నమామి దేవి నర్మదే!! -4

2
3

[box type=’note’ fontsize=’16’] భక్తి పర్యటనలో భాగంగా తమ నర్మదా పరిక్రమణ యాత్రానుభవ కదంబాన్ని సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ. [/box]

నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం

ఓంకారేశ్వరం – మొదటిరోజు

కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః

ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే।

శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున

ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్॥  (శివానందలహరి)

శివుడు పరమ దయాళువు. పిలిచిన పలికే దైవం. బోళాశంకరులని పేరు. శివుని ధ్యానము వలన లౌకికమైన కోరికలు తీర్చి, జన్మాంతర మోక్షం కూడా ప్రసాదిస్తాడు.

పరమాత్మను సత్యం, శివం-సుందరం అన్నారు. పరమ సుందరమేదో అదే పరతత్త్వం.

ఈ పరమ శివతత్త్వమే సర్వ కారణకారణమని సనాతన ధర్మంలో ఆరాధ్యమయ్యింది.

నిర్వికార నిరాకార జ్యోతిర్మయ పరతత్త్వంగా శివుడిని ఆరాధించటము సంస్కృతిలో భాగం.

సృష్టికి పూర్వము నుంచి ఉన్న అనాది పరబ్రహ్మకు చిహ్నంగా లింగారాధన కొనసాగుతోంది.

లీయమాన మిదం సర్వం

బ్రహ్మణ్యేవ హి లీయతే॥

సమస్త జగత్తు దేనిలో లీనమవుతుందో అదే లింగం. జ్యోతి స్వరూపమైన లింగరూపములో అర్పించబడే పరతత్త్వం “ఏకోఽహం బహుస్యామ్” అని అనేక రూపాలయింది.

తనంతట తాము జ్ఞానజ్యోతి స్వరూపునిగా ఆవిర్భవించిన చోట్లు పన్నెండు. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలన్నారు.

మరో కథనం ప్రకారం బ్రహ్మ విష్ణువుల సంవాదంలో లింగం వారి మధ్య ఉద్భవిస్తుంది. ఆది, అంతం లేని ఆ మహా లింగమే భారతదేశములోని జ్యోతిర్లింగాలని నమ్మకం. ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధి చెందాయి

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్

ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్

సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే

హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః

సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.॥”

ఓంకారేశ్వరం జ్యోతిర్లింగం మహా శక్తివంతం. నాలుగవ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర, మమలేశ్వర జ్యోతిర్లింగం. ఓంకారేశ్వరం గురించి స్థానికంగా రెండు కథలు మనకు చెబుతారు. “వింధ్యాచల పర్వతుడికి తనే గొప్పవాడనే పొగరు ఉండేదిట. నారదుల వారు వింధ్యాచలునితో ‘అయ్యా! నీకన్నా మేరు పర్వతం ఉత్తమం…’ అన్ని చెప్పాడుట. సిగ్గు పడిన వింధ్యాచలుడు శివుని కొరకు  తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై ఓంకారేశ్వర పర్వతం పైన నర్మద ఒడ్డున జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఓంకారేశ్వరం పైనుంచి చూస్తే ‘ఓం ఆకారంలో’ ఉంటుందని ఓంకారేశ్వరమని ఆ పట్టణానికి పేరు వచ్చింది.”

మరో కథనం ప్రకారం “మంధాత రఘవంశ రాజు. రఘు వంశములో రాముని పూర్వమున్నవాడు. ఆయన నర్మదానది ఒడ్డున తపస్సు చేసుకున్నాడు. మహాదేవుడు జ్యోతిర్లింగముగా అనుగ్రహించాడు. మాంధాత భక్తి మెచ్చిన పరమేశ్వరుడు వరమిచ్చాడు ఆ కొండను మాంధాత పర్వతమని పిలుస్తారని. ఆ కొండ పైన ఓంకారేశ్వరుడుగా నర్మదకు ఈవల వైపు మమలేశ్వరునిగా, మహాదేవుడు మనకు దర్శనమిస్తాడు”.

ఈ జ్యోతిర్లింగం మహాశక్తివంతం. ఇక్కడే జగద్గురువులు ఆదిశంకరులు తమ గురువైన గోవిందపాదుల వారిని కలుసుకున్నారు. ఓంకారేశ్వరములో మనము ఆదిశంకరులు తన గురువును కలుసుకున్న గుహను దర్శించవచ్చును కూడా. ఆ పవిత్రమైన శక్తిక్షేత్రంలో శంకరులు ఉపనిషత్తులకు భాష్యాలు రచించారు.

