నేను కూడా నిజాయితీ కోసం

13
3

[dropcap]ని[/dropcap]ద్రాణంలో ఉన్నవారిని కూడా చైతన్యవంతులను చేయగల శక్తి ఒక్క సూర్య భగవానునికే ఉంది. ఒకవైపు గుడిగంటల మ్రోగుతున్నాయి. మరియొకవైపు నుండీ వివిధ మోటారు వాహనాల శబ్దాల సుప్రభాతంలో హైదరాబాద్ నగరం ఆనందంగా మేల్కొంది.

ఆ రోజు ఆదివారం, జూన్ 7, 1981. ఉదయం నేను కాఫీ త్రాగే సమయానికి ఊరు నుంచీ వూడిపడ్డాడు మిత్రుడు నాగిడి బులిస్వామి, మా ఇద్దరికీ టిఫిన్లు, కాఫీలు ఇచ్చింది మా అక్కయ్యగారు. ఇలాగే ఆదివారాలు ఇంకా శెలవు రోజుల్లో చుట్టాలు, స్నేహితులు మా ఇంటికి రావటం, వాళ్లకి జంట నగరాల్లోని ముఖ్యమైన సందర్శనా స్థలాలు చూపించటం నాకు తప్పక అలవాటైపోయింది. ఈ సైట్ సీయింగ్ కొత్తలో సరదాగా వున్నా, రాను రాను మహా కష్టంగా మారిపోయిన వైనం పైనున్న భగవంతునికే తెలుసు.

మరి ఈ స్నేహితుడు ఎక్కడకు వెళ్ళాలంటాడో!! అని ఆలోచిస్తుండగానే “ఒరేయ్ ఇప్పుడు మనం పటాన్‌చెరువులో వున్న నెక్కంటి వెంకటేశ్వరరావుని కలవటానికి వెళ్లాలి” అని చెప్పడంతో కోఠీ నుండీ పటాన్‌చెరుకి బస్సులో ప్రయాణమయ్యాం.

“ఇదుగో ఇదే ‘సిటీ బస్ స్టేషన్’. దీనిని నిజాం పరిపాలనా కాలంలో హెలికాఫ్టర్లు పెట్టుకోవటానికి నిర్మించబడిరది. దీన్నే అతిపెద్ద బస్‌స్టాండ్‌గా మార్చేశారు. అదిగో అటు చూడు! ఆంధ్రప్రదేశ్ విధానసభ, విధానమండలి భవనం. ఒరేయ్! ఇది కూడా నిజాం కాలం నాటిదే! ఎంత బాగుందిరా! ఈ నాటికీ కూడా చెక్కు చెదరలేదు. గొప్ప కట్టడాలన్నీ ఆ రోజుల్లో రాజులే కట్టేశారు!” చెప్పాను. “మరి మనమేం కట్టలేదా?” అంటూ నన్ను యక్ష ప్రశ్నలతో సతమతం చేస్తుండగా, “ఇదిగో ఇటువైపు చూడు, ఇదే రవీంద్రభారతి! ఈ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు నాటకాలు కూడా ప్రదర్శిస్తారు” అని వివరంగా మిత్రుడికి చెప్పాను.

“మరి నువ్వు ఈ ప్రోగ్రామ్లన్నీ చూస్తావా!” అని వాడు అడగటంతో, “ఇంకా చూసేదేముంది? ఈ రోజు నువ్వొచ్చావుగా! ఇదే ఒక పెద్ద ప్రోగ్రాం, నాటకం కూడా!” అని చెపుతూ ఉండగా “ఒరేయ్! ఇదేం వంతెనరా?” అని అడిగాడు. “ఇదే ‘లకడీ కా పూల్’. అంటే ఆ రోజుల్లో కట్టెలతో వంతెన నిర్మించారు. అందుకే ‘లకడీ కా పూల్’ అని పేరు పెట్టారు” అని చెప్పాను. “ఏంటీ లడకీక పూలా?” అన్నాడు. “ఒరేయ్ జాగ్రత్తగా పలకాలి. ఇది ‘లకడీ కా పూల్’ అని చెపుతూ నిద్రలోకి జారుకున్నాను నేను.

దాదాపు గంట తరువాత “పటాన్‍చెరువు దిగాలి! దిగాలి!! ఇదే ఆఖరి స్టాప్” అని కండక్టర్ గట్టిగా అరవటంతో మేమిద్దరం మేల్కొని బస్సు దిగేశాం!

