కొరియానంలో చిన్న బ్రేక్
Chapter 12
[dropcap]వ[/dropcap]దల బొమ్మాళీ వదలా!
మీరనుకునే బ్రేక్ కాదు. Oldboy తో మొదలుపెట్టి, …Ing లో మి సుక్, మిన్-ఆ లతో పరిచయం పెంచుకుని, వీరికి మన ట్విస్టెడ్ హీరోను పరిచయం చేసి, మధ్యలో మాటల సందర్భంగా పోయెట్రీ సినిమా గురించి తెలుసుకున్నాం. అన్నీ సీరియస్ సినిమాలే. లోతైన కథలే. ఎన్నో విషయాలను, విశేషాలను కలుపుకున్నవే. వీటికి తోడు కొరియన్ వేవ్‌లో భాగంగా జనాలకు బాగా తెలిసిన సినిమాలే కాకుండా కాస్త Off The Beaten Path లాంటి సినిమాలను కూడా మనం గమనించాలి. కానీ కొరియన్ సినిమాలనగానే మనవాళ్ళకు బాగా గాఢత కలిగినవిగా భ్రమ కలిగించేవే బాగా గుర్తొస్తాయి.
Popcorn entertainers కూడా కొరియన్ సినిమాలో భాగమే. వాటిలో కూడా కొన్ని విచిత్రమైన సినిమాలుంటాయి. అలాంటివాటిలో ఒకటే My Wife Is A Gangster. చాలా popular సినిమా. బ్రహ్మాండంగా ఆడింది. దీన్నే మన అల్లరి నరేశ్‌తో ‘జేమ్స్ బాండ్ – నేను కాదు మా ఆవిడ’ అనే పేరుతో తీశారు. అలాంటి మరో సినిమా A Millionaire’s First Love. దీన్ని కూడా మనం తెలుగులో నానితో వచ్చిన much loved ‘పిల్ల జమీందార్’గా చూసేశాం. కానీ, అంతగా పరిచయం లేని సినిమాలు కూడా కొన్ని మనవాళ్ళకు బాగా పనికి వచ్చాయి. చాలా చిత్రంగా… ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చూస్తే మనకు మన కన్నడ డబ్బింగ్ సినిమాలు గుర్తుకు వస్తాయి.
అలా అని వాటిని ఈ సినిమా చూసి తీశారా అంటే కాకపోవచ్చు. దీన్ని చూసి వాటినే తీశారా అంటే… ప్చ్! చెప్పలేం. అలాంటి సినిమాలు కొన్ని 1996-2004 మధ్య వచ్చిన కన్నడ సినిమాలుగా గుర్తు. ఖచ్చితంగా చెప్పలేను. మనం మాట్లోడుకోబోయే సినిమా 2006లో వచ్చింది. పేరు…
The City of Violence.
ఈ సినిమా పేరు నేను మొదట వచ్చిన ఎపిసోడ్లలో చెప్పాను. ఇదేమీ పెద్ద కళాఖండం కాదు. అలా అని తీసిపారేయదగ్గ సినిమా కూడా కాదు. ఒక జాతికి చెందిన తమాషా సినిమా. మన భాషలో చెప్పాలంటే స్టంటు సినిమా. కేవలం స్టంట్స్ కోసమే తీసినట్లుండే సినిమా.
ఒక్క క్షణం ఇక్కడికి ఆపేసి యూట్యూబ్ లో Street Fight in The City of Violence అని కానీ, City of Violence Street Fight అని కొట్టి చూడండి. అక్కడ వచ్చే వాటిలో 480p ఉండే ఒక వీడియో దాదాపు నాలుగున్నర నిమాషాలది ఉంటుంది. దాన్ని చూడండి. చూశారా? హమ్మయ్య! ఇంక వెనక్కి వచ్చేయండి.
చిత్ర విచిత్రమైన ఆయుధాలతో డజన్ల కొద్దీ రౌడీల లాంటి వాళ్ళు ఒక వ్యక్తిని చుట్టుముడతారు. అతను కూడా వీళ్లంతా నా ముందు పిల్లకాయలు అన్నంత తేలికగా ఫైట్ మొదలుపెడతాడు. బేస్ బాల్ బ్యాట్ల నుంచీ, సంగీత పరికరాల వరకూ అన్నీ ఆయుధాలే. కరాటే నుంచీ, పాప్ సాంగ్స్ స్టెప్స్ వరకూ అన్ని రకాల exercise లు మనకు ఈ ఫైట్‌లో భాగంగా కనిపిస్తాయి. ఫైట్ కూడా Chaotic editing తో ఒక రకమైనా రిథమ్‌తో సాగుతుంది. ఎగురుతూ, దుముకుతూ, కుప్పి గంతులు వేస్తూ, ఆశ్చర్యకరమైన విన్యాసాలు చేస్తూ ఆ ఒంటరి వ్యక్తి ఫైట్ కొనసాగిస్తాడు. ఒక్కొక్కరిని, ఇద్దరిద్దరిని కొడుతూ దారి చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఒకానొక సందర్భంలో నాలుగు రోడ్ల కూడలిలో అతన్ని కనీసం వంద మంది పైనే చుట్టుముడతారు.