మేము ఓంకారేశ్వరంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వ టూరిజం వారి ‘టెంపుల్ వ్యూ’ లో బస చేశాము. ముందు ఆ హోటల్‌లో చెకిన్ అయి మా సామాను గదిలో చేర్చుకున్నాము. మమ్మల్ని గుడికి తీసుకుపోవటానికి, మాకు పరిక్రమ గురించి వివరాలు చెప్పటానికి ఒక పురోహితులవారు అప్పటికే అక్కడకు వచ్చి ఉన్నారు. హోటల్ గదిలో సామాను పెట్టి ముందు ఆయనతో కలసి దర్శనానికి వెళ్ళాము. మా బస నుంచి ముందు మమ్ములను గజానన మహారాజ్ ఆశ్రమబస వరకు కారులోనే తీసుకుపోయారు. గజానన మహారాజ్ ఆశ్రమబస చాలా పేరున్న వసతి ఓంకారేశ్వరంలో. అక్కడ్నుంచి నడక దారిలో మేము దేవాలయానికి వెళ్ళాము. దేవాలయలం దాదాపు కిలో మీటరు పైగా నడిచి వెళ్ళాలి.

సోమవారం కాబట్టి జనం బాగా ఎక్కువగానే ఉన్నారు. ఒకరి మీద ఒకరు పడి తోసుకుంటున్నారు. అప్పటి వరకు కొంత దూరం మెసలుతున్నా ఆ దేవాలయం ప్రాంగణములో క్యూలోకి వెళ్ళే సరికే తోపులాట మొదలయింది. క్యూను మూసివేసారు సమయం ముగిసిందని. మమ్మల్ని, మాలాంటి కొందరిని ఒక ప్రక్కన నిలబెట్టారు. ‘దర్శనం ప్రతేక్యం’ అని చెప్పారు.

మామూలు క్యూలో ఒక స్త్రీ ఎంత సేపటి నుంచి నిలబడి ఉందో పాపం వాంతులు చేసుకుంది అక్కడే ఆ మండపంలో. బయటకు వెళ్ళటానికి కాని, ప్రక్కకు జరగటానికి కాని చోటులేదు. ప్రజలు ఆమెను అడ్డంగా కట్టిన ఇనుప రాడ్లు మీదుగా ప్రక్కను దింపారు. ఆమె నిలబడలేకపోతున్నది. ఇద్దరు చిన్న పిల్లలు. భర్త పిల్లలను ఎత్తుకొని ఆమెను పట్టుకొని అవస్థ పడుతు లాక్కుపోయాడు. అందరు తప్పుకున్నారు. దేవాలయం వారు అక్కడ శుభ్రం చేశారు. అరగంటకు తొక్కిడి తగ్గింది. అయినా మేము నిలబడిన చోట తోపులాట ఆగడం లేదు. ఆ మండపం శివుని దగ్గరకు తీసుకుపోయే దారిలో వచ్చే రెండవ మండపం. అందమైన శిల్పాలతో, తోరణాలతో ఉంది. శిల్పాలు పురాతనమైనవిగా తోచాయి. ఆ అందం కనపడనంతగా ఏవో తోరణాలు కరెంట్ తీగలు కట్టారు. దేవాలయ సౌందర్యం కప్పెడుతూ బ్యారికేడ్లు, వెలసిన తోరణాలు, బీరువాలు… జనాల తోపులాటలు. సందులో సందుగా దుష్టఆలోచనల పురుష పుంగవులు శక్తివంతమైన జ్యోతిర్లింగ దేవాలయ పవిత్రతను నేలమట్టం చేశారనిపించిన మాట నిజం.

ఆ దేవాలయాన్ని పూర్వం అన్ని దేవాలయాల లాగానే మహ్మదీయుల దండయాత్రలో శిల్పసంపద కోల్పోయినదట. పోగా మిగిలినది ఇలా శిథిలావస్థలో ఉంది. ఇలా రకరకాల ఆలోచనలతో దాదాపు నలభై నిముషాలు నిలబడిన తదనంతరం మాకు దర్శనం లభించింది. మేము శివుని ముందు నిలబడ్డాము, వెంటనే ఒకడు నన్ను చేతులతో లాగి బయటకు తోశాడు.

నేను ‘పరమేశ్వర ప్రాప్తి ఇంతే’ అనుకొని బయటకు వచ్చేశాను. బయట మరో విశాలమైన హాలు ఉంది. మాతో వచ్చి, పండా మాకు అక్కడ అభిషేకానికి కూర్చోబెడతానన్నాడు. అక్కడ జనాల మధ్య అవసరమనిపించలేదు. దానికి తోడు గంట సేపు తొక్కిసలాట, రెండు సెకన్ల దర్శనముతో మతి కోల్పోయి, పైగా రెండు సంవత్సరముల తరువాత జనాల మధ్యకు వచ్చి తొక్కిసలాటలో కూరుకుపోయినందుకు కలిగిన ఆందోళనతో వెంటనే బసకు వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాము.

