‘ధీరేసే ఆజా’ పాటలో లత స్వరం పలికే విభిన్నమైన భావాలను అత్యద్భుతంగా ప్రస్ఫుటమయ్యే రీతిలో బాణీ సృజించాడు. సి. రామచంద్ర.

లతా మంగేష్కర్‍తో పాటలు పాడించటం వల్ల సి. రామచంద్ర సంగీత రచన సంవిధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. 1949‌-50 వరకు అత్యధికంగా పాశ్చాత్య బాణీలకు, శాస్త్రీయ రాగాలకు ముడిపెడుతూ వచ్చాడు సి. రామచంద్ర. లత స్వరం పలికే విభిన్న భావాలను ప్రస్ఫుటం చేయటం కోసం, ఆమె స్వరం  పోయే పలు అద్భుతమైన పోకడలను ప్రదర్శించేందుకు సి. రామచంద్ర నెమ్మదిగా పాశ్చాత్య బాణీలపై ఆధారపడటం తగ్గించి శాస్త్రీయ రాగాలపై ఆధారపడిన బాణీలను సృజించటంపై దృష్టి పెట్టాడు. లతతో ‘గోరే గోరే ఓ బాన్ కే చోరే’ పాటను పాడించిన సి. రామచంద్ర, లతతో ‘బల్ మా బడా నా దాన్ హై’ (అల్బేలా), ‘తుమ్ క్యా జానో తుమ్హారి యాద్ మే (షిన్ షినాకి బబ్లా బూ), దిల్ సే భులాదో తుమ్ హమే (పతంగ), కట్‌తే  హై దుఃఖ్ మే యే దిన్/ (పర్ఛాయీ), ఏయ్ ప్యార్ తేరీ దునియాసే హమ్/( ఝాంఝర్), ‘రాధా నా బోలే  నా బోలే’ (ఆజాద్), దేఖోజీ బహర్ ఆయీ (ఆజాద్), ‘మై జాగూ సారీరైన్, బల్‌మా  అనాడీ మన్ భాయే (బహురాణి), యె జిందగీ ఉసీకి హై, మొహబ్బత్ ఐసి ధడ్‍కన్ హై, ఆజా అబ్‍తో ఆజా (అనార్కలి), కాన్హా బజాయే  బన్సూరీ, హే బ్రహ్మ హే విష్ణు (నాస్తిక్), ఓ నిర్దయీ ప్రీతమ్ (స్త్రీ), జబ్ దిల్ కో సతాయే  గమ్, ఓ చాంద్ జహా వో జాయె (శారదా) వంటి శాస్త్రీయ రాగాలపై ఆధారపడిన పరమాద్భుతమైన గీతాలు సృజించాడు సి. రామచంద్ర. సి. రామచంద్రను హిందీ సినీ ప్రపంచం, పాటలలో ‘రాక్ అండ్ రోల్’ ను పరిచయం చేసిన వాడిగా భావించినా, సి. రామచంద్రను ఈనాటికీ లతా మంగేష్కర్ కోసం ఆయన సృజించిన శాస్త్రీయ రాగ ఆధారిత పాటల ద్వారానే గుర్తుంచుకుంటుంది. సి. రామచంద్ర అనగానే అల్బేలా, అజాద్, అనార్కలి, పర్చాయియా, షిన్ షినాకి బబ్లా బూ వంటి సినిమా పేర్లు గుర్తుకువస్తాయి.

ముఖ్యంగా ‘అనార్కలి’ సినిమాను సి. రామచంద్ర సంగీత దర్శకత్వం వహించేందుకు దారితీసిన పరిస్థితులను గమనిస్తే, సి. రామచంద్ర సంగీత సృజనలో లత ఎంతగా భాగమైపోయిందో స్పష్టమవుతుంది. అనార్కలి, సినిమా నిర్మాత శశిధర్ ముఖర్జీ. లత మంగేష్కర్ స్వరం ‘బలహీనంగా ఉంది’ అని తిరస్కరించిన వాడీయన. గీతా స్వరానికి ప్రాధాన్యం ఇచ్చినవాడు. ఆయన అనార్కలి నిర్మిస్తూ, సి. రామచంద్రను సంగీత దర్శకత్వం వహించమన్నాడు. కానీ సి. రామచంద్ర అందుకు ఓ షరతు విధించాడు. పాటలన్నీ లత పాడాలని అన్నది ఆ షరతు. శశిధర్ ముఖర్జీ ఒప్పుకోలేదు. పాటలన్నీ గీతా దత్ పాడాలన్నాడు. సి. రామచంద్ర అందుకు ఒప్పుకోలేదు. సినిమా అవకాశం వదలుకున్నాడు కానీ లత లేకుండా సంగీత దర్శకత్వం వహించేందుకు ఇష్టపడలేదు.

సి. రామచంద్ర పక్కకి తప్పుకోవటంతో,  ఖేమ్‍చంద్ ప్రకాశ్ సోదరుడు వసంత్ ప్రకాశ్‌కు సంగీత దర్శకత్వ బాధ్యతలను అప్పచెప్పాడు శశిధర్ ముఖర్జీ. పాటలన్నీ గీతా దత్‍తో పాడించాలన్న నిబంధనకు ఒప్పుకున్నాడు వసంత ప్రకాశ్. గీతతో ‘ఆ జాన్-ఎ- వఫా’ అనే పాటను కూడా రికార్డు చేశాడు. కానీ అతని ఆరోగ్యం పాడవటంతో పక్కకు తప్పుకున్నాడు. దాంతో హేమంత్ కుమార్ సంగీత దర్శకుడిగా నియమితుడయ్యాడు. హేమంత్ కుమార్ రెండు పాటలు రూపొందించాడు. తరువాత ఆయన కూడా పక్కకు తప్పుకున్నాడు. అప్పుడు విధిలేక,  సి. రామచంద్ర  విధించిన అన్ని షరతులకూ ఒప్పుకుని సంగీత దర్శకత్వ బాధ్యతలను అప్పగించాల్సి వచ్చింది. అనార్కలి సినిమాలోని పన్నెండు పాటలలో తొమ్మిది పాటలు లత పాడింది. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ‘యే జిందగీ ఉస్‍కీ హై’ పాట ఈనాటికీ పాటల పోటీల్లో తప్పనిసరిగా పాడే పాట. అనార్కలిలోని ప్రతిపాట ఆణిముత్యం లాంటి పాట.

