సాఫల్యం-24

1
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“సా[/dropcap]మీ! చన్ముకి రాజు పజ్జెముండాది సూడు. రాయబారంలోది. అదొకటి ఎత్తుకో. సలి సంకనాకిపోతాది” అన్నాడు.

“అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడా అజాతశత్రుడే అలిగిననాడు. ……” అంటూ అచ్చం షణ్ముఖి ఆంజనేయరాజుగారిని అనుకరిస్తూ పద్యం పాడాడు పతంజలి. పద్యం చివర రాగం కూడ చాలా సేపు తీశాడు.

తోకోడన్నట్లుగానే చలి తగ్గిపోయింది. మంటలో దోసెడు వేరు శనగకాయలు పోశాడు. పుల్లలు ఎగద్రోసి, ఒక పుల్లతో అటూ ఇట్టూ కదుపుతూ కాయల్ను కాచాడు. జేబులోంచి ఒక పొట్లం తీసి “రా సామీ తిందాం” అన్నాడు.

కాయలు నల్లగా మాడి ఉన్నాయి. అట్లా మాడితే గాని, లోపల గింజ వేగదు. పొట్లం విప్పి పెద్ద బెల్లం ముక్క ఒకటి పతంజలికిచ్చాడు.

“బెల్లమెప్పుడు తెచ్చావురా?” అంటే “రేత్తిరికి ఈడే బండుకోవాలని దెలుసు. తెల్లార్జామున ‘తంపట’ ఏసుకున్నపుడు పనికొచ్చాదని ఒక అర్ధరూపాయది తిరువీదోల్లంగట్లో కట్టించుకొచ్చినా, వచ్చేతప్పుడు”

“నీ పాసుగూల! నీ సమయస్ఫూర్తికి నా జోహార్లు” అన్నాడు పతంజలి.

“నీ పాసుగూల దప్ప, నీవన్నదేమయినా అర్తమైంటే నీ ఎడంకాలి సెప్తోగొట్టు” అన్నాడు వాడు. వాడి మాటలకు పతంజలికి నవ్వు ఆగలేదు.

వేడివేడి బుడ్డలు వలుచుకొని, ఏడెనిమిది గింజలు నోట్లో వేసుకుని, నమలకుండా జాగ్రత్తగా బెల్లంతో కొరుక్కుని, తింటూ ఉంటే స్వర్గం ఎక్కడో లేదనిపించింది.

పచ్చికాయలు మంటమీద కాలిస్తే, దానికి బెల్లం కలిస్తే ఆ రుచే వేరు.

పొద్దున ఒక పావెకరా స్థలం సలికలతో చదును చేశారు. రాళ్లూ రప్పలూ ఏరిపారేసి, ఈతచాపలు పరచి కాయలన్నీ అడుగు మందాన పరిచారు. ఎనిమిది గంటల నుండి భళ్లున ఎండ కాయడం ప్రారంభించింది. మధ్యలో మూడు నాలుగుసార్లు కాళ్ళతో దున్నారు కాయలను. క్రింది వాటికి కూడ ఎంత తగలాలని.

అలా మూడు నాలుగు రోజులు కాయలో పచ్చితనం పోయేలా ఎండపెట్టారు. రోజూ సాయంత్రం మళ్లీ కుప్పగా పోసి గోనెపట్టలు కప్పారు. లేకపోతే రాత్రికి పడే మంచుకు నానతాయి. కదిలిస్తే కాయలోపల గలగలలాడే శబ్దం వినిపించిన తర్వాత రాపమలింగయ్యశెట్టి వద్దకు వెళ్లి చెప్పాడు.

“క్వింటం ఎనభైరూపాయలుంది సామీ! ఇప్పుడమ్ముతారా, లేక ఉగాది బోయినాకనా, అప్పుడయితే నూరు దాటతాదని అనుకుంటాండా మిలుల్లో. గోడౌనుకు తోలిచ్చా తూకమేయిచ్చి పెట్టుకుందాం. మీరు యానాడు దర తెంపితే ఆనాడు లెక్క జేసుకుందాం” అన్నాడాయన.

‘నిజమే’ అనుకున్నాడు పతంజలి. ఇప్పుడు కాయ ఎక్కువగా మార్కెట్‌ కొస్తుంది. ఉగాది వరకు చూద్దాం అనుకొని “సరే” అన్నాడు.

మర్నాడు లారీ తీసుకొని శెట్టి గుమస్తా ఇద్దరు హమాలీలతో వచ్చాడు. ఖాళీ గోనెసంచుల కట్టలతో. లారీ నుండి కాటా దింపారు. కాయలు గోతాల్లో నింపి ఒక్కోదాట్లో యాభై కేజీల చొప్పున తూకం వేసి, మూతులు కట్టి లారీలోకి ఎక్కిస్తున్నారు. సగం అయ్యేసరికి లారీ లోడ్‌ అయింది. నూట నలభై మూటలెక్కాయి.