పండా మమ్మల్ని మరునాడు నర్మదా ఒడ్డున ఆరు గంటలకు కలుస్తానని మాయమయ్యాడు.

మేము నీరసంగా బసకు వచ్చాము. జనాల మధ్య నలిగామని, కరోనా జాగ్రత్త కోసం వెంటనే స్నానం చేశాము. తరువాత భోజనం చేసి, ఆనాడు మధ్యాహ్నం నేను కొన్ని పూజ సామాను కొనటానికి దుకాణానికి తీసుకుపొమ్మని డ్రైవరు అనిల్‌ను అడిగాను. అతను మళ్ళీ దేవాలయం వద్దకే తీసుకుపోయాడు. ఆ ఊరిలో దుకాణాలన్ని ఇవే అన్నారు.

దీపారాధన నూనె, వత్తులకు నెయ్యి, ప్రతిరోజు దానం చెయ్యటానికి పార్లే బిస్కెట్లు, అగ్గిపెట్టె, కొన్ని నోటు పుస్తకాలు, పెన్నులు, పది రూపాయలు నోట్ల చిల్లర, ఇవి నేను సేకరించాను. ఆ రోజు నుంచి మేము ప్రతి దేవాలయం, ఘాట్ లలో బిక్షం అడిగిన వారికి పది రూపాయిల నోట్లు, పిల్లలకు బిస్కెట్లు, నోటు పుస్తకం పెన్ను, సాధు సన్యాసులకు బిస్కెట్లు, పండ్లు దానం చేశాము. (ఈ వివరాలు కేవలం యాత్ర చెయ్యాలనుకునే వారికి పనికొస్తాయని పంచుకోవటం జరుగుతోందని మనవి.) ఇవ్వన్ని సేకరించి పెద్ద సంచులు రెండిట్లో నింపుకొని తెచ్చి కారులో ఉంచాను. పళ్ళు కొన్ని కొని పెట్టాను. అరటి పళ్ళు కొని ఉంచుకున్నాము. దారిలో కనపడిన ఆవులకు అరటి పళ్ళు పెట్టాము. మొత్తానికి ఆ సాయంత్రం ఆ షాపింగ్ తరువాత, తిరిగి బసకు చేరి విశాంత్రి తీసుకున్నాము. ఆ రోజుకు డయేరియా తగ్గింది కాని గొంతులో గురగుర, బొంగురు గొంతు తగ్గలేదు. పైగా చిన్నగా పొడి దగ్గు కూడా మొదలయింది నాకు.

~

మార్గబంధు స్తోత్రం
శంభో మహాదేవ దేవ | శివ శంభో మహాదేవ దేవేశ శంభో ||
శంభో మహాదేవ దేవ | శివ శంభో మహాదేవ దేవేశ శంభో ||
శంభో మహాదేవ దేవ ||
ఫాలావనమ్రత్కిరీటమ్ | ఫాలనేత్రార్చిషాదగ్ధ పంచేశు కీటం ||
శూలాహతారాతి కూటం | శుద్ధ మర్థేన్దుచూడం భజే మార్గబంధుం || 1 || శంభో ||
అన్గే విరాజద్భుజంగం | అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం ||
ఓంకారవాటీ కురంగం | సిద్ధ సంసేవితాన్ఘ్రిం భజే మార్గబంధుం || 2 || శంభో ||
నిత్యం చిదానంద రూపం | నిహ్నుతాశేష లోకేశవైరి ప్రతాపం ||
కార్తస్వరాగేంద్రచాపం | కృత్తి వాసం భజే దివ్య సన్మార్గబంధుం || 3 || శంభో ||
కందర్పదర్పఘ్నమీశం – కాలకంఠం మహేశం మహావ్యోమకేశం |
కుందాభదంతం సురేశం – కోటి సూర్య ప్రకాశం భజే మార్గబంధుం || 4 || శంభో ||
మందారభూతేరుదారం – మందరాగేంద్రసారం మహాగౌర్యదూరం |
సిందూరదూరప్రచారం – సింధురాజాతిధీరం భజే మార్గబంధుం|| 5 || శంభో ||
అప్పయ్యయజ్వేంద్రగీతం | స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే ||
తస్యార్థ సిద్ధిం విధత్తే | మార్గమధ్యే~భయంచాశుతోశో మహేశః || 6 || శంభో ||

~

ఓంకారేశ్వరము – సంకల్పదీక్ష – రెండవ రోజు

రేవాతీరే తపః కుర్వాత్ మరణం జాహ్నవీ తటే।

దానం దద్యాత్ కురుక్షేత్రే, గౌతమ్యాం త్రితయం వరమ్॥” అని పురాణ వాక్యం.

