నమామి దేవి నర్మదే!! -5

0
3

[box type=’note’ fontsize=’16’] భక్తి పర్యటనలో భాగంగా తమ నర్మదా పరిక్రమణ యాత్రానుభవ కదంబాన్ని సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ. [/box]

నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం

“ఓం జయ జగదానంది మయ్యా జయ ఆనంద కంది

బ్రహ్మ హరిహర శంకర, రేవా శివహర శంకర, రుద్రీ పాలంతీ ఓం జయి॥” అంటూ సాగే హారతిని మాచేత నర్మదకు ఇప్పించారు.

“ఇదం తు నర్మదాష్టకం త్రికాలమేవ యే సదా

పఠంతి తే నిరంతరం న యాంతి దుర్గతిం కదా.

సులభ్యదేహదుర్లభం మహేశధామగౌరవం

పునర్భవా నరా న వై విలోకయంతి రౌరవం ..” ఆదిశంకరులు రచించిన నర్మదాష్టకం చదివాము.

నైవేద్యంగా చిన్న బాదం పలుకులు పెట్టి ప్రదక్షిణలతో నమస్కారం చేశాము.

మా కుడిచేతులకు తోరం కట్టారు. కట్టిన తదనంతరం చెప్పారు, “నేటి నుంచి మీలో నర్మదామాయి వచ్చి నివసిస్తుంది. మీరే నర్మదా, నర్మదే మీరు. నేటి నుంచి రోజు రెండు పూటలా మీరు మీ వద్ద ఉన్న నర్మదకు పూజ చెయ్యాలి. ప్రతి రోజు తప్పక నర్మదను దర్శించి నదిలో స్నానం చెయ్యాలి. ఇది విధి…” అన్నారు.

మేము సమ్మతమని తలలు ఊపాము.

“ఈ రోజు నుంచి మీరు ప్రతి వారిని ‘నర్మదే హరే’ అని పలకరించాలి…”

“అలాగే పండిత్ జీ!”

“మీకు మిగిలిన రూల్స్ తెలుసుగా?” అడిగాడాయన.

“తెలుసు. మీరు చెప్పండి అయినా వింటాము..”

“ప్రతిరోజూ రెండు పూటలా నర్మదను పూజించాలి.

ఏ ఘాటు, ఏ కుండం దర్శించినా మీరు ముందు ప్రోక్షణ చేసుకొని, మీ వద్ద ఉన్న డబ్బాలో నీరు సగం ఖాళీ చేసి ఆ ఘాట్ నుంచి నీరు నింపుకోవాలి.

సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి.

సబ్బు, షాంపు వాడకండి.

జుత్తు కత్తిరించకూడదు.

నదిని దాటకూడదు.

మీ పరిక్రమణ అయ్యాక మీరు మళ్ళీ ఇదే క్షేత్రంలో మీ దగ్గరి నర్మదా జలంతో ఓంకారేశ్వరునికి అభిషేకం చెయ్యాలి. తదనంతరం మీ పరిక్రమ పూర్తి అయినట్లు. అప్పుడు మీ చేతి ఈ తోరం తొలగిస్తాను…”

“అలాగే పండిత్ జీ!”

శ్రీవారు ఆయనకు దక్షిణ ఇచ్చాక మేము నమస్కరించుకున్నాము. మాకు ఆయన హిందీలో ఉన్న హారతి, నర్మదాష్టకం, నర్మదా దేవి చిన్న ఫోటో ఇచ్చారు.

మేము ఈ సంకల్పము తీసుకొన్న తదనంతరం నర్మదకు ప్రణమిల్లుతు, ‘సాధనలో ముందుకు తీసుకుపొమ్మని, చతుష్టయములలో ఒక్కటైనా సిద్ధించే వరమివ్వమ’ని ప్రార్థన చేసుకున్నా.

శ్రీవారు ఏమనుకున్నారో నాకు తెలియదు. మేము అలా సంకల్పం చేసుకొని పూజా సామాను ఇద్దరం చేతులలో నింపుకొని వచ్చాము. మేము వచ్చే సరికే అనిల్ కారు మీద బ్యానర్ అతికించి ఉంచాడు.

‘టెంపుల్ వ్యూ’ బసకొచ్చి బట్టలు సర్దుకొని, అల్పాహారం తిని మా వాహనమెక్కాము.