లారీ వెళ్లి, మిల్లులో అన్‌లోడ్‌ చేసి వచ్చింది. ఈసారి తూకం వేసి, నింపుతే మరో 120 మూటలయ్యాయి. అంటే మొత్తం 130 క్వింటాళ్లు. ఒక కాయితం మీద వివరం రాసి పతంజలికిచ్చి అంతా వెళ్లిపోయారు. తమ ఇంటి వాడకానికి ఒక 25 కేజీలు పక్కకు తీసి ఉంచుకున్నాడు. తోకోనికి, ఈ సుంకన్నకూ తలా ఐదు కేజీలు ఇచ్చాడు. దేవుని దయవల్ల ఉగాదికి వంద దాటితే పదమూడు వేలు వస్తుంది. మళ్లీ కొన్ని అప్పులు చెల్లు వేయవచ్చు అనుకున్నాడు.

ముగ్గురూ కలిసి శనక్కట్టె అంతా వామి వేశారు. ఒకరు వరుస అది. ఒక వరుస వరి గడ్డి పేర్చుకుంటూ పిరమిడ్‌ ఆకారంలో అమర్చారు. పైన వరిగడ్డి కప్పి, దానితోనే పురులు వేసి తాళ్లు కిందికి వేలాడ తీసి తాళ్లకు రాళ్లు కట్టారు. గాలికి గడ్డి ఎగిరిపోదు. ఎంత వర్షమొచ్చినా మేత తడవదు. ఎద్దులకూ గణపతికి దాదాపు ఆరు నెలల గ్రాసం.

పొలమంతా దుక్కిదున్ని మినుములు పెసలు చల్లుదామని నిర్ణయించుకున్నారు. వెళ్లిపోదామని ఎద్దులను విప్పారు. బండి కాడిమాను ఎత్తి పట్టుకుంటే అవే వచ్చి తలలు దించి కాడి మెడల మీద వేసుకున్నాయి.

గణపతికి రెండో సంవత్సరం నడుస్తూంది. బలంగా ఎత్తుగా పెరిగాడు. వాడి అందమంతా కళ్లదే. కాటుక పెట్టినట్లుంటాయి. తోకోడు పలుపుతాడు విప్పుతూనే చెంగున ఎగిరి పతంజలి దగ్గరికి వచ్చింది. భుజం మీద మోర పెట్టి దువ్వమని అడిగింది. మెడక్రింద దువ్వాడు. గోనెపట్టాతో ఒళ్లంతా రుద్దాడు. గజ్జల్లో, వృషణాల దగ్గర కనపడిన ‘పిర్దుల్ని’ పీకిపడేశాడు. అరమోడ్పు కళ్ళతో ఈ సేవనంతా అనుభవించాడు గణపతి.

“ఇంకో ఆర్నెల్లుంటే అంకె కొచ్చాది” అన్నాడు తోకోడు. వాడు బండి తోలుతూంటే సుంకన్న పతంజలి నడవసాగారు. వెనక గణపతి.

“కాదురా! నీవు మన పనుల్లో సాయం చేస్తుంటావు కదా! ఓబులప్పగానీ సంజీవరాయుడుగానీ ఏమీ అనరా?” అనడిగాడు పతంజలి.

“ఆయప్ప కా ద్యాసే లేదులే సామీ! మంచోల్లు పాపం” అన్నాడు సుంకన్న.

ఆరోజు రాత్రి భోజనాలయ్యాయి. నాన్న పడుకుని ఉంటే కాళ్లు నొక్కుతున్నాడు పతంజలి. వర్ధనమ్మ మటిక్కాయలు ఈనెలు తీస్తూ రేపటి కూరకు సిద్ధం చేసుకుంటూ కూర్చుంది అక్కడే.

“మహితను పెద్దదానికి సాయంగా పంపిద్దామనకున్నాము కదా. మరి ఎప్పుడు?” అన్నదామె.

“రెండ్రోజుల్లో బయలుదేరండి. నాయనా పతంజలీ! బంగారమ్మను పెద్దక్క దగ్గర వదలివస్తే, సహాయంగా ఉంటుంది. మరో మండలం రోజులు కూడ లేదు. ప్రసవానికి వారం రోజులు ముందు మీ అమ్మ వెళితే కాన్పు చేసి నెలరోజులుండి, మనయింటికి తెచ్చుకుంటే, తిరిగి మూడో నెలలో దిగవిడిచి రావొచ్చు. తర్వాత దాని బాధ అది పడుతుంది” అన్నాడు మార్కండేయశర్మ.

“సరే నాన్నా, ఎల్లుండి బయలుదేరతాము”

“అయితే రేపు వాళ్లకోసం రెండు రకాలు ఏవయినా తయారు చేస్తాము” అన్నది తల్లి.

అనుకున్నట్లుగానే అటుకులు, వేరుశనగ పలుకులతో మిక్చరు, రవ్వలడ్డు చేసిందామె. పతంజలి తండ్రితో ఒక ప్రతిపాదన చేశాడు. “నాన్నా, మహితను నంద్యాల్లో విడిచిపెట్టి, నేను అహోబిలం వెళ్లి మన స్వామిని దర్శించుకొని వస్తాను. డిగ్రీ పరీక్షలయినాక వస్తానని మొక్కుకున్నాను. రిజల్టు వచ్చింతర్వాత వెళదామనుకున్నాగాని, అది ఆయన మీద నా నమ్మకాన్ని నేనే పలుచన చేసుకున్నట్లవుతుంది. అక్కడ నుండి సంజామలకు వెళ్లి, మా ఆజంసారును కలిసివస్తాను. ఏమంటారు?”

