సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-14

0
3

[dropcap]జ[/dropcap]బ్ దిల్ కో సతాయే గమ్, తూ ఛేడ్ సఖీ సర్ గమ్
బడా జోర్ హై సాథ్ సురోమే బహతే ఆసూ జాత్ హై థమ్
‘సర్‍గమ్’ సినిమాలో సి. రామచంద్ర సంగీత దర్శకత్వంలో లత మంగేష్కర్ సరస్వతీ రాణీతో కలసి పాడిన పి.ఎల్. సంతోషి పాట. లతా మంగేష్కర్ జీవితానికి సరైన నిర్వచనం లాంటిది. లతా మంగేష్కర్ తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలన్నింటికీ సమాధానం సంగీతం. ఆమె బాధలకు, వేదనలకు ఉపశమనం సంగీతం. సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించాలంటే కావాల్సింది సంగీతం.
“నా జీవితంలో సంగీతం తప్ప మరొకటి లేదు. బాల్యంలో నాన్నగారు సంగీతం నేర్పించేందుకు పిలిస్తే నేను ఏవేవో సాకులు చెప్పి తప్పించుకునేదాన్ని. కడుపునొప్పి అనేదాన్ని, తలనొప్పి అనేదాన్ని. ఏదో సాకు చెప్పేదాన్ని. చివరికి ఒకరోజు నాన్నగారు నన్ను నిలదీసి అడిగారు. ‘ఎందుకని సంగీతం నేర్చుకోవటం నుంచి తప్పించుకుంటున్నావు! నీకు భగవంతుడిచ్చిన అతిగొప్ప స్వరం ఉంది. దాన్ని ఎందుకని సరైన రీతిలో ఉపయోగించేందుకు ఇష్టపడటం లేద’ని అడిగారు. “నాకు మీ ముందు పాడాలంటే భయంగా ఉంది” అని నిజం చెప్పింది లత. అప్పుడు ఆమె తండ్రి అన్న మాటలు జీవితాంతం తన వెంట ఉండి తనకు ఆత్మవిశ్వాసాన్నిస్తాయని చెప్పింది లత. “భగవంతుడు నీకు అత్యద్భుతమైన స్వరం ఇచ్చాడు. ఎవరి ముందు పాడేందుకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ ముందు ఎవరూ నిలువలేరు. అలాగని ఎక్కడ బడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు పాడి నీ స్వరాన్ని వ్యర్థం చేసుకోకు. కాబట్టి నా ముందే కాదు, ఎవరి ముందు కూడా పాడేందుకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు” అన్నాడు దీననాథ్ మంగేష్కర్. ఈ సంఘటన చెప్తూ అంది లత “అప్పటి నుంచీ నేను నాన్నగారి మాటలను పాటిస్తున్నాను. పెద్ద గాయనిలతో, గాయకులతో కలసి పాడేటప్పుడు కూడా భయపడలేదు. వారిని గౌరవించాను తప్ప భయపడలేదు. నాది భగవంతుడు ఇచ్చిన స్వరం. నేనెవరితో కలిసి పాడేందుకైనా ఎందుకు భయపడాలి?’ అంది లత.
అయితే లతా మంగేష్కర్ ఇతర గాయనీ గాయకులలా సభలలో, పార్టీలలో, వివాహాలలో పాటలు పాడలేదు. ఎవరెంతగా అభ్యర్థించినా, అసందర్భంగా తన గళం విప్పలేదు. ఇంటర్వ్యూలలో పాట పాడమని ఎవరెంతగా అభ్యర్థించినా నవ్వుతూ ఎత్తగొట్టేసింది. జావేద్ అఖ్తర్‌తో జరిగిన ఓ టీవీ ఇంటర్వ్యూలో నటుడు అమీర్ ఖాన్ ఆమెని పాట పాడమని కోరినప్పుడు, పాట పాడనని చెప్తూ “ఏయ్ క్యా బోల్తా తూ?” అని సమాధానం ఇచ్చింది అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతూ. అది అమీర్‍ఖాన్ ‘గులామ్’ సినిమాలో స్వయంగా పాడిన పాట!
ఇదే ఆత్మవిశ్వాసం లత తన సినీ జీవితం ఆరంభంలో అప్పటికే స్థిరపడి ఉన్న రాజ్ కుమారీ, అమీర్‌బాయి కర్ణాటకి, శంషాద్ బేగమ్ లతో కలసి యుగళ గీతాలు పాడే సందర్భాలలో ప్రదర్శించింది. అప్పటికే స్థిరపడి ఉన్న దుర్రానీ వంటి వారితో కలిసి పాడే సందర్భాలలోనూ ప్రదర్శించింది. ఇదే ఆత్మవిశ్వాసం తన కెరీర్ ఆరంభం నుంచీ ప్రదర్శించింది. దాంతో సినీ ప్రపంచం లతతో పనిచేయాలంటే ఆమె చెప్పినట్టు వినాలి తప్ప తాము చెప్పినట్టు ఆమె వినదని అర్థం చేసుకుంది. అంటే 1950వ సంవత్సరం వచ్చేసరికి లతా మంగేష్కర్ చెప్పినట్టు విని ఆమెతో కలిసి పనిచేసేందుకు సినీ ప్రపంచం మానసికంగా సిద్ధమైపోయిందన్నమాట. అంటే 1950 వచ్చేసరికి లతా మంగేష్కర్ మకుటం లేని మహారాణిగా ఎదిగేందుకు రంగం సిద్ధమై పోయిందన్నమాట. భవిష్యత్తు గురించిన అభద్రతా భావం సంపూర్ణంగా తొలగకున్నా ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఆమె హృదయంలో స్థిరపడింది. ఇది ఆమె గాన సంవిధానంలోనూ ప్రస్ఫుటమవసాగింది. లతా మంగేష్కర్ సినీ సంగీత ప్రపంచంలో మహారాణిగా ఎదగటానికి, మహారాణిలా పరిగణనకు గురవటానికి శంఖుస్థాపన 1946 నుండి 1950 నడుమ జరిగింది. అందుకే అంతవరకూ పలు విషయాల్లో లత పట్టుదలను మూర్ఖత్వంగా, అహంకారంగా భావించిన సినీ ప్రపంచం 1950 నుంచి అది ఆమె పద్దతిగా, లతకే ప్రత్యేకమైన ప్రవర్తనగా పరిగణించి, ఆమోదించి ఆమెను గౌరవించటం ప్రారంభించింది. ఇది లతను ఇతర గాయనిల నుంచి ప్రత్యేకంగా నిలుపుతుంది.
అవకాశం లభించటమే పరమార్థంగా భావించి ఎలాంటి పాట దొరికితే అలాంటి పాట పాడే బదులు నిర్దిష్టమైన ప్రామాణికాలు, నాణ్యతలున్న అటు సంగీత పరంగా, ఇటు సాహిత్య పరంగా ఉన్న పాటలనే లత పాడటంతో, సంగీత దర్శకులు ఆమె కోసం అత్యద్భుతమైన బాణీలు సృజించారు. గేయ రచయితలు ప్రత్యేకంగా తమ సృజనాత్మక సాగర మథనంలోంచి జనించిన అమృతమయమైన భావాలను లత కోసం రచించారు. దాంతో లత పాటలు ఇతర గాయనిల పాటల కన్నా ఎత్తున నిలిచాయి.
ఆమెను ఎవరికీ అందనంత ఎత్తున నిలిపాయి.