స్నేహితుడి చిరునామా వెతుక్కుంటూ వెళ్లగా అతని రూమ్ యొక్క తాళం మమ్మల్ని వెక్కిరించి, హేళనగా నవ్వింది. ఇంటివాళ్లను వాకబు చేయగా వాళ్లు కూడా తెలియదని చెప్పారు. అప్పట్లో సెల్‌ఫోనులు లేవు సరికదా బ్యాచిలర్స్‌కి లాండ్ ఫోనులు ఎక్కడి నుండి వస్తాయి?

వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకవేళ వెంకటేశ్వరరావు సినిమాకు వెళ్లి ఉండవచ్చునని, అక్కడ అశోక్‌నగర్‌లో వున్న జ్యోతి సినిమా థియేటర్‌కి వెళ్లి మేనేజర్‌ని కలిశాము. వారు మాకు అనుమతి ఇవ్వటంలో సినిమాహాలు లోనికి వెళ్లి స్నేహితునికోసం వెతకటం ప్రారంభించాం. అది మ్యాటనీ షో. అప్పుడు శంకరాభరణం సినిమా ఆడుతోంది. ఇక్కడ మా స్నేహాన్వేషణ సినిమా మా ఇద్దరి సహనాన్ని పరీక్షిస్తోంది.

అతని కోసం వెతికి వెతికి వేసారి నీరసం వచ్చేసింది. ఇద్దరి దగ్గరా ఉన్న డబ్బులతో టిఫిన్లు చేశాం, కడుపు నిండా మంచినీళ్ళు త్రాగేశాం. అక్కడున్న ఒక ఖాళీ స్థలంలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాం. “ఏమిటిరా ఇలా అయ్యింది?” అంటూ స్నేహితుడు స్వామి ప్రశ్నిస్తూ ఉంటే, నా కోపాన్ని అణుచుకున్నాను. అసలే కవిని నేను, వెంటనే నెక్కంటి మీద, స్వామి మీద వ్యంగ్య కవిత్వం చెప్పటం ప్రారంభించాను.

అసలు ఇదంతా నావల్లే జరిగిందంటూ స్వామి చెపుతూ నన్ను కూల్‌డౌన్ చేయటానికి ప్రయత్నించాడు. “అయినా నువ్వు ముందుగా ఉత్తరం వ్రాసి, ఫలానా రోజు నేను హైదరాబాద్ వస్తున్నానని చెపితే మనకు ఈ అనవసర శ్రమ, త్రిప్పుట ఉండేవి కావు” అంటూ ఇప్పుడేమి చేద్దాం? అనే ఆలోచనల్లో మునిగిపోయాను.

అప్పుడు రాత్రి ఎనిమిది గంటలు కావస్తోంది. మళ్ళీ తిరిగి కోఠీ, హైదరాబాద్‌కి బస్సులో వెళ్లటానికి మా ఇద్దరి దగ్గరా డబ్బులు లేవు. స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకోవచ్చని స్వామి వచ్చాడు. కానీ ఆ స్నేహితుడు మాత్రం హైదరాబాద్‌లో వున్న అక్కయ్య ఇంటికి వెళ్లినట్లు ఆ తరువాత తెలిసింది.

ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో బస్సెక్కాలంటే డబ్బులు కావాలి. మరి టికెట్ లేకుండా బస్సు ప్రయాణం చేస్తే ఇద్దరికీ చలాన్ వేస్తారు. అది నేరం కూడా. ఇక లాభం లేదని నిర్ణయించుకొని పదకొండు నెంబరు బస్సు ఎక్కాము.

రాత్రంతా నడుస్తూనే ఉన్నాము. మార్గం మధ్యలో పెట్రోలింగ్‌లో వున్న పోలీసులు మమ్మల్ని ఆపి ఇంటరాగేట్ చేశారు. ఎందుకంటే నేను లంబులా, స్నేహితుడు జంబులా ఉన్నాం. పోలీసులు మా ఇద్దరినీ అనుమానాస్పదంగా చూస్తున్నారు. “ఎందుకని మీరిద్దరూ ఇంత రాత్రివేళ నడుచుకుంటూ వెళుతున్నారు? బస్సెక్కి వెళ్ళచ్చుకదా!” అని అడిగేవాళ్లు. అప్పట్లో నేను డిగ్రీ చదువుతున్నాను. వాడు మాత్రం డిగ్రీ పూర్తి చేసి సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు.