అనార్కలిలో ‘మొహబ్బత్ మే ఐసే కదమ్ జగ్ మగాయే, జమానే యే సమ్‍ఝె కే హమ్ పీకే ఆయె’ అనే పాట ఉంటుంది. మద్యం తాగిన మత్తులో నడి దర్బారులో తాగిన మత్తులో వెక్కిళ్ళతో పాడే పాట ఇది. ఈ పాట వింటూనే శశిధర్ ముఖర్జీకి కోపం వచ్చింది. “ఇంతటి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పాటతో నా సినిమా నాశనం చేశావ”ని సి. రామచంద్రను దూషించాడు. సి. రామచంద్ర బెదరలేదు. ‘లత మత్తు స్వరం విన్న ప్రజలు మైమరచిపోతారు’ అని విశ్వాసంతో ప్రకటించాడు. సినిమా మొదటిరోజు పాట ఆరంభంలో వెక్కిళ్ళు రాగానే హాలు నిశ్శబ్దమైపోయింది. లతా మంగేష్కర్ ఇలాంటి పాట పాడటం ఏమిటన్న ఆశ్చర్యం ఒకవైపు, నాయిక మత్తులో పాడటం, శాస్త్రీయ సంగీత ఆధారిత పాటలో వెక్కిళ్ళు లయబద్దంగా రావటం ఇంకోవైపు అందరినీ ఆశ్చర్యాంబుధిలో ముంచేసింది. పాట ప్రజలకు ఎంతగా నచ్చిందంటే, తెల్లరేలోగా ఈ పాట సంచలనం సృష్టించింది. బీనారాయ్ మత్తు కళ్ళు లత మంగేష్కర్ మత్తు స్వరం కలగలసి పాట సూపర్ హిట్ అయింది. కలిసొచ్చే కాలమొస్తే వెక్కిళ్ళుకూడా పాటకు అలంకారాలవుతాయని ఒక సంగీత దర్శకుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడీపాట హిట్ అవటంపై.  అనార్కలి సినిమాలోని 12 పాటలకు 12 సూపర్ హిట్ పాటలే. లత, సి. రామచంద్రల కలయికలో రూపొందించిన పరమాద్భుతమైన పాటలున్న సినిమాల జాబితాలో అనార్కలి, అల్బేలా, యాస్మిన్, ఆజాద్ సినిమాలు అగ్రస్థానం వహిస్తాయి.

‘మేరీ జాన్ అనా సండే కి సండే’ ‘గోరీ గోరీ’, ‘షోలాజోభడ్కే’ వంటి పాశాత్య పరమైన బాణీలను సృజించి సంచలనం సృష్టించిన సి. రామచంద్ర 1955-56 వచ్చేసరికి శాస్త్రీయ సంగీత ఆధారిత బాణీలతో, లత స్వరం ఆధారంగా శరీరంతో పాటు హృదయాన్ని స్పందింపచేసే మధురమైన అమరగీతాలు సృజించే స్థాయికి ఎదిగాడు. సంగీత దర్శకుడిగా ఉచ్ఛస్థాయికి చేరుకున్నాడు. అతడి సృజన తిరుగులేనిదిగా, విజయవంతమైంది. అత్యంత వేగంగా, అద్భుతమైన పాటలు సృజించేవాడిగా సి. రామచంద్ర పేరు మార్మొగిపోయింది.

అధికంగా సి. రామచంద్రకు పాటలను రాజేందర్ క్రిషన్ రచిస్తాడు. రాజేందర్ క్రిషన్ కూడా సి. రామచంద్రతో పనిచేసేందుకు ఇష్టపడతాడు. రాజేందర్ క్రిషన్‍కు తమిళం రావటంతో తమిళ నిర్మాతలు స్క్రిప్టు రచనకు, పాటల రచనకు రాజేందర్ క్రిషన్‍ను ఎంచుకునేవారు. సంగీత దర్శకుడిగా రాజేందర్ క్రిషన్ సి. రామచంద్ర పేరును సూచించేవాడు. అలా అనేక దక్షిణాది సినిమాలకు ఇద్దరూ కలసి పనిచేశారు. సి. రామచంద్ర సైతం తన బాణీలకు రాజేందర్  క్రిషన్ పాటలు రాసే విధానం సరిగ్గా సరిపోతుందని భావించాడు. కానీ వి. శాంతారామ్ సినిమా ‘సుబహ్ కా తారా’ సినిమాలో శాంతారాం పట్టుబట్టటం వల్ల ‘నూర్ లఖ్నవీ’తో పనిచేశాడు. ‘కర్దార్’ సినిమాలకు పని చేసినప్పుడు ‘జాన్ నిసార్ అఖ్తర్’తో పాటలు రాయించాడు. ‘నాస్తిక్’ సినిమాలో కవి ప్రదీప్‍తో పాటలు రాయించాడు. అనార్కలిలో రాజేందర్ క్రిషన్‍తో పాటుగా శైలేంద్ర, హస్రత్ జైపురిలతో పాటలు రాయించాడు. ఇది రాజేందర్ క్రిషన్‍కు ఆగ్రహం కలిగించింది. సి. రామచంద్రకు పాటలు రాయనని ప్రకటించాడు. 1956 తరువాత సి. రామచంద్ర, రాజేందర్ క్రిషన్ కలసి పని చేయలేదు.