ఇక్కడ ఇంకో విశేషం… chaotic editing, hip hop montage లతో పాటూ ఒకరకమైన బీట్ ఉన్న మ్యూజిక్ వెనకాల వస్తుంటుంది. సన్నివేశంలో ఉన్న వైలెన్స్‌కీ, ఈ background music కీ సంబంధం ఉన్నట్లుగా కనబడదు. కానీ, మనం ఆ విజువల్స్‌కు అయినా లేదా ఆ మ్యూజిక్ కైనా addict అయి ఆ సీన్‌ను రిపీట్ మోడ్‌లో చూస్తాము. అలాగే ఇష్టంగా ఆ వీడియోను చూస్తూ ఉండిపోతాము ఏదో మంత్రం వేసినట్లు. ఆ మ్యూజిక్‌లో ఉండే ఓ మజా అలాంటిది. ఆ విజువల్స్‌లో ఉన్న rhythm అలాంటిది.
సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే దీన్ని Zeigarnik Effect అంటారు. ఈ ఫైట్‌ను గమనిస్తే ఎలా హఠాత్తుగా మొదలైందో అలాగే హఠాత్తుగా అంతమౌతుంది. అందువల్ల మనకు మనసులో ఎక్కడో చిన్న అసంతృప్తి. కానీ, ఏదో గొప్ప సన్నివేశాన్ని చూసిన ఫీలింగ్. సోవియెట్ రష్యాలో భాగంగా లిథువేనియా దేశం ఉన్న కాలంలో… అంటే 1927లో Bluma Zeigarnik ఈ విషయాన్ని ప్రతిపాదించింది.
మనిషి ఏదైనా పని గొప్పగా చేయటం కన్నా హఠాత్తుగా మధ్యలో ఆపేస్తే అది బాగా గుర్తు ఉంటుంది. వంద సహాయాలు చేసిన వ్యక్తి నుంచి మనం పొందిన మంచి కన్నా, ఆ వ్యక్తి వల్ల మనకు ఎదురైన చిన్న నిరాకరణే ఎక్కువ గుర్తుంటుంది. అందుకే గొప్ప ఆర్టిస్టులు కూడా perfectionism కు aim చేసి కూడా కావాలనే ఏదో మనం తేలికగా కనిపెట్టలేని… అలా అని అసలు కనుకొనలేని విధంగా కాకుండా సూక్ష్మమైన లోపాన్ని తమ పనిలో ప్రవేశ పెట్టి చోద్యం చూస్తుంటారు.
ఉదాహరణకు టైటనిక్ సినిమాలో లిఫ్ట్ సీన్. అది అందరూ అనుకునేట్టు goof కాదు. లిఫ్ట్ పైకెళ్తుంటే నీడ కూడా పైకి వెళ్ళడం కావాలని చూపిన ఎఫెక్టే. మెదడు వాటిని కనుగొననంత వరకూ ఓకే. కానీ ఒకసారి పట్టుకుంటే ఇక… we cannot unsee it. ఈమధ్యే వచ్చిన అవతార్ 2 టీజర్, పోస్టర్లలో కూడా జేమ్స్ కామరాన్ ఇలాంటి టెక్నిక్ వాడాడు. దాన్ని గురించి మరోచోట చూద్దాం. ఈ effect వల్ల మనకు ఆ యా సన్నివేశాలో, ఆర్టువర్కులో అలా గుర్తుండి పోతాయి. వాటిని మనం ఎప్పటికీ మర్చిపోలేం.
సరిగ్గా ఇలాంటి టెక్నిక్‌ను సినిమా అంతా వాడి తీసిందే The City of violence. సినిమాలో పెద్ద కథ ఏమీ ఉండదు. అన్నీ ఫైట్లే. మన Thriller Manju సినిమాల్లో లాగానే. ఆ ఫైట్లు పెట్టటానికి ఏదోక కారణం కావాలి కనుక కథ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని అలా అలా ముక్కలు ముక్కలుగా కొట్టి ఫైట్ల మధ్య అతికిస్తారు.
చిరుగులున్న పంట్లాల మీద కుట్లు వేసి అవి కనబడకుండా చేసినట్లు. కాకపోతే ఈ సినిమాలో కాస్త చెప్పుకోదగ్గ కథకు స్నేహం, ఆత్మీయత అనే ఫెవికాల్ ఎమోషన్లు పూసారు అంతే.
The City of Violence దర్శకులు Ryoo Seung-wang, Jung Doo-hong. Ryoo అధిక భాగానికి దర్శకత్వం వహించగా, మధ్యమధ్యలో కొన్ని చోట్ల Jung చేయిచేసుకున్నాడు. వీళ్ళద్దరూ మన రామ్-లక్ష్మణ్, Thriller Manju లాంటి action choreographers. కాస్త fashionable గా చెప్పటానికి. నాటుగా చెప్పాలంటే స్టంటుమెన్ను. Sympathy for Mr. Vengeance, Sympathy for Lady Vengeance సినిమాలలో action scenes లో cameo రూపంలో ఆకు రౌడీ పాత్రలు వేయటమే కాదు. Crying Fist లాంటి classic action melodrama (మన Oldboy చోయ్ మిన్-సిక్ ప్రధాన పాత్ర) నే కాకుండా No Blood No Tears లాంటి pulp action thrillers కూడా తీశాడు.
