విమర్శ – ఒక పరామర్శ
[dropcap]మ[/dropcap]నకు పొగడ్తలంటే ఇష్టం. విమర్శలంటే అసలు ఇష్టం ఉండదు. కానీ విమర్శను ఒక విమర్శకుడిలా కాకుండా ఒక ప్రసంగకర్తగా, సహేతుకంగా, పరిశీలనాత్మకంగా, ఇంకా చెప్పాలంటే పరిశోధనాత్మకంగా ఎవరైనా చెప్పగలిగితే అది సద్విమర్శే అవుతుంది.
ఒక రచయిత తనకున్న పరిజ్ఞానం మేరకు, తన ఊహా శక్తికి మేరకు ఆలోచించి కవితగానీ, కథగానీ, నవలగానీ రాస్తాడు. కానీ విమర్శకుడు అందులోని వస్తువును, సన్నివేశాల కల్పనను, సమయోచిత సంభాషణా నైపుణ్యాన్నీ, ఎత్తుగడనీ, ముగింపునీ విశ్లేషించి, విపులంగా వివరిస్తూ ఆయా పాత్రల స్వభావ స్వరూపాల విశిష్టతను వివరించి చెబుతుంటే, అది రాసిన రచయిత కూడా నేను రాసిన దానిలో ఇంత నిగూఢమైన భావాలు ఇమిడియున్నాయా అని అశ్చర్యపోవచ్చు. అదీ సద్విమర్శ అంటే.
కానీ చేమకూర వెంకట కవిగారు వాపోయినట్లు ఏగతి రచించినా సమకాలము వారు మెచ్చరు అన్నదే పదే పదే మననం చేసుకోవాల్సి వస్తోంది. విమర్శ చేసే వారిని విమర్శించేవారూ ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో విమర్శ, అనగా సద్విమర్శ బాగా వెనక పడిందనే చెప్పాలి. సాహిత్యసృష్టి చేయటం కష్టంగానీ, చేసిన దానిని విమర్శించటం చాలా తేలిక. షేక్స్‌పియర్ సాహిత్యం కన్నా, ఆయన సాహిత్యం మీద వచ్చిన విమర్శే ఎక్కువ.
ఒక యువకవి ఒక పద్య కావ్యం రాశాడు. విశ్వనాథవారి చేత దానిని ఆవిష్కరింప చేస్తే, అది అందరి దృష్టిలో పడుతుంది గదా అని ఆలోచించి, ఆయనను ఆవిష్కరించమని కోరితే, ఏ కళలోనున్నారో గానీ, ఆయన అందుకు అంగీకరించారు. సభలో ఆయన ఏం చెప్పారంటే, “ఈ కవి ఎవరో నాకు తెలియదు. ఈయన రచనలు ఏవీ ఇది వరలో నేను చదివియుండలేదు. కానీ వీరి తండ్రి నాకు తెల్సు. ఆయన గొప్ప పండితుడు కనుక ఈయన పండితపుత్రుడని నేను చెప్పగలను” అన్నాడు.
ఆయన చెప్పిన దానిలో అసత్యమేమీ లేదు. నిజమే చెప్పాడు. కాని పండిత పుత్రుడు అన్నది మరొక అర్థంలో కనిపిస్తుంది. కవిని వ్యక్తిగతంగా విమర్శించటం, సరియైన విధానం కాదు. విశ్వనాథ వారి రచనలను విమర్శించిన వారూ ఉన్నారు. ఆయన రామాయణ కల్పవృక్షం రాస్తే, రంగనాయకమ్మగారు విషవృక్షం రాశారు. సాహిత్యానికి సంబంధించినంత వరకూ భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నయి. తెనాలి రామకృష్ణకవి, అనాటి కవి పండితులను, తన చమత్కార చాతుర్యంతో ఎలా ఆటపట్టించాడోనన్నది జగమెరిగిన సత్యమే.