సినీ ప్రపంచంలో ఇది సర్వ సాధారణం. సంగీత దర్శకుడు, గేయ రచయిత నడుమ చక్కని అనుబంధం ఉండటం చక్కని పాటలు రూపొందేందుకు దారితీస్తుంది. ఒక్కో సంగీత దర్శకుడికి వ్యక్తిగతంగా ఒకో రకమైన గేయ రచన సంవిధానం నచ్చుతుంది. నౌషాద్ ఆరంభంలో పలు గేయ రచయితలతో పనిచేశాడు. ఒక్కసారి షకీల్ బదాయూని పరిచయం అయిన తరువాత, షకీల్ మరణించే వరకూ షకీల్‍తోనే పాటలు రాయించాడు. షకీల్ రాసిన గీతాలకు, ఆయన రాయని గీతాలకూ నౌషాద్ బాణీలలో తేడా స్పష్టంగా తెలుస్తుంది. సంగీత దర్శకుడి బాణీలలో   లోపం లేకున్నా, గేయ రచయిత ప్రతిభలో ఎలాంటి లోపం లేకున్నా, అలవాటయిన వారితో పనిచేస్తే ఉండే సౌలభ్యం ఉండదు. అందుకే రాజేందర్ క్రిషన్ పాటలు రాయకున్నా  సి. రామచంద్ర బాణీలలో లోపం రాలేదు. కానీ అంతకు ముందు ప్రవాహంలా సులభంగా జాలువారే బాణీలు గంభీరంగా అనిపించాయి. ఇంతలో లతా మంగేష్కర్ సి. రామచంద్రతో కలిసి పనిచేయనంది!

స్వభావరీత్యా సి. రామచంద్ర ఆధిక్య భావనను ప్రదర్శిస్తాడు. అందరితో స్నేహంగా ఉన్నా, తాను అనుకున్నది అందరూ సమర్థించాలన్న పట్టుదల కలవాడు. తన ప్రతిభపై అపారమైన విశ్వాసం కలవాడు. ఎవరికీ తలవంచని వాడు. లతా మంగేష్కర్ కూడా దాదాపుగా ఇలాంటి స్వభావం కలది. ఆమె కూడా రాజీపడదు. తాను అనుకున్నది సాధిస్తుంది. తనపై ఎవరి అధికారాన్నీ ఒప్పుకోలేదు. తనకు సహాయం చేస్తున్నవారు, తనతో పాటలు పాడిస్తున్న వారందరూ తన స్వరాన్ని మెచ్చినవారే తప్ప వ్యక్తిగతంగా వారితో ఎలాంటి అనుబంధాన్ని లత నెలకొల్పుకోలేదు. కుటుంబాన్ని పైకి తేవటం ఆమె ప్రధాన లక్ష్యం, ప్రధాన బాధ్యత. దాన్నుంచి పక్కకు తప్పించే ఏ భావననూ లత ఆమోదించదు, ఆదరించదు. పైగా ఆమెకు తాను దీనానాథ్ మంగేష్కర్ తనయన్న భావన, అందుకని తాను ప్రత్యేకం అన్న భావన అధికంగా ఉంది. కాబట్టి ఎవరు తనపై అధికారం చెలాయించినా, చనువుగా ఉండాలని ప్రయత్నించినా లత ఆమోదించదు. వారి ఇష్టాలను తనపై రుద్దాలని ప్రయత్నిస్తే ఆ సంబంధాన్ని వదలుకుంటుంది తప్ప రాజీపడదు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం లతకు అలంకారాలు. అవి తప్ప మరో అలంకారం లేదామెకు. ఆమెకు అలంకారాలంటే ఇష్టం కూడా లేదు. దునియామే బస్ లాజ్ హీ నారీ క ధరం హై అన్నది అక్షరాలా నమ్ముతుంది లతా.

