[dropcap]వె[/dropcap]న్నెలకాసే రాత్రులలో హాయిగొలుపు చల్లగాలిలో
ఆ గాలి మోసుకొచ్చిన సుగంధ పరిమళాలు
ఏ వయసువారిని అయినా మురిపిస్తాయి.
కవితలు పుట్టుకువస్తాయి కలలో వింతలూ కనిపిస్తాయి
మనసును మురిపించి మదిలో వీణలు మ్రోగిస్తాయి
అందమైన ఈ ప్రకృతి మైకంలో మనలను ముంచుతాయి.
పచ్చని చెట్ల ఆకులపై తళ తళ లాడే వెన్నెల
అరవిరిసిన పూలసోయగాలను కూడా మైమరిపిస్తోంది
గాలితో కలిసి విరులతో మురిసి ఊయల లూగుతుంది.
మదిలో వీణలు మ్రోగించి ప్రేమగీతాలు ఆలపిస్తుంది
చిలిపి అల్లరి చేసిన గాలి -పయ్యెదతో ఆడుకుంటూ పరువు తీస్తుంటే
సిగ్గుపడిన కన్నె వదనం వెన్నెల రేనికి కనులవిందు చేస్తుంది.
చీకటి రాత్రులలో దేశ సంచారం చేస్తూ ప్రేమ జీవులపై నిఘా వేస్తాడు
వెన్నెల కాసే రోజుల్లో చెలియ మనసుకు గాలం వేస్తాడు
ఎమెరుగని నంగనాచి వెన్నెలరేడు వాడు.
చందమామకు వెన్నెల ఆయుధం విరులకు మకరందం ఆకర్షణ
వెన్నెల కురిపించి పూలలోన తేనే నింపు పోకిరివాడు
మధుపములతో మంతనాలు చేయు టక్కరి దొంగ అతడు.
మేఘరాజుతో కలిసి వర్ష ఋతువులో కుట్రలు చేస్తాడు
సరోవరాన విరియు కన్నె కలువల వలువలు వర్షంతో తడిపేస్తాడు
అయ్యో పాపం! అంటూ సానుభూతి చూపుతాడు ఆ కొంటె గాడు.
ఒక పిలుపేదో గాలి తరంగాలపై తేలి వచ్చెను
అనురాగాగీతమై నా మదిని కదిలించేను
ఆ అలజడిలో నీరూపమే కనిపించును చందమామలో .
నీ చూపులు నాకనులలో వెలిగించును కోటి దీపాలు
ఇక వెన్నెలెందుకు తారల తళుకులెందుకు
చందమామకు నాతో పరిహాసమెందుకు!