కశ్మీర రాజతరంగిణి-84

0
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

చక్రే మడవ రాజ్య స్థైరథ ప్రాయో ద్విజా విధిః।
న సుజ్జేః కంపనేశత్వమిచ్ఛామ్ ఇతి వాదిభిః॥
(కల్హణ రాజతరంగిణి 8, 2077)

[dropcap]ఎ[/dropcap]నిమిదవ తరంగం అంతా కుట్రలు, అధికారం కోసం పోరాటాలతో కశ్మీరు అల్లకల్లోలం కావటం, ఈ అల్లకల్లోల స్థితిలో వీలయినంత ఐశ్వర్యాన్ని దండుకోవాలని లోభులు ప్రయత్నించడం, జీవితం క్షణికమని తెలిసి కూడా ఐశ్వర్య సంపాదన కోసం సర్వం విస్మరించే మూర్ఖుల గాథలతో నిండి ఉంటుంది.

కశ్మీర రాజు జయసింహుడికి లోహర రాజ్యం పెద్ద తలనొప్పిగా పరిణమించింది. మల్లార్జునుడిని రాజుగా నిలిపాడు కానీ మల్లార్జునుడు అనుకోకుండా అందిన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. అతనికి లోహారంలో ఐశ్వర్యాన్ని చూడగానే మతి చలించినంత పని అయింది. రాజ్యపాలనను పక్కనపెట్టి ఐశ్వర్యాన్ని అనుభవించటంలో మునిగిపోయాడు. దొంగలు, మూర్ఖులు, కుట్రదార్లు, మోసగాళ్ళు మల్లార్జునుడి చుట్టూ చేరారు. ఇది జయసింహుడికి చికాకు కలిగించింది. లోహార రాజును కాళ్ళబేరానికి తెచ్చేందుకు సైన్యాన్ని పంపాడు. చివరికి జయసింహుడికి విధేయత ప్రకటించి కప్పం చెల్లించేందుకు ఒప్పుకున్నాడు మల్లార్జునుడు. అంతేకాదు, తన నిజాయితీకి ఋజువుగా తన తల్లిని శత్రు శిబిరానికి పంపాడు. ఆమె తన అందచందాలతో శత్రు సైన్యాధికారిని తన వలలో వేసుకుంది.

ఈ సంఘటనలు చదువుతుంటే, అధికారం కోసం ఏ స్థాయిలో వ్యక్తులు దిగజారగలరో అర్థమవుతుంది. ఏ స్థాయికి భారతీయ సమాజం విదేశీ సంపర్కంతో నైతికంగా దిగజారిందో బోధ పడుతుంది. పిలిచి రాజ్యాధికారం అప్పజెప్పినా, తిరస్కరించిన మహానుభావులుండే దేశం, తన రాజ్యాధికారం నిలుపుకునేందుకు తల్లిని సైతం పావులా వాడుకునే స్థాయికి దిగజారింది. మల్లార్జునుడి తల్లిపై వ్యామోహంతో శత్రు సైనికాధికారి దొంగతనంగా రాత్రి కోటలో ప్రవేశించినప్పుడు, మల్లార్జునుడి సైనికులు అతడిని చంపేస్తారు.

ఈ సమయంలో జయసింహుడికి మద్దతు తెలుపుతూ, మల్లార్జునుడి తరఫున మంతనాలు చేసేవారు మల్లార్జునుడి నుండి ధనం బహుమతులుగా గ్రహించారు. మల్లార్జునుడిని మూర్ఖుడిగా చేస్తూ, ఎవరు పడితే వారు తాము కవులమని, కళాకారులమని, గాయకులమని చెప్పి రాజు నుంచి ధనాన్ని కొల్లగొట్టారు. బాల్యం నుండి మెదడెదగని మల్లార్జునుడు రాజుగా నోటికొచ్చినట్లు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నా, ఈ మూర్ఖులంతా అత్యంత తెలివైన సంభాషణలుగా ప్రచారం చేసి మంచి బహుమతులు పొందేవారు.

ఇది మానవ స్వభావంలోనే ఉంది. అధికారంలో ఉన్నవాడు, వాడు తెలివి ఉన్నవాడా, మూర్ఖుడా అన్నదానితో సంబంధం లేకుండా ఏం మాట్లాడినా గొప్ప వాక్కు, ఏం చేసినా గొప్ప చర్య అన్నట్లు ప్రవర్తించటం ఈనాడూ మనం నిత్యం అనుభవిస్తునే ఉన్నాం. ఈ అధికారానికి లొంగే బానిస స్వభావం, బహుశా, మానవుడిలోని అభద్రతా భావానికి, తమ జీవికను సుస్థిరం చేసుకోవాలనుకునే  self preservation భావానికి నిదర్శనం.