లతతో ఒకదాని వెంట మరొకటి సూపర్ హిట్ పాటలను సృజిస్తూ, ఉచ్చస్థానానికి ఎగబ్రాకుతున్న సి. రామచంద్ర లతను వివాహం చేసుకోవాలనుకున్నాడు. లతను తాను ప్రేమిస్తున్న విషయం పలువురికి బహిరంగం చేయటం ఆరంభించాడు. ఇతర సంగీత దర్శకుల పాటలు లత పాడుతుంటే అక్కడికి తానూ రావడం మొదలుపెట్టాడు. లతపై తనకు అధికారం ఉన్నట్టు ప్రవర్తించసాగాడు. ఇదీ నిజ జీవితంలో మనం గమనించవచ్చు. ఒక మహిళకు ఒక పురుషుడు సహాయం చేస్తాడు. ఒక రెండు సార్లు సహాయం చేయగానే, ఆమె పై తనకు హక్కున్నట్టు, ఆమె తనమాట తప్పకుండా వినాలన్నట్టు భావిస్తాడు. అధికారం చలాయిస్తాడు. అప్పుడే స్త్రీ స్పష్టంగా నిర్ణయించుకోవాల్సివుంటుంది, అతని అధికారానికి లొంగి సహాయం పొందటమా,లేక, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ అతని సహాయాన్ని కోల్పోవటమా, అన్నది. తన అధికారానికి లొంగని స్త్రీకి ఎలాంటి శరతులు, ఆశలు లేకుండా సహాయం చేసే సహృదయాన్ని పురుషులు చాలా తక్కువగా ప్రదర్శిస్తారు. పైగా, గతంలోని ఆమెతో తమ సాన్నిహిత్యాన్ని చిలువలుపలువలుగా చెప్పి ఆమె వ్యక్తిత్వంపై బురదచల్లుతారు అధికులు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సి రామచంద్ర లత స్వరంతో అద్భుతమైన గీతాలు రూపొందిస్తున్న సమయంలోనే శంకర్ జైకిషన్‍లు లత స్వరం ఆధారంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. లత తప్ప మరో గాయని వైపు చూడటం లేదు. సినిమాలో అన్ని పాటలూ లతతోనే పాడిస్తున్నారు. పూనమ్, పట్రాణి వంటి సినిమాలో పదికి పది పాటలు లతతోనే పాడించారు. పదీ సూపర్ హిట్ పాటలే. ఇంకా రాజ్ కపూర్ సినిమాల్లో,  అమియ చక్రవర్తి సినిమాల్లోనూ లతతోనే పాటలు పాడించారు. ఇతరులతో ఏదో ఒకటి, అరా పాటలు పాడించారు తప్ప శంకర్ జైకిషన్‍లు మొదటి పదేళ్ళలో అంటే 1949 నుండి 1959 నడుమ సృజించిన 350 పై పాటలలో దాదాపుగా 159 పాటలు లత పాడినవే,  అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఎంతగా శంకర్ జైకిషన్‍లు లతతో పాటలు పాడించారో! ఇదే సమయానికి నౌషాద్, హేమంత్ కుమార్, ఎస్.డి. బర్మన్, రోషన్, మదన్ మోహన్‍లు కూడా లతనే తమ ప్రధాన గాయనిగా నిర్ణయించుకుని, అవసరమైతే తప్ప మరో గాయని వైపు దృష్టి మరల్చలేదు. ఇలాంటి పరిస్థితులలో సి. రామచంద్ర తనకు లతపై హక్కు ఉన్నట్టుగానో ప్రవర్తించటం, అధికారం చలాయించటం లతకు ఆమోదించాల్సిన అవసరం లేదు. తన వ్యక్తిత్వాన్ని మసిబార్చేట్టు ప్రవర్తించేవారిని సహించాల్సిన అవసరమూ లేదు.  పైగా ఆమె దృష్టి ప్రేమ, వివాహం వంటి వాటిపై లేదు.

ఆశా భోస్లే వివాహం చేసుకుని వెళ్ళటం, ఆ వివాహం విఫలమవటం లత కుటుంబంలో అందరి మానసిక వ్యవస్థపై ప్రభావం చూపించింది. ఇంటికి దగ్గరలోనే ఉన్నా ఆశా భ్లోస్లేను లత మంగేష్కర్ కుటుంబంతో మాట్లాడనీయలేదు గణపతి రావ్ భోస్లే. వాళ్ళింటికి కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. డబ్బులు సంపాదించమని పాటలు పాడేందుకు తరిమేవాడు. ఇలాంటివి చూసిన తరువాత ప్రేమ అన్నా, పెళ్ళి అన్నా విముఖత రావటం సహజం. ఒకరి అధిక్యాన్ని సహించేందుకు మనసు ఆమోదించదు. పైగా లత పాడటం ఆరంభించిందే కుటుంబాన్ని ఒక దారికి తీసుకు వచ్చేందుకు. ఆ బాధ్యత నెరవేరక ముందే, తాను వివాహం చేసుకోవటం అన్నది బాధ్యతారాహిత్యం అవుతుంది. కాబట్టి కుటుంబం స్థిరపడిన తరువాతనే వివాహం అన్నది నిర్వివాదాంశం.

లతా మంగేష్కర్‍కు తండ్రితో సన్నిహితమైన అనుబంధం ఉంది. తాను పాటలు పాడటానికి కారణం తండ్రి అన్నది ఆమె ప్రగాఢ విశ్వాసం. ఒకోసారి పాటలు పాడుతున్నప్పుడు తన తండ్రి ‘లతా’ అని పిలిచినట్టు అనిపిస్తుందనీ, అలా అనిపించిన పాటలు సూపర్ హిట్ అవుతాయని హరీష్ భిమానీకి, యతీంద్ర మిశ్రలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో లత చెప్పింది. తన తండ్రికి సంబంధించిన గొలుసు ఎప్పుడూ ఆమె దగ్గరనే ఉంటుంది. ‘లత స్వరంలో బాబా (తండ్రి) పలుకుతాడు’ అని తమ్ముడు హృదయ్‌నాథ్ మంగేష్కర్ అంటాడు. ‘మాకు అమ్మ నాన్న అక్క సర్వం లతనే’ అని ఆమె చెలెళ్ళు ముక్తకంఠంతో స్పష్టం చేస్తారు. అంటే తండ్రి బాధ్యతను స్వయంగా స్వీకరించిన లత, తండ్రి బాధ్యతను అసంపూర్తిగా వదిలివేయటమో, బాధ్యత నుంచి తప్పుకోవటమో నేరంగా భావించటం స్వాభావికం. కాబట్టి ఎవరికి ఆమె సన్నిహితంగా వెళ్ళినా, వివాహం ప్రసక్తి రాదు. సర్వస్వతంత్రురాలు లత. మరొకరి అధిక్యం, అధిపత్యం ఆమె ఆమోదించదు కాబట్టి,  సి. రామచంద్రతో సన్నిహితంగా ఉన్నా, అది వృత్తికి సంబంధించినంతవరకే తప్ప, ఇంకెందుకో అనుకుంటే అది పురుషాహంకారం తప్ప మరొకటి కాదు. అది ప్రేమ అనీ, వివాహం అనీ లత ఆలోచించలేదు. సి. రామచంద్ర అలా భావించటం ఆమెకు నచ్చలేదు. అందుకని పరిస్థితి చేయి దాటేలోగా చక్కదిద్దాలని ఆమె సి. రామచంద్రతో కలిసి పనిచేయకూడదని నిశ్చయించుకుంది. ఒక రకంగా ఇది చక్కటి నిర్ణయం.

