మిణుగురులు-15

0
3

[box type=’note’ fontsize=’16’] విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘Fireflies’ కవితా సంపుటిని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ ముకుంద రామారావు. [/box]

211
చెట్టు రెక్కలున్న జీవం
విత్తనం బంధనాల నుండి బయటపడి
తెలియని సాహస జీవితాన్ని అన్వేషిస్తుంది

212
పద్మం దాని అందాన్ని ఆకాశానికి
పచ్చిక, భూమికి దాని సేవ అర్పిస్తుంది

213
సూర్యుడి ముద్దుకు పచ్చని పండు మెత్తబడి
కాండాన్ని పట్టుకుని వేలాడే తత్వాన్ని వదులుకుంటుంది

214
జ్వాల నాలోని మట్టి దీపాన్ని కలుసుకున్నాక
ఎంత గొప్ప కాంతి అద్భుతమో

215
సత్యానికి సమీపంలోనే పొరపాట్లు నివసిస్తాయి
మనం అంచాతనే మోసపోతాం

216
శూన్యంలో ఆడంబరపు నడిమంత్రపు సిరి అని
మేఘం ఇంద్రధనుస్సుని చూసి నవ్వింది
ప్రశాంతంగా ఇంద్రధనుస్సు బదులిచ్చింది
సూర్యుడంత యథార్థంగా నేను అనివార్యం అని

217
చీకటిలో గుడ్డిగా వ్యర్థంగా నన్ను వెతకనీయొద్దు
అరుణోదయం అవుతుందని
సత్యం నిరాడంబరంగా ప్రత్యక్షమవుతుందని నమ్మకంతో
నా మనస్సుని నిశ్శబ్దంగా ఉండనీ

218
నిశ్శబ్ద రాత్రి గుండా
ఉదయపు తిరుగుబోతు ఆశలు తిరిగొచ్చి
నా హృదయాన్ని తట్టడాన్ని నేను వింటాను

219
ప్రాచీన శాశ్వత సంపదని నాకు తెస్తూ
నాకు నా నూతన ప్రేమ వస్తుంది

220
చంద్రుడిని చూస్తూ భూమి ఆశ్చర్యపోతుంది
ఆ నవ్వులోనే సంగీతమంతా ఉండాలి కదా అని

221
దాని ఆరాటపు తీవ్రదృష్టితో పగలు
నక్షత్రాల్ని పారిపోయేట్టు చేస్తుంది

222
నాదైన నా కిటికీ దగ్గర
బహిరంగంగా కాకుండా
ఎక్కడైతే నీ సామ్రాజ్యం ఉందో అక్కడ
ఓ ఆకాశమా, నా మనస్సు నీతో యథార్థ సంయోగంలో ఉంది

223
మాలగా అల్లుతున్నపుడు
దేవుని పూలమీద
అధికారం తనదే అనుకుంటాడు మనిషి

224
భూస్థాపితమైన నగరం
కొత్త యుగపు సూర్యుని ముందు నగ్నమై పడుండి
దాని కీర్తనలన్నీ కోల్పోయినందుకు సిగ్గుపడుతుంది

225
చాన్నాళ్లుగా దాని అర్ధం కోల్పోయిన నా హృదయ వేదనలా
చీకటిలో వేషం వేసుకున్న సూర్య కిరణాలు
వాటంతటవే భూమి కింద దాగుంటాయి
హఠాత్ ప్రేమ స్పర్శకు నా గుండె నొప్పిలా
వసంతం పిలుపుకి ముసుగు మార్చి
పూలు ఆకులు ఉత్సవ రంగుల్లో బయటకొస్తాయి

(మళ్ళీ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here