మల్లార్జునుడి దగ్గర బోలెడంత ధనం ఉంది, అతని కోట శత్రు దుర్బేధ్యం. దాంతో  మల్లార్జునుడు తన మాట వినేట్టు చేసుకునేందుకు జయసింహుడు సుజ్జి సహాయాన్ని కోరాడు. సుజ్జి ఒకప్పుడు జయసింహుడి విధేయుడు. కానీ ధనం ఆశతో జయసింహుడి వ్యతిరేకుడయ్యాడు. గొప్ప వీరుడయినా, నైతిక విలువలు వదలటంతో సుజ్జి ఇప్పుడు ఎవరు ధనం ఇస్తే వారికి విధేయుడిగా ఉంటూ వారి తరఫున యుద్ధం జరిపే వాడయ్యాడు. తన వీరత్వాన్ని, శౌర్యాన్ని అమ్మకానికి పెట్టాడన్న మాట సుజ్జి. అంతవరకూ సుజ్జితో శత్రుత్వం నెరపి, సుజ్జి జయసింహుడికి దూరమవటంలో ప్రధాన పాత్ర వహించిన లక్ష్ముకుడు కూడా సుజ్జితో ఉదారంగా, స్నేహంగా ప్రవర్తించాడు. దాంతో సుజ్జి జయసింహుడి పక్షం వహించాడు. సుజ్జిని వ్యతిరేకిస్తున్న లక్ష్మకుడు కూడా సుజ్జి మిత్రత్వంతో రాజీపడ్డాడు.

జయసింహుడు ఇలా వీరులను తన వైపు తిప్పుకుని యుద్ధానికి సిద్ధపడుతున్న సమయంలో లోహారం వదిలిపోయిన లోధరుడు సైన్యం సమకూర్చుకుని మల్లార్జునుడిపై దాడి చేశాడు. లోహారం గెల్చుకుని, కశ్మీరులోని క్రౌమరాజ్యంపై దాడి చేశాడు. ఇలా దాడులు చేసి, నష్టం కలిగించి, మళ్ళీ సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోయాడు లోధరుడు. ఇలా లోధరుడు కశ్మీరుపై దాడులు చేస్తూండటంతో జయసింహుడు సైన్యాన్ని తీసుకుని లోధరుడి ఆట కట్టించేందుకు బయలుదేరాడు.

అప్పటి కశ్మీరు పరిస్థితి ఎంతో దయనీయమైనది. రాజు ఉన్నాడు, కానీ రాజు ఖజానా ఖాళీ. సైన్య శక్తి శూన్యం. రాజుకు విధేయులు ఎవరో, విధేయులుగా ఉంటూ శత్రువులతో మంతనాలు నెరపుతూ గోతులు త్రవ్వుతున్నదెవరో ఎవరికీ తెలియదు. ఎవరినీ నమ్మే వీలు లేదు. కాస్త బలం ఉన్న ప్రతి ఒక్కడూ సింహాసనం తనదేనన్న ధీమాతో రాజును లెక్క చేయనివాడే. ఇలా ఆశ ఉన్న ప్రతి ఒక్కడూ కుట్రలు, కుతంత్రాలతో అధికారం కోసం అల్లకల్లోలం సృష్టిస్తుంటే, సామాన్యుడి పరిస్థితి ఊహించవచ్చు. రక్షణ లేక భద్రత లేక, ఏ క్షణాన ఏ సైన్యం వచ్చి అల్లకల్లోలం సృష్టిస్తుందో తెలియక ప్రజలు అల్లల్లాడిపోయారు.