తరుచూ కలుస్తుంటే సాన్నిహిత్యం పెరుగుతుంది. సాన్నిహిత్యాన్ని అపార్థం చేసుకుంటే స్నేహం దెబ్బతింటుంది. అయినా కలుస్తూ ఉంటే వివాదాలు మొదలవుతాయి. మనసుపై నియంత్రణ తప్పవచ్చు. అది ప్రమాదకరం. కాబట్టి ఎలాంటి వికృతులకు, వికారాలకు తావివ్వకుండా లత మంగేష్కర్,  సి. రామచంద్రతో సంబంధాలు సంపూర్ణంగా తెంచుకుంది. మరో మాటకు కానీ, ఎలాంటి అపోహలకు కానీ తావియ్యలేదు. లత ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవటం వెనుక తన ఆప్త స్నేహితురాలు గీతా దత్ పరిస్థితి కూడా పరోక్షంగా ప్రభావం చూపించి ఉండవచ్చు. లతా మంగేష్కర్, గీతా రాయ్‍లు ఒకే సంవత్సరంలో హిందీ సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించారు. 1946లో ఇద్దరూ తొలి పాట పాడారు. అయితే, గీతా రాయ్ ముందుకు దూసుకుపోయింది కుందేలులాగా. లతా మంగేష్కర్ తాబేలులాగా వెనుక పడిపోయింది పలు కారణాల వల్ల. కానీ 1949 వచ్చేసరికి లత, గీతా రాయ్‍లు దాదాపుగా సమానమయ్యారు. కానీ లత పాడిన పాటలు సూపర్ హిట్‌లవటం, సినిమాలు విజయవంతమవటంతో లతతో సమానంగా పాటలు పాడినా గీతా రాయ్ వెనుక పడినట్టు అనిపిస్తుంది. నిజానికి గీతా రాయ్ వెనుక పడినట్టు అనిపించిన కాలంలో కూడా లతతో సమానంగా పాటలు పాడుతూ వచ్చింది. ఇది 195‌0 నుండి 1960 వరకూ వీరిద్దరూ పాడిన పాటల గణాంక వివరాలను పోల్చి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.

లత గీత
1950 152 158
1951 218 77
1952 171 122
1953 189 63
1954 166 55
1955 209 85
1956 200 111
1957 135 114
1958 127 69
1959 193 85
1960 158 65

లత గీతాలు నేపథ్య గాయనిలుగా ఎప్పుడూ ఒకరికి ఒకరు పోటీ కారు. లత పాడే పాటలు ప్రత్యేకంగా లత కోసం రూపొందించినవి. ఆరంభంలో విషాద గీతాలు, భజనలకే పరిమితమైన గీతా ‘జాల్’ సినిమాలో ‘తక్‌దీర్ సే బిగ్డీ హూయీ’ పాటతో హుషారైన గీతాలు, క్లబ్బు పాటలు, చిలిపి పాటలు కూడా అద్భుతంగా పాడుతుందన్న పేరు తెచ్చుకుంది. దాంతో ఆమె తనకంటూ లతతో ఏమాత్రం సంబంధం లేని గీతాల ప్రపంచం ఏర్పాటు చేసుకుంది. లత అడుగు కూడా పెట్టలేని ఆ గీతాల ప్రపంచానికి రాణి అయింది. ఇలా పాటలు పాడే సందర్భంలోనే ఆమెకు గురుదత్ పరిచయమయ్యాడు. పరిచయం ప్రణయంగా మారి, ప్రణయం పరిణయంగా పరిణమించింది. గీతా రాయ్, గీతా దత్ అయింది. అంతమటుకూ లతతో పోటీగా పాటలు పాడుతూ తనదైన ప్రత్యేక పాటల సామ్రాజ్యానికి మహారాణిలా ఉన్న గీతా రాయ్ అదృష్టం గీతా దత్ అవటంతోటే మారిపోయింది.

గీతా వివాహ సమయంలో లత

ఎలాగైతే తాబేలు, కుందేలు పోటీలో ముందు పరుగెత్తే కుందేలు విశ్రాంతి తీసుకున్న సమయంలో తాబేలు ముందుకు వెళ్ళిపోయిందో, అలాగే గీతా రాయ్, గీతా దత్ అయి, గురుదత్ – ఆత్మన్యూనతా భావంతోటీ, నిరాశా భావాలతోటీ సతమతమయి, పిల్లల బాధ్యతలు, సంసార బాధ్యతలతో మునిగి తన కెరీర్‍ను విస్మరించింది. తాబేలు లాగా ఎలాంటి ప్రలోభాలు, ఆకర్షణలకు లొంగకుండా అదే వేగంతో ముందుకు సాగిపోయింది లతా మంగేష్కర్. ‘గీతా రాయ్’ సంవత్సరం వారిగా పాడిన పాటల సంఖ్యను, లత మంగేష్కర్ అదే సంవత్సరం పాడిన పాటలతో పోల్చి చూస్తే, అంతవరకూ లతతో దీటుగా పాటలు పాడ్తున్న గీతా దత్ 1953 నుంచి హఠాత్తుగా వెనుకపడటం  గమనించవచ్చు. ఆ తరువాత గురుదత్‍కు తెలియకుండా,  అతడి అభీష్టానికి వ్యతిరేకంగా పాటలు పాడటం ఆరంభించి,  పుంజుకున్నట్టు కనిపించినా, 1958 నుంచీ గీతా దత్ పాటలు గణనీయంగా తగ్గిపోవటం స్పష్టంగా తెలుస్తుంది.