మా వివరాలన్నీ ప్రతీ పోలీస్ పోస్ట్ దగ్గరా నిర్భయంగా చెప్పాం. నైట్ పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు కాబట్టి వాళ్ల దగ్గర వైర్లెస్ కమ్యునికేషన్ వ్యవస్థ ఉండేది. “మీ ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నాం, రండి! రండి!!” అంటూ పోలీసులే మమ్మల్ని ఆహ్వానించేవారు. ఎంతకింత కట్టుదిట్టమైన నిఘా ఉంది. ఆ రోజు అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 13 సంవత్సరాల తరువాత తిరిగి పంచాయితీ ఎన్నికలు జరగటమే అయ్యుండవచ్చును. కౌంటింగ్ అయ్యేవరకు బ్యాలెట్ బాక్సులను ఎవరూ ఎత్తుకుపోకుండా కాపలా కాయలి కదా! అందుకేనేమో? వాటికోసం నక్సలైట్ల కదలికలు కూడా ఎక్కువగా ఉండవచ్చునన్న ప్రణాళికతో పోలీసు వ్యవస్థ కట్టుదిట్టం చేసి ఉండవచ్చును. ఇలా నడుస్తూ మధ్యలో కొంచెంసేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని, మళ్లీ నడవటం ప్రారంభించాం. ఇంతలో ఒక పోలీస్ వ్యాన్ వచ్చి మాముందు ఆగింది. “ఏయ్ ఎవరయ్యా మీరు ఎక్కడికెళుతున్నారు?” అని ఇన్‍స్పెక్టర్ కరకుగా ప్రశ్నించాడు. “ఎందుకని ఇంత అర్ధరాత్రి వేళ నడుచుకుంటూ వెళుతున్నారు?” అంటూ సీరియస్‌గా అడిగాడు. మేము మాత్రం మామూలుగానే, శాంతంగానే సమాధానం చెప్పాం.

‘మియాపూర్ కహా హై బోలో’ అని అడిగాడు ఇన్‍స్పెక్టర్. “సార్ ముఝే మియాపూర్ మాలూమ్ నహీ హై! లేకిన్ ‘నయాపూల్’ మాలూమ్ హై!” అని నిర్భయంగా చెప్పాను. ఆ రోజుల్లో పటాన్‌చెరువు నుండి కుక్కట్‌పల్లి వరకూ రోడ్డుకిరువైపులా దాదాపు అడివిలాగానే ఉండేది.

“ఠీక్ హై! జావ్ జావ్!” అంటూ ఇన్‍స్పెక్టర్ అంటుండగా “సార్! హమ్ దోనో కోఠీ జానాహై! కృపయా తోడా ఆప్ కా వ్యాన్ మె లిఫ్ట్ దీజియే” అని ఇన్‍స్పెక్టర్‌ను రిక్వెస్ట్ చేశాను.

“నైనై! తుమ్ పైదల్ జావ్! కల్ సుబహ్ తక్ హైదరాబాద్ పహుంచేగా!” అంటూ విసురుగా వ్యాన్ ఎక్కి పోలీసులతో సహా వెళ్లిపోయాడు ఇన్‍స్పెక్టర్.

“ఒరేయ్! నువ్వు హిందీ బాగానే మాట్లాడుతున్నావుగా” అని కితాబు ఇచ్చాడు నా స్నేహితుడు. నాకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. అప్పటికే నేను హైదరాబాద్ వచ్చి ఐదు సంవత్సరాలు అయ్యింది కదా! అందుకనే ఏదో ఒక మాదిరిగా హిందీ నేర్చుకున్నాను.

అప్పుడర్థమయ్యింది మన దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ ఎన్ని కష్టాలు పడ్డాడో! సత్యాన్నే పలకాలి. నిజాన్ని చెపుతూ నిర్భయంగా బ్రతకాలన్న ఆయన ఆశయమే నాకు స్ఫూర్తి. అందుకే ఆరోజు పటాన్‌చెరువు ఇండ్రస్ట్రియల్ ఎస్టేట్ నుండీ కోటీ వరకూ 40 కి.మీ. అంటే దాదాపు 25 మైళ్ల దూరం సాగిన మా ‘నిజాయితీ పాదయాత్ర’. ఏదీ ఆశించకుండా చేసిన మా పాదయాత్రను గుర్తుచేసుకొని ఇప్పటి తరానికి ఒక పాఠంగా చెపుతూ ఉంటాను. మా కథ విన్నవాళ్లు ‘శభాష్’ అంటూ వుంటే ఏదో విజయం సాధించినవాడిలా ఉద్వేగానికి లోనౌతూ కూడా ఉంటాను.

