హన్మకొండలో… మేము..!!
[dropcap]జ[/dropcap]న్మభూమిని వదిలి ఉద్యోగపరంగానో, వ్యాపారపరంగానో ఇతర కారణాల వల్లనో వేరే ప్రాంతాలకు వలస పోయినప్పుడు, ఆ ప్రాంతం అన్నిరకాలుగా అలవాటై, అక్కడి ప్రజలతో మమేకమై, ఆ ప్రాంతానికి అలవాటై, ప్రజాసంబంధాలు మెరుగై, సంబంధ బాంధవ్యాలు అధికమై, ఆ నేల, ఆ నీరు, ఆ వాతావరణం వదిలిపెట్టి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలా పనిచేసిన చోట లేదా ఎక్కువ కాలం పనిచేసిన చోట స్థిరపడి పోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో, వ్యాపారస్తుల్లో, ఇల్లరికం పెళ్లికొడుకుల్లో ఇలాంటి నిర్ణయాలు త్వరగా జరిగిపోతుంటాయి. ఆ రకంగా పుట్టి పెరిగిన వూరు వదలి, ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళు వున్నారు. అలాగే, జన్మ స్థలాలను వదిలిపెట్టకుండా వారి పూర్వీకుల పేరును అక్కడ స్థిర పరచినవాళ్ళూ వున్నారు, వున్న ఆస్తులు అమ్ముకుని మరచిపోయినవారూ వున్నారు. పట్నాలలో, నగరాలలో అలవాటైన పిల్లలు, గ్రామ వాతావరణానికి అలవాటు పడలేక పోవడంతో చాలామంది, పుట్టి పెరిగిన ఊళ్లకు దూరమై పోతున్నారు. కొత్త ఊళ్ళల్లో స్థిరపడిపోతున్నారు. అలా వలసలు వెళ్లుతున్నవారు ఎక్కువగా రాష్ట్ర రాజధానిలోనూ, జిల్లా కేంద్రాలలోనూ, తాలూకా కేంద్రాలలోనూ స్థిరపడిపోతున్నారు. అందుకే అలాంటి చోట్ల భూముల విలువ, ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా మనం చూడవచ్చు.
ఈ నేపథ్యంలో నా వలస హై స్కూల్ స్థాయిలోనే హైదరాబాద్‌కు మారింది. అక్కడ చదువుసంధ్యలు పూర్తి చేసుకున్నాక, ఉద్యోగ పర్వం నాటి వరంగల్ జిల్లాకు చేరుకుంది. భార్యాభర్తలం ఇద్దరం ఉద్యోగస్థులం కావడంతో హన్మకొండలో స్థిరపడక తప్పలేదు. అందుచేత హన్మకొండలో స్వంత ఇల్లు కట్టుకోక తప్పలేదు. అలా హన్మకొండ వాసిని కాక తప్పలేదు. ఎక్కడ తూర్పు గోదావరి, ఎక్కడ హన్మకొండ? ఈ పరిస్థితి నేను ఎప్పుడూ ఊహించింది కాదు. నా సగం బాల్యం నా స్వంత గ్రామం లోనూ, సగం బాల్యం నాగార్జునసాగర్ -హైదరాబాద్ లలో గడిచిపోయింది.
ఉద్యోగరీత్యా బెల్లంపల్లి (స్వల్ప కాలం)లో, మహబూబాబాద్‍లో గడిపిన తర్వాత హన్మకొండలో స్థిరనివాసం ఏర్పరచుకోవడం జరిగిపోయింది. పూర్తిగా కొత్త ప్రదేశం ఇది నాకు. ఇక్కడ బంధువులను, రక్త సంబంధీకులను అసలు ఊహించలేము. అదృష్టం కలిసొస్తే అన్నీ సమకూరుతాయి అనడానికి నా జీవితమే గొప్ప ఉదాహరణ. అదృష్టవశాత్తు నాకు హన్మకొండలో స్నేహితులతో పాటు, బంధువులు రక్తసంబంధీకులూ తారసపడ్డారు. నాలో కొండంత ధైర్యానికి ఊపిరి పోసారు. దీనితో నాకు హన్మకొండ చాలా ఇష్టమైన ప్రదేశంగా మారిపోయింది. నాకు హైదరాబాద్‌లో స్థిరపడాలని మనసులో వున్నా, వద్దని నా శ్రీమతి అరుణ తెగేసి చెప్పడానికి ముఖ్య కారణం ఇదే కావచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ నేను ప్రస్తావించవలసిన వారు చాలా మంది ఉన్నప్పటికీ, కొద్దిమంది గురించి మాత్రమే వివరిస్తాను.