“మంచిదేరా, వెళ్లిరా! నంద్యాల నుండి అవి రెండూ దగ్గరే కదా!”

పొద్దున్నే రామళ్లకోట మీదుగా నంద్యాలవెళ్లే బస్సులో కూర్చున్నారు అన్నయ్య, చెల్లెలు. కొంతకాలంగా ఆర్‌.టి.సి. బస్సులు వచ్చాయి. ఆ బస్సు డోన్‌ నుండి వస్తుంది. దాదాపు నలభైమైళ్లు కచ్చా రోడ్డులో ప్రయాణించి, కర్నూలు- తిరుపతి స్టేట్‌ హైవే మీద కాల్వ బుగ్గ దగ్గర కలుస్తుంది.

ఆ బస్సే రెండుసార్లు తిరుగుతుంది. ఆ రూట్లో మరో బస్సు లేదు. అంతా కొండలు, బండలు, మధ్య మధ్య మామిడి తోటలు. రామళ్లకోటలో బస్సు పూర్తిగా నిండిపోయింది. దాదాపు రెండు గంటలు ప్రయాణించి, మెయిన్‌ రోడ్డు ఎక్కింది. మెయిన్‌ రోడ్‌ ఎక్కిం తర్వాత నరకంలోంచి స్వర్గంలోకి వచ్చిన అనుభూతి కల్గింది.

సోమయాజుల పల్లె సత్రం దగ్గర ఆపాడు టిఫిన్ల కోసమని. ఒకపాక హోటలుందక్కడ. పొయ్యి మసి వల్ల గోడలన్నీ నల్లగా ఉన్నాయి. లోపల నాప బండలతోనే బెంచీలు నాలుగు వేసి ఉన్నాయి. ఎదురుగ్గా కట్ట మీద పెద్ద డేకిశాలో ఉగ్గాని, ప్రక్కన మరో పెద్ద సిల్వరు తట్టలో మిరపకాయ బజ్జీలున్నాయి. సీసాల్లో వేరుశనగ పాకం ఉండలు, నువ్వుండలు కనబడుతున్నాయి.

రెండు ప్లేట్లు ఇమ్మన్నాడు. సత్తు ప్లేట్లలో ఉగ్గాని వేసి, నాలుగు బజ్జీలు పక్కన పెట్టి ఇచ్చిందొకామె.

చాలా రుచిగా ఉంది ఉగ్గాని. బజ్జీలు కూడ మెత్తగా కారంగా ఉన్నాయి. తిన్నారిద్దరూ. తనకు ‘టీ’ వద్దంది మహిత. పతంజలికి గాజు గ్లాసులో టీ యిచ్చిందామె. బెల్లంటీ యేమో, నల్లగా, తియ్యగా, కొంచెం పొగచూరిన వాసనతో విచిత్రంగా ఉంది. టీ. అయినా తాగాడు. అతనికి ఏదీ అసహ్యమనిపించదు.

మిరపకాయబజ్జీ బాగా కారంగా ఉంది. అప్పటికీ తాను రెండే తిని అన్నయ్యకు రెండిచ్చేసింది మహిత.

“నాలుక మంట పుడుతుందన్నయ్య”, అన్నదా అమ్మాయి. రెండు వేరుశనగ వుండలు కొనిచ్చాడు.

బస్సు బయలు దేరింది. అక్కడనుంచి మరో నలభై మైళ్ళుంటుంది నంద్యాల. ఇటు ఎడమవైపు వెళితే కర్నూలు కడప నుండి, తిరుపతి నుండి వచ్చే ఎక్స్‌ప్రెస్‌ బస్సులు వేగంగా ఎదురుగా వస్తున్నాయి. ‘సుగాలి మెట్ట’ దాటింది. తమ్మరాజుపల్లె కనుమ ద్వారా కొన్ని మైళ్లు ప్రయాణించింది బస్సు. కొండమీద మెలికలు తిరుగుతూ వెళ్లే ఘాట్‌ రోడ్‌ అది.

ఘాట్‌ దిగింతర్వాత పావుగంటకు ‘పాణ్యం’ వచ్చింది. అది ఒక కూడలి. అక్కడ నుండి కుడివైపుకు వెళితే బనగానిపల్లె, కోవెలకుంట్ల వస్తాయి. నేరుగా వెళితే నంద్యాల. పాణ్యం జామ తోటలకు ప్రసిద్ధి. బస్సు ఆగగానే జామకాయలమ్మేవాళ్లు బస్సును చటుట్టుముట్టారు. దోరవి, పండినవి, నిగనిగలాడుతూ జామకాయలు నోరూరిస్తున్నాయి. కొన్ని లోపల పింక్‌ కలర్‌లో ఉన్నాయి. ఆ విషయం తెలిసేట్లు ఒక కాయ పువ్వు ఆకారంలో కట్‌ చేసి, లోపల ఎరుపు కనబడేలా బుట్టల్లో పెట్టుకున్నారు కొందరు.

