[dropcap]’ఈ[/dropcap] రాజేశ్వరి ఎవరో? ఎక్కడి నుండి వచ్చిందో? ఆమెకూ తనకు ఇంత దగ్గర పోలికలుండటమేమిటో? అనుకుంటుంటే ఏమీ అంతుబట్టడం లేదు. మొన్న సంక్రాంతి కెళ్ళినప్పుడు అమ్మనైనా అడగాల్సింది. రాజేష్ అన్నట్లుగా ఏ దూరపు చుట్టాలైన తన పోలికలతో వున్నారేమో? రాజేష్ కూడా అమ్మవాళ్ళ నడగటానికి మొహమాట పడి వుంటాడు. నేనేమో మరిచిపోయాను. ఈసారి ఫోన్ చేసినప్పుడైనా గుర్తుంచుకుని అమ్మనడగాలి’ అనుకుని తన పనుల్లో పడిపోయింది దేవసేన.
దేవసేన చెప్పినట్లే మాథ్స్ ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు – “అమ్మాయి కాస్త శ్రద్ధ పెడితే చాలు. తేలిగ్గా ఈ కోర్సు పూర్తి చేయొచ్చు. బాగా చదివించండి చాలు” అన్నారు. చాముండేశ్వరి వాళ్ళు అమ్మయ్య అనుకుని వచ్చేశారు.
ఆ రాత్రికి రాజేష్ వచ్చిన తర్వాత రాజేశ్వరి విషయమంతా చెప్పంది దేవసేన.
“మీ ఇద్దరి పోలికల విషయమై నేను ఆలోచిస్తున్నాను దేవసేనా. విషయం ఏదో వుందనిపిస్తుంది. ఒకసారి ఆవిడను కలసి మాట్లాడితే సరి. ఏ వైపు నైనా బంధుత్వం వుందేమో తెలుస్తుంది.”
“పో రాజేష్. బంధుత్వమూ వుండదు. ఏమీ వుండదు. నాకు తెలియని చుట్టాలు అమ్మ తరఫునా, నాన్న తరుపునా ఎవరూ లేరు. కాని మా ఇద్దర్నీ ఒక చోట చూసిన వాళ్లు మాత్రం ఆశ్చర్యపడక తప్పదు” అన్నది నవ్వుతూ దేవసేన.
దేవసేన తీసుకున్నంత తేలిగ్గా రాజేష్ తీసుకోలేకపోయాడు. ‘ఈ విషయమేమిటో పూర్తిగా తెలుసుకంటేగాని తనకు స్థిమితంగా వుండేటట్లు లేదు’ అనుకున్నాడు.
రాజేష్ మనసులో అనుమానం ఏ మూలో చిన్న పాము పిల్లలాగా కదలసాగింది. ఎలాగైనా ఆమెను కలిసి మాట్లాడితే కాని విషయం తేలదు అనిపించింది. వెళ్లి మాట్లాడాలంటే చాముండేశ్వరి గారింటికి వెళ్లాలి. ‘వెళ్లి అడిగితే బాగుంటుందా? అసలావిడ తన అంతరంగం విప్పి చెప్తుందా? చాముండేశ్వరో, ఆమె భర్తా ఏమైనా అపార్థం చేసుకుంటారా? ఇందులో అపార్థం చేసుకోవటానికి ఏముందిలే. పొలైట్‌గా మాట్లాడి వస్తే సరి’ అనుకున్నాడు. ఈ ఆలోచనల నుంచి బయటపడి రేపటి తన క్లాసుకు ప్రిపేర్ కావాలనుకున్నాడు. రేపు పి.జి స్యూడెంట్స్‌కు క్లాసు తీసుకోవాలి. తనకెంత ఎక్స్‌పీరియన్స్ వున్న యమ్.బి.బి.యస్. వాళ్ల క్కానీ, పి.జి స్టూడెంట్స్ క్కానీ క్లాసు తీసుకోవాల్సి వస్తే ఆ ముందురోజు రాత్రి థరోగా ప్రిపేరవుతాడు. అరగంట క్లాస్ చెప్పాలంటే ఆరు గంటలన్నా ప్రిపేరేషన్ వుండాలి అనే సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాడు తను. ఎక్కడెక్కడి మెడికల్ బుక్స్ తెప్పించి చదువుతాడు. చదవటంతో పాటు మరుసటి రోజు చెప్పబోయే క్లాసుకు సంబంధించిన స్లైడ్స్ అన్నీ శ్రద్ధగా చూసుకని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం సిద్ధపడిపోతాడు. అప్పుడే తను స్టూడెంట్స్‌కు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగానన్న తృప్తీ, వారికి కావలసిన విషయం అందించగలగానన్న నమ్మకంతో బయటికొస్తాడు.