హన్మకొండ నాకు పూర్తిగా కొత్త ప్రదేశం అయినప్పటికీ, ఇక్కడ నాకొక పెద్ద దిక్కుగా కుసుమ వెంకటరత్నం గారి కుటుంబం దొరికింది. వారు మాకు బంధువులు. మా అమ్మమ్మ తరుపు బంధువు శ్రీ వెంకటరత్నం గారు, నాకు చిన్నాన్న వరస. వారు సహజ కవి, సహృదయులు, భక్తిపరులు. బంధుత్వాలపై అమితమైన ప్రేమాభిమానాలు చూపించే వ్యక్తి. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో (హైదరాబాద్) చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పదవీ విరమణ చేసారు. ఆయన ప్రేమ అపూర్వం.
ఆయనతో పాటు వారి శ్రీమతి సుశీలా వెంకటరత్నం గారూ, వారి పిల్లలు వినోద్, ప్రసాద్ (అన్న కొడుకు), సనాద్, ప్రమోద్, సుమన బుంగ, విద్యాసాగర్ బుంగ (అల్లుడు) వీరంతా మా పట్ల ఎంతో అభిమానంతో ఆత్మీయంగా వుంటారు. నా శ్రీమతికి ఇక్కడ ప్రాంతీయ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో సభ్యత్వం ఇప్పించింది కూడా శ్రీ కుసుమ వెంకటరత్నం గారే! అలా.. ఆ కుటుంబానికి మేమెంతో రుణపడివుంటాము. నేను మరచిపోయి ఫోన్ చేయకపోయినా, ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మా యోగ క్షేమాలు కనుక్కునే స్వచ్ఛమైన సహృదయత వారిది.
కానేటి గోపాల కృష్ణ మా పెద్దన్నయ్య (మా పెదనాన్న కొడుకు) కానేటి కృష్ణమూర్తి గారి పెద్ద కుమారుడు. నేను మహబూబాబాద్‌లో ఉండగానే గోపాల కృష్ణకు ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. నేనే తీసుకువెళ్లి అప్పటి వరంగల్ జిల్లా ‘పర్వత గిరి’ లో జాయిన్ చేసాను. నేను 1994లో హన్మకొండకు వచ్చేసరికి ఇతను కూడా వరంగల్‌కు బదిలీ అయివచ్చాడు. వివిధ హోదాలలో పని చేసి ఆఫీసర్ కేడర్ లో పదవీ విరమణ చేసాడు. మా ఇరు కుటుంబాల మధ్య చెప్పుకోదగ్గ రాకపోకలు లేకపోయినా, మంచి చెడ్డలకు అప్పుడప్పుడూ కలుసుకోవడం జరుగుతుంటుంది. నా రక్త సంబంధీకుడు ఇక్కడ నాతో పాటు స్థిరపడ్డాడు.. అనే దైర్యం నాకు మంచి వూతం ఇస్తుంది.
తరువాత గోపాల కృష్ణ చెల్లెలు శ్రీమతి ధనలక్ష్మి (బుజ్జి)చాలాకాలం ఉద్యోగ రీత్యా హన్మకొండలో ఉండేది. నన్ను ప్రేమగా బాబాయ్ అని పలకరించే కూతురు నాకు. కొద్దీ సంవత్సరాల క్రితమే హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరచుకుని ,అక్కడికి బదిలీ అయిపోయింది. ఆమె బదిలీ కొద్దిగా నాకు నిరాశే మిగిల్చింది అని చెప్పక తప్పదు.