1946 నుంచి 1950 నడుమ లత మూడువందల యాభై తొమ్మిదిపైన పాటలు రికార్డు చేసింది. వాటిలో 240 పాటలు సొలో పాటలు. సొలో పాటలు ఎన్ని ఎక్కువ పాడితే ఆ గాయనిపై సంగీత దర్శకుడికి అంత విశ్వాసం ఉన్నదని అర్థం. ఒక పాటను స్వయంగా తన స్వరబలంతో విజయవంతం చేయగలదన్న విశ్వాసాన్ని ఆమెపై సంగీత దర్శకుడు ఉంచినట్టన్నమాట. అంటే 1950 కల్లా సంగీత దర్శకులకు లత గాన ప్రతిభపై ఎంత విశ్వాసం కలిగిందంటే ఆమెతో సొలో పాటలు అధికంగా పాడించటం ప్రారంభించారన్న మాట.

‘ప్యార్ కీ జీత్’ పాటలు సూపర్ హిట్ అయిన తరువాత 1949-50 నడుమ హుస్న్ లాల్, భగత్ రామ్‍లకు దాదాపుగా పద్దెనిమిది సినిమాలు లభించాయి. వీటిలో అధిక శాతం దేవ్ ఆనంద్, సురయ్యల సినిమాలు కావటంతో లతతో పాటలు పాడించే అవకాశాలు అధికంగా లభించలేదు. అయినా సరే 1950లో ఐదు సినిమాలలో లతతో పద్దెనిమిది పాటలు పాడించారు. ఇదే సమయంలో శంకర్ జైకిషన్‍ల ‘బర్సాత్’ పాటలు సినీ సంగీత ప్రపంచాన్ని సంపూర్ణంగా రూపాంతరం చెందించాయి. పాటల స్వరూప, స్వభావాలను మార్చివేశాయి. ఆర్కెస్ట్రేషన్‍కు పెద్దపీట వేస్తూ ఆకర్షణీయము, వేగవంతమైన బాణీల రూపకల్పనతో శంకర్ జైకిషన్‍లు హిందీ సినీపాటలలో కొత్త ట్రెండ్‍ను సృష్టించారు. దానితో హుస్న్‌లాల్ భగత్‍రామ్‍లు వెనుకబడ్డారు. నెమ్మదిగా కనుమరుగై పోయారు.

అంతకు ముందే ఓ పాట రికార్డింగ్ సందర్భంలో పరిచయమైన మదన్ మోహన్ స్వతంత్ర సంగీత దర్శకుడయ్యాడు. 1950లో ‘ఆంఖే’ సినిమాతో సంగీత దర్శకత్వ కెరీరును ఆరంభించిన మదన్ మోహన్, తన రెండవ సినిమా ‘అదా’తో లతా మంగేష్కర్‍తో పాడించటం ఆరంభించాడు. లత, మదన్ మోహన్‍ల కలయికలో రూపొందించిన అమర గీతాలు లత తన జీవితంలో పాడిన అత్యుత్తమ పాటల జాబితాలో తప్పనిసరిగా ఉంటాయి.

ఒక్క 1950 సంవత్సరంలోనే సి. రామచంద్ర ఆరు సినిమాలలో లతతో 32 పాటలు పాడించాడు. అనిల్ బిశ్వాస్ మూడు సినిమాలలో పద్నాలుగు పాటలు పాడించాడు. మొత్తంగా 1950 సంవత్సరంలో పదిహేనుమంది సంగీత దర్శకులు లతతో 143 పాటలు పాడించారు. అంటే, హిందీ సినీ ప్రపంచంలో ఆ కాలంలో అత్యుత్తమ సంగీత దర్శకులు, అగ్రశ్రేణి సంగీత దర్శకులుగా పరిగణనకు గురైనవారందరూ లతను విరివిగా వాడటం ప్రారంభించారన్నమాట. ఒక్కో సినిమాలో ఐదారు పాటలు పాడించేవారు. అగ్రశ్రేణి సంగీత దర్శకులను, అగ్రశ్రేణి నిర్మాతలు వాడతారు. వారు రూపొందించే సినిమాలు కూడా ఉచ్చస్థాయిలో ఉంటాయి. సినిమాలు హిట్ అయితే పాటలూ హిట్ అవుతాయి. ఆ సినిమాతో సంబంధం ఉన్న ప్రతి కళాకారుడూ లాభపడతాడు. ఈ రకంగా అగ్రశ్రేణి కళాకారులతో అధికంగా పనిచేయటంతో లత 1950 కల్లా సినీరంగంలో స్థిరపడిందనవచ్చు. 1950 నుంచీ సినీ సంగీత ప్రపంచంలో స్వర్ణయుగం ఆరంభమయిందని భావిస్తూండటంతో లత ఉచ్చస్థాయికి ఎదగటంతో సినీ సంగీత ప్రపంచంలో స్వర్ణయుగం ఆరంభమయిందనుకోవచ్చు.