పతంజలి డజను కాయలు కొన్నాడు బేరం చేసి, డజను రూపాయి చెప్పి ముప్పావలాకిచ్చిందొకామె. యథా ప్రకారం డ్రైవరుకూ కండక్టరుకూ చెరో నాలుగు కాయలిచ్చారు. అందుకేనేమో ఇంజనాపేసి తీరుబాటుగా కూర్చున్నారు.

పదిగంటలలోపే నంద్యాల చేరుకుంది బస్సు. బస్టాండు కిటకిటలాడుతూంది. బయటకు వచ్చి అక్కయ్యకు రెండు మూరలు కనకాంబరాలు మాల, ఒక పావలా విడిపూలు చేమంతులు కొన్నారు. విడిపూలు తీసుకోకపోతే మాల దేవుడికి వేసేస్తుందక్కయ్య అని తెలుసు. మేనల్లుడి కోసం క్రీమ్‌ బిస్కెట్‌ పాకెట్‌ పెద్దది తీసుకున్నారు.

రిక్షా మాట్లాడుకొని నడిగడ్డ వీధికి చేరుకున్నారు. ఇంటిగుర్తులు సులభంగానే కనుక్కున్నారు. అక్కయ్య తమ్మున్నీ చెల్లెల్నీ చూసి సంబరపడిపోయింది. ఒళ్లు చేసి చాలా అందంగా ఉంది. ముఖంలో కొంచెం అలసట కనబడుతూంది.

వాళ్ల చేతుల్లో సంచులు అందుకుని లోపల పెట్టింది. చచి బయటకొచ్చాడు. కాసేపు పిలిచినా రాలేదు. బిస్కెట్‌ ప్యాకెట్‌ యిస్తానంటే పతంజలిని పట్టుకోనిచ్చాడు.

పాకెట్‌ పై భాగాన కొద్దిగా చింపి ఒక బిస్కెట్‌ ఇస్తే, రెండో చేయి కూడ చాపాడు. క్రిందికి దిగి రెండు బిస్కట్లు విడదీసి, క్రీము మొత్తం నాకేసి బిస్కట్లు మామ కిచ్చేశాడు.

“వాడంతేరా క్రీము తిని బిస్కట్లును మనకిచ్చేస్తాడు” అంది అక్కయ్య.

మహితను చూపించి “ఎవరు నాన్నా?” అని అడిగితే “పిన్నమ్మ” అని చెప్పాడు. తన బొమ్మల ప్రదర్శన ఏర్పాటు చేసి, పిన్నికి మామకూ చూపించాడు. నాన్న ఏడమ్మా అంటే ‘బాంకు’ అన్నాడు.

ఇద్దరికీ కాఫీ యిచ్చింది వాగ్దేవి. ఉదయం బొంబాయి నూక ఉప్మా చేసిందట. తిని వెళ్లిపోయాడు బావ. మధ్యాహ్నం రెండుకు వచ్చి భోజనం చేసి మళ్లీ వెళతాడట.

వంట ప్రారంభించింది. వంకాయలు తరిగి, ఒక గిన్నెలో చెంచాడు ఉప్పు, నీళ్లు పోసి అందులో వేసిచ్చాడు. బావకు ఉల్లిపాయలు వేయాలట. వెల్దుర్తిలో వీళ్లు అస్సలు తినరు. అవేకాదు వెల్లుల్లి కూడ నిషిద్ధమే. తాటిముంజెలు తినరు. రెండు ఉల్లిపాయలు కూడ సన్నగా తరిగి యిచ్చాడు. మహిత స్టవ్‌ మీద పప్పుకు పెట్టింది. బియ్యం కడిగి బొగ్గుల పొయ్యిమీద ఎసరు పెట్టింది.

“అక్కయ్యా! నీవు పూర్తిగా రెస్టు తీసుకోవాలి” అంది మహిత.

“వచ్చిన మరుక్షణమే రంగంలో దిగకపోతే ఏమే. రేపటి నుండి సాయం చేద్దువుగానిలే. అయినా చిన్నపిల్లవు. నీతో చాకిరీ చేయించుకుంటానా! తోడుగా ఉండు చాలు”

“అదేం కుదరదు అమ్మ ఆర్డరు”

ముగ్గురూ నవ్వుకున్నారు. పప్పులో చేమాకు వేసిందక్క. దాంట్లో కూడ ఒక ఉల్లిపాయ వేసింది. మూకుడులో పూదీనా వేయించుకొని, ఎండుమిరపకాయలు, ధనియాలు, చిటికెడు మెంతులు దొరగా వేయించింది. కొంచెం చింతపండు ముందుగానే నానేసింది.