ఆ మధ్యాహ్నం రాజేష్ తన గాస్ట్రోఎంటరాలజీ వింగ్‌లో కుర్చుని వున్నాడు. హౌస్ సర్జన్ చేసేవాళ్లు, పి.జి. చదివేవాళ్లు తనకు ఎలాట్ చేసి పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. మధ్య మధ్యలో రౌండ్స్‌కు వెళ్లి వాళ్ల ట్రీట్‌మెంట్‌ను పరిశీలించి వస్తున్నాడు. రాజేశ్వరి విషయమే మనసులో మెదులుతున్నది. ‘చాముండేశ్వరి భర్త రాజేంద్ర ప్రసాద్ కాకినాడ బ్రాంచ్ రిలయన్స్‌లో సీనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఆ మధ్య వాళ్లింటికెళ్లినప్పుడు రిలయన్స్ షేర్ల గురించి మాట్లాడాడు. మంచి గ్రోత్ వుంటుంది కొంత ఎమౌంట్ ఉంటే దీంట్లోనూ పెట్టండి అన్నాడు. ఆ రోజు తనేమీ ఉత్సాహం చూపించలేదు. ఇప్పుడు రాజేశ్వరి విషయం తెలుసుకోవటం కోసమైనా ఈ షేర్ల వంకతో అతన్నో సారి ఇంటి దగ్గర కలవాలనుకున్నాడు. దేవసేన ద్వారా ట్రై చేద్దామంటే తనకా విషయం పట్ల ఏమాత్రం కుతూహలం లేదు. అదో పెద్ద కనుక్కోవాల్సిన విషయమా అని కొట్టిపారేస్తున్నది, ఆమెకు తెలియకుండా నేనే రంగంలోకి దిగాలి. ఎలాగైనా విషయం మేంటో తెలుసుకోవాలి.’ అనుకుంటూ ఆ సాయంకాలం నెమ్మదిగా పోనిస్తూ కారులో వస్తున్నాడు. లక్కీగా రాజేంద్ర ప్రసాద్ తన కార్లో ఇటే వస్తున్నాడు. దాదాపుగా వాళ్లంటి దగ్గరకొచ్చారు. కార్లు స్లో చేసుకున్నారు. ఇద్దరూ కార్లు దిగి రోడ్డు మీద నిలబడ్డారు.
రాజేష్ రిలయన్స్ షేర్ల గురించి అడిగాడు.
“ఇంటికెళదాం రండి డాక్టరుగారూ! బ్రోచర్ అంతా చూద్దూరు గాని. నేను వీటిని గురించి తెలిసిన వాళ్లందరికీ చెప్తున్నాను. కొంత ఎమౌంట్ దీంట్లోనూ పెట్టండి. తప్పకుండా మేలు జరుగుతుంది నష్టమంటూ రాదు” అని గట్టిగా చెప్తున్నాడు.
రాజేంద్రప్రసాద్, రాజేష్ ఇద్దరూ ఇంటికెళ్లి డ్రాయింగ్ రూమ్‌లో కూర్చున్నారు. చాముండేశ్వరి వచ్చి పలకరించి వెళ్లింది. రాజేంద్రప్రసాద్ షేర్ల విషయం వివరించి చెప్తున్నాడు. చాముండేశ్వరి యాపిల్ ముక్కలూ, మంచి నీళ్లు తెచ్చింది. మరలా కొంచెం సేపున్నాక టీ కప్పులు తెచ్చి ఇచ్చింది.
సంకోచాన్ని కొంచెం పక్కన పెట్టి “మీరే మాటి మాటికీ తిరుగుతున్నారు. మనిషి చేత పంపకపోయారా!” అన్నాడు రాజేష్.
“పోయిన సారి మీకు టీ పెట్టి ఇచ్చినామె నిన్ననే వెళ్లపోయిందండీ. మరొకర్ని వెదుక్కోవాలి.”
‘హతోస్మి’ అనుకున్నాడు. రాజేష్. ఎక్కడికెళ్లిందో ఎలా అడగాలి? అడిగితే ఈ డాక్టరేంటి ఇలా అడుగుతున్నాడని అనుకుంటారు. తను వచ్చిందే ఆ పని మీద. వీళ్ల సమక్షంలోనే ఆమెతో మాట్లాడదామనుకున్నాడు. ఇప్పుడామే లేదు.