ఈ సమయంలో ఓ రోజు లక్ష్మకుడు నిద్రలోనే మరణించాడు. దాంతో సుజ్జికి ఉన్న అవరోధం తొలగిపోయింది. ఈలోగా జయసింహుడి మీద కోపంతో కోస్థకుడు మల్లార్జునుడిపై దాడి చేశాడు. మల్లార్జునుడికి చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనయింది. కోస్థకుడు మల్లార్జునుడిని ఎంత బలహీనం చేశాడంటే, భవిష్యత్తులో కశ్మీరులోకి ప్రవేశించాలంటే వారికి లోహారం ఎలాంటి ప్రతిఘటననూ చూపలేనంత బలహీనం అయిపోయింది. దాంతో జయసింహుడు కోస్థకుడితో సంధి చేసుకున్నాడు. లోహారాన్ని లొంగదీసుకునేందుకు సైన్యాన్ని పంపాడు. బలహీనుడైన మల్లార్జునుడు, లోహారం ఖజానాలో ఉన్న ధనమంతా తీసుకుని లోహారం వదిలి పారిపోయాడు. అయితే, దారిదోపిడీ గాళ్ళు దాడులు చేసి, మల్లార్జునుడి దగ్గర ఉన్న సగం ధనం కొల్లగొట్టారు. చావు తప్పి కన్ను లొట్టబోయి, మిగిలిన ధనంతో ‘అవనాహ’ ప్రాంతాన్ని చేరుకున్నాడు మల్లార్జునుడు. అది క్రీ.శ. 1132 వ సంవత్సరం.

సుజ్జి మళ్ళీ తన పాత పద్ధతులను అవలంబించాడు. తన వారిని కీలక స్థానాలలో నియమించాడు. ఇది ఇతరులలో సుజ్జి పట్ల ద్వేషం పెంచింది. వారు రాజు మనసులో మళ్ళీ సుజ్జి పట్ల వ్యతిరేక భావనలను నాటేరు. అయితే, జయసింహుడు సుజ్జి పట్ల తన భావనలను బహిరంగం చేయలేదు. సుజ్జిని గౌరవిస్తూ మామూలుగానే ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తించాడు. పాలకులలో మంచివారు, చెడ్డవారు, శ్రేయోభిలాషులు, మోసగాళ్ళను వేరు చేసి చూడలేని విచక్షణా రాహిత్యం ఆ దేశ ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తుందని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు.

సుజ్జి పట్ల ప్రజలలో కూడా తీవ్రమైన వ్యతిరేక, ద్వేష భావనలు నెలకొన్నాయి. సుజ్జి బంధువులు, సమర్థకులు ప్రజలను వేధించేవారు, బాధించేవారు. సుజ్జి శక్తిపై ఆధారపడి ఉన్న రాజు, సుజ్జికి చెందిన వారు ఎలా ప్రవర్తించినా వారిని అదుపులో పెట్టలేకపోయాడు. కానీ శక్తిమంతుడైనా, దుస్థితిలో ఉన్న సంజపాలుడిని కశ్మీరం ఆహ్వానించాడు జయసింహుడు. సంజపాలుడి ఆగమనం సుజ్జిలో కలవరం కలిగించింది. సంజపాలుడి ముందు అందరూ తలవంచాల్సిందే అనుకున్నాదు. ఆ అసూయ, అభద్రతా భావం, తాను – తన సైన్యం లేందే రాజుకు గడవదన్న అహంకారంతో సుజ్జి అడ్డు అడుపు లేకుండా అకృత్యాలు ఆరంభించాడు. తన దోపిడీలకు, అకృత్యాలకు అడ్డు వచ్చిన వారిని విచక్షణా రహితంగా హింసించి చంపేవాడు. ఎవరయినా రాజ్యంలో శక్తిమంతుడిగా కనిపించినా, రాజుకు సన్నిహితుడిగా అనిపించినా, సుజ్జి భరించలేకపోయేవాడు. అతను చుట్టూ ఉన్నవారు  అహంకారమనే అగ్నికి ఆజ్యం పోశారు. దాంతో రాజు జయసింహుడితో కూడా ఇష్టం వచ్చినట్టు అహంకారంగా ప్రవర్తించాడు సుజ్జి. సుజ్జి భయానికి రాజు రిల్హణుడితో కూడా బహిరంగంగా వ్యవహరించటం మానేశాడు. దాంతో రిల్హణుడు సహాయం కోసం ఎదురు చూడసాగాడు. సంజపాలుడికి బహుమతులు ఇచ్చి అతనిని తన వైపుకు తిప్పుకున్నాడు రిల్హణుడు.

రాజు ఎవరివైపు అనుగ్రహంగా చూసినా భరించలేని సుజ్జి, ఓ పండగ సందర్భంగా నిండు సభలో రాజును అవమానపరిచాడు. అదేమీ గమనించనట్టు, జయసింహుడు సుజ్జిని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కానీ మనసులో సుజ్జికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు.

ఇప్పుడు కశ్మీరం బ్రాహ్మణులు రంగ ప్రవేశం చేశారు. సుజ్జికి అధికారం ఉండకూడదని వారు ఉపవాస నిరసన వ్రతం ఆరంభించారు.