1950 కల్లా భవిష్యత్తులో లతతో అద్భుతాలు చేసే సంగీత దర్శకులంతా తెరపైకి వచ్చినట్టే. లతతో కలిసి అత్యద్భుతమైన యుగళగీతాలు పాడే తోటి గాయకులు కూడా తెరపైకి వచ్చారు. సాధారణంగా కళాకారుల నడుమ ఎంత సన్నిహిత సంబంధం ఉన్నా, ఓ రకమైన పోటీ ఉంటుంది. ఇరువురు అత్యుత్తమ కళాకారులు కలసి పాట పాడేటప్పుడు ఒకరిని మించి గొప్పగా పాడాలని కళాకారులు ప్రయత్నిస్తారు. తోటి కళాకారుడు పాట పాడే సంవిధానాన్ని గమనిస్తారు. పదాలు పలకటం, దీర్ఘాలు తీయటం, కొన్ని పదాలను ఒత్తి పలకటం, మరి కొన్ని పదాలను తేల్చేసినట్టు పాడటం, వంటివన్నీ రిహార్సల్స్‌లో గమనిస్తారు. తాను పాడేప్పుడు తోటి గాయకుడి కన్నా ఓ మెట్టు పైనుండాలన్న తపనతో తమ స్థాయిని పెంచుకుంటారు. రెండు అలల నడుమ నిర్మాణాత్మకమైన కలయిక జరగటం వల్ల అల మరింత పైకి ఎగసినట్టు, ఇలా కళాకారులు ఒకరిని మించి మరొకరు పాడాలని పోటీ పడి ప్రయత్నించటం వల్ల పాట స్థాయి పెరుగుతుంది. మామూలు పాట కూడా అత్యద్భుతమైన పాటలా ఎదుగుతుంది. ఇది లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీతో కలసి పాడిన ప్రతి యుగళ గీతంలో గమనించవచ్చు. యుగళగీతంలోనే కాదు, వారు వేర్వేరుగా పాడిన ఒకే గీతం, టాండెమ్ పాటలలోనూ గమనించవచ్చు. అందుకే హిందీ సినీ ప్రపంచంలో లత, రఫీలు కలసి పాడీన యుగళగీతాలు, ఇతరులతో వీరిద్దరూ పాడిన యుగళ గీతాలన్నిటిలోకీ ప్రత్యేకంగా నిలుస్తాయి. అంతేకాదు, హిందీ సినీ ప్రపంచంలోని యుగళగీతాలన్నిటిలోకి రఫీ, లతలు పాడిన యుగళగీతాలను ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఇద్దరు అత్యుత్తమ కళాకరులు, దైవ కరుణా కటాక్ష వీక్షణాలతో అలౌకికమైన మాధుర్యాన్ని చిలకించగల స్వరాలను పొందినవారు , పోటీపడి ఒకరి కన్నా మరొక్కరు గొప్పగా పాడాలని ప్రయత్నిస్తూ పాడిన పాటలు ప్రత్యేకంగా నిలవటంలో ఆశ్చర్యం ఏమీలేదు.

ఆరంభం నుంచి మరణించే వరకూ గాయకులలో లత స్థాయిని అందుకున్న గాయకుడిగా నిలచినవాడు మహమ్మద్ రఫీ. లతతో పాడిన ఇతర గాయకులు, ముకేష్, కిషోర్ కుమార్, మన్నాడే, మహేంద్ర కపూర్ తదితరులు లతను గౌరవంతో ప్రత్యేకంగా చూస్తే, మహమ్మద్ రఫీ మాత్రమే ఆమెతో సమానస్థాయి గాయకుడిలా పాటలు పాడినవాడు. అందుకే వారిద్దరి నడుమ ఒక అప్రకటిత స్పర్థ ఉండేది. అది ఆరోగ్యకరమైన స్పర్థ.

1924 డిసెంబర్ 24న మహమ్మద్ రఫీ పంజాబ్‍లోని అమృతసర్ దగ్గరలోని కోట్ల సుల్తాన్ సింగ్ ప్రాంతంలో జన్మించాడు. హాజి ఆలి మహమ్మద్ ఆలీ ఆరుగురి సంతానంలో రెండవవాడు మహమ్మద్ రఫీ. బాల్యం నుంచీ గానం పట్ల ఆసక్తి ఉన్న రఫీ, ఓ ఫకీరు పాడే పాట పట్ల ఆకర్షితుడై అతడిని అనుకరిస్తూ పాడుతూ అతని వెంట తిరిగేవాడు. ఉస్తాద్ అబ్దుల్ వాహిద్ ఖాన్, పండిత జీవన్ లాల్ మట్టూ, ఫిరోజ్ నిజామీల వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందాడు. పదమూడేళ్ళ వయసులో, లాహోర్‍లో సైగల్ సభలో తొలిసారిగా వేదికపై గళం విప్పాడు రఫీ. శ్రోతలను మంత్రముగ్ధులను చేశాడు. అతడి స్వరం విని ముగ్దుడైన శ్యామ్ సుందర్ ‘గులోబులోచ్’ (1944) అనే సినిమాలో రఫీతో సినిమాల్లో తొలిసారిగా పాటను పాడించాడు. రఫీని బొంబాయికి ఆహ్వానించాడు.