మా నర్మదా జలపు డబ్బాలు, పూజా సామాగ్రి అంతా బ్యాగులో సర్ది ముందు సీట్లో పెట్టి బెల్టు పెట్టేశాము.

‘ఇక సాయంత్రం వరకు అమ్మ అలా ముందు నిలిచి మమ్ములను నడిపిస్తుంది’ అనుకున్నాను.

నా ఆసనం కారు సీట్లో వేసుకొని సుందరాకాండ పారాయణము మొదలు పెట్టాను.

జై శ్రీరామ్॥ నర్మదే హరే నర్మదా॥

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!!

***

“సింధుసుస్ఖలత్తరంగభంగరంజితం

ద్విషత్సు పాపజాతజాతకాదివారిసంయుతం.

కృతాంతదూతకాలభూతభీతిహారివర్మదే

త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే”.. (నర్మదాష్టకం)

యముని వలన కలుగు మరణభయమును హరించు ఓ దేవీ! నర్మదామాయి!!! నీటిబిందువులు కల ప్రవాహమునందు,

లేచి పడుచున్న అలలతో శోభిల్లుచున్నది,

పుట్టుకనే నశింపచేయు జలము కలది అగు

నీ పాదపద్మములకు నమస్కరించుచున్నాను.

ఓంకారేశ్వరము నుంచి మా ప్రయాణం మొదలైయింది. ఓంకారేశ్వర్ నుంచి ‘షహడ’ 250 కిలోమీటర్లు ఉంది. ఓంకారేశ్వరం నుంచి దాదాపు గంటన్నర ప్రయాణించాక మేము ‘రావఖేడ్’కి చేరుకున్నాము. అక్కడ నర్మద ప్రక్కనే పీష్వా మొదటి బాజీరావు సమాధి ఉంది.

మరాఠీ వీరుడు, మరాఠీ రాజ్యంలో వీరశివాజీ తరువాత అత్యంత గౌరవప్రతిష్ఠలు కలిగిన వాడు మొదటి బాజీరావు. చాలా చిన్న వయస్సులో అంటే ముప్పై తొమ్మిది సంవత్సరముల వయస్సులో యుద్ధంలో జర్వం మూలంగా మరణించాడు ఈ మహావీరుడు. ఆయనకు రేవా నది తీరాన అంత్యక్రియలు చేసి అద్భుతమైన సమాధి మందిరాన్ని నిర్మించాడు రానోజీ షిండే.

క్రీ.శ 1700లో జన్మించిన బాజీరావు యొక్క తండ్రి విశ్వనాథుడు. తండ్రి ఛత్రపతి సాహు దగ్గర పీష్వాగా ఉంటాడు. చిన్నతనం నుంచే బాజీరావు తండ్రితో కలసి తిరగటానికి, వ్యవహార దక్షత తెలుసుకోవటానికి మొగ్గు చూపేవాడు.

మరాఠీ బ్రాహ్మణుల సాంప్రదాయ చదువులైన సంస్కృతంతో పాటు, యుద్ధ విద్యలు కుడా నేర్చాడు బాజీరావు. తండ్రితో పాటు యుద్ధాలలో పాల్గొని తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. క్రీ.శ 1720 లో తండ్రి మరణాంతరం ఛత్రపతి సాహు బాజీరావును పీష్వాగా నియమించాడు. ఎందరో పెద్దవారు అనుభవజ్ఞులైన వారుండగా కేవలం ఇరువది సంవత్సరాల బాజీరావును పీష్వాగా నియమించటము కొందరికి రుచించలేదు.

పీష్వాగా నియమించబడిన తరువాత బాజీరావు ఎన్నో యుద్ధాలు జరిపాడు. మొఘలుల ప్రాబల్యం తగ్గుతున్నదని నమ్మిన బాజీరావు ఉత్తరానికి వెళ్ళి మొఘలుల మీద విజయం సాధించాడు. దక్షిణాన నిజాంను గోదావరి ఒడ్డున కట్టడి చేసి, విజయం సాధించాడు. మాళ్వా మీద దండెత్తి విజయం సాధించాడు. గుజరాత్ మీద దండెత్తి విజయం సాధించాడు. తన వంటి యువకులైన మల్హర్ రావ్ హోల్కర్ (ఇండోర్), రానోజీ షిండే(గ్వాలియర్), ఉదాజీ పవార్(ధర్), తుకోజీరావు పవార్ (దేవార్), శివాజీ రావు పవార్ లతో కలిసి మరాఠా కూటమిని మొదలుపెట్టాడు.