మొత్తానికి తెల్లవారు జామున 4 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తాలో గల సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం దగ్గర పచ్చికపై పడుకుంటే అది పట్టుపరుపులా అనిపించింది. అక్కడ ఒక గంటసేపు నిద్రపోయాక, పబ్లిక్ గార్డెన్స్ చేరుకొని అక్కడ కూడా ఒక గంటసేపు ఆదమరచి నిద్రపోయాము.

అక్కడ నుండి మా గమ్యమైన కోఠీ, గౌలీగూడ చేరుకొన్నాము. అప్పట్లో నాకు పోస్టల్ సేవింగ్స్ ఎకౌంట్ ఉండేది. దాంట్లోంచి కొంత డబ్బు డ్రా చేసి నా స్నేహితుడు స్వామికి ఇవ్వగా అతను నాకు కృతజ్ఞతలు చెప్పి ఆ రోజే భీమవరానికి ప్రయాణమయ్యాడు. ఎందుకంటే మరుసటి రోజు ముఖ్యమైన పెళ్లికి హాజరు కావాలట!

నేను నాల్గవ తరగతిలో ఉండగా మా క్లాస్ టీచర్ కాంతారావు చెప్పిన పాఠం ఇంకా గుర్తుంది. గాంధీగారు ఇంగ్లీషులో కెటిల్ అనే పదం స్పెల్లింగ్ తప్పు వ్రాయగా, మజుందార్ అనే తోటి విద్యార్థి యొక్క పేపరులో చూచి వ్రాయమని స్వయంగా మాష్టారే చెప్పినా గానీ, అలా కాపీ చేయటం తప్పు కదా అని భావించిన గాంధీగారు కాపీ చేయకపోవటమే నాకు స్ఫూర్తి.

అదే రోజు ఇంటర్వెల్‍లో ఒక జామచెట్టు ఎక్కారు నా ఇద్దరు తోటి విద్యార్థులు. నేను మాత్రం జామ చెట్టుకింద నుంచున్నాను. వాళ్లు జామకాయలు కోసుకొని నిక్కరు జేబుల్లో దాచుకొని, నాకు ఒక జామకాయ క్రిందకు వేస్తే క్యాచ్ పట్టుకున్నాను. ఇంతలో తోట యజమాని చాకలి సోమయ్య (పొట్టి సోమయ్య) అక్కడికి రానే వచ్చాడు. ఆయనను చూడగానే భయంతో ఇద్దరు తోటి విద్యార్థులు చెట్టుమీంచి దూకి పారిపోయారు. కానీ నేను మాత్రం అక్కడ నుండీ పారిపోలేదు.

ఇంతలో తోట యజమాని సోమయ్య నా దగ్గరకొచ్చి “నువ్వెందుకు పారిపోలేదు వాళ్లతోపాటు?” అని అడిగాడు. “జామకాయలు కోసింది వాళ్లేగదా! నేను కోయలేదుగా” అని నిజాయితీగా చెప్పాను. కానీ నాకు లోలోపల ఏదో భయంగానే వుంది. సోమయ్య స్కూలుకి వచ్చాడు. హెడ్మాస్టర్ కాంతారావుగారికి జామకాయల దొంగతనం గురించి చెప్పనే చెప్పాడు. అలాగే నా గురించి కూడా చెపుతూ సోమయ్య నన్ను మెచ్చుకున్నాడు. కాంతారావుగారు కూడా నన్ను ప్రత్యేకించి అభినందించారు.

“సార్! ఈ రోజు మీరు చెప్పిన గాంధీగారి పాఠమే నన్ను నిజాయితీగా ఉండడంతోపాటు నిర్భయంగా మాట్లాడడం కూడా నేర్పింది” అని నేను చెప్పగానే క్లాస్ విద్యార్థులంతా చప్పట్లతో అభినందించారు.

‘నేను కూడా నిజాయితీ కోసం’ అంతో ఇంతో నిజజీవితంలో జీవిస్తున్నందుకు నాకు ఇప్పటికీ గర్వంగానే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here