1944లో బొంబాయిలో అడుగుపెట్టిన రఫీతో ‘గావోన్ కీ గోరీ’ సినిమాలో దుర్రానీతో కలిసి పాడించాడు శ్యామ్ సుందర్. ‘అజీ దిల్ హో కాబూమే’ అనే పాట రఫీ పాడిన తొలి హిందీ పాట. నౌషాద్ , రఫీతో ‘పహ్లే ఆప్’ సినిమాలో హిందుస్తానీ కే హమ్ హై’ అనే పాటను ఇతర గాయకులతో కలిసి పాడించాడు. ఆ తరువాత నౌషాద్ కొన్నాళ్ళు రఫీతో పాడించలేదు. మళ్ళీ ‘అన్‌మోల్ ఘడీ’ లో ‘తెరా ఖిలోనా టూటా బాలక్’ పాటను పాడించాడు. 1947లో ‘జుగ్ను’ సినిమాలో, నూర్జహాన్‍తో కలసి పాడిన యుగళగీతం ‘యహాన్ బద్‍లా వఫాకా’ పాటతో రఫీ గుర్తింపు పొందాడు. 1948లో మహాత్మాగాంధీ హత్యానంతరం రాజేందర్ కిషన్ రచించగా హుస్న్ లాల్ భగత్‍రామ్ రూపొందించిన పాట ‘సునో సునో ఐ దునియా వాలో’ పాటతో అందరి మన్ననలందుకున్నాడు రఫీ. లత లాగే 1949వ సంవత్సరం రఫీ సంగీత జీవితాన్ని మలుపు తిప్పిన సంవత్సరం!

ఈ సంవత్సరం శ్యామ్ సుందర్, హుస్న్‌లాల్ భగత్ రామ్, నౌషాద్‍ల సంగీత దర్శకత్వంలో రఫీ సూపర్ హిట్ పాటలు పాడేడు. నౌషాద్ సంగీత దర్శకత్వంలో చాంద్‌నీ చౌక్, దిల్లగీ, దులారీ వంటి సినిమాలో పాటలు అందరి దృష్టిని రఫీ వైపు మళ్ళించాయి. ముఖ్యంగా దులారీ సినిమాలో ‘సుహానీ రాత్ ఢల్ చుకీ’ పాట ఈనాటికీ సజీవంగా నిలుస్తుంది. ఈ పాటతో తనదైన ప్రత్యేక గాన సంవిధానంపై తెరతీశాడు రఫీ. అంతవరకూ మంద్ర స్వరానికి పరిమితమైన పాటలను, ఉచ్చస్వరంలో పాడి మెప్పించాడు రఫీ. దాంతో హైపిచ్ పాటలు రూపొందించే వీలు చిక్కింది సంగీత దర్శకులకు. పైగా రఫీ పాటలను, స్వరంతో నటిస్తూ విభిన్నమైన భావాలను ప్రదర్శిస్తూ పాడటంతో, ఎలాగైతే లత ఆగమనం సంగీత దర్శకుల సృజనకు రెక్కలనిచ్చిందో అలా రఫీ స్వరం కూడా వారి సృజనకు స్వేచ్ఛనిచ్చింది. అయితే లత అంత వేగంగా మహమ్మద్ రఫీ హిందీ సినీ సంగీత ప్రపంచంలో అగ్రశ్రేణి గాయకుడిగా ఎదగలేకపోయాడు. ఇందుకు కారణాలు అనేకం.

1950 కన్నా ముందు రఫీతో ఎస్డీ బర్మన్, సి. రామచంద్ర, అనిల్ బిశ్వాస్ వంటి వారు పాటలు పాడించినా, 1950లో ‘ఆర్జూ’ సినిమాలో తలత్ మహమూద్ ‘ఏయ్ దిల్ ముఝే ఐసీ జగాహ్ లే చల్’ పాట విన్న సంగీత దర్శకులంతా తలత్‍ను తమ ప్రధాన గాయకుడిగా ఎంచుకున్నారు. పలువురికి రఫీ హైపిచ్‌లో పాడటం, పాటలో భావాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించటం నచ్చలేదు. వారు తలత్ మహమూద్ వెన్నెల వంటి మెత్తని స్వరాన్ని sophisticated స్వరంగా భావించారు. రఫీ స్వరాన్ని తక్కువ స్థాయిగా భావించారు. అదీగాక 1946 నుంచి 1950 ప్రథమార్థం వరకూ పాటలు అధికం మహిళల పాటలే అయి ఉండేవి. ఒక సినిమాలో రెండు మూడు మగ పాత్రల పాటలుంటే గొప్పగా భావించేవారు. బర్సాత్‍లో పదకొండు పాటలలో ముకేష్ రెండు పాటలు, రఫీ ఒక పాట పాడేరు. ముకేష్ పాడిన పాటలు యుగళగీతాలు. రఫీ పాట సొలో. అందుకే 1949 పూర్తయ్యేసరికి మహమ్మద్ రఫీ నలభై తొమ్మిది సినిమాల్లో ఇరవై ఒక్క మంది సంగీత దర్శకులకు 121 పాటలు పాడేడు. 1950లో రఫీ పాడిన 108 పాటలలో 29 పాటలు సోలోలు. 1951లో రఫీ 72 పాటలు పాడేడు. వీటిలో సోలో పాటలు 26. 1952లో రఫీ పాడిన ఎనభై పాటలలో 32 పాటలు సోలోలు. 1952లో అంటే ‘బైజూ బావరా’ విడుదలైన సంవత్సరంలో రఫీ మొత్తం ఎనభై పాటలు పాడాడు. వీటిలో సొలో పాటలు 32 మాత్రమే. 1953లో రఫీ పాడిన 71 పాటలలో సోలో పాటలు 31 మాత్రమే. 1949 నుండి 1953 వరకూ రఫీ, లతాలు పాడిన మొత్తం పాటలు, వారు పాడిన సోలో పాటలను గమనిస్తే 1950వ దశాబ్దంలో సినిమాలలో మహిళల పాటలు అధికంగా ఉండటం స్పష్టంగా తెలుస్తుంది. గాయనిలు అధిక సంఖ్యలో సోలో పాటలు పాడటం కూడా తెలుస్తుంది.