పెరట్లో చిన్న రాతి రోలుంది. అక్కను పచ్చడి నూరనివ్వలేదు మహిత. ముందు దినుసులన్నీ ఇత్తడి పొన్నున్న రోకలితో మెత్తగా దంచి, చింతపండు గుజ్జు, పొదీనా ఆకువేసి నూరింది. చివర్లో ఉసిరిక కాయంత బెల్లం కలిపి నూరింది.

పప్పు ఉడికిన తర్వాత వంచిన ‘కట్టు’ నీళ్లతో చారు చేసింది. పప్పుకూ, పచ్చడికీ చారుకూ ఒకేసారి ‘తిరగమోత’ పెట్టింది. పన్నెండున్నరకల్లా వంటయింది. శశిధర్‌గాడికి పెట్టేసింది మహిత. వాడు పెద్దవాళ్లు తిన్నట్లే అన్నీ తిన్నాడు. మరీ చప్పగా ఉంటే ఉమ్మేస్తాడట. కొంచెం నెయ్యి వెయ్యాలి.

సరిగ్గా రెండు గంటలకు రామ్మూర్తి బావ వచ్చాడు. మరదలిమీద, బావమరిది మీద జోకులు వేశాడు. అందరూ మధ్య గదిలో కూర్చుని భోజనాలు చేశారు. “ఈ రోజు వంట ఏదో తేడాగా ఉందే” అన్నాడు.

“ముగ్గురం చేశాం” అన్నది వాగ్దేవి.

“టూ మెనీ కుక్స్‌ స్పాయిల్‌ ది బ్రాత్‌ అన్న సామెత మీకు వర్తించలేదు” అన్నాడాయన.

“పచ్చడి నేను నూరినాను బావా!” అన్నది మరదలు.

“అందుకే అంత మహితాత్మకంగా ఉంది”

“వంకాయలు, ఉల్లిపాయలు, చేమాకు తరిగింది నేను” అన్నాడు పతంజలి.

“సాక్షాత్తూ భాష్యకారుడైన పతంజలి మహర్షి కూరలు తరిగినందుకే చేమాకు పప్పు, వంకాయకూర సంగీత సాహిత్యాల కలయికవలె గుబాళిస్తున్నాయి” అన్నాడు బావ. ఆయనకు పతంజలి పాటలు బాగా పాడతాడని తెలుసు. సాహిత్యం సరే సరి.

భోజనం చేసి వెంటనే బయలుదేరాడు బావ. వెళ్లేముందు పతంజలినడిగాడు.

“నీవు రెండ్రోజులుంటున్నావు కదరా?”

“లేదు బావా. రేపు ఉదయం బయలుదేరి అహోబిలం వెళ్తాను. స్వామిని దర్శించుకొని అక్కడనుండి సంజామలకు వెళ్లి మా గురువుగారిని చూసి రావాలి.” అన్నాడు.

“అయితే సాయంత్రం సినిమాకు వెళదాం. ఐదున్నర కల్లా రడీగా ఉండండి. నీవు తిరుగు ప్రయాణంలో కూడ నంద్యాల మీదే కదా వెళ్లాలి?”

“సంజామల నుండి కోవెలకుంట్ల, బనగానిపల్లె, బేతంచెర్ల మీదుగా దగ్గర బావా. కర్నూలు జనరల్‌ హాస్పిటల్‌లో మా గోకర్ణం మిత్రుడు ఉన్నాడట. కిడ్నీలలో రాళ్లు చేరాయని అడ్మిట్‌ అయ్యాడట. ఆయన్ను చూసి వెళతాను.”

“సరే అయితే” అని వెళ్లిపోయాడు బావ ఆఫీసుకు.

ఐదుగంటలకల్లా అందరూ తయారైనారు. శశిధర్‌కు మంచి డ్రస్‌ వేసి తయారు చేసింది వాళ్లమ్మ. మహిత కర్నూల్లో తీసుకున్న డ్రస్‌ వేసుకుంది. పతంజలి చిత్తూరులో బావ కొనిచ్చిన ప్యాంటు, టీషర్టు వేసుకున్నాడు. అల్లుడు మహిత దగ్గరికి పోయి ఎగాదిగా చూసి, “చానా బాంది” అని కామెంట్‌ చేశాడు. “మరి నాదిరా?” అని పతంజలి అడిగితే. పరికించి చూసి “యాక్కి, బాల్యా” అన్నాడు. “వేలెడంత లేడు వీడు చూడవే అక్కయ్యా, నా డ్రస్‌ బాగలేదంటున్నాడు” అని ఫిర్యాదు చేశాడు మామ.

“కొత్తగా ఉన్నవే నచ్చుతాయిరా వాడికి. మహిత డ్రస్‌ కొత్తగా ఉంది. నీ డ్రస్‌ పాతపడింది కదా” అంది అక్కయ్య.

సరిగ్గా ఐదున్నరకు రామ్మూర్తి బావ వచ్చాడు. డ్రస్‌ మార్చుకోలేదు. ముఖం కడుక్కుని తల దువ్వుకున్నాడంతే, కాఫీ తాగాడు.