వీరు ఐదుగురు కలిసిన బలమైన మరాఠా సైన్యం ఆనాడు దేశ చరిత్రలో మరాఠుల రాజ్యం విస్తరించటములో ముఖ్య భూమిక పోషించింది. ముఖ్యమైన భాగాలన్నీ ఆనాడు మరాఠాల ఏలుబడిలోకి వచ్చాయి. అక్కడి రాజులు మరాఠాలకు సామంతులుగా మారవలసి వచ్చింది. బాజీరావు గొప్ప యుద్ధ వీరునిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన యుద్ధ కౌశల్యము మీద గొప్పగొప్ప రచనలు కూడా వెలుబడ్డాయి. అత్యంత వేగవంతమైన మార్పులు, శీఘ్ర నిర్ణయాలు, మెరుపు దాడులకు బాజీరావు ప్రసిద్ది చెందాడు. నిజాం మీద జరిపిన యుద్ధం, సాధించిన విజయం భారతీయ యుద్ధాలలో ఎంతో ప్రముఖమైనదిగా ఆంగ్లేయులు, యూరోపియన్లు కూడా పొగుడుతారు. ప్రతి యుద్ధ నాయకుడు బాజీరావు యుద్ధ కౌశలమును నేర్చుకోవాలని పేర్కొంటారు, మరాఠాల మీద పుస్తకాలు రాసిన జాథునాధ్ సర్కార్, పానికర్ ప్రభృతులు.

వీర శివాజీ తరువాత హిందూ వీరులు ఇంత గొప్ప యుద్ధ వీరులని చూసి ఉండలేదు. బాజీరావుకు సాటి మరొకరు లేరు. భారతదేశమంతా విస్తారంగా యుద్ధాలు చేసి, ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పశ్చిమాన గుజరాత్ వరకు మరాఠాకు తిరుగులేని విధంగా జయకేతం ఎగురవేశాడు బాజీరావు.

పూణెను తన ముఖ్యమైన భూమిక చేసుకున్నాడు. పూణెలో కట్టిన కోట నేటికి దర్శనీయమైన స్థలము. ఇరవై సంవత్సరాలు వరుస యుద్ధాలు చేశాడు బాజీరావు. క్రీ.శ 1740లో నర్మదా నది తీరంలో ఒక యుద్ధం కోసము ఆగినప్పుడు విషజ్వరం బాజీరావును కమ్మేసింది.

రావఖేడ్‌లో తన చివరిశ్వాసను ఒదిలివేశాడు. తన పేరు మీద ఒక ఛత్రీ (వృత్తాకారపు గోపురంతో కూడిన మందిరాలను చత్రీ అంటారు) కట్టమని రానోజీ షిండేకి చెబుతాడు బాజీరావు. బాజీరావు కోరిక మీద నర్మదా ఒడ్డున రావోజీ ఒక విశాలమైన ఘనమైన ఛత్రిని నిర్మించాడు. ఆ ఎత్తైన ప్రాకారంలో రామునికి, నీలకంఠేశ్వరునికి దేవాలయాలను కూడా నిర్మించారు. చుట్టూరా ఎత్తైన ప్రాకారం, గదులు, బారుగా నిర్మించిన వరండాలతో, నర్మద మీదకు తెరిచి ఉన్న పెద్ద కిటికీలతో, నిలువెత్తు ద్వారంతో ఎంతో రాజసంగా ఉంది ఆ ఛత్రి. ఆ ఛత్రి చాలా శుభ్రంగా ఉండి పర్యాటకులను స్వాగతిస్తోంది.

మేము ద్వారం గుండా లోపలికి వెళ్ళి, ఆ రాజసం చూసి కొంత ఆశ్చర్యపోయాము.

నర్మద మీదకు ఉన్న కిటికీలు చూసి చాలా సంతోషం కలిగింది. ఆ కిటీకిల నుంచి నర్మద పరమ సుందరంగా కనపడుతోంది. వరండా హాల్‌కు కట్టిన ఆర్చ్‌లు ఒకదాని నుంచి ఒకటిగా చూడటానికి చాలా బాగున్నాయి. కొంత సేపు లోపల అంతా తిరిగి చూసి సంతోషపడి బయటికి వచ్చాము. ఆ ప్రాంగణం ముందర, ‘అది బాజీరావు సమాధి’ అని బాజీరావు గురించి కొంత సమాచారంతో ప్రభుత్వ టూరిజం వారి బోర్డ్ ఉంది. ప్రక్కనే పెద్ద మర్రి చెట్టు, చెట్టు మొదట్లో హనుమంతుల వారు ఉన్నారు. ఆ చెట్టు మొదలు పాతిక అడుగుల కన్నా విశాలంగా ఉంది. పురాతనమైన ఆ చెట్టుకు ప్రదక్షిణ చేసుకుని హనుమంతుల వారికి నమస్కరించాను.