సంవత్సరం లత రఫీ
మొత్తం పాటలు సోలో మొత్తం పాటలు సోలో
1949 157 103 121 35
1950 152 93 108 29
1951 223 158 72 26
1952 177 138 80 32
1953 195 149 71 31
895 641 452 143

రఫీ లత పాటల పట్టికను గమనిస్తే లత అధిక సంఖ్యలో పాటలు పాడటమే కాదు, సొలోలు కూడా అధిక సంఖ్యలో పాడింది. అదే రఫీ విషయానికి వచ్చేసరికి మగవారి సోలో పాటలు తక్కువగా ఉండి, యుగళ గీతాలు అధికంగా ఉండటం ఒక ప్రధాన కారణమైతే, గాయనిలలో లతలా పాడగల వారు ఎవరూ లేకపోవటం కూడా ఆమె అధిక సంఖ్యలో పాటలు పాడేందుకు కారణమయింది. ఇదే సమయానికి గీతాదత్ కూడా వందపైగా పాటలు ప్రతి సంవత్సరం పాడుతూండటం ఆ కాలంలో పాటలంటే ప్రధానంగా మహిళల పాటలే అన్న అభిప్రాయం ఉండటాన్ని స్పష్టం చేస్తుంది. ‘నాగిన్’ సినిమాలో పన్నెండు పాటలలో రెండు పాటలు మాత్రమే హేమంత్ కుమార్ పాడేడు. మిగతా పది పాటలు లత పాడింది. ఇలాంటివి ఎన్నో. శంకర్ జైకిషన్ పలు సినిమాల్లో గాయకుడి పాటలే లేవు. కాబట్టి ఆ కాలంలో గాయకుల పాటలు సినిమాల్లో ఒకటో రెండో ఉండేవి. ఆ ఒకటో రెండో పాటల కోసం గాయకుల నడుమ పోటీ ఉండేది. అందుకే రఫీ పాటలు తక్కువ సంఖ్యలో ఉండటమే కాదు, తిరుగులేని గాయకుడిగా ఎదగటానికి అతనికి లతకన్నా అధిక సమయం పట్టింది. రఫీ తన జీవితంలో పాడిన అయిదువేల పై పాటలలో లతతో 447 యుగళగీతాలు, ఆశా భోస్లేతో 903 యుగళ గీతాలు పాడేడు. అంటే రఫీ పాటలలో అధిక భాగం యుగళ గీతాలు ఆక్రమిస్తాయన్నమాట. 1953‌-54 తరువాత నెమ్మదిగా హిందీ సినిమాలలో ట్రెండు మారింది. నాయకుల పాటల ప్రాధాన్యం హెచ్చింది.

రాజ్‍కపూర్ తొలిచిత్రం ‘ఆగ్’లో గాయకులు పాడినవి రెండే పాటలు. రఫీ ఒక యుగళగీతం పాడేడు. ముకేష్ ఓ సోలో పాడేడు. బర్సాత్ సినిమాలో ముకేష్ రెండు యుగళ గీతాలు పాడేడు. రఫీ ఒక సోలో పాడేడు. అదే శ్రీ420 దగ్గరకు వచ్చేసరికి ముకేష్ ఒక సోలో, రఫీ, లతలతో ఒక యుగళ గీతం పాడితే, మన్నాడే ఒక సోలో, రెండు యుగళగీతాలు పాడేడు. లత ఒక సోలో ఒక యుగళగీతం మన్నాడే తో, ఒక యుగళగీతం రఫీ, ముకేష్‍లతో (రామయ్యా వస్తావయ్యా) పాడింది. ఆశా భోస్లే మన్నాడేతో ఓ యుగళ గీతం పాడింది. అంటే నెమ్మదిగా హీరోల ప్రాధాన్యం పెరిగి హీరోలు పాటలు పాడటం పెరుగుతోంది. దీనితో పాటు గాయకుల ప్రాధాన్యం పెరుగుతోంది. ఎప్పుడైతే నాయకుల పాధాన్యం పెరుగుతుందో అప్పుడు గాయకుల ప్రాధాన్యం పెరుగుతుంది. ఇది 1960 కల్లా గాయనిల ప్రాధాన్యం తగ్గి గాయకుడి ప్రాధాన్యం పెరిగేట్టు చేసింది. అందుకే 1960లో సినిమాల్లో రఫీ పాటలు అధికంగా వినిపిస్తాయి. ముఖ్యంగా షమ్మీకపూర్, రాజేంద్ర కుమార్, బిస్వజీత్, జాయ్ ముఖర్జీ వంటి హీరోల సినిమాలలో గాయకుల పాటలు అధికం. ‘జాన్వర్’ సినిమాలో రఫీ మూడు సోలోలు, ఆశా బోస్లేతో ఒక యుగళగీతం పాడేడు. లతా మంగేష్కర్ ఒక సోలో, ఆశాతో ఓ యుగళగీతం పాడింది. అందుకే ఆరంభంలో మొదటి దశాబ్దంలో రఫీ పాటల సంఖ్య, వాటిల్లో సోలో పాటల సంఖ్య తక్కువగా ఉంది. 1960లలో గాయకుల ప్రాధాన్యం పెరగటంతో గాయనిల పాటల సంఖ్య తగ్గింది. ‘దీవానా’ అనే సినిమాలో (శంకర్ జైకిషన్‍) ఒక్క గాయని పాట కూడా లేదు. సినిమాలో ఆరు పాటలూ ముకేష్ పాడేడు. బ్రహ్మచారి సినిమాలో ఆరు పాటలలో ఆరూ రఫీ పాడేడు. వీటిలో ఒక యుగళగీతం రఫీ, సుమన్ కళ్యాణ్‌పూర్‍తో పాడేడు. ఒక్క లత పాట కూడా లేదీ సినిమాలో. అందుకే, 1946-53ల నడుమ లత పాటలతో పోలిస్తే, రఫీ తక్కువ పాటలు పాడినా, 1980లో మరణించేనాటికి లత కన్నా రఫీ పాడిన పాటల సంఖ్య ఎక్కువ.