డా. రెవ. నిరంజన్ బాబు గారు ఇక్కడ ‘సెంటినరీ బాప్టిస్ట్ చర్చి-హన్మకొండ’ లో గత 36 సంవత్సరాలుగా పాస్టర్‌గా పని చేస్తున్న సహృదయమూర్తి, నాకు మంచి స్నేహితులు. నా కుటుంబం పట్ల అపారమైన ప్రేమ -అభిమానం చూపించే దైవజనుడు. నా రచనా వ్యాసంగాన్ని అమితంగా ప్రోత్సహించే వాళ్లలో ఆయన కూడా ఒకరు. కష్టసుఖాలు చెప్పుకుని కాస్త సేద దీర్చుకోవడానికి ఆయన కూడా ఒక పెద్ద దిక్కు మాకు. దేనికైనా ఆయన ఉన్నారనే గొప్ప గుండె దైర్యం. 72 సంవత్సరాల వయస్సులో, ఆయన క్రమశిక్షణ, పట్టుదల, చురుకుదనం చాలా గొప్పవి. ఆయన గొప్ప ప్రసంగీకుడు మాత్రమే కాదు, గొప్ప నిరంతర బైబిల్ పరిశోధకుడు కూడా. ఆయనతో స్నేహం నాకు భగవంతుడు చూపించిన దివిటీగా నేను భావిస్తాను.
ప్రొఫెసర్ పాలపర్తి రవికుమార్, జీవితంలో నేను గుర్తుపెట్టుకోదగ్గ, మరియు మరచిపోలేని మధుర జ్ఞాపకం. కడప అందించిన ఒక సహృదయ సౌజన్య మూర్తి, ప్రేమగా నన్ను ‘అన్నా’ అని పిలిచే స్నేహ స్ఫూర్తి, నాకు అత్యంత శ్రేయోభిలాషి. సామాజిక సేవకు నిలువెత్తు చిరునామా ఆయన.
హన్మకొండకు వచ్చిన తర్వాత పరిచయం అయిన సోదరుడు డా. రవికుమార్, నిట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి -పూర్వం రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల) లో ప్రొఫెసర్ (క్రీడా రంగం). మానవీయత నరనరాన పుణికి పుచ్చుకున్న డా. రవికుమార్, సహాయం ఎక్కడ అవసరం అయితే అక్కడ ప్రత్యక్ష మౌతాడు. అంత మాత్రమే కాదు వీరి సతీమణి డా. అనురాధ, వీరికి తగ్గ మహిళ. వీరు మైక్రోబయాలజీ బోధిస్తూ డీన్-ఆఫ్ సైన్స్ హోదాలో ఒక డీమ్డ్ యూనివర్సిటీ లో పని చేస్తున్నారు.
ఈ ఇద్దరూ ఇతరులకు సహాయం చేయడంలో, స్నేహంలో, ఒకరిని మించిన వారు మరొకరు. నా శ్రేయోభిలాషులుగా వారు నాకు లభించడం నాకు మాత్రమే కాదు నా యావత్ కుటుంబానికి అదృష్టం అని నేను నమ్ముతాను. హన్మకొండ (సెంటినరీ బాప్టిస్ట్ చర్చి) మాకు అందించిన సహృదయ జంట వీరు.
శ్రీ ఆనంద్ కుమార్, అరుణ గార్లు మా కుటుంబ మిత్రులు. అరుణ గారు నా శ్రీమతీ అప్పటి స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లో సహోద్యోగులు, మంచి మిత్రమణులు. ఇద్దరి పేర్లు ‘అరుణ’ కావడం ఇక్కడ విశేషం.
ఆనంద్ కుమార్ గారు నాకు మంచి సాహితీ మిత్రులు. కథలు, వ్యాసాలు మాత్రమే కాదు వీరు పాఠ్య గ్రంథ రచయిత కూడా! జన విజ్ఞాన వేదికలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. చెకుముకి -పత్రికకు కూడా వీరు తమ అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. వృత్తి రీత్యా వీరు విద్యాశాఖలో ఉన్నత పదవులు అలంకరించి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఈ జంట కూడా మా శ్రేయోభిలాషులు, మంచి స్నేహితులు కూడా! ఇటువంటి మిత్రుల, శ్రేయోభిలాషుల వల్ల హన్మకొండపై మరింత మమకారం పెరిగిందని చెప్పక తప్పదు. ప్రస్తుతం వీరు హైదరాబాద్‌లో ఉంటున్నా ఎప్పటికప్పుడు మా క్షేమ సమాచారాలు తెలుసుకుంటూనే వుంటారు.