ఆపై మరింతగా దిగజారింది గీతా దత్ పరిస్థితి. గీతా దత్ రిహార్సల్స్ అన్యమనస్కంగా చేయటం, గురుదత్ ఇంటికి తిరిగి వచ్చేలోగా ఇల్లు చేరాలన్న తొందరలో పాటలపై సరిగ్గా ధ్యాస పెట్టకపోవటం, ఎప్పుడూ రికార్డింగ్‍కు వస్తుందో, ఎప్పుడు రాదో తెలియకపోవటం వల్ల గీతా దత్‍ను అభిమానించే సంగీత దర్శకులు కూడా అయిష్టంగానే గీతా దత్‍తో పాటలు పాడించేందుకు సిద్ధం కాకపోవటం ఆమె కెరీర్‍ను దెబ్బతీశాయి. దీనికి తోడుగా వహీదా వెంటపడ్డ గురుదత్ మానసిక స్వాస్థ్యతను కోల్పోవటం, గురుదత్‍ను వివాహమాడీ తన ఉజ్జ్వలమైన కెరీర్‍ను మట్టిపాలు చేసుకున్నానన్న గ్రహింపుతో నిరాశలోకి దిగజారి గీతా దత్ తాగుడుకు బానిస అవటం, చివరికి గురుదత్ హఠాన్మరణంతో ఆమె పూర్తిగా నిరాశ పాతాళంలోకి దిగజారటంతో అమె కెరీరు సమాప్తమయింది. 1961లో 44 పాటలు, 1962లో 24 పాటలు, 1963లో 17 పాటలు, 1964లో 9 పాటలు, 1965లో 2 పాటలు, 1966లో 6 పాటలు, 1967లో 12 పాటలు పాడిన గీతా దత్, మళ్ళీ 1970లో 4 పాటలు, 1971లో మూడు పాటలు, 1972 లో రెండు పాటలు పాడింది. ఆమె 1972లో మరణించింది. పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ వుంటుందంటారు. కానీ, విజయం సాధించిన మహిళల్లో అధిక శాతం ఒంటరివారే!అలాగే, విజయం అంచులనుంచి పతనమైన మహిళందరి జీవితాల్లో  పతనానికి కారణంగా  పురుషుడుంటాడు.

ఆశా, సీ రామచంద్ర

గీతాదత్‌ను అధికంగా అభిమానించి ఆమె స్వరం ఆధారంగా తమ కేరీర్లు నిర్మించుకున్న సంగీత దర్శకులు కూడా గీతాదత్ మళ్ళీ పాడతానంటే ఆమెకు అవకాశాలివ్వకపోవటానికి మరో కారణం ఆశాభోస్లే. ఆశాభోస్లే సినిమా పాటలను జీవికగా ఎంచుకుంది కానీ, ఆమెకు అవకాశాలు లభించటం  కష్టమయ్యింది. ఎందుకంటే  సినీ సంగీత ప్రపంచంలో  సగం లతా ఆక్రమించుకుంటే,  మిగతా సగం గీతా ఆక్రమించుకుంది. ఇక మిగిలిన అర కొర పాటలకోసం శమ్షాద్ బేగం, సుధా మల్‌హోత్రా వంటి ఇతర గాయనిలతో పోటీ పడాల్సివచ్చింది ఆశాకు. ఎప్పుడయినా లతా, గీతాలకు పాటపాడే వీలు లేకపోతే అర కొర పాటలు ఆశాకు అందేవి. అలాంటి పరిస్థితుల్లో గీతాదత్ వివాహం తరువాత వ్యక్తిగత కారణాలవల్ల పాటలపై సరిగ్గా దృష్టి పెట్టకపోవటంతో, తన ప్రతిభను నిరూపించుకునే వీలు ఆశాకు చిక్కింది. ఈ అవకాశాలను ఆశా చక్కగా ఉపయోగించుకుంది. ఆరంభంలో గీతాను అనుకరిస్తూ అలాగేపాడినా, తనదైన ప్రత్యేక గాన సంవిధానాన్ని ఏర్పరచుకుని గీతాలేని లోటును అద్భుతంగా పూడ్చింది. దాంతో మళ్ళీ గీతా పాడాలనుకున్నా ఆమెకు అవకాశాలు లభించలేదు. అలా, ఒక అత్యద్భుతమయిన గాయని కేరీరు సమాప్తమయిపోయింది.