కశ్మీరు రాచరికంలో ఉంది. సరైన పాలకుడు లేక అనిశ్చింత పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితులలో సర్వ శక్తిమంతుడై, రాజును కూడా అదుపులో పెట్టగల సుజ్జికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శించటం ఆలోచించాల్సిన విషయం. ఈనాడు, ప్రజాస్వామ్యంలో కూడా ఫలానా వ్యక్తి అధికారిగా ఉండేందుకు అనర్హుడు అని ప్రజలు నిరసన తెలుపలేని పరిస్థితులున్నాయి. అధికారంలో ఉన్నవాడు ఎలాంటి వాడయినా వాడి అడుగులకు మడుగులొత్తేవారే తప్ప, బహిరంగంగా అతడిని ప్రజలు వ్యతిరేకించడం జరుగదు. ఒకవేళ వ్యతిరేకత కనిపించినా, దాని వెనుక రాజకీయం ఉంటుంది తప్ప, ప్రజలు స్వచ్ఛందంగా వ్యతిరేకించటం అరుదుగా సంభవిస్తుంది. వాతావరణం సుజ్జికి వ్యతిరేకంగా ఉన్నదని గమనించిన రిల్హణుడు, సుజ్జి వ్యతిరేకి పంచచంద్రుడిని అతడి సేనలతో సహా కశ్మీరుకు ఆహ్వానించాడు.

ఇది గమనించిన సుజ్జి తన సేనలను యుద్ధానికి సిద్ధంగా ఉంచాడు. తన మద్దతుదారులందరినీ కూడగట్టుకున్నాడు. రిల్హణుడి వ్యతిరేకులతో చేతులు కలిపాడు. నిజానికి, సుజ్జి ఇదంతా జయసింహుడి రక్షణ కోసం చేస్తున్నాడు. సంజపాలుడు రాజుపై దాడి చేస్తాడని సుజ్జి భయం. కానీ సుజ్జి వ్యతిరేకులు, ఇది రాజద్రోహ చర్య అనీ, రాజుకు వ్యతిరేకగా దాడి చేసేందుకు సుజ్జి సిద్ధమవుతున్నాడనీ రాజుని నమ్మించారు. రాజు నమ్మాడు. సుజ్జిని హత్య చేసే బాధ్యత సంజపాలుడికి అప్పగించాడు.

సుజ్జిని బహిరంగంగా యుద్ధంలో చంపాలన్నది సంజపాలుడి ఆలోచన.

దాంతో రెండు వైపుల సైన్యాలను అప్రమత్తంగా ఉంచటం, యుద్ధానికి సిద్ధం అవటం వంటి చర్యలు ప్రజలలో ఆందోళనను కలిగించాయి. ఏ క్షణంలో ఏమవుతుందోనన్న భయంతో కశ్మీరంలో ఎవ్వరూ నిద్రపోవటం లేదు.

ఇంతలో ఓ రోజు సంజపాలుడు జయసింహుడికి సుజ్జి కుట్రను వెల్లడించాడు. తన వారిని కీలకమైన స్థానాలలో నియమించి, మాట వినకపోతే రాజును తొలగించి ఓ తోలుబొమ్మలాంటి వాడిని సింహాసనంపై నిలపాలన్నది సుజ్జి ఆలోచన. దాంతో సుజ్జి అడ్డు తొలగించుకోవాలన్న రాజు నిశ్చయం దృఢమయింది. కానీ సరైన అవకాశం లభించటం లేదు. ఓ రోజు సైన్యాధికారి ‘కులరాజు’ అనేవాడు జయసింహుడి దగ్గరకు వచ్చి సుజ్జి అడ్డు తొలగిస్తానన్నాడు.

ఓ రోజు సుజ్జి ఒక్కడే ఉన్నడని తెలుసుకుని జయసింహుడు, తమలపాకులు ఇచ్చే నెపంతో కులరాజును సుజ్జి దగ్గరకు పంపాడు. కులరాజు తనతో ఇద్దరు నమ్మకస్థులను వెంట పెట్టుకొని వెళ్ళాడు. వారు సుజ్జిని ఎలా చంపారో కల్హణుడు కళ్ళతో చూసినట్లు వర్ణిస్తాడు.