అందుకే రఫీ లతాలు ఆరంభంలో యుగళగీతాలు కలసి పాడినా వారి యుగళగీతాల్లోని గొప్పతనం తరువాతి కాలంలో ముఖ్యంగా రఫీ ఆత్మవిశ్వాసం అధికమై రఫీ నెంబర్ వన్ గాయకుడి స్థాయికి ఎదిగిన తరువాతనే స్పష్టమయింది. అంతకు ముందు లత ముకేష్, తలత్ మాహమూద్ వంటి గాయకులతో పాడిన యుగళగీతాలు ప్రాధాన్యం వహించాయి. కానీ ఒక్కసారి లత రఫీలిద్దరూ తమ సంగీత జీవితాలలో ఉచ్చస్థాయికి చేరుకున్న తరువాత వారిద్దరూ కలిసి పాడిన యుగళగీతాలు అత్యద్భుతమైన గీతాలుగా ఎదిగాయి. ఇద్దరూ పోటాపోటీగా పాడేరు. ఒకరిని మించి ఒకరు పాడాలని పోటీపడ్డారు. దాంతో అంతకు ముందు గీతాలకన్నా తరువాత పాడిన యుగళగీతాలు అలౌకికానందాన్నిస్తాయి.

‘అందాజ్’ సినిమాలో రఫీ లతాలు పాడిన యుగళ గీతం ‘యూన్‍తో ఆపస్ మే, బిగడ్ తే హై’ ను; అదే నౌషాద్ సంగీత దర్శకత్వంలో 1960లో విడుదలైన ‘కోహీనూర్’ సినిమాలోని యుగళగీతం ‘దో సితారోంక జమీన్ పర్ మిలన్’ పాటతో పోలిస్తే లత రఫీలు పోటీ పడి పాడటం తెలుస్తుంది. గాయనీ గాయకుల పోటీ వల్ల పాట స్థాయి పెరగటం కూడా తెలుస్తుంది. 1951లో ‘జనమ్ జనమ్ కే ఫేరే’ సినిమాలో లత, రఫీలు పాడిన ‘జర సామ్ నె తో ఆవో ఛలియే’ అనే యుగళగీతంతో రఫీ, లతల యుగళ గీతాల మాయాజాలం ప్రస్ఫుటమవటం ప్రారంభమయింది. హిందీ సినీ సంగీత ప్రపంచంలో లతతో పోటీ పడటమే కాదు ఆమె కన్నా గొప్పగా పాడేడు అనిపించగల ఏకైక గాయకుడు మహమ్మద్ రఫీ. ఇది లతకు కూడా తెలుసు. అందుకే వారిద్దరి నడుమ పరోక్షంగా స్పర్ధ నడుస్తూండేది. ప్రత్యక్షంగా ఎవ్వరూ ఏమీ అనకున్నా లతకు ఎదురుగా, లతకు దీటుగా నిలబడ గలిగిన ఏకైక గాయకుడు మహమ్మద రఫీ అన్నది అందరికీ తెలుసు. వారిద్దరి నడుమ పరోక్షంగా సాగిన స్పర్ధ గాయనీ గాయకుల రాయల్టీ విషయంలో ఒకసారి బహిర్గతమైతే, 1970వ దశకంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో అత్యధిక సంఖ్యలో పాటలు (30 వేలు) పాడిన గాయనిగా లత పేరు నమోదు అవటాన్ని రఫీ వ్యతిరేకించటంతో మరోసారి వేదికపైకి వచ్చింది. లత ముప్పయి వేల పాటలు పాడటాన్ని రఫీ వ్యతిరేకించటంతో అసలు హిందీ సిని ప్రపంచంలో సంవత్సరానికి ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయి, ఏ సినిమాలో ఎన్ని పాటలున్నాయీ, ఎవరెవరు ఎన్నెన్ని పాటలు పాడేరు వంటి వివరాల సేకరణ ఉద్యమంలా సాగింది. హర్ మందిర్ సింగ్ వంటి వారు రూపొందించిన ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ హిందీ ఫిల్మ్ సాంగ్స్’ వంటి పుస్తకాలు ప్రామాణికమయ్యాయి హిందీ సినీ గీతాల సమాచారం విషయంలో.

ఆ కాలంలో లతతో యుగళ గీతాలు పాడిన ముకేష్‍కు శాస్త్రీయ సంగీతం రాదు. ఆయన పాటలు పాడటంలో శిక్షణ పొందలేదు. దాంతో లత వంటి సుశిక్షితురాలు ముకేష్ వంటి గాయకుడితో పాడటంలో ఎలాంటి పోటీ ఎదుర్కొనే వీలులేదు. సులభంగా లత తన ఆధిక్యాన్ని నిరూపించుకోగలదు. అందుకే ముకేష్‍తో లతకు ఎన్నడూ ఎలాంటి వివాదం రాలేదు. ‘ముకేష్ భయ్యా’ అంటూ ముకేష్‍ను అత్యంత ఆదరంగా లత పలకరించేది. ఆయనతో విదేశీ టూర్లు చేసింది. అలాంటి ఓ పర్యటనలోనే ముకేష్ మరణించాడు.