విమర్శలు సూటిగా నాటుకునే బాణాల్లా కాకుండా, సున్నితంగా సుతిమెత్తగా చేసేవిగా కూడా కొన్ని ఉంటయి. ఇవి పైకి సరదాగా చేసిన సరసంలా అనిపించినా, కొంచెం సీరియస్‌గా ఆలోచిస్తే, చెళ్లున వీపు మీద కొట్టినట్లు ఉంటయి. ఈ కోవకు చెందినదే ఒకటి. ఒక చిత్రకారుడు తన చిత్ర ప్రదర్శనశాలకు వచ్చిన ఒక సందర్శకునితో – “నేను ఒక చిత్రం చిత్రించటానికి మూడు నాలుగు రోజులు రాత్రింబగళ్లు కష్టపడతాను. చిత్రం వేయటం పూర్తి అయిన తరువాత, ఇంక దాని గురించి అసలు పట్టింటుకోను” అన్నాడు. ఆ సందర్శకుడు అందుకు సమాధానంగా “మేము అంతే” అన్నాడు. ఈ రెండు మాటలలో ఉన్న గూడార్థం అతని చిత్రాలన్నిటి మీదా చేసిన తీవ్రమైన విమర్శగా పరిగణించాల్సి వస్తుంది. చిత్రకారునిగా అతనికున్న స్థానం ఏమిటో ఆ రెండు మాటలూ చెప్పకనే చెబుతున్నవి.
ఇలాంటిదే మరో ఘాటు విమర్శ ఎంత సునిశితంగా చేయవచ్చో చెప్పే సంభాషణ ఒక రచయిత మరో రచయితతో అన్నాడు. “పోటీకి పంపిద్దామని రాత్రి కథ రాసి పడుకున్నాను. పొద్దున చూస్తే, నా రెండేళ్ల కొడుకు ఆ కాగితాలన్నీ చించేశాడు.” అని. ఆ మిత్రుడి స్పందన ఏమిటంటే “అరే, వాడికి అప్పుడే చదవటం వచ్చేసిందా?” అని. అంటే ఆ కథ చదివితే ఎరైనా, ఆ కాగితాలను కోపంతో చించిపారేస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కథను గురించి ఒక్క మాట మాట్లాడకుండా దాని మీద చేసిన విమర్శ, నవ్వు తెప్పిస్తుంది గానీ, దాని పై గల అభిప్రాయాన్నీ వ్యక్తం చేస్తుంది.
ఒక యువకుడు అర్థశాస్త్రంలో మంచి పరిజ్ఞానాన్ని సంపాదించాడు. ఒక సభలో పొదుపు పైన ప్రసంగం చేశాడు. అందరూ ఓపికగా విన్నారు. సభాద్యక్షుల వారు ఏమన్నారంటే “ఇంత వరకూ, రామారావు పొదుపు గురించి మనకు ఎన్నో విషయాలు వివరంగా తెలియజేశారు. ఆయన మీకు తెలియజేయని విషయం ఒకటి నేను తెలియజేస్తున్నాను. ఆయన కింకా పెళ్లికాలేదు…” అని అన్నాడు.
ఇక్కడ ఆయన చేసిన ప్రసంగాన్ని అద్యక్షులవారు విమర్శించారు. దాని గురించి ఒక్క మాట చెప్పలేదు. కానీ ఆయన కింకా పెళ్లి కాలేదు – అని ఒక వ్యాక్యం వెలిబుచ్చటం వల్ల ఆ ప్రసంగం ఎంత నిరర్థకమైనదో చాలా గుంభనంగా తెలియజేశారు. ఇలాంటి విమర్శలు ఎంత చతురతతో ఉంటాయో, అంతగా కాల్చి వాత పెట్టినట్లూ ఉంటాయి.
ఆయన ఒక సభలో వాదోపవాదాల్లో తీవ్రంగా చర్చిస్తూ చివరకు విసుగెత్తి అన్నాడు “నేను ఒట్టి వెధవను కాబట్టి మీతో ఇంకా వాదిస్తున్నాను” అని. అందుకు ప్రత్యర్థి “తెల్సిన విషయాలే ఎందుకు చెబుతారు. కొత్త విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి” అన్నాడు. ఇదో రకమైన విమర్శగాని విమర్శ.