ఏం జరుగుతోందో అన్న ఉద్విగ్నతలో ఉన్న రాజుకు సుజ్జి హత్య దిగ్విజయంగా పూర్తయిందన్న విషయం, బయట వీధులలో కంగారుగా పరిగెత్తుతున్న మనుషులను చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడయితే సుజ్జి హత్య సత్యమేనన్న వార్త ప్రచారం పొందిందో, వెంటనే సుజ్జి సమర్థకుల ఇళ్ళపై దాడులు ప్రారంభమయ్యయి. ఇక్కడి నుండి కొన్ని శ్లోకాలలో సుజ్జి బంధువులను, సమర్థకులను ఎలా హతమార్చారో విపులంగా వర్ణిస్తాడు కల్హణుడు. జరుగుతున్న ఈ సంఘటలన్నింటికీ కల్హణుడు ప్రత్యక్ష సాక్షి.

రాజతరంగిణి రచనలో రాజులన్నా, రాజాశ్రయం అన్నా ద్వేషం, అసహ్యం స్పష్టంగా తెలుస్తూంటుంది. రాజు చుట్టూ చేరిన వారు రాజులను ఎలా తప్పు దారిన పెడతారో వివరించటమే కాదు, అంత తెలివైన రాజులు కూడా విచక్షణ లేకుండా మూర్ఖుల మాటలను ఎలా నమ్ముతారోనని బాధ పడటం కనిపిస్తుంది. సుజ్జి హత్య, అతని సమర్థకులు, బంధువులు అనుయాయుల హత్యల సందర్భంగా కల్హణుడు ఈ ఆవేదనను, రాజుల సేవ ఎంత అసహ్యకరమోనన్న భావనను మరింత స్పష్టంగా ప్రకటిస్తాడు.

పిశాచాలతో చెలిమి చేయటం, శిఖరం అంచు నుండి దూకటం, విష సేవనం, ప్రాణాలతో చెలగాటం ఆడడం వంటివి రాజు దగ్గర పని చేయటం కన్నా క్షేమకరం అంటాడు కల్హణుడు. ఇతరులపై ఆధారపడే గుణం కల రాజు ముందు నించోవటం కన్నా ఘోరమైన పాపం ఇంకొకటి లేదంటాడు. బహుశా ‘రాజ సేవ’ అంటే కల్హణుడిలో గూడు కట్టుకుని ఉన్న ఏహ్య భావన వల్లనే కల్హణుడు ఏ రాజాస్థానంలోకి అడుగు పెట్టలేదు. ఏ రాజును ఆశ్రయించలేదు. గత కాలపు రాజుల ఘనతను భావి తరాలకు సజీవంగా నిలిపేందుకు స్వచ్ఛందంగా రాజతరంగిణి రచనకు పూనుకున్నాడు.

మనిషి మనసు అధికంగా వర్తమానానికి స్పందిస్తుంది. వర్తమానం ఆధారంగా భూతకాలాన్ని దర్శిస్తాడు, భవిష్యత్తును ఊహిస్తాడు. వర్తమానంలో రాజులు  వ్యక్తిత్వ రాహిత్యులు. ధూర్తులు. నీతీ నిజాయితీ, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం లేని వారు. విచక్షణాశూన్యులు. పాండిత్యం లేని వారు. ఎలాంటి ఉత్తమత్వం, ఔన్నత్యం లేనివారు. ఇలాంటి వారిని చూసి, గతంలో రాజులంతా ఇలాగే ధూర్తులు, చేతకానివారు, అధికార దాహం కలవారు, సుఖ లాలసులు అనుకునే వీలుంది. అలాంటి వారికి ప్రాచీన రాజుల ఔన్నత్యం తెలియకపోతే,  గతమూ ఇంతే అని పొరబడే వీలుంది. ప్రాచీనుల ఔన్నత్యాన్ని తెలుపుతూ, అధికార దాహం వల్ల అనర్థాలను ప్రస్ఫుటం చేస్తూ, తాత్కాలిక సౌఖ్యం కోసం శాశ్వతంగా పాపం మూట కట్టుకోవటాన్ని వివరిస్తూ తమ స్వార్థం కోసం ప్రజలను హింసించే ఏ రాజూ, ఆ అధికారాన్ని కానీ, అందువల్ల అందే సౌఖ్యాలను కానీ అనుభవించ లేడనీ, అందుకోసం ప్రయాస పడడం జీవితాన్ని వ్యర్థం చేసుకోవటమేనని నిరూపించేందుకు రాజతరంగిణి రచనకు పూనుకున్నాడు.

(అతి త్వరలో తెలుగులో తొలిసారిగా జోనరాజు రాజతరంగిణి).

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here