తర్వాత, హన్మకొండలో నేను గుర్తుపెట్టుకోదగ్గ (సాహిత్య పరంగా) అతి ముఖ్యులు శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, శ్రీ దర్భశయనం శేషాచార్య. గిరిజా మనోహర్ బాబు గారు నేను కలసి చాలా సంవత్సరాలు సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థలో కలిసి పనిచేశాం. అంతకు మించి ఆయన నాకు గురుతుల్యులు. పద్యం పాడడంలో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది.
ఆయన మంచి ఉపన్యాసకుడు, తెలుగు సాహిత్య రంగంలో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. అన్నింటికీ మించి ఆయన వ్యక్తిత్వం, సోదరత్వం, స్నేహతత్వం ఎన్నటికీ మరువరానివి. ఎక్కడ వున్నా పలకరించి సాహిత్య విశేషాలు అందించే గొప్ప గుణం మాష్టారిది. ఆయన పరిచయం ఎన్నటికీ మరువలేనిది, స్నేహం విడవ లేనిది.
శేషాచార్య వృత్తి రీత్యా తెలుగు పండితుడు. మంచి విశ్లేషకుడు, సమీక్షకుడు. ప్రచారం కిట్టని గొప్ప సాహిత్య సేవకుడు. వరంగల్ సాహితీ లోకానికి నన్ను పరిచయం చేసి, సాహిత్యకారుడిగా నేను ఎదగడానికి నన్ను అమితంగా ప్రోత్సహించిన/ప్రోత్సహిస్తున్న మహానుభావుడు. సాహిత్య -సాంస్కృతిక కార్యక్రమాల పట్ల మంచి అవగాహన వున్నవ్యక్తి. స్థాయిని మరచిపోయి అవసరాన్నిబట్టి ఎలాంటి పని చేయడానికైనా, నేనున్నానంటూ ముందుకు వచ్చే సహృదయుడు. ఒకానొకప్పుడు సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థకు ఆయన అందించిన సేవలు వెలకట్ట లేనివి, మరచిపోలేనివి. ఏ పనినైనా అంకితభావంతో పూర్తి చేసే క్రమశిక్షణ సుగుణం ఆయన ఆభరణాలు. ప్రతి క్షణం నేను తలచుకునే వ్యక్తుల్లో శేషాచార్య ముఖ్యుడు. ఆయన స్నేహం నాకు చాలా విలువైనది.
చివరగా, ఒక వ్యక్తిని గురించి రాయకపోతే ఈ వ్యాసం అసంపూర్తి గా ఉంటుందని నా నమ్మకం. ఆయన మరెవరో కాదు. శ్రీలేఖ -సాహితి వ్యవస్థాపక అధ్యక్షుడు డా.శ్రీరంగస్వామి. సంస్థ తరఫున ప్రతి సంవత్సరం ఆయన తీసుకువచ్చే (బహుశః ఉగాదికి అనుకుంటాను) కవితా సంకలనాలలో నాకు చోటిచ్చి నన్ను రాయమని ప్రోత్సహించిన సాహితీ మిత్రుడు ఆయన. అంత మాత్రమే కాదు,నా సలహా మేరకు కథా సంకలనాలు కూడా తీసుకువచ్చిన సాహితీ మిత్రుడాయన. ఆ విధంగా ‘శ్రీలేఖ’ను ఉపయోగించుకున్నవాళ్ళల్లో నేనూ ఒకడిని.
ఇలా, నేను ఇష్టపడేవాళ్లు, నన్ను ఇష్టపడేవాళ్లు, ఇక్కడ చాలామంది ఉన్నప్పటికీ వారందరి గురించీ ఇక్కడ ప్రస్తావించే అవకాశం లేదు. అలాంటి మహానుభావులందరికి నా హృదయ పూర్వక వందనాలు.
అలా.. హన్మకొండ(ఇప్పుడు జిల్లా)ను నేను చాలా ఇష్టపడతాను, యెంత అంటే హైదరాబాద్ కంటే ….!! హన్మకొండ లాంటి ప్రదేశంలో చక్కని నివాస గృహం ఏర్పరచుకోవడం, జీవితంలో నేను సాధించిన ఘన విజయాలలో ఒకటి, అదే నాకు గొప్ప తృప్తి.
(మళ్ళీ కలుద్దాం)