తలత మహ్మూద్, ముకేష్, రఫీలతో లతా

తలత్ మహమూద్‍ది మెత్తటి వెన్నెల లాంటి స్వరం. దాంతో లత సులభంగా అతడిని డామినేట్ చేయగలదు. ఇద్దరూ కలసి పాడిన యుగళ గీతాలలో లత స్వరంతో స్వరం కలపటానికి తలత్ మహమూద్ ప్రయాసపడటం తెలుస్తూంటుంది. అలాగే హేమంత్ కుమార్ లత భక్తుడు. అతిగొప్ప స్వరం ఆయనది. ఆయన స్వరం ముందు లత స్వరం మరింత అందంగా, తీగలా, ఉదయం పూట మెరిసే మంచు బిందువులా తోస్తుంది. ఇది వీరిద్దరూ ‘మమత’ సినిమా కోసం పాడిన ‘ఛుపాలో యా దిల్ మె ప్యార్ మేరా’ అన్న పాటలో హేమంత్ కుమార్, లత స్వరాలు ఒకరి స్వరానికి మరొకరి స్వరం ఉద్దీపననివ్వటం తెలుస్తుంది. లత స్వరం అలౌకికానందాన్నందించే పవిత్ర స్వరంలా ధ్వనించటమూ తెలుస్తుంది. ‘కిషోర్ కుమార్’ ప్రధానంగా గాయకుడిలా సినీ రంగ ప్రవేశం చేసినా, అతడిని గాయకుడిగా ఎవరూ సీరియస్‍గా తీసుకోలేదు. దీనికి తోడు అతడు నటుడూ అవటంతో గాయకుడిగా అతడిని ఎవరూ పరిగణించలేదు. ఆరంభంలో తన పాటలు పాడుకోవటం, దేవ్ ఆనంద్‍కు పాడటానికి అతడు పరిమితం కావటంతో గాయకుడిగా కిషోర్ కుమార్ కెరీరు 1969 తరువాతనే ప్రారంభమయిందనుకోవచ్చు. అంతకు ముందు అధికంగా అల్లరి చిల్లరి పాటలు పాడేవాడు కిషోర్ కుమార్. అతనికీ, లతకు సన్నిహిత స్నేహం. కిషోర్ దా అనేది లత. వారిద్దరి నడుమ ఉన్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని కిషోర్‍తో విదేశాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహించింది లత. ఆ కార్యక్రమాలలో లత ‘ఆ పాట పాడొద్దు’, ‘ఈ పాట పాడొద్దు’ అంటే, ఎగతాళి చేస్తూనే ఒప్పుకునేవాడు కిషోర్ కుమార్.

కిషోర్ కుమార్ మరణానికి కొన్నిరోజులు ముందు లతను కలసినప్పుడు ఆయన ‘నేను చాలా విషాదంలో ఉన్నాను’ అని కంటతడి పెట్టుకున్నాడట. లత కారణం అడిగినా ఆయన చెప్పలేదు. తరువాత కొన్నాళ్ళకు కిషోర్ కుమార్ హఠాత్తుగా మరణించాడు. కిషోర్ కుమార్‍కు లతకు ఎంత స్నేహం ఉండేదంటే, కిషోర్ కుమార్ గానానికి అసలు వారసుడు అతని కొడుకు అమిత్ కుమార్ మాత్రమే అని ప్రకటించి, కుమార్ సాను, అభిజీత్ వంటి కిషోర్ కుమార్‍ను అనుకరించే గాయకులతో లత పాటలు పాడేందుకు నిరాకరించింది. అంత సాన్నిహిత్యం అనుబంధం ఉన్న వారిద్దరి నడుమ పోటీ ప్రసక్తే లేదు. పైగా గంభీరంగా వుండే కిషోర్ కుమార్ స్వరం ముందు లత స్వరం తీగలా, అందమైన అమ్మాయి అందమయిన తీగలాంటి స్వరంలా అనిపిస్తుంది.

‘మన్నా డే’ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడు. అద్భుతమైన గాయకుడు. కానీ రఫీలా పలు విభిన్నమైన భావాలను అలవోకగా ప్రకటించదు అతని స్వరం. దాంతో ఎలాంటి పాటయితే, అలాంటిది పాడగలిగేవాడు కాదు. ఏ హీరోపై అతని స్వరం కుదురుకోలేదు. దాంతో మన్నా డే తో యుగళగీతాలు పాడేటప్పుడు మన్నా డే ను లత సులభంగా డామినేట్ చేయగలిగేది. అలాగని మన్నా డే తక్కువ స్థాయి గాయకుడనుకుంటే పొరపాటు, మహమ్మద్ రఫీ సైతం ‘అందరూ నా పాటలు వింటే, నేను మన్నా డే పాటలు వింటాను” అని ప్రకటించాడు. అంతగొప్ప గాయకుడు మన్నా డే. కానీ సినీ ప్రపంచంలో ఇమడని స్వరం అతనిది. అందుకని మన్నా డే తో లతకు ఎలాంటి పోటీ లేదు. మన్నా డే సినీ ప్రపంచం కేంద్రంలో ఏనాడూ లేడు. సినీ ప్రపంచపుటంచులలో నిలిచినవాడు. కాబట్టి లతకు దీటుగా నిలిచి అవకాశం దొరికినప్పుడల్లా లతను డామినేట్ చేసే రీతిలో పాడగల ఏకైక గాయకుడు మహమ్మద్ రఫీతో లతకు స్పర్ధ ఉండటంలో ఆశ్చర్యం లేదు. పైగా హైపిచ్ పాటలు రఫీ అలవోకగా పాడుతూంటే, హైపిచ్‍లో లత స్వరం ‘కీచు’గా వినిపిస్తూండటం రఫీ ఆధిక్యాన్ని స్పష్టం చేస్తుండేది. హైపిచ్‍లో పాడటం, అంత పిచ్‍లో గమకాలు వేయటం చేసినప్పటికీ సోలోల్లో మెప్పించిన లత యుగళ గీతాల్లో రఫీతో పాడేందుకు ఇబ్బంది పడేది. ఇందుకు జంగ్లీ సినిమాలో లతా రఫీల టాండెం పాట, ఎహెసాన్ తెరా హోగా ముఝ్ పర్.