“పోయిన సారి నేనూ, దేవసేనా వచ్చినప్పుడు టీ అదీ చాలా బాగా పెట్టిచ్చింది” అన్నాడు రాజేష్.
“అవునండీ. వంటంతా కూడా చాలా బాగా చేసేది. మంచి మనిషి. బాగా మర్యాదగలది కూడా.”
“అలా వెళ్లిపోయే రకమూ కాదు రాజేష్ గారూ. ఈమె మహాత్మాగంధీ సేవా సమితిలో ఎన్నేళ్లబట్టో వుంటున్నది. పెద్ద స్వామీజీ వున్నంత వరకూ బాగానే వున్నది. మాతాజీ బంధువులు కొద్ది మంది వచ్చి అక్కడ చేరారు. వాళ్లకి ఈ రాజేశ్వరి పొడ గిట్టలేదు. దాంతో మనస్తాపం చెంది రాజేశ్వరి బయటకొచ్చేసింది. ఇక్కడుంటుందన్న సంగతి తెలుసుకుని మాతాజీయే స్వయంగా ఫోన్ చేశారు. నాతోనూ మాట్లాడారు. ‘మీ ఇంట్లో వుంటే కేవలం మీ కుటుంబానికే వుపయోగపడుతంది. అదే మా దగ్గరయితే ఎంతో మంది వృద్ధులకు ఒకరకంగా అనాథలకు సేవా శుశ్రూషలు చేయగలదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. రాజేశ్వరిని వెనక్కు పంపండి’ అంటూ రాజేశ్వరికే ఫోన్ ఇమ్మన్నారు. మాతాజీ గొంతు వింటూనే తప్పిపోయిన చిన్నపిల్ల అమ్మ గొంతు విని వెక్కి వెక్కి పడ్టట్లుగా ఈ రాజేశ్వరి కూడా ‘మాతాజీ, మాతాజీ’ అంటూ విలవిలలాడింది. ‘రాజేశ్వరి! ఇన్నేళ్లు నీకు నీడనిచ్చిన మన సేవా సంస్థను వదలి ఎలా వెళ్లగలిగావు! నాకు ఒక్క మాట చెప్పొద్దా! నేను లేకుండా చూసి వెళ్ళిపోవటమేనా! వెంటనే వెనక్కి వచ్చేసేయ్. ఇకడున్న మామ్మలు, తాతలూ నువ్వు కనపడక తల్లి కనపడని లేగదూడల్లా అల్లాడుతున్నారు. ఇక్కడ వీచే గాలిలో నీ అడుగుల చప్పుడు లేదు. పూచే పూలలో పరిమళం తగ్గింది. నిన్నిక్కడ ఎవరూ ఏమీ చిన్నబుచ్చరు. వెంటనే బయలుదేరిరా. మాతాజీ మాటలకు గౌరవమివ్వు’ అన్నారు. అంతే ఆ పూట వంట హడావుడిగా చేసేసి మాతాజీ దగ్గరకే వెళ్లిపోయింది” అంటూ వివరంగా చెప్పింది చాముండేశ్వరి.
యథాలాపంగానే విన్నట్లుగా విన్నాడు రాజేష్. ఈ మాటలు విన్నాక రిలయన్స్ షేర్ల మీద ఆసక్తి పోయింది. కాని తన ఆలోచనలను బయటకు పోనివ్వకుండా అదిమిపెట్టి రాజేంద్ర ప్రసాద్ చూపించిన బ్రోచర్లను పరిశీలనగా చూశాడు. టాక్స్ ఎగ్జంప్షన్‌కు పని కొచ్చే షేర్లు తీసుకుంటానని చెప్పి వచ్చాడు. మహాత్మా గాంధీ సేవా సమితిని వెతుక్కుంటూ పోవాలి. ఎంతో కొంత డొనేట్ చేసి రావాలి అనుకున్నాడు. రాజేశ్వరి కనపడనందుకు కాస్త నిరుత్సాహంగా వున్నది.
***
ఆ రోజు శశిరేఖ తండ్రి కూతురింటికి వచ్చాడు. మాములుగా రోజు ఈ టైమ్‌లో హస్పిటల్లో వుంటాడు. వేళగాని వేళలో తన ఇంటికొచ్చిన తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది శశిరేఖ. వున్న ఊళ్లోనే కూతుర్ని ఇచ్చుకున్నా తమ వారెవరూ అతి చనువు తీసుకుని శశిరేఖను చూడటానికంటూ రారు. నర్సింహరావు లోపలికి వచ్చి కూర్చోగానే సుధారాణి ఎదురు పడింది.