గీతా దత్‍తో అత్యంత సన్నిహితంగా ఉన్న లతా మంగేష్కర్ గీతా దత్ జీవితంలో జరుగుతున్న పరిణామాలను అతి దగ్గరగా గమనించింది. గీతా దత్ పూర్తిగా మందుకు బానిస కాకముందు లతతో అన్ని విషయాలు పంచుకునేది. ఆ తరువాత గీతా బాలికి సన్నిహితమైంది. గీతాబాలి హఠాన్మరణం గీతా దత్‍కు సన్నిహితులన్న వారిని లేకుండా చేసింది. గీతా దత్ మాత్రమే కాదు, కమల్ అమ్రోహినీ వివాహం చేసుకున్న తరువాత మీనాకుమారి అనుభవించిన కష్టాలు కూడా లత దగ్గరగా చూసింది. మీనా కుమారి అంటే లతకు చాలా ఇష్టం. ఆమె మరణించే కొన్నిరోజుల ముందు మీనా కుమారిని కలిసింది లత. ఇంకా సినిమా ప్రపంచంలోని ప్రేమలు, వివాహాలు దెబ్బతినటం, ఒకరిని వదలి మరొకరిని చేసుకోవటం వంటివన్నీ లతకు అయిష్టకరమైన విషయాలు. అప్పటికే వివాహమైన భార్యను వదలి అనిల్ బిశ్వాస్ మీనాకపూర్‍ను వివాహం చేసుకోవటం కూడా లత హర్షించలేదు. కాబట్టి అప్పటికే వివాహమైన సి. రామచంద్రతో లత ప్రేమ వ్యవహారం నడపటం కానీ, పెళ్ళి చేసుకోవాలనుకోవటం కానీ అనూహ్యమైన విషయాలు, అసంబద్ధం అనిపించే విషయాలు.

కలసి పనిచేయటం, హిట్ పాటలు ఇవ్వటం వల్ల ఏర్పడ్డ సాన్నిహిత్యాన్ని లత స్నేహంగా భావించి ఉండవచ్చు. సి. రామచంద్ర ప్రేమగా పొరపడి ఉండవచ్చు. అమ్మాయి నవ్వుతూ చూస్తేనే ప్రేమించేసిందని పొరపడే వ్యక్తులు, కలసి రెండడుగులు వేస్తే కథలల్లేసే జర్నలిస్టులు ఉన్న సమాజంలో ఒక మహిళ మనస్సు గురించిన ఆలోచనలు, స్పృహ ఉండాలని ఆశించడం పొరపాటే! అందుకే ఎవరేమన్నా లత మౌనాన్ని ఆశ్రయించింది.

లత స్వరం ఆధారంగా అత్యద్భుతమైన రాగ అధారిత బాణీలను సృజించిన సి. రామచంద్ర సృజన, లత స్వరం లేకపోవటంతో దెబ్బతిన్నది. లోపం అతని బాణీలలో లేదు. ఆయన ఊహ సృజించిన పాటకు ఊహించని రీతిలో ప్రాణం పోసి నవ చైతన్యాన్ని ఆపాదించగలిగే లత స్వరం లోపించటంతో సి. రామచంద్ర పాటలలో ఆత్మ లోపించింది. ‘నవరంగ్’ పాటలు హిట్ అయ్యాయి. కానీ ఆశా భోస్లే స్వరంతో రాజీపడలేకపోయాడు సి. రామచంద్ర. మళ్ళీ హిట్ పాటలను సృజించలేకపోయాడు. లత తనను కాదన్నదన్న బాధ త్రాగుడులో మరచిపోవాలని చూశాడు. త్రాగుడులో మునిగి తన బాధను అందరితో చెప్పుకున్నాడు. అధికంగా లత తప్ప మరో గాయనితో పాడించని దానికి ఫలితం అనుభవించాడు. అతని కెరీర్ సమాప్తం అయిపోయింది.

చైనా యుద్దం తరువాత ‘ఏయ్ మేరే వతన్ కే లోగో” పాటను ఆశా  కోసం రూపొందించాడు. తరువాత లత, ఆశాల యుగళగీతంలా తయారుచేశాడు. కవి ప్రదీప్ మాట విని మళ్ళీ లత ఈ పాటను పాడేందుకు ఒప్పుకుంది. కానీ చివరికి స్టేజీ మీద పండిత జవహర్ లాల్ నెహ్రూ ముందు లత సోలోగానే పాడింది. ఈనాటికీ ఈ పాట లతకు గుర్తింపు పాటగా, దేశభక్తి పాటలలో  తలమానికంగా నిలుస్తోంది. అయితే లత 1956‌-57 తరువాత ఎప్పుడూ సి. రామచంద్ర పేరు తలవలేదు. తనకు నచ్చిన పాటల జాబితాల్లో సి. రామచంద్ర పాటలు చేర్చలేదు. ఆమె స్టేజిపై సి. రామచంద్ర పాటలు పాడేటప్పుడూ కూడ ఆ గేయ రచయిత పేరు చెప్పేది తప్ప సంగీత దర్శకుడిగా సి. రామచంద్ర పేరు పలికేది కాదు. ఇది లత పాటలను విశ్లేషించే సమయంలో సి. రామచంద్రకు అంతగా ప్రాధాన్యాన్నివ్వకపోవటానికి దారి తీసింది.