ఇద్దరం కలిసి నర్మద వద్దకు వెళ్ళాము. ఘాట్ బాగుంది. గ్రామ ప్రజలు కొందరు బట్టలు ఉతుకుతున్నారు. కొందరు నదికి పూజలు చేస్తున్నారు. మేము వెళ్ళి ముందు నదికి నమస్కరించుకొని, నదిలోకి ప్రవేశించటానికి అనుమతి ప్రార్థించాము. తదనంతరం నదిలోకి దిగి ప్రోక్షణ చేసుకున్నాము. మా వద్ద ఉన్న నర్మదా నీరు ఉన్న డబ్బాలో కొంత నీరు తొలగించి నదిలో నీరు పట్టుకున్నాము, మాకు పండిత్‌జీ చెప్పినట్లుగా.

తరువాత నెమ్మదిగా ఎత్తైన గట్టు ఎక్కి రోడ్డు మీదకు వచ్చాము. అక్కడ గ్రామం లోని పిల్లలు వచ్చి కారు చుట్టూ మూగి ఉన్నారు. నేను వారికి తలో బిస్కెట్ ప్యాకెట్, నోటు పుస్తకం, పెన్ను పంచాను. అందరం కలిసి ‘నర్మదే హరే’ అన్ని గట్టి శరణుఘోష చేశాము. తరువాత మేము బయలుదేరాము.

అక్కడ్నుంచి రోడ్డు ఎక్కే లోపల ఒక ఆశ్రమంలో నర్మదా పరిక్రమ చేసే భక్తులకు భోజనాలు వడ్డిస్తున్నారు. ఒకతను మా కారు వైపు చేతులు ఊపుతూ పిలిచారు. నేను ఆగుదామన్నా శ్రీవారు వద్దని చెప్పారు. తరువాత ఆయనతో చెప్పాను “ఇక పై ఎవరన్నా పిలిస్తే వెళ్ళి వారిచ్చినది తీసుకుందాము. వద్దని చెప్పవద్దు. కేవలం అమ్మ అనుగ్రహం వలననే అలా మనలను పిలుస్తారు” అని, ఆయన ఎంత విన్నాడో కాని యాత్ర మొత్తం తనకు తోచిన విధంగానే సాగించాడు. ఆరోజు మాకు భోజనం చెయ్యగలిగే ప్రదేశం కనపడలేదు. “పిలిచినా ఆగక వచ్చినందుకు శిక్ష” అని అనుకున్నా.

దారిలో మేము కొన్ని పురాతనమైన దేవాలయాలను సందర్శించాము. అవి మహాకాలేశ్వరుని దేవాలయం 1 మరియు మహాకాలేశ్వరుని దేవాలయం 2, జైనదేవాలయం.

ఈ దేవాలయాలు అద్భుతమైన శిల్పకళకు తార్కాణం. దేవాలయాలు పరమరా రాజవంశీయులచే నిర్మించబడ్డాయి. పూర్వం అసలు ఖర్గాను విద్యానిలయమై వెల్లివిరిసింది. ఆ విషయం ఆ దేవాలయాలలోని గోడలపై లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తుంది. పరామరా రాజుల తరువాత ఈ దేవాలయాలు హోల్కర్లచే పోషించబడినాయి. ఈ దేవాలయాల నిర్మాణం ఎత్తైన శిఖరాలతో కలిగి ఉంటాయి. దేవాలయాల మీద శిల్పాలు, దేవాలయంలో గర్భగుడి, ముందర మండపములతో, అణువణువునా శిల్పసంపదలతో ఉన్నాయి.

లతలతో, ఏనుగులు వంటి జంతువుల బారులతలో కూడిన తోరణాలు, యోగినులు, శిల్పసుందరులు ఉన్న దేవాలయ గోడలు చాలా వరకు దెబ్బతిని ఉన్నాయి. అవి మహ్మదీయ దండయాత్రలలో వాటి సొగసులు చాలా మటుకు కొల్పోయాయి. అయినా వాటి అందం తరగక మనలను ఆకర్షిస్తాయి.