“ఏమ్మా! బాగున్నావా?” అంటూ పలకరించాడు.
“ఆ… ఆ…” అంటూ లోపలికెళ్లిపోయింది. కనీసం కూర్చోమని కూడా చెప్పలేదని శశిరేఖ బాధపడింది. మాట వినిపించి సత్యవతి లోపలనుంచి వచ్చింది. నర్సింహరావును చూడగానే నవ్వు మొహంతో “రండి అన్నయ్యగారూ కూర్చోండి. ఒక్కరూ వచ్చారు. వదినగారూ వస్తే బాగుండేదిగా” అంటూ పలకరించింది. శశిరేఖ మాత్రం తండ్రి హాస్పిటల్‌కు పోకుండా ఈ టైమ్‌లో తమ ఇంటికెందుకొచ్చాడా అని ఆలోచిస్తూ కళవళ పడసాగింది. ఆలా ఆలోచిస్తూనే తండ్రికి మంచి నీళ్లు తెచ్చిఇచ్చింది.
ఆ మంచి నీళ్లు తాగాడు.
“నువ్వు కూర్చుని మీ నాన్నతో మాట్లాడూవుండు. నేను లోపలికి వెళ్లి కాఫీ పంపిస్తాను” అని లోపలికి వచ్చింది సత్యవతి. అక్కడ సుధారాణి తన కోసం కారెట్ జ్యూస్ తీసుకుంటున్నది.
“సుధా! శశిరేఖా వాళ్ల నాన్నగారు నీకూ తండ్రి లాంటి వారే. ఒకసారి పలకరించి రా.”
“ఊళ్లో మనిషేగా అత్తయ్యా. పొరుగూరి నుంచి రాలేదుగా.”
“ఊళ్లో మనిషి అయితే మాత్రం మన ఇంటికి తరుచుగా వచ్చే మనిషి కాదు. ఇంటి కొచ్చిన వాళ్లను పలకరించి మర్యాద చేయటం మన బాధ్యత” అన్నది.
“ఈ జ్యూస్ తాగేసి వెళ్తానులే” అన్నది నిర్లక్ష్యంగా.
నర్సింహరావు కాఫీ పంపించి మరలా తన కూడా హాల్లోకి వచ్చింది సత్యవతి.
అన్యమనస్కంగానే కాఫీ కప్పు చేతిలో పట్టుకుని “మేం రేపు బయల్దేరి హైద్రాబాద్ వెళ్తున్నామమ్మా.”
“ఇప్పుడెందుకు నాన్నా! మురళీ ఏమన్నా రమ్మన్నాడా ! హస్పిటల్ వదలి పెట్టి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లవు. విషయమేమిటి నాన్నా?”
“వెళ్లేది మురళీ వాళ్లింటికే. అక్కడే వుండి మీ అమ్మను బసవతారకం కాన్సర్ హాస్పిటల్లో చూపించాలి” అన్నాడు బాధ నిండిన గొంతుతో.
“అదేంటి నాన్నా?” అని శశిరేఖ; “ఎందుకండీ అన్నయ్యగారూ” అని సత్యవతీ ఒకేసారి అన్నారు.
“ఈ మధ్య మీ అమ్మకు ఒంట్లో బాగుండటం లేదమ్మా. బాగా నీరసంగా వుంటున్నది. ఏ పనీ చేసుకోలేకపోతున్నది. నేనే ఏవో టాబ్లెట్లు తెచ్చిచ్చాను. ఏమి ఉపశమనం కలగలేదు. మా డాక్టరు గారి దగ్గరకు తీసుకెళ్లి చూపించాను. డాక్టరుగారు కొన్ని టెస్టులు చేయించారు. ఒక్కసారి బసవతారకం హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకుని రమ్మన్నారు. పది రోజులుండటానికి సిద్ధపడే వెళ్లమనీ చెప్పారు. మురళీకి ఫోన్ చేసి మేమొస్తున్నట్లు చెప్పాను.”
ఆ మాటలు విన్న శశిరేఖ ముఖం చిన్నబోయింది. సత్యవతి మాత్రం వెంటనే తేరుకున్నది.
“ఏం భయం లేదులే అన్నయ్యగారూ. ఏదో అనుమానం కొద్దీ మీ డాక్టరుగారు పంపిస్తూ వుండొచ్చు. ఈ రోజుల్లో వైద్య సౌకర్యం బాగా పెరిగింది. ఏ ఇబ్బందీ వుండదు. అయినా వదినగారు చాలా హుషారుగా, ఆరోగ్యంగా వుండే మనిషి.”