సైకిల్‌ ముందు రాడ్‌ మీద బేబీ సీటు పెట్టించారు. శశిగాడికి. వాడిని కూర్చోబెట్టి నడిపించుకుంటూ రోడ్డు మీదికి వచ్చారు. ఖాళీ రిక్షాను ఆపి, వాగ్దేవిని, మహితను ఎక్కించి ప్రతాప్‌ టాకీసుకు తీసుకెళ్లమన్నాడు.

పతంజలిని వెనుక కూర్చోబెట్టుకుని వెనుక రిక్షాను అనుసరించాడు బావ. పది నిముషాల్లో థియేటర్‌ చేరుకున్నారు.

“సంపూర్ణ రామాయణము” ఆడుతూంది ఆ థియేటర్లో. బాపు దర్శకుడు.

“బావా, నేను టిక్కెట్లు తెస్తానుండు” అని పతంజలి వెళ్లబోతుంటే, “అమ్మో చాలా పెద్దవాడివయ్యావన్నమాట. నీవు మాకు పెట్టే కాలం ముందుందిగాని, ఉండవయ్యా” అని వెనక్కు లాగాడు బావ. పదిరూపాయల నోటు తీసి పతంజలికిచ్చి బాల్కనీ టిక్కెట్లు తెమ్మన్నాడు.

సినిమా వచ్చి నెల రోజులు దాటిందట. జనం బాగానే ఉన్నారు. అందరూ వెళ్లి బాల్కనీలో ఒక వరుస చివర్లో ఫ్యాను క్రింద కూర్చున్నారు.

ఒక అద్భుతమయిన దృశ్యకావ్యం తీశాడు బాపు. రామాయణమంతా కవర్‌ చేసినట్లే. అందరూ సినిమాలో లీనమైపోయారు. శశిగాడు సినిమా చూడకుండా, వెనక్కు తిరిగి ప్రొజెక్టర్‌ లోంచి వచ్చే ఫోకస్‌ చూస్తూ కూర్చున్నాడు.

ఇంటర్వల్‌లో బయటకు వచ్చి, పప్పు చెక్కలు కొనుక్కున్నారు. చాలా చిన్నవిగా ఉన్నాయి. అర్ధరూపాయి బిళ్లంత వేడిగా, ప్రక్కనే ఉన్న పెద్ద బాణలిలో వేయించి అమ్ముతున్నాడు. పావలాకు పది. సోడాలు కూడ లోపలికి తీసుకొని వచ్చాడు ‘ఓపెనర్‌’ కూడ యిచ్చాడు.

అర్ధరూపాయి బిళ్లలు బాగా రుచిగా ఉన్నాయి. కరకరలాడుతూ. జీలకర్ర, ఇంగువ, కొద్దిగా వెల్లుల్లి కూడ దంచి వేసినట్లున్నాడు. “ఇవి ఈ ఊరి ధియేటర్‌లలో మాత్రమే దొరుకుతాయి. చాలా ఫేమస్‌ అందరూ తీసుకుంటారు” అన్నాడు బావ సోడాలు సేం కొట్టువాడు కొట్టినట్టే శబ్దం వచ్చేట్టు కొట్టిచ్చాడు బావ అందరికీ. మహిత ఆ గ్యాస్‌కు ఉక్కిరి బిక్కిరయింది. శశిగాడు మాత్రం ఏమాత్రం చలించకుండా ఐదారుగుక్కలు తాగి, అందరి వైపు చూసి నవ్వి “బాంది” అన్నాడు.

పతంజలి వెళ్లి సోడా సీసాలు, ఓపెనర్‌ బయట యిచ్చి వచ్చాడు.

“ఎంత బాగా సోడాలు కొట్టావు బావా! ఒకసారి నేను ట్రై చేశాను. ఎంతనొక్కినా గోలీ లోపలికి పోలేదు.” అన్నాడు.

“ఆయనకు బ్యాంకుద్యోగం రాకముందు వాళ్ల ఊళ్లో సోడా కొట్టు ఉండేదంట లేరా” అన్నది వాగ్దేవి.

“ఇంటికి పోయింతర్వాత నీ పని చెబుతానుండు” అన్నాడు బావ నవ్వుతూ.

కాసేపటికి శశి నిద్ర బోయాడు. అందరూ యిల్లు చేరేసరికి పది దాటింది. దారిలో ‘ఉడిపి కృష్ణ భవన్‌’ దగ్గర ఆగి ఇడ్లీలు పార్సెలు కట్టించుకొని వెళ్లారు. ఉదయం చేసినవేవీ మిగల్లేదు. శశి లేచి ఒక ఇడ్లీ తిని మళ్లీ బజ్జుకున్నాడు. బావ నాలుగిడ్లీలు తిని చాలలేదని మధ్యాహ్నం అన్నం కొంచెం ఉంటే, మజ్జిగ వేసుకుని తిన్నాడు.

ముందుగదిలో బావ పతంజలి పడుకున్నారు. మధ్యగదిలో మహిత వాగ్దేవి బాబును పెట్టుకొని పడుకున్నారు. రెండు రూముల్లో ఫ్యాన్లున్నాయి.

బావమరుదులిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. డిగ్రీ సర్టిఫికెట్‌ వచ్చిన వెంటనే బ్యాంకు పరీక్షలు, రైల్వే, పరీక్షలకు ప్రిపేరవమని చెప్పాడు బావ. ‘కాంపిటేషన్‌ సక్సెస్‌’ అనే మంత్లీ మ్యాగజైన్‌కు చందా కట్టమన్నాడు. సరే అన్నాడు మరది.

పొద్దున్నే ఆరుగంటలకల్లా తయారయ్యాడు పతంజలి. వద్దన్నా వినకుండా సైకిలు మీద బస్టాండుకు తీసుకొచ్చాడు బావ. వీళ్లు వెళ్లేసరికి చిత్తూరు వెళ్లే బస్సు ఒకటి సిద్ధంగా ఉంది. ఆర్టీసీ బస్సది. దాంట్లో సీట్లు లేవు.

బయట ఒక ప్రయివేటు బస్సుంది. ‘సిరి వెల్లాల్గడ్‌ సిరి వెల్లాల్గడ్‌’ అని అరుస్తున్నాడు కండక్టరు. పతంజలి కర్థం కాలేదు. “ఏమంటున్నాడు బావా?” అని అడిగాడు.

“సిరవెళ్ల, ఆళ్లగడ్డ అని వాడి మొత్తుకోళ్లు” అన్నాడు బావ. డ్రైవర్‌ హారన్‌ కొడుతూ, ఇంజను రైజ్‌ చేస్తూ, ఏ క్షణానైనా కదిలించేటట్లున్నాడు.

“బావా! బస్సు కదులుతూంది. నేను వెళ్లొస్తానయితే” అన్నాడు.

“వాడి మొహం బస్సు నిండేంత వరకు పోడు. ఎక్కిన వాళ్లకు ఎక్కినట్లు టికెట్‌ ఇస్తాడు. వాళ్లు లేటవుతూందని దిగిపోకుండా అంతవరకూ అట్లా హంగామా చేస్తూంటాడు అన్నాడు బావ. “క్రిందే నిలబడి ఉందాం. ఈలోపు ఆర్‌.టి.సి. బస్సేదీ రాకపోతే చూద్దాం.”

ఐదు నిమిషాలున్నారు. ఇంతలో కర్నూలు నుండి నెల్లూరు వెళ్లే బస్‌ వచ్చింది. అది బస్టాండులోకి తిరిగి పాయింటు దగ్గరకొచ్చేటప్పటికి వీళ్లు వెళ్లి నిలబడ్డారు. అందులోంచి ఏడెనిమిది మంది దిగారు. సీట్లున్నాయి. పతంజలి ఎక్కి ఒక సీట్లో కూర్చున్నాడు.

“వెళ్లొస్తా బావా!” అన్నాడు.

“ఆల్‌ ది బెస్ట్‌. ఇది ఆళ్లగడ్డ వరకు ఆగదులే. నరసింహస్వామినీ, చెంచులక్ష్మి అమ్మవారినీ అడిగినట్లు చెప్పు” అన్నాడు బావ నవ్వుతూ.

బస్సు కదిలింది. బావ చమత్కారంగా మాట్లాడతాడనుకున్నాడు. స్వామీ అమ్మవారూ తమ బంధువులైనట్లు చెప్పాడు. ఆలోచిస్తే ఆయన అన్నదాంట్లో ఒక దగ్గరితనం కనిపించింది భగవంతునితో. ‘తను హృద్భాషలసఖ్యమున్‌’ అన్నట్లుగా స్వామిని మిత్రునిగా, బంధువుగా భావించడం కంటే కావలసిందేముంది?

బస్సు నూనేపల్లె దాటింది. వేరుశనగనూనె మిల్లులు ఎక్కువగా ఉండటం వల్ల ఆ పేరు వచ్చిందేమో. అదీ నంద్యాలలో భాగమే. చక్కెర ఫ్యాక్టరీ దాటింతర్వాత కుడివైపు తిరిగింది. ఎడమవైపు రోడ్డు ప్రక్కన పసుపుపచ్చని బోర్డు మీద గిద్దలూరు మార్కాపురం, శ్రీశైలం అక్కడ్నుంచి ఎంత దూరమున్నాయో సూచించబడి ఉంది.

బస్సు చాలా వేగంగా నడుపుతున్నాడు. చక్కెర ఫ్యాక్టరీకి చెరకు తీసుకుని వచ్చే ఎద్దులబండ్లు, ట్రాక్టర్లు ఎదురుగా వస్తున్నాయి. సరిగ్గా గంటలో ఆళ్లగడ్డ బస్టాండులో దింపాడు. అప్పటికి ఇంకా ఎనిమిది కాలేదు. స్వామి దర్శనం అయ్యేంతవరకు ఏమీ తినకూడదనుకున్నాడు. ఎదురుగా ఉన్న ఒక హోటల్లో ఒక టీ తాగాడు. దాదాపు నాలుగైదు హోటళ్లున్నాయి. అన్నింట్లో ఉగ్గాని, బజ్జీ దర్శనమిచ్చాయి.