ఇక Jung Doo-hong విఖ్యాతి గాంచిన action choreographer. G. I. Joe లాంటి American యాక్షన్ సినిమాలకు కూడా స్టంట్ మాస్టర్‌గా చేశాడు. ఇతను ర్యూ కు మంచి స్నేహితుడు, ఇద్దరూ చాలా సినిమాలకు కలిసి పనిచేశారు.
The City of Violence కథ వియయానికొస్తే…
తే-సు, పిల్-హో, సుక్-హ్వాన్, వాంగ్-జే, డాంగ్-హ్వాన్ లు స్కూల్‌మేట్స్. మంచి స్నేహితులు. ఎటు పోయి ఎటు వచ్చినా, ఐదుగురూ జీవితాంతం ఆత్మ బంధువులుగా (శివాజీ గణేశన్‌ను గుర్తు తెచ్చుకోవద్దు ప్లీజ్) ఉండాలని చిన్నతనంలో ఒట్టు పెట్టుకుంటారు. పెరిగి పెద్ద అయ్యాక తే-సు సోల్ (Seoul) నగరంలో పోలీస్ డిటెక్టివ్ అవుతాడు. మంచి పేరు సంపాదించుకుంటాడు. వాంగ్-జే మాబ్ బాస్ అవుతాడు. అతనికి సహాయంగా కుడిభుజం లాంటి మనిషిగా పిల్-హో వ్యవహరిస్తుంటాడు. సుక్-హ్వాన్ రికవరీ ఏజంట్ గా చేస్తుంటే, అతని పెద్ద సోదరుడు డాంగ్-హ్వాన్ చిన్న స్కూల్ లో లెక్కల మాస్టరుగా చేస్తుంటాడు.
సినిమా వాంగ్-జే ను ఎవరో నలుగురు యువకులు ఏదో తగువులో భాగంగా తమ వెంట పడి తరుముతుంటే ఒక చిన్న ఇరుకు సందులోకి దారి మళ్ళించి చంపటంతో మొదలౌతుంది. అతని స్థానాన్ని పిల్-హో తీసుకుంటాడు. పిల్ హో చెప్పటంతో మిగిలిన నలుగురూ వాంగ్-జే అంతిమ కర్మకు హాజరౌతారు. తామ చిన్నప్పటి ప్రతిజ్ఞ గుర్తుపెట్టుకుని పోలీస్ డిటెక్టివ్‌గా తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారు అన్నది కనుక్కుని, వారిని జైలుకు పంపాకే సోల్ నగరానికి వెళ్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అతనితో పాటూ సుక్ హ్వాన్ తనకు తానుగా ఆ హంతకులను పట్టుకోవాలని డిసైడయ్యి భవ సాగరమీదే తన అన్నను ఇంటికి పంపి రంగంలోకి దిగుతాడు. రికవరీ ఏజంట్‌గా అనుభవం అక్కరకు వస్తుంది. పిల్-హో మాత్రం వీరికి విడిగా సాయం చేస్తానని, తన బిజినెస్‌ను మళ్ళా నిలబెట్టుకోవాలని చెప్తాడు.
ఆ చిన్నప్పటి వాగ్దానాలు, స్నేహితుల మధ్య అనుబంధాలు, పైపూతగా, ఇక వరుసబెట్టి స్టంట్ సీన్లు వస్తాయి. అలా చివరికి ఆ నగరంలో ఉన్న హంతకులను వీరు ఎలా పట్టుకుని చంపి తమ ప్రతీకారం తీర్చుకున్నారు అనేది కథ. ఐదు ప్రధాన action సీన్లు, కొత్త తరహా ఎడిటింగ్, గంగవెర్రులెత్తించే మ్యూజిక్, రిచ్ విజువల్స్. అంతే. ఎక్కడా బోర్ కొట్టకుండా తెర మీద నుంచి తల తిప్పకుండా కూర్చోబెడతారు దర్శకులు.
ఈ సినిమాలో వచ్చిన ఎడిటింగ్ స్టైల్‌ను అటు రాఘవ లారెన్స్, ఇటు పూరీ జగన్నాథ్‌లే కాకుండా సింగం సినిమాల్లో దర్శకుడు హరి విచ్చలవిడిగా వాడుకున్నారు. ‘బుజ్జిగాడు’లో ఒక పాట, ఒక action scene దీని నుంచి స్పూర్తి పొందినవే. ‘సిత్తరాల సిరపడు’ పాటలో వచ్చే ఫైట్ కూడా ఈ సినిమాలో వచ్చే ఒక ఫైట్ నుంచీ inspire అయినదే. సినిమా మేకింగ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. విపరీతమైన వైలెన్స్ ఉన్నా, గొప్ప సినిమా కాకపోయినా, Zeigarnik Effect వల్ల విపరీతంగా చూడబుద్ధి వేస్తుంది. Oddly satisfying.