కొన్ని దశాబ్దాల క్రిందట భారతి, జాగృతి, ఆంధ్ర పత్రిక లాంటి పత్రికలలో సాహిత్యం మీద మంచి విమర్శలు వచ్చేవి. పాఠకులకు అవి విజ్ఞానదాయకంగానూ ఉండేవి.
కొంత కాలం కిందట కొన్ని పత్రికలలో వచ్చిన విమర్సలు వ్యక్తిగత దూషణకు దిగటంతో, ఉన్న పరువు పోయే పరిస్థితి ఏర్పడింది. ఒక కవి… తో ‘ఎట్లారా నీవు సామ్యవాదివి, ఎట్లారా నీవు కమ్యూనిష్టువి?’ – అని నిందకు దిగితే, ఆయన పి.ఏ.పి. లో ‘నా పాట సగం గతికావు, ఇంకా ఎందుకురా బతికావు?’ – అని తిట్టి పోశాడు. ఇవి నిందారోపణలే అవుతాయి గానీ విమర్శలు కావు.
అలాగే కొన్నేళ్ల కిందట బూదరాజు రాధాకృష్ణగారు ఈనాడులోను, జి.వి.సుబ్రమణ్యంగారు ఆంధ్రభూమిలోనూ సీరియల్‌గా విమర్శించుకొని, చివరకు అక్కడా వ్యక్తిగత దూషణల స్థాయికి దిగారు. పండితులు చేయవల్సిన పని కాదు అది.
ప్రతి వారికీ ఎవరి అనుభవాలను బట్టి, వారికి కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఏర్పడతయి. అవి అందరికీ నచ్చాలనీ, అందరూ మెచ్చుకొని తీరాలన్న నియమం ఏమీ లేదు. కొన్ని దశాబ్దాల క్రిందట యువ భారతి అనే ఒక సాహిత్య సంస్థ వారు, ఆయా ప్రక్రియలలో ఉద్దండ పండితుల చేత ప్రాచీన సాహిత్యం మీద వ్యాసాలు రాయించారు. సారస్వత పరిషత్ ప్రాంగణంలో సభలు ఏర్పాటు చేశారు. ప్రేక్షకుల అభిప్రాయం కోసం ఒక పుస్తకం పెడితే, చెదలు పట్టిన సాహిత్యాన్ని దులిపి అచ్చు వేస్తున్నారంటూ ఎవరో విమర్శించారు.
ప్రాచీన సాహిత్యం ఇప్పటి వారికి నచ్చదు. పద్య కవిత్వమే కవిత్వం గానీ, వచన కవిత్వం కవిత్వమే కాదని ఒకప్పడు నిరసించిన వారు ఉన్నారు. అభ్యుదయ రచయితల సంఘం అనీ, విప్లవ రచయిత సంఘం అనీ, దిగంబర కవిత్వమనీ – కొన్ని బృందాలు కొంత కాలం పని చేశాయి. శ్రామిక వర్గానికి కొమ్ము కాస్తున్నామన్న దిగంబర కవులు తమ కవితా సంకలనాలను అమావాస్య అర్ధరాత్రి పూట, ఒక రిక్షావాని చేత ఆవిష్కరింప చేశారు. బాలగంగాధర తిలక్ వారికి ఉత్తరం రాస్తూ “మీరు రిక్షావాని చేత ఆవిష్కరింప చేసినా, మంత్రిగారి చేత ఆవిష్కరింప చేసినా, రెండూ ఒకటే, వాళ్లు ఇద్దరూ కవిత్వం చదవరు” అని అన్నారు. అది నిష్ఠూరంగా ఉన్నా నిజమే.
ఒకప్పుడు భావ కవిత్వాన్నీ తేలికగా తీసేసిన వారున్నారు. కాలం పరిణామశీలి. కాలంతో పాటు, అభిప్రాయాలూ, ఆలోచనలూ మారుతూనే ఉంటయి. ఒకప్పుడు సంస్కృతం తెల్సిన వాడే పండితుడు. ఒకప్పుడు ఇంగ్లీషు వచ్చిన వాడే విద్యావంతుడు. సాహితీ స్రవంతి అన్నిటినీ, అందరినీ తనలో కలుపుకొని పోతూనే ఉంటుంది.