నర్మదను దర్శించినంతనే సర్వ పాపాలు తొలగుతాయి. నర్మద ప్రక్కన జపం సర్వ శ్రేష్ఠం అని చెబుతున్నాయి పురాణాలు.

మర్నాడు, అంటే మంగళవారం నర్మదా నది తీరానికి ఉదయం ఆరు గంటల కల్లా చేరాము. హేమంత ఋతు ప్రభావం వలన నదిలో నీరు చల్లగా ఉంది. సూర్యుడు ఇంకా రానందున పరిసరాలలో చల్లదనం శరీరాన్ని వణికిస్తుంది.

త్వదంబులీనదీనమీనదివ్యసంప్రదాయకం

కలౌ మలౌఘభారహారిసర్వతీర్థనాయకం .

సుమచ్ఛకచ్ఛనక్రచక్రవాకచక్రశర్మదే

త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే॥

నీ యందు నివశించు మొసళ్లకు, చక్రవాకపక్షులకు సుఖమునిచ్చు ఓ దేవీ! నర్మదాదేవీ! నీలో ఉన్న చేపలుకు కూడా దివ్యత్వమును కలుగచేయునది, కలికాలదోష్ములను హరించు పుణ్యతీర్థములకు ప్రభువైనది అగు నీ పాదపద్మమును నమస్కరించుచున్నాను.”

నర్మదాష్టకంతో నర్మదను తలచుకొని నమస్కరించించుకొని నది వైపు నడిచాము. పొగమంచు తగ్గుతు, వెలుతురు హెచ్చుతోంది. నర్మదా నీరు ఆకుపచ్చ రంగులో చిన్నగా కదులుతోంది. ఆ నీరు కొద్దిగా కృష్ణ నదిలా తోచింది. మనకు తెలిసిన వాటితో మనం పోల్చుకోవటం సామాన్యం.

నది ఒడ్డున బట్టలు, బాగ్ ఎక్కడ పెట్టాలి? అన్న ప్రశ్న శ్రీవారిని కంగారు పెట్టింది. అక్కడ భక్తులు ఎక్కువగా లేరు. “పర్వాలేదు. ఇక్కడ వదిలేసి వెడదాము…” అన్నాను. ఆయనకు నా మాట రుచించలేదు.

“ఎక్కడికి వచ్చినా ఆ జంజాటమేనా?” అన్నాను.

అక్కడ ఒక ముసలి స్త్రీ పసుపు కుంకుమలు అమ్ముతోంది. ఆమె డబ్బాలో అవి పెట్టుకు అమ్ముకుంటోంది.

“ఇక్కడ పెట్టి వెళ్ళండి. నేను చూస్తాను!” చెప్పింది ఆమె.

“సరే!!” అని ఆమె డబ్బా దగ్గర తన బాగ్ వదిలేశారు శ్రీవారు.

ఇద్దరం కలిసి, నదిని నమస్కరించుకుని, నదిలోకి దిగాము. అక్కడ ఆ చలిలో నదిలో, నర్మద మమ్ముల్ని ప్రియంగా స్వాగతించినట్లుగా మేము భావించాము. మేము ఇద్దరం సంకల్పం చెప్పుకొని మూడు మునకలు వేశాము. ఒడ్డుకు వచ్చి దుకాణాల మధ్య, వృద్ధ స్త్రీలు అమ్ముతున్న పూజా సామగ్రి కొట్టు వెనక, నేను బట్టలు మార్చుకున్నాను.

మేము ఇద్దరము మడి వస్త్రాలు కట్టుకొని నర్మదామాయి పూజకు తయారయ్యే సరికి మాకు సంకల్ప దీక్ష ఇవ్వటానికి పురోహితులు కూడా వచ్చి ఉన్నారు.

మా చేత రెండు డబ్బాలు కొనిపించారు. వాటిలో నదీ జలం సేకరించాము.

ఆయన మమ్మల్నిద్దరిని తీసుకొని జనసాంద్రత తక్కువగా ఉన్న చోటకు నర్మదకు కొద్దిగా దగ్గరగా తీసుకొనివెళ్ళి  ఒడ్డున కూర్చొబెట్టారు.

మా చేత నదికి, డబ్బాలో పట్టుకున్న జలానికి షోడషోపచార పూజ చేయించారు. పంచామృతాలతో  ఏక రుద్రం అభిషేకం చేయించారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here