శిరీష్ కనేకర్ రాసిన ‘గాయే చలా జా’ పుస్తకంలో రాసిన ఓ సంఘటన ఇది. 1976లో ‘ఇందిరా డెకెడ్’ సంరంభాల్లో భాగంగా లత ‘ఏ  మేరే వతన్ కే లోగో’ పాటను స్టేజిపై పాడింది. పాటను ప్రకటించింది దిలీప్ కుమార్. దిలీప్ కుమార్ పాటను ప్రకటించి కవి ప్రదీప్‍ను గేయ రచయితగా ప్రకటించాడు తప్ప సంగీత దర్శకుడి పేరు ప్రకటించలేదు. హాలులో ఉన్న సి. రామచంద్రకు కోపం వచ్చింది. దిలీప్ కుమార్ స్టేజి దిగి రాగానే,  నిలదీశాడు. “నా పేరు చెప్పవద్దని ఆదేశాలు వచ్చాయా” అని కోపంగా అడిగాడు. “దిలీప్ కుమార్‍కు ఆదేశాలిచ్చే వారింకా పుట్టలేదు” అన్నాడు దిలీప్ కుమార్. దానికి సి. రామచంద్ర పెద్దగా నవ్వి “అరే వదిలెయ్…. కాలం మారిపోయింది. దిలీప్‌ కుమార్‌కే కాదు, ఎవరికైనా ఏదైనా ఆదేశాలు ఇవ్వవచ్చు” అన్నాడు. ఈ సంఘటన సి. రామచంద్ర తనకు స్వయంగా చెప్పాడని రచయిత పుస్తకంలో రాశారు.

సి. రామచంద్ర ఎప్పుడు కలిసినా ‘లత ఏమంటోంది?’ అని అడిగేవాడని రాజు భరతన్ రాశాడు. లత, సి. రామచంద్రను మరచి ముందుకు సాగిపోయింది. ఆమె గాన జీవితంలో పోషించాల్సిన పాత్రను పోషించి సి. రామచంద్ర తెర వెనుకకు వెళ్ళిపోయాడు. లత ముందుకు  సాగిపోయింది,  Men may come and Men may go, But I go on for ever అన్నట్టు.

తన పతనాన్ని, లత తిరస్కారాన్ని మరచిపోలేని సి. రామచంద్ర మరాఠీ భాషలో ‘మాఝ్యా జీవనాచి సర్గమ్’ (The sargam (music) of my life) అనే పుస్తకం రాశాడు. 1977లో ఇది ప్రచురితమయింది. ఈ పుస్తకంలో లత పేరు చెప్పకుండా ‘సీత’ అనే అమ్మాయితో తన గాఢమైన సంబంధాన్ని విపులంగా వర్ణించాడు. ‘ఏయ్ మేరే వతన్ కే లోగో’ వెనుక కథను విపులంగా రాశాడు.

అయితే, ఈ పుస్తకాన్ని వెంటనే మార్కెట్ నుంచి తొలగించారు. పుస్తకం లభ్యం కావటం లేదు. ఈ పుస్తకాన్ని ఇతర భాషల్లోకి అనువదించేందుకు కూడా అనుమతి లభించట్లేదు. ఈ పుస్తకం చదివిన కొందరు, ఆయన వర్ణించిన సంఘటనలను లొట్టలేసుకుంటూ చదివితే, మరికొందరు ‘లత దక్కలేదన్న అక్కసును ఆమె వ్యక్తిత్వ హననం ద్వారా తీర్చుకున్నాడ’ని సి. రామచంద్రను విమర్శించారు. కానీ పుస్తకం ప్రస్తుతం లభ్యం కాకపోవటం, ఇకపై లభ్యమయ్యే ఆశ కూడా లేకపోవటంతో సమస్య అంతరించింది. ఊహగానాలు మిగిలాయి.

ఇలా లత తన పాటలు పాడకపోవటం వల్ల కెరీరు సర్వ నాశనమై  కూడా ‘లత లాగా ఎవ్వరూ పాడలేరు. ఆమె సంగీత సరస్వతి’ అని అంటాడు సి. రామచంద్ర . ఇక్కడే మనం పురుష ప్రకృతిలో స్త్రీ, దృష్టిలో తేడాను గమనించాల్సి ఉంటుంది.

‘స్త్రీ’ ఒక పురుషుడు కనబడగానే ‘వీడే నా ప్రియుడు’ అనుకోదు. పురుషుడిలో, తండ్రిని చూస్తుంది. అన్నను చూస్తుంది, బాబాయిని, మామను ఇలా బంధువులను చూస్తుంది. పురుషుడు ఇందుకు భిన్నం. కనపడ్డ ప్రతి అందమైన స్త్రీని ఆశగా చూస్తాడు. ‘ఈమేనా నా  ప్రేయసి? ‘ అని అన్వేషిస్తాడు. ఆమె నవ్వుతూ పలకరిస్తే కలలు కంటాడు. కల నిజమనుకుంటాడు. నిజం తెలిసిన స్త్రీ ఆశ్చర్యపోతుంది. ‘ఛ…. అలా ఎలా ఆలోచిస్తారంటుంది?’.  పురుషుడు ఆమె నటిస్తోందనుకుంటాడు. మోసం చేసిందనుకుంటాడు. ప్రేమ కసిగా, ద్వేషంగా మారుతుంది. ఆమె గురించి తానూహించింది చిలువలు వలువలు చేసి ప్రచారం చేస్తాడు. ఎవరితో  మనం మాట్లాడటం మానేస్తామో, మరుక్షణం నుంచి వారు మన గురించి మాట్లాడతారంటారు. అయితే సమాజం ఎంత అభివృద్ది చెందినదైనా పురుషుడి ఊహలకిచ్చిన విలువ స్త్రీ మనసులోని మాటకు ఇవ్వదు. అలాంటి పరిస్థితుల్లో స్త్రీ ఏం మాట్లాడినా అది తప్పుగానే అర్థమవుతుంది. అందుకే ఎవరేమన్నా లత మాట్లాడదు. ‘ముఝ్ పె ఇల్జామ్ – ఎ- బేవఫాయీ హై’ అని పాడుతుంది సినిమాలో. నిజ జీవితంలో మౌనమే అన్నిటికీ సమాధానం..

వచ్చేవారం 1950లలోని పాటలను విశ్లేషిద్దాం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here