నంద్యాల నుండి కడప వరకు పంట భూములు దర్శనమిచ్చా పతంజలికి. కె.సి. కెనాల్‌ (కర్నూల్‌ – కడప కాలువ) ఆయకట్టు భూములవి. వరి కోతలైపోయి భూములు ఖాళీగా ఉన్నాయి. మినుములు పెసలు వేశారేమో వరిమళ్లనిండా మొలకలు వచ్చి పచ్చగా ఉన్నాయి. తన ప్రాంతాన్ని తల్చుకొని విచారించాడు పతంజలి.

అక్కడ ఎంక్వయిరీ పాయింటు దగ్గర అడిగాడు. “పెద్దోలంబోయేది ఇప్పుడొచ్చాది. ముందల పైన జూస్కొని రార్రి. మల్లా మద్యాన్నం బస్సే పైకి బొయ్యేది ఆడ దర్శనమైనంక కిందోళానికొచ్చే, ఆడకూడ సూస్కొని సాయంత్రానికి ఆల్లగడ్డకు రావొచ్చు. మంది యావూరో?”

“వెల్దుర్తి. డోన్‌ దగ్గర…”

“తెల్చులే. మెయిన్‌ రోడ్డు మీదనే గాదూ ఆ వూరుండేది. టేసను కూడ వుండ్ల్యా. అవునూ చెరుకులపాటి శివారెడ్డిని సంపేశిరి గదా ఆయన కొడుకు సేతికొచ్చినాడా?”

“అతను చిన్నవాడండీ ఇంకా”

“సానా మంచోడంట శివారెడ్డి ఇజయ బాస్కర్రెడ్డికి కుడి బుజమంట గదా! జీతగాల్లే నరికినారంట”

ఇవన్నీ పతంజలికి తెలుసు. ఆర్టీసీ ఎంక్వయిరీ గుమాస్తా ఇంకో ప్రాంతంలో అయితే ఇన్ని మాటలు మాట్లాడడు. అదీ రాయలసీమ గొప్పదనం. ప్రక్కనే యస్‌.వి. థియేటరు కనబడిరది. యస్వీ సుబ్బారెడ్డి పేరు విని ఉన్నాడు. ఆ ప్రాంతమంతా ఫాక్షన్‌ జోన్‌. పోలీసుల్నయినా కొట్టి తమ వాళ్లను విడిపించుకుపోయే సాహసికులున్నారక్కడ.

“పూలు పండ్లు ఈడనే కొనుక్కో చార్‌. ఆడ ఏమీ దొరకవు” అన్నాడతను.

పైన క్రింద ఇద్దరు స్వాములకు ఆరు మూరలు దండ తీసుకుని రెండు భాగాలు చేయించాడు. అరడజను అరటిపండ్లు రెండు కొబ్బరికాయలు, చిన్న ఊదుకట్ట పాకెట్‌, తమలపాకులు, వక్క చీటీలు, కర్పూరం అన్నీ తీసుకొని సంచిలో పెట్టుకుందామంటే నలిగిపోతాయని, అర్ధరూపాయిచ్చి చిన్న గుడ్డ సంచీ కొనుకున్నాడు. దాంట్లో అన్నీ జాగ్రత్తగా సర్దుకున్నాడు.

బస్సొచ్చింది ఆళ్లగడ్డ – ఎగువ అహోబిళం బోర్డు పెట్టుకొని. ఎక్కడున్నారో అంతవరకు, జనం ఒక్కుమ్మడిగా బస్సు మీద దాడి చేశారు. కిటికీల్లోంచి చంటిపిల్లలను అందిస్తున్నారు. చాలామంది టాపు మీదికి ఎక్కి కూర్చున్నారు. కిటికీలోంచి ఒకాయన పతంజలివైపు చూసి అరిచాడు.

“య్యోవ్‌, ఏందట్టా దిక్కులు సూచ్చాండావు. నీ చిత్తి (సంచి) ఇట్లాయియ్యి సీటు పట్కుంటా. లేకపోతే గమ్మున పైకన్నాబో. ఈ బస్సు పోయిందంటే పదకొండుకే సూస్కోమల్ల”

పతంజలికి పైనే బెటరనపించింది. వెనక ఉన్న నిచ్చెన ఎక్కి పైకి చేరుకుని కూర్చున్నాడు. ఎర్రటి దుమ్ము పేరుకుని ఉంది. ఒకాయన పతంజలిని చూసి, “ఉండుండు. కూసోగాకు. దీనమ్మ ఇంకా శివరాత్రి గూడ్క పోకుండగనే ఎండ ముదిరి, దుమ్ము ఎక్కువాయె” అంటూ తన పైపంచతో కొంత మేర శుభ్రంచేసి, అప్పుడు కూర్చోమన్నాడు ఆయన ‘కన్‌సర్న్‌’కు పతంజలి కదిలిపోయాడు. ఆయన పక్కనే కూర్చున్నాడు సంచులు పెట్టుకుని.

“యా ఊరో?” అన్నాడాయన పతంజలి వైపు ఆరాగా చూస్తూ.

“వెల్దుర్తి”.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here