మొదటి దేవాలయంలో శివుడు ఉన్నాడు. రెండవ దానిలో నంది ఉన్నా దానికి తల లేదు. వాటి చుట్టు శుభ్రం చేసి పోషిస్తున్నారు ఆర్కియాలజీ విభాగం వారు. రెండవ దేవాలయం మరింత విశాలంగా ఉంది. శిల్పాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నా, కొద్ది భాగం కూలిపోయి ఉన్నాయి. మూడవ దేవాలయం పెద్దది.

మహమ్మదీయుల తరువాత జైనులు అక్రమించారని, వారి తరువాత అది శివాలయంగా మారిందని చెబుతారు. అందమైన ఎత్తైన ఆ మండపం చాలా భాగం చెక్కుచెదరకుండా శిల్పాలతో, తోరణాలతో కళకళలాడుతోంది. మండపములోని స్తంభాలు పెద్దవిగా ఉండి అద్భుత శిల్పకళ చూడచక్కనైనది. దానికి గోపురం లేదు.

నాలుగవ దేవాలయం చిన్నది. చాలా సాధారణంగా ఉంది. లోపల ఉన్న శివునికి ఆరాధన జరుగుతున్న గుర్తులు ఉన్నాయి. బయట నందికి తల కొట్టేసి ఉంది. దేవాలయం పైన కాషాయపు జెండా ఎగురవేసి ఉంది. మేము ఆ దేవాలయాల వద్ద ఆగి ప్రదక్షిణ చేసి నమస్కారాలు చేసుకొని ముందుకు సాగాము. ప్రతి దేవాలయం దగ్గర ఒక రిజిష్టర్ పెట్టారు. అందులో వచ్చిన పర్యాటకుల వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు గంటలు ఏకధాటిగా ప్రయాణించి మేము మహారాష్ట్ర లోని షహాడా చేరుకున్నాము. షహాడా పట్టణము మహారాష్ట్ర వాయువ్య సరిహద్దు వద్ద ఉంది. గోమతి, తపతి నదులు కలిసే సంగమము ఈ పట్టణానికి చేరువుగా ఉంది. ఈ పట్టణము దగ్గర జరిపిన త్రవ్వకాలలో క్రీస్తు పూర్వం 1700 నాటి వస్తుసముదాయాలు లభించాయి. వాటిని బట్టి ఇది పురాతనమైన పట్టణముగా పేర్కొంటారు. ఉన్నత విద్యాసంస్థలతో కూడి ఉన్న ఈ పట్టణం చుట్టుప్రక్కల వారికి మంచి కేంద్రం.

‘షేర్ పంజాబ్’ అన్న చిన్న హోటల్ మాకు బసగా ఏర్పాటు చెయ్యబడింది. అది చాలా చిన్న హోటల్. మాకు రెండవ అంతస్తులో గదిని కేటాయించారు. గదిలో దుప్పట్లు మీద మరకలు, హోటల్ సిబ్బంది మాస్క్ వాడకపోవటం శ్రీవారిని చికాకు పరిచింది. అన్నింటికి సర్దుకుపోయే నేను “పర్వాలేదు…” అన్నా వినక ఆయన వాళ్ళ చేత నాలుగు దుప్పట్లు మార్పించారు. కాని అన్నింటి మీదా ఏవో మరకలు.

మాతో తెచ్చుకున్న దుప్పటి పరుచుకొని, మరొకటి కప్పుకొని పడుకుందామని సముదాయించాను. ఆ హోటల్ వారి శుభ్రత మీద అనుమానంతో అక్కడ రాత్రి కూడా భోజనం చెయ్యలేదు వారు.

మేము వెళ్ళాక, నర్మదను గదిలో ఒక చిన్న బల్ల మీద సర్ది, స్నానాంతరం నర్మదకు పండిత్‌జీ చెప్పిన విధి విధానంతో పూజ చేసి హారతి ఇచ్చాము. తదనంతరం నేను కొంత జపం చేసుకున్నాను. ఆ సాయంత్రం రెండు పుల్కాలు, జీరా ఆలు కూరతో నేను భోజనం చేశాను. ఇద్దరం మజ్జిగ త్రాగాము. పరమాత్మను, నర్మదను ధ్యానించి, ప్రయాణంలో రెండవ రాత్రి రోజును ముగించాము.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here