నిన్నటి పరిస్థితులు వేరు. నేటి పరిస్థితులు వేరు. ఒకప్పుడు బి.ఏ చదివితే గొప్ప. ఉద్యోగాల వేట మొదలయ్యాక, బి.యసి. బి.కాం చదవాలన్నారు. ఇప్పుడు బి.టెక్‌లు వచ్చాయి. రేపు ఇంకా మరుగున పడిపోవచ్చు.
కాన్వెంట్ చదువుల ఉరవడిలో తెలుగు మృత భాష అవుతుందేమో అన్నారు. తెలుగు కథలు, నవలల ప్రాభవం తగ్గుతోందన్న అభిప్రాయము ఉంది. యువతరానికి సాహిత్యం అంతగా రుచించటం లేదన్న వాదనా ఉన్నది.
కవిత్వం మీద చులకన భావం ఏర్పడుతోంది. కవిత్వం చదువుతానంటే పారిపోతున్నారని చెప్పటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇందుకు కారణం కవిత్వంలో ఉండవల్సిన భావ గాంభీర్యం, శబ్ద సౌందర్యం, వ్యక్తీకరణ ఔచిత్యం కొరవడటం ఒక కారణంగా చూపిస్తున్నారు.
“ఈయన డాక్టరు గారు. కవిత్వం కూడా రాస్తారు” అని అంటే, “జనాన్ని చంపటానికి, వైద్యం అయితేనేం, కవిత్వం అయితేనేం” – అని విసుర్లు విసురుతున్నారు.
కవిత్వంలో ఏముందీ – అని అంటే, ఒక విమర్శకుడు ఏమన్నాడంటే – “మర్రి చెట్టు విత్తనం తీసుకో. దాన్ని పగల కొట్టు. అందులో నీకేమీ కనిపించదు. దానిలోని సారమే ఒక మహావృక్షానికి బీజం అవుతుంది. అలాగే కవిత్వం ఆలోచనను రేకెత్తించాలి. ఆలోచనా పరంపరకు ఒక బీజం కావాలి”. ఇదీ కవిత్వం మీద ఒక విమర్శకుని వ్యాఖ్యానం.
అసలు విమర్శ ఉంటేనే సాహిత్యం పరిఢవిల్లుతుంది. విమర్శకుడిలా విఫలమైన కవి, రచయిత ఉంటాడని అంటారు. అంతే కాదు విమర్శకుడిలో నిష్పక్షపాతంగా ఆలోచించే ఒక ఉత్తమ పాఠకుడు, ఒక విశ్లేషకుడు, ఒక జ్ఞాని, ఒక పండితుడు, ఒక న్యాయనిర్ణేత అంతర్లీనంగా ఉంటాడు. విమర్శ చేయటం అంటే తప్పు లెన్నటం కాదు. రంధ్రాన్వేషణ అంతకన్నా కాదు. విమర్శ అనేది ఒక శాస్త్రం. ఒక అరుదైన విజ్ఞానం. విమర్శకునికి అసూయ, కీర్తి కండూతి, వ్యక్తిగత ద్వేషం ఉండకూడదు. చేసే విమర్శలో ఎంతో సంయమనాన్ని పాటించాలి.
విమర్శ, సమీక్ష రెండూ ఒకటి కాదు. సమీక్ష అంటే రివ్యూ. విమర్శ అంటే క్రిటిసిజం. సమీక్ష చేయటానికి పాండిత్యం అక్కర్లేదు. ఒక రచన చదివినప్పుడు. అందులో ఏదో ఒక అంశం అతనికి నచ్చుతుంది. దాన్ని విశదంగా చెప్పటమే సమీక్ష. విమర్శ అలా కాదు. ఆ రచన గుణగణాలను విశ్లేషించి చెప్పగలగాలి.
