[dropcap]ఆ[/dropcap]మె కన్నీళ్ళు తుడుచుకుని గబగబ రామనాధానికి ఫోన్ చేసింది. అతనే తీసాడు. ఆమె అవార్డు గురించి అడగగానే, “సారీ అమ్మా… నా మనస్సాక్షిని మోసం చేసుకోలేకపోయాను. ఇంతకీ ఆ అవార్డు వచ్చిన నవల పేరు తెలుసా? ‘తీర్పు’. చాలా బావుంది. నువ్వు కూడా చదువు” అని ఓ వుచిత సలహా పారేసాడు.
కృష్ణమూర్తి కూడా ఇంచుమించు అదే తరహాలో మాట్లాడాడు. “రచన అంటే అక్షరాలని ఇష్టం వచ్చినట్టు బస్తాల కొద్దీ తెల్ల కాయితాల మీద విసర్జించడం కాదు. సాధనా, శోధనా కావాలీ! ప్రతి మనసు తలుపూ తట్టగలగాలి. పేజీకి ఎన్ని అక్షరాలని అమ్మగలను… అవి ప్రింట్ అవడానికి ఎవడికి ఎలా ఎర వేయగలనూ? అని ఆలోచించడం మానుకోవాలి… అదొక తపస్సు. ఒక వరం… గుండె కయిన గాయం లోంచి వాల్మీకి కొచ్చిన ఆర్తవం! మరో కవి పోతన మనసుతో పరమాత్మని సంగమించి వ్రాసిన వాఙ్మయం!”
ఆమె టప్పున ఫోన్ పెట్టేసింది.
అది వెంటనే తనని చూసి గలగలా నవ్వుతున్నట్లు ఆగకుండా మ్రోగసాగింది.
విసుగ్గా తీసి “హలో…” అంది.
“మాలా… నన్ను గుర్తుపట్టగలవా? నీరజను… నీ చిన్ననాటి స్నేహితురాలిని.” వినిపించింది.
మాళవిక ఆశ్చర్యంగా “నీరూ…” అంది.
“మాలా… రెండు నిమిషాలు ఓపిగ్గా నే చెప్పేది విను. చిన్ననాడు రాయి మీద రాయి పెట్టి కొట్టి, నేను నీకు పరీక్షలో చూపించకపోతే మా అమ్మ చచ్చిపోతుంది అన్న నాడే నీ తెలివికి అబ్బురపడి, అది వక్రమార్గంలో పయనిస్తున్నందుకు బాధపడ్డాను. ఆ తర్వాత నీ వాళ్ళని నువ్వు వదిలిపెట్టి ప్రారంభించిన జీవితాన్ని గురించి తెలుసుకున్నాను. సాహిత్యం అంటూ నువ్వు చేసిన సాముగరిడీలూ చూసాను. హెచ్చరించాను కూడా. సాఫీగా సాగిపోతున్న నందిని జీవితంలో చెల్లెలని కూడా చూడకుండా నువ్వు రేపిన తుఫాను గురించి విని అసహ్యించుకున్నాను. ఎంతో మంది స్త్రీల దుఃఖానికి కారణమైన నీ నడవడికని మార్చుకోమని చెప్దామనుకుని కూడా ఎదురుదెబ్బ తింటే నువ్వే మారతావని ఓర్పుగా నిరీక్షించాను. ఈ రోజు అవార్డు రాలేదని నువ్వు పడే బాధ వెనకాల నీ నిజాయితీ, కృషీ కన్నా కుటిలత్వం, అతిశయం ఎక్కువగా వున్నాయి. నువ్వెన్ని ప్రయత్నాలు చేసావో నాకు తెలుసు. కానీ నీ జీవితాన్ని చదివి ఇలా అడ్డదారుల్లో సాగే ప్రయాణం ఎప్పటికైనా కొంప ముంచుతుంది, అది ఆడపిల్లలకి ఓ ప్రబోధంగా నేను వ్రాసిన ‘తీర్పు’ నవలకి అకాడెమీ వాళ్ళు అవార్డు ఇచ్చారు. ప్రతి అక్షరంలో జీవితాన్ని చేజార్చుకుంటున్న అమాయకమైన ఆడపిల్లల పట్ల వేదనా, సమాజంలోని సౌఖ్యాల వైపు వెర్రిగా వెర్రిగా పరుగెడ్తూ, నిప్పుల్లో పడి కాలిపోతున్న ఇసుళ్ళ వంటి వారి జీవిత గమనం పట్ల సానుభూతినే కాదు… జీవితాన్ని రమ్య హార్మ్యంగా… హసన్మందార మాలగా ఎలా మార్చుకోవాలో పాజిటివ్‍గా చెప్పే వ్యక్తిత్వ వికాసం గూర్చిన అంశాలు కూడా వ్రాసాను. నీకు వీలైతే ఒక్కసారి చదువు. బెటర్ లేట్ దేన్ నెవర్… ఇప్పట్నుండీ సరికొత్తగా జీవిత ప్రయాణం ప్రారంభించు…. ఇంకొక్క మాట! రాజశేఖరం ఇందాకే నా నవల రైట్స్ కొంటానని కబురు చేసాడు. ఇప్పుడు నీ తలుపు తట్టేవాడు… నిజమైన నీ స్నేహం అభిలషించేవాడే అయ్యుంటాడు. కానీ ఇంకొక ఆకర్షణలోకి రాడు. ఎందుకంటే అద్దంలో నీ ముఖం మీద ఏర్పడుతున్న ముడతలు చూసుకో… వుంటాను… బై!”
మాళవిక అప్రయత్నంగా లేచి వెళ్ళి అద్దంలో తన ముఖం చూసుకుంది. మేకప్ లేని ముఖం ఎండిన గోధుమరొట్టెలా బిగుసుకుని అక్కడక్కడా ముడుతలు పడి, మెడ క్రింద వదులుగా అయిన చర్మంతో కనిపించి వెక్కిరించింది. చేతులలో ఆమె తన ముఖాన్ని కప్పుకుని క్రింద కూలబడిపోయింది.
నీరజ చెప్పిన మాట నిజమైంది.
అప్పులాళ్ళు తప్ప ఆమె తలుపు ఆ రోజు తర్వాత ఎవరూ తట్టలేదు!
నీరజ పోస్ట్‌లో పంపిన ‘తీర్పు’ని అందుకుని విరక్తిగా నవ్వుకుంది మాళవిక.
పుస్తకం చదివాకా ఆమె చేసిన మొదటి పని, పేపర్‍లో ప్రకటన చూసి వెళ్ళి ఓ మందులు తయ్యారు చేసే ఫ్యాక్టరీలో ప్యాకింగ్ గర్ల్ వుద్యోగంలో చేరడం. ఇప్పుడామె రోజులు వేగంగా గడుస్తున్నాయి.
ఆమె జీవన వైకుంఠపాళిలో మొదటి గడి నుంచి కదుల్తోంది పావు!
(సమాప్తం)