జంగ్లీ సినిమాలో రఫీ పాడిన ఎహెసాన్ తెరా హోగా ముఝ్ పర్, అత్యద్భుతమయిన పాట. ఈ పాట చరణాలలో రఫీ హై పిచ్ లో పాడతాడు. ప్రతి సారీ ఎహెసాన్ అన్నప్పుడు భిన్నంగా పలికి అలరిస్తాడు. ఆ పాట ఫిమేల్ వెర్షన్ కూడా వుండాలని పట్టుబట్టాడు సినిమా నాయకుడు షమ్మీ కపూర్. అప్పటికి సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. మరో పాట రికార్డ్ చేసి షూట్ చేయాలంటే మళ్ళీ షూటింగ్ ఏర్పాట్లకు బోలెడంత ఖర్చవుతుంది. కాబట్టి పాట తరువాత రికార్డ్ చేసినా షూటింగ్ అప్పుడే అయిపోవాలి. చేసేదిలేక, రఫీ పాట నేపథ్యంలో వినిపిస్తూంటే, పెదిమలు కదుపుతూ సైరా బాను నటించింది. పాట చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడు ఆపాటను లతా పాడాలి. సాధారణంగా పురుషుడు పాడే పాటకూ, గాయని పాడే పాటకూ, బాణీ ఒకటే అయినా, కొద్దిగా తేడా వుంటుంది. గాయని పదాన్ని ఒక చోట విరుస్తుంది. ఊపిరి మరో చోట తీస్తుంది. హై పిచ్ కి వెళ్ళినా, తన స్వరం కానీ, భావం కానీ చెడకుండా భావనలను ప్రదర్శించగలిగే స్థాయి వరకే వెళ్తుంది. కానీ ఎహెసాన్ తెరా పాటలో లతకు అలాంటి వెసులుబాటులేదు. ఎందుకంటే రఫీ పాటకు అభినయించింది సైరా. రఫీ ఎంత ఎత్తులో తన స్వరాన్ని పలికించాడో, ఎక్కడెక్కడ దీర్ఘాలు తీశాడో, ఏ పదాన్ని మృదువుగా పలికాడో లత కూడా అలాగే పలకాలి. ముందు లతా నిరసన తెలిపింది. తరువాత చాలెంజ్ లా తీసుకుని పాటను రఫీ పాడిన విధానాన్ని అనుసరిస్తూ పాడింది. అందుకే, ఈ పాట మేల్ ఫిమేల్ వెర్షన్లు ఒకే లా వుంటాయి. కానీ, ఇది చాలా కష్టం. ఇలాంటి పాటలు శంకర్ జైకిషన్లు లతతో అనేకం పాడించారు. ఓ మెరీ షాహేఖూబా( లవ్ ఇన్ టోక్యో), అజీ రూఠ్ కర్ అబ్( ఆర్జూ), తుం కంసిన్ హో( ఆయీ మిలన్ కీ బేలా), తుం ముఝే యూన్ భులాన పావోగే( పగ్లా కహీకా) వంటివి.

ఇతర గాయకులతో టాండెం పాటలు పాడేప్పుడు లతా హై పిచ్ సమస్యను ఎదుర్కునేది కాదు. ఒక్క రఫీ తోటే ఈ సమస్య వచ్చేది. సులభంగా, అనాయాసంగా హై పిచ్ చేరుకున్నా మధురంగా ధ్వనించే రఫీ స్వరంతో పోటీ పడేందుకు లతా ఎంతో కష్టపడాల్సివచ్చేది.

మహెబూబా సినిమాలో మేరే నైనా సావన్ భాదో కూడా టాండెం పాటనే. సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్ ఈ పాటను శివరంజని రాగంలో రూపొందించాడు. లతకు పాట పాడటం కష్టం కాదు. కానీ, శాస్త్రీయ సంగీతం తెలియని కిషోర్ కుమార్ కు కష్టం. అందుకని, ఆ పాటని ముందు లతతో పాడించి రికార్డ్ చేశారు. లత ఎలా పాడిందో విని, ఒక వారం సాధన చేసిన తరువాత కిషోర్ కుమార్ అద్భుతంగా పాడేడు. పాట రెండు వెర్షన్లూ హిట్ అయ్యాయి. కానీ, లతా పాడిన పాట వింటే, సుశిక్షితురాలయిన గాయని పాడటానికి,అద్భుతమయిన స్వరంవుండి ఎంతో గొప్ప గాయకుడయినా శిక్షణలేని గాయకుడు పాడటానికీ తేడా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే, లతా రఫీ తో టాండెం పాటలు పాడటంలో పడిన ఇబ్బంది ఇతర గాయకుల టాండెం పాటలలో ఎదుర్కునేది కాదు. అందుకే, లతాకు పోటీ ఒక్క మహమ్మద్ రఫీతోనే!

పైగా ఇతరులంతా లతను మహరాణిలా గౌరవంగా చూస్తుంటే రఫీ లతను తనతో సమానమైన వ్యక్తిలా చూస్తూ మహారాణి అని వ్యంగ్యంగా పిలిచేవాడు. అందుకని లత, రఫీల నడుమ బహిరంగంగా ప్రకటించని పోటీ ఉండేది. వీరిద్దరి పోటీ హిందీ సినీ సంగీత ప్రపంచ గతిని నిర్దేశించింది. ముఖ్యంగా 1952లో ‘బైజు బావరా’ సినిమా, పాటల వల్ల సూపర్ హిట్ అవటంతో గాయకుడి పాటల వల్ల కూడా సినిమాలు హిట్ అవుతాయన్న సత్యం సినీ కళాకారులకు అర్థమయింది. కుందన్ లాల్ సైగల్ తరువాత గాయకుడి పాటలకు సినిమాలో ప్రాధాన్యం లభించటం, ఆ పాటల వల్ల సినిమా వ్యాపార విలువ పెరగటం ‘బైజు బావరా’ సినిమాతో, రఫీ పాటలతో మళ్ళీ అందరికీ బోధపడింది. ఈ పదేళ్ళలో ( 1942-52) గాయనిల పాటలకే ప్రాధాన్యం ఉండేది. ‘బైజు బావరా’ తరువాత నెమ్మదిగా గాయకుడి పాటల ప్రాధాన్యం పెరిగింది. గాయకుడి వల్ల నటుడికి ఇమేజ్ ఏర్పడటం, ఆ ఇమేజ్ వ్యాపార లాభాలను సంపాదించి పెట్టటంతో గాయనిల ప్రాధాన్యం వెనుకపడింది. నటులకు ఇమేజీని సృష్టించి, నిలిపే గాయకుడిలా రఫీ తెరపైకి వచ్చాడు. హిందీ సినీ సంగీత స్వర్ణయుగం ఉచ్చస్థాయికి చేరుకుంది.

(ఇంకా ఉంది)