విమర్శ ఎప్పుడూ శ్లాఘనీయంగా ఉండదు. చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపవచ్చు. దానిని రచయిత సానుకుల ధోరణితో స్వీకరించాలి. లేదంటే, అది ఎలా సందర్భనీయమో వివరించాలి. ఎంత పరిణతి చెందిన వారు రాసినా ఎక్కడో ఒక చోట భిన్నమైన ఆలోచన వల్ల ఇతరులకు అంతగా రుచించకపోవచ్చు.
ఇందులో మళ్లా విమర్శించటం వేరు, ప్రోత్సహించటం వేరు. వర్ధమాన రచయిత రాసిన కథ అంతగా ఆకట్టుకోకపోవచ్చు. దానిని ఖండఖండములుగా ఖండించ వలసిన పని లేదు. ఎంత ప్రముఖడికీ ఒక దశలో ఆదరణ ఉండదు.
సోమర్‍సెట్ మామ్ అనే ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మొదట్లో పన్నెండు సంవత్సరాలు తీవ్ర నిరాశకు, నిరాదరణకు, నిర్లిప్తతకు గురి అయినాడు. అయితే ఆయన ఈ సమయంలో తనకు ఎదురైన అవరోధాలనూ, కష్టాలనూ, అవమానాలనూ అనుభవసారంగా మలుచుకున్నాడు. మానవ స్వభావాల గురించి ఎన్నో విషయాలను అవగతం చేసుకున్నాడు. ఎవరూ పట్టించుకోకపోయినా, రచనా వ్యాసంగం సాగిస్తూనే వచ్చాడు. లండన్‌లో ఒక నిర్మాత తన దగ్గరున్న స్క్రిప్ట్ నచ్చక, మరొక స్క్రిప్ట్ కోసం వెతుకుతూ, పాత ఫైల్స్ తిరగేస్తుంటే, పాత స్క్రిప్ట్ ఒకటి దొరకింది. అది మామ్ రచించిన “లేడీ ఫ్రెడెరిక్”. ఆ నాటకాన్ని ప్రదర్శించాడు. దానికి మంచి స్పందనం వచ్చింది. మామ్‌కి రాత్రికి రాత్రికి మంచి పేరు వచ్చింది. మిగిలిన ప్రొడ్యూసర్స్ మామ్ రచనల కోసం పోటీ పడ్డారు. అప్పటికే ఆయన వద్ద చాలా రచనలు పోగుపడి ఉన్నయి. వాటి అన్నిటికీ మంచి ప్రాచుర్యం లభించింది. “నేను ఒక జీనియస్ కాక ముందు నేనొక నిరర్థకమైన జీవిని” అని ఆయన చెప్పుకున్నారు.
అంచేత ప్రజల అభిరుచులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిన్న మొన్నటి పాతబడిన కథలన్నీ రేపొక దుమారం లేపనూ వచ్చు.
విమర్శలు, చర్చోపచర్చలూ, సిద్ధాంతాల రాద్ధాంతాలు, దూషణ భూషణ తిరస్కారాలు సాగుతూనే ఉంటయి.
నచ్చిన వాడు యుగకర్త. నచ్చని వాడు కుకవి. సమీక్షకుడూ. విమర్శకుడూ, పాఠకుడు – ఎవరు ఎలా స్పందిస్తారో చెప్పటం కష్టం. అందుకు సోమర్‌సెట్ మామ్ నిదర్శనం. తెలుగులోనూ చాలా మంది ఉన్నారు. కానీ ఒకరంటే ఒకరికి గిట్టదు.
ప్రతి తెలుగు వాడిలోనూ రచయిత లేకపోయినా, ఒక విమర్శకుడు ఉన్నాడు. విమర్శ అంటే తెలుగు వాడికి తిట్టుగా అర్థమవుతుంది. ఒకడు పండితుడంటే, మరొకుడు ఒప్పుకోడు. దీని మేలుకీళ్ల సంగతి అలా ఉంచితే, తెలుగు వాడి అహంకారమే వాడికి అలంకారంగా భాసిల్లుతుందని – జి.వి సుబ్రమణ్యంగారు అన్నారు.