“అదేనండీ. చాలా ఆరోగ్యంగా వుండే మనిషే. పది రోజుల నుండీ బాగా తేడా చేసింది.”
“పది రోజుల నుండి బాగా లేకపోతే కాస్త కబురు చెప్పకుడదా! శశిరేఖ వచ్చి వుండేది. మీరిద్దరే వుండి ఇబ్బంది పడ్డారు. అలా ఎందుకండీ? ఊళ్లోనే ఉన్నాం కదా!” అన్నది సత్యవతి.
“మిమ్మల్ని అందర్నీ ఇబ్బంది పెట్టడమెందుకని ఊరుకున్నాం. అలాగే ముక్కూతూ, మూలుగుతూ వంట చేసేది.”
“భలేవాడివి నాన్నా! నాక్కాస్త కబురు చెయ్యెచ్చుగా. నేను ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వుగాని, అమ్మగాని నాకేం చెప్పలేదు. నేను రావటమో, వంట చేసి పంపటమో చేసే దాన్ని” అన్నది శశిరేఖ.
“సరేనమ్మా వెడతాను. ” అంటూ లేచాడు నరసిహరావు.
“ఉండండన్నయ్య. నేనూ, శశిరేఖా కూడా మీతో వస్తాం. వదినగారిని పలకరించి వస్తాం.” అంటూ సత్యవతి డ్రైవర్ని కేకసింది.
ముగ్గురు కలసి నర్సింహరావు ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ వెళ్లి టెస్టులు చేయించుకోమని డాక్టరుగారు చెప్పేటప్పటికి శశిరేఖ తల్లికి బాగా కంగారుగా వున్నది. భర్త కాంపౌండర్, కాబట్టి చిన్న చిన్న అనారోగ్యాలకు ఏవో టాబ్లెట్లు తెచ్చిచ్చేవాడు. ఎప్పుడో తప్పితే తమ డాక్టరుగారి దగ్గరకు కూడ వెళ్లేది కాదు. అలేంటిది ఇప్పడిక్కడ కొన్ని టెస్టులు చేయించారు. పైపెచ్చు బసవతారకం హాస్పిటల్ కెళ్లి చూపించుకోమన్నారు. దాంతో ఆమె డీలా పడిపోయింది. శశిరేఖనూ, సత్యవతినీ చూడగానే కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నది. శశిరేఖక్కూడా ఏడుపొచ్చింది.
“ఛ… ఛ… ఊరికోండొదనా. ఊరికే భయపడకండి. మీకే ప్రమాదమూ రాదు. ఆరోగ్యంగా వుంటారు చూడండి.” అంటూ ధైర్యం చెప్పింది సత్యవతి.
“హైద్రాబాద్ వెళ్లి చూపించుకోగానే ఫోన్ చెయ్యండి.” అని చెప్పి ఒక గంట కూర్చుని వెళ్తానని లేచింది. శశిరేఖకు తల్లిని వదిలి వెళ్లాలని లేదు. ఆ మాట గ్రహించినట్లుగా “శశిరేఖా! నువ్వీ పూట ఇక్కడే వుండి కావలసిన సామానంతా సర్దిపెట్టిరా. నువ్వొచ్చే ముందు ఫోన్ చేస్తే డ్రైవర్ని పంపిస్తాను” అని చెప్పి ఇంటికి బయల్దేరింది సత్యవతి.
***
ఆ తర్వాత నర్సింహరావు దంపతులు హైదరాబద్ వెళ్లి బసవతారకం హాస్పిటల్లోనే టెస్టులు చేయించుకున్నారు. బ్రెస్ట్ కాన్సర్ అని రిపోర్ట్ వచ్చింది. వెంటనే ట్రీట్‌మెంట్ మొదలు పెట్టాలి. ఆపరేషన్ కూడా చెయ్యాలని చెప్పారు. శశిరేఖ హైదరాబాద్ బయలుదేరింది.
“అనుకోకుండా మీ అమ్మకు అనారోగ్యం వచ్చింది. ఆపరేషన్ అంటే ఖర్చుతో కూడుకొన్నది. మురళీ దగ్గర, మీ నాన్నగారి దగ్గర సరిపడినంత డబ్బు వున్నదో లేదో నువ్వు కనుక్కో. అవసరమైతే జగత్‌కు ఫోన్ చెయ్యి శశిరేఖా. మొహమాట పడకండి.” అని చెప్పింది సత్యవతి.
(